అమెరికాలో అలా నా వెట్టి చాకిరీ……..

 అమెరికాలో అడుగుపెట్టిన మొదటి మూడు నెలలలో జీవనోపాధి కోసం చైనా వాళ్ళ రెస్టారెంట్ లో గిన్నెలు కడిగే ఉద్యోగం లాంటివి చేసిన నాకు యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలో గా ఏమైనా అవకాశం ఉందేమో అడగడానికి ఒక ప్రొఫెసర్ గారిని కలిసే అవకాశం అనుకోకుండా వచ్చింది. కల్లెన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనం రెండో అంతస్తులో ఆ ప్రొఫెసర్ గారి ఆఫీసు గదిలో 1975 ఏప్రిల్ నెలలో ఒకానొక రోజు భయం భయంగానే అడుగుపెట్టాను. చూడడానికి భారతీయుడిలాగానే గోధుమ రంగులోనే సూటూ బూటూ వేసుకుని పెద్ద సింహాసనం లాంటి కుర్చీలో కూచున్న ఆయనకి గుడ్ మోర్నింగ్ చెప్పగానే ‘యస్’ అనేసి ‘ఎవరు నువ్వు?” అని అడిగారు.

నేను వెంటనే నా ప్రవర…అంటే నా పేరు, బొంబాయి ఐఐటి లో ఫ్లూయిడ్ మెకానిక్స్ లోనే డాక్టరేట్ చేసిన సంగతీ, ఆయన దగ్గర పోస్ట్ డాక్టరల్ ఫెలో గా పని చేద్దాం అనే కోరికా చెప్పాను. అది విని ఆయన వికటంగా నవ్వి “నా దగ్గర అలాంటివేమీ లేవు. నువ్వు వెళ్ళ వచ్చును” అనేసి ఏదో రాసుకోవడం మొదలెట్టాడు. కనీసం కూచోమని కూడా చెప్ప లేదు. నాకు అనాలోతంగా చెమట్లు పట్టేశాయి. “మీరు అలా అనకండి. మొన్ననే మీ దగ్గర పని చేసి ఇండియా వెళ్ళిపోతున్న రామన్ పొజిషన్ ఇప్పుడు ఖాళీ ఉంది కదా” అన్నాను నెర్వస్ గా. అది విని తల పైకెత్తి, అలా వచ్చావా అన్నట్టు ఓ చూపు చూసి “అందుకే నాకు ఇండియన్స్ అంటే నాకు అసహ్యం, వెరీ ఏరోగెంట్ ఫెల్లోస్”. అది ఆయన మొదటి అవమాన అస్త్రం. నేను మళ్ళీ తెల్లబోయి, తేరుకుని “నేను అలా కాదు. ఐఐటి లో లెక్చరర్ గా కూడా ఐదేళ్ళు పని చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి వచ్చాను”. అది విని ఆయన “అలాగా…నీ వయసు ఎంతా?” అని, నా సమాధానం విన్నాక అప్పుడు కూచో అన్నాడు. ఆయన మహా అయితే నాకన్న అయిదారేళ్ళు పెద్ద అనీ, బంగ్లాదేశ్ లో ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చి అమెరికాలో ప్రతిష్టాత్మకమైన స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో నా సబ్జెక్ట్ లోనే డాక్టరేట్ చేసి, పది, పదిహేను పేపర్లు ప్రచురించి ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో ఉన్నాడు అనీ   ఆ తర్వాత కొన్నాళ్ళకి తెలిసింది.

నన్ను ‘కూచో’ అని ఆయన అనగానే నాలో కాస్త ఆశ పుట్టి, వెంటనే నా బయో డేటా, డిగ్రీ సర్టిఫికేట్లు, నేను దేశ విదేశీ సాంకేతిక జర్నల్స్ లో ప్రచురించిన వ్యాసాలూ ఉన్న ఫైల్ ఆయన చేతికి అందించి “ఇవి చూసి నేను పోస్ట్ డాక్టరల్ కి అర్హుడినో కాదో నిర్ణయించండి” అన్నాను కాస్త వణుకుతున్న గొంతుతోనే. “లెట్ మే టేక్ ఎ లుక్” అని మహా అయితే రెండు, మూడు నిమిషాలు అలా, ఇలా తిరగేసి మళ్ళీ నాకు ఆ ఫైల్ తిరిగి ఇచ్చేసి “వెల్…నీ  ఇండియా డాక్టరేట్ ఇక్కడ హై స్కూల్ డిప్లమాతో సమానం, తెలుసా” అని ఒక విషపు నవ్వు నవ్వాడు ఆ ప్రొఫెసర్ హుస్సేన్. ఇది మరొక అవమాన అస్త్రం. ఆయన అలా అనగానే నాకు ఏం చెయ్యాలో తెలియక లేచి నుంచున్నాను. నేను వెళ్ళిపోబోతున్నాను అని గమనించి “నో..నో. ఇట్ ఈజ్ ఒకే. సిట్ డౌన్” అని బంగ్లా దేశ్ నుంచి వచ్చిన ఈయన “నాకు ఇండియా డిగ్రీ సర్టిఫికేట్లు నిజమైనవో, నకిలీవో తెలీదు. కాబట్టి రేపు నువ్వు ఒక సారి వస్తే ఫ్లూయిడ్ మెకానిక్స్ మీదా..అందులో ముఖ్యంగా టర్బ్యులెన్స్ థీరీల మీదా ఒక పరీక్ష పెడతాను. దాన్నిబట్టి చూద్దాం” అన్నాడు. ఇది మూడవ అవమాన అస్త్రం. నాకు ఏడవాలో, నవ్వాలో, అసలు ఏం చెయ్యాలో ఏమీ అర్ధం కాక, ఆలోచించుకుని చెప్పే పరిస్థితి లేక “సరే, అలాగే” అనేసి సమయం నిర్ధారణ చేసుకుని, మళ్ళీ బస్ ఎక్కి ఎపార్ట్ మెంట్ కి వచ్చేశాను.

ఐదేళ్లు అవే సబ్జెక్ట్స్ ఐఐటీ లో పాఠాలు చెప్పిన నాకు ఇప్పుడు పరీక్ష రాసి నిరూపించుకోవాలీ అంటే ఆ రోజంతా ఒక వేపు అవమాన భారం దహిస్తూనే ఉంది. పోనీ మానేద్దామా అంటే గత మూడు నెలలలో నాకు వచ్చిన ఏకైక ఇంజనీరింగ్ ఉద్యోగ అవకాశం ఇదొక్కటే. పైగా ఇది ఎలాంటి పరీక్షో తెలియదు కాబట్టి ఎలా ప్రిపెర్ అవాలో కూడా తెలీదు. తెలిసినా నా దగ్గర పుస్తకాలు ఏమీ లేనే లేవు.  ఏమైతేనేం ఆ మర్నాడు మళ్ళీ వెళ్ళి. ఆయన పెట్టిన పరీక్ష సునాయాసంగానే గట్టెక్కాను. అయినా నా పరీక్ష ఫలితాలు చూసి కొంచెం పెదవి విరిచి ఆయన “నా దగ్గర ఇప్పుడు పోస్ట్ డాక్టరల్ లెవెల్ పొజిషన్ ఏదీ ఓపెనింగ్ లేదు. కానీ నీకు అమెరికాలో డాక్టరేట్ చేసే గొప్ప అవకాశం ఇస్తాను. మూడేళ్ళలో నువ్వు అసలు, సిసలు పిహెచ్. డి‌ సంపాదించుకో వచ్చును. నెలకి 250 డాలర్లు ఇస్తాను. అది కాక కేంపస్ జాబ్ కి సహాయం చేస్తాను.” అని అప్పుడు తను ఎంత గొప్పవాడో, తన దగ్గర డాక్టరేట్ చేస్తే  స్టాన్ ఫర్డ్, హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలలో నాకు కూడా ఎంత పేరు వస్తుందో తెగ ఆశలు చూపించి ఎలాగైనా నన్ను తన దగ్గర డాక్టరేట్ చేయడానికి ఒప్పించే విశ్వప్రయత్నాలు చేశాడు ప్రొఫెసర్ హుస్సేన్. నమ్మండి, నమ్మక పొండి. ఇదంతా ఆయన ఆ రోజు మధ్యాహ్నం యూనివర్శిటీ కేఫటీరియాకి తీసుకెళ్ళి లంచ్ పెట్టిస్తూ ఇచ్చిన గీతోపదేశం.

సరిగ్గా అంతకు రెండు రోజుల ముందు నా డాక్టరేట్ ని హైస్కూల్ డిప్లొమా కంటే తక్కువగా చూసిన వాడికి ఇవాళ నా మాస్టర్స్ డిగ్రీ తరవాత పి, హెచ్.డి చేసే అర్హత ఎవరైనా కలలో కనపడి చెప్పారేమో కానీ నాకు ఉచిత సలహా అస్సలు సముచితంగా కనపడ లేదు. అందు చేత ‘పొజిషన్ ఉంటే గింటే పోస్ట్ డాక్టరల్ ఫెలో గా అవకాశం ఇవ్వండి. నిజానికి నాకున్న టీచింగ్ అనుభవం చూస్తే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హుడిని. కానీ స్థానిక అమెరికా అనుభవం లేదు కాబట్టి ఇలా మిమ్మల్ని బతిమాలవలసి వస్తోంది.” అని నా అయిష్టాన్ని కాస్త గట్టిగానే చెప్పాను. ఆయన ఇంకా నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే “నన్ను ఆరు నెలల పాటు పోస్ట్ డాక్టరల్ గా చేర్చుకోండి. అప్పుడు కూడా నా టెక్నికల్ స్థాయి మీకు తక్కువగా అనిపిస్తే అప్పుడు మళ్లీ ఇంకొక డాక్టరేట్ లో మీ దగ్గర చేరతాను” అని అప్పటిపప్పుడు తట్టిన ఉపాయం చెప్పాను. ఇక అప్పుడు ఆయన మొదటి సారిగా నన్ను “డా. రాజూ” అని సంబోధించి “ఇప్పుడు ఏ పొజిషనూ లేదు” అని పాత పాటే పాడి ఈ సారి ట్యూన్ మార్చి “కానీ నువ్వు మూడు, నాలుగు రోజుల్లో ఒక పది పోస్ట్ డాక్టరల్ స్థాయి రీసెర్చ్ ప్రపోజల్స్ తయారు చేసి తీసుకురా. వాటిల్లో నాకు నచ్చినవి ఏమైనా ఉంటే వచ్చే వారం చూస్తాను” అని యాదాలాపంగా చెప్పేసి నేను ఏమంటానో అని నాకేసి చూశాడు.

నిజానికి ఇది మరొక  పరీక్ష…,మరొక అవమానం, ఒక చిన్న బిస్కట్ ముక్క. మూడు, నాలుగు రోజుల్లో పది రిసెర్చ్ ప్రతిపాదనలు వ్రాసి ఇవ్వడం అప్పుడు నేను ఉన్న పరిస్థితిలో అసాధ్యం. కానీ ‘వచ్చే వారం చూస్తాను” అంటే ఏదో ఉంది అని ఆశపెట్టే బిస్కట్ ముక్క. అసలు ఆ రిసెర్చ్ ప్రతిపాదనలు ఎలా వ్రాయగలనా అని అప్పటికప్పుడు కొంచెం ఆలోచించగానే ఒక ఐడియా తట్టి “సరే అలాగే” అని ఒప్పుకోగానే ఆయన నిర్ఘాంత పోయాడు. వివరాలు అడగబోయాడు కానీ నాకు ఏమీ చెప్ప బుద్ధి వెయ్యక “ఈ వీకెండ్ పని చేస్తాను. దాన్ని బట్టి ఎన్ని ప్రపోజల్స్ ఇవ్వగలనో అన్నీ బుధవారం మీ ఆఫీస్ కి వచ్చి ఇస్తాను.” అని హడావుడిగా బై చెప్పేసి బస్ ఎక్కేసి తిన్నగా రైస్ విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోయాను. నాకు వచ్చిన ఆలోచన అదే!. నేను హ్యూస్టన్ లో అడుగు పెట్టిన గత రెండు నెలలోనూ ఎక్కువ సమయం రైస్ యూనివర్శిటీ లో డాక్టరేట్ లు చేస్తున్న మూర్తి, మహంతి మొదలైన స్టూడెంట్స్ తో టెన్నిస్ ఆడడం ప్రధాన కాలక్షేపం. అప్పుడప్పుడూ వాళ్ళతో అక్కడ లైబ్రరీకి కూడా వెళ్ళడంతో టెక్నికల్ రిసెర్చ్ జర్నల్స్, పుస్తకాలు ఎక్కడ ఉంటాయో బాగానే తెలుసు. అది పబ్లిక్ లైబ్రరీయో కాదో నాకు తెలీదు కానీ ఆ గుమ్మం దగ్గర కాపలా కాసే అమ్మాయిలు. అబ్బాయిలు నన్ను ఎప్పుడూ అడ్డుకో లేదు.

పైగా ఏవైనా పుస్తకాలు ఇంటికి తెచ్చుకోవాలీ అంటే మా మిత్రులు ఉండనే ఉన్నారు. ఇక కావలసినది అల్లా ఒక టైప్ రైటర్. అది కూడా ఆ లైబ్రరీలోనే ఉంటుంది. ఇక అంతే సంగతులు. అమెరికా వచ్చాక మొదటి సారిగా నేను ఏకధాటిగా రోజుకి 12 గంటలు….అంటే ఆ లైబ్రరీ తెరిచి ఉన్నంత సేపూ అక్కడే అన్ని జర్నల్స్ చూసి. అందులో ఈ ప్రొఫెసర్ హుస్సేన్ అనే ఆయన తాలూకు రిసెర్చ్ పేపర్లు చూసి, ఆకళింపు చేసుకుని, ఆయనకి ఎటువంటి ప్రతిపాదనలు ఆసక్తి కరంగా ఉంటాయో ఊహించుకుని, నా సొంత ఆలోచనలు కలిపి మొత్తానికి 9 రిసెర్చ్ ప్రపోజల్స్ టైపింగ్ రాని నేను టిక్కు టిక్కు అనుకుంటూ ఒక్కొక్క అక్ష్రరం ఒక్కొక్క వేలితో కొట్టుకుంటూ, ఆ ఇంటెగ్రల్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మటుకు పెన్ను తో వ్రాసి మొత్తానికి కార్బన్ కాపీతో సహా రెండేసి కాపీలు తయారు చేశాను.

నేను చిన్నప్పటి నుంచీ అదే ఏప్రిల్ నెలలో ముప్పయ్యవ పడిలో పడిన అన్నేళ్ళలోనూ అంత శ్రమ ఎప్పుడూ పడ లేదు. ఇప్పుడు చదువు అంతా పూర్తి అయ్యాక ఈ దిక్కుమాలిన అమెరికా ఇంత కష్టపెడుతోందేమిటా, ఇండియా నుంచి అమెరికా వచ్చి ‘సుఖాన ఉన్న ప్రాణాన్నిదు:ఖాన్న పెట్టుకున్నానా?” ఇక్కడికి రావడంలో ఏమైనా పొరపాటు చేశానా అనే అనుమానం కలిగిన మాట వాస్తవం.

ఆ బుధవారం ముహూర్తం రానే వచ్చింది. నేను పొద్దున్నే రెండు బస్సులు మారి ప్రొఫెసర్ హుస్సేన్ గారి ఆఫీసుకి నిఝంగానే కాళ్ళు ఈడ్చుకుంటూనే వెళ్ళాను. నన్ను చూడగానే “అదేం అలా ఉన్నావు? ఆర్యూ ఆల్ రైట్?”. అన్నాడు. అవును మరి. ఇంచుమించు ఐదు రోజులు నిద్రాహారాలు మాని బుర్ర వేడెక్కి పోయే ఫ్లూయిడ్ మెకానిక్స్ & టర్బ్యులెన్స్ సబ్జెక్ట్స్ లో ఉన్న అతి క్లిష్టమైన ఈక్వేషన్స్ తో పి హెచ్ డి. స్థాయిని దాటవలసిన 9 రిసెర్చ్ ప్రతిపాదనలు వ్రాసుకొచ్చాక అలా నీరసంగా, కళ్ళూ పీక్కు పోయి రేపో మాపో అనే వాడిలా ఉండక ఆయన లాగా సూటూ బూటూ వేసుకుని టింగు రంగాలా ఎలా ఉంటాను? నేను “బాగానే ఉన్నాను” అని నీరసంగా అనేసి “ఇవిగో నా ప్రపోజల్స్” అని ఆ ఫైల్ ఆయన చేతికి ఇచ్చాను. “రియల్లీ” అని ఆయన విపరీతంగా ఆశ్చర్య పోయి కూచుని అందులో కాగితాలు తిరగేశాడు. మొహంలో అక్కడ ఏమీ చెప్పలేని హావభావాలతో ఆయన ఏమంటాడో, నా ప్రతిపాదనలు నచ్చాయో, లేదో అని నేను నా జన్మలో ఏనాడూ పడని టెన్షన్…నేర్వస్ నెస్ తో కుర్చీ అంచున కూచున్నాను.

ఒక యుగం పాటు కాలం గడిచాక ఆయన నా ఫైల్ బల్ల మీద నిర్లక్ష్యంగా పెట్టాడు. తన కుడి వేపు డ్రాయర్ లాగి అందు లోంచి పది కాగితాలు చూసి నాకు ఇచ్చి “వెల్. నాకు కొన్ని రిసెర్చ్ ఆలోచనలు ఉన్నాయి. ఇవిగో చూడు” అన్నాడు. నాకు మాట పెగల లేదు. ఏమనాలో అస్సలు తెలియ లేదు. నేను ఆ కాగితాలు అందుకునే లోగానే “నా ప్రపోజల్స్ లో అయితే ఒక పోస్ట్ డాక్టరల్ పొజిషన్ ఉంది”.  ఇప్పుడు నేను నిర్ఘాంత పోయాను. ‘మరి వాటి మాట ఏమిటి?” అన్నాను నేను ఆయనకి ఇచ్చిన నా 9 ప్రతిపాదనల ఫైల్ కేసి వేలు పెట్టి చూపించి. “ ఓ. దే ఆర్ ఆల్ రైట్”, కానీ నా లెవెల్ చాలా ఎక్కువ. స్టాన్ ఫర్డ్” అని నా కళ్ళెదురుగుండా, నేను చూస్తుండగానే నా శ్రమ ఫలితమైన ఆ ఫైల్ ని పక్కనే ఉన్న చెత్త బుట్టలో పడేశాడు. ఇది అన్నింటికన్నా ఘోరమైన అవమానం. హత్యా, ఆత్మహత్యల మధ్య ఊగిసలాడే సందర్భం.

నేను లేచి నిలబడబోతూ ఉంటే ….ప్రొఫెసర్ హుసేన్ గారు  “కమింగ్ బాక్ టు మై రిసెర్చ్…నీకు నెలకి $500 తో పోస్ట్ డాక్టరల్ ఫెలో గా ఎపాయింట్ మెంట్ ఇవ్వడానికి ఆనందంగా ఉంది. టాక్సెస్ వగైరాలు పోనూ నీకు సుమారు 400 వస్తాయి. నేను స్టాన్ ఫర్డ్  కేలిఫోర్నియా లాంటి ఖరీదైన ప్రాంతం లో అదే జీతంతో హాయిగా బతికాను. అలాంటిది ఇది హ్యూస్టన్ లో ఎక్కువ జీతమే. ఆరు నెలల తర్వాత నీ పనిని బట్టి జీతం పెంచ వచ్చును. నువ్వు సరే అంటే డిపార్ట్ మెంట్ సెక్రటరీకి చెప్తాను. అప్లికేషన్ పూర్తి చేసి ఆవిడకి ఇస్తే ఆవిడ అన్నీ చూసుకుంటుంది. నువ్వు రేపటి నుంచీ మన రిసెర్చ్ మొదలుపెట్టవచ్చును. ఏమంటావ్? “

కుర్చీలోనించి లేచిన వాడిని మళ్ళీ కూచోక తప్ప లేదు. ఒక పక్క అవమానం మీద అవమాన భారంతో బుర్ర గిర్రున తిరుగుతోంది. మరొక పక్క అమెరికాలో మొట్టమొదటి అవకాశం. ఎదరంతా ఎడారో, గోదారో తెలియని పరిస్థితి. ముందు నుయ్యి, వెనక గొయ్యి అని కూడా అనవచ్చును. మళ్ళీ చైనా రెస్టారెంట్ లో గిన్నెలు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఆయనకి “థేంక్యూ, సర్” అని నాలుగు గదుల అవతల ఉన్న డిపార్ట్ మెంట్ సెక్రటరీ అమ్మాయి దగ్గరకి వెళ్ళగానే ఆ అమ్మాయి “కంగ్రాట్యులేషన్స్. వెల్ కం టు కలెన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్” అని అప్లికేషన్ ఫారం చేతిలో పెట్టి చక చకా నా ఉద్యోగం ఖరారు చేసింది. . నాకు అవకాశం ఇచ్చిన ఆ కిరాతక మహానుభావుడు నాకన్న రెండేళ్ళు మాత్రమే వయసులో పెద్దవాడు అని అప్పుడే తెలిసింది!.

ఆ విధంగా నాకంటే రెండేళ్ళు పెద్దవాడు అయిన ఒక కిరాతకుడి దగ్గర నా వెట్టి చాకిరీ మొదలయింది.

అది 1975 మే నెల..ఒకటో తారీకు.

ఒక ఏడాదిన్నర ఆ వెట్టి చాకిరీ గురించీ…అదే సమయం లో జరిగిన మంచి విషయాలతో..మరొక సారి…

*

వంగూరి చిట్టెన్ రాజు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు