అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయె……..

దాదాపు యాభై యేళ్ల కిందటి మాట. అప్పట్లో మా సాయంకాలాలు యెలా వుండేవంటే , మల్లెలో, సన్న జాజులో మా పెరళ్లలో సువాసన లీనుతుండే సమయం. ఇల్లాళ్లందరూ బడినుండీ వచ్చిన పిల్లలకు లాలపోసి , తుడిచి చక్కగా ఉతికిన బట్టలేసి వాకిట్లో అరుగు మీద కూచోబెట్టే వాళ్లు ,చేతిలో ఇంత తినడానికేమన్నా పెట్టి.

పిల్లలు కాసేపు కూచుని ,ఆ తర్వాత తోటి పిల్లలతో ఆడుకుంటూ వుండేవాళ్లు. మునిమాపు వేళ ఆవులూ ,గేదెలు ఇళ్లకు మళ్లుతూ వుండే సందడీ,ఆటలలో పిల్లల కేరింతలూ అన్నీ కలిసి వీథికి రంగులద్దేవి.
కాస్త కను చీకటి పడుతుండగా,కోటేశ్వరా సినిమా హాలునుండీ “నమో వెంకటేశా నమో తిరుమలేశా ” అని ఘంటసాల పిలుపు వినపడేది.ఇంకేముందీ,వీథిలో సినిమా  హడావుడి మొదలయ్యేది “అదిగో నమో వెంకటేశా “రికార్డు వేశాడు తెమలండర్రా” అని తొందర చేస్తుండే వాళ్లు.
అమ్మలు వీథిలో ఆడుకునే పిల్లల్ని కేకేసి, తాముకూడా చక్కగాచీర సింగారించి తయారయ్యు సన్నజాజులో,మల్లెలో సిగలో తరుముకుని ,తలుపు తాళం పెట్టుకుని, పిల్లల చేతులందుకుని వీథిలోకి అడుగుపెట్టేవారు.
ఆ పాటికే వీథంతా, కోలాహలంగా ఒక చక్కని చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న వర్ణ చిత్రంలా వుండేది.ఈ లోగా “ఏడుకొండల సామి యెక్కడున్నావయ్యా యెన్ని మెట్లెక్కినా కాన రావేమయ్యా” అని ఘంటసాల పాట వినపడే సమయానికి హాలు ముందు  మొదటాటకి హాజరయ్యే వారు.
అలాంటి సాయంసమయాలను గుర్తుచేసే “ఏడుకొండల సామి ” పాటంటే భలే ఇష్టం నాకు. ఇటీవలి కాలందాకా నాకు ఈ పాట శుధ్ధ ధన్యాసి రాగం ఆధారంగా తయారయిందని తెలియదు.
శుధ్ధ ధన్యాసి భక్తి రసాన్ని చక్కగా పలికించే రాగం,సినిమా పాటలలో శృంగార రస ప్రధానమైన పాటలు రక్తి కట్టించడానికి కూడా ఉపయోగిస్తారీ రాగాన్ని.
ఇది 22వ మేళకర్త అయిన ఖరహరప్రియనుండీ జనించిందని భావిస్తారు కొందరు 8వమేళకర్త అయిన హనుమత్తోడి నుండీ కానీ 20వ మేళకర్త అయిన  నఠ భైరవి నుండీ కానీ జనించిందంటారు. ఇది పెంటాటోనిక్ స్కేలుకు చెందినది అంటే సంపూర్ణ రాగం లో వుండే ఏడు స్వరాలు ఇందులో వుండవు.ఆరోహణలో రి,ద లు వర్జింపబడ్డాయి. ఆరోహణలో అయిదు స్వరాలూ,అవరోహణలో యెడు స్వరాలూ వుంటాయి .అందుకే ఔడవ సంపూర్ణ రాగమంటారు.
ఉదయరవి చంద్రిక అనే రాగం శుధ్ధ ధన్యాసికి చాలా దగ్గర బంధువు. ఈ రెండు రాగాలూ  పాటలో  కలిసి పోతుంటాయి చాలా సార్లు ఉదయరవి చంద్రిక లో ఆరోహణ అవరోహణ రెండింటి లోనూ అయిదే స్వరాలుంటాయి .రి,ద లు వర్జితాలు. దీనికి హిందూస్థానీలో సమానమైన రాగం రాగ్ థానీ.
ఉదయరవిచంద్రిక లో కాకలి నిషాదము ప్రయోగింప బడేది పూర్వకాలంలో. ఇది చాలా పురాతనమైన రాగం అంటారు.శుధ్ధధన్యాసి లో గమకం యెక్కువ అచ్చమైన కర్ణాటక పధ్ధతిలో వుంటుంది,కైశికి నిషాదం ప్రయోగించుతారు. ఉదయరవిచంద్రిక యెక్కువ హిందూస్థానీ పధ్ధతిలో వుంటుంది.
శుధ్ధ ధన్యాసిలో త్యాగరాజుల వారు
“ఎంత నేర్చినా యెంత చూసినా
యెంత వారలైన కాంత దాసులే ” అనేది చాలా పేరొందిన కీర్తన, “హిమగిరి తనయే హేమలతే “అనే  హరికేశ నల్లురు ముత్తయ్య భాగవతార్ కీర్తన కూడా చాలా ప్రచారంలో వుంది.
అన్నమయ్య పదాలలో యం.యస్ .అమ్మ గానం చేసిన “భావము లోన బాహ్యము నందును గోవింద గోవింద అని కొలువ ఓ మనసా” అనేదీ, “వినరో భాగ్యము విష్ణు కథా” అని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్  గానంచేసిందీ వున్నది శుధ్ధ ధన్యాసిలోనే సుమా!
ప్రయివేట్ సాంగ్స్ లో   బాగా హిట్టయిన పాట “ఏడు కొండల సామి యెక్కడున్నావయ్య””—రచన రావులపర్తి భద్రిరాజు, సంగీతం, గానం ఘంటసాల.  సినిమా పాటలలో బాగా తరచుగానే వినియోగింపబడే రాగం ఇది.
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు తన కలాన్ని తేనెలో ముంచి రాస్తారేమో అనిపిస్తుంది . ఆయన “రాజమకుటం “కోసం రాసిన ఈ “సడిసేయకో గాలి సడి సేయబోకే బడలి ఒడి లో రాజు పవ్వళించేనే”పాటని స్వరపరచింది మాస్టర్ వేణు. అత్యంత మధురంగా ఆలపించింది పి.లీల. ఈ పాటని ఇష్టపడని వారుండరేమో !
సినిమా పాటల సాహిత్యంలో సిరి వెన్నెలను కురిపించిన వారు సీతారామ శాస్త్రిగారు. ఆయన మొదటగా పాటలు రాసిన సినిమా “సిరివెన్నెల”. చిత్రంగా ఆ  చిత్రం పేరే ఆయన ఇంటి పేరయింది. ఆయన రచించిన “విరించినై విరచించితినీ ఈ కవనం” అనే పాట  పాడింది బాలు, సుశీల సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్
సినిమా పాటని అత్యున్నత స్థాయికి తీసికెళ్లాలంటే వేటూరే .(కొన్ని వివాదాస్పదమైన పాటలు రాసినప్పటికీ). ఆయన “సీతాకోక చిలుక” సినిమాకి రాసిన పాట “అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయె” పాడింది బంగారు తీగెలాంటి గొంతుతో వాణీజయరామ్  సంగీతం చేసింది స్వర జ్ఞాని ఇళయ రాజా.
వేటూరీ, ఇళయరాజాల జతలో వచ్చిన మరో పాట “కొండవీటి దొంగ” సినిమాలో “శుభలేఖ రాసుకున్నా యెదలో యెపుడో”, పాడింది బాలు,చిత్ర.
అదే వేటూరీ ,ఇళయరాజా కలిసి చేసిన ఇంకో చిత్రం లోని పాట “గోపెమ్మ చేతిలో గోరుముద్ద “. చిత్రం పేరు “ప్రేమించు-పెళ్లాడు”.  దీని దర్శకుడు వంశీ. తెలియని దేముంది వంశీ సినిమాలకి మంచి మంచి పాటలందిస్తారు కదా ఇళయరాజా! పాడింది బాలూ , ఇళయరాజా ఇష్టగాయని జానకి.
చూస్తుంటే శుధ్ధ ధన్యాసిని యెక్కువ ఇష్టపడింది ఇళయరాజానే అనిపిస్తుంది. మరి అన్ని సినిమా పాటలు కనపడుతున్నాయి ఆయన చేసినవి.
“స్వాతి ముత్యం” లో సి.నారాయణ రెడ్డి గారు రాసిన  ఈ “మనసు పలికే మౌన గీతం “అనే పాటని కూడా ఇళయరాజా శుధ్ధ ధన్యాసిలోనే స్వరపరిచారు. పాడినది బాలు,యస్ .జానకి.
“స్వర్ణ కమలం” సినిమాలో “ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లే తుళ్లు” అనే పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. స్వర సారథ్యం చెప్పేదేముంది స్వరరాజు ఇళయరాజానే.పాడింది బాలు ,సుశీల.
“స్వయంవరం “సినిమాలో  భువన చంద్ర గారు రాసిన గీతం “కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం “పాడింది ఉదిత్ నారాయణ్ ,స్వర్ణలత .స్వరకర్త వందేమాతరం శ్రీనివాస్ దీనికీ ఆధారం శుధ్ధ ధన్యాసి రాగమేనండోయ్ కీరవాణి రాగం కాదు.
 జాలాది గారు నెత్తురు ఉప్పొంగేలా రాసిన  దేశభక్తి గీతం “పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి”
దానిని అంతే ఉత్తేజంతో పాడిన వారు యస్ .పి. బాలసుబ్రహ్మణ్యం.చిత్రం “మేజర్ చంద్రకాంత్ “.సంగీత దర్శకత్వం నెరపిన కీరవాణిని తలుచుకోవడం మరువ కూడదు.
అవండీ శుధ్ధ ధన్యాసిలోని కొన్ని తెలుగు సినిమా పాటలు. ఇక హిందీ సినిమాలలో వి కూడా మచ్చుకి రెండు మూడు పాటలు చూద్దాం. హిందూ స్థానీలో ఈ రాగాన్ని రాగ్ థానీ అంటారనుకున్నాం కదా!
“హమ్ దోనోం ” సినిమాలో లతా పాడిన “ప్రభు  తేరో నామ్ ” పాటకి స్వరకర్త జయదేవ్
“ఫకీరా “లో లతానే పాడిన పాట “దిల్ మే తుఝే బిఠాకే కర్ లూంగీ మై బంధ్ ఆంఖే పూజా కరూంగీ తేరీ” ,దీనికి కూడా రాగ్ థానీ నే ఆధారం.రచన,సంగీత దర్శకత్వం రవీంద్రజైన్.
రవీంద్ర జైన్ రచనా,సంగీత దర్శకత్వంలో వచ్చిన మరొక మంచి పాట “చిత్ చోర్ “చిత్రం లో జేసుదాస్ పాడిన “గోరి తెరా గావ్ బడా ప్యారా” అనేది. ఈ పాట సూపర్ హిట్  ఆరోజుల్లో!
ఇదండీ  టూకీగా శుధ్ధ ధన్యాసి రూపచిత్రం!
*

రొంపిచర్ల భార్గవి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నమో వెంకటేశా అనే పాట అప్పట్లో అన్ని ఊళ్లలోని
    సినిమా హాళ్ళలో ప్లే చేసేవారు. అలా శుద్ధధన్యాసికి మంచి ఇంట్రో ఇచ్చి మంచి పాటల సుగంధాన్ని భలే పరిచయం చేశారు.
    కృతజ్ఞతలు భార్గవి మేడం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు