అపశ్రుతుల నుంచి ఆచరణ దాకా!

“…అతనిలో వైరుధ్యాలు ఎక్కువ. చాలా అపశ్రుతులున్న పాటలా…..”

‘మోహనా! మోహనా!’ కథ నేపథ్యంలో, మోహనరావు పాత్ర చిత్రణ గురించి డా. వి చంద్రశేఖర రావు రాసిన ఈ వాక్యాలు (మరొకరి డైరీ నుంచి జ్ఞాపకం మీది ఉటంకింపు అని ఆయన చెప్పారు, కానీ అవి ఆయన సొంత వాక్యాలైనా కావచ్చు) ఆయన రచనలను అర్థం చేసుకోవడానికి ఒక తాళంచెవిలా ఉపయోగపడతాయి. ఆయన సృష్టించిన పాత్రలలో ఎక్కువభాగపు సాధారణ స్వభావం ఈ అపారమైన అంతర్గత వైరుధ్యాలే, అపశ్రుతులే. కాని ఎన్ని వైరుధ్యాలున్నా ఆ పాత్రలన్నీ అటూఇటూగా మనకు తెలిసినవే. బహుశా మనలో కూడ ఉన్నవే. ఎన్ని అపశ్రుతులున్నా అవన్నీ వినవలసిన పాటలే. ఆ రకంగా ఆయన రచనల్లోని పాత్రలు ఆ రచనలు చదువుతున్న పాఠకులే. ఆయన చిత్రించిన కాలం ఆ పాఠకుల సమకాలీనమే. ఆ రచనల నిండా ఉన్నవి ఆ పాఠకులు నిత్యమూ వింటున్న అపశ్రుతుల పాటలే.

బహుశా అందువల్లనే చంద్రశేఖర రావు కథలు, నవలు సమకాలీనంగా పాఠకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి, సంచలనాత్మకమయ్యాయి, లోతుగా కదిలించాయి, నిలువనీటి మనసుల్లో సుడిగుండాలు రేపాయి. కాని, చాల మంది తెలుగు రచయితల విషయంలో జరిగినట్టుగానే ఆయన విషయంలో కూడా రావలసినంత సమగ్రమైన, నిశితమైన విమర్శ వచ్చినట్టు లేదు. ఆయన రచనల గుణదోషాలను సమ్యగ్ దృక్పథంతో విమర్శనాత్మకంగా పరిశీలించిన సమగ్ర విశ్లేషణ గత ముప్పై సంవత్సరాల్లోనూ వెలువడినట్టు అనిపించదు. తెలుగు కాల్పనిక సాహిత్యంలో అత్యంత ప్రతిభావంతుడైన, సమకాలీన వివాదాస్పద వస్తువులతో అరుదైన శిల్ప ప్రయోగాలు చేసిన చంద్రశేఖర రావు కృషి అత్యంత ప్రశంసనీయమైనదీ, చర్చనీయమైనదీ, అనుసరణీయమైనదీ. కాని ప్రశంస కొంతవరకైనా అందిందేమో గాని జరగవలసినంత చర్చ మాత్రం జరగలేదు. ఆయన రచనాశైలి అబ్బురపరిచింది గాని అనుచరులను సంపాదించుకోలేకపోయింది. ఆయన రచనల మీద తగినంత విమర్శ రాకపోవడం వల్ల సాహిత్య విశ్లేషణ ద్వారా సాధించగలిగిన సాహిత్య, సామాజిక నిర్ధారణలు వెలుగు చూడకుండానే ఉండిపోయాయి.

ఆయన కథా సంపుటాల మీద, నవలల మీద సమీక్షలు, విమర్శలు రాలేదని కాదు, వివాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాని మొత్తంగా ఆయన సాహిత్యం మీద, ఆయన వస్తు శిల్పాల ప్రత్యేకత మీద సమగ్రమైన గుణదోష చర్చ మాత్రం జరగలేదు. దాదాపు మూడు దశాబ్దాలలో, రెండు వేల పేజీలలో విస్తరించిన ఆయన రచనలమీద, ఆ సంక్షుభిత దశాబ్దాల రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక జీవనానికి తనదైన పట్టకం పట్టుకున్న ఆయన రచనల మీద, కనీసం ఆయన అకాల మరణం తర్వాతనైనా, ఒక విహంగావలోకనం వంటిది జరిగినట్టు లేదు.

నావరకు నేను ఆయన కథల సంపుటి ‘లెనిన్ ప్లేస్’ (1998) మీద ‘బీభత్సానికి లక్ష ముఖాలు’ (ఆంధ్రప్రభ, ఆగస్ట్ 23, 1998, పునర్ముద్రణ: కథా సందర్భం, 2000) అని, నవల ‘ఐదు హంసలు’ (2000) మీద ‘శిల్పం పాడిన హంసగీతం’ (నీహార్ ఆన్ లైన్ డాట్ కామ్, సెప్టెంబర్ 2, 2001, పునర్ముద్రణ: నవలాసమయం, 2006) అని సమీక్షలు రాశాను. ఆ సమీక్షల్లో ఉండవలసినదానికన్న ఎక్కువ విమర్శనాత్మకంగా, కొంత కటువుగా కూడ ఉన్నానేమో. ఆ సమీక్షల్లో కొన్ని అవసరమైన నిర్ధారణలు కూడ ఉన్నప్పటికీ అవి స్థూలమైనవీ, అప్పుడు సమీక్షిస్తున్న పుస్తకానికి మాత్రమే ప్రత్యేకమైనవీ అయి ఉంటాయి. మొత్తంగా చంద్రశేఖర రావు రచనల ఆవిర్భావ నేపథ్యాన్ని గాని, అవి వెలువడిన సాహిత్య, సామాజిక వాతావరణాన్ని గాని, ఆ రచనల ప్రత్యేకతను గాని, వాటి ప్రయోజనాన్ని గాని సమగ్రంగా చర్చించడానికి అక్కడ అవకాశం లేదు. అంతమాత్రమే కాదు, రెండు దశాబ్దాల వెనుక ఉండిన అవగాహనల పరిమితుల వల్ల నా సమీక్షలు కూడా ఆ రచనల పరిశీలనకు అవసరమైన సమగ్రతను సంతరించుకోలేదనుకుంటాను.

బహుశా చంద్రశేఖర రావు రచనల మీద సమగ్ర విశ్లేషణ రాకపోవడానికి తెలుగు సమాజ సాహిత్యాలలో సాహిత్య ప్రయోజనం గురించి ఉన్న పరిమిత అవగాహన ఒక కారణం కావచ్చు. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఏదీ ఉండనక్కరలేదనే వాదనలు, కళ కళ కోసమే వంటి వాదనలు ప్రబలుతున్న సందర్భంలో తెలుగు సాహిత్య సంప్రదాయం సాహిత్య ప్రయోజన వాదాన్ని సరిగానే ఎత్తిపట్టింది. కానీ ఆ వివాదంలో మరొక కొసకు వెళ్లినందువల్ల సాహిత్య ప్రయోజనాన్ని అవసరమైనంత విశాలంగా, లోతుగా అర్థం చేసుకోవడం జరగలేదు. సాహిత్య ప్రయోజనం తక్షణమే కనబడాలనీ, అది కూడా స్పష్టంగా, సూటిగా, వాచ్యంగా ఉండాలనీ, ప్రతి సాహిత్య రచనా తప్పనిసరిగా ఒక సామాజిక సందేశం ఇవ్వాలనీ ఆలోచనలు వెలువడ్డాయి. నిజానికి ఆ వివాదపు వేడిలో అటువంటి ఆలోచనలు తలెత్తడం సహజమే కావచ్చు గాని కాలక్రమంలోనైనా ఆ పరిమిత అవగాహనను అధిగమించి, విస్తరించి ఉండవలసింది. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండాలనడం దానికదిగా తప్పు కాదు. తప్పనిసరిగా సాహిత్యానికి తక్షణ ప్రయోజనం కూడా ఉంటుంది. కానీ అదే సమయంలో సాహిత్యానికి దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది. ఆ రెండూ కూడా పైకి కనబడేట్టు, వాచ్యంగా, సందేశం రూపంలో కూడా ఉండాలని నియమమేమీ లేదు. జీవితాన్ని, జీవితం పట్ల అవగాహనను, భాషను, వ్యక్తీకరణ పద్ధతులను ఉన్నతీకరించడం, పాఠకులకు కనబడే రూపం నుంచి లోతైన సారం వైపు తీసుకుపోవడం సాహిత్య అంతిమ ప్రయోజనం అనుకుంటే అది తక్షణమే కానక్కరలేదు, వాచ్యం కానక్కర లేదు, సందేశం కానక్కర లేదు. అది అనేక రూపాల్లో, అనేక తలాల్లో, అనేక స్థాయిల్లో వ్యక్తీకరణ పొందవచ్చు. అటువంటి అనేక వ్యక్తీకరణల్లో ప్రయోగపరత్వం ఒకటి. ఆ ప్రయోగపరత్వం సామూహికంగానూ వ్యక్తం కావచ్చు. రచయితల వ్యక్తిగత స్థాయిలోనూ వ్యక్తం కావచ్చు. వస్తు శిల్పాల ఎంపికలో, భాషా వినియోగంలో ఈ ప్రయోగాలు వ్యక్తమవుతాయి.

చంద్రశేఖర రావు సాహిత్యాన్నంతా సమగ్రంగా పరామర్శించదలచినప్పుడు ఆయన సాహిత్య ప్రయోజనం తక్షణమో, తాత్కాలికమో కాదని, అది ప్రయోగపరత్వమని, తద్వారా దాని ప్రయోజనం దీర్ఘకాలికమని అర్థమవుతుంది. వస్తువుల ఎంపిక, పాత్రల చిత్రణ, పాత్రల వాతావరణం, సన్నివేశాల కల్పన, భాషా వినియోగం, ఆకస్మిక మలుపుల కల్పన వంటి ఎన్నో అంశాలలో ఆయన తెలుగు సాహిత్య, కథా సంప్రదాయంలో ప్రయోగాలకు పూనుకున్నారు.

అయితే ఆ ప్రయోగపరత్వమే, కొన్ని సందర్భాలలో అది మితి మీరడమే ఆయన పట్ల అనుమానానికి కూడ కారణమై ఉంటుంది. ప్రయోగం అనగానే అరాచకత్వమేమో అని, లక్ష్యం లేకపోవడమేమోనని ఒక అపోహ తెలుగు సాహిత్య విమర్శలో చిరకాలంగా కొనసాగుతున్నది. నిజానికి మానవ విజ్ఞానాన్వేషణలో ప్రధాన పాత్ర ప్రయోగపరత్వానిదే. ఇప్పటికీ విజ్ఞానశాస్త్ర సంప్రదాయంలో ప్రయోగానికి చాలా గౌరవనీయత ఉంది. ప్రయోగం అభివృద్ధికి ఒక మార్గం. ప్రయోగాన్ని ఎప్పుడూ అనుమానించనక్కరలేదు. కానీ ఆశ్చర్యకరంగా తెలుగు సాహిత్య సంప్రదాయంలో వ్యవహారిక భాషావాదం నాటి నుంచీ అంటే కనీసం ఒక శతాబ్దానికి పైగా ప్రతి ప్రయోగమూ మొదట అనుమానాన్నే ఎదుర్కొన్నది. ఆ ఒరవడిలోనే చంద్రశేఖర రావు రచనల పట్ల రావలసినంత విమర్శనాత్మక ప్రశంస బదులు, అనుమానసహిత విమర్శే వచ్చింది.

అయితే, ప్రయోగపరత్వంతో అనేక అవకాశాలు తెరుచుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అంతర్గతంగానే పరిమితులు కూడా ఏర్పడతాయని గుర్తించాలి. ప్రయోగం ఏదైనా తప్పనిసరిగా ఒక లక్ష్యంతోనే, ఉద్దేశంతోనే జరుగుతుంది. కానీ ప్రయోగక్రమంలో వచ్చే కొత్త అంశాలు గుర్తించడానికీ నమోదు చేయడానికీ అవసరమైతే ప్రయోగ దిశను మార్చుకోవడానికీ కూడా సిద్ధంగా ఉండాలి. ఊహాశాలిత కూడా ఒక ప్రయోగమే. ఒక నిర్దిష్ట ఉద్దేశంతో ప్రారంభమయిన ఊహాక్రమంలో ఎన్నో అనుకోని, తెలియని ఊహలు వస్తాయి. మార్గాలు తెరుచుకుంటాయి. కానీ ఈ క్రమంలో అసలు ప్రయోగం ఎందుకు మొదలుపెట్టామో మరిచిపోగూడదు. ప్రయోగం ప్రయోజనరహితం అనుకోగూడదు. గాలిపటాన్ని ఎంత దూరమైనా పంపవచ్చు, ఏ గాలులకైనా కొట్టుకు పోనివ్వవచ్చు, ఎన్ని కొత్త లోకాలైనా చుట్టి రానివ్వవచ్చు గాని, ఆ గాలి పటాన్ని ఒక మనిషిగా తాను పట్టుకున్నానని, ఒక భూమి మీద నిలబడి పట్టుకున్నానని మరిచిపోగూడదు. నేల విడిచి సాము అనే నుడికారం ఉండనే ఉంది.

ప్రయోగానికి ఉన్న ఈ రెండు కోణాలూ – అద్భుత అవకాశాలూ, ప్రారంభం మరిచిపోయే పరిమితులూ – కూడా చంద్రశేఖర రావు రచనలో వ్యక్తమయ్యాయి.

ప్రయోగపరత్వం వల్ల చంద్రశేఖర రావు తన ముందున్న వస్తువులను కొత్త దృష్టితో చూశారు. నిజానికి ఆయన ఎంచుకున్న సామాజిక వస్తువులు అన్నీ అందరిముందూ ఉన్నవే. కానీ ఆయన వాటినే ఒక కొత్త చూపుతో చూశారు. అలా చూసే అవకాశం కూడా ఉందని పాఠకులకు చెప్పారు. అందువల్ల తప్పనిసరిగా ఆ వస్తువుల మీద కొత్త వెలుగు ప్రసరించింది. ఆ వస్తువులేమిటి? సరిగ్గా ఆయన సాహిత్య రంగ ప్రవేశం, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచీకరణ విధానాల ప్రవేశం ఒకేసారి జరగడం యాదృచ్ఛికం కాదు. 1980ల మధ్యలో రాజీవ్ గాంధీ పాలనలో మొదలైన దిగుమతి సరళీకరణ విధానాల మీదుగా, 1991లో పివి నరసింహా రావు – మన్మోహన్ సింగ్ ల నూతన ఆర్థిక విధానాల పేరు మీది సరళీకరణ – ప్రైవేటీకరణ – ప్రపంచీకరణ విధానాలు, ఆర్థిక రంగంలో తెచ్చిన మార్పులు ఇక్కడ అనవసరం గాని, సామాజిక, సాంస్కృతిక రంగాలలో తెచ్చిన మార్పులకూ చంద్రశేఖరరావు రచనలకూ అవిభాజ్య సంబంధం ఉంది గనుక వాటిని చర్చించుకోవాలి.

ఈ రాజకీయార్థిక విధానాలు ఒక కొత్త మధ్యతరగతిని సృష్టించాయి. లేదా పాత మధ్యతరగతిలోనే ఒక కొత్త మనస్తత్వానికి భూమికను సిద్ధం చేశాయి. ఈ కొత్త మధ్యతరగతి తన పాత విలువలను తానే సందేహించడం ప్రారంభించింది. కొత్త ప్రశ్నలు వేస్తూ, కొత్త జవాబులు కనిపెడుతూ, నిన్న కనిపెట్టిన జవాబును ఇవాళ, పొద్దున కనిపెట్టిన జవాబును సాయంత్రం కొట్టివేస్తూ నిత్య సందేహంలో, నిత్య గందరగోళంలో, పాదరస స్థితిలో కొనసాగడం ప్రారంభించింది. మధ్యతరగతి విద్యావంతులు, ఆలోచనాపరులు తమ అభిప్రాయాలనూ పనులనూ తామే  సందేహించుకునే పరిస్థితి తలెత్తింది. విభిన్న సమూహాలు తమ అస్తిత్వాన్ని, ప్రత్యేకతను ప్రధానంగా చూడడం అనే అత్యవసరమైన పని చేస్తూనే ఆ క్రమంలో ఐక్యతను మరిచిపోయారు. భాగాన్ని చూస్తూ మొత్తాన్ని పక్కనపెట్టారు. చెట్టును చూస్తూ అడవిని విస్మరించారు. ఈ నేపథ్యంలో సామాజిక ఉద్యమ జీవులలో కొందరిలోనైనా తాము చేస్తున్న పని మీద, తమ అభిప్రాయాల మీద సందేహాలు, అనుమానాలు మొదలయ్యాయి. సామాజిక జీవులలో ఒక కొత్తరకం షిజోఫ్రెనిక్, పారనోయా మనుషులు తలెత్తారు. వారిలో కొందరు చంద్రశేఖర రావు పాత్రలయ్యారు. ఈ గందరగోళ వర్తమాన స్థితిలో కొందరైనా గతం వైపు చూడడం, గతమే బాగుందనుకోవడం మొదలుపెట్టారు. అలా సరిగ్గా ఆ దశాబ్దిలోనే తెలుగు సాహిత్యంలో పురాస్మృతి (నోస్టాల్జియా) విస్తరించింది.

ఇది మధ్యతరగతి స్వీయమానసిక పాదరస స్థితి మాత్రమే కూడా కాదు, నాటి భౌతిక జీవితంలోనే, ఆ జీవితాన్ని నిర్వచించే, ప్రశ్నించే, నిర్వహించే సామాజిక ఉద్యమాలలో కూడా అనేక డోలాయమాన స్థితులు, ముందు వెనుకలు, ఉత్థాన పతనాలు, చీలికలు, పరస్పర దూషణలు, నిందలు, ఏ ఒక్కరినీ ఏ ఒక్కరూ నమ్మలేని స్థితి కొనసాగాయి. అలా తెలుగు సమాజంలో, ముఖ్యంగా బుద్ధిజీవులలో 1990లలో ఒక పాదరస వాస్తవికతా స్థితి ప్రారంభమైంది. ఈ పాదరస వాస్తవికతను బహుశా అత్యద్భుతంగా పట్టుకున్నవారు చంద్రశేఖర రావు. (ఈ 1990ల దశాబ్ది వాస్తవికతకే ఉండిన మరొక రెండు ముఖాలు అల్లం రాజయ్య ‘మధ్యవర్తులు’, ‘మనిషిలోపలి విధ్వంసం’ కథలలో, కె ఎన్ వై పతంజలి ‘పిలక తిరుగుడు పువ్వు’ నవలికలో కూడ వ్యక్తీకరణ పొందాయి). కనుక చంద్రశేఖర రావు రచనలను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలన్నా, విశ్లేషించాలన్నా 1990 లలో ప్రారంభమై మారుతూ వస్తున్న రాజకీయార్థిక వాతావరణాన్ని, ఆ వాతావరణానికి అనుగుణంగా మారుతూ వచ్చిన సామాజిక, సాంస్కృతిక ధోరణులను, మధ్యతరగతి మనస్తత్వాన్ని పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

“నేను నా రచనల ద్వారా సృష్టించబడ్డాను. నా కథల్లోని పాత్రలన్నీ నేనే. నేనే మోహన సుందరాన్ని. నేనే లలితను. నేనే మోహినిని. ఆ పాత్రల గుండెల్లోని రిసెంట్ మెంట్ నేనే. నాస్టాల్జియా నేనే. తన శరీరంపై తానే గాయాలు చేసుకుంటున్న కాలం నేనే. నా కథల్లోని ప్రొటాగనిస్టులు, నాలోపలి డిప్రెషన్ నుంచి, సందేహాల నుంచి, కోట్లాది భయాల నుంచి, చిటికెడంత ఆశ నుంచి పుట్టుకొచ్చినవాళ్లే” అని ఆయనే చెప్పుకున్న మాటలు ఈ స్థితిని సూచిస్తాయి.

“ప్రతి మనిషి ఒక కథ, ప్రతి దుఃఖం ఒక పాట” అనీ, “నీ శక్తి అంతా నిన్ను నువ్వు గాయపరచుకోవటానికే వాడుతున్నావు” అనీ ఆయన చాలా సార్లు అన్నారు. ఆ అర్థంలో చంద్రశేఖర రావును తనను తాను గాయపరచుకున్న ఒక తరానికి ప్రతిబింబంగా, ఆ తరపు మానసిక స్థితికి వ్యాఖ్యాతగా చూస్తే ఇంకా ఎక్కువగా అర్థం అవుతారు. తన రచనల్లో పాత్రలుగా మారిన తన తరపు “ఉద్యమకారుల” గురించి, వారి అవకాశవాదం గురించి మాట్లాడుతూ, “ఈ అవకాశవాదుల గురించి బహుపరాక్ చెప్పాల్సిన అవసరం ఉంది” అని చంద్రశేఖర రావే అన్నారు.

చంద్రశేఖర రావు రచనల మీద ఇప్పటివరకూ వెలువడిన అభిప్రాయాలలో ఎక్కువ భాగం ఆయన వినూత్న, బహుళార్థ స్ఫోరక శిల్పం మీద కేంద్రీకరించాయి. ఈ విమర్శలు తెలుగు సాహిత్య విమర్శలో సాంప్రదాయికంగా వస్తున్న వస్తు శిల్ప విభజన, వస్తు ప్రాధాన్యత దృష్ట్యానే సాగాయి గనుక ఆయన రచనలను లోతుగా విశ్లేషించడానికి కొంత అవరోధంగా మారాయి. నిజానికి వస్తు శిల్పాల మధ్య ఐక్యత గతితార్కికమైనది, విభజన అనవసరమైనది. ప్రగతిశీలమైన వస్తువు అనాకర్షక శిల్పంతో ఉండడం, ప్రగతినిరోధక వస్తువు ఆకర్షక శిల్పంతో ఉండడం అనే ఒక ప్రత్యేక స్థితి వల్ల ఒకానొక కాలంలో ఈ వస్తు శిల్పాల చర్చ ప్రాధాన్యత పెరిగింది. వస్తువుల మీద, శిల్పపద్ధతుల మీద విధి నిషేధాలు ఉనికిలోకి వచ్చాయి. నిజానికి సృజనకర్తకు వస్తువు విషయంలోనూ, శిల్పం విషయంలోనూ విధినిషేధాలు అవసరం లేదు. ప్రయోజనం రీత్యా అవి కొంతవరకు అవసరమైనవే అనుకున్నా, అసలు ప్రయోజనం అనేదాన్నే ఇంకా విశాలంగా చూడవలసి ఉంది.

మరొకవైపు నుంచి చూస్తే, చంద్రశేఖర రావు విషయంలో ప్రత్యేకంగానూ, అసలు మొత్తంగానూ, వస్తువు – శిల్పం అనే బదులు దృక్పథం – వ్యక్తీకరణ అనడం సముచితం అనిపిస్తుంది. ఏ వస్తువు తీసుకున్నప్పటికీ ప్రతి రచయితకూ ఒక దృక్పథం ఉంటుంది. లేదా దృక్పథ స్పష్టత లేని కలగలుపు దృక్పథాలు ఉంటాయి. ఆ దృక్పథపు, దృక్పథ రాహిత్యపు పట్టకంలోంచే ఒక వాస్తవం ఏడురంగుల కళగా రూపు దిద్దుకుంటుంది. ఆ రచయిత అధ్యయనాన్ని, అనుభవాన్ని, పరిశీలనా శక్తిని, ఊహాశాలితను, ప్రయోగపరత్వాన్ని, ఎంచుకున్న వస్తువును బట్టి వ్యక్తీకరణ సంవిధానాలు ఉంటాయి. ఆ సంవిధానాలు మారుతూ కూడ ఉండవచ్చు.

చంద్రశేఖర రావు వ్యక్తీకరణ సంవిధానాలు విలక్షణమైనవనీ, వినూత్నమైనవనీ, పాఠకులను, విమర్శకులను కూడ దిగ్భ్రాంతి పరిచాయనీ కొత్తగా చెప్పనక్కరలేదు. కవితాత్మక ఆలంకారిక వాక్య నిర్మాణం, కవిత్వంలో లాగ పదచిత్రాలు, పాత్రల వ్యక్తిత్వ నిర్మాణపు వివరణ, విశ్లేషణల మీద శ్రద్ధ, పాత్ర గురించి భిన్న దృక్పథాలను కథలో భాగం చెయ్యడం, కిక్కిరిసిన జీవితాలు, విశాల అధ్యయనం నుంచి ఉటంకింపులు, ఒక అత్యల్ప సంఖ్యాక బుద్ధిజీవుల బృందపు వాతావరణంలా కనిపించే ఒక సామాజిక శకలాన్ని యథాతథంగా చిత్రించడం, పాత్రలనూ, సన్నివేశాలనూ, పదచిత్రాలనూ, వర్ణనలనూ కూడ ఒకే కథలోనూ, వేరువేరు కథలలోనూ పునరుక్తం చేయడం  వంటి వ్యక్తీకరణ సంవిధానాలను ఆయన వాడుకున్నారు.

కాని ఆ వ్యక్తీకరణ సంవిధానాలు విడిగా చూడవలసినవీ కాదు, ప్రధానమూ కాదు. ఆయన ఒక ప్రత్యేక రాజకీయార్థిక, సామాజిక వాతావరణంలో, తానే ఎంచుకున్న ప్రత్యేక వస్తువులకు కళారూపం ఇవ్వడం కోసం ఆ వ్యక్తీకరణ సంవిధానాలను ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్నారు. కనుక ఆ రచనల నేపథ్యాన్నీ, రచయిత దృక్పథాన్నీ, ఆ ప్రత్యేక వస్తువు ఎంపికనూ, ఆ వ్యక్తీకరణ సంవిధానాన్నీ కలిపి చూడవలసిందే తప్ప వేరు చేసి ఏదో ఒకదాని మీద వ్యాఖ్యానించడానికి వీలు లేదు.

“కథల్లో నేను వాస్తవవాదాన్ని ఇష్టపడతాను. అయితే ఒక గాయాన్ని, అవమానాన్ని, ఒక పశ్చాత్తాప గాథను చెప్పవలసి వచ్చినపుడు పూర్తి డాక్యుమెంటేషన్ కాక, రవంత ‘సర్రియల్ టచ్ ‘ కూడా అవసరమవుతుంది” అని,

“కథలోని భౌతిక నేపథ్యంతో పాఠకుడు ఐడెంటిఫై కాగలిగితేనే ఒక వాస్తవికమైన చిత్తరువును సృష్టించగలం. అట్లాగే కథలోని దుఃఖాన్ని, ఆర్తిని పాఠకుడు అనుభవించి పలవరించినపుడే అది ఇంపాక్ట్ కలిగించే డాక్యుమెంటు అవుతుంది. కథ వాతావరణానికి, పాత్రలకు పాఠకుడితో దగ్గరితనం పెరగాలి. ఆ దగ్గరితనంలోంచి గాఢత వస్తుంది” అని,

“సంఘటనల ఎగ్జిబిషన్ లా కథ రూపొందాలని నా ఆలోచన” అనీ,

“కథకు అవసరం లేని కాంప్లెక్సిటీ ఏర్పాటు చెయ్యబడింది” అనీ,

“ఈ టెక్నిక్ ద్వారా నేను సాధించదల్చుకొన్నది – ఒకటి, ఒక దుఃఖాన్ని పాఠకుడికి రిపిటీటివ్ గా ఇంజక్ట్ చెయ్యటం. రెండు – చిరపరిచితమైన సంఘటనని, అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల ద్వారా చెప్పిస్తున్నాననే భ్రాంతిని కలిగించటం, మూడోది – కథకుడి ఇంటర్ ఫియరెన్స్ ని చాలావరకు తగ్గిస్తున్నాననే భ్రమను పాఠకుడికి కలిగిస్తూ ప్రొటాగనిస్ట్ ని ప్రొజెక్ట్ చెయ్యటం, నాలుగోది – కథ నిడివిని తగ్గించటం” అనీ,

“ఈ రిపిటీషన్ తప్పనిసరి అవసరంగా నేను సమర్థించుకొన్నాను. ఈ పునరావృత దోషం చరిత్రదీ, మనుషులదీ, మానవ సంబంధాలదీ కూడా! ఒక అనాగరిక, ఆటవిక సామాజిక హింస పునరావృతం అవుతున్నంతకాలం అనుభవాల సామాన్యీకరణం తప్పనిసరి! ఒక డి-జావూ ఫీలింగ్ క్రియేట్ చెయ్యక తప్పదు” అనీ తన కథన పద్ధతి గురించి చంద్రశేఖర రావు స్వయంగా, వాచ్యంగా చెప్పుకున్న సూచనలు కీలకమైనవి. వాస్తవవాదం, రవంత సర్రియల్ టచ్ అవసరమైన అవమాన, పశ్చాత్తాప గాథ, భౌతిక నేపథ్యం, దుఃఖం, ఆర్తి, ఇంపాక్ట్ మీద దృష్టి, పాఠకులకు దగ్గరితనం కలిగించే ప్రయత్నం, గాఢత, సంఘటనల ఎగ్జిబిషన్, అవసరం లేని కాంప్లెక్సిటీని ఉద్దేశపూర్వకంగా కల్పించడం, అనాగరిక, ఆటవిక సామాజిక హింస పునరావృతం అవుతున్నప్పుడు కాల్పనిక సాహిత్య ప్రక్రియలు కూడ అటువంటి పునరావృతిని చిత్రించక తప్పదని అనుకోవడం వంటి అనేక అంశాలు ఆయన రచనలను అర్థం చేసుకోవడానికీ, విమర్శించడానికీ, విశ్లేషించడానికీ ఉపయోగపడతాయి.

సమాజ జీవితమే వైరుధ్యాల మాయం. ఒక అపశ్రుతుల పాట. ఈ వైరుధ్యాల్ని పరిష్కరించక తప్పదు. ఈ పాటను పాడకా, వినకా, సరిచేయకా తప్పదు. ఆ వైరుధ్యాలను, అపశ్రుతులను పాఠకులను కలవరపరిచేలా, ఆలోచింపజేసేలా, చెళ్లున చరిచి చెప్పి, ఆ వైరుధ్యాలను పరిష్కరించే, అపశ్రుతులను సవరించే ఆలోచనల వైపు, ఆచరణల వైపు నడపడమే చంద్రశేఖరరావు రచనల లక్ష్యమూ ప్రయోజనమూ.

*

ఎన్. వేణుగోపాల్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • డా. వి. చంద్రశేఖరరావును మరింత లోతుగా అర్థం చేసుకోడానికి మంచి పరికరాలను అందించిన వేణుకి అభినందనలు.
    ప్రయోగం అంటేనే ఆమడ దూరం జరగడం వల్ల చంద్రశేఖర రావు రచనలపై సమగ్రమైన అధ్యయనం జరగలేదు. ప్రయోజనోద్దిష్టమైన ప్రయోగం ఎప్పుడూ ఆహ్వనించదగిందే.
    కొత్త తరం రచయితలు అతని రచనల ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
    మనకాలపు మహా రచయిత తొందరపడి వెళ్ళిపోవడం అసలైన అపశ్రుతి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు