అమెరికా వాళ్ళ తెలుగు చదువు -2

అంశం మీద ముందటి భాగానికి మంచి స్పందన వచ్చింది. ఇక్కడ సారంగ పేజిలో వచ్చిన వ్యాఖ్యలే కాక, ఫేస్బుక్ లోనూ, ఇతర వ్యక్తిగత చర్చల్లోనూ మిత్రులు చాలా మంది తమ అనుభవాలనీ, అభిప్రాయాలనూ పంచుకున్నారు. ముందుగా వారందరికీ ధన్యవాదాలు.

చాలా మంది చెప్పింది, ఇన్సెన్టివ్ ముందు ఇంట్లో నించి, కుటుంబం నించి రావాలి. రెండోది, ముఖ్యంగా భాష నేర్చుకోవడానికి ఇక్కడి వారికి సంబంధం ఉండే స్టడీ మెటీరియల్ ఉండాలి. తెలుగు భాష ఒక బోధనా ప్రక్రియగా నిలదొక్కుకో లేక పోవడానికి ఈ రెండూ కొరవడడం ముఖ్య కారణాలని వ్యాఖ్యానించిన మిత్రులు భావిస్తున్నట్టు నాకు అర్ధమైంది.

ఆ అభిప్రాయాలతో అంగీకరిస్తూనే, ఈ విషయమై నాకున్న మరి కొన్ని అభిప్రాయాలని మీ ముందుంచడానికి ఈ రెండవ భాగం రాస్తున్నాను.

మన ముందున్న ప్రశ్న అమెరికాలో తెలుగు బోధన, తెలుగు సంతతి వారు కానీ, ఇతరులు కానీ తెలుగు భాష నేర్చుకోవడానికి వారికున్న మోటివేషన్, ఇన్సెంటివ్ ఏమిటి? వాటిని ఎలా అభివృద్ధి చెయ్యగలం?

భాష విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడదాం. ఏ పరిజ్ఞానాన్ని అయినా ఒకరు నేర్చుకోవాలి అని నిర్ణయించుకుని దాని పట్ల కృషి చెయ్యడానికి కారణాలు ఏముంటాయి.

నాకు నేరుగా పరిచయం ఉన్న కొన్ని ఉదాహరణలు చెబుతాను.

1. మా నాన్నగారు నలభయ్యేళ్ళ వయసులో మొదలు పెట్టి హిందీ ప్రచార సభవారి క్లాసులలో నమోదు అయ్యి, అ-ఆలతో మొదలు పెట్టి సభవారి అత్యున్నత పరీక్ష ప్రవీణ దాకా ఉత్తీర్ణులయ్యారు. ఒక స్థాయి నించీ ఆయన హిందీలో అనర్గళంగా ఉపన్యసించేవారు కూడా. అప్పట్లో బెజవాడలో అనేక హిందీ భాషా సభలకి ఆయన్ని వక్తగా ఆహ్వానించేవారు.
ఆయన జన్మరీత్యా తమిళులు. యుక్తవయసుదాకా గడిపింది తమిళనాడులోనే. ఉద్యోగరీత్యా స్థిరపడింది బెజవాడలో. చుట్టూతా ఉన్నది తెలుగు భాష. వృత్తి వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా. హిందీ భాష నేర్చుకోవడం వల్లనూ, దానిలో ప్రావీణ్యం సంపాదించడం వల్లనూ ఆయనకి ఏమీ వృత్తిపరంగా లాభం కానీ, ధనార్జన కానీ లేదు. అప్పట్లోనో, తరవాతనో భారత కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకి హిందీ నేర్చుకోవడం వల్ల ఇంక్రిమెంట్ వంటి కొన్ని సదుపాయాలు పెట్టింది అని విన్నాను, నిజమో కాదో నాకు తెలియదు. ఈ ఉదాహరణలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మా నాన్న గారికి హిందీ పాండిత్యం వల్ల ఒనగూడిన ఆర్ధిక లాభం ఏమీ లేదు.

2. అమెరికాలోనే కాక అనేక ప్రపంచ దేశాలలో బడులలో, కాలేజీలలో వివిధ కళలకి సంబంధించిన శిక్షణ ఇస్తున్నారు. ఈ కళలని అభ్యసించే వారిలో బహు కొద్దిమంది మాత్రమే దానిని వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఇదికాక కోట్ల మంది ఏదో ఒక దశలో తమకు లభ్యంగా ఉన్న వనరులతో ఏదో ఒక కళని అభ్యసిస్తున్నారు. ఇలాంటిది నేను కూడా ఒక పధ్నాలుగేళ్ళు చేశాను లెండి. నాకు స్వానుభవమే.  వీరెవరికీ కూడా ఆ కళ వృత్తిలో కానీ ధనార్జనకి కానీ ఉపయోగ పడేది కాదు.
ఈ రెండు ఉదాహరణల ద్వారా నేను నొక్కి చెప్పాలనుకున్నది – భాషలు, కళలు నేర్చుకోవడంలో కేవల ధనార్జనకి మించిన ఫలితం ఏదో ఉంది. మెదడుకి మేత, మనసు ఉత్తేజితం అవడం, మనోభావాల వ్యక్తీకరణకి ఒక మార్గం – ఇవీ, ఇలాంటివీ ఎన్నో ఫలితాలు ఆ వ్యక్తికి లభించవచ్చు.
దీన్ని నేను మోటివేషన్ అంటాను. ఐతే చిన్న వయసులోనే ఇటువంటి మోటివేషన్ సహజంగా కలగడం కష్టం. అమెరికాలో ఎదుగుతున్న ఒక పదేళ్ళ పాప తెలుగు భాషనో (ఇంగ్లీషు కాని మరొక భాషనో), కర్నాటక సంగీతాన్నో (లేక మరొక కళారూపాన్నో) నేర్చుకోవాలి అంటే ఆమెకి కలిగే ప్రోత్సాహం బయటినించి రావాలి. దీన్ని నేను ఇన్సెన్టివ్ అంటున్నాను. ఈ ఇన్సెన్టివ్ గురించి ముందటి వ్యాసంలో కొంచెం ముచ్చటించుకున్నాము.
ఇన్సెన్టివ్ కలగడానికి – నేను చూసినంతలో, ప్రస్తుతం మన సమాజంలో అమలులో అందుబాటులో ఉన్న వనరుల దృష్ట్యా ఈ కింది రకాలుగా ఉంది.

1. బడిలో, కాలేజిలో నేర్చుకోవడం
2. విద్యార్ధి దశలో ఉండగానే బడి/కాలేజి పరిధికి బయట నేర్చుకోవడం
3. విద్యార్ధి దశ దాటిన తరువాత ఏదైనా విద్యాసంస్థ ద్వారా కాని, ఇతరంగా గానీ ఏదైనా నేర్చుకోవడం.

వీటిల్లో 1, 2 వనరుల దృష్ట్యా నేర్చుకునే వారికి, ముఖ్యంగా పిల్లలకి రెండు ప్రోత్సాహకాలు సమకూడుతాయి. తమ తోటి పిల్లలు కూడా ఇటువంటి కార్యక్రమాలలో ఉండడం ఒకటైతే, ఆ బోధించే వారు చాలా బాగా నేర్పిస్తారనే ఖ్యాతి ఉండడం ఇంకోటి.

ఐతే మూడు రకాల వనరులకీ కూడా ముఖ్యమైన మూలం ఇంకొకటి ఉంది. ఆ భాషనో కళనో నేర్పించే వనరు ఒకటి ముందు అక్కడ ఉండాలి. అది విద్యార్ధికి అందుబాటులో ఉండాలి.

అమెరికాలో విద్య ముఖ్యంగా ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఇటువంటి వనరుల ఏర్పాటు కూడా ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి, ప్రజల కోరిక మేరకు ఈ వనరుల ఏర్పాటు సమకూడుతూ వస్తోంది. ప్రాథమికంగా అన్ని బడులలో బోధించే సబ్జక్టు విషయాలకి అతీతంగా ఇంకే విషయం బోధించడానికి ఏర్పాటు చెయ్యాలన్నా కూడా ఇటువంటి ప్రజాప్రయత్నం తప్పనిసరి. పబ్లిక్ విశ్వవిద్యాలయాలలోనూ ఇదే పరిస్థితి.

వ్యాసం చివర, మాకు దగ్గరలో ఉన్న అతి పెద్ద విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో భాషా బోధనకి సంబంధించిన రెండు లింకులు ఇచ్చాను. ఇందులో భారతీయ భాషలని చెప్పుకో దగిన కొన్ని భాషల బోధనా వివరాలు ఉన్నాయి – ఒక్కొక్క భాషా ఎందుకు నేర్చుకోవాలి అని వారు రాసిన ప్రోద్బలాలు నాకు ఆసక్తిగా అనిపించాయి. మీరూ సమీక్షించ గలరు. అవన్నీ చదివాక నాకు బలంగా అనిపించింది ఏమిటి అంటే – ఈ భాషా బోధన ఏదో శూన్యంలోనించి పుట్టుకు రాలేదు. ఆయా భాషలకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు, సమూహాలు ఆయా కోర్సులు స్థాపించడానికి ఎంతో శ్రమ పడ్డారు. తెలుగు వారు కూడా దీని ప్రాముఖ్యతని గుర్తించి ఆ దిశగా కొంత కృషి చేశారు కానీ అది తగినంత బలం కూడ దీసుకోలేదు. అందుచేత అటు బడులలో కాని, ఇటు విశ్వవిద్యాలయాలలో కానీ తెలుగు బోధన స్థిర పడలేదు.

తెలుగుభాష అమెరికాలో పదికాలాలపాటు బోధించాలి, నేర్చుకోవాలి, అని ఆరాట పడేవారు ఇప్పటికైనా దీనిని గుర్తించి, దానికి అవసరమైన సాంఘిక బలము, సాంఘిక బలానికిమూలం అయిన రాజకీయ బలమూ సమకూర్చుకోవాలి. అమెరికా తెలుగు సమాజానికి ఇప్పటికే పుష్కలంగా ఉన్న ఆర్ధిక బలాన్ని కొంతైనా ఈ దిశగా వినియోగించాలి.
పి.యెస్. ఈ వ్యాసం రాయడం ముగించి పంపబోతూ ఉండగా ఫేస్బుక్ లో ఒక మంచి వార్త కనబడింది. కొడవళ్ళ హనుమంతరావు గారు, కొడవళ్ళ అనూరాధ గారు, వారికి సమీపంలో వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ – సియాటిల్ లొ తెలుగు కి ఒక “Endowed Chair” ఏర్పాటు చెయ్యడానికి యూనివర్సిటీ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారని. వారికి మనసారా నా అభినందనలు.
Language course offerings at University of Michigan
Website for South Asian Language Instruction at University of Michigan

ఎస్. నారాయణ స్వామి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Good intentions are not fruitful. How do we motivate the younger generation to learn their native language? Or at least get awareness of their culture? I have tried but I became a babysitter!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు