అనుభవానికి ఆనవాలు!

కొబ్బరి ఈనెల మధ్య కదలే నీడల్లాంటి పురాస్మృతుల్లా
ఈ ఇల్లు, ఈ వాసనలు, నా బాల్యం, ఇంకా, యవ్వనం.

ప్రేమసందేశాన్ని దాచి
సముద్రంలోకి విసిరిన గాజుసీసా
మళ్ళీ విసిరినవాడి పాదాలకే తగిలినట్టు
వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఊరెళితే,
లోపల చిత్రమైన కుదుపు

ఉంగరం చూపెట్టి జ్ఞాపకాలను మేల్కొల్పిన ప్రేయసిలా
అనాది నేస్తం లాంటి ఆకాశం
చందమామను వొంపి
ఈ పిట్టగోడల మధ్య పుట్టిన
ఎలప్రాయపు పాటల్ని గుర్తుచేస్తోంది.

కొబ్బరి ఈనెల మధ్య కదలే నీడల్లాంటి పురాస్మృతుల్లా
ఈ ఇల్లు, ఈ వాసనలు, నా బాల్యం, ఇంకా, యవ్వనం.

మాటుమణిగిన రేయిలో మునకలేస్తోంది జాబిలి.

మునిచీకటి వేళల్లో రహస్యంగా మెరిసి
నడిరేయి సౌందర్యానుభవాన్ని మాటిచ్చిన నక్షత్రమేదో
అదను చూసి తలుపు తెరిచినట్టు -పైనంతా
వెలుతురు పొట్లాలు చిట్లి చెల్లాచెదురైన కాంతి
దిగంతాల్లో నుండి జలజలా రాలుతోన్న స్వర్ణధూళి

“తూ సఫర్ మేరా..తూ హీ హై మేరీ మంజిల్”
హృదయాన్ని పాటగా పెదాల దాకా లాగి
ప్రాణం పెనుగులాడుతోంటే జీరగా కునికే ఆ గొంతు-
గాలి అలల్లో తేలి కాంక్షాతప్త హృదయాన్ని
కారుణ్యపుచందనప్పూతలా ఊర్కోబెడుతోంది.

రజనీడోలలో నిశ్చింతానుభవమై ఊగుతోన్న కాలం
కలతో పాటుగా మెల్లిగా కరుగుతోంది.

మేల్కొన్న రెప్పల నంటి – ప్రత్యూషహేమరాశి
గుండెల మీద, అయాచితంగా రాలిపడ్డ
పసుపుపూల సౌందర్యరాశి.

అమృతానుభవానికి ఆనవాళ్ళను వెదుక్కుంటూ
ఈ ఉదయం.

*

painting: Mandira Bhaduri

మానస చామర్తి

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మానసా, ఎంతమంది స్వీయ అనుభవానికి మీ కవిత సున్నితత్వాన్ని అద్దిందో, ఎంతమంది “వర్క్ ఫ్రమ్ హోమ్” లో అనుభవించి మాటల్లో పెట్ట లేని దాన్ని సుళువుగా అందంగా చెప్పారో! So nice ma

 • మాటుమణిగిన రేయిలో
  మునకలేస్తోంది జాబిలి
  …..ఊహే చిందులేయిస్తోంది. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంతలా రెచ్చగొడుతోందని తెలిస్తే అందరం కంపెనీకి అర్జీలు పెట్టుకుని మరీ అది శాశ్వతం చెయ్యమని అడుగుతాం! 👌

 • “రజనీడోలలో నిశ్చింతానుభవమై ఊగుతోన్న కాలం”
  బ్యూటిఫుల్!!!
  ఊహకే ఎంత బావుందో, మానసా!
  వర్క్ ఫ్రమ్ మై కంట్రీ గురించి కలలైనా కంటాను ప్రస్తుతానికి!! 🙂

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు