అమెరికాలో నా మొట్టమొదటి ఉద్యోగం – మొదటి రోజు  

అమెరికాలో నా మొట్టమొదటి ఉద్యోగం – మొదటి రోజు  

వంగూరి జీవిత కాలమ్-66

1975 ఫిబ్రవరి నెలాఖరున అమెరికాలో నా మొట్టమొదటి ఉద్యోగానికి చికాగో సమీపంలోని అరోరా నగరంలో ఒకానొక టూవెల్ పైప్ & సిస్టమ్స్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళడం, అది అవగానే  ఏకంగా గంటకి ఆరు డాలర్లు….అంటే నెలకి ఒకటా, రెండా… 70 వేల రూపాయల జీతంగా, ఆ ఉద్యోగం నాకు ఇచ్చినట్టు వారు చెప్పడం….ఆ రోజున .. సాయంత్రం మళ్ళీ మా తమ్ముడు పాపం పొలోమని గంటన్నర డ్రైవ్ చేసి నన్ను వెనక్కి ఇంటికి తీసుకెళ్ళడం జరిగాయి. ఇద్దరం ఎంత అలిసిపోయి ఉన్నామో అంతే హుషారుగా కూడా ఉన్నాం. నాకు ఏదో గాస్ స్టేషన్ లో అటెండర్ గానో, పెద్ద ఆఫీసులో తపాలా పనులు చూసే వాడిగానో చిన్నా, చితకా ఆషామాషీ ఉద్యోగం కాక నాకున్న మూడు ఇంజనీరింగ్ డిగ్రీలకి బాగా తక్కువే అయినా ఇంజనీర్ గా ఒక ప్రొఫెషనల్ స్థాయి ఉద్యోగం రావడం మా ఇద్దరికీ నమ్మశక్యంగా లేదు. నేనేమో, నెలకి వెయ్యి డాలర్లు జీతం గురించి ఆలోచిస్తూ, అందులో ఎంత ఆదా చేసి మా అమ్మకీ, బాబయ్య గారికీ పంపించగలనా అనే లెక్కలు వేసేసుకుంటున్నాను. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఆ రోజుల్లో అలా అమెరికా నించి ఇంటికి డబ్బు పంపించడం చాలా గర్వంగా ఉండేది. నాకైతే అసలు ఇండియాకి డాలర్లు ఎలా పంపించాలో అస్సలు తెలీదు. ఇక మా తమ్ముడు అయితే రాజా (అంటే నేనే…. మా కుటుంబంలో నన్ను రాజా అనీ, మా తమ్ముడిని ఆంజి అనీ పిలుస్తారు…ఇప్పటికీ. మా గురించి వినే గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ కీ, ఏఎన్నార్ కీ అవే పేర్లు పెట్టారు అని నేను చెప్పుకుంటూ ఉంటాను కానీ అది సరదా అబధ్దం.) రోజూ అరోరాకి అరవై మైళ్ళ దూరం ఎలా వెళ్ళగలడా అని బెంగ పెట్టుకుని అన్ని మార్గాలూ ఆలోచిస్తున్నాడు. ఆ మర్నాడు ఉద్యోగంలో మొదటి రోజు కాబట్టి తనే దిగబెట్టడానికీ, ఆ సాయంత్రం అక్కడే ఏదో హొటెల్ లో నేను ఒకటి, రెండు రోజులు ఉండడానికి కావలసిన బట్టలూ, అవీ సద్దుకుని వెళ్ళడానికీ, ఆ వారాంతంలో అరోరా నగరం లోనే ఆ పొలాల మధ్య ఆఫీసుకి దగ్గరగా ఒక ఎపార్ట్ మెంట్ వెతికి అద్దెకు తీసుకోడానికీ మా తమ్ముడు ప్రణాళిక వేశాడు.

ఆ మర్నాడు పొద్దున్నేఆరింటికల్లా బయలుదేరి అరోరాలో నన్ను దిగబెట్టి మా తమ్ముడు తన ఆఫీసుకు వెళ్ళిపోయాడు. అదే అమెరికాలో నా మొదటి ఉద్యోగంలో మొదటి రోజు. టూవెల్ గారు నాకు ఆప్యాయంగా స్వాగతం చెప్పి, ఒక ఆఫీసు గది కేటాయించి, వెనకాల షెడ్డులో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న అరడజను మంది మెకానిక్స్ కి “అవర్ న్యూ ఇంజనీర్” అని పరిచయం చేశారు. ఆ తర్వాత నాకు ఇంజనీరింగ్ పరికరాలు ఏమేమి కావాలో లిస్ట్ రాసి ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు. బ్రాండో గారు ఎక్కడా కనపడ లేదు. చెప్పొద్దూ, నాకు అస్సలు ఏం చెయ్యాలో, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక గిజ గిజ లాడిపోయాను. మొత్తానికి ఇంజనీరింగ్ డిజైన్ డ్రాయింగులు గియ్యడానికి కావలసిన టీ స్క్వేరూ, ట్రయాంగిల్స్, రూలర్,  కేలుక్యులేషన్స్ చెయ్యడానికి స్లైడ్ రూల్ లాంటి పేర్లు రాశాను కానీ అవన్నీ అక్కడే ఉన్నాయి. పంపుల డిజైన్ గురించి ఎప్పుడో క్లాసులో చదువుకున్న పుస్తకాల పేర్లు కొన్ని గుర్తుతెచ్చుకుని రాసుకున్నాను. వాటిల్లో నాకు ఇంకా గుర్తు ఉన్నది ఏ,జె. స్టెపనాఫ్ అనే రష్యన్ ప్రొఫెసర్ వ్రాసిన టెక్స్ట్ బుక్. అది అమెరికాలో దొరుకుతుందో లేదో తెలియదు. అసలు ఆ పుస్తకం ఇక్కడ పనికొస్తుందొ లేదో కూడా తెలీదు. నలభై ఏళ్ళ ఇంజనీరింగ్ డిజైన్ అనుభవం తర్వాత ఇప్పుడు ఆనాటి నా అజ్ఞానాన్నీ….అంటే సిధ్ధాంత గ్రంధాలు చదివి పరికరాలు డిజైన్ చేసేద్దాం అనుకున్న నా అమాయకత్వాన్ని తల్చుకుంటే ఎంత నవ్వొస్తుందో, అంత సిగ్గూ వేస్తోంది.

నేను ఆ రాతా, కోతా ‘నటిస్తుండగా’ బ్రాండో గారు వచ్చారు. అప్పటికి 11 గంటలు దాటడంతో ఆయన రాగానే టూవెల్ గారు “లంచ్” కి వెడదామా అని నన్ను కూడా లేవదీశారు. ఈ బ్రాండో గారు టూవెల్ గారి స్వయానా బావమరిది అనీ, యుధ్దంలో పని చేసి రిటైర్ అయిపోయి కాలక్షేపానికి టూవెల్ గారికి అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు అనీ అక్కడ తెలిసింది. మాటల సందర్భంలో “ఎక్కడా నీ కారు కనపడలేదు, ఎలా వచ్చావ్ ఆఫీస్ కి?” అని టూవెల్ గారు అడగ్గానే మా తమ్ముడి గురించీ, గంటన్నర డ్రైవ్ చెయ్యడం గురించీ చెప్పగానే ఆశ్చర్య పోయి, నాకు కారు లేదు అనీ, అమెరికాలో డ్రైవింగ్ రాదు అనీ తెలిసి ఇంకా ఎంతో ఆశ్చర్య పోయి అప్పటికప్పుడు దగ్గర్లో  ఏదైనా హొటెల్ చూపించమని బ్రాండో గారిని ఆదేశించారు టూవెల్ దొర గారు.

ఇక్కడ జరిగిన మరొక చిన్న విషయానికి నేను విపరీతంగా ఆశ్చెర్యపోయాను. ముగ్గురం ఎవరికి కావలసినది వారు లంచ్ ఆర్డర్ చేసి, అంతా అయిన తర్వాత ఆ బేరర్..అంటే లంచ్ తెచ్చి ఇచ్చిన సర్వర్ బిల్లు తీసుకురాగానే నేను చెయ్యి చాపాను… ఎప్పుడైనా నలుగురైదుగురు కలిసి రెస్టారెంట్ కి వెళ్తే అందరిదీ కలిపి ఒకటే బిల్లు ఇవ్వడమే కాక సాధారణంగా నేనే ఆ బిల్లు చెల్లించడం నా ఇండియా అలవాటు మరి. కానీ ఇక్కడ నేను చాపిన చేతిలో నా ఒక్కడి బిల్లూ పెట్టి, టూవెల్ గారి బిల్లు ఆయనకీ, బ్రాండో గారి బ్రాండో గారికీ ఎవరి బిల్లు వాళ్లకి ఇచ్చాడు ఆ సర్వర్. అది అమెరికా పధ్ధతి అని తెలియని నేను వాళ్ళిద్దరినీ అడిగి ఆ మొత్తం బిల్లు నేనే కట్టాలా. లేకపొతే టూవెల్ గారు నా బిల్ అడిగి మొత్తం బిల్లు ఆయనే కడతారా అనే సందిగ్ధంలో పడ్డాను. కానీ వాళ్ళిద్దరూ ఎంతో యాదాలాపంగా కౌంటర్ దగ్గరకి వెళ్ళి, స్వయానా బావామరుదులే అయినా ఎవరి బిల్లు వాళ్ళే కట్టగానే అప్పుడు నాకు కూడా వెలిగి, నేను కూడా నా బిల్లు చెల్లించాను….నగదు రూపేణా. ఎందుకంటే అప్పటికి మనకి క్రెడిట్ కార్డ్ అనే పదార్ధానికి అర్ధమూ తెలియదు, అర్హత అంతకంటే లేదు. అప్పుడు నేను ఏం తిన్నానో గుర్తు లేదు కానీ బిల్లు మటుకు పది డాలర్ల లోపే అయినా అప్పట్లో అదే చాలా ఎక్కువ మొత్తం.

ఇక మితభాషి అయిన బ్రాండో గారు “లెట్ అజ్ చెక్ ఔట్ ఎ ఫ్యూ హొటెల్స్” అని తన కారులో నన్ను అరోరా పట్టణం డౌన్ టౌన్ లో ఒక హొటెల్ దగ్గరకి తీసుకెళ్ళారు. అది చూడగానే భలే భయం వేసింది. ఎందుకంటే అది ఒక చిన్న ‘ఘెట్టో’ మొటెల్. చుట్టూ అంతా చెత్తా, చెదారంతో ఎంతో అపరిశుభ్రంగా ఉంది. బయట గుమ్మం దగ్గరే నలుగురు రోడ్డు మీద చలి దుప్పట్లు కప్పుకుని మిట్ట మధ్యాహ్నమే బీర్ తాగుతున్నారు. మేము కారు దిగగానే అంతా దుర్గంధమే! ఎలాగో అలా లోపల లాబీ లోకి వెళ్ళి అడగగానే సూటూ, బూటూ వేసుకున్న బ్రాండో గారినీ, నన్నూ చూసి వాళు కొంచెం ఆశ్చర్యపోయినా రోజుకి రూమ్ అద్దె పది డాలర్లు అనీ, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండవచ్చును అనీ చెప్పారు. అప్పటికే ఆ వాతావరణానికి బ్రాండో గారికే కళ్ళు తిరిగి “యు కెనాట్ స్టే హియర్” అని మళ్ళీ మరొక హొటెల్ కి తీసుకెళ్ళారు. ఇలా ఆ రోజు సాయంత్రం ఐదు దాకా ఐదారు హొటెల్స్ చూసి ఆఫీసుకి వెళ్ళిపోయాం.  హొటెల్ సెలెక్షన్ మా తమ్ముడికి వదిలేద్దాం అనుకుంటుండగానే వాడూ వచ్చాడు. ఒక మోస్తరు హొటెల్ కి కూడా రోజుకి కనీసం  పాతిక డాలర్లు అని తెలియగానే “మన దగ్గర అంత డబ్బు లేదుగా, ఈ వారాంతం లో వచ్చి ఎపార్టెమెంట్ వెతుక్కుందాం” అని మా తమ్ముడు నన్ను మళ్ళీ హార్వుడ్ హైట్స్ లో తన స్టూడియో ఏపార్ట్మెంట్ కి తీసుకెళ్ళాడు.

ఈ విధంగా నా మొట్టమొదటి ఉద్యోగం లో మొదటి రోజు గడిచింది. భేషజాలు పోకుండా బాస్ లు కూడా మనతో పాటు లంచ్ చేస్తారు అనీ, ఎవరి లంచ్ బిల్లు వాళ్ళే కట్టుకుంటారు కానీ ‘అంతా నేను కడతాను” అంటే “నేనే కడతాను” అని కొట్టుకు చావరూ అనీ, కొత్త ఉద్యోగికి ఎటువంటి సహాయం అయినా చేసే సంస్కారం అమెరికాలో ఉంది అనీ ఆ రోజు నేను నేర్చుకున్న కొన్ని కొత్త విషయాలు.

ఇక ఆ మర్నాడు..ఏమయిందో తర్వాత సంచికలో…..

*

వంగూరి చిట్టెన్ రాజు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • 1975లో 1డాలర్= 8 రూపాయల చిల్లర మాత్రమే కదండీ. అంటే నెలకి 8వేల రూపాయల జీతమే కదా. 70వేలు ఎలా?

  • మీ రచనలు అన్నీ చదువుతాను. వంగూరి జీవితకాలం చాలా బాగా రాస్తున్నారు. మమ్మల్ని కూడా ఆ రోజులలోకి తీసుకెళ్తున్నారు.

    మీకూ తెలిసే ఉంటుంది, ఈ మధ్యనే చదివాను – మీ గురుపత్ని శ్రీమతి సుబీర్ కార్ గారు తమ ఇంటిని ఐఐటీ బొంబాయికి దానం చేశారని.

    • అవును, విన్నాను..నిజానికి ఆయన పేరు ఒక endowment fund & chair పెడదాం అని నేను ఐఐటి అధికారులని సంప్రదిస్తే సుబీర్ కార్ గారి శ్రీమతి నీనా గారు తన ఫ్లాట్ ని తన తదనంతరం దానికోసం దానం చేశారు అని చెప్పారు. వారికి పిల్లలు లేరు.

      నా రచనలు చదువుతున్నందుకు, అవి నచ్చుతున్నందుకు ధన్యవాదాలు, నాగేశ్వర రావు గారూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు