ఈ వీకెండ్ అమెరికా తెలుగు రచయితల సదస్సు

1960, 70 దశకాల మా మొదటి తరం తెలుగు సాహిత్యాభిమానుల అలనాటి మేటి కలలు ఈ నాటికి సాకారం అవుతున్నాయి అనడానికి నిదర్శనంగా, అమెరికా తెలుగు సాహితీ ప్రప్రంచం సాధించిన పరిణణితికి తార్కాణంగా అక్టోబర్ 4-5-6 తేదీలలో కేలిఫోర్నియా రాష్ట్ఱం, మిల్పిటస్ నగరం (బే ఏరియా ప్రాంతం) లో ఒక వినూత్నమైన సాహిత్య సమావేశం జరగడం చాలా హర్షణీయం. “అమెరికీయత” అనదగిన ఈనాటి తరం భావజాలానికి అద్దం పట్టే ఈ సమావేశానికి కూడా సదస్సు అనే మాట నిర్వాహకులు వాడినా, ఇది వరలో జరిగిన సదస్సుల మాదిరిగా మైకులు, ప్రసంగాలతో ఊదరగొట్టడాలు ఉండవు సరి కదా కేవలం అమెరికా రచయితలకి మాత్రమే పరిమితం అయిన ఈ సమావేశం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పధ్దతిలో ఉంటుంది. రచయితలు కాని మామూలు శ్రోతలు ఉండరు. ఒకరిద్దరు పెద్దలు చర్చా వేదిక బాధ్యతలు స్వీకరించినా, సుమారు 40 మంది విచ్చేస్తున్న అమెరికా రచయితలు అనేక సాహిత్య పరమైన విషయాల మీద, సమస్యల మీద ఏకంగా రెండు రోజుల చర్చల అనంతరం, మూడో రోజు మానసిక ఉల్లాసం కోసం విహార యాత్ర వాతావరణం లో ఆరు బయట ఆనందిస్తారు.

అమెరికా తెలుగు సాహిత్య ప్రపంచం భారత దేశం ఎల్లలు దాటి, అసలు అటు వేపు చూసే అవసరం లేకుండా తన కాళ్ళ మీద తనే నిలబడే స్థాయికి వచ్చింది అని ఈ సమావేశాన్ని అర్ధం చేసుకోవచ్చును. అమెరికాలో అనేక నగరాలలో స్థానిక సాహిత్యాభిమానుల “నెల నెలా తెలుగు వెన్నెల (హ్యూస్టన్, డాలస్), వీక్షణం (కేలిఫోర్నియా), సరదాగా సాయంత్రం (ఓర్లాండో), డిట్రాయిట్ లిటరరీ క్లబ్ లాంటి కార్యక్రమాలు, జాతీయ సంఘాల భారీ ఉత్సవాలలో సాహిత్య వేదికలు, రచయితలకీ, సాహిత్య ప్రసంగాలకి పెద్ద పీట వేస్తూ ప్రతీ రెండేళ్ళకీ జరుగుతున్న జాతీయ స్థాయి అమెరికా సాహితీ సదస్సులు, మొదలైనవి అమెరికాలో సాహిత్య వికాసానికి ఉదాహరణలు. ఈ పరంపరలో నవంబర్ 2-3, 2019 తేదీలలో ఓర్లాండో లో జరుగుతున్న 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న అమెరికా రచయితల సదస్సు మా సాహిత్య ప్రస్థానం లో మరొక మైలు రాయి అవుతుంది అని ఆశిస్తున్నాను.

కాస్త అతిశయం అనిపించినా ఈ నాడు తెలుగు నాట సాహితీ వికాసం కోసం ఆధునిక రచయితలు ఇప్పటికే అమెరికా వేపు చూడ్డం మొదలు పెట్టారేమో అని కూడా అనుమానం కలుగుతోంది. దానికి నిదర్శనం అమెరికా నుండి వెలువడుతున్న అంతర్జాల పత్రికలలోనే (ఈమాట, కౌముది, సారంగ, మధురవాణి వగైరా) ఇండియా కథకులకీ, కవులకీ ఎక్కువ చోటు దొరుకుతోంది అనడం అతిశయోక్తి కాదు. దీనికి ప్రధాన కారణం భారత దేశం లో వెలువడే అంతర్జాల పత్రికలు చాలా మటుకు ఏదో ఒక భావజాల పరిధిలోనే ఇమిడి పోవడం అనే చెప్పుకోవాలి. కేలిఫోర్నియాలో జరిగే రచయితల సదస్సు దిగ్విజయంగా జరగాలని కోరుకూంటూ, నిర్వాహకుకి నా అభినందనలు.

వంగూరి చిట్టెన్ రాజు

పాశ్చాత్యదేశాలకి శాశ్వతంగా వలసకొచ్చిన తెలుగు వారి జీవనసరణి వేరుగా ఉంటుందని చెప్పటం పునరుక్తి దోషం. మనకి రాయటం అనే వ్యాసంగం సరదాగా ఊసుపోక రాయటం కోసం కాదు; రాయవలసిన అవసరం ఉండబట్టే మనం ‘రచయితల’ మయ్యాం. మన రచనలకి ఒక ప్రత్యేకత ఉంది,’ అని నేను సుమారు ఇరవై సంవత్సరాలకింద అన్నప్పుడు, మనం వేరుగా కలవాల్సిన అవసరం ఉన్నదిసుమా అని అన్నప్పుడు, నవ్వినవారు లేకపోలేదు. అయినా, ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు,’ అని అవకాశం దొరికినప్పుడల్లా ఘోషపెడుతూనే ఉన్నాను.  ఇప్పుడు అమెరికాలో తెలుగు రచయితలు ఒకచోటకలిసి తమ సాహిత్యం గురించి ముచ్చటించుకుంటారన్న వార్త ఎంతో ఆనందదాయకం.

అయితే మనం ఒకవిషయం మరిచిపోకూడదు. సరికొత్త సాహిత్యప్రయోగాలు చేస్తున్న వాళ్ళు తెలుగునాట ఉన్నారు. వారిదీ ప్రత్యేకత ఉన్న సాహితీ వ్యాసంగమే! వాళ్ళతో మనం జట్టుగట్టితే తెలుగు సాహిత్యంలో కొత్తవెలుగులు మిగితా సాహిత్య ప్రపంచానికి చూపించటం తేలికవుతుంది.

మనకి తెలుగునాట ప్రబలంగా పాతుకొపోయిన  సాహితీరాజకీయాలతో పనిలేదు. ప్రాచీన తెలుగు సాహిత్యం, ఆథునిక తెలుగు సాహిత్యం పాశ్చాత్యభాషలలోకి, ముఖ్యంగా ఇంగ్లీషులోకి అనువదించుకోగలిగితే తెలుగు సాహిత్యం ప్రపంచసాహిత్యానికి ఏమాత్రం తీసిపోదు, అని మనం నిరూపించగలం.  మనకి వనరులున్నాయి. మనకి స్థోమతకూడాఉంది. వాటినిసద్వినియోగపరుచుకోవటానికి ఈ సదస్సు నాంది కావలని నాకోరిక.

మనకు దేశవ్యాప్తంగా అరడజను  ‘సాంస్కృతిక’ సంస్థలున్నాయి. ఆ సంస్థలు ‘బయస్కోపు సంస్కృతి’ కి అగ్రతాంబూలం ఇస్తూ వస్తున్నాయి.  ఈ సదస్సులో జరగబోయే చర్చలు, తెలుగు సాహిత్యవిశిష్టతకి కనీసం ఒక చిన్నపీట వెయ్యటానికి ఆసంస్థలకి సహకరిస్తాయని ఆశిద్దాం.

-వేలూరి వేంకటేశ్వర రావు 

 

మా మొదటి తరం అమెరికా (1960-70) తెలుగు సాహిత్యాభిమానుల అలనాటి మేటి కలలు ఈ నాటికి సాకారం అవుతున్నాయి అనడానికి నిదర్శనంగా, అమెరికా తెలుగు సాహితీ ప్రప్రంచం సాధించిన పరిణణితికి తార్కాణంగా అక్టోబర్ 4-5 తేదీలలో కేలిఫోర్నియా రాష్ట్ఱం, మిల్పిటస్ నగరం లో ఒక వినూత్నమైన సాహిత్య సమావేశం జరగడం చాలా హర్షణీయం. “అమెరికీయత” అనదగిన ఈనాటి తరం భావజాలానికి అద్దం పట్టే ఈ సమావేశం  కేవలం అమెరికా రచయితలకి మాత్రమే పరిమితం. ఈ సమావేశం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పధ్దతిలో ఉంటుంది. రచయితలు కాని మామూలు శ్రోతలు ఉండరు. ఒకరిద్దరు పెద్దలు చర్చా వేదిక బాధ్యతలు స్వీకరించినా, సుమారు 40 మంది విచ్చేస్తున్న అమెరికా రచయితలు అనేక సాహిత్య పరమైన విషయాల మీద, సమస్యల మీద ఏకంగా రెండు రోజుల చర్చలతో ముగుస్తాయి.

అమెరికా తెలుగు సాహిత్య ప్రపంచం భారత దేశం ఎల్లలు దాటి తన కాళ్ళ మీద తనే నిలబడే స్థాయికి వచ్చిందన్న దానికి ఈ సమావేశం ఒక తార్కాణంగా చెప్పచ్చు.  ఇప్పుడు జరుగుతున్న అమెరికా రచయితల సదస్సు మా సాహిత్య ప్రస్థానం లో మరొక మైలు రాయి అవుతుంది అని ఆశిస్తున్నాను.
కాస్త అతిశయం అనిపించినా ఈ నాడు తెలుగు నాట సాహితీ వికాసం కోసం ఆధునిక రచయితలు ఇప్పటికే అమెరికా వేపు చూడ్డం మొదలు పెట్టారేమో అని కూడా అనుమానం కలుగుతోంది. దానికి నిదర్శనం అమెరికా నుండి వెలువడుతున్న అంతర్జాల పత్రికలలోనే (ఈమాట, కౌముది, సారంగ, మధురవాణి వగైరా) ఇండియా కథకులకీ, కవులకీ ఎక్కువ చోటు దొరుకుతోంది అనడం ఏమాత్రమూ అతిశయోక్తి కాదు.

-కిరణ్ ప్రభ

సభల్లో కేవలం రచయితలే వుండరు. చదువరులూ, కొంత ఆసక్తి వుండీ లేని వాళ్ళు రకరకాల సాహిత్య జీవులు వుంటారు. అట్లా కాకుండా, కేవలం రచయితలు ఒక చోట కూర్చొన్నప్పుడు సాహిత్య సృజన, విశ్లేషణకి సంబంధించిన సమస్యలు మాట్లాడుకునే వీలుంటుంది. అట్లా అమెరికాలోని తెలుగు రచయితలంతా కలుసుకొని మూడు రోజుల పాటు సాహిత్య విషయాలు చర్చించుకోవటం శుభ పరిణామం. అమెరికా తెలుగు సాహిత్యం ప్రధాన స్రవంతి తెలుగు సాహిత్యం లో ఒక బలమైన పాయ గా బలపడుతొందనటానికి ఇదొక సూచిక.ప్రముఖ సాహిత్య సాంస్కృతిక సంఘాల సదస్సుల్లో ఒక చిన్న భాగంగా జరిగే సాహిత్య సదస్సుల నుండి పూర్తి స్థాయి సదస్సు కి ఎదగటం డయాస్పోరా తెలుగు సాహిత్యపు ఎదుగుదలకు బలమైన కొండగుర్తు. తోటి మిత్రులు, రచయితలు సాహిత్యం గురించి యేమేం విషయాలు చర్చిస్తారా అని నా మటుకు నాకు ఆసక్తిగా వుంది.

-కల్పనా రెంటాల

అమెరికా తెలుగు రచయితల సమావేశం ట! దరిదాపు 50 మంది దాకా వస్తున్నారు ట. అంటే, చిన్న, చితక  కలుపుకుని అమెరికాలో ఉన్న 5 లక్షల తెలుగువారిలో ఓ 500 మంది తెలుగు రచయితలు  ఉంటారని నా అంచనా! ఈ  లెక్కని 8 కోట్ల తెలుగువారిలో తెలుగు బాగా వచ్చిన వారు నూరింట ఒకరు ఉన్నారనుకుంటే, ప్రపంచంలో 800 మంది తెలుగు రచయితలు ఉండాలి. అంటే తెలుగు రచయితల గరిమనాభి ఇప్పుడు అమెరికాలో ఉందన్నమాట!

నేను అమెరికా వచ్చిన కొత్తలో, అనగా 1961 లో, నాకు తెలిసినంతవరకు అమెరికాలో ఒకే ఒక తెలుగు రచయిత ఉండేవారు. ఆమె శ్రీమతి చెరుకూరి రమాదేవి. ఈమె ఇండియాలో ఉండగానే బాంధవ్యబంధితులు అనే నవల రాసి, 5000 రూపాయలు బహుమతి గెలుచుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు అమెరికాలో తెలుగు రచయితల సంఖ్య పెరుగుతూనే వచ్చి నేడు ఒక సమావేశం పెట్టుకునే స్థాయికి చేరుకున్నాము.

రచయితలతో పాటు ప్రచురణ మాధ్యమాలు కూడా అమెరికాలో పెరిగాయి. తెలుగు భాషా  పత్రిక అనే రాత పత్రికతో 1967 లో మొదలయి ఇప్పుడు జాల పత్రికలతో కలుపుకుని అరడజనుకి పైగానే అమెరికాలో ప్రచురణ అవుతున్న పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికలకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. దీనితో అమెరికా తెలుగు రచయితల ఉత్పత్తి బాగా పెరిగింది. ఒక్క రాసి లోనే కాదు, వాసిలో కూడ అమెరికా తెలుగు రచయితలు  గణనీయమైన గుర్తింపు సాధిస్తున్నారు. కానీ ఇది సరిపోదు. తెలుగు రచనలకి ప్రపంచ వేదిక మీద గుర్తింపు రావాలి. తెలుగు కంటే “చిన్న” భాష అయినా స్వీడిష్ లో రాసిన రచనకి నోబెల్ బహుమానం వచ్చినప్పుడు తెలుగు రచనకి ఎందుకు తగిన గుర్తింపు రాకూడదు?

ఈ సమావేశానికి వచ్చినవారంతా సరదాగా కబుర్లు చెప్పేసుకుని, కాఫీలు తాగేసి, తిరిగి వెళ్లిపోకుండా ఒక లక్ష్యం పెట్టుకుని దాని కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తెలుగు రచయితల గరిమనాభి ఇప్పుడు అమెరికాలో ఉందన్నమాట మరచిపోకండి!

— వేమూరి వేంకటేశ్వరరావు

 

రెండు విభిన్న సంస్కృతులూ, నమ్మకాల మధ్య ఊగిసలాడే డోలాయమాన స్థితే  వలసవచ్చిన వారి జీవితం. మాతృదేశం వదిలి వలస వచ్చిన వారి ఈ సంఘర్షణకి అంతర్లీనంగా సంస్కృతీ, అలవాట్లే ప్రధాన హేతువులు.  కొత్త దేశం, కొత్త సంస్కృతీ చూడగానే  ఆ దేశం గురించీ, అక్కడి జీవితం గురించీ తమవారికి చెప్పాలనిపిస్తుంది.
ఒకప్పుడు పాఠకులుగా ఉన్న వారు కొత్త రచయితలుగా మారడం అనేది దీనిలో అదనపు మార్పు. గత 25 ఏళ్ళగా అమెరికాలో తెలుగు వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అమెరికాలో దాదాపు 50మందికి పైగా రచయితలున్నారు. ఇక్కడున్న తెలుగు సంస్థల ద్వారానే  రెండేళ్ళ కోసారి ముగ్గురో నలుగురో కలుసుకునే వేదిక. అదీ కొంతమందికే పరిమితం.
సంస్థలనే సరికి కొన్ని పరిమితులూ, ఆశయాలూ ఉంటాయి. వాటిలో సాహిత్యం ఒక చిన్న అంశం. అలా కాకుండా రచయితలందరూ ఒకే చోట కలసి సాహిత్యం గురించి చర్చించుకున్న సంఘటనలు చాలా అరుదు. అదే ఈ తెలుగు రచయితల సదస్సుకి నాంది.  అందరూ కలిసి తెలుగు సాహిత్యం, ముఖ్యంగా డయాస్పోరా సాహిత్యానికి చెయ్యాల్సిన కృషి గురించి గొంతు కలుపుతాం.  అమెరికా నలుమూలల నుండీ నలభై మంది పైగా  రచయితలు పాల్గొనడం గొప్ప విశేషం.  ఈ సమావేశాలు తెలుగు సాహిత్యంలో కొత్త ఆలోచనలు రేకెస్తుందన్నదే మా అందరి ఆశా, ఆకాంక్షా! సిలికాన్ వ్యాలీలో మా చేతులా మీదుగా ఈ సదస్సు జరగడం మరింత ఆనందదాయకం.
-సాయి బ్రహ్మానందం గొర్తి 
అమెరికా రచయితలూ, కవులూ అడపా దడపా కలుస్తున్నా, వేదికలమీద ప్రసంగాల నడుమ ముచ్చట్లకే పరిమితమవుతున్నారు కానీ ఇక్కడి సాహిత్యంపై విస్తృతమైన, లోతైన చర్చలకు దూరంగానే ఉండిపోతున్నారు. చర్చావేదికలుగా సాగే ఈ రెండురోజుల సమావేశాలు ఆ లోటు తీరుస్తాయనే నమ్మకం. అమెరికా సాహిత్యపు తీరుతెన్నులను నిర్మొహమాటంగా విశ్లేషించుకోవడానికేగాక పంచుకునే అభిప్రాయాలూ, ఆలోచనలూ రాయడం పట్ల అందరికీ కొత్త ఉత్సాహం కలిగించడానికీ తోడ్పడతాయని ఆశ. ఎవరి లోకంలో వాళ్లుండే ఎక్కడెక్కడివాళ్లూ ఒకచోట చేరడం, మాట్లాడుకోవడం  ముందు ముందు సాహిత్యానికి సానుకూల వాతావరణం ఏర్పడడానికి దారి తీస్తాయి.
-కన్నెగంటి చంద్ర

ఈ వారాంతం శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణం. మరో తెలుగు సదస్సు. నిజానికి ఇది “మరో” తెలుగు “సదస్సు” అనడానికి లేదు. సాధారణంగా అమెరికాలో జరిగే తెలుగు సాహిత్య సదస్సులు ప్రసంగాలకు పరిమితం…అదీ పది నిమిషాలు మాత్రమే- వాటికి భిన్నంగా కలిసేది కొద్ది మందే అయినా కొంచెం లోనారసి మాట్లాడుకునే సందర్భం. అంటే, విషయాలను ఉపరితలస్పర్శిగా కాకుండా ఆలోచనాత్మకంగా, వీలైనంత విశ్లేషణాత్మకంగా షేర్ చేసుకునే రౌండ్ టేబుల్. ఇలాంటి ప్రయత్నాలు ఇంతకుముందు జరగలేదని కాదు. ఆలోచన ఎక్కడో ఆగిపోయిందన్న చింతనలోంచి మరో కొత్త మొదలు ఇది!

-అఫ్సర్

ఎడిటర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అమెరికా తెలుగు రచయితలు సమావేశం అవుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది.
    అంతేకాదు మీరంతా యేయే విషయాలు చర్చిస్తారా అని ఆసక్తిగా కూడా ఉంది. మీ అందరికి నా శుభాకాంక్షలు.

  • మీరందరూ కలసి కలబోసుకునే ఆలోచనల సమాహారం కోసం ఎదురుచూస్తూ ఉంటాం. శుభాకాంక్షలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు