అరణ్యకాండ

న్ని ఊర్లలో ఉన్నట్టే ఆ ఊర్లో కూడా కొన్ని పుకార్లు ఉన్నాయి. అవి పుకార్లుగానే ఉంటే సమస్య ఉండేది కాదు. ఊరు అడవికి దగ్గర్లో ఉండటంతో మనిషీ ప్రకృతి కలిసి పెరిగారు. ఇంకోవైపు వాగు, తప్పులేమైనా ఉంటే అందులో కడిగేసుకుంటారు కాబోలు నీళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి.
‘చీకటి పడుతోంది, పడవ త్వరగా ఒడ్డుకు చేరుకుంటే బాగుండు’ అనుకున్నాడు అమిత్.
“ఈ వాగు నీళ్లు ఒక్కోచోట ఒక్కో రంగులో కనబడతాయి, నల్లమల కూడా అంతే, నల్లగా ఏమీ ఉండదు, పచ్చగా, అప్పుడప్పుడూ ఎర్రగా మారుతుంది” మంద్ర స్వరంతో అంది ఆర్తి, ఆమె సోషియాలజీ స్కాలర్.
చెప్పుకోకూడదు కానీ అతనిలో సన్నని జంకు, ఆమె వైపు అలాగే చూశాడు, ఆ ఎక్స్ప్రెషన్ కోసమే చూస్తున్నట్టు ఉంది, పకాలున నవ్వి “మీరు పత్రికలో ఇలాంటి కథనాలు రాస్తే ఎవరు చదువుతారు?” అంది.
“జనానికి ఇలాంటి వాటిమీదే ఆసక్తి, కానీ ఈ ఊర్లో జరిగేవి నిజమని నమ్మలేకపోతున్నాను” అమిత్.
“మొదట్లో నేనూ నమ్మలేదు, కానీ తర్వాత నమ్మక తప్పలేదు, ఈ పక్కన ఊర్లకి ఆనుకొనిఉన్న అడవిలోకి వెళ్ళినవాళ్లు మొహం మీద గాట్లతో వస్తే నమ్మకుండా ఉండగలమా, అది కూడా ఒకటీ రెండూ గాట్లు కాదు, అనేకం. రక్తసిక్తమై వస్తారు, ఎవరైనా దాడి చేశారా? అంటే నోరు మెదపరు, ఇది టైగర్ జోన్ కూడా కాదు, కాబట్టి పులులు.. అనుకోవడానికి లేదు, మొన్నటిదాకా అడవిలోనే జరిగేది, ఈమధ్య ఊర్లలోకి వచ్చినవాళ్లకి కూడా తెల్లారేసరికి ముఖమంతా నెత్తుటిమయం అవుతోంది”
ఆ మాటకి అతని అరచేతుల్లో చెమట “ఇదంతా మీరు చూశారా? దీని మీద మీకేంటి అంత ఇంట్రెస్ట్?!”
“లేదు‌, చూల్లేదు, చెప్పుకుంటుంటే విన్నా. మా ప్రొఫెసర్లు.. స్కాలర్లకు ఇలాంటి వియర్డ్ సోషల్ కండిషన్స్ మీద అమితాసక్తి ఉండాలి, లేకుంటే థీసిస్ సవ్యంగా ఉండదు, అని చెట్టడంతో దీనిమీద ఫోకస్ పెట్టాను, కానీ రాను రానూ చిత్రంగా అనిపిస్తున్నాయి సంఘటనలు” తన కలువ కళ్ళు పడవంత చేసింది.
“అంటే?” అతని మస్తిష్కంలో చిక్కుముడి మరిన్ని చిక్కులు పడుతోంది.
“ఆ గాయాలైనవాళ్లు ఒక్కొక్కరూ మాయమవున్నారు”
నీళ్లలోకి తదేకంగా చూస్తూ చెప్పింది ఆర్తీ, ఆ మాటా, వాగు ఉధృతీ కలగలిసి మరింత భయపెట్టాయి.
అతనూ ఆమె చూసిన వైపుకే చూశాడు, అక్కడ నీళ్ళు ఎర్రగా మారుతున్నాయి, అది పడవదాకా విస్తరించింది. ఎరుపు మధ్య నుంచి ఓ శవం పైకి తేలింది. దాని మీద క్రమంగా చీకటి కమ్మింది.

***

నిశీధిలో ఊరంతా గదిలో బంధించిన పాత సామానులా ఉంది. వాతావరణంలో మంద్రస్థాయిలో పొగ అలుముకొంది.. అతను వెనక్కి తిరిగి వాగుని చూశాడు. జనం శవాన్ని పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
“ఊర్లు ఇంత లోపలికి ఎందుకు ఉంటాయో అర్థం కాదు” నడుస్తూ అంది ఆర్తీ.
తన తెలివిని పరీక్షిస్తుందని తెలీక నోరు మెదిపాడు జర్నలిస్టు “మృగాలు భయంతో పొదలో దాక్కున్నట్టు మనుషులు కూడా భయంతోటే ఇలా దూరంగా వచ్చి నివాసాలు ఏర్పరచుకుని ఉండొచ్చు”
“నాగరికులకా, ఏంకాదు, పంటకు అనుకూలంగా ఉండే భూమి దగ్గరే జనం ఉంటారు. నాగరికతల గురించి చదువుకోలేదూ.. సివిలైజేషన్స్ ఆర్ ఆరిజినేటెడ్ ఎట్ రివర్స్”
నడక ఆపి ఆమె వైపు చూసాడు ‘ఈమె ప్రతిభా ప్రదర్శన ఏమిటీ?’ అని కాబోలు. ముందుకొచ్చి “ఊరు కుడివైపు కదా, ఎడమవైపు వెళ్తున్నామే!” అన్నాడు.
“ఊర్లోకి వెళ్లడం మంచిది కాదు”
“అదేంటి? మనం వచ్చింది అక్కడికి వెళ్ళడానికే కదా”
“లేదు, నాకు తెలిసిన నలుగురిని ఇక్కడికి పిలిపిస్తాను, వాళ్లతోనే మాట్లాడు, అంతే”
“వాళ్లకు రహస్యాలన్నీ తెలుస్తాయా? ఆర్తిగారూ ఇదేమీ బాలేదు”
ఆమె తన చేతిలోని ఖాళీ వాటర్ బాటిల్ని విసిరేసి “నాకు తెలిసింది నేను చెప్పాను, మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్లటం కూడా నా బాధ్యత” అరిచింది.
అతను పట్టించుకోకుండా కుడివైపుకు వెళ్ళిపోతున్నాడు. ఆమె గొంతు తడారిపోతుంటే అలా చూస్తూ ఉంది. అతను పొలిమేర దగ్గరికి వెళ్లి పక్కన చుట్ట కాలుస్తున్న ముసలాయన్ని కదిపాడు, ఆయన అతని వైపు ఒక నిమిషం పాటు చూసి తల తిప్పుకున్నాడు. ముసలాడి వాలకం అర్థంకాక మరింత ముందుకెళ్ళాడు. ఓ కుర్రాడు ఏవో సామాన్లు భుజాన వేసుకొని వెళ్తుంటే కదిపాడు, ఆ కుర్రాడు కూడా ఓ నిమిషం పాటు తీక్షణంగా చూసి ఊర్లోకి పరిగెత్తాడు. అయోమయంలో పడ్డాడు అమిత్. చూస్తే వెనకాల ముసలోడు కూడా లేడు. అంతే, పరుగులాంటి నడకతో ఆర్తిని చేరుకున్నాడు, కాస్త ఆయాసం. సిగరెట్లు తీసి ఒకదాని వెంట ఒకటి కాల్చాడు. అప్పటికే ఆమె కోసం వచ్చిన నలుగురూ అక్కడున్నారు. అతని చేయి పట్టుకొని ముందుకు లాక్కెళ్ళింది. ఆ నలుగురూ చెప్పడం మొదలెట్టారు, చీకట్లో వాళ్ల మొహాలు తెలియడంలేదు “మేం పక్కూరి వాళ్లమే, మాకూ కొంతే తెలుసు, కొత్తవాళ్ళు వస్తే ఊరిలో జనం అంతగా మాట్లాడరు, ఈ చావులు జరిగాక అది మరింత పెరిగింది, అప్పుడప్పుడూ ఊరిలో ఎల్లమ్మ జాతర జరుగుతుంది, అప్పుడు జనాలు గుంపులు గుంపులుగా కలుస్తారు. కొందరు పూనకాలతో భవిష్యత్తు చెబుతారు. ఒంటికి శూలాలు దించుకొని నాట్యమాడతారు, అమ్మవారికి గొర్రెలు బలిచ్చి అందరూ పంచుకుంటారు”
“ఇది అన్ని చోట్ల జరిగేదేగా” అమిత్.
“అవును, కానీ ఈమధ్య గొర్రెలను బలి ఇవ్వద్దని భవిష్యవాణి చెప్పిందట. ఆపేశారు, అప్పటినుంచే మనుషులు కత్తివేటుకు గురవుతున్నారు. వీటన్నిటి గురించీ తెలియాలంటే దూరంగా ఉన్న పాడుబడ్డ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఒకతను ఉంటాడు, అతన్నే అడగండి, చూడ్డానికి దేశదిమ్మరిలా ఉంటాడు, ఇంకో విషయం, మీరు ఆయన్ని కలిసిన విషయం ఊర్లో ఎవరికీ తెలియకూడదు. మీరు ఈ ఊరినుంచి వచ్చినట్లు చెప్పొద్దు” హెచ్చరించి వెళ్లిపోయారు.
‘ఇంకా ఏమి చూడబోతున్నామో అనుకుంటూ, చీకటి నుంచి మరింత చీకట్లోకి ప్రయాణం సాగించారు.

***

పొదల మధ్య సన్నని దారి, వాళ్ళు దాటొచ్చిన వాగు లాగా. కీచురాయి శబ్దాలు తరుముతున్నట్లున్నాయి. చెట్ల మధ్యన ఉన్న ఆ భవనం దగ్గరికి దారి చేసుకుంటూ వెళ్ళారు.
దబ్… వీళ్ళను చూసి గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు దేశ దిమ్మరి.
జర్నలిస్ట్ అవాక్కయి చూసి “ఆ చావులకీ ఇతనికీ గట్టి సంబధమే ఉండి ఉండాలి.” అనుకున్నాడు.
ఇద్దరూ వివరాలు చెప్పి అరగంట బతిమాలితే కానీ అతను బయటకి రాలేదు. పేరు శివకాశి, అది తనే పెట్టుకున్నాడట. యాభై ఏళ్ళుంటాయి. భారీ కాయం. అతని మొహంపై అనేక గాట్లు, కొన్ని పచ్చిగా, కొన్ని సాక్షిగా. నవ్వినప్పుడు పెద్ద లోయ కనపడింది, ముందుండే అయిదారు పళ్ళు లేవు మరి. దాంతో మాటలు అస్పష్టంగా పలుకుతున్నాడు.
“ఆ రహస్యం గురించి తెలుసుకుందామని వచ్చాము” బిడియంగా అన్నాడు అమిత్.
ఆయన కళ్ళు మూసుకొని ఐదారు నిమిషాలకు తన గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ చాలా సేపు ఎదురు చూశారు కానీ అతను రాలేదు, అసలతను ఈ లోకంలో లేడు. తను శిలలా ఉన్నా, మనసు మాత్రం గాలిలా ఎటో ప్రయాణించింది…. ‘కొన్ని ఘోరాల వెనక కారణాలు మార్మికంగా ఉంటాయి. ప్రకృతిలో నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేవి ఉంటాయి. ఒకటి చెడు చేస్తుంది, మరోటి మంచి చేస్తుంది… చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీ నుంచి తప్పించుకోవడానికి మనం ఏవేవో పనులు చేస్తుంటాం. కానీ నష్టం జరిగిపోతుంది”
పక్కకు తిరిగి ఆర్తితో “ఈయన ఫౌంటెన్ కట్టిస్తే బాగుండు”
చేతి మీద పడ్డ లాలాజలం తుడుచుకుంటూ అన్నాడు.
ఆర్తీ “ఇది ఫౌంటెన్ కాదు తుఫాన్” కిసుక్కున నవ్వుకున్నారు. ఇద్దరికీ మొదట ఉన్నంత జంకు లేదిప్పుడు.
అదంతా గమనించినట్టున్నాడు, కర్చీఫ్ అడ్డం పెట్టుకొని, “క్షమించాలి, అదీ పళ్లు లేకపోవడం వల్ల ఇలా…” మన లోపాలు మనమే చెప్పుకోవాల్సిన వచ్చినప్పుడు పడే వేదన అంతా ఇంతా కాదు.
దానికతను తల అడ్డంగా ఊపి “నో ప్రాబ్లమ్, కానీ మీ నెగెటివ్ ఎనర్జీ సిద్దాంతాన్ని ఒప్పకోను. ప్రకృతికి పాజిటివ్, నెగిటివ్ అని ఉండదు. నదులు పొంగడం, భూమికి గురుత్వాకర్షణ, అడవి పెరుగుదల, మనుషుల్లో చలనం, ఇవన్నీ సైంటిఫిక్ ఎనర్జీ ద్వారా జరిగేవే, కానీ నెగటివ్ ఎనర్జీ ఏదో గాలిలా, దెయ్యంలా ఆ ఊరిమీద పడిందని చెప్పకండి” అతని నిష్టూరం.
“మ్…. మీరు తెలివైన వాళ్ళు, నేనేమీ అంత జ్ఞాని కాదు, నీ ప్రకారమే చూద్దాం, భూకంపాలూ, సునామీలు ఎందుకొస్తాయ్? నెగిటివ్ ఎనర్జీ వల్ల కాదూ!” మనుషులతో మాట్లాడి చాలా రోజులైందన్న ఆత్రం అతని వాలకంలో,
“చాల్లే ఆపండి” కసిరాడు అమిత్. మనం నమ్మిన సిద్ధాంతం ఎవరిదగ్గరైనా ఓటమిలో ఉంటే చెప్పలేనంత కోపం, అప్పుడు వచ్చే మాటలిలాటాయి… “ప్రతి పదార్థానికి ఓ లక్షణం ఉంటుంది, దాన్ని అపసవ్యం చేస్తే వైపరీత్యం సంభవిస్తుంది. ఇక్కడ ఉన్న గ్లాస్ ని దాన్ని తయారు చేసిన స్ట్రక్చర్ ప్రకారం ఒక పద్ధతిలో నిలబెట్టాలి. పద్ధతి మారితే పగిలిపోతుంది. ఇదంతా సైన్సేనండి” అంటూ ఆ పంగాణీ గ్లాసుని క్రాస్ గా నిలబెట్టాడు జర్నలిస్ట్. సహజంగానే అది కింద పడి పగిలిపోయింది, అది తమ ఎరుకలోనే జరిగినా అలర్టయ్యారు అందరూ. శివకాశి అతన్ని తీక్షణంగా చూశాడు. ఏదోభయం ఆవహించింది దిక్కులు చూస్తున్నాడు.
ఆర్తి గుసగుసలాడింది “తనేదో చేసేసి ప్రకృతి మీద నెడుతున్నాడు”
అమిత్ అవునన్నట్లుగా తలాడించాడు.
శివకాశి ధ్యానంలోకి వెల్లిపోయాడు.
చాలా సేపటికి ఆర్తి బిస్కెట్ ప్యాకెట్ అతన్ని తట్టిది. కళ్ళు తెరిచి క్షణంలో దాన్ని ఖాళీ చేసి మరో ప్యాకెట్ కోసం చూశాడు.
ఇద్దరూ మొహాలు చూసుకొని లేదన్నట్టు పెదవి విరిచారు, వాటర్ బాటిలిచ్చారు. మొత్తం నీళ్లన్నీ తాగేశాడు.
అమిత్ ని దగ్గరకు పిలిచి “ఈ బిల్డింగ్ వెనకాల కాస్తంత దూరం వెళితే ఒకే చోట నాలుగు జామచెట్లు కనబడతాయి, కాయలు పైన ఎక్కడో ఉంటాయి, నేను ఎక్కలేను, వెళ్లి తీసుకురాగలవా?”
“అడవిలో వేట కుక్కలుంటాయి జాగ్రత్త” మళ్లీ తనే. ‘నిజాలకోసం వస్తే అడవిలోకి పంపిస్తున్నాడు, తేకపోతే ఏమీ చెప్పేటట్లు లేడు…’ అనుకుంటూ నడిచాడు అమిత్. లోన తెలియని బిడియం, అడుగులో అడుగేస్తూ అడవిలోనికి వెళుతున్నాడు. ఆర్తి బిక్కుబిక్కుమంటూ, గదిలో పెప్పర్ స్ప్రే గట్టిగా పట్టుకుని కూర్చుంది. కానీ అడవిని చూస్తుంటే అగాధంలా ఉంది. దట్టమైన వెన్నెల వల్ల బాగానే కనిపిస్తుంది. ఒకచోట ఆగి చెట్లను చూశాడు. కొన్ని జామచెట్లు, కొన్ని చింత చెట్లు, కొన్ని యూకలిప్టస్ చెట్లు, ఆ చెట్లను ఫారెస్ట్ వాళ్ళు పనిగట్టుకొని పద్ధతిగా పెంచినట్లున్నారు. బరబరా చెట్టెక్కి కాయలు కోశాడు. ఇక దిగడమే ఆలస్యం. ఇంతలో కుక్కల వాసన అతనికి రాలేదు కానీ అతని వాసన వాటికి వచ్చింది, నాలుగు అడవి కుక్కలు చుట్టూ మాటువేశాయి. తమ మధ్య ఎన్నాళ్ళ పగో ఉన్నట్టు గుర్రుగా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నాయి. అసలు అడవి కుక్కలు కూడా ఎందుకు దాడి చేస్తాయి? మనుషులు వాటి ఆహారం కాదుకదా అనుకున్నాడు. ఎలా తప్పించుకోవాలో అనుభవంలేదు. దొరికితే కండపట్టి పీకేస్తాయి. ఒక్కోసారి చచ్చిపోతారు కూడా. ‘కొంపదీసి ఆ ఊర్లో ఘటనలు అడవి కుక్కల వల్లనేనా? తను చూసిన ఫోటోల్లో గాట్లు కుక్కలు మీదపడి రక్కినట్టే ఉన్నాయి. గోటి గాట్లు, పదునైన గాట్లు. కానీ ఆ బలులు ఆపడంతోనే ఏదో శక్తి ఇలా చేస్తుందని నమ్ముతున్నారు ఊరిలో జనం. లేక ఈ శివకాశి స్కైచ్ ఏమైనా గీశాడా? రకరకాలుగా అతని భయాలోచనలు సాగుతున్నాయి. ఎలా..ఎలా..ఎలా తప్పించుకోవాలి?’ అప్పుడు వెలిగింది.. జేబులోని లైటర్. తనకి పక్కనే అందుతోన్న యూకలిప్టస్ చెట్ల ఆకులకి ముట్టిస్తూ విఫలయత్నం చేశాడు. క్షణక్షణానికి కింద నుంచి కుక్కల అరుపులు గుండెను జార్చుతున్నాయి, ఇది అతని జీవితం లోనే అతి భయంకరమైన రాత్రి. ఎంతో సేపటికి గాని చిన్న చిన్న రవ్వలతో నిప్పు రాజుకుంది, ఆ తర్వాత క్షణాల్లో జ్వాల చెట్టంతా పాకింది… ఆశ్చర్యకరంగా, యూకలిప్టస్ చెట్లకి ఉండే గమ్ చెట్టు మొత్తాన్ని మండుకునేలా చేస్తుంది. అడవుల్లో కార్చిచ్చులు ఎక్కువగా ఈ చెట్ల వల్లనే అన్న అవగాహన ఉండటం వల్ల త్వరగానే స్పందించాడు. చెట్టంతా భీకర మంటతో దగ్ధం కాసాగింది. అది చూడగానే సాధారణంగా అడవి జంతువులకుండే నిప్పుభయం ఆ కుక్కలనీ భయపెట్టింది. వేడిని తట్టుకోలేక కాస్త దూరం పరిగెత్తి చూస్తున్నాయి. ఇదే సరైన సమయం అనుకుని అతను చకచకా దిగి, పరుగు లంకించుకున్నాడు. వేట కుక్కలు ఊరుకోలేదు… వేట మొదలెట్టాయి, పరుగుపరుగున అతని దగ్గరికి చేరాయి, శక్తికొద్దీ పిక్కలకి పని చెప్పాడు. ఒక్కక్షణం ఉంటే కాళ్లు వాటి నోటికి దొరికేవి, ఎగిరి కంచె దాటి, ఆఫీస్ లోకి ప్రవేశించి తలుపేసాడు. హఠత్పరిణామానికి కంగారు పడిపోయింది ఆర్తి. అడుగుతుంటే చెప్పడానికి గొంతు పెగల్లేదు. ఎత్తయిన ఫెన్సింగ్ ఆ కుక్కలు అపరిచిత స్థలం అన్నట్లు కాసేపు చూసి వెనక్కెళ్లిపోయాయి. పదిహేను నిమిషాల పాటు అతని శ్వాస శ్శబ్దం తప్ప మరేమీలేదు. చివరికి గస పెడుతూనే గొంతు విప్పాడు “తను వాటికి ఏ హాని చేయలేదు, అవి కూడా మనిషి మాసం తినేవి కావు. మరి ఈ దాడి ఎందుకు?, దొరికితే నన్ను చంపేసేవా?” శివకాశిని ప్రశ్నించాడు. అతని మీదున్న సందేహాన్ని మాత్రం బయట పెట్టే ధైర్యం చేయలేకపోయాడు.
ఆయన తాపీగా “ఆ.. అది జంతు స్వభావం, అంతే, వాటి సమీపానికి ఒక జీవి వచ్చినప్పుడు జంతువులు అలాగే స్పందిస్తాయి, హింస వాటి నైజం” తెచ్చినవాటిలో రెండు పండ్లు వాళ్ళకిచ్చాడు.
“నాకు పెద్దగా ఇష్టం ఉండదు” అమిత్.
“ఇవి మనుషులు కాదు.. ఇష్టం లేని తిండి పదార్థాలూ శరీరానికి మేలే చేస్తాయి, హాని కాదు” శివకాశి.
చెరొకటి తీసుకొని ఆరగిస్తున్నారు. ముగ్గురి మధ్య అంతకుముందున్న దూరం తగ్గింది, సందేహాలు మాత్రం పెరుగుతునే ఉన్నాయి.

***

“అయితే ఆ జరిగిన వాటికి మీకు ఏ సంబంధం లేదంటారు” ఇద్దరిదీ అదే ప్రశ్న.
తలాడించాడు శివకాశి. అవును మరి, యుద్ధం చేసేవాడే కాదు, నాగారా మోగించినవాడు కూడా యుద్ధంలో భాగవుతాడు.
తమ ప్రెడిక్షన్ నిజమైనందుకు ఆనందంగా మొహాలు చూసుకున్నారు అమిత్, ఆర్తీ, ఆ వెనకే భయం తొంగి చూసింది. తమ మాట్లాడుతుంది మిస్టీరియస్ చావులకి కారణమైన వాడితో అని.
శివకాశి పది నిమిషాల గడువడిగి ఏదో పూజ చేశాడు. కాస్త సంస్కృతం, ఇంకాస్త మరేదో భాష, చిత్రంగా ద్వనిస్తోంది. ఆర్తి వైపు చూశాడు.
“అది తమిళం” క్లారిఫై చేసింది.
పూజ అనంతరం జాంపళ్ళు కోయడానికి కత్తి నూరుతున్నాడు. మనసుని సుదూర జ్ఞాపకాలకు పయనం కట్టించాడు….
శివకాశి.. అతనికంటూ ఎవరూ లేరు, ఒక్కోసీజన్ ఒక్కో ఊర్లో ఉంటాడు, ఇక్కడికొచ్చాక ఆ వాగూ, అడవీ, ప్రకృతీ, ముఖ్యంగా జనం చేసే కోలాహలం, అన్నీ నచ్చాయి, అందుకే ఐదారేళ్ళుగా ఇక్కడే ఉండిపోయాడు. ఊర్లో వాళ్లకి భవిష్యత్తు చెప్పేవాడు, అదీ అడిగితేనే. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అందులో సమస్య ఏమీ లేదు. ఏదీ మన చేతుల్లో ఉండదు కదా. ఆయుర్వేదం తెలుసు, రోగులకి మందు ఇస్తే వచ్చే డబ్బులూ గౌరవం సరిపోతాయి బతకడానికి, రెండేళ్లకి ఊరి సర్పంచ్ ఆ ఇంటి స్థలం ఇప్పించ్చాడు, దానికి ఊర్లో రెండు వర్గాలూ కుమ్ములాడుకున్నాయి,
“ఎవరికో ఊర్లో స్థలం ఇచ్చేది ఏంటని’ కాళేశ్వర్ కదం తొక్కాడు. చిన్న తరహా పెద్దమనిషి. ఇస్తే తప్పేమీ లేదన్నాడు పరంధాములు. అతను ఊర్లో జ్ఞాని అన్న బిరుదుకు తగ్గట్టు పసుపు శాలువా ఒకటి కప్పుకొని తీక్షణమైన చూపు కలిగి ఉంటాడు, శాస్త్ర ాలు చదివాడు. తన లాంటి ప్రవర్తన కలిగిన వాడు కావడంతో శివకాశి మీద కాస్తంత అభిమానం.
స్థలం శివకాశికి ఇచ్చేయడంతో కాళేశ్వర్ అహం దెబ్బతింది, రెండు వర్గాలుగా చీలిపోయారు.
“ఊరి లోపల, పొలిమేరలో, అడవిలో కూడా కొన్ని సంస్థానాలు వాడివే, అలాగే నీదీ అనుకున్నాడు” క్లారిఫై చేశాడు పరంధాములు. ‘ఏది ఎవరిదీ’ నవ్వుకున్నాడు శివకాశి.
అనుకోకుండా పోయిన వేసవిలో వారానికొకరు చొప్పున స్పృహ తప్పి పడిపోయోరు. వచ్చి వైనం అడిగారు జనం. శివకాశి మందులిచ్చాడు. మరింతమందికి ఇదే సమస్య. తరచూ వస్తున్నారు. అతను రోజులో ఎక్కువ శాతం ధ్యానంలోనే గడిపేవాడు. ఈ మంత్రాలు విని ‘ఏంటి, ఏదో చేస్తున్నాడు!’ అని గుసగుసలడుకునే వారు ఆ ఊరి జనం. మా ఇంటిలోపలి వాతావరణం పరిశీలించి చూడడంతో వాళ్లకి ఎందుకో అతడి మీద అనుమానం వచ్చింది. కొన్నాళ్లకే అది బలపడింది.
అమిత్ కదిలించడంతో ఈ లోకంలోకి వచ్చాడు.
“ఒకరోజు దారిలో అటకాయించి క్షుద్ర పూజలు చేస్తున్నావు కదూ, ఆపేయి, లేదంటే ఊరుకోము అని వార్నింగ్ ఇచ్చాడు కాళేశ్వర్. అప్పుడక్కడ ఇద్దరు ముగ్గురే ఉన్నారు. అలాంటివి తను చేయలేదని చెప్పినా వాళ్లకు అర్థం చేసుకునే శక్తి లేకపోయింది. అప్పటికి హెచ్చరించి వదిలేశారు”
“యు మీన్ బ్లాక్ మ్యాజిక్” ఇలాంటివి హ్యరీపోటర్ లో మాత్రమే చూసిన మోడరన్ అమ్మాయి ఆర్తీ.
” అవును, బ్లాక్ మ్యూజిక్” శివకాశి, అతనిలో రకరకాల భయాలు. ఈసారి కనిపిస్తే కొడతారేమో, కాలో, చేయ్యో విరిగితే నన్నెవరు చూసుకుంటారు? ఎక్కడికైనా పారిపోదామా! ఇంత మంచి ప్రకృతిని, అభిమానించే వాళ్లనీ వదిలి ఎక్కడికో ఎందుకు వెళ్లాలి? ఆ రోజు నుంచీ బయట తిరగడం మానేశాడు, రోజులు గడుస్తున్న కొద్దీ ఊర్లో ఎవరో ఒకరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య రావడం అది అనేక ఊహలకు ఊపిరిపోయడం. అతను గదిలో ఉండి నిష్టగా ఈ కాశ్మొరా విద్యలేవో చేస్తున్నాడు” . ఎవరూ వెళ్లి చూడకుండానే దూరం జరిగారు. వాళ్లు అతన్నభిమానించే వర్గమే. తరువాతి వార్నింగులు వాళ్లవే. పరంధాములు ఎదురుపడ్డా మాట్లాడటమే లేదు. ఊరు పరాయివాడిని చేసింది. తన పూర్వపు స్థితిలో నిలిపింది. ఇక ధైర్యం సడలింది. మర్నాడు సాయంత్రం ట్రైన్ కి దక్షిణం వైపు వెళ్ళిపోదామని నిర్ణయించుకుని బ్యాగ్ సర్దుకున్నాడు. కానీ విధి మరోలా వెక్కిరించింది. రోజు రాత్రి ఏదో అలజడి, శబ్దం. ఎవరో అరుస్తున్నారు. నిద్రపోతున్న నేను ఉలిక్కిపడి లేచాడు, శ్రధ్ధగా ఆలకిస్తే ఆ అరుపులో ఉన్నది తన పేరే… ఒరేయ్ శివకాశి.. అని. అర్థరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. చుట్టుముట్టి.. “క్షుద్ర విద్యలు.. చేస్తున్నావా?” అని వాళ్లే కేకలు పెట్టారు.
అతని మాట వాళ్లకి చెవికి ఎక్కడంలేదు, ఎవరో అంటున్నారు.. ‘ఊర్లో ఎందుకు నష్టాలు జరుగుతాయి. ఎందుకు వానలు పడటం లేదు, పంటలు పండలేదు, వీటన్నిటికీ కారణం నువ్వే,’ చీకటిలో మొహం తెయలేదు, గొంతు మాత్రం బాగా తెలుసు.
“పడవ బోర్లా పడ్డా, మనుషులు పడ్డా, ఎవరి బతుకు ఏ కారణంతో తలకిందులైనా దానికి అతడినే కారణమట. “ఊహించని సంఘటనలకు మార్మిక కారణాలు వెతకడం సాధారణ జనానికి అలవాటు, అలా వెతికితే దొరికింది ఈ కారణం” ఆ బీభత్సం తలుచుకొని శివకాశి.
“మరి వాటికి అసలు కారణాలేంటి?” చెప్పేది రికార్డ్ చేస్తూ జర్నలిస్ట్ అమిత్.
శివకాశి నిట్టూర్చి “సాధారణ కారణాలే.. డీహైడ్రేషన్, కొందరికి ఉపవాసాల వల్ల నీరసం, తిండిలేక, మరికొందరికి సహజమైన రోగాలు. కాకపోతే వరుసపెట్టి జరగడంతో సహజంగానే భయపడ్డారు. దేనికైనా హేతువు ఉంటుంది అన్న విజ్ఞత మర్చిపోయారు, అది నెగెటివ్ ఎనర్జీ కూడా కావచ్చు, వాళ్లు వింటేనా!!”
“మరి ఇక్కడ ఎందుకు ఉన్నారు? మొహం మీద ఆ గాట్లు?”
“హ… ఇది చూసే నన్ను నిజంగా మాంత్రికుడు అనుకుంటున్నారు కదూ, నాకు తెలుసు, ఇలా వస్తే బయట జనం కూడా అదే అనుకుంటారు. ఎప్పుడూ చీమ క్కూడా హాని చేయలేదు, అలా నన్ను చూసి జనం తప్పుకుంటే మనసు మెలి పెట్టినట్టు అనిపిస్తుంది” కళ్ళు తుడుచుకున్నాడు.
ఇది నమ్మాలా లేదా అన్న మీమాంసలో పడ్డారు అమిత్, ఆర్తి.
మళ్లీ అతనే “ఏ మనిషి కోరుకొని సంఘటన అది, ఆ రాత్రి పగిలిన నా ఇంటి తలుపును నెట్టి లోనికి దూసుకొచ్చారు జనం. కర్రలు, కత్తులు, బరిసెలు, చంపడానికి ఎవరు ఆయుధంగా వాడని రోకలి బండలు, పబ్లిక్ కొలాయి పైపులు, మటన్ కత్తి, ప్రతిదీ ప్రాణం తీయగలదు. వాల్ల మెదడులో ఏమి ఆలోచన సాగి ఉండొచ్చు! ఒక ప్రాణం తీద్దామనా? నిన్నటి దాకా తమతో కలిసి తిరిగిన వాడిని, బ్రతుకుల్లో భాగమైన వాడిని భూమిలో కలిపేద్దాం అనుకున్నారా! మనిషి నెత్తురు ధార చూస్తే వాళ్లకి ఏమీ అనిపించదా, అరక్షణంలో వేయి రకాల ఆలోచనలు, నా మెదడు ఓ రకంగా స్తంభించింది, మరో రకంగా ఆలోచనల విస్పోటనం జరుగుతోంది.
“వాడిని చంపేయండి రా, నరకండి రా..” అంటూ కేకలు. ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఒకటే రౌద్రం. కాదు.. కాదు, ఉన్మాదం. అది అడవి మృగాలు వేటాడేటప్పుడు పొందే ఆనందం.
వాళ్లు అతని చుట్టూ మూగారు, అతని కాళ్లు చేతులు వణుకుతున్నాయి. నోట్లోంచి మాట రావడం లేదు. ఏమైనా చెప్తే వింటారేమో, నిజానికి అలాంటి స్థితిలో ఎవరు వినరు, తన శరీరంలో ఏ అవయవం ఆధీనంలో ఉన్నట్లు అనిపించడం లేదు. వాళ్లలో ఇద్దరు అతని రెక్కలు పట్టుకున్నారు. చీకటిలో ఎవరో రోకలిబండతో అతని మూతిమీద ఒక్క పోటు వేశాడు. దెబ్బకి పెదాలు చీలిపోయాయి. తనలో భాగం మాంసం ముద్ద అయింది. నోట్లోంచి నెత్తురు ధార కట్టింది. చొక్కా అంతా నెత్తుటిమయం. ఆ తర్వాత ఎన్ని సార్లు కొట్టాడో లెక్కేలేదు. రాళ్లతో మొహమంతా చితక్కొట్టారు. మూతి మీద కొట్టి కొట్టి పళ్ళు రాలగొట్టారు. క్షుద్ర మంత్రాలు పలకలేకుండా.
కోసిన జామకాయలు చిన్న గుండ్రారాయితో నలగ్గొట్టి కళ్లు మూసుకొని తింటున్నాడు. అది చూస్తే వీళ్ళకి ఏవగింపు కలిగింది.
“ఏమైందో కాస్త క్లియర్గా వివరించండి?” ఆర్తీ.
“ఊర్లోవాళ్ళు తమ దగ్గరు కత్తులతో నా మొహం నిండా గాట్లు పెట్టారు. అదీ ఎంతో నైపుణ్యంతో, శిల్పం చెక్కినట్టు. బొప్పాయి పండుని బాగాలుగా కోసినట్టు నా మొహాన్ని కోసారు. అదెలా ఉందంటే, ఒక పెద్ద సాలెపురుగులు నా మొహం మీద గూడు కట్టుకుని నిద్రపోతున్నట్టు ఉంది. నాకు నేను కొత్త మనిషిలా కనబడ్డాను. అసలు నాకు నేనే కాకుండా పోయాను. అప్పుడే వాగులో దూకుదామనుకున్నాను. అలా చేస్తే తప్పు ఒప్పుకున్నట్టే”
“మరి చంపడానికి వచ్చిన వాళ్ళు ఎలా వదిలేసారు?” అమిత్.
“హు… అది వేట. మనమే పారిపోవాలి. ఆటవిక న్యాయం లో అదే సరి.”
అమిత్ కి తాను వేటకుక్కల బారి నుంచి పారిపోయింది గుర్తొచ్చింది.
“కత్తితో నా ముక్కును కోస్తున్న వాడిని గట్టిగా నెట్టేశాను, పడుతూ లేస్తూ వంటగదిలోకి దూరి తలుపేసుకొని గడి పెట్టుకున్నాను, కానీ చేష్టలుడిగి పోయాను,అసలే శరీరంలో ఏ భాగం స్పందించడానికి సిద్ధంగా లేదు కదా. అప్పటికే పైనుంచి పెంకులు తీసి కిందకి రావడానికి చూస్తున్నారు కొందరు. ఇక దిగ్బంధం అయ్యానని అర్థమయింది. ఒకటే దడ. మొహమంతా మంట, చుట్టూ చూశాను, మూలన కనపడింది కిరోసిన్ డబ్బా. అది తీసుకొని కిటికీలోంచి బయటకు పోశాను. అంతకుమించి ఏం చేయాలో తోచలేదు. అగ్గిపెట్టె తీసుకుని ముట్టించి అందులో వేశాను. మంట తగలగానే ఇల్లంతా భగ్గుమంది. పసుపురంగులో ఎగస్తున్నాయి. పరంధాములు శాలువాలా, అది జ్వాలా? శాలువా? తెలీడంలేదు. ఆ చిక్కటి చీకటిలో, దట్టమైన పొగలో వెనక దారి నుంచి ఎలాగో బయటపడ్డాను”
అమిత్ కి నోట మాట రాలేదూ, ఆయనవైపే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. తను ఆ వైల్డ్ అనిమల్స్ నుంచి తప్పించుకోవడానికి చెట్టు ని తగలబెట్టి పారిపోయి వచ్చినట్టే ఉంది, మృగత్వం మీద పడ్డప్పుడు అంతకుమించి మార్గం ఏముంది! అతని ఆంతర్యం, ఆ కుక్కల అరుపులు మరోసారి అతని చెవిలో మోగాయి, గొంతు తడారిపోయింది.. తాగుదామంటే అక్కడ నీళ్లు లేవు.
“అతి పిరికివాడు కూడా ప్రాణం తీయడానికి వచ్చారంటేనే నమ్మలేకపోతున్నాను, మనిషిలో లోపలెక్కడో దాగున్న తత్వాలు బయటకు వస్తున్నాయి” అదే భయంలో శివకాశి.
“అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు, ఊర్లోనే ఇద్దరుముగ్గురు మొహానికి మీలాగే గాయాలు, నదిలో శవం తేలడం. దీనంతటికి కారణం ఏంటి? అందరూ మీరే పగబట్టి వాళ్లకి శాపాలు పెడుతున్నారు, చేతబడీ, బాణామతి వాళ్లమీద ప్రయోగిస్తున్నారు, అందుకే ఈ చావులు అంటున్నారు”
ఆయన పెద్దగా నవ్వాడు “మంత్రాలతో రెండు జామకాయలు రాల్చలేకపోయాను, జీవాలను కూల్చగలనా? నిజానికి ఆ మొహంమీద గాట్లతో చనిపోయిన వాళ్ళు ఎవరూ ఆ ఊరి వాళ్ళు కాదు. ఏదో పని మీద ఇక్కడికి వస్తున్నవాళ్లు. ఇక్కడికి పూర్తిగా అపరిచితులు. ఇక్కడి వాళ్ళ పద్ధతులను గురించి పట్టింపు లేని వాళ్ళు. వాళ్లనీ అలాగే అనుమానించి కొట్టి స్తంభాలకు కట్టేశారు. కొందరిని నదిలో తోసేశారు. పోలీసులు వస్తే ఎవరిని అరెస్ట్ చేయాలో అర్థం కాదు, అసలు వాడు నిజంగా క్షుద్రమాంత్రికుడో కాదో కూడా తెలీదు, వాళ్లు చెప్పిందే అక్కడ నిజమవుతుంది, చెప్పకుంటే నిజం సమాధి అవుతుంది, అనుమానం ఉంటే మళ్లీ వెళ్లి వాళ్ళ దవడలు తెరిచి చూడండి. వాళ్ళెవరికీ ముందు పళ్ళుండవు…. నాలాగే” కళ్ళు మూసుకున్నాడు.
అప్పటిదాకా అమిత్ తలలో గింజుకున్న సందేహం,
విస్పోటనం అయింది. ‘మాబ్ హిస్టీరియా… ఒకరిని చూసి పది మంది ఊగిపోవడం. పబ్బుల్లో ఒకరిని చూసి పది మంది డాన్స్ చేయడం. ప్రార్థన లో ఒకరి పూనకానికి పది మంది ఊగడం. జాతరలో ప్రమాదకర విన్యాసాలు చేయడం. ఈ సందర్భంలో శరీరానికి నొప్పి తెలియదు. మెదడులో సైతం రాగద్వేషాలు పోతాయి కాబోలు. చంపడానికి వెనుకాడనంత క్రోధం. అదో ఉన్మాద స్థితి’ వివిద తర్కాలతో ఓ అవగాహన కొచ్చాడు అమిత్, శివకాశిని జాలిగా చూశాడు ” వాళ్ళ దేవున్ని కాదని ప్రకృతే దెవుడు అన్నందుకేనా ఇదంతా?”
“హు… ఏమో?” శివకాశి
ప్రకృతి ఎంత భయానకంగా ఉంటుదో కూడా చూపించారు మీకు. నెత్తుటి నీళ్ళు, వేటాడే అడవి, సూర్య కిరణాలు తాకని జీవితం, సర్లే, మరి ఇక్కడెందుకు, మాతో పాటు రా, ఇంకెక్కడైనా ఉండొచ్చు” చేయి చాపాడు.
ఆయన నిర్వకారంగా నవ్వి “జనం నేనెవరో గుర్తించేలా మొహాన గుర్తులు పెట్టారు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇదే గతి, ఉన్నన్నాళ్ళు ఉంటాను” అతనిలో అదే తాత్వికత, ఏదో తెలియని బావ సంచలనం.
“అసలు తప్పెవరిదో అర్థం కావడంలేదు, దీనికి విరుగుడు ఏమిటీ?” అమిత్.
శివకాశి అదే సాధునవ్వుతో “ఆలోచించు… తార్కికంగా ఆలోచించు”
సలహాలోనే సమాధానం నింపాడు.
“మనిషి మనిషి మీద పడడం నెత్తుటి క్రీడ.అమాయకులపై మూఢత్వం ఆడిన క్రీడ” ఆ అడవి కుక్కలు అమిత్ మష్తిష్కంలో ఇంకా తరుముతున్నాయి. ఆర్తీతో రోడ్డు మీదకు వచ్చి దూరంగా ఉన్న ఊరి వైపు చూశాడు, ఊరంతా నిద్రపోతున్న మృత్యువులా ఉంది. ఇప్పుడు తాము తిరిగి అదే ఊరు మీదగా వెళ్లాలి. చలిలో చెమట పట్టింది, తన చేత్తో అతన్ని పట్టుకుంది ఆర్తి, ఇప్పుడు తనే ఆమెని సేఫ్గా తీసుకెళ్లాలి.
ముందు ఊరు, అందులో జనాలు, వెనుక అడవి.. అందులో వేట కుక్కలు, అతనికి ప్రమాదంలో తేడాలు తెలియలేదు. మరో దారి లేదు, వికలమైన మనసులతో ఆ వాగువైపు బయలుదేరారు.

*

చరణ్ పరిమి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీరు కథ చెప్పిన విధానం, మాటలు, భావాలు.. చాలా బాగున్నాయి. శుభాకాంక్షలు..💐💐💐 All the best 👍

  • మిత్రమా చరణ్.. వాస్తవ పరిస్థితి, ప్రజా చైతన్యం, ప్రజల అమాయకత్వం పై ని రచనలు అవసరం… చివరిలో వికలమైన మనస్సుతో ప్రయాణం… ని.. కథ నాటకీయత నచ్చాయీ… thank you

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు