అలల పక్కటెముకల  శబ్దం వినిపిస్తున్న కవికి…

నేను మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభిస్తాను.   ఆదిమ మానవుడు ఏ కులదృవీకరణ పత్రం లేకుండా అంతటా తిరిగాడు.   ఆదిమ మానవుడి మతం ఏదో ఎవరు చెప్తారు. ప్రతీ చెట్టు అతన్ని హత్తుకుంది. ప్రతి నీటి బొట్టు అతని దాహాన్ని తీర్చింది.  కానీ ఎక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ మనుషులు మతాలుగా, కులాలుగా ,వర్గాలుగా, వర్ణాలుగా విడిపోయిన సందర్భాలేంటో తెలియడం లేదు. ఇక్కడే పుట్టి,పెరిగి మనతో తిరిగిన వాళ్ళను వివక్షకు గురిచేయడం అనే దారుణ ఆలోచనలు రాను రానూ మరి పెరిగిపోవడాన్ని చూస్తూ ఉన్నాం. ఏదో మతం లో పుట్టి పెరిగిన కారణంగా అవమానాలను,అనుమానాలను, పీడనను ఎదుర్కోవడం తీవ్రమైన మానసిక సంఘర్షణకు దారితీస్తుంది.

“నా బాల్యాన్ని నీ భుజాల మీద మోస్తున్నప్పుడు

కనీసం మాటవరసకైనా చెబితే బాగుండేది నాన్నా

నేను పుట్టకముందే ఈ మట్టికి శత్రువునయ్యానని

ఎందుకు చెప్పలేదు నాన్నా?”

పై వాక్యాలు చాలా సాధారణంగా ఉన్నట్లు అనిపించినా ,ఆ వాక్యాల్లోని సంఘర్షణ అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఈ దేశంలో బొట్టుకు, టోపీకి మధ్య మనుషులు ఎందుకు విలవిల లాడిపోతున్నారు? ఒక మతం జాడల్ని ,నీడల్ని, ఉనికిని నిఘా గా మోహరించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది . ఈ వాక్యాలు రాస్తున్న కవి మత వైష మ్యాన్ని  ప్రశ్నిస్తున్నాడు .మత విధ్వంసాన్ని ప్రశ్నిస్తున్నాడు. అలా అని అతను మరో మతం మీద ద్వేషాన్ని ఉసిగొలిపే వాక్యం రాయడం లేదు. చాలాసంయమనంగా రాస్తున్నాడు. చాలా ప్రేమగా చెబుతున్నాడు. వైషమ్యాలను ఉసికొల్పే మతాల్ని తెగ నరకాలనే పిలిపిస్తున్నాడు. అసలు నీకు నేను శత్రువుని ఎలా అవుతానని అమాయకం గా అడుగుతూనే ,కొన్ని చారిత్రక ప్రశ్నల్ని సాక్ష్యాలుగా చూపుతాడు.

“పొట్టకూటి కోసం పూటకు ఒక్క పని వెతుక్కునే నాకు

కుతుబుద్ధిన్ ఐబక్  ముత్తాతెట్లైతడు

కోట గోడ వైపు తలెత్తి చూడలేని పేదలకు వారసుడ్నైన  నేనూ

తైమూరు మొగలుల రాజదర్పానికి ఏ  వన్నెలు అద్దిన వాణ్ణి

అందరితో పాటే కలో గంజో తాగి బతికిన నేను

నిజాం నవాబుకు సుట్టం  మెప్పుడైన

నేనేమన్నా వాళ్ళ ఆస్తులు తిన్నోడినా

ఆడంబరాలకు పోయినొన్నా

తాజ్మహల్కు వస్తున్న సంపదలో నా వాటా అడుగుతున్నోడి నా”

 

అలా ఆధారాలని  ప్రశ్నిస్తూ ఏ యుగంలో మీ మతానికి నేను శత్రువునయ్యాను అని చాలా ఆవేదనగా కవి ప్రశ్నిస్తాడు.

 

ఈ వాక్యాలు రాయడానికి కవి లోపల బయట ఎంత అంతః సంఘర్షణ ఎదుర్కొని ఉండాలో మనం ఆలోచన చేయవచ్చు. ఆ అంత సంఘర్షణలోంచి నిజాయితీతో కూడిన వాక్యాలు రాసిన కవి ఇబ్రహీం నిర్గుణ్. అతను ఇప్పుడు బహిరంగ ప్రకటన చేస్తున్నాడు. ఆధిపత్యము, అణచివేతలపై దండోరా వేస్తున్నాడు. ఒక  ధిక్కారాన్ని సారిస్తున్నాడు. ఈ ధిక్కారములో పొగరు కనిపించదు. గర్వము వినిపించదు. నేను మీలో ఒకడిని, ఈ దేశపు పౌరుడిని అనే  బుద్దిజీవి వేదన కనిపిస్తుంది. 21వ శతాబ్దంలోనైనా సంకుచిత వాదుల మనసుల్లో మార్పు రావాలని ఉద్దేశంతో ఇతను బహిరంగ ప్రకటన చేస్తున్నాడు.

పెట్టుబడిదారుల కుతంత్రాల పెట్టుడు మచ్చలు రాలుస్తున్న దుఃఖం లోంచి తనని తాను బయటపడేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

“పెట్టుడు మచ్చల రాజకీయలబ్దుల పరిహాసాలకు

కొనసాగింపులు తెరదించి

మీనార్ కొనమీద రెక్కలు తొడిగే అజా పిలుపులు

ప్రపంచశాంతి కోసమని ప్రకటించాలి”

ఈ కవి లోలోపల అనేక దిగుళ్ళు గూడు కట్టి ఉన్నాయి .అవి రెక్కలు కట్టుకొని పక్షుల్లాఎగురుతున్నాయి. అతను నిద్రలో ఉన్నప్పుడు ఇంద్రావతిలో పారిన నెత్తురు అతని పాదాల్ని తడుపుతుంది. గడ్చిరోలి ,ఏవోభీలలో మోగిన తుపాకీల శబ్దం అతని చెవుల్లో మోగుతుంది. గోద్రాగాయాలు గుర్తుకు వస్తాయి .వాకపల్లి గుర్తుకు వస్తుంది .ఇంద్రవెల్లి రైతులు జ్ఞాపకానికి వస్తారు. ఇంకా ఎన్నో ఎన్నెన్నో అమానవీయ, ఆధిపత్య, నిరంకుశ విషయాలు అతణ్ని ఎన్నో అర్ధరాత్రులు నిద్ర లేకుండా చేస్తాయి. ఆ నేపథ్యంలో నుండి ఈ కవి బహిరంగ ప్రకటన చేస్తున్నాడు. మనల్ని అప్రమత్తంగా ఉండమంటున్నాడు.

“విత్తనాల్ని నాటడానికి సిద్ధంగా ఉన్న రైతులా

మరోసారి మనం సిద్ధంగా ఉండాలి

ఏ అర్ధరాత్రో స్వతంత్రం వచ్చినట్లు కాకుండా

సమసమాజ స్థాపన జరిగిందని

పట్టపగలే బహిరంగ ప్రకటన రావచ్చు”

పై వాక్యాలు కవి ఏ టోన్ లో చెప్తున్నాడు మనకు తెలుస్తుంది. అతని హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ కవికి ఏ కవితను ఏ టోన్ లో చెప్పాలో తెలుసు .ఏ కవితకి ఏ నిర్మాణం కావాలో తెలుసు. ఏ కవితకి ఏ సౌందర్యం కావాలో తెలుసు. తన అస్తిత్వ వేదనను ఏ గొంతులో పలికించాలో ఆ గొంతులోనే పలికిస్తున్నాడు.

కెన్యా కవి గూగి ఇక్కడికి వచ్చి వెళ్లిన సందర్భంలో ఈ కవి గొప్ప కవితను రాశాడు. ఉన్నతమైన కవిత్వీకరణకు ఈ పద్యాన్ని ఉదాహరణగా చూపవచ్చు. తీసుకున్న వస్తువును కళాత్మకంగా ఎలా మలిచాడో మనం గమనించవచ్చు.

“నువ్వొచ్చి వెళ్లడం అంటే ఒక రుతువు మారడం

అడవంతా మోదుగు పూల వసంతం తొడగడం

పొట్టలోకి కాళ్లు దూర్చి పడుకున్న జింకపిల్ల

ఒక అదాటున లేచి మైదానానికి పచ్చని చిందులు నేర్పించడం

సచ్చుపడ్డ ఎర్ర చీమల కాళ్ళకు ఇంధనపు రవ్వల్ని సమకూర్చడం

మూసిన కలాల ఎండిన పెదాలకు ఆకుపచ్చని పద్యాన్ని అద్దడం

నీ చేతి స్పర్శకు

నరాల్లో రక్త కణాలు పద్యమై లేడి పిల్లలా పరిగెత్తడం”

ఇట్లా ఈ కవి కి ఏం చెప్పాలన్న విషయం పట్ల ఎరుకఉంది .ఎట్లా చెప్పాలన్న విషయం పట్ల జాగ్రత్త ఉంది.  ఈ బహిరంగ ప్రకటన అనే కవితా సంపుటి లో వస్తువు వైవిద్యం  ఉంది. భావాల కుండపోత మనల్ని తడిపేస్తుంది. ఇప్పుడు దేశం ఎలా ఉంది? ప్రపంచం ఎలా ఉంది ? తన ఊరు ఎలా ఉందో? ఇట్లాంటి అనేక అంశాల పట్ల ఈ కవికి స్పష్టత ఉంది. అభివ్యక్తిలో ఒక సాంద్రతని  మనం గమనించవచ్చు.

తాను ఏ అంశాన్ని కవిత్వం చేయదలిచాడో ,ఆ అంశం ఉద్వేగంగానో, ఒక ప్రకంపన గానో, అనుభవంగానో ఒక అనుభూతిగానో మనలో సునాయాసంగా ప్రవేశ పెట్టగలిగే శక్తి ఈ కవిత్వానికి ఉంది. గాఢత ఈ కవిత్వాన్ని వెలిగిస్తూ ఉంది. ఒక మూడ్ లోకి తీసుకెళ్లడం కూడా మనం గమనించవచ్చు. సామాజిక వాస్తవికతను పాఠకుల్లో పట్టించగలిగే నైపుణ్యం నిర్గుణ్   కి ఉందని

మనకు అడుగడుగునా తెలుస్తుంది. ఆయుధం లాంటి కవిత్వాన్ని ప్రశ్నలా రాస్తున్న కవి నిర్గుణ్. అందుకే  స్టే ట్యూన్ కీప్ రైటింగ్ అని భరోసా ఇస్తాడు. తన తల్లి,  ఊరు నేపథ్యంలో రాసిన కవితలు అద్భుతంగా ఉన్నాయి.

ఇక్కడ బక్కి శ్రీను, అక్కడ జార్జ్ ఈ రెండు కవితల లక్ష్యం ఒకటే. రెండు సంఘటనల వెనక ఉన్న వాస్తవం ఒక్కటే. ఇక్కడ కుల వివక్ష, అక్కడ వర్ణ వివక్ష. అందుకే నిర్గుణ్  బి కేర్ఫుల్ విత్ మాంగో అన్నాడు.  Iam coming from roots అని గుర్తుచేస్తున్నాడు. సెక్యులరిజం మేనిఫెస్టోకి ముందుమాట, డెమోక్రసీ ఉత్త మాట అని ధైర్యంగా ప్రకటన జారీ చేస్తున్నాడు.

“ఒరేయ్ శీను

మామిడిపండు కూడా మారణాయుధమే

అది కూడా కుల మతాల కలలు కంటుంది రా

నీ కులం పేరుతో మామిడిపండు పుట్టలేదు ఇంకా

అది నిషిద్ధ ఫలం”

అని అంటారు.

జార్జ్ శ్వాస శ్వేత సౌధం చుట్టూ బిగుసుకున్న ఉచ్చు అని, అతని చూసిన చివర చూపు ఊపిరి ఆడే వాళ్లను దగ్గరకు చేర్చిన జాతరని , ఐ కాంట్ బ్రీత్ అనే ఆఖరి మాట కావాలని, తెల్లోడికి జ్ఞానోదయం కలగాలని ఆశిస్తాడు.

ఇవి రెండూ సంఘటనాత్మక కవితలు అయినా వాటిని చిత్రిక పట్టిన తీరు, వ్యక్తీకరించిన విధానం ఆ కవితల్ని నిలబెట్టింది. సంఘటనాత్మక కవితల్ని కూడా సమర్థవంతంగా నిర్వహించడం ఎలాగో ఈ కవి నుంచి నేర్చుకోవచ్చు.

పోరాటం అంటే వెయ్యి ఏండ్లదని ,ఆ పోరాటాన్ని ఎప్పటికైనా ఎర్రసిరాతోనే రాయాలని అది చావైనా బతుకైనా యుద్ధం లెక్కనే ఉండాలని ఈ కవి  నిర్ధారణ చేస్తాడు.  మరణం ఆదిమ కాలపు కొనసాగింపు ,పాతవాచకం అనే నిజాన్ని వెల్లడిచేస్తాడు. కవిత్వం ఒక  దండకారణ్యం అని సాధారణీకరిస్తాడు. బతుకు చెట్టుకు ఆత్మగౌరవ పూలు పూయాలని ఆశిస్తున్నాడు. తెలవారనేలేదు సాధికా ,ఇక్కడే ముగిసే యాత్ర లాంటి కవితల్లో ఇతని తాత్వికత ముచ్చటేస్తుంది.

అమ్మని  జ్ఞాపకం చేసుకుంటూ

“ప్రవహించి ప్రవహించి

ఓ రోజు… ఎండిపోతున్న నది కళ్ళల్లోంచి తీసి

ఒడ్డున పడేసిన చేపకళ్ళ తన్లాటవి నువ్వు”

అమ్మని పాఠం నేర్పిన గురువుగా, కాలువలా మొదలై, నదిలా పారి పచ్చటి పొలమైన తల్లిగా ఎప్పటికీ ఎంత చదివినా పూర్తికాని పాఠంగా మన ముందు నిలుపుతారు.

విప్లవం నేపథ్యంలో విప్లవకారులను గుర్తు చేసుకుంటూ రాసిన ప్రతి కవిత మన గుండెలను తాకుతుంది. ఆకలి నిషేధించబడిన నేల  కవితలో శిల్పం మనల్ని ఆకట్టుకుంటుంది. ప్రశ్నకు సమాధానం రాయలేక ప్రశ్ననే చంపేసే వాళ్ళని పాలకులుగా నిర్వచించడం కొత్తగా అనిపిస్తుంది.

చివరగా ఇబ్రహీం నిర్గుణ్ కవిత్వం

 

మోదుగు పూల నవ్వు

గరికపోసలను కాగడాగా వెలిగించే అగ్గిపుల్ల

మట్టిపాలైన అమ్మను ఊరేగించే పల్లకి

భూమిని ఎర్రని చిగుర్లు తొడిగించే కవిత్వం

రాం సావిగుట్టమాటున ఎదురుచూసే తూరాయి పూల నవ్వు

విడిచిన ఊరును పదే పదే పలువరించే వివశత్వం

జమ్మిచెట్టు మీద ఆయుధాన్ని ఇచ్చే ధైర్యం.

 

కొన్ని గమనింపులు:

1.వస్తు నిర్దిష్టత తో పాటు సౌందర్యాత్మక వ్యక్తికరణ ఉంది.

2.రూప లక్షణం బాగుంది

 1. స్థానికతనుండి ప్రపంచ ఉద్యమాల పట్ల అవగాహన కనిపిస్తుంది.
 2. సమకాలీనత, సామరస్యజీవనం, ప్రజా పోరాటాల పట్ల సహనుభూతి కనిపిస్తాయి
 3. తనలాంటి మనుషుల కి ఒక భరోసాని ఆత్మవిశ్వాసాన్ని వాగ్ధానం చేస్తున్నాడు.
 4. కొన్ని కవితల్లో కవి హఠాత్తుగా పలికిన భాష నాకు అడ్డుగా అనిపించింది.
 5. కొన్ని కవితల్లోకి నేను వెంటనే ప్రవేశించలేకపోవడం బహుశా నా వ్యక్తిగత లోపం అయి ఉండవచ్చు.

అలల పక్కటెముకల శబ్దం వింటున్న కవీ  నీకు   హృదయపూర్వక శుభాకాంక్షలు.

*

సుంకర గోపాలయ్య

పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల లో తెలుగు అధ్యాపకులు. సొంత ఊరు నెల్లూరు.
సంపాదకుడిగా పిల్లల కవిత్వం రెండు పుస్తకాలు తెచ్చారు.రంజని కుందుర్తి,తానా, ఎక్సరే ,పాటూరి మాణిక్యమ్మ మొదలైన పురస్కారాలు అందుకున్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాకులలో ఒకరు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చాలా చక్కటి సమీక్ష ,విలువైన కవిత్వానికి ,విలువైన విశ్లేషణ కవి తమ్ముడు నిర్గం కు ,సాహిత్య విమర్షకుడు మిత్రుడు గోపాలయ్యకు ,సమీక్ష ప్రచురించిన సారంగ వెబ్ పత్రకకు అభినందనలు….

 • బహిరంగ ప్రకటన అద్భుతమైన విశ్లేషణ రాసిన
  సుంకర గోపాలన్నకు

  సారంగ మ్యాగజైన్ అధినేత
  అఫ్సర్ సార్ కి
  హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు