అల్విదా!  

తడిని జీవించనివ్వండి
అతడిని విడుదల చేయండి
లేదంటే ముగిసిపోతాడు😓  
 

జీవితం ఇక చాలు

అని ఎందుకనిపిస్తుందో

ఇప్పుడర్ధమవుతోంది

 

ఎంతో వివేచనాపరులు కొందరు 

అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం చూసి

ఎందుకలా అనుకునేవాళ్ళం
మద్యం వంకనో నిర్లక్ష్యం వంకనో మరోటో…
ఈ లోకానికి తనింకా అవసరం అని తెలిసీ నిష్క్రమణ
ఎందుకో ఇప్పుడర్ధమవుతోంది

 
అతడి నిష్క్రమణ ఒక నిరసన
తన అవసరం ఉన్న మనుషులు,
సమాజం ఆ ఇంపార్టెన్స్ ని గుర్తించనప్పుడు
ఆవరించే నైరాశ్యం అతన్ని కాలం చేయిస్తుంది
వీళ్లింతేలే అని వీళ్ళు
తనను గుర్తించనవసరం లేదని
దాటేయగలిగినవాళ్ళు ఎందరు?
ఏ కొందరో బాలగోపాళ్లు తప్ప!
ఆ వెసులుబాటు,
ఎన్నింటినో దాటేసే జ్ఞానమోఉండాలిగా..
లేకుంటే నిష్క్రమణే మార్గమవుతుంది
 
చైతన్యం పేరుతోనూ
ఆధిపత్యం కొనసాగుతుంటుంది..
అవతలి మనిషిని బక్రా ను చేస్తుంది 
 

అన్ని దారులూ మూసేసాక

ఏం చేస్తాం
చుట్టూ మూగి ఉన్నవారూ
తలా ఓ రాయి విసురుతారనుకున్నప్పుడు ఏం చేస్తాం
తన అనుకునేవారి కురచ బుద్ధి వైకల్యం
లేనివి ఉన్నవిగా
మొఖం నిండా సిరా పులిమితే
ఏం చేస్తాం మిగిలింది ఓకే దారి భయాలను వీడి
నిశ్చింతగా నిష్క్రమించడం!
అప్పుడు ఏ కోకిలల ముసుగు కూతలకూ
జవాబివ్వవలసి ఉండదుగా..
 
మనసు చిగుర్లను నరికేయకూడదు  
ఆశను చంపేయకూడదు
వేయి ఆలోచనలను చిదిమేయకూడదు
మనసు స్పందనకు కట్టడి పడితే కష్టం
ఆలాపనను అనుమానిస్తే మిగిలేది శూన్యం   
 

నాలుగు గోడల మధ్య బందీ చేశాక

అవతలి జీవి అసహాయతపై తిరగబడలేం
ఆత్మహత్యించుకోవడం తప్ప

 
జీవితేచ్చ చచ్చిపోతే
నువ్వు జీవచ్ఛవమే!
ఈడ్పు మాత్రమే మిగులుతుంది 
కొనసాగింపుకి ఏ ప్రయత్నమూ ఉండదు 
ఎటూ చూడకుండా రోడ్డు దాటే తనమో 
గుండె పట్టేసినా పట్టించుకోకపోవడమో..
మధుబావిలోకి దూకేయడమో… 
 
అల్విదా!
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం 

స్కైబాబ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు