అన్నా… వేగుచుక్కై వెలుగు

వేప, చింత చెట్లపై అప్పటివరకూ సందడి చేసిన పక్షులు ఆహారాన్వేషణలో పయనమై వెళ్లిపోయాయి

పశువులు అంబా… అంబా… అరుపులతో చేలలోకి, పచ్చిక బయళ్ళలోకి బయలుదేరుతున్నాయి.

అప్పుడు, కోక్కొరొక్కో… కొక్కొరొక్కో… తెల్లవారింది లేవండన్నట్టు కూస్తున్నది కోడిపుంజు

‘కాలం గతి తప్పినట్టే, మనిషి మతి తప్పినట్టే ఉన్నది ఈ పుంజు ‘ మనసులో అనుకుంటూ నిన్న తెచ్చిన విత్తనపు సంచి విప్పాడు రైతు.  ఆ విత్తనం చేతపట్టి పరిశీలనగా చూస్తున్నాడు.  విత్తనం లోపలుండే బీజం దెబ్బ తింటే మొలక రాదేమోనని ఆ పరిశీలన.

నెత్తీనోరూ బాదుకుని ఎంతమంది చెప్పినా వినడే. ఎన్నిసార్లు చెప్పినా వినడే. దున్నబోతు మీద వానపడ్డట్లు…  అంతా నా ఖర్మ… ఖర్మ లోపలినుండి భార్య సణుగుడు వినిపిస్తూనే ఉన్నది.

మౌనిలా ఉన్న అతనిలో వేదన, ఆవేదన సుడులు తిరుగుతున్నది. నిన్న ఆకాశానికి ఎత్తిన నోళ్లే నేడు పాతాళానికి తొక్కేసే మాటలు.

నష్టాల బాట పట్టిన అతని వ్యవసాయాన్ని చూసి భార్యాబిడ్డలకి చులకన. యాభై నాలుగేళ్లకే వట్టిపోయిన గేదెలాగా కనిపిస్తున్నానేమో…  ఎగతాళిచేస్తున్నారు ఇంటా బయటా.

పొగసూరిన మనుషుల మధ్య బతకడం కష్టమే.

పొగసూరిన బతుకు వాళ్లదా… నాదా..?

నాదే. నాదేనేమో…

మనిషి విలువ అతని ఆర్ధిక పరిస్థితిని బట్టి మారిపోతుందా. సమాధానం వెతుక్కుంటూ ఆలోచనల సుడిగుండాలలో అతను  ఉన్న పొలం కౌలుకిచ్చేసి కృష్ణా రామా అనుకోకుండా, కొరివితో తల గోక్కుంటాడీ మనిషి. ఏం చెయ్యనురా… లోపలి నుండి భార్య గొంతు అతని చెవిలో పడుతున్నది.  ఈ విషయంలో ఇంట్లో రోజూ అనేక ఘర్షణలు, సంఘర్షణలు ఎదుర్కొంటున్నాడు.

రెక్కలొచ్చి పట్నం ఎగిరిపోయిన కొడుకులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారంటే ఈ మట్టి చలువే కదా.., ఈ మనిషి పిసికిన మట్టిలోంచి ఎదిగినవాళ్ళే కదా…, పాలు తాగి తల్లి రొమ్ము తన్నినట్టున్నది పిల్లల వ్యవ్యహారం.

పాతఫోటో ఫ్రేమ్ కట్టి దాచుకున్నట్టు తనని తాను దాచుకోలేడు.  ఈ రైతు మనసు వాళ్ళర్ధం చేసుకోరు.

రైతంటే ఎవరు? తలొంచుకుని మట్టిలోకి చూస్తూ సకల సంపదలను, విలువలను, విశ్వాసాలను ఉత్పత్తి చేసే వ్యక్తి.

తాము మన్ను తింటూ లోకానికి అన్నం పెట్టే వ్యక్తి.

తల్లి నవ మాసాలు మోసి బిడ్డను కన్నట్టే రైతు ఆరుగాలం కష్టపడి పంట తీస్తాడు.  అయినా పండంటి బిడ్డని ఇవ్వలేని తల్లి స్థితిలా ఉంది రైతు పరిస్థితి. ఆ తల్లి పడే వేదన అనుభవిస్తున్నాడు.

మట్టిని నమ్ముకున్న మనిషి మట్టిని, మట్టితో పెనవేసుకున్న బంధాన్ని వదిలి ఉండడమంటే బతికిలేనట్టే గదా…

రైతు ఎప్పుడూ తను బతుకుతూ నలుగురినీ బతికించాలని తాపత్రయ పడతాడు.  కానీ, గత మూడేళ్ళుగా వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోతూనే ఉన్నాడు. అయినా ఆశ. ఈ ఏడాదైనా మంచి పంట తీయగలనని ఆశ.  ఆ ఆశే నడిపిస్తున్నది. ఆ ఆశతోనే విత్తనం తెచ్చాడు. సాహసం చేస్తున్నాడు.

కానీ, విత్తనమే మొలకెత్తకపోతే.., మోసం చేస్తే.., మొలకెత్తిన విత్తనం కూడా సరిగ్గా ఎదగకపోతే, చీడపీడలు ముంచెత్తుతుంటే తనేం చేయగలడు.

గతేడాది విత్తనం మొలకెత్తలేదు. మొలకెత్తిన విత్తనం కూడా సరిగ్గా ఎదగలేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు.

అంతకు ముందటేడాది బాగా దుబ్బుచేసి పంట బాగా వస్తుందనుకున్న సమయంలో వచ్చిన అగ్గితెగులు.. ఫంగస్ ఎడాపెడా దాడి చేయడంతో ఆరు సార్లు క్రిమిసంహారాలు వాడవలసి రావడం. మొక్కజొన్నకి అంతే కండె వేసి గింజపాలు పోసుకుంటున్నసమయంలో దాడిచేసిన రోగాలు. ఎన్ని మందులు కొట్టిన ఏం ప్రయోజనం..?

పత్తి మొక్క గిడసబారిపోయింది.  కలుపు బాగా పెరిగింది.  కలుపు మందులు చల్లితే అప్పటికి మాడినట్లయి పిలకలేసి మళ్ళీ వచ్చేది.  అసలు మొక్క నాశనమయ్యేది

అంతకు ముందటేడు పొలం ఈనింది. పెద్ద పెద్ద కంకి వచ్చింది. పాలు పోసుకునే దశలో వచ్చిన రోగంతో తాలు ఎక్కువైంది. అన్ని అవరోధాలు ఎదుర్కొంటూ కాస్తో కూస్తో చేతికి వచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధరలేక నష్టం తప్పలేదు.

ఈ ఏడాది ఏమవుతుందోననే భయం మనసులో వెంటాడుతున్నది.  అయినా విత్తాల్సిందే. మబ్బుల వెనక సూర్యుడు ఎన్నిరోజులు దోబూచులాడతాడు. ఏదో ఒకరోజు బయటికి రావలసిందే కదా. అట్లే నాకు మంచిరోజు వస్తుందని విత్తనం తెచ్చాడు.

వెలవెల బోతున్న తన పొలం కళ్ళముందు నిలిచిందతనికి.

కళకళలాడాల్సిన భూతల్లి కన్నీరు పెడుతున్నది. తన శక్తి చాలదంటున్నది.  దాన్ని పరిపుష్టం చేయడానికి శక్తికి మించిన ఖర్చుతో, దొరికిన చోటల్లా అప్పు తెచ్చి ఎరువులు తెచ్చి పోస్తున్నాడు. సేద్యం చేస్తున్నాడు.  ఎకరాకరవై పుట్లు పండించిన తన ఘనత నిన్నలలో కలిసిపోయింది.  సేద్యం జూదంగా మారిపోయింది. దీర్ఘంగా నిట్టూర్చాడు రైతు.

దోసిట విత్తనపు గింజలతో ఉన్న రైతును గతం తాలూకు వేదనలు, ఆవేదనలు మేఘంలా కమ్ముకుంటున్నాయి.  తీవ్ర వేదనకు, సంఘర్షణకు గురిచేస్తున్నాయి. పచ్చని చెట్లు ఉరికంబాలై వెక్కిరిస్తున్నాయి. ఏవేవో ఘటనలు, సంఘటనలు కళ్ళముందు కదలాడుతూ కలవరపరుస్తుండగా వాటినుండి తప్పించుకోవడానికి ఇంటి వెనుక వాకిట్లోకొచ్చాడు.  దోసిట ఉన్న విత్తనాలను తేరిపారచూస్తున్న వాడల్లా తలెత్తాడు.

వాకిట్లో కుడివైపున ఉన్న రోటి దగ్గర వేసిన రాయి రోహిణి ఎండలకు రెండుగా విచ్చుకుంది.  ఆ రాళ్ళ నడుమకు చింత గింజ ఎప్పుడు చేరిందో… ఎలా చేరిందో…

విత్తనంలోంచి మొలక తలెత్తి ఆకాశంకేసి చూస్తున్నది. భవిష్యత్ పై కొండంత ఆశతో కనిపిస్తున్నది.

బతకాలనే ఆ విత్తనపు ఆశ బండరాయిని ఓడించిందేమో…

ఎంత గడ్డుపరిస్థితుల్లో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నదీ విత్తనం.  అలా కొన్ని క్షణాలు ఆ చింత మొలకనే చూస్తున్నాడు. అది తనకేదో ఉపదేశం చేస్తున్నట్టుగా అనిపించిదతనికి.  ఉత్తేజితుడవుతుండగా…

“ఏమిటీ అంత దీర్ఘాలోచన.

విత్తనం మోసం చేస్తుందేమోనని భయపడుతున్నావా రైతన్నా. విత్తనం మోసకారి కాదు, జిత్తులమారి అంతకంటే కాదు”    .

అప్పటివరకూ ఎడతెగని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతు ఉలిక్కిపడ్డాడు. కళ్ళు చికిలించి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. మరి ఎవరిదాగొంతు. అర్ధం కాలేదు.

“అన్నా.., చెమటచుక్కల్లో పచ్చని చందమామల్లే ఉండే నీ నేస్తాన్నే” ఎవరన్నట్లుగా చుట్టూ చూసాడు.

ఎవరూ కనిపించడం లేదు.

ఎదుట కాస్త దూరంగా ఉన్న కొండవాలు ఫక్కున నవ్వినట్లనిపించింది రైతుకి.  నాలుగు చినుకులు పడగానే పచ్చదనం నింపుకున్న పచ్చిక బయళ్లు.

ఆ పచ్చటి పచ్చికలో అక్కడక్కడా తెల్ల కొంగలు, తెలుపు నలుపు కలిసిన బూడిదవర్ణపు కొంగలు, నలుపు జీరలున్న తెల్లకొంగలూ, పచ్చిక మేస్తూ ముందుకు సాగుతున్న పశువులు అవి దగ్గరవుతుండడంతో ఒక్క ఉదుటున ఎగిరే కొంగలు.  నీటిగుంటలో ఒంటికాలిపై జపం చేస్తున్న కొంగలు.

కళ్ళు చించుకు చూసినా అవే కనిపిస్తున్నాయి.

తాను విన్న స్వరం ఎవరిదో అర్ధం కాలేదు రైతుకి.  తన ఇంటి వెనక గుమ్మంలోంచి మరో రెండడుగులు ముందుకేశాడు.

మమ్మల్నీ కాస్త పట్టించుకొమ్మన్నట్లుగా చూస్తున్నాయి గిడసబారిపోయిన వంగ, బెండమొక్కలు

పచ్చని చందమామనా… హూ…

ఈ మొక్కల్లాగే గిడసబారిన బతుకు తనదీనూ… అనుకున్నాడా రైతు.

మారుమూల ప్రాంతంలో విసిరేసినట్టున్న చిన్న గ్రామంలో ఈ దివాళా రైతు దగ్గరకొచ్చి పలకరించిందెవరో అర్ధం కాలేదు.  చేతిలో ఉన్న విత్తనాలకేసి చూస్తూ నెమ్మదిగా గొంతు పెగుల్చుకుని

“ఈ సారయినా నన్ను కరుణించు తల్లీ, లేకపోతే…” మనసులో భావాలు పైకొచ్చేస్తున్నాయి

“ఊ…లేకపోతే” రెట్టించింది స్వరం.

“ఎవరదీ..? చుట్టూ చూశాడు రైతు

“వానల్లో వరదల్లో బురదజిల్లిన మసక జాబిలల్లే ఉన్న నీ బాధను నేను అర్ధం చేసుకోగలను. నువ్వే నన్నర్ధం చేసుకోవడం లేదు” కంచు కంఠం

ఎవరదీ.., నేనెప్పుడూ వినని గొంతు అనుకుంటూ చుట్టూ పరికిస్తూనే “నేనా..?” అంటూ తెల్లబోయాడు రైతు

తానేం చేశాడో అర్ధం కాక దోసిట విత్తనాలతో నట్టింట్లో కెళ్ళి బల్లపై చతికిల పడ్డాడు.

టీవీలో తమ కంపెనీ విత్తనాలు వాడమంటూ ప్రకటన ఊదరగొడుతున్నది.   ప్రతి రోజూ టీవీలో ఊదరగొడుతున్న విత్తన కంపెనీల ప్రకటనలు చూస్తూనే ఉన్నాడు. అందులోంచి ఒక కంపెనీ ఎంచుకుని విత్తనం తెచ్చాడు.  ఎదపెట్టడానికి భూమి సిద్ధం చేసుకున్నాడు.

ప్రకృతి ప్రసాదించిన వరం విత్తనం. మానవ మనుగడకు ఆధారం విత్తనం.

విత్తనం లేకపోతే రైతుకు మనుగడే లేదు. దోసిట్లో విత్తనాలను కళ్లదగ్గరకు తీసుకుంటూ కళ్ళకు అద్దుకున్నాడు రైతు.

“హ్హా…హ్హ్హా …” పగలబడి నవ్వింది స్వరం

తానేమన్నాడని ఆ నవ్వు… ఎందుకింత పగలబడుతున్నది.  అర్ధంకాక రైతు బుర్ర గోక్కున్నాడు.

బుంగ మూతి పెట్టి “ఓయ్.., ఎందుకలా నవ్వుతావ్? నామనసులో మాట చెప్పినందుకా…”   విత్తనాల దోసిటను గుండె దగ్గరకు చేర్చుకుంటూ అడిగాడు రైతు.

ఆ విత్తనాలను చూస్తుంటే చేతిలో ఉన్న గుప్పెడు విత్తనాల్లో ఏదో తనతో మాట్లాడుతున్నట్లు సందేహం వచ్చి మూసిన దోసిట తెరిచి మళ్ళీ విత్తనాలకేసి పరీక్షగా చూశాడు.

నిశ్శబ్దంగా కనిపిస్తున్న వాటిని తీసుకెళ్లి విత్తనాల సంచీలో పోశాడు.  జారిపడ్డ రెండు గింజల్నీ ఏరి సంచిలో జాగ్రత్తగా వేశాడు. సంచి మూతి తాడుతో బిగించాడు.  పట్టిన గ్రహణం ఈ ఏడాదైనా వీడుతుందా అనుకుకున్నాడు.

“నీ అమాయకత్వం చూసి నవ్వాను, నవ్వొద్దంటావా? ఊ…” మళ్ళీ నవ్వు. తర్వాత

“నువ్వన్నది నిజమేనోయ్. మానవ మనుగడకు ఆధారం విత్తనం.  మరి ఆ విత్తనాన్ని మీరు కాపాడుకుంటున్నారా…” ప్రశ్నించింది స్వరం. వీపు మీద ఎవరో కొరడాతో చరిచినట్లనిపించింది రైతుకు.  అంతలోనే ఉక్రోషం పొడుచుకొచ్చింది.

“ఎందుకు కాపాడుకోవడంలేదూ.., కాపాడుకుంటున్నాం” టక్కున జవాబిచ్చాడు.

“కాపాడుకుంటున్నావా… హ్హా హ్హా… లేదన్నా..,

విత్తనం మీచేతుల్లోంచి ఎప్పుడో జారిపోయిందిగా…”

“జారిపోయిందా…” అంటూ విత్తనాల సంచీకేసి చూశాడు. జారిన రెండు గింజలూ ఆ సంచిలోనే వేశాడు.  కింద ఒక్క గింజకూడా కనిపించడం లేదే

ఈ మాటల్లోని మర్మం ఏమిటో అన్నట్టుగా ఆలోచిస్తూ ముందు వాకిట్లోకి నడిచాడు.  చుట్టూ పరికించాడు.  ఎవరూ అగుపించలేదు.  వరండాలో వాల్చి ఉన్న వాలుకుర్చీలో వాలాడు.

“అవునన్నా.., నవ్వులాట కాదు. సీరియస్ గానే అంటున్నా.

వేలాది సంవత్సరాలుగా రూపాంతరం చెందుతూ, ప్రకృతి సహజంగా తానున్న ప్రాంతం, వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి తనను తాను మలుచుకుంటూ మీకు అందుబాటులో ఉన్న విత్తనాన్ని మీరెప్పుడో చంపేశారు కదన్నా..” అన్నది స్వరం

“విత్తనాన్ని చంపడమేంటి..?

నువ్వూ నీ పిచ్చిమాటలూ ఆపు…  రైతన్నవాడు విత్తనాన్ని చంపుకుంటాడా..?

వ్యవసాయమొక సృష్టి.  అదో జీవన విధానం. అదో సంస్కృతి.

నీకు తెలియదేమో.., మానవ నాగరికతా వికాసమంతా నాగలి కర్రు నుంచి ఉబికి వచ్చింది. నెగేటి సాళ్లలో వేసిన విత్తనం నుంచి ఎదిగింది.

విత్తనమే మా సంస్కృతిని రూపొందించడంలో కేంద్ర బిందువు.

మా ఆచార వ్యవ్యహారాల్ని చూడు. అన్నీ విత్తనం ఆధారంగానే, ధాన్యం కేంద్రంగానే కనిపిస్తాయి. అది భారతదేశమయినా, ఆఫ్రికా అయినా, లాటిన్ అమెరికా అయినా విత్తనమే మా జీవితం.

విత్తనాన్ని నాటతాం. కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తాం.   విత్తనం అందించే ధాన్యం మా ఆహారం కోసమే కాదు. విత్తనమే మాకు జీవితాన్ని నేర్పిస్తుందని అనుకుంటాం. అందుకే మా నిత్య జీవితంలో, మా ఆచార వ్యవహారాల్లో ప్రధానంగా విత్తనం కనిపిస్తుంది.  విత్తనమే మా జీవితం” కించిత్ ఆవేశంగా అన్నాడు రైతు

“అహ్హహ్హా… హ్హహ్హా…” మళ్ళీ పగలబడి నవ్విందా స్వరం

“గ్లేయిసెల్, రౌండప్ కలుపు మందు నీ గడపతొక్కిందిగా.  డబ్బులు బాగాపోసి తెచ్చినట్టున్నావుగా.

బిటి విత్తనాలు నీ ఇంటికి, నీ చేలోకి చేరినట్లే. అదీ నీ చేలోకే కదన్నా” కొన్ని క్షణాల మౌనం తర్వాత

“ఓసి పిచ్చి సన్నాసీ… నువ్వు కొట్టే కలుపు మందు నువ్వు నాటిన మొక్కని నాశనం చెయ్యదని ఎట్లా అనుకున్నావ్?  నేలలో ఉండే వానపాములు, సూక్ష్మజీవులను పెంపొందించే జీవవైవిధ్యం నాశనమవదని ఎలా అనుకున్నావ్.

ప్రకృతి వ్యవస్థలో భూమి, మొక్కలు, సూక్ష్మజీవులు, అన్నీ అంతస్సంబంధం కలిగిన బుద్ధిశాలులే. ప్రకృతిలో అంతర్భాగమైన సహజీవన సంబంధాన్ని ప్రజలు గుర్తెరిగినప్పుడే సమాజం, భూమి, పర్యావరణం ఆరోగ్యవంతంగా ఉంటాయి”

“ఏహే… ఆపు నీ సొద

ఎవరో చెప్పవు. ఏదో నా సొంత తమ్ముడైనట్టు అన్నా అన్నా… అంటూ అడ్డం దిడ్డంగా వాగుతావు” అసహనంతో అరిచాడు రైతు

ఆ అరుపుకి రైతు భార్య నీరసంగా వచ్చి అటూ ఇటూ చూసింది. ఎవరూ కనిపించలేదు.

ఖర్మ ఖర్మ అంటూ కుడిచేత్తో నుదిటిమీద చిన్నగా తట్టుకుంటూ, ఈ మనిషితో ఎట్టా వేగాలో… పిచ్చి కూడా మొదలైపోయింది. ఉన్న అనారోగ్యాలకు తోడు ఇది కూడానా. అనుకుంటూ లోనికిపోయింది.

“అయ్యా… అమాయక చక్రవర్తీ… నీకెలా చెప్పను.?!

నీకు అర్థమయ్యేటట్లు చెప్పగలనో లేదో. కోపగించుకోకుండా సావధానంగా వినన్నా

నీ మేలుకోరి నీతో సంభాషిస్తున్నా. నన్ను మాట్లడనీ ప్లీజ్”

కొద్ది క్షణాల మౌనం తర్వాత “వ్యవసాయంలో వేళ్లూనుకుని ఉన్న ప్రాచీన జీవన మూలాలు ఇప్పుడున్నాయా.? ఒక్కసారి విత్తనంలోకి తొంగి చూడు. ‘అసలు’ విత్తనం ఉన్నదా…

ఒకప్పుడు వివిధ ప్రాంతాల్లో, వివిధ నేలల్లో, వివిధ వాతావరణాల్లో రైతులు వేసిన పంటల్లో గొప్ప జీవవైవిధ్యం అందేది.  మీరు స్వతంత్రంగానో, మీ స్వతంత్ర వ్యవ్యస్థల ద్వారానో కొత్త కొత్త ఆలోచనలతో రకరకాలుగా అభివృద్ధిపరుచుకున్నారు.  మీ చేతుల్లో విత్తనం గర్వంగా ఒదిగిపొయ్యేది.

మీరు రూపొందించుకొని అభివృద్ధిపరుచుకున్న సంప్రదాయ జ్ఞానం, విజ్ఞానం అంత గొప్పగా ఉండేది మరి!

మీరు ఆడైనా మగైనా పని చేస్తున్న క్రమంలో ప్రతి ఏడాదీ విత్తనం తీసిపెట్టుకున్నారు.  సాంప్రదాయ పద్ధతుల్లో భద్రపరుచుకున్నారు.  విత్తనంలో ఇమిడి ఉన్న సూక్ష్మ జ్ఞానం నీకు జీవితాన్ని తెలుపుతుందని అనుకున్నావు ఆనాడు.

నీ బాల్యంలోకి తొంగి చూడు. వాళ్ళు తీసి పెట్టిన విత్తనం నీకు దర్శనం ఇస్తుంది.

అది విత్తనం ఒక్కటే కాదు, నాణ్యమైన ఆహారం అందించేది. పోషకాహారం అందించేది.

అందుకే జీవ వైవిధ్యం కాపాడే పంటలు పండించేవారు మీరు.

నిజానికి సేద్యం చేసే రైతు అంటే మామూలు వ్యక్తా…చెప్పు

నేల వెన్నుపూస. నీలో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఒక అన్వేషకుడున్నాడు. ఒక సహజ వనరుల పరిరక్షణవేత్త ఉన్నాడు.  ఒక విత్తన పరిరక్షకుడున్నాడు.  హైబ్రీడీకరణ నిపుణుడున్నాడు. ఒక సాహసి ఉన్నాడు. ప్రకృతిని మాలిమి చేసుకున్న ప్రేమికుడున్నాడు. అటువంటి విశిష్టతలు కలిగిన నువ్వు విదేశీ కంపెనీల ముందు మోకరిల్లావ్.  దేబిరించే స్థాయికి దిగజారిపోయావ్.  వినియోగదారుడి స్థాయికి కుంచించుకుపోయావ్.  జాలేస్తున్నదయ్యా నిన్ను చూసి” అన్నదా స్వరం

రైతు ఛాతీ కించిత్ గర్వంతో ఉప్పొంగి ముఖంలో వెలుతురు ప్రసరించిందల్లా గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయాడు.

“నేను దేబిరించటం ఏంటి.  రైతు నలుగురికీ కడుపు నింపుతాడు. కానీ దేహీ అని ఎప్పుడూ అనడు” కోపంగా రైతు

“అనకపోవడం ఏంటీ… అంటూనే ఉన్నావ్ గా. మార్కెట్ మాయాజాలం ముందు చేష్టలుడిగిన పసివాడిలా విత్తనం కోసం క్యూ కట్టి పడిగాపులు పడి తెచ్చుకోలేదూ…

అట్లాగే ఎరువులు, క్రిమి సంహారాలు నీ ఇంటికి చేర్చుకోవడం లేదూ… వెన్ను విరగ్గొట్టుకోవడం లేదూ రెట్టించింది స్వరం

“నా సొమ్ములు పెట్టి నేను కొనుక్కున్నా. అడుక్కోలేదు. అర్ధమయిందా “రైతు గొంతులో ఆవేశం, అసహనం

“అదే అన్నా,నేను విన్నవించుకునేది.  ఈ మారుమూల కొండల్లోకి కూడా రోడ్లు వచ్చాయి. సైకిళ్ళు, ట్రాక్టర్లు, ట్రక్కులు మొదలయ్యాయి. కొన్ని సుఖాలతో పాటు కష్టాలూ మొదలయ్యాయి”

“నీకే ఏదో ఆం…తా తెల్సి ఉన్నట్టు..? సంబంధంలేని వాగుడు” ఎగతాళిగా గద్దించాడు రైతు

“ఉందయ్యా ఉంది. సంబంధం ఉంది.  సంబంధం ఉన్న ముచ్చట్లే నేను చెప్పేది. నీకు నాకు మధ్య కూడా సంబంధం ఉంది. మన మధ్య బంధమేంటో తర్వాత మాట్లాడుకుందాం గానీ…

సౌకర్యాలు నీకు అందుబాటులోకి వచ్చాక నీ వ్యవసాయంలో సంప్రదాయంగా నువ్వు అభివృద్ధి పరచుకుంటూ వచ్చిన నైపుణ్యాలు, పద్ధతులు వల్లకాట్లో కలిశాయా లేదా… ఆ స్థానంలోకి పెద్ద పెద్ద యంత్రాలొచ్చేశాయా లేదా” నిలదీసింది స్వరం

నిజమే ఎడ్లు బండ్లు పోయాయి. కాడి వల్లకాట్లో కలిసింది మనసులో అనుకుంటూ “అసలు నీ బాధ ఏంటో” అంటూ భుజం మీది తుండుగుడ్డ ఒక్కసారి విదిలించి మళ్ళీ వేసుకున్నాడు రైతు. అతనిలో అసహనం పెరిగిపోతున్నది.

“నేను చెప్పేది నీకు అసంబద్ధంగా అనిపిస్తుందేమో… కానీ, నేను చెప్పకుండా ఉండలేను” అన్నది స్వరం

మళ్ళీ ఆ వెంటనే “ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు నోరు విప్పాను.  నాలో రగులుతున్న వ్యధనంతా ఈరోజు నీతో పంచుకోవలసిందే. అంతా విన్న తర్వాత ఏమి నిర్ణయించుకుంటావో నీ ఇష్టం.

“నువ్వెవరో గానీ, నువ్వూ నాలాగే బాధల్లో ఉన్నట్లున్నావు. సర్లే చెప్పు . నా వల్ల నీకు ఇసుమంతయినా ఓదార్పు లభిస్తుందనుకుంటే …” సయోధ్యతో రైతు

“రెండో ప్రపంచ యుద్ధం గురించి విన్నావా..?” చిన్నప్పుడు చదువుకున్నవి గుర్తొస్తుండగా ఊ అన్నట్లు తలూపాడు రైతు.

“ఆ సమయంలో ప్రపంచం యుద్ధ అవసరాలకోసం కొత్త కొత్త రసాయనాలు తయారుచేసుకుంది.  యుద్ధం ముగిసింది. రసాయనాలు చేతిలో ఉన్నాయి. వాటిని ఏమి చెయ్యాలి..?  ప్రశ్నించుకుంది. ప్రయోగాలు చేసింది.

రసాయనాలను ఉపయోగంలోకి తీసుకొస్తూ వాటితో ఎరువులు, పురుగు మందులు తయారు చేయడం మొదలు పెట్టింది.

అధిక దిగుబడులు రావాలంటే రసాయన ఎరువులు వాడాలని రైతులకుపదేశించింది.  రసాయనాల వాడకం ద్వారా అధికదిగుబడి, ఆహార భద్రత, ఆర్థికాభివృద్ధి చెందవచ్చని నమ్మబలికింది.

మనిషి ఎదగాలంటే మనిషికి ఆహరం కావాలి.  మనిషిలాగే భూమికీ ఆహరం కావాలి.  రకరకాల ఆహారం కావాలి.

నీ పూర్వీకులు ఎప్పుడూ ఆహారంగా రసాయనాలు వాడలేదు. పెంటతో పంట పండించేవారు.  అదను ఎరిగి సేద్యం చేసేవారు.  పదను ఎరిగి పైరు వేసేవారు.

అవన్నీ వదిలి ఎప్పుడైతే రసాయన ఎరువులు, పురుగు మందులు రైతు ముందు వాలిపోయాయో, వాటిని వాడడం మొదలైందో, అప్పటి నుంచీ మీరు వేలవేల సంవత్సరాలుగా రూపొందించుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన జ్ఞానసంపద అంతా తుడిచిపెట్టుకుపోవడం మొదలైంది.

మత్తుకు బానిసైన మనిషిలాగే నేలతల్లి రసాయనాలకు బానిస అయింది.

ఇక ఇప్పుడు రసాయనాలు లేకపోతే బతుకు లేదన్నట్టు తయారయింది.  ఒక సీజన్లో వాడిన రసాయన ఎరువులకు మరింత ఎక్కువ రసాయనాలు నేలతల్లి శరీరంలో నింపకపోతే పంట చేతికి రావడంలేదు. అందుకే రసాయన ఎరువులు రోజు రోజుకీ పెంచుకుంటూ పోతున్నావు.  వేరే మార్గం లేదు కదా మరి!

రసాయనాలు వాడడం మొదలు పెట్టాక విత్తనం నిల్వ చేసే పద్ధతీ మారింది.  సహజ విత్తనానికి బదులు హై బ్రీడ్ విత్తనాలు ముందుకొచ్చాయి. ప్రకృతి సహజంగా జరిగిపోయే విత్తన చక్రంలో మార్పులొచ్చాయి.  జన్యుపరంగా ఉన్నతమైన విత్తనాలు మాయమవడం మొదలైంది.  కొత్త కొత్త జన్యువులతో సంకరం చేయడం జరిగింది. ఆహార భద్రత పేరుతో మానవ మేధస్సు నుండి పుట్టుకొచ్చిన కొత్త కొత్త వంగడాలు రాజ్యమేలడం మొదలైంది.  ఇంకేముందీ, గద్దలు, రాబందులు విత్తనం మీద వాలాయి. తన కబంధహస్తాల్లోకి చిక్కించుకున్నాయి.

మానవ మనుగడకు బీజం మూలాధారం. పాతాళ సాగుకు, పర్యావరణ సమతౌల్యానికి అవసరమైన చెట్టుచేమల వృద్ధికి బీజం ప్రధానం. వ్యవసాయరంగానికి విత్తనం ప్రాణసమానం. కానీ ఇప్పుడా విత్తనం రైతు చేతుల్లో లేదు. సొమ్ములు పెట్టి కొనుక్కోవలసిందే.  జీవన మూలాలను పెట్టుబడి పెళ్లగిస్తున్నది.

ప్చ్… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్థానిక, సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో పెనుమార్పులు.

తక్కువ శ్రమతో, ఎక్కువ ఉత్పత్తి   చేయండంటూ కలలు అమ్ముతూ మీ చేతిలోని విత్తనాన్ని మాయం చేసేసాయి మాయదారి కంపెనీలు. నీ పరిస్థితి గాలిలో దీపమైంది మిత్రమా. విత్తనం త్రిశంకు స్వర్గంలో వేలాడుతోంది.

నీ తాతల కాలంలోకి వెళ్లి ఒక్కసారి చూడు. వాళ్ళు అచ్చమైన రైతులు.  నలుగురికీ తిండిపెట్టే పంటలు పండించారు.  పొట్ట నింపడమే కాదు ఆరోగ్యం పంచే పంటలు పండించారు. మరిప్పుడు నువ్వేం చేస్తున్నావ్.

డబ్బు పెంచే పంటలు, అదేనయ్యా వ్యాపార పంటలు అంటున్నావ్. ఎక్కువ రాబడి లక్ష్యంగా పంటలు వేస్తున్నావ్. కలలు కంటున్నావు. పోనీ నీ కలలు తీరుతున్నాయా?

ఊహూ, కల్లలే అవుతున్నాయి.

ఎందుకు? ఒకప్పటి రైతు ఉన్నంత సుఖంగా నువ్వుంటున్నావా… లేదు.

దేశ ఆర్ధిక వ్యవస్థ బాగుండాలంటే రైతు బాగుండాలి.  రైతు బాగుండాలంటే రైతుకు నాణ్యమైన విత్తనం అందాలి.

మీతాతను చూస్తే.., తన విత్తనం తానే చేసుకున్నాడు.

తన పొలంలోకి ఎరువు తానే చేసుకున్నాడు.

విత్తనం వేసేవాడు. వచ్చిన పంట తీసుకునేవాడు.

రసాయన ఎరువులు, పురుగుమందులు, విత్తనం ఖర్చులేనే లేదు. అది మన వ్యవసాయ సాంప్రదాయం.

అధిక దిగుబడుల పేరుతో వచ్చిన సంకరజాతి విత్తనాల కోసం మీ నాన్న ఆ పద్దతి వదిలేశాడు.

ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గుచూపాడు.  విజ్ఞానం విస్తరించింది కానీ సదుపాయం కలుగుతున్నదా..? రైతు అనందం పెరుగుతున్నదా. లేదే…

శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానం అవసరమే. ఎంతవరకూ..,

అది మనకు మేలు చేసినంతవరకూ. అదే మనని వినాశనం వైపు మళ్లిస్తుంటే..? చూస్తూ అలాగే ఉండగలమా..? చెప్పు.

ఇదిలా ఉంటే మరోవైపు నుండీ పర్యావరణానికి ముంచుకొస్తున్న పెను ప్రమాదం గుర్తించి రసాయనాల వాడకం తగ్గించడం మొదలైంది. ఆధునిక సాగు విధానాలు ఎన్నో అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు రైతులు పర్యావరణ హితమైన సేంద్రియ వ్యవసాయంతో ప్రకృతి సిద్దమైన సాగు పద్ధతులే అవలంబిస్తున్నారు.

ఇప్పుడిప్పుడే కొందరు రైతులు విత్తనాలను ఉత్పత్తి చేసి మిగిలిన రైతులకు అందించే వ్యవ్యస్థలు ఏర్పరచుకునే విధానంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిచోట్ల వ్యవసాయ శాఖ వారి ప్రోత్సాహం కూడా తోడైంది.

నువ్వూ ప్రకృతి వ్యవ్యసాయ పద్ధతులతో సేంద్రియ స్వయం సమృద్ధి చేసుకోలేవా..?

“కాకికి కారోబార్ తనం ఇస్తే కోటంతా నాదే అన్నదట. అట్లున్నది” అప్పటివరకూ శ్రద్దగా విన్న రైతు

“అయ్యా.. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో కానీ అది నిజం.

డేగ కంపెనీలు చేసిందదే. ఇప్పుడు, నువ్వు ప్రతి సీజన్ లోనూ విత్తనం కొనాల్సిందే కదా.

లక్షల రకాల విత్తనాలుండేవి ఒకప్పుడు.  ఆ విత్తన వైవిధ్యమంతా గత వైభవం.  నేడు నకిలీలు రాజ్యమేలుతున్నాయి.

నాణ్యమైన విత్తనమని అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి జన్యుమార్పిడి విత్తనాలో, ఆధునిక రసాయనాలు పూసిన విత్తనాలో, రసాయనాలతో శుద్ధి చేసిన విత్తనాలో అవుతున్నాయి.

అధిక దిగుబడి ఏమో కానీ వాటికి పచ్చే చీడ పీడల నుంచి పంటను కాపాడుకోవడానికి, రసాయనాలతో సత్తువ కోల్పోతున్న భూమిలో బలం నింపడంకోసం మరింత ఎక్కువ రసాయన ఎరువులు పోస్తూ పుడమి తల్లిని సుసంపన్నం చేయడానికి తపన పడుతూనే ఉన్నావ్.. అయినా ఆశించిన ఫలితం పొందడం లేదు.

మీ తాతకి శ్రమ ఉండేదేమో కానీ మానసిక వేదన ఉండేది కాదు. తుండు గుడ్డేసుకుని ఆ పొలం గట్లమీదే హాయిగా పడుకొనేవాడు. ఆనందంగా గడిపేవాడు. నువ్విప్పుడట్లా పడుకోగలవా.., లేదు. పడుకోలేవు.

నీ దగ్గరకొచ్చేసరికి అధిక ఆదాయం కోసం వ్యాపార పంటల్లోకి వెళ్లిపోయావ్.  వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చేశావ్. ఆదాయం ఏమో మనశ్శాంతి లేకుండా అస్థిమితంతో సతమతమవుతున్నావ్.

నువ్వు పండించే పత్తి విత్తనంలో ఒకే ఒక్క జీన్ పెట్టడం ద్వారా పత్తి విత్తన సంస్థ వేలకోట్లు తన జేబులో వేసుకుంది.  అట్లా లక్షల కోట్ల విత్తన వ్యాపారం జరుగుతున్నది.

అంత సంపదని ఈ ప్రపంచానికి విత్తనం అందిస్తున్నదని సంతోషపడాలా,

ఆకంపెనీల వాళ్ళు ఆవ విత్తు వేసి తాటి విత్తుగుంజుకు పోతున్నారని, నీ జేబు ఖాళీ చేస్తున్నారనీ బాధపడాలో తెలియని స్థితి విత్తనానిది.  అదంతా ఎవరి సొమ్ము, నీ సొమ్మేగా?!

రాబోయే రోజుల్లో వచ్చే తెగుళ్లు తట్టుకునే శక్తి విత్తనానికి ఉండాలి.  నానో టెక్నాలజీ ద్వారా విత్తనంలో ఎన్నో మార్పులు చేస్తున్నారు. ఎన్నో రకాల టెక్నాలజీలు విత్తనంలో పొందుపరుస్తున్నారు.  ఉపయోగిస్తున్నారు. అదంతా అభివృద్ధి అని నిను భ్రమింపచేస్తూ నిన్ను పీల్చి పిప్పి పిప్పి చేస్తున్నారని గమనించడంలేదు నువ్వు. ”

స్వరం మాటలకడ్డు తగులుతూ “అంటే.., ఊళ్ళోకి, రైతు ఇంట్లోకి వచ్చేదాకా ఊరపిల్లిలా ఉన్నకంపెనీ ఊళ్లోకి, రైతు ఇంట్లోకి చొరబడ్డాక గండుపిల్లి అయిపొయిందంటావ్. అంతేనా…” ఏదో అర్ధమయినట్టు అన్నాడు రైతు.

“హమ్మయ్య.., ఇందాకటి నుంచీ నా కంఠశోష ఊరికే పోలేదు, నీ బుర్రలోకి ఇంకుతాంది” నవ్వింది స్వరం

“అది సరేగానీ.., చెప్పు చెప్పు” తొందరపెట్టాడు రైతు

“ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా విత్తనాలు ఫ్యాక్టరీలలో పండవు.  విత్తనాల కంపెనీలలో పండవు.  రైతుల పొలంలోనేగా పండుతాయి.  విత్తనాలు వాడుకునేది రైతులే.

ఆ పంట పండించిన రైతు పొలాల్లోంచి విత్తనం సేకరించి ఫ్యాక్టరీలో రసాయనాలతో ప్రాసెస్ చేసి, చక్కటి కవర్లలో పాకింగ్ చేసి మళ్ళీ రైతులకి అమ్ముతున్నారు.  అంటే విత్తనాలు పండించేది రైతులే. విత్తనం వాడుకునేది రైతులే

అయినా విత్తనం, విత్తనోత్పత్తి రైతు చేతుల్లో లేదు.  కొందరి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది.

జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చింది.  కొత్త కొత్త జన్యువుల్ని కనుగొంది. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం డేగలు, గద్దల చేతుల్లో చిక్కింది. అవి నీకు కలలను అమ్ముతూ కాష్ చేసుకోవడం మొదలైంది.

ప్రకృతి సహజంగా ఉన్న జీవాణువుల్ని, జన్యువుల్ని వాళ్ళే పేటెంట్ చేసుకున్నారు.  విత్తన వైవిధ్యం, విత్తన స్వేచ్ఛ అంత వాళ్ళ చేతుల్లోనే”

“అంటే నన్ను విత్తనం నుండి విడగొట్టినట్లేగా.., దూరం చేసినట్లేగా…” ఎగాదిగా చూస్తూ అమాయక రైతు

“అవును,

నీకు తెలుసో లేదో.., నీవు ఆ విధంగా ఆలోచిస్తావో లేదో గానీ, విత్తనాన్ని కంట్రోల్ చేయడం అంటే రైతుని కంట్రోల్ చేయడమే.  రైతును కంట్రోల్ చేయడమంటే మొత్తం ఆహార వ్యవస్థని చెప్పుచేతల్లో పెట్టుకోవడమే.

విత్తనం ఒక భవిష్యత్. మానవజాతికే భవిష్యత్.

ఆ రైతు కలల పంటకి ఆధారం విత్తనం. ఒక దేశానికి ఆహార భద్రత నిచ్చేది విత్తనం. ఆ దేశ ప్రజలకు పోషకాహార భద్రత నిచ్చేది విత్తనం.  దేశానికి విత్తనం ఒక ఉపాధి వనరు. ఒక ఆశ.

విత్తనం అంటే ఏంటి? ఒక విత్తనం వందలు, వేలు .., లక్షలుగా మల్టిప్లై అవ్వాలి. అది విత్తన లక్షణం.

కానీ నీ చేతిలో విత్తనం అలా అవుతుందా. కాదు. వాటికా గుణం లేదు.

మీ తాత చేతిలో, అంతకు ముందు తరాల చేతిలోని విత్తనం అలా వేలు, లక్షలుగా మల్టిప్లయ్ అవుతూనే ఉండేది.  ఒకరి నుండి ఒకరికి చేరేది. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించేది. అక్కడి వాతావరణ, భూసార పరిస్థితులకు అనుగుణంగా మలుచుకునేది. రూపాంతరం చెందేది.  అందుకే ఆనాటి విత్తనాల్లో వైవిధ్యం ఉండేది.  జీవ వైవిధ్యం ఉండేది.

విత్తనం ఒక అనంతమైన ధన సంపత్తి.  మేధో సంపత్తి.

మీకు తెలుసా..?

ఒక చిన్న వడ్ల గింజ తీసుకోండి. అందులో ఉండే జినోమ్ ను అక్షరరూపంలోకి తీసుకొస్తే 5357 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

ఒక చిన్న విత్తనంలో రాబోయే రోజుల్లో ఆకులు, పువ్వులు, విత్తనంలో వచ్చే మార్పులు, వాసన, రూపు, ఎత్తు ఎలా ఉంటుంది అంతా ఆ విత్తనంలో నిక్షిప్తమై ఉంటుంది.  ఆ జ్ఞానం అంతా సహజంగా వచ్చింది”

“నిజ్జంగానా..! అద్భుతం! “విస్మయంతో కళ్ళుపెద్దవి చేసుకున్న రైతు

“అవును విత్తనమే ఒక అద్భుతం.

నువు వాడే విత్తనాల్లా కృత్రిమమైనవి, సంకుచితమైనవి కాదు ఆనాటి విత్తనం. నీ చేతిలో ఉన్న విత్తనాలు ఎక్కడినుంచి వచ్చాయి?

నీవు తయారు చేసినవి కాదు కదా..? మనిషి రూపొందించిన కొత్త జన్యువులతో ప్రాసెస్ అయిన విత్తనాలవి.  రసాయనాలు నిండా నింపుకున్న విత్తనాలవి.  అందుకే విత్తనం ఆనందంగా లేదు. నీకైనా విత్తనానికైనా, ఏ జీవికైనా జీవితానికి మూల సూత్రం ఆనందంగా బతకడం.

ఆ ఆనందం ఇప్పుడు అందుతోందా..?

ఇప్పుడు చూడు, వేలాది సంవత్సరాలుగా మానవుడు మెరుగు పరుచుకుంటూ వస్తున్న విజ్ఞానం మీ తాత ముత్తాతలది.  అది మరుగున పడిపోయింది. ఆ కాలంలో ఉన్న అనేక రకాల ఆహారపంటలు కనుమరుగైపోయాయి.

జీవవైవిధ్యం కాపాడుకోలేక పోవడం వల్ల ఉపాధి కోల్పోతున్నావు. ఆహార భద్రత, పోషకాహార భద్రత, శ్రమ విభజన ఇలా ఎన్నో నష్టపోతున్నది సమాజం. అదే విధంగా ఆనందాన్ని కోల్పోయింది.

వైవిధ్యం అంటే మనుగడ

వైవిధ్యం అంటే కొనసాగించడం లేదా ముందుకు నడవడం

వైవిధ్యం అంటేనే మరణం లేకుండా ఉండడం

“విత్తనం మన దగ్గరే మారిపోయిందా” అమాయకంగా అడిగాడు రైతు

“మొదట అమెరికా ఆ తర్వాత అర్జెంటీనా, పెరుగ్వే, బ్రెజిల్ వంటి దేశాలతో పాటు ఇక్కడ మనదేశంలోనూ జరుగుతున్నదదే.

నీ చేతిలోని విత్తనాన్ని, విజ్ఞానాన్ని కార్పొరేట్ గద్దలు దొంగిలించారు. గుప్పెడు మంది చేతుల్లో చిక్కుకుని విలవిల లాడుతున్నది విత్తనం ఒక్కటే కాదు.  నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లోనే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ వ్యవసాయ వ్యవస్థే వాళ్ళ చేతుల్లో ఉంది.  భవిష్యత్తులో విత్తన వైవిధ్యం హిస్టరీ చెత్త కుప్పలో కలిసిపోతుంది.  గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో సాంప్రదాయక పద్ధతుల్లో సాధించుకున్న స్వాలంబన సంస్కృతీ నాశనం అయిపోతున్నది. ఇప్పటికే చాలా వరకు మట్టిలో కలిసిపోయింది.

విత్తన వైవిధ్యం లేదు కాబట్టే రసాయన ఎరువులు అధికంగా వాడే వ్యవసాయ పద్ధతులపై ఆధారపడే వ్యవసాయం తప్ప గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది”

“ఎంత బాగా పెరిగేది పంట. పురుగుమందులు ఎన్నికొట్టినా మళ్ళీ ఏదో ఒకటి వచ్చి పంట తుడిచి పెట్టుకు పోతున్నది.

వరి, మొక్కజొన్న, పత్తి ఏది వేసినా పంట చేతికి రాక, ఆరోగ్యం బాగోక అవస్థలు పడుతున్నా” దీనంగా గొణిగాడు రైతు

“నీ దీన స్థితికి, నీ కిడ్నీ జబ్బుకు కారణం నువ్వు అధికంగా వాడుతున్న రసాయనాలు.  నీ భార్య కాన్సర్ జబ్బుకీ మూలకారణం అవే.

నువ్వు వాడే రసాయనాలతో భూమి, గాలి, నీరు, వాతావరణం అంతా కలుషితమేగా. రసాయనాలతో నేల సత్తువ కోల్పోయింది. పర్యావరణం సంక్షోభంలో చిక్కుకున్నది. నువ్వు దిగుబడికోసం మరింత రసాయనాలు వాడుతున్నావు. ఫలితంగా నీటివనరులు కలుషితం అయ్యాయి. పర్యావరణం, ప్రజారోగ్యం దెబ్బతిన్నది”

మధ్యలో అందుకుని “సొమ్మూ పోయింది శనీ పట్టింది.  ఈ శనిని ఎట్లా వదిలించుకోవాలో” దిగులుగా మొహం వేలాడేసుకున్న రైతు

“ప్రకృతిని చెరబట్టారు ఇన్నాళ్లు. ఆ చెర నుండి విముక్తి చెయ్యాల్సిందీ నువ్వే అన్నా., జీవితానికి ఆనందాన్ని సంపాదించుకోవాల్సిందీ నువ్వే అన్నా”

“నేనా ఎలా..?”అయోమయంగా

“మీకు తెలుసో లేదో నీ దేశంలో ఇంకా అక్కడక్కడా గుప్పెడు మంది చేతుల్లో చక్కని వ్యవసాయం బతికే వుంది. ఆనాటి విత్తనమూ ఉంది.

అది నాగరికులనుకునే వాళ్లకు అనాగరిక వ్యవసాయంలాగా కనిపిస్తుందేమో కానీ అదే భవిష్యత్ ఆశ. ఆ విత్తనమే భవిష్యత్.

సంప్రదాయ పంటతో కొద్ధి భూమిలో, కొద్ధి నీటి వనరులతో ఆరోగ్యకరమైన పోషకాహారం అందిస్తారు.

ప్రక్రుతి సిద్దమైన పంటల వైవిధ్యం ఉంటుంది. వాళ్ళే నేలను, నీటిని, పర్యావరణాన్ని కాపాడేది”.

“నిజమా.., మా ముత్తాతల నాటి విత్తనం ఇంకా బతికే ఉందా” రైతు గొంతులో సంభ్రమాశ్చర్యం

“ఇప్పటి వరకూ మీ ఇద్దరి సంభాషణ వింటున్నా. నా మనసులో మాట మీతో పంచుకోవచ్చా” ప్రశ్నించింది కొత్త స్వరం.

“ఎవరు నువ్వు” రైతు, మొదటి స్వరం ఒకే సారి ప్రశ్నించాయి.

“నన్ను అందరూ భూతల్లి, నేలతల్లి, భూమాత, పుడమి అంటూ రకరకాల పేర్లతో పిలుస్తార్లే.”

“ఓ నేలమ్మ వా..!

చాలా సంతోషం. నీ పలకరింపు నాకు పులకరింత” అన్నది మొదటి స్వరం

రైతు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.  కొత్త గొంతు నేల తల్లిదా! తల్లి బాధ బిడ్డతో పంచుకుంటున్నదా. వింతగా ఉందే. భూతల్లికి బాధలేమి ఉంటాయి? ఆశ్చర్యం గా చూస్తుండిపోయాడు రైతు

“అవునా, విత్తనం ఎప్పుడూ ఆ మాటే అంటుంది.

తనని చీకట్లోకి నెట్టేశారని విత్తనం ఎప్పుడూ బాధపడదు.

నా మట్టిపొరల్లో చక్కగా ఒదిగిపోతుంది.  తల్లి వెచ్చదనం అనుభవిస్తూన్నట్టుగా.

మెత్తటి మట్టి పెడ్డల మధ్య మదుగుచేసుకున్న విత్తనం రెండు నీటిబొట్లకోసం వెతుక్కుంటుంది వర్షం చుక్కల కోసమో రైతు పెట్టే తడికోసమో ఎంతకాలమైనా ఎదురుచూస్తుంది. లేదంటే చెట్ల ఆకులు రాల్చే నీటిబిందువుల కోసం ఆశగా ఎదురుచూస్తుంది. ఆ నీటి చుక్కలని ఎంతో ఇష్టంగా తీసుకుంటుంది. ఆ చెమ్మ విత్తనం లోపలున్న బీజం తనలో ఇముడ్చుకుంటుంది.

విత్తనపు కణాల్లో ఉండే ఎంజైములు చైతన్యం అవుతాయి.  నిద్రపోతున్న బీజం జాగృతమవుతుంది. ఆహరం తీసుకోవడం మొదలు పెడుతుంది.   వెలుతురులోకి రావడానికి మొదటి ప్రయత్నంగా విత్తనం చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని చీల్చతుంది.  చీకట్లోంచి వెలుతురు కోసం తహతహలాడుతుంది.  నేను అడ్డుగా ఉన్నానని నన్నేమీ తిట్టుకోదు. కానీ ఎలా బయటికిరావాలని ఆ అంకురం తపన పడుతూనే ఉంటుంది.

నెమ్మదిగా తల్లి మెత్తని స్పర్శను అనుభూతి చెందుతూ అవ్యక్తానందంతో లోలోపలికి చొచ్చుకుపోవడానికి అనువుగా తనను మలుచుకుంటుంది.  మరో వైపు నుండి సూర్యరశ్మి అందుకుంటుంది. చిరునవ్వులొలికే ముద్దు బిడ్డలా మొలక తలెత్తి ఆకాశం కేసి చూస్తుంది. నగుమోముతో పలకరిస్తుంది.  గగనమంత ఎత్తు ఎదగాలని ఉవ్విళ్లూరుతుంది.

విచ్చుకున్న విత్తనం ఆకులతో, కొమ్మలు రెమ్మలతో, పూలు పండ్లతో అలా అలా… మహావృక్షమవుతుంది.

ఆ దృశ్యం ఎన్ని సార్లు చూసినా అద్భుతంగానే.., అపురూపంగానే…” తన్మయత్వంతో అన్నది నేల.

“సృష్టి ఎంత అద్భుతమైనది. అపురూపమైనది…” రైతు మనసులోని మాట పైకే వచ్చింది

“ఆ…నిజమే.., ఆ అద్భుతాన్ని నిలబెట్టుకోవాలిగా. అపురూపాన్ని కాపాడుకోవాలిగా…

ఒకప్పుడు ఎన్నో జీవరాశులకు ఆలంబన అయ్యాను. ఇప్పుడు నాలోపలి పొరల్లోని జీవావరణం అంతా దెబ్బతింది. ఇక తట్టుకునే శక్తి నాకు లేదు. మరణం అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నాను” ఆయాసపడుతూ గొంతు పూడుకుపోతుండగా అన్నది నేలతల్లి.

“అయ్యో.., తల్లీ… నువ్వే ఆ మాటంటే ఎట్లా తల్లీ” రెండుచేతులెత్తి దండంపెడుతూ రైతు

“అంతా మీ వల్లే” అన్నది మొదటి స్వరం

“నేనేమీ చేయలేని అల్పుడను. నన్ను నిందిస్తే ఏం లాభం..? నన్ను మీ ముందు దోషిగా నిలబెట్టిన వాళ్ళది అసలు తప్పు. చేతులు కాలిపోయాయి. ఇప్పుడు ఆకులు పట్టుకున్నా ఏం లాభం” అన్నాడు రైతు

“మీకో రహస్యం చెప్పనా” మరో స్వరం

“తమరెవరో…” రైతు ప్రశ్న

“ఇందుగలడందు లేడనే గాలిని.

అట్లాగని నేనిప్పుడు చెప్పే ముచ్చటని గాలి కబుర్లకింద కొట్టిపడెయ్యకండి.

స్వార్ధపరులు కాదు విజ్ఞులు అనుకుంటున్న మాటలే మోసుకొచ్చా…

చిన్న చిన్న కమతాల రైతులు అనుసరించే సేద్యంలో, పద్ధతుల్లో అంతగా పరిణతి ఉండదని, లోపభూయిష్టమైన విధానాలని ఒకప్పుడు ప్రచారం చేశారు కదా…

ఇప్పుడు వాటినే అత్యంత అధునాతనమైన, సరైన పద్ధతులుగా పరిగణిస్తున్నారని మారికి విక్ జియాని, జగ్జిత్ ప్లాహే అనే శాస్త్రవేత్తలు అంటున్నారు.  వాళ్ళు చిన్న కమతాల రైతుల ప్రాధాన్యతను గురించి పరిశోధన చేసి చెప్పిన మాటలివి.

రైతులు నష్టాన్ని వీలైనంత తగ్గించుకునే వ్యూహాలు రూపొందించడంలో ముందుంటారట. కరువు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వీరికి బాగా తెలుసట.  జీవవైవిధ్యాన్ని, పంటల వైవిధ్యాన్ని, విత్తన వైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఎలాంటి సేద్య పద్ధతులను అవలంబించాలో, అనుసరించాలో, నేలసారాన్నిఎట్లా నిలబెట్టాలో, నీటి వనరులను ఎలా సంరక్షించుకోవాలో, వ్యవసాయ వ్యర్ధాలను ఎలా ఉపయోగించుకోవాలో, వసతులు-వనరులు ఎంత జాగ్రత్తగా వాడాలో రైతుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదట.  రైతుకున్న పరిశీలన శక్తి, జ్ఞాపక శక్తి అపారమైనదట.  తన జ్ఞానాన్ని కథల రూపంలో ఒక తరం నుండి మరో తరంకి అందిస్తూ వస్తున్నారట.  విత్తనాలను భద్రపరచడంలో గ్రామీణ మహిళలు ఇప్పటివరకూ అనుసరిస్తూ వచ్చిన పద్ధతులన్నీ మరుగున పడిపోయాయట” వివరించింది గాలి

“నువ్వు విన్నది అక్షరాలా నిజం మిత్రమా” అన్నది స్వరం

“పరాధీనతలోకి జారిపోనంతవరకూ రైతు జీవితమంతా ఉత్సవంలాగా, పండుగలాగా ఉండేది.” సాలోచనగా అన్నది భూమి

“ఏ జీవికైనా జీవితమే ఒక అద్భుతం. ఈ లోకంలో ప్రతి జీవి పుట్టుకా మహాద్భుతమే “అన్నది గాలి

“నా శ్రమశక్తి సరుకై పోయింది. సేద్యం ఒక జూదం అయిపొయింది. పావులెవరివో, ఆడించేదెవరో తెలియదు. కానీ నిత్య ఓటమి మాత్రం నాదయింది. నా జీవితమే విషాదమయింది” భారమైన హృదయంతో, బాధతో దుఃఖంతో గొంతు బొంగురుపోతుండగా రైతు.

“రైతన్నా.., కడవల కొద్దీ నీ కష్టాలు, నీ చుట్టూ ముసురుకున్న చీకటి, అనుభవిస్తున్న ఘర్షణలు – సంఘర్షణలూ అన్నీ తెలుసు.  అయితే నువ్వు, నిత్యం సేద్యం అనే సాహసక్రీడ ఆడే సాహసివని మర్చిపోకు.

మట్టిలోంచి మెతుకు అందించే మాంత్రికుడివి నువ్వు, నీకే జరుగుతున్న విధ్వంసాన్ని సరిదిద్దే శక్తి ఉంది.  వేటగాడు పన్నిన వలలోంచి నిన్ను నీవు విముక్తం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. నీ అన్వేషణలోంచి ప్రకృతిని, మానవాళిని కాపాడే విత్తనం ఎంచుకో.  కమ్యూనిటీ విత్తన బ్యాంకులు వృద్దిచేసుకో.

విత్తన నాణ్యత, జన్యు స్వచ్ఛత, తేమశాతం వంటి ప్రమాణాలు పాటిస్తూ ముందుకుపో.

నీ మేధస్సుతో కనుగొన్న విజ్ణానం,శాస్త్ర సాంకేతికతల, సాంప్రదాయ పద్దతులను జోడించుకుంటూ ఏ జీవికి నష్టం కలిగించని అనారోగ్యం కలిగించని సహజ పద్ధతుల్లోకి మళ్లితే.. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చకపోతే ప్రకృతి మాత నిన్ను దీవిస్తుంది.

జీవవైవిధ్యంతో కూడిన వ్యవసాయంలో జీవులకెప్పుడూ ఉత్సవమే.

అప్పుడు ఈ లోకంలో నువ్వున్న ప్రతి క్షణం పండుగే.

అన్నా.., వేగుచుక్కవై వెలుగు, ముందుకు సాగు రైతన్నా…” అన్నది స్వరం

“శరీరమూ, మనసూ, హృదయమూ పిప్పి పిప్పి అయిన సమయంలో నీతో ముచ్చట్లు

నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కళ్ళు తెరిపించాయి.

ఇంతకీ నువ్వెవరో చెప్పనేలేదు “అజ్ఞాత స్వరం ఎవరిదో తెలుసుకోవాలన్న ఆతురత రైతు గొంతులో

“విత్తనాన్ని” నొక్కి అన్నదా స్వరం

*

 

శాంతిప్రబోధ

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • కథ చాలా బాగుంది మేడం.. రైతుల సంప్రదాయ పద్ధతులను చెప్తూ.. పాశ్చాత్య పద్ధతులను అవలంబిస్తే ఎలాంటి పరిణామాలు ఉద్బవిస్తాయో చక్కగా చెప్పారు మేడం..శుభాకాంక్షలు💐💐💐

  • Heart touching story.In direct story of Seed is nicely depicted. This story is very much needed to highlight the present on going farmers’ agitation.
    Congratulations to Ms. Shanthi Prabodha garu.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు