అయిదో అడుగు: ఆత్మహత్య

నియతీ.. నియతీ… ఎంత పని చేశావే!

స్టాప్ ఆల్ దిస్. గో ఫర్ ఎ టెస్ట్ ఫస్ట్. నిర్ణయాలు తరువాత తీసుకోవచ్చు. ముందు నిర్థారించుకో.

ఒకవేళ పాజిటివ్ వస్తే? నో నో… రాకూడదు. కానీ ఎలా? ఎవరి వల్ల?

నందుతో మాత్రం కాదు. ఆ అవకాశమే లేదు. కారణం ఏదైనా నిన్ను దగ్గరకు రానివ్వటం లేదు కదా?

శశాంక్?

ఎక్కడో లెక్క తప్పింది. ప్రతిసారి జాగ్రత్తలు తీసుకున్నావు కదా? నిజంగానే తీసుకున్నావా? నో!

అనుకోకుండా కలిసినప్పుడు, అనుకున్న దానికన్నా ఎక్కువసార్లు కలిసినప్పుడు, ఔట్ ఆఫ్ అన్ కంట్రోలబుల్ ప్యాషనేట్ ఎమోషన్… జాగ్రత్త పడ్డావా? ఓహ్నో! నో!

ఏం చెయ్యాలిప్పుడు? ఏం చెయ్యాలి?

చెయ్యడానికి ఏముంది? ఎటు వెళ్ళాలో తెలియని కూడలిలో వున్నానని అనుకున్నావు ఇప్పటి దాకా. ఏ దారిలో వెళ్ళాలాని ఆలోచించావు. అనవసరపు ప్రయాస. నువ్వు ఇప్పుడున్నది కూడలిలో కాదు. తిరిగి వచ్చేందుకే కాదు, ముందుకు వెళ్ళేందుకు కూడా వీలులేని డెడ్ ఎండ్ లో వున్నావు. డెడ్ ఎండ్!

ఏం చేస్తావిప్పుడు? నందు దగ్గరకు వెళ్ళగలవా?

నందు పిచ్చివాడేం కాదు. శశాంక్ తో నీ సంబంధం గురించి ఎలా చెప్పాలా అని ఇంతసేపు ఆలోచించావు. ఆ సంగతి అతనికి తెలిసిపోతుందేమో అని భయపడ్డావు. ఇప్పుడది అనివార్యమైపోయింది. తెలిసిపోవటం తప్పదు. ఇలా తెలియడంలోనే సమస్యంతా.

చంపేస్తాడు. అవును. చం..పే..స్తా..డు. అంతే!

కాదేమో!

ఎవరి వల్ల? అని అడుగుతాడు పిడికిలి బిగించి. ఏం చెప్తావు?

నీ వల్లే అని మభ్యపెట్టలేవు. అది ఇంకా కోపం తెప్పిస్తుందేమో అతనికి. చెప్పక తప్పదు. చెప్తే వచ్చే పర్యవసానాలన్నీ ఆలోచించావు. చెప్పడం సాధ్యం కాదని నిర్ణయించావు. మరి ఎలా? చెప్పకపోతే బయటికి వెళ్ళిపొమ్మంటాడేమో. అదీ మంచిదే. సులువైన ఎగ్జిట్.

నందు వెళ్ళిపొమ్మంటాడా? బహుశా అనడేమో. భార్యను వెళ్ళగొట్టిన భర్తగా వుండటం అతనికి ఇష్టం వుండదు. భార్య తనని కాదని మరొకడితో వుందని అందరికీ తెలియడం కూడా అతనికి ఇష్టముండదు. ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయ్యిందో అతని పేరు తెలుసుకోవాలని కూడా అనుకోకపోవచ్చు.

ఎందుకు చేశావీ పని? అని మాత్రం అడుగుతాడు. మళ్ళీ అదే ప్రశ్న. సమాధానం ఇది వరకు నువ్వు అనుకున్న బుకాయింపు మాత్రం కాలేదు. కళ్ళ ముందే సాక్ష్యం కనపడుతోంది కాబట్టి. తెగించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. క్షమాపణే మార్గం కావచ్చు. కాళ్ళ మీద పడాలి. ప్రాధేయపడాలి. ఆ తరువాత?

బహుశా అతను ఇంట్లోనే పడుండు అంటాడేమో. క్షమించి కాదు. బయట ప్రపంచం దృష్టిలో చెడ్డవాడు కాకుండా వుండాలి కాబట్టి.

మరి ప్రగ్నెన్సీ?

తీయించెయ్ అంటాడు. తనది కానిది తనకెందుకు. లేదు లేదు. అలా అనలేడు. ఎందుకంటే అతనికి పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలని కోరిక. ప్రయత్నిస్తూనే వున్నారు కదా మీరు. నువ్వు ప్రగ్నెంట్ అవ్వాలని ఎంతో ఎదురు చూశాడతను. అయ్యావు. కానీ అతని వల్ల కాదు.

నువ్వు అతని భార్యగానే కొనసాగుతావు. నీకు ఒక బిడ్డ పుడతాడు. లోకం దృష్టిలో ఆ పుట్టే బిడ్డ అతనికి కూడా బిడ్డే కదా? ప్రపంచం దృష్టిలో నందు తండ్రి అయినట్లే కదా? అతని కావాల్సినది అదే! తీరని కోరిక. ఇలా తీరుతున్నందుకు సంతోషిస్తాడా?

అతని చుట్టూ వుండే మనుషులలో చులకన కాకూడదు కాబట్టి అతనికి భార్య కావాలి.. అతను మగాడని నిరూపించుకోడానికి, పితృత్వాన్ని అనుభవించడానికి ఒక పిల్లవాడు కావాలి. నువ్వు కంటావు. అందుకోసమైనా ఒప్పుకోడా?

కొడుకుని మాత్రం తీసుకోని నిన్ను కాదంటే? అలా జరిగేందుకు అవకాశం వుందా? అప్పుడైనా ప్రపంచానికి సమాధానం చెప్పాలి. పైగా అలాంటి పరిస్థితే వస్తే అతను రెండు ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. భార్యని కాదన్నందుకు, కొడుకుని వుంచుకున్నందుకు. కొడుకు సొంత కొడుకైతే భార్య బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. కొడుకు సొంత కొడుకు కాకపోతే వాణ్ణి తనతో వుంచుకున్నందుకు సమాధానం చెప్పాల్సి రావచ్చు. రెండూ కష్టమే. అందువల్ల బిడ్డ మాత్రమే కావాలి అని అనలేడు. నువ్వు కూడా కావాలి. నీతో పాటు మరెవరి వల్లో నీకు కలిగే బిడ్డ కూడా కావాలి. అలాగే అంటాడు. బహుశా అతనితో నీ బంధం మళ్ళీ మొదలుపెట్టడానికి ఇది కూడా మార్గమేమో.

అతడికి తండ్రి స్థానం ఇచ్చే నెపంతో అతనితోనే వుండే అవకాశం.

ఆగాగు… నీకు కావాల్సింది ఇది కాదు కదా? నందుతో కలిసి బ్రతకడానికా ఇంత చర్చ? అతనితో నీకు కుదరటంలేదనే కదా ఇంత దూరం ఆలోచిస్తున్నావు? మరి మళ్ళీ అతని దగ్గర వుండిపోయే ఆలోచన ఎందుకు చేస్తున్నావు?

ఇంకెవరితోనో భార్య సంబంధం పెట్టుకోని బిడ్డను కంటుంటే ఆమెను తన భార్యగానే వుంచుకోవడం! అతనికి ఇది త్యాగం. నీ పట్ల చూపించే ఔదార్యం. కానీ, ఇది నిన్ను క్షమించడం కన్నా ఘోరమైన అవమానం.

అలాగని ఈ బిడ్డని శశాంక్ బిడ్డగా కనగలవా?

శశాంక్ కి ఎలా చెప్తావు? ఏమని చెప్తావు?

నువ్వు తండ్రివి కాబోతున్నావు అంటావా? ఈ రోజో రేపో అతనే తండ్రి కాబోతున్నాడు.

నీ బిడ్డకు నేను తల్లిని కాబోతున్నాను అంటావా? అతని బిడ్డకు తల్లి అతని భార్య రేఖ అవుతుంది. నువ్వు ఎలా అవుతావు? సరే అతని వల్ల జరిగింది కాబట్టి నువ్వు తల్లివే కావచ్చు. కానీ ఇలా అని ప్రకటించగలవా?

ఒకవేళ నువ్వు చెప్పినా అతను అంగీకరించాలి కదా. అతను ఒప్పుకోవడం అంటే తన భార్యకు జరిగిందంతా చెప్పేయడం. చేజేతులా తన సంసారాన్ని కూలదోసుకుంటాడా? శశాంక్ నీ కోసం, భార్యని బిడ్డని కాదనుకోగలడా? వదులుకోగలడా?

ఎందుకు వదులుకుంటాడు. నీ మీద ప్రేమా? ఎంత ప్రేమ వుంది నీ మీద? ఈ ప్రపంచానికి ప్రకటించేంత ప్రేమ వుందా అతనికి నీ మీద. నిన్ను ప్రేమిస్తున్న విషయం ప్రకటించడం అంటే ఏమిటో తెలుసా? నాకు రేఖ అఖర్లేదు నియతి మాత్రమే కావాలి అని చెప్పడం. జరుగుతుందంటావా? ఇది ఎప్పటికీ జరగని పని.

ప్రాక్టికల్ గా ఆలోచించు.

నీ ప్రెగ్నెన్సీ గురించి తెలియగానే అతను మొదట భయపడతాడు. కంగారుపడతాడు. ఇలా ఎలా జరిగింది అంటాడు. జాగ్రత్తగా వుండాలి కదా అంటాడు. లెక్కల్లో తప్పింది నువ్వే అంటాడు. తీయించెయ్ అంటాడా? అంటాడేమో!

సరే అది పక్కన పెట్టు. తరువాత ఏం చేస్తాడు? పుట్టబోయే బిడ్డకి తండ్రిగా వుండటానికి అంగీకరిస్తాడా?

రేఖ ముందు తలదించుకోని తప్పు చేసినట్లుగా అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి సిద్ధపడతాడా? అలా ఒప్పుకున్న తరువాత రేఖకి దూరమవ్వాల్సి రావచ్చు. దానికి సిద్ధపడతాడా?  ముఖ్యంగా రేఖకి పుట్టబోయే బిడ్డ దూరమవ్వడానికి సిద్ధపడతాడా?

ఇదంతా ఒకెత్తు. అతని తల్లిదండ్రులు, బంధువులు, పరిచస్థులు. వీళ్లందరి గురించి కూడా ఆలోచిస్తాడు. పండంటి సంసారంలో నిప్పులు పోసుకోని, ఎవతినో తెచ్చి పెట్టుకున్నాడన్న పేరు అతనికి ఇష్టం వుండకపోవచ్చు. ఇవన్నీ ఆలోచిస్తాడతను. ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు.

ఆ నిర్ణయం ఏమిటో తెలుసా? నిన్ను వదిలేయడం.

అవును. అతను నిన్ను వదిలేస్తాడు. నువ్వు ఎవరో తెలియదంటాడు. లేకపోతే ఆ కడుపులో వున్న బిడ్డ నా బిడ్డే అని ఏమిటి గ్యారెంటీ లాంటి డైలాగులు వేస్తాడు.

శశాంక్ రేఖల మధ్య అడ్డుగోడలు కట్టడం నీ ఉద్దేశ్యం కాదు. మరి అతనిని నీ బిడ్డకు తండ్రిగా ప్రకటించి నువ్వు సాధించేదేమిటి? జాలి? అయ్యో పాపం అని అందరూ అనుకునే జాలి కోసమా ఇదంతా? శశాంక్ తో నీ సంబంధాన్ని నిరూపించి నువ్వు చేసేదేమిటి? అతని సంసారం కూలిపోవడమా? లేదు. నీ ఆలోచన సరైనది కాదు.

ఎటూ వైపు కదల లేని ఊబిలో దిగబడిపోయావు. ఇంక ఇప్పుడు నీ గతేమిటి?

పిల్లలు కావాలని కోరుకుంటున్న నందుకి శశాంక్ ద్వారా పుట్టే పిల్లాణ్ణి ఇవ్వలేవు. నీ ద్వారా పిల్లల్ని కనాలని అనుకోని శశాంక్ కి ఈ బిడ్డని ఇవ్వలేవు. సమాజానికి భయపడి నిన్ను తన్ దగ్గరే వుంచుకుంటాననే నందు దగ్గర వుండటం నీకు సమస్య. అదే సమాజానికి భయపడి నిన్ను తన దగ్గర వుంచుకోలేని శశాంక్ దగ్గరే వుండాలని నీ ఆశ.

ఏది అసాధ్యమో అదే కోరుకుంటున్నావు. ఎటూ తప్పించుకోలేని ఉచ్చు ఇది. నిన్ను అమాంతంగా కబలించి అగాధంలోకి లాక్కు వెళ్లే ఊబి. దారి తోచనివ్వని సుడిగుండం. ఏ దేవుడో దయదలిచి నిన్ను అర్థాంతరంగా ఈ భూమి మీద నుంచి ఎత్తుకుపోతేనో, ఏ పాతళలోకమో నిన్ను అమాంతంగా మింగేస్తే తప్ప తప్పించుకోవు నువ్వు.

కడుపులో బిడ్డని చంపెయ్యక తప్పదు.

సమస్య కడుపులో బిడ్డ కాదు. నువ్వు ఎవరికీ అవసరం లేకపోవడం. చచ్చిపోవాల్సింది బిడ్డ కాదు. నువ్వేనేమో!

అవును ఆత్మహత్యే!

నీకు నువ్వంటే చాలా ఇష్టం కదా. ఒక పరువు మర్యాద వుంది. సరే అవన్నీ ఫార్స్ అంటే అనుకో. కనీసం నీ కంటూ ఒక వ్యక్తిత్వం వుంది. నందు, శశాంక్ కాకుండా ఇంకా మనుషులే లేరా. వాళ్లందరి దృష్టిలో నీకు ఒక పేరు వుంది. అది ఇప్పుడు అద్దంలా బ్రద్దలైపోయింది. ఈ రోజు కాకపోతే రేపు బ్రద్దలౌతుంది. అందుకు  రంగం సిద్ధంగా వుంది. ఎంత మంది ముందు తలదించుకోని నిలబడాలో ఆలోచించు.

ఇలాంటి పరిస్థితిలో ఆత్మహత్యే మార్గమని నీకు ముందే అనిపించి వుండాల్సింది. ఇప్పటి దాకా నువ్వు అనుకున్న మార్గాలన్నీ అనవసరపు ఆప్షన్లు –కొనసాగింపు, బుకాయింపు, ధిక్కరింపు, క్షమాపణ – ఏవీ నీ సమస్యను పరిష్కరించలేకపోయాయి. ఇప్పటికి నీ సమస్యను అర్థం చేసుకోని, పూర్తిగా చిక్కుముడి విప్పే సమాధానం దొరికింది. నువ్వే లేకుండా పోవడం.

బహుశా నిద్రమాత్రలతో. లేకపోతే నరాలు కోసే బ్లేడు. అంతే! అయిపోతుంది.

ధైర్యంగా చెయ్యగలనా అని కదూ ఆలోచిస్తున్నావు?

నువ్వు ఎక్కడికి వెళ్దామని ఈ జీవిత ప్రయాణం మొదలుపెట్టావో అక్కడి మాత్రం చేరలేదు. చేరతావనే నమ్మకం నీకు లేదు. బాధగా అనిపించడం లేదూ? నిన్ను చూస్తే నీకే కోపం రావటం లేదూ? అసహ్యం కలగటం లేదు? ఎంత దయనీయమైన పరిస్థితికి వచ్చావు? వెలుగుకి భయపడి చీకటిని ప్రేమించావు. నిజం ఇప్పుడు నీకు నిప్పులా ఎదురైంది.

ఇప్పుడు కూడా చూడు. నీలో మరో భాగం ఇందులో పెద్ద తప్పేమీ లేదని వాదిస్తోంది. నీకు నచ్చినట్లు వుండటం స్వాతంత్ర్యం తప్ప తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది.

మొదట్నించి అంతే నువ్వు. నీ గురించే ఆలోచించుకున్నావు. అప్పుడు నీకు ఆనందమో, థ్రిల్లో కావాలనిపించింది. ఇప్పుడు నీకు పరువు మర్యాద కావాలనిపిస్తున్నాయి. నిర్ణయం నీ గురించే తప్ప ఇతరుల గురించి కాదు. నీ జివితంలో కావాలనుకున్నది సాధించుకోడానికి నువ్వు అన్ని ప్రయత్నాలు చేసావు. ఇది కూడా అలాంటి ప్రయత్నమే.

ఇప్పుడు నీకు కావాల్సింది మరణం. అందుకో.

నీకు నువ్వంటేనే అసహ్యం కలుగుతోంది. వెనక్కి వెళ్ళే దారి మూసుకుపోయింది. ఇంక మిగిలిందేమిటి?

బ్లేడుతో మణికట్టు మీద ఒక్క గాటు. దిగజారిన బ్రతుకు చేజారిపోతుంది.

వెంటనే అమలు చెయ్యి. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత సమయం కూడా లేదు.

కాకపోతే ఒక సమస్య వుంది. ఆత్మహత్య ఎం చేస్తుందో తెలుసా? నువ్వు బ్రతికున్న రోజులకి లేనిపోని విలువని తెచ్చిపెడుతుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం నీ జీవితం అవుతుంది. అందరి ముందు నీ జీవితం నగ్నమౌతుంది.

ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అన్న ప్రశ్న ఇప్పటి దాకా నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకన్నా శక్తివంతమైనది.

అది నువ్వు అడగవు. నువ్వు లేనప్పుడు నీ గురించి అందరూ అడుగుతారు. ఒకరిని ఒకరు అడుగుతూ ప్రశ్నల గొలుసు కడతారు. అప్పుడు వాళ్ళు ఒకరికి ఒకరు ఏమని సమాధానం చెప్పుకుంటారు?

అంతా బాగానే వుంది. బంగారంలాంటి జీవితం. అనుకూలమైన భర్త. డబ్బుకు కొరత లేదు. ఎందుకు చనిపోయింది?

పోలీసులు. కేసు. పోస్ట్‍మార్టం..

ఆవిడ కడుపుతో వుందట! ఎంత ఘోరం.

అంతేనా? అప్పుడైనా నందుకి విషయం తెలిసిపోతుంది. తెలిసినా తెలియనట్లే వుంటాడు. అవమానాన్ని దిగమింగి వుండాలి కదా. వుంటాడు.

అంతా గుట్టుగానే వుండిపోతుంది.

కానీ ఏ ఒక్కరికి నీ విషయం తెలిసి వున్నా అది దావానలంలా అంటుకుంటుంది. పోలీసులు కనిపెట్టినా సరే.

ఇది నియతి రియల్ ఎస్టేట్ యజమాని భార్య మరణం. ఆత్మహత్య. కారణం కనుక్కోకుండా వుంటారా? నందు కాస్త పలుకుబడి, ఎంతో డబ్బు ఖర్చుపెట్టి విషయం బయటికి పొక్కకుండా వుంచాలని ప్రయత్నిస్తాడు. కానీ గాలిలో కలిసిపోయిన విషయాన్ని బంధించలేడు.

అక్రమ సంబంధం కారణంగా రియల్టర్ భార్య ఆత్మహత్య.

తలుచుకోడానికే అసహ్యంగా వుంది కదూ

ఆమెకి ఇంకెవరితోనో సంబంధం వుందట.

కడుపు చేసింది వాడేనేమో?

ఇంత మంచి భర్త వుండగా అదేం పొయ్యేకాలమో ఆమెగారికి.

నీ జీవితం ముగిసిన తరువాత ఆ జీవితం గురించి విశ్లేషణ మొదలౌతుంది

నీ జీవితం బాగాలేదని నువ్వు ఆత్మహత్య చేసుకుంటే బాగాలేని ఆ జీవితం గురించి మరింత ప్రచారం జరుగుతుంది. నీ జీవితం బాగాలేదన్నది అందరికీ తెలుస్తుంది. ఏ మర్యాద కోసం ఏ పరువుకోసం నువ్వు చావడానికి సిద్ధమౌతున్నావో ఆ మర్యాద ఆ పరువు నీ చావుతో మరింత ఘోరంగా చచ్చిపోతుంది.

ఏం సాధించినట్లు.?

నందుకి ఏం తెలియకూడదో అది తెలిసిపోతుంది. శశాంక్ గురించి బయట ప్రపంచానికి ఏం తెలియకూడదని నువ్వు అనుకుంటున్నావో అదంతా తెలిసిపొతుంది.

ఇద్దరూ నిన్నే అసహ్యించుకుంటారు.

ఇదా నీకు కావాల్సింది. కాదు. కాదు.

ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు. ముఖ్యంగా నీకు మాత్రం ఆత్మహత్య పరిష్కారం కానేకాదు. నువ్వు చేసుకోలేవు. చేసుకోకూడదు.

బ్రతికి పోరాడాలని కాకపోయిన చచ్చిపోతే పోరాడలేవు కాబట్టి బ్రతికే వుండు.

మరి ప్రెగ్నెన్సీ?

అబార్షన్ చేయించెయ్.

అంతే కదా? ఇంకేమైనా వేరే ఆలోచన వుందా నీకు? కొంపదీసి ఆ బిడ్డని కనాలని అనుకుంటున్నావా? నియతీ, నీకు పూర్తిగా పిచ్చి పట్టింది. బిడ్డని ఎలా కనగలవు?  ఎవరి బిడ్డగా కంటావు?

కడుపులో వున్న ప్రాణాన్ని తీయడం నీ ప్రాణాన్ని తీసుకోవడం కన్నా దారుణమైనదే. కానీ నీ పరిస్థితి అలాంటిది. నువ్వు ప్రాణాలతో వుండాలని నిర్ణయించుకున్న తరువాత, ఆ ప్రాణాన్ని తీసెయ్యక తప్పదు.

అంత సెంటిమెంటల్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే ముగుస్తుంది.

శశాంక్ బాధపడతాడు. ఏమో. హమ్మయ్య అనుకుంటాడేమో. అతని కావాల్సింది నువ్వు. నీ ప్రగ్నెన్సీ కాదు.

నందుకు తెలియకుండానే వుండిపోతుంది. అతనికి కావాల్సింది నీ ప్రగ్నెన్సీ. నువ్వు బహుశా లేకపోయినా ఏం కాదు.

అయినా ఇది ఖచ్చితంగా ప్రగ్నెన్సీ అని ఎలా అనుకుంటున్నావు. కాకపోయుండచ్చు. టెస్ట్ చేసుకున్న తరువాత, నిర్థారణ అయిన తరువాత కదా ఇదంతా ఆలోచించాలి. అసలు నువ్వు ప్రెగ్నెంట్ కావేమో? ఈ టేన్షన్ల లో తప్పు లెక్క వేస్తున్నావేమో?

ప్రెగ్నెన్సీ వున్నా లేకపోయినా, ఒకటేనేమో. వుంటే అబార్షన్ కి వెళ్తావు. ఆ తరువాత మళ్ళీ మొదటికి వస్తావు. ప్రగ్నెన్సీ వుందేమో అన్న అనుమానం లేనప్పుడు ఏ ప్రశ్నలకు నువ్వు సమాధానాలు వెతుకుతున్నావో ఆవే ప్రశ్నలు అబార్షన్ తరువాత వస్తాయి. కొనసాగించడమా? బుకాయించడమా? ధిక్కరించడమా? క్షమాపణ అడగటమా? ఆత్మహత్యచేసుకోవడమా? అవన్నీ సాధ్యమయ్యే పనులు కాదని ఇంతకు ముందే నిర్ణయించుకున్నావు కదా. మరో మార్గం ఏమిటి?

మళ్ళీ మొదట్నుంచి మొదలు పెట్టగలవా? ఇవేమీ లేని జీవితం మళ్ళీ మొదలుపెట్టగలవా? సాధ్యమా?

సాధ్యమే.

వీళ్ళందరినీ వదిలేసి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతకడం. అప్పుడు నీ ప్రెగ్నెన్సీ కూడా అడ్డం కాకపోవచ్చు.

ఈ ప్రపంచాన్ని వదిలివెళ్ళడం కన్నా నీకు తెలిసిన ప్రపంచాన్ని మాత్రమే వదిలివెళ్ళడం సులభం. అందరికీ శ్రేయస్కరం.

(ఇంకా వుంది)

*

అరిపిరాల సత్యప్రసాద్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అయిదో అడుగులో కొంత సందిగ్దత, కొంత అంతః సంఘర్షణ కలిగాయి నియతి లో .ఈ ఆలోచనలు ఇంత కాంప్లెక్స్ ఆలోచనలు అవసరమా ? నియతీ అనిపించింది. వేచి చూద్దాము ఆరో అడుగు ఎలా వేస్తుందో

    • “ఈ ప్రపంచాన్ని వదిలివెళ్ళడం కన్నా నీకు తెలిసిన ప్రపంచాన్ని మాత్రమే వదిలివెళ్ళడం సులభం. అందరికీ శ్రేయస్కరం.” అంటోందిగా ఇదే ఆరోవ అడుగు కావచ్చు. కానీ ఈ ఆరు మార్గాలలో నియతి ఏ మార్గం లో ప్రయాణిస్తుందో తెలియాలంటే ఏడో అడుగు దాకా ఆగాలి మణి గారూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు