పూర్వం నమ్మకం, సత్యం గురించి పెద్ద గందరగోళం లేదు. ప్రజలు తమ పెద్దల మాటలను, గ్రామ సమాచారాన్ని నిజమని నమ్మేవారు. వార్తలు నోటి మాటల ద్వారా పంచుకునేవి, అందరికీ ఒకే నిజం ఉండేది. రాజులు, గురువులు చెప్పినది సత్యమని భావించేవారు. కానీ కాలం మారింది. రేడియో, టీవీలు వచ్చాయి, తర్వాత ఇంటర్నెట్, సోషల్ మీడియా వచ్చాయి. ఇప్పుడు అందరూ ఏదో ఒక వార్తను పంచుకుంటారు. ఒక్కోసారి అది నిజమో కాదో తెలియకుండానే విశ్వసిస్తాం. అబద్ధాలు వేగంగా పాకిపోతాయి, నమ్మకం తగ్గిపోతోంది. పాత రోజుల్లో ఒకే సత్యం ఉంటే, ఇప్పుడు అందరికీ తమదైన సత్యం కనిపిస్తుంది. ఈ మార్పు మనల్ని ఒకరిపై ఒకరు అనుమానించేలా చేసింది
ఒక రోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఒక పబ్లిక్ ఒపీనియన్ సేకరణ సంస్థ నుండి. వాళ్లు కొన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. మొదట రెండు మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాను. కానీ కొంచెం సేపటికి నాకు అనుమానం మొదలైంది. వీళ్ళు నిజంగా ఎవరు? వీళ్లు అడిగే ప్రశ్నల వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా? ఈ అనుమానం నన్ను ఆపేసింది. ఆలోచిస్తే, ఈ రోజుల్లో ఎవరినీ ఎవరూ నమ్మడం లేదు. ఇది నిజమైన పనులకు అడ్డంకిగా మారుతోంది. అప్పుడే నాకు ఎరిక్ షురెన్‌బర్గ్ అనే ఇంక్ మ్యాగజైన్ మాజీ ఎడిటర్ చేసిన TEDx ప్రసంగం గుర్తొచ్చింది. సత్యాన్ని గుర్తించి, దానికి మద్దతు ఇవ్వడం ఎంత ముఖ్యమో అతను చెప్పిన మాటలు గుర్తుచేసుకున్నాను
నమ్మకం, సత్యం లేకపోతే ఏమవుతుంది?.
ఎరిక్ ఒక సంఘటన గురించి చెప్పాడు. ఒకసారి సిన్సినాటీలో ఒక ప్యానెల్ చర్చ తర్వాత, ఒక మహిళ అతని దగ్గరకు వచ్చి, “మీ జర్నలిస్టులు ఎందుకు ఎప్పుడూ అబద్ధాలు చెబుతారు?” అని అడిగిందట. ఈ ప్రశ్న అతన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె మాటలు విన్న తర్వాత, ప్రజలు మీడియాపై, సైన్స్‌పై, న్యాయవ్యవస్థపై, విద్యపై ఎంత తక్కువ నమ్మకం ఉంచుతున్నారో అతను గ్రహించాడు. ఈ నమ్మకం లేకపోవడం వల్ల, అబద్ధాలు మనల్ని గందరగోళంలోకి నెట్టేస్తాయి. నిజాలు మరుగున పడిపోతాయి.నమ్మకం లేకపోతే, సత్యాన్ని నమ్మే ఆలోచనే లేకపోతే, సమాజం గందరగోళంలో పడుతుంది. ప్రజల అభిప్రాయాలు సేకరించడం కష్టమవుతుంది, ఎందుకంటే ఎవరూ ఏదీ నిజమని చెప్పలేరు. ఒకరు ఒకటి చెబితే, మరొకరు దాన్ని తప్పని అనుమానిస్తారు. ఇలా అందరూ ఒకరిపై ఒకరు సందేహిస్తే, కలిసి పనిచేయడం ఎలా సాధ్యం? ప్రభుత్వం, విద్యాసంస్థలు, వైద్యులు చెప్పే మాటలను కూడా ప్రజలు విశ్వసించరు. దీనివల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఆగిపోతుంది. అబద్ధాలు పెరిగితే, భయం, గందరగోళం మాత్రమే మిగులుతాయి. సమాజం ఒక దారిలేని అడవిలా మారుతుంది, అక్కడ ఎవరికీ ఏదీ స్పష్టంగా కనిపించదు.
ఇలా అన్నిటినీ అందరూ అబద్దాలుగా పరిగణిస్తున్న తరుణంలో సత్యానికి నిలబడాల్సిన ఆవశ్యకత చాలా పెరిగిపోతున్నది. అందుకే ఎరిక్ లాంటి కొందరు ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగ మాట్లాడాల్సి ఉంటుంది. ఎరిక్ తన టెడెక్స్ ప్రసంగంలో సత్యానికి మద్దతుగా ఉండడానికి మూడు మార్గాలు చెప్తాడు. మొదట, నిజాలు ఉన్నాయని నమ్మాలి—అవి అభిప్రాయాలు కాదు, నిరూపించగలిగిన విషయాలు. ఉదాహరణకు, భూమి గుండ్రంగా ఉందని నాసా ఫోటోలు చూపిస్తాయి. రెండోది, మనం జాగ్రత్తగా ఉండాలి. మన మనసు సులభంగా అబద్ధాలను నమ్మేస్తుంది, ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ఆసక్తికరమైన కథనాలను. ఒకసారి ఆహార ఫ్యాక్టరీల్లో మంటల గురించి ఒక వార్త వచ్చింది. అది పెద్ద కుట్రలా కనిపించింది, కానీ తనిఖీ చేస్తే అది సాధారణమైన విషయమని తెలిసింది. మూడోది, సులువుగా తప్పించుకోకూడదు కొన్నిసార్లు సమూహాలని వ్యతిరేకించాలి అంటే ధైర్యం కావాలి.
నా ఫోన్ కాల్ అనుభవం తర్వాత, నేను ఆలోచించాను. నేను అంత తొందరగా అనుమానపడకుండా వాళ్లతో మాట్లాడి ఉంటే, బహుశా వాళ్ల నిజమైన ఉద్దేశం ఎరిక్ చెప్పినట్టు, నేను వాళ్లను విని, వాళ్ల అనుమానాలను అర్థం చేసుకుని, నా వైపు నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించాలి. అందరం కలిసి సత్యాన్ని సమర్థిస్తే, ఈ నమ్మకం లేని ప్రపంచంలో కొంత మార్పు తెచ్చే అవకాశం ఉంది. సత్యం వల్లే మనం మంచి ప్రపంచాన్ని నిర్మించగలం. అబద్ధాలు మాత్రం గందరగోళం తప్ప ఏమీ ఇవ్వవు.
*
Add comment