అలా మొదలై, చాలా దూరం వెళ్ళే బాబా కథన కవిత్వం!

బొల్లోజు బాబా “మూడో కన్నీటి చుక్క”కి స్వాగతం!

వొక సంపుటి వెలువడిన తరవాత కవి ముందు మహాద్వారమేదో తెరుచుకుంటుంది.

ఆ ద్వారాన్ని దాటుకొని అతను యెటు వైపు అడుగేస్తాడా అని లోకం కనీసం పది కళ్ళతో యెదురుచూస్తుంది. అందులో కొన్ని కళ్ళు పచ్చగా అసూయతో- కొన్ని కనిపించీ, యింకొన్ని కనిపించని- చూస్తూ వుంటాయి. చాలా కష్టం! చాలా అయిష్టంగా కూడా వుంటుంది. అట్లా అని తెరుచుకున్న తలుపుని మూసేసి వెనక్కి వెళ్లలేడు కవి. ముందుకే వెళ్ళాలి. ముఖ్యంగా చాలా కవిత్వ పుస్తకాలు వెలువడుతున్న కాలంలో తనదే అయిన దారీ, చూపూ వుంటే తప్ప అట్లా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. అవేమీ లేకుండానే కొంతమంది ముందుకు వెళ్తున్నామన్న భ్రమలో బతికేస్తూ వుంటారు. ఆ భ్రమని పాఠకులు బ్రేక్ చేసి, వాస్తవంలోకి ఈడ్చి కొడ్తారు, నిశ్శబ్దమైన నిరాకరణతో-

నన్ను నేను కూడదీసుకునే ప్రయత్నంలో ఇద్దరు కవుల్ని ఈ మధ్య మార్చి మార్చి చదువుతున్నాను. మార్చి మార్చి చదవడం అంటే కాసేపు ఈ కవి పేజీలు కొన్ని, ఇంకాసేపు ఆ కవి పేజీలు కొన్ని- ఇద్దరినీ వొకేసారి చదువుతున్నా. ఆ ఇద్దరు: వొకరు మన కవి బాబాజీ. మరొకరు: వాల్ట్ విట్మన్.

1

బాబా రెండో కవిత్వ పుస్తకం  అంది, చాలా కాలమే అయింది. ఈ లోపు నా జీవితంలో వూహించని విషాదం ఎదురైంది. అమ్మ పోయింది. కవిత్వం చదివే మనసూ లేదు. ఇక నాలుగు మాటలు రాసే చేతులేవో పడిపోయినట్టుగా అనిపించింది. కానీ, బాబా కవిత్వం మధ్యలో చదువుతూనే వున్నాను. చదువుతూ చదువుతూ ఆగిపోతున్నాను. ఆగిపోయిన చోట యేదో వెతుక్కుంటూ వున్నా. అట్లా వెతుక్కుంటున్నప్పుడు మరీ ముఖ్యంగా వొక కవిత దగ్గిర కాస్త యెక్కువ సేపు నిలిచి వున్నాను.

ఆ కవిత శీర్షిక: ఒక కవిని కలిశాను

రేపతను తన ఇంటిలో ఉండకపోవచ్చు

రేపతను తన దేహంలో ఉండకపోవచ్చు

రేపతను తన ఆత్మలో ఉండకపోవచ్చు

కానీ తన పేరులో సజీవంగా ఉంటాడు

ఇన్ని సంవత్సరాల జీవితాన్నీ

తన పేరులో దాచుకొన్నాడు

అక్షరాలుగా, వాక్యాలుగా, కవిత్వంగా….

మరణాలూ, జననాలూ, ఉత్సవాలూ, నిరుత్సాహాలూ మామూలు మనిషికీ వుంటాయి. వాటిని గుర్తు పెట్టుకోడానికో, మరచిపోడానికో అతనూ యేదో చేస్తాడు. బహుశా, వొక స్నేహితుడి దగ్గిరకెళ్లి భోరున ఏడుస్తాడు లేదంటే కడుపారా నవ్వుకుంటాడు. గుంభనగా వుండే మనిషి అయితే లోలోపలే వుండిపోయి, బయటికి రాలేక తనలో తాను పోరాడుతూ వుండిపోతాడు. కానీ, కవి మామూలు మనిషి కాదు. కవి దగ్గిర కొన్ని పదాలుంటాయి. వాటిని వాక్యాలుగా అల్లే శక్తి వుంటుంది. ఆ శక్తి కొన్ని సార్లు కవిని ఆదుకుంటుంది లేదా కవి మనసుతో ఆడుకుంటుంది. ఆ పదాలతో కవి నిజంగానే తన ఏడుపూ, సంతోషమూ చెప్పచ్చు. లేదంటే, పదాలకు రంగులద్ది మోసం చేయచ్చు. Replacement జరగాలి. అది యెట్లా అయినా జరగచ్చు. అది యెట్లాంటి Replacement?

బాబా అంటున్నాడు:

రేపతను తన ఇంటిలో ఉండకపోవచ్చు

రేపతను తన దేహంలో ఉండకపోవచ్చు

రేపతను తన ఆత్మలో ఉండకపోవచ్చు

మూడు రకాల Replacement- ఇల్లు, దేహం, ఆత్మ! అది తేలిక కాదు. కవికే కాదు, మామూలు మనిషికి కూడా తేలిక కాదు.

2

కొంత దూరం నడిచాక కవికి భాష విధించే ఖైదు భారమైపోతుంది.

అంటే, తను వాడుతున్న భాష కటకటాలయం అవుతుంది. ఆ కొద్ది దూరం తరవాత కవి వెతుకులాట అంతా భాష గురించే. భాషని శుభ్రం చేసుకోవాలన్న పట్టుదల పెరుగుతుంది. అప్పుడు ఆ కవి యే భాష వైపు కదులుతాడన్నది అతని దృక్పథాన్ని బట్టి వుంటుంది. నా మటుకు నేను colloquial అంటే రోజువారీ జీవితం వైపు మళ్లే కవిత్వం మీద వొక రకమైన పక్షపాతం. ఎందుకంటే, సాహిత్య భాషకి ఎదురుగా సాధారణ భాషని నిలబెట్టడం పెద్ద యుద్ధం కాబట్టి!

బాబా మొదట బుద్ధిజీవి. అతనికి స్థానిక చరిత్రలూ, సంస్కృతుల మీద వున్న ఆసక్తీ, పరిశోధనా అనుభవం చాలా మటుకు తన కవిత్వ వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తూ వుంటాయి. అట్లాగే, కవిత్వ విమర్శ మీద గత కొంతకాలంగా నిక్కచ్చిగా గొంతు విప్పి, పరిభాష వెతుక్కుంటున్న poet-critic బాబా. యిక్కడ ఆ రెండు కాళ్లే అనేక పడవల మీదకి వెళ్ళి, నదిని దాటుకొని రావాలని ప్రయత్నించడం మనం ఈ కొంతకాలంగా చూస్తున్నాం. స్థానిక చరిత్రల మీద పనిచేస్తున్న శోధకుడికి వెంటనే నచ్చే మరో సాహిత్య శిల్ప ధోరణి: narration.

Narrative poetry మనకేమీ కొత్త కాదు. అయితే, అత్యాధునిక సందర్భంలో ఈ విధమైన నిర్మాణం వెంట ముఖ్యంగా రెండు ప్రయోజనాలున్నాయి. వొకటి: సంప్రదాయ కవిత్వ శైలిని నిరాకరించడం; రెండు- కవిత్వంలో వొదగని సాంస్కృతిక లక్షణాలను స్వీకరించడం. ఈ రెండు పనులూ చక్కగా చక్కదిద్దుతున్నాడు బాబా.

ముఖ్యంగా- ఈ కొత్త కవిత్వ సంపుటిలో బాబా Narrative poetry కి సంబంధించిన అనేక కోణాలని మనకి పరిచయం చేస్తున్నాడు. బహుశా, ఈ సంపుటి ప్రధానంగా తలపెట్టిన task అదే! పైన చెప్పిన కవితలో ఇతర అంశాలు అనేకం వున్నా, అందులోని narration మనల్ని కట్టిపడేస్తుంది.

కనీసం మూడు రకాల narrative పద్ధతుల్ని బాబా వాడుతున్నాడు. నేరుగా కథనం చేయడం ఇందులో ఎక్కువగా కనిపిస్తున్న పద్ధతి.

ఉదాహరణకు:

జీవించటమే…….అనే కవిత చూడండి:

రోజు హఠాత్తుగా ఒకదారి తన గమ్యాన్ని మరచిపోయింది. చాలా బెంగ పట్టుకొంది దానికి, గమ్యం లేని జీవితమేమిటని. తన గమ్యాన్ని వెతుక్కొంటూ ప్రయాణం కట్టిందా దారి. కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతోంది.

యిలా మొదలై ఈ కథ చాలా దూరం వెళ్తుంది. చివరికొచ్చేసరికి బాబా అసలు కథ చెప్తాడు. ఇది నేరుగా కథ చెప్పినట్టే వుండి, కొన్ని జీవన దృశ్యాలను ఆవిష్కరించే ప్రతీకల మీదుగా తుది మజిలీ చేరుకుంటుంది.

ఫ్రాగ్మెంట్స్ అనే శీర్షిక కింద రాసిన శకలాల్లో కూడా కథనాత్మకతే కనిపిస్తుంది. అయితే, ఈ కథనాత్మకత యింకొంచెం గాఢంగా రూపం దిద్దుకుంటుంది.

అందమైన సీతాకోకలు

గాల్లో తేలిగ్గా అలా ఎగిరే దృశ్యం

హాయిగా అనిపించేది

ఒకరోజు

రైల్వే ట్రాక్ పై చెత్త ఏరుకొంటున్న

మురికిబట్టల సీతాకోకను

చూసే వరకూ…..

ఈ కవిత నిజానికి శకలం కాదు. కొద్ది వాక్యాల్లోనే వొక దీర్ఘ కథకి కావలసిన సామగ్రి నింపుకున్న నిర్మాణ చాతుర్యం ఇందులో వుంది. ప్రతి కవీ కొన్ని పాత్రల చుట్టూ తన కథే చెప్తాడు. అయితే, బాబా కవితల్లో పాత్రలకు ఆ ఆత్మకథాత్మకతని మించిన లక్షణాలు కనిపిస్తాయి. ఈ విధంగా సమకాలీన కవిత్వంలో కవులు చేస్తున్న ప్రయోగాలకు భిన్నమైన ధోరణిలో వెళ్తున్నాడు బాబా.

3

ఆశ్చర్యం యేమిటంటే, క్రమంగా తెలుగు కవిత్వంలో కవిత్వాన్ని మాత్రమే విశ్లేషించే సాధనాలు లేవు. ఎంతోమంది కవిత్వ విమర్శకులు ఆధునిక కవిత్వ ప్రారంభ దశ నుంచీ వస్తున్నప్పటికీ ఇప్పటికీ కవిత్వ విమర్శ సాధనాలను సృష్టించుకోలేకపోయాం. చేకూరి రామారావు లాంటి వారు భాష శాస్త్రం కోణం నుంచి చేసిన ప్రయత్నాలు ఆ తరవాత అంతగా అనుసరించిన వాళ్ళు కూడా లేరు. ఆ రకంగా చూస్తే, కవిత్వ విమర్శ పరిభాష మనకింకా ఏర్పడలేదు. అదొకటి ఏర్పడాల్సి వుందన్న ఆలోచన కూడా నెమ్మదిగా పోతోంది.

బాబాలో కవీ, విమర్శకుడూ ఇద్దరూ పుష్కలంగా వున్నారు. వాళ్ళ ప్రపంచాలు అంత భిన్నమైనవేమీ కాదు. అయితే, వాళ్ళిద్దరి మధ్యా సరిగా వంతెన కట్టే విశ్లేషణ ఏదో జరగాల్సిన సందర్భం దగ్గిర పడిందని ఈ కొత్త కవిత్వ సంపుటి చదువుతున్నప్పుడు అర్థమైంది. కవిగా తన దారి ఏమిటో వెతుక్కోడానికి బాబా కవిత్వ విమర్శలోకి వచ్చాడనీ నాకు గట్టిగానే అనిపిస్తుంది.

సృజన అనే కవితలో బాబా అంటాడు:

అంతకు ముందు ఏవి లేవో

వాటిని కొందరు

గొప్ప కాంక్షతో, దయతో

అన్వేషించి

అక్షరాల్లో మరోప్రపంచాల్ని

శిలల్లో భంగిమల్ని

రంగుల్లో ప్రవహించే దృశ్యాల్ని

ఆవిష్కరిస్తూంటారు

ఇది కవిత్వంలో పొదిగిన తన ఆత్మకథ. ఇది బాబా కవిత్వ విమర్శకి కూడా వర్తించే అంశమే. బాబా వొక గొప్ప కాంక్షతో కవిత్వంలోకీ, కవిత్వ విమర్శలోకీ బయలుదేరాడు. వొక సామాజిక శాస్త్రజ్నుడిగా అతనికి అన్వేషణా, ఆవిష్కరణ అనే రెండు concepts కూడా తోడవుతున్నాయి. అంతమంది వొక చోట కలిసే బహుళత్వం తెలుగు కవిత్వానికి గొప్ప బహుమతి.

నవంబర్ 27, 2019

 

 

Avatar

అఫ్సర్

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Narractive poetry, రాసిన, బాబా సర్ కి, ..విశ్లేషణ చేసిన, Afsar ji!కి,అభివందనంలు..!💐👌.మూడో కన్నీటి చుక్క,ఇంకా చదవలేదు,.. Exams అవ్వగానే.. చేసే మొదటి పని ఈ బుక్ చదవడం..నేను!

 • బాగుంది…ఇంకా కవిత్వ విమర్శ సాధనాల గురించి విపులంగా చెపితే వినాలని ఉంది. సారంగ ద్వారా అది చేయొచ్చుగా…

  • అవును
   అఫ్సర్ గారు చెపితే వినాలని ఉంది సర్

 • ఏకాంతంలో నిలబడి నన్ను ఏ దిక్కున వెతుక్కోవాలా అని అనుకున్నప్పుడు అందిన వ్యాసం..
  ఈ కవిత్వం చదవలేదు…కానీ మా అఫ్సర్ మామ వల్లనే మూడో కన్నీటి చుక్కలో దాగున్న కమ్మదనం పొందగలిగాను. కవిత్వాన్ని విశ్లేషించడం కేవలం ఒక కవి లేదా విమర్శకుల వల్లే సాధ్యం.
  ఒక కవి గురించి మరో కవే మాట్లాడగలడు. ఇద్దరిదీ ఒకే భాష కాబట్టి.
  ఇక బాబా గారి కవిత్వం చదవటం ఇదే ప్రథమం..అదీ ఈ వ్యాసంలోనే.
  కవిత్వం పై ఆసక్తి కలిగించే వ్యాసం రాసారు మామ.
  ఈ కరోనా వల్ల కొన్ని పుస్తకాలు వెంటనే పొందలేకపోయా…సో అతి త్వరలో ఆ మూడో కన్నీటి చుక్కను దోసిల్లలోకి తీసుకుంటా..!
  💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు