అమెరికాలో నా మొదటి ఉద్యోగం -మూడవ రోజు

వంగూరి జీవిత కాలమ్-67

1975 ఫిబ్రవరి నెలాఖరున అమెరికాలో నా మొట్టమొదటి ఉద్యోగానికి చికాగో సమీపంలోని అరోరా నగరంలో ఒక కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళడం, నేను అస్సలు ఊహించని విధంగా వాళ్ళు నాకు ఉద్యోగం ఇవ్వడం, ఆ మర్నాడు మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళడం, ప్రతీ రోజూ మూడు గంటలు మా తమ్ముడు నన్ను తన కారులో తీసుకెళ్ళి దింపే అవకాశం లేదు కాబట్టి ఆ వారాంతంలో అరోరాలోనే ఒక ఎపార్ట్మెంట్ అద్దెకి తీసుకుందాం అనుకోడం ఇప్పటిదాకా జరిగిన కత. ఇక నా రెండో రోజు ఉద్యోగానికి కూడా పాపం మా తమ్ముడు హనుమంత రావే పొద్దున్న ఆరు గంటలకి ఆ చలిలో నన్ను అక్కడ పొలాల మధ్య ఉన్న మా ఆఫీసు అనబడే ఒకానొక చిన్న నాలుగైదు గదుల ఇల్లు మరియు వెనకాల రేకుల షెడ్డు దగ్గర దిగబెట్టి వెనక్కి బయలుదేరాడు. అలాంటి షెడ్డుని అమెరికాలో ‘బార్న్’ అంటారు. అదే మన ప్రాంతాలలో ‘తాటాకుల పాక” లాంటిది. అంటే గుర్రాలు, ఆవులు, గేదెలు, కోళ్ళు ..ఇలా అన్నింటినీ పెంచే పశువుల శాల. 1975 నాటి టూవెల్ కంపెనీ ఫోటో కాదు కానీ ఇంచుమించు అలాంటి ఫోటోలు రెండు ఇక్కడ జతపరిచాను. ఆఫీసు లాంటి ఆ భవనం మీద అరోరా స్టేబుల్స్ బదులు ఆ టూవెల్ కంపెనీ పేరు రాస్తే చాలు.

ఇక రెండో రోజు కూడా మొదటి రోజులాగానే ఏం చెయ్యాలో తోచ లేదు. టూవెల్ గారు. బ్రాండో గారూ ఆఫీసులో లేకపోవడంతో నేను ఒక్కడినే ఉన్నాను. వెనకాల షెడ్డులోకి వెళ్ళినా ఎవరి పనుల్లో ఉన్న వాళ్ళు నన్ను పట్టించుకో లేదు. అక్కడే ఉన్న కాఫీ మెషీన్ లో ఒక కప్పు కాఫీ కలుపుకుందాం అనుకుంటే అది మనకి ఇండియాలో అలవాటు లేని పని అయినా అమెరికా వచ్చి నెల దాటింది కాబట్టి మా తమ్ముడి ఇంట్లో ఉన్న యంత్రంలో లాగానే ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తే అది నానా కంగాళీ అయి అంతా కింద వొలికి పోయింది. ఆఫీసులో ఎవరూ లేరు కాబట్టి నేను చడీచప్పుడూ చెయ్యకుండా అంతా శుభ్రం చేసి “ఇంకా నయం, నా మొదటి రోజు నిర్వాకం టూవెల్ దొరగారికి తెలియ లేదు కాబట్టి సరిపోయింది. లేక పోతే ఉద్యోగం పీకేసును?” అని అనుకుంటూ ఉండగానే టూవెల్ దొర గారూ, బ్రాండో గారూ వచ్చారు. అప్పటికే పొద్దున్న పదకొండు గంటలు దాటింది. ఆయన వచ్చీ రాగానే నా ఆఫీసు గుమ్మం దగ్గరికి వచ్చి “నా ఆఫీసులోకి ఒక సారి రాగలవా?” అని అడగగానే నేను ఆయన వెనకాలే వెళ్ళాను. మర్యాదపూర్వకంగా ఆయన కూర్చోమని చెప్పగానే మొదటి రోజు కదా…ఆ రోజు నుంచీ చెయ్యవలసిన పనీపాటూ గురించి చెప్తారేమో అని నేను కుతూహలంగా చెవులు రిక్కించి వినడానికి సిధ్దంగా సద్దుకుని కూచున్నాను.

“రాయూ, క్రిందటి వారం మేము ఒక పెద్ద గవర్నమెంట్ కాంట్రాక్ట్ కి బిడ్ వేశాం. మరొక నాలుగు కంపెనీలు మనకి కాంపిటీషన్. గవర్నమెంట్ వాళ్ళు అన్నీ రివ్యూ చేసి మన బిడ్ బావనుండి కానీ మీ కంపెనీలో డిగ్రీ చదువుకున్న ఇంజనీర్ లేకపోవడం లోటుగా ఉంది. మీరు మరొక రెండు రోజుల్లో క్వాలిఫైడ్ ఇంజనీర్ ని ఎవరినైనా ఉద్యోగం లో చేర్చుకుంటే ఈ కాంట్రాక్ట్ మీకు వచ్చే అవకాశం ఉంది.” అని మాకు అవకాశం ఇచ్చారు. అని ఆగారు టూవెల్ గారు. నన్ను ‘రాయూ’ అని సంబోధించడం అదే మొదటి సారి వినడం. భలే కొత్తగా ఉంది.

“ఓ, అలాగా. దట్ ఈజ్ వెరీ నైస్” అని నేను గొణిగాను.

“వెంటనే మిమ్మల్ని  ఇంటర్వ్యూ కి పిలిచి, మీకు అన్ని అర్హతలూ ఉన్నాయి కాబట్టి మా కంపెనీలో చేర్చుకుని, మీ రెస్యూమే గవర్నమెంట్ కి పంపించాం.

“Thank you” అన్నాను. అవును కదా. అలా అనాలి కదా.

“బట్,  ఇప్పుడే నేనూ, బ్రాండో పొద్దున్న 8:00 గంటలకి ఫైనల్ బిడ్ ఓపెనింగ్ కి వెళ్ళాం. దురదృష్టవశాత్తూ ఆ కాంట్రాక్ట్ మనకి రాలేదు. అ యామ్ సారీ” అని టూవెల్ దొరగారు లేచి నుంచుని నాకు షేక్ హేండ్ ఇవ్వడానికి చెయ్యి చాపారు. నేనూ లేచి చెయ్యి చాపి షేక్ హేండ్ ఇచ్చి “అ యామ్ సారీ” అన్నాను మామూలుగానే. ఎందుకంటే మన బుర్రకి ఏమీ వెలగ లేదు.

“బ్రాండో విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఫార్మాలిటీస్” అని ఆయన అంటూ ఉండగానే బ్రాండో గారు వచ్చారు. వస్తూనే ‘గుడ్ మార్నింగ్.  లెట్ అజ్ గో టు మై ఆఫీస్” అని పక్కనే ఉన్న తన ఆఫీసు కేసి దారి తీశాడు. అప్పటికీ నాకు పూర్తిగా వెలగ లేదు కానీ ఏదో మిణుకు మిణుకు మనడం మొదలవుతూ ఉండగా బ్రాండో గారి ఆఫీసుకి వెళ్ళగానే ఆయనా ఎంతో మర్యాదగా “ప్లీజ్ సీట్ డౌన్” అని,  నేను కుర్చీలో అదోలా కూచోగానే “ఆయామ్ సారీ” అంటూ తన ఆఫీసు బల్ల డ్రాయర్ లోంచి ఓ కాగితం తీసి నాకు ఇచ్చి ‘ఆల్ ద బెస్ట్” అన్నాడు.

ఈ ‘ఆల్ ది బెస్ట్ ‘ ఎందుకో, అసలు గత కొద్ది నిమిషాలలో ఇద్దరు అమెరికా దొరలు నాకు అ యామ్ సారీ అంటూ అంత వినయంగా ఎందుకు క్షమాపణలు చెప్పుకున్నారో మాట ఎలా ఉన్నా, ఇప్పుడు బ్రాండో గారు నా చేతిలో పెట్టినది అది అక్షరాలా $451.92 డాలర్లకి నా పేరిట ఉన్న ఒక చెక్కు అని చూసి ఇంచుమించు మూర్ఛ పోయాను. ఆ చెక్కు లోనే “Severance Pay – 80 Hrs.”, $6/Hr., FICA: 5.85%, FIT: 0.00, Net Pay: $451.92 అనే వివరణా, అందులో ఆ సెవెరెన్స్ అనే మాటా కనపడగానే, మనల్ని ఉద్యోగం నుంచి తొలగించినట్టూ, అదే మన ‘ఆఖరి’ జీతం అనీ అప్పుడు మనకి పూర్తిగా వెలిగింది.  తమాషా ఏమిటంటే అది నా ‘ఆఖరి’ జీతం కాదు….అమెరికాలో నా మొట్టమొదటి జీతం, స్వార్జితం. అనుకోని విధంగా నా పేరిట సుమారు ఐదు వందల డాలర్ల చెక్కు చూడడమే నేను మూర్ఛపోడానికి అస్సలు కారణం. నేను తేరుకోగానే బ్రాండో గారు “యు కెన్ గో హోమ్” అనగానే నాకు నవ్వాలో, ఏడవాలో తెలియ లేదు. ఎందుకంటే నన్ను ఇక్కడ దిగబెట్టి మా తమ్ముడు ఇంకా తన ఆఫీస్ కి చేరుకున్నాడో లేదో అప్పుడే మళ్ళీ వెనక్కి ఎలా వస్తాడూ? ఈ సమస్య చెప్పగానే, తనకి కూడా అది తెలుసు కాబట్టి “నిన్ను చికాగో వెళ్ళే లోకల్ ట్రైన్ స్టేషన్ లో డ్రాప్ చేస్తాను” అన్నాడు బ్రాండో గారు. మొత్తానికి మా తమ్ముడిని ఎలాగో అలాగా తన అఫీస్ ఫోన్ లో పట్టుకుని ఆ లోకల్ ట్రైన్ వివరాలు చెప్పి తను మళ్ళీ మూడు గంటలు అరోరా దాకా రావక్కర లేకుండా కాస్త దగ్గరే ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర నన్ను పిక్ అప్ చేసుకునే ఏర్పాటు చేసుకుని నేను ఆ చెక్కు నా బ్రీఫ్ కేస్ లో పెట్టుకుని అరోరాకి వీడ్కోలు చెప్పాను. 1975 ఫిబ్రవరి/మార్చ్ లో ఆ మూడు రోజుల తర్వాత ఇప్పటి వరకూ గత ఐదు దశాబ్దాలలో నేను మళ్ళీ అరోరా వెళ్ళ లేదు. టూవెల్ దొరా, బ్రాండో దొరలని ఇలా అప్పుడప్పుడు “ఆప్యాయంగా” తల్చుకోవడమే కానీ మళ్ళీ కలుసుకో లేదు. కానీ, వాళ్ళు ఇప్పుడు కనపడినా బహుశా గుర్తు పట్టగలనేమో! ఏమో!

మొత్తానికి అమెరికాలో నా మొట్టమొదటి ఉద్యోగ పర్వం అంతా కలిపి కట్టే, కొట్టే, తెచ్చే లాగా మూడే మూడూ రోజుల్లో ఇంటర్వూ, ఒక రోజు ఉద్యోగం, మర్నాడు ఉద్వాసన జరిగిపోయాయి.  ఈ మాత్రం దానికి ఇంత విస్తృతంగా వ్రాయడానికి కేవలం ఆ మూడు రోజులలో అమెరికా గురించి నేను నా తొలి రోజుల్లో నేర్చుకున్న పాఠాలు, ఈ దేశం పధ్దతుల  మీద మౌలికమైన అవగాహన ప్రధాన కారణాలు. ఈ నాడు అమలాపురంలో ఉన్నా అమెరికా గురించి అందరికీ అన్నీ తెలుసునేమో కానీ సుమారు 50 ఏళ్ళ క్రితం నేను బొంబాయి లాంటి గొప్ప ఆధునిక నగరం నుంచి వచ్చినప్పటికీ అమెరికా గురించి ఏమీ తెలియని అమాయక ప్రాణినే!. ఆ రోజుల్లో అమెరికా వచ్చిన వారు అందరూ స్వీయ అనుభవాలతోనే ఈ దేశం పధ్ధతుల గురించి తెలుసుకునే అవకాశం ఉండేది.

నేను ఆ కంపెనీలో ఒక ఉద్యోగస్థుడిగా ఉన్నది ఒకే ఒక్క రోజు మాత్రమే అయినా వాళ్ళు నాకు రెండు వారాల జీతం లెక్క కట్టి ఎంతో మర్యాదగా చూడడం నాకు అమెరికా వ్యాపారస్థుల మౌలికమైన నిబద్ధతకి, న్యాయ సూత్రాల అమలుకి, అనామిక వ్యక్తుల పట్ల కూడా వాళ్ళు చూపించే మర్యాదకి ప్రతీకగా నాకు అర్ధం అయింది.  వాళ్ళు నాకు పైసా కూడా ఇవ్వకుండా “మాకు కాంట్రాక్ట్ రాలేదు కాబట్టి నిన్ను తీసేస్తున్నాం” అని చెప్పి పంపించేసినా నేను చేసేది ఏమీ లేదు కదా!.  కంపెనీకి పని చేసే ఒక ఉద్యోగి అవసరం, ఆ ఉద్యోగానికి కావలసీన అర్హతలు ఉంటే చాలు, ఎవరికైనా అమెరికాలో ఉద్యోగం వస్తుంది అనీ, అలాగే ఎప్పుడు ఆ ఉద్యోగి అవసరం లేకపోయినా,  వెనువెంటనే ఆ ఉద్యోగిని న్యాయబధ్దంగా తొలగించవచ్చును అని కూడా  ఈ అనుభవం నాకు ప్రత్యక్షంగా  నేర్పింది.

ఒకే ఒక్క రోజులోనే నా మొదటి ఉద్యోగం గోవిందా, గోవింద అయిపోయాక నిరుద్యోగ పర్వంలో తర్వాతి నెల ఎలా గడిచిందో….త్వరలోనే…

*

వంగూరి చిట్టెన్ రాజు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు