అమెరికా తొలి గుణపాఠాలు – నిరుద్యోగ పర్వం

వంగూరి జీవిత కాలమ్-64

చికాగో చలిలో, రోజూ ఒక బస్సూ, మెట్రో రైలులో డౌన్ టౌనూ, మరొక మెట్రో రైలులో అక్కడ నల్లవారి హింసాకాండలకీ, డ్రగ్స్ కీ ఇప్పటికీ అందరినీ భయపెట్టే సౌత్ సైడ్ అనబడే “ఘెటో” మధ్యలో ఉన్న ఇల్లినాయ్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి రోజూ వెళ్ళి, అమెరికాలో వచ్చే అన్ని పేపర్లలో ఉద్యోగాల ప్రకటనలు కత్తిరించుకుని వాటి తగినట్టుగా నా బయోడేటా కాస్త సవరించి, వారానికి పది, పదిహేను ఉద్యోగాలకి అలా దరఖాస్తులు పెట్టుకుంటూ ఉండగా నాకు జరిగిన ఒక అనుభవం….ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది.  ‘స్లమ్’ అంటే కేవలం అత్యంత బీద వారు ఉండే దీనాతిదీనమైన ప్రదేశం అనీ ‘ఘెట్టో’ అంటే దానికి  దౌర్జన్య వాతావరణంకూడా తోడు అయిన ప్రాంతం అనీ అర్ధం అవడానికి నాకు ఎన్నాళ్ళో పట్ట లేదు.  ఎందుకంటే నేను ‘ఘెట్టో’ లో నివసించే అవకాశం తర్వాత వచ్చింది.

ఇక ఒక రోజు చికాగో ఐఐటి లైబ్రరీ లో ఒక స్థానిక చికాగో పేపర్లో హైడ్రాలిక్ & న్యుమాటిక్స్ లో అనుభవం ఉన్న ఇంజనీర్ అర్జంటుగా కావలెను. పంపు, కంప్రెసర్, వాటికి సంబంధించిన కంట్రోల్ సిష్టమ్స్ డిజైన్ బాగా తెలిసి ఉండవలెను.  ఫీజు చెల్లించవలెను” అనే ప్రకటన చూశాను. అంతే.. ఈ ప్రకటనలో హైడ్రాలిక్స్ & న్యూమాటిక్స్ అనే మాటలు చూడగానే నా ప్రాణం లేచి వచ్చి,  ఆ సాంకేతిక విషయాలు నేను బొంబాయిలో పాఠాలు చెప్పిన వాడిని కాబట్టి,  ప్రకటనలో చికాగో ఫోన్ నెంబరే ఇచ్చారు కాబట్టి అక్కడే ఐఐటి లైబ్రరీలో ఫోన్ బూత్ లో ఏకంగా రెండు క్వార్టర్లు వేసి వెనువెంటనే ఆ ఆసామీకి ఫోన్ చేశాను. అయితే ఆ ఆసామీకి నేను ఎందుకు పిలిచానో అర్ధంఅయింది కానీ ఎక్కడో నాకే ఎక్కడో తేడా కనపడింది.  మొత్తానికి రెండు రోజుల తర్వాత అతనితో నా ఇంటర్ వ్యూ కి వాళ్ళ ఆఫీసుకి నేను వెళ్ళే ఏర్పాట్లు జరిగాయి. ఇహ చెప్పొద్దూ..అమెరికాలో ఒక ఉద్యోగానికి అదే నా మొదటి ఇంటర్ వ్యూ….అదీ అమెరికాలో అడుగుపెట్టిన నెలా, నెలన్నర లోగానే..మామూలుగా అయితే ఆపద మొక్కుల వాడికి మొక్కుకునే వాడినే కానీ, మనం ఆ బాపతు కాదు. ఆ పెద్దాయనకి ఆపన్నులు చాలా  మందే ఉన్నారు కదా మధ్యలో మనం ఆయన్ని ఎందుకూ ఇబ్బంది పెట్టడం అనుకున్నాను. పైగా ఎంచేతో ఆ ప్రసక్తి రాకపోయినా ఇదంతా నా జేబులో రహస్యంగా దాక్కున్న గ్రీన్ కార్డ్ మహిమే సుమా అని నేను ప్రగాఢంగా నమ్మాను.

అప్పటికే రెండు, మూడేళ్ళ నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న మా తమ్ముడికి నాకు అంత తొందరలోనే ఇంటర్ వ్యూ వచ్చింది అంటే చాలా సంతోషించాడు కానీ ఎందుకో నమ్మ లేదు. కానీ ఇంటర్ వ్యూ నాడు ఎప్పటిలా మామూలు చలి కాలం సూటూ, బూటూ కాకుండా మా తమ్ముడికి ఉన్న ఒకే ఒక్క త్రీ పీస్ సూట్ నేను వేసుకుని యధాప్రకారం బస్సూ, రైలూ ఎక్కి ఎక్కడో ఉన్న ఆ కంపెనీకి వెళ్ళాను. నేను మాట్లాడిన తెల్ల ఆసామీ నన్ను పలకరించి తన ఆఫీసు గదిలోకి తీసుకెళ్లి, నేను నా బ్రీఫ్ కేస్ లోంచి అప్పుడే ముద్రించిన ఫెళ ఫెళ లాడుతున్న నా బయో డేటా అడిగి తీసుకుని, దాన్ని పై నించి, కింద దాకా చదివి “బావుంది” అన్నాడు. ఇక అక్కడి నుంచీ మా ఇద్దరం మాట్లాడుతున్నది ఇంగ్లీషే అని తెలుస్తూనే ఉన్నా, మా మధ్య ఏదో భాషాదోషం సమస్య ఉంది సుమా అని అర్ధం అయింది.  ఉదాహరణకి నేను హైడ్రాలిక్ కాంపొనెంట్స్”  అంటే ఆ దొర ఆ మాట రెండు సార్లు చెప్పించుకుని “యస్, హైడ్రాలిక్ కంపోనెంట్స్” అని నేను సాగదీసిన చోట వాడు కుదించడం, అతను సాగదీసిన అక్షరాన్ని మనం పైకి వినపడకుండా కుదించెయ్యడం తో కాస్త కుస్తీ పడ్డాం. ఇక కంట్రోల్ వాల్వ్ అనే మాట ని వేల్వ్ అనాలా, ‘వా’ కీ ‘వే’ కీ మధ్యలో నా, అలాగే నేను “గేర్ పంప్” అంటే వాడు గియర్ పంప్ అనీ అటు బొంబాయి ఇటు చికాగో ఆంగ్ల భాషలలో  యుధ్దం చేసుకున్నాం. మామూలు రోజువారీ మాటలలో తేడాలు ఉన్నాయి అని తెలుసు కానీ సాంకేతిక పదజాలం లో కూడా అంత ఎక్కువగా ఉచ్చారణ భేదలూ, బాధలూ ఉన్నాయి అని అంత వరకూ నాకు తెలియనే లేదు. అలా అని ఆ మానవుడు నన్ను పెద్ద టెక్నికల్  ఇంట్రర్ వ్యూ చెయ్యనే లేదు. వేరే కాగితం మీద ఉన్న ఇందాకటి టెక్నికల్ మాటలు నా బయో డేటాలో ఉన్నాయా లేదా అని చూస్తున్నట్టు నాకు అనుమానం వచ్చింది. నేను ధైర్యం చేసి “ఇంతకీ కంపెనీ ఎక్కడా?” ..అంటే మీ మాన్యుఫేక్చరింగ్ ఫేక్టరీ ఎక్కడ ఉందీ?” అనే ఉద్దేశ్యంతో అడిగాను. దానికి ఆ దొర తల పైకెత్తి “ఇంకా తెలీదు. వుయ్ హేవ్ అ కపుల్ ఆఫ్ క్లయంట్స్ హు మే బి ఇంటరెస్టెడ్” అనగానే నాకు అతను అన్నది ఒక్క అక్షరం కూడా అర్ధం అవలేదు. “మా ఫీజ్ స్ట్రక్చర్ తెలుసా….ముందు రెండు వేల డాలర్లు డిపాజిట్ కట్టాలి. ఆ తర్వాత నీ రెండు నెలల జీతంలో మొదటిది నువ్వు ఉద్యోగం లో చేరే ముందు మాకు ఇవ్వాలి. నువ్వు ఆరు నెలలు ఉద్యోగం చేశాక అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మాకు రెండో నెల జీతానికి సమానం గా మాకు ఫీజు ఇస్తారు”. అని ఆ సూటూ బూటూ దొర చెప్పి నాలుగు కాగితాలు నా చేతిలో పెట్టగానే అప్పుడు గానీ నాకు వెలగ లేదు. ఇది ఒక ఎంప్లాయ్ మెంట్ ఏజెన్సీ. అతను నా చేతిలో పెట్టినవి థామస్ ఇంజనీరింగ్ స్టాఫింగ్ కంపెనీ వారి కాంట్రాక్ట్ కాగితాలు.  అది వినగానే, ఆ కాగితాలు చూడగానే నా త్రీ పీస్ సూట్ చెమటతో తడిసిపోయింది. అప్పటికప్పుడు రెండు వేల డాలర్లు కట్టకపోతే ఏమవుతుందో అని భయంతో వణికి పోయాను.

ఇండియాలో ఉన్నప్పుడు కేవలం ప్రభుత్వం వారి ఎంప్లోయ్ మెంట్ బ్యూరో గురించి విన్నాను కానీ బాగా చదువుకున్న ఇంజనీరింగ్ ఉద్యోగాలకి కూడా ప్రైవేట్ ఏజెన్సీలు ఉంటాయి అని నాకు తెలీదు. అమెరికాలో అడుగుపెట్టిన మొదటి, నెలా రెండు నెలలలో వాటి గురించి విన్నాను కానీ ఈ తొలి అనుభవం నాకు చాలానే నేర్పింది. ఆ ప్రకటన లోనే ఉన్న “ఫీజు చెల్లించ వలెను” అని చిన్న చిన్న అక్ష్రరాలలో ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా చదవాలి అనేది తొలి పాఠం. సాంకేతిక పదాల ఉచ్చారణ కూడా అమెరికాలో ఎంతో భిన్నంగా ఉంటుంది కాబట్టి ఆ ధోరణిని ఒడిసి పట్టుకోవాలి సుమా అనేది రెండో పాఠం. ఈ రెండు పాఠాలకీ మరొక అనుభవం కూడా తోడయి, మూడో పాఠం నేర్పింది. అది కూడా ఉద్యోగ ప్రయత్నాలలోనే..ఆ రోజుల్లోనే.

అప్పటికే నాలుగేళ్ళ నించి అమెరికాలొ ఉన్న మా తమ్ముడు దేశంలో అన్ని చోట్లా తనకి తెలిసిన స్నేహితులందరికీ ..ముఖ్యంగా ఇంజనీరింగ్ కంపెనీలలో పని చేసే వారికి ఫోన్ చేసి నా గురించి చెప్పడం నా ఉద్యోగ ప్రయత్నాలలో మరొక ప్రధాన అంశం. మూర్తి గారు అనే అలాంటి మిత్రుడు ఒకాయన న్యూ జెర్శీ లో ఇబాస్కో ఇంజనీరింగ్ కన్ సల్టింగ్ కంపెనీలో పని చేసున్నారు. ఆయనకి నా బయో డేటా పంపించడం, ఆయన వాళ్ళ కంపెనీలో ఎవరికో ఇవ్వడం, అక్కడ ఇన్ స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ మేనేజర్ కి నచ్చడం, అంచేత ఆ కంపెనీ వారి పెర్సనెల్ డిపార్ట్ మెంట్ నుంచి ఒక ఉత్తరం రావడం అంతా నెలలోగానే జరిగిపోయింది….ఇదంతా 1975, ఫిబ్రవరి రెండో వారం అని గుర్తు.

ఆ రోజుల్లో ఈ నాటి “హ్యూమన్ రిసోర్సెస్” అనే మాట లేదు. అన్ని కంపెనీలలోనూ ఉద్యోగాల ఇంటర్ వ్యూల ఏర్పాటు, ఉన్న ఉద్యోగుల బాగోగులు, జీత భత్యాలూ అన్నీ చూసుకునే విభాగాన్ని పెర్సనెల్ & ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అనే వారు. అసలు ఆంగ్ల భాష లో ఈ మాటని పెర్సనల్ అనాలా, పెర్సానెల్ అనాలా, పెర్సోనెల్ అనాలా నాకు తెలియక తిక మక పడేవాడిని. ఇబాస్కో కన్ సల్టెంట్స్ నుంచి “నీ బయోడేటా అందింది. మాకు మీతో మాట్లాడాలి అని ఆసక్తి ఉంది. త్వరలోనే పిలుస్తాం. ఈ లోగా మీకు ఏదైనా సమాచారం కావాలంటే ఈ క్రింది వారిని సంప్రదించండి” అని ఆ ఒక పేజీ ఉత్తరం సారాంశం. ఇహ నా ఆనందానికి హద్దులు లేవు. క్షణం ఆగకుండా ఆ క్రింద ఉన్న అమ్మాయికి ఫోన్ చేశాను. చెప్పొద్దూ, నేను ఎవరో గుర్తు పట్టడానికీ, అసలు ఎందుకు పిలుస్తున్నానో తనకి తెలియడానికీ ఆ అమెరికన్ అమ్మాయి ఒకటికి నాలుగు సార్లు అడిగించుకుని మొత్తానికి ఆవిడే నాకు వ్రాసిన ఉత్తరం చదివి వినిపించాక నన్ను గుర్తు పట్టింది. ఇక ఈ అమెరికన్ పదజాలంలో ఆ అమ్మాయి నాకు నిజంగా చెప్పిన దానికీ, మన ఇండియా పదజాలం లో అది నాకు అర్ధం అయిందానికీ ఎక్కడా పొంతన లేదు అని ఒక వారం తర్వాత కానీ నాకు అర్ధం అవలేదు. జరిగినది ఏమిటీ అంటే….”ఒరేయ్, ఆ మూర్తి గారి ద్వారా నాకు న్యూజెర్శే ఎబాస్కో లో ఇంటర్ వ్యూ వచ్చింది రా” అని నేను మా తమ్ముడికి చెప్పడం, వాడు ఆదరాబాదరాగా నాకు విమానం టికెట్టు కొనేయడం,  నేను ఝాం అని  అక్కడికి వెళ్ళిపోవడం, మూర్తి గారు నన్ను విమానాశ్రయం నించి జెర్శీ విలేజ్ లో వాళ్ళింటికి తీసుకెళ్ళి “ఇంత తొందరగా మీకు మా కంపేనీ లో ఇంటర్ వ్యూ రావడం భలే ఆశ్చర్యంగా ఉంది సుమా” అని ముక్కున వేలు వేసుకోడం వారం రోజుల్లో జరిగిపోయాయి.

ఇక  నేను సూటూ, బూటూ వేసుకుని టింగు రంగా అంటూ మూర్తి గారితో ఆ కంపెనీకి వెళ్ళిపోయాను.  మూర్తి గారు నన్ను వాళ్ళ ‘పెర్సానేల్’ ఆఫీస్ కి తీసుకెళ్ళి  ఇంటర్ వ్యూలు అన్నీ అయ్యాక ఇక్కడే ఉండమని చెప్పి  అదే భవనంలో మరొక అంతస్తులో తన ఉద్యోగానికి వెళ్లి పోయారు. ఇక డ్రామా మొదలు.  “నేను సూజన్ ని కలవాలి “ అని అక్కడ ముందు బల్ల దగ్గర కూచున్న అమ్మాయిని అడగగానే “ఉంది, ఇవాళ నన్ను రమ్మంది” అని నేనూ, “ఏ టైమ్ కి?” అని ఆ పిల్లా, “టైమ్ చెప్ప లేదు” అని నేను సమాధానం చెప్పగానే ఆ పిల్ల   “రియల్లీ”  అని ఆ అమ్మాయి హాచ్చెర్య పోయి  “లెట్ మి చెక్” అని ఆ నాటి ఇంటర్ కామ్ లో మాట్లాడి “అక్కడ కూచుని వైట్ చెయ్యి” అని సోఫా చూపించింది. అంతే కాదు. “కాఫీ కావాలా ?” అని కూడా అడిగింది. అప్పటికే అమెరికాలో కాఫీ అంటే కషాయం అని తెలిసిపోయింది కాబట్టి “వద్దు బాబోయ్” అని మర్యాదగానే చెప్పాను.  ఒక అరగంట తర్వాత ఒకానొక భారీ నల్ల యువతి….ఈనాటి పరిభాషలో ఒక ఆఫ్రికన్ అమెరికన్ అనమాట….ఆవిడ వచ్చి  ”నేను సూజన్ ని.”  పరిచయం  చేసుకుంది. ఇక్కడ నేను మొహం తెల్ల వేశాను. ఎందుకూ అంటే నేను ఫోన్ లో మాట్లాడిన సూజన్ సహజంగానే అమెరికా అనగానే తెల్ల అమ్మాయి అనే అప్పుడే ఇండియా నుంచి వచ్చిన  నా భారతీయ భావన. పైగా నేను అనుకున్నట్టుగా ఆ అమ్మాయి పాతికేళ్ళ యువతికి బదులు యాభై ఏళ్ల పైబడిన పెద్దావిడ గానూ, అంతకంటే పరమాశ్చర్యంగా నేను ఊహించుకున్న  ఆ తెల్ల సూజన్ ఇలా నల్ల సూజన్ గా మారిపోవడం అప్పుడు నాకు ఊహకి అందని విషయం.  ఇక నేను ఎవరో ఎందుకు వచ్చానో ఆ పెద్దావిడకి చెప్పగానే ఆవిడ తెల్లబోయింది. “అసలు నిన్ను ఇక్కడికి ఇవాళ రమ్మని ఎవరు చెప్పారూ?” అని నిలదీశింది. “మనం ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు నువ్వే కదా నన్ను ఇంటర్ వ్యూ కి రాగలవా అని అడిగావు. వారం రోజుల్లో వస్తాను అని చెప్పాను కదా” అని నేను అసలు జరుగుతున్నదేమిటో అర్ధం కాక నేనూ తెల్లబోయాను. ఇంతకీ జరిగినది ఏమిటంటే మా ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ భాషాదోషం వలన నన్ను ఇంటర్ వ్యూకి పిలిచేశారు కదా అని వీర లెవెల్ లో అని నేను అపార్ధం చేసేసుకుని విమానం ఎక్కి వెళ్ళిపోయాన మాట. అప్పటి నా అమాయకత్వం, ఉద్యోగం కోసం ఆరాటం, ఇక్కడి పకడ్బందీ పధ్దతుల మీద అవగాహనా లోపం…అన్నీ ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది. అన్నీ కరతలామలకంగా అందుబాటులో ఉన్న ఈ నాటి యువతీయువకుల అదృష్టానికి ఆనందం వేస్తుంది. కొంచెం అసూయగానూ ఉంటుంది.

ఆ రోజు పాపం ఆ పెద్దావిడ నా  తొందరపాటుని అర్ధం చేసుకుని, అప్పటికప్పుడు ఆ ఇన్ స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ విభాగం లో అందుబాటులో ఉన్న ఒకరిద్దరి చేత ఇంటర్ వ్యూ చేయించింది కానీ నేను చేసిన ఘోరమైన తప్పిదం నాకు తెలిసిపోయింది. నా తొందర పాటు వలన ఆ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు అనీ అర్ధం అయింది. ఈ తతంగం అంతా అయ్యాక పాపం మూర్తి గారు నన్ను ఇంటికి తీసుకెళ్ళి ఓదార్చారు. ఇక్కడ కొస మెరుపు ..నిజానికి మెరుపు కాదు….నా బుధ్ది మాందవ్యం….ఆఖర్న ఆ సూజన్ అనే పెద్దావిడని “నా విమానం టిక్కెట్టు డబ్బు ఇస్తారా?” అని అడగగానే ఆవిడ నవ్వింది ముసి, ముసి నవ్వులే కానీ “ఓరి వెర్రి వెధవా” అని వికటాట్తహాసం చేసి “అయామ్ సారీ” అని క్షమాపణలు చెప్పింది. పధ్ధతి ప్రకారం అయితే నా ప్రయాణం ఖర్చులు వాళ్ళే పెట్టుకునే వారుట..కానీ మనం సొంత పైత్యంతో వచ్చాం కాబట్టి తన అసహాయతని నాకు వివరించింది. పద్దతులు పాటించడంలో అమెరిక కార్పొరేట్ సంస్కారంలో ఇది నా మొదటి గుణ పాఠమే కానీ “ఎగ్గొట్టడానికి ఏదో డబ్బు ఎగ్గొట్టడానికి కథలు చెప్పింది “అనే అప్పుడు నేను అనుకున్నాను. కానీ  నా అభిప్రాయం చాలా సంకుచితమైనది అని  మరి కొద్ది రోజుల్లోనే జరిగిన మరొక అనుభవం నా కళ్ళు తెరిపించింది. మనం  ఈ మొత్త్తం సన్నివేశం మన పవిత్ర భారత దేశంలో ..అంటే నేను చెప్పా పెట్టకుండా ఏదైనా కంపెనీకి ఇంటర్ వ్యూ కి వెళ్తే ఏం జరిగి ఉండేదీ ఏం జరిగి ఉండేదీ అని ఊహించుకుంటేనే అదోలా ఉంది.

ఈ రెండు ఉదంతాలూ జరిగినది ఒకే ఒక నెలలో…అదీ నేను అమెరికాలో అడుగుపెట్టిన  మొదటి నెలలో..ఇక తర్వాత నెల విశేషాలు….తర్వాత నెలలోనే…

*

వంగూరి చిట్టెన్ రాజు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఒకప్పుడు దేశంలో డెహ్రాడూన్ ఇంటర్వ్యూకి పిలిచారు; అవును గవర్నమెంట్ వారే – డబ్బులు ఇస్తాం అని. అది కూడా రాత పరీక్ష పాస్ అయ్యాకండి. తీరా వెళ్తే చెప్పిన విషయం. రైల్ ఛార్జీలు ఇస్తారు కానీ బెర్త్ రిజర్వేషన్ డబ్బులు ఇవ్వరుట. అంటే పాసెంజర్ ఛార్జీ సబ్బులు పెట్టి కడిగి నూట పదిహేను రూపాయలు లెక్కపెట్టి ఇచ్చారు. ఖర్చుపెట్టినది దానికన్నా చాలా ఎక్కువే. ఇప్పుడైతే ఇటువంటివేమీ లేవు. మీ టికెట్ మీ మైల్ బాక్సులోకి వచ్చి పడుతుంది. అది వెబ్ సైట్ మీద సరిచూసుకుని జామ్మంటూ ఎగిరిపోవడమే. రెండేళ్ళ క్రితం వెళ్ళిన ఒక కాన్ఫరెన్స్ వారు టాక్సీ వాడికి ఇచ్చే టిప్ కూడా ఇచ్చారు – ఇది ఇంతా అని కాయితం మీద రాసి ఓ సంతకం పరేస్తే చాలుట. ఇప్పటికీ ఈ ఏజెన్సీలు ఉన్నాయి. మాన్ పవర్ అనీ, లేబర్ అంటూ రకరకాల పేర్లు.

    • భారత దేశం పురోగతికి మీరు చెప్పినది ఒక ఉదంతం. అయితే నేను అమెరికా వచ్చాక వ్యాపార నిమిత్తం డెహ్రాడూన్ కి ఇద్దరు అమెరికా దొరలతో వెళ్ళిన అనుభవం గుర్తుకి వచ్చింది. త్వరలోనే ఆ వివరాలు రాస్తాను, మిత్రమా. మీ స్పందనకి ధన్యవాదాలు.

  • చివరాకరన..టికెట్ డబ్బులడగటం ఉంది చూసారు.
    😆😂🤣..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు