అదే నీవు అదే నేను

ఫీసులో ల్యాండ్లైన్ మోగింది యధాలాపంగా ఎత్తి ,”హలో !జానకి సిమెంట్స్!” అన్నాను.

“యా! నా పేరూ జానకే!కానీ నన్ను ఎవరో  జానకీ, నా జానూ…అనేవారు.” అట్నుంచి గలగల నవ్వు. చెయ్యి బిగుసుకుపోయి,స్వరం ఆగిపోయి, ప్రాణం అత్యంత వేగంగా ఆ తీగల వెంబడి దొర్లిపోయింది. ఆమె నవ్వు చేసే అలికిడి అలల్లో 12 సంవత్సరాలు వెనక్కి . “ఓయ్! మహీ!మహి!ఓయ్” అని రెట్టిస్తున్న  ఆ కంఠస్వరానికి ఏం బదులు ఇవ్వాలో తెలీక,” ఆ ! యా! ఆ….నేను….” అంటూ తడబడ్డాను. “పర్లేదు! ఇంకా ఈ నాలుగు పదుల వయస్సు కి నిన్ను ఎవరూ ఏమీ అడగరు. హలో! ఇలలోకి రావయ్యా!బాబు,ప్రెసెంట్ టెన్స్ కి  రా!” నవ్వు వినబడుతోంది మళ్లీ అట్నుంచి. తను నా మనసును తీసి బావి దగ్గర బాల్చీ నీళ్లలో ఝాడిస్తున్నట్టుగా ఉంది.

“జానకీ!”భారంగా అన్నాను.” సరే! మహీ! ఓ పూట సెలవు మీ ఎం.డీ ని నేను అడగనా? నువ్వు అడుగుతావా?  ఏంటి? ఓ పూట,  హైదరాబాద్ వస్తావా? ట్యాంక్ బండ్ దగ్గరికి!” ఆమె కంఠంలో రెట్టింపు చిలిపితనం.ఏదో చెప్పాను. తారీకు,సమయం చెప్పి, “ మళ్ళీ రిమైండ్ చేయనా? నోట్ చేసుకుంటావా?”. తనేమన్నా పరవాలేదు. అసలు నాతో మాట్లాడడమే చాలు.”అహ!నేను…. వస్తాను.” బదులిచ్చాను.

ఫోన్ పెట్టేసింది జానకి

జానకి, సీత, మైథిలి, భూమిజ —— ఎన్ని రకాలుగా పిలిచేవాడిని! తెల్లని ముఖానికి, చైనా అమ్మాయిలా,రెండు చిన్న కళ్ళు,నవ్వుతో  విరిసే పెదాలు, ఆ మోము మరిచిపోయే దా?!!!

కాలేజీలో వెనక బెంచీలో కూర్చుని పక్క వాళ్లను  దాటించి, వెనక్కి వంగి  చూపులతో,అమ్మాయిల వైపు నేను, అబ్బాయిల వైపు తాను,ఏదో ఒక క్షణంలో కళ్లారా, చూసుకునే ఆ నిమిషాలు —— ఇంద్రధనస్సు కు అటు,ఇటు మేమిద్దరం నిలబడి ఎక్కుతున్నట్టు….గతజన్మ లో  జరిగినట్టుందిప్పుడు తలచుకుంటే. లేచి,కేంటీన్ వైపు నడిచాను.అది మా కాలేజి కేంటీన్ కే!

 

లంగా-ఓణి  లో తాను,నాలుగు అడుగులు దూరంగా నేను—ఒకరినొకరు అనుసరిస్తూ అలా రైలు పట్టాల వైపు నడిచి వెళ్ళడం.. గాలికిచెదురుతున్న  క్రాఫ్ తో నేను, ఎగిరే  పైటను బిగించుకుని తను,తన పుస్తకాలు నే మోస్తానని చేయి చాపడం, ‘హమ్మయ్య’ అని అందించి తను…ఇద్దరం రైలు పట్టాలకు అటు ఇటు నడిచి… వెళ్లి,వెళ్ళి—- ఎపుడైనా పట్టాల మీద పనిచేసే వారితో కబుర్లాడి,….ఏదో కూనిరాగం…..” కిన్నెరసాని వచ్చిందమ్మా, వెన్నెల పైటేసి…. అసలా పాట ఏంటి? వెన్నెల పైట ఎలా?” అని తను అడగడం,తెలియనట్టు! నేనేమో చాలా సిన్సియర్ గా ప్రతి పదానికి అర్థం చెప్పడం,నాకు తెలుసున్నట్టు!

’పాట పాడు మహీ’ అనగానే గుండెలో విచిత్రమైన పొంగు…” మదనసుందా… రి, మదన సుందారి…అంటూ ‘రంగులకల’ లో పాట పాడుతూ నేను గొంతు హెచ్చించి ఎదురొచ్చే గాలికి దీటుగా దమ్ము నిలబెట్టి పాడుతూ……”దొరగాడు కాసే” వాక్యం మానేయడం…’అరే! దొర లైన్ మరచిపోయావు!’అనేది జానకి. నేను “ అది వద్దులే,”. “బాగుంది! దొర, దొర కొడుకు చూసినా పాట పాడితేనే చెలికాడు”.జానకి నన్ను ఉడికించడం.

కనుకొలకలు ముడతలు పడి, ఎఱ్ఱగా మండిపోతూ వచ్చినపుడల్లా ,” ఎందుకో అంత కష్టం! రాత్రి పడుకున్నావా?” అని జానకి గదమాయిస్తే,”తెల్లవారితే ఓ సారి నిన్ను చూసి, మన కెమిస్ట్రీ క్లాసులో, ఇంగ్లీషు క్లాసులో పడుకుంటాను గా!”అని నేను సర్ది చెప్పేవాడిని.

నాన్న కు సుస్తీ చేయడంతో, అమ్మ-అక్క  ఉన్న  కుటుంబపోషణ కోసం కర్రల అడితి లో నైట్ డ్యూటీ చేసేవాణ్ణి. స్టాకు లారీలు వచ్చినా, వెళ్ళినా నిద్ర ఉండదు.
ఉదయం పూట డిగ్రీ వెలగబెట్టడం. సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది దాకా ట్యూషన్లు. తర్వాత నైట్ డ్యూటీ.మళ్లీ అదే . మళ్లీ ,మళ్లీ అదే. జానకి కోసమే కాలేజీకి వెళుతున్నానన్నట్టు ఉండేది. సున్నుండో, పులిహారో తను తెచ్చిస్తే మహాప్రసాదంగా తీసుకునే పరమభక్తుడిని నేను.
“నీలా నేను -earn while you learn- కాదు . ఒకటే మంచి ఉద్యోగం చేస్తాను. నాకైతే Ph.D చేయాలని ఉంది- ఈ బోటనీ లోనే. ఇన్ని రకాల ఆకులు, మొక్కలు- వీటి కన్నా చదవాల్సింది ఇంకేముంది? అనిపిస్తుంది!’  స్పష్టంగా చెప్పేది జానకి.

ఆరంభంలోనే కాస్త ఖాళీ ప్రదేశంతో ఓ ఇల్లు,పూల మొక్కల వరుసలు, రెండు పూటలా పాటలు ,ముగ్గులు—- మా భవిష్యత్తు ఏదో ఒక నిలువెత్తు చిత్రపటంలా  కనబడేది నా మూగమనసుకు కలలో.

డిగ్రీ ఆఖరు సంవత్సరంలోనే  ఏదో వాళ్ళ నాన్నగారు  ‘తెలిసిన అబ్బాయి’ అంటూ సంబంధం కుదిర్చేస్తానన్నారు. జానకి మా ఇంటికి వచ్చింది .వాళ్ళ నాన్నగారు ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ లో జనరల్ మేనేజర్ గా పని చేసేవారు.ముగ్గురు ఆడపిల్లలలో జానకి మొదటి పిల్ల.

ముందు గదిలో కూర్చున్న జానకికి గ్లాసుతో నిమ్మరసం పట్టుకుని వచ్చి అమ్మ ,” అంతా బాగుందమ్మా! నువ్వు నాకు నచ్చావు కానీ,ఇంకో రెండేళ్ళు – మహీధర్ మాకు కావాలి. వాళ్ళ అక్కకి సంబంధాలు చూస్తున్నాం.ఆ తర్వాతే వీడికి.మళ్లీ వారం మహికి ఒడుగు చేస్తాం.నువ్వు కూడా రామ్మా!” నిక్కచ్చిగా చెప్పిన అమ్మ మాటలు మా ఇద్దరికీ కళ్ళాలు వేశాయి.

జానకి  ఇంట్లో  దెబ్బలాడి  మరీ ఉస్మానియా యూనివర్సిటీ లో పీ.జీ లోచేరింది. అప్పట్లో ఆమె రాసిన ఉత్తరాలే ఊపిరిగా బతికాను . సుందర స్వప్నం నేలపై ఎలా నిజం చెయ్యాలో చెప్పేది తను.వెన్నెల మబ్బుల్లో వెండి మెరుపులా  ఆమె ప్రణాళికలన్నీ చూడడమే నా పని .ఏడాదిలో నేనేం చేయాలో,తానేం చేస్తుందో: ఒక క్యాలెండర్ వేసి మరీ చెప్పేది.  అమ్మాయిలు తమ వయస్సు అబ్బాయిల కన్నా పరిణతిలో ముందుంటారు అన్నమాట ఇప్పుడు తెలుస్తోంది! రోజువారీ శ్రమలో, దిగులులో, జానకి ఒక అందమైన వర్ణం. ఆరోజు ఆ రంగులో  మనసును  ముంచి ఓ బుడగలా  గాలిలో  ఎగరేయడమే తప్ప నాకింకేం తెలిసేది కాదు. రెండేళ్లు ఇట్టే గడిచిపోయాయి.తన పరీక్షలయి  వచ్చింది జానకి.
నన్ను కలిసింది.  అదే రైలు పట్టాలు. అక్కడ ఉన్న ఒక సిమెంటు తీనె మీద కూర్చున్నాక, “మనిద్దరం ఇంక పెళ్లి చేసుకుందామా?మహీ!” అంది. అందులో కొంచెం నిరాశ,కాస్త విసుగు కనబడ్డాయి,కాదు వినబడ్డాయి. “అరె ఎప్పుడూ అదే ప్రశ్నేనా ?”,అన్నాన్నేను.
“మరి,ఇంకేమిటి? చెప్పు.నాన్నగారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఇక ఇంతకన్న నావల్ల కాదు.అసలే నాన్నగారికి నిజామాబాద్ ట్రాన్స్ ఫర్ అయేలా ఉంది. ఆర్డర్స్ పెండింగ్.నేనిక వరంగల్ కి రాలేనేమో మహీ!”
నేను ఆలోచిస్తున్నాను. మా నాన్నగారు చనిపోయి ఏడాదయింది. అక్క ప్రసవానికి ఇంటికి వచ్చింది. నేనొక మెయిన్ జాబ్,  రెండు పార్ట్ టైం లు చేస్తూనే ఉన్నాను.ఈసారి నేనే,”ఇంకొక ఆరు నెలలూ” అన్నాను “మహీ! ఆరు నెలల తర్వాత ఓయూ హాస్టల్ లో  రూం నెంబర్ 32. అది జూన్ 20, శనివారం. ఆ తర్వాత …..” సుమారుగా హెచ్చరించింది.
అక్క కి బాబు పుట్టాడు.ప్రసవ సమయంలో ఫిట్స్ వచ్చాయి. ఒక పక్క వైద్యం. మరో పక్కన  వాళ్ళ అత్తవారి సూటిపోటి మాటలు.ఓ 3 నెలలు ఉఫ్ మని గడిచిపోయాయి.

నిస్సహాయుడిని నేను. బందీని పరిస్ధితులకు.

కాదు-నాకు తెగువలేదు.

ఉహు. నాకు భయం.

అమ్మ-కుటుంబం-కట్టుబాట్లు…. ఎన్నైనా కారణాలు- అవన్నీ వంకలు.

అది నాకు లోలోపల తెలుసు. మహీధర్… పిరికివాడు. పైకి బుద్ధిమంతుడు.

కాలం పరుగులో ఆరు నెలలు దొర్లిపోయాయి.అక్క కోలుకుంది.కాపురానికి పంపాం. ఊపిరి పీల్చుకున్నాం.అమ్మ మాట మీద ఎం.బి.ఏ చేరాను.మళ్లీ  కాలేజీలో బెంచి మీద కూర్చుంటే జానకి గుర్తొచ్చింది! ఒక బలమైన క్షణంలో గడువుదాటిందని తెలిసినా రాత్రి బస్ కి వెళ్లాను.హైదరాబాద్ కి.

“జానకా? తను జూన్ నెలాఖరికి ఖాళీ చేసి వెళ్ళిపోయింది.మీకు తెలియదా?తనకు పెళ్లి అయిపోయింది. ఎవరో అమెరికా కుర్రాడు.”హాస్టల్ లో చెప్పారు.

అయిపోయింది.అంతా అయిపోయింది . జానకి వెళ్ళిపోయింది . భారంగా ఇంటికొచ్చి అమ్మకి చెప్పాను.మరో రెండేళ్ల కి నా పెళ్లి.ఇంకో నాలుగేళ్లలో ఉద్యోగం.జీవితం ఓ చక్కని దారి లోకి వచ్చేసింది. సరోజ అదృష్టం అన్నారందరూ.

కంపెనీ లో  ప్రారంభపు రోజులలో  ముభావంగా ఉన్నా, ఆ మధ్య హైదరాబాద్లో, తరువాత బెంగళూరులో ట్రైనింగ్ కోర్సులకు వెళ్లాను. ఆ తర్వాత నాలో కూడా మార్పు. మరీ అంత సైలెంటుగ ఉండడం లేదు.నలుగురితో కలుస్తున్నాను.

అమ్మ మేమున్న సిటీకి రాలేదు.నేను,పాప, నా భార్య-అప్పుడప్పుడు అమ్మ దగ్గరికెళ్లి వస్తుంటాం.సౌకర్యాలతో , సాదాసీదాగా  బ్రతుకుతూ,సంతృప్తితో, నా సంసారం సాగిపోతోంది.

ఇప్పుడిప్పుడే కాస్త కంపెనీ యాజమాన్యానికి, పని వాళ్లకి మధ్య మంచి సంబంధాలను నెలకొల్ప కలిగే హెచ్ ఆర్ మేనేజర్ కం కౌన్సిలర్ గా కూడా నేనో కొత్త అవతారం ఎత్తాను.మా కంపెనీ కూడ శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది.

మళ్లీ ఇన్నాళ్లకు, జానకి….!

 

*****

కుమార్  వచ్చేడో, సీట్ లో ఉన్నాడో ఏంటో చూడాలి..!. (ఈ వీకెండ్ నేను హైదరాబాదు వెళ్ళాలంటే కుమార్ కాస్త ఎలర్ట్ గా ఉండాలి…! అతని క్యూబికల్ దగ్గరకెళ్ళాను. కొంచెం దూరంగా ఫోన్ మాట్లాడుతున్నాడు, వీడియో కాల్ లా ఉంది. నన్ను ఆగమని ఒక వేలుతో చూపిస్తూ ఒక్కనిముషం అని సైగ చేసి, త్వరగానే వచ్చాడు.

“ హై సర్! వాట్స్ అప్!” అన్నాడు… “సోమవారం వస్తాను, ఈ వీకెండ్ కాల్ ఉంటే నువ్వూ…”….ఇంకా ముగించకుండానే… “పరవాలేదు. ఐ విల్ మానేజ్.! యు నో! అన్నీ సార్ట్ ఔట్ చేసాను.మహీ సర్! నిర్మొహమాటంగా అమ్మ, నాన్నతోను; ఓపెన్ గా మంజు తో మాట్లాడాను. ఇపుడందరూ ఒకరితో ఒకరు కలుస్తున్నారు.అంతా సరిగ్గా  అయితే మంచిది.ఒక వేళ సరిపోకపోయినా
…..నా  వంతు నేను ప్రయత్నించిన తృప్తి తో ఉంటాను. నా మూడ్ పాడవదు. గ్యారంటీ. “ హాయిగా నవ్వుకున్నాం. నేను లేచాను నా ఛాంబర్ వైపు..
..”.మహీ సర్! థాంక్యూ…. “ అన్నమాట హుషారుగా వినబడింది. హాయైన ఆనందపు ఈలపాట పెదవులపైకి అప్రయత్నంగా వచ్చింది .

********

కుమార్ తన జూనియర్ కొలీగ్.అవడానికి తెలివైనవాడే. కాని ఏం లోపల లేనట్టు, ముభావంగా, చెప్పాలంటే అభావంగ ఉంటాడు. గత నెల తనకూ, కుమార్ కూ కాసేపు భేటీ పడింది. ఇంటరెస్టింగ్ ఫెలో…

“ కుమార్! బ్రెక్ఫాస్ట్ అయిందా?” “ఏం సార్ మీరు పెడతారా?”

“ పెడితే తప్పేముంది? “

“ ఉద్యోగం కాక స్నాక్ సెంటరు కూడ ఓపెన్ చేస్తారా?”అతని మాటలకు నిజంగా నవ్వొచ్చింది.

“అది లాభసాటి అయితే అదే చేద్దాం! “ అంటూ అతని సిస్టమ్ దగ్గరకు వెళ్ళి కూర్చొన్నాను.

“రాత్రి ఏం చేసేవు? “ లాలనగా అడిగాను. కుమార్,తల అడ్డంగా ఊపి,” నిద్రైతే సరిగా పట్టలేదు. ఎదో ప్రైమ్ సిరీస్… చూస్తూ…”

భుజాలెగరేసాడు.

’చూడు! నీలో నీవు మధనపడితే తేలనిదే ప్రేమ.దాన్ని సంఘానికి ఆమోదయోగ్యం చేసి, ఒక పద్దతిగా నడిపేదే పెళ్ళి. నువ్వు ఎక్కడ డిలే చేస్తున్నావో నాతోనైనా మాట్లాడచ్చుగా?”అన్నాను.

“సర్! పెండింగు పన్లగురించే బోర్ కొట్టిస్తారనుకుంటే, పెర్సనల్ ప్రాబ్లమ్స్ కూడ వదలరా?” చిరాకు, వ్యంగ్యం కలిపి అన్నాడు. “ హేయ్! నో! నీకు లైఫ్ లో కూడ కాస్త సీనియర్ ని కదా అని , పోనీ అలా ఐతే మాట్లాడ     వద్దులే.”

“మహీ సర్! అదేంకాదు. ఎవరూ ఎవర్నీ అర్ధం చేసుకోరే? అదే నా బాధ.”

మళ్ళీ కూర్చుంటూ ఒక నవ్వు నవ్వాను.” ఎవరినైనా కన్విన్స్ చేయకూడదు. అపుడు,వాళ్ళకి నచ్చినట్టు చెప్పాలనుకుంటాం.  మన ఇబ్బంది మన ఆలోచనలోనే దాచుకోకుండా మరో మనిషితో కలిసి డిస్కస్ చేయాలి కుమార్. నీ ఆశ లో పక్కవారి ఆశ  కలగలిసి ఉందంటేనే ఇద్దరు పార్టనర్స్  ఔతారు.”

“కాకపోతే? “…..

“అపుడు విడిగా ప్రయాణించాలి, కానీ నిష్టూరాలు- నిందలు అనే  బురద పూసుకోకూడదు”

“ సరే నిందించం. కాని హార్డ్ ఫీలింగ్స్ ఉండిపోతాయేమో! మాస్టారూ…” సందేహంగా అన్నాడు కుమార్.

”నో… నీ ప్రయత్నం పాజిటివ్ గా ఉండాలి. జీవితం పెద్దది.  అందులో ఐదేళ్ళకోసం జీవితకాలపు కాంప్రమైజ్ ఎంచుకోకు. కుదరనపుడు సర్దుకో అంతేకాని అణిగిపోకు.” లేచాడు మహీధర్.

“మీకివెలా తెలుసు?”

అతని భుజంపై చెయ్యి వేసాను.” ఒక్కో అనుభవం స్వయంగా చూస్తేనే తెలిసేది. నేనేం బయాస్డ్ గా చెప్పట్లేదు.ఏ బరువులూ ఎత్తుకోకు.అలా అని బాధ్యతలు వదిలేయకు. నీ డైలీ రొటీన్ పాడవకుండా ఉంటేనే నీ స్వేఛ్ఛ.  అది కానిదంతా…”

”……అనవసరపు బరువే .”అన్నాడు కుమార్.

“పచ్చినిజం చెప్పావు.”

****************

బస్సు ఎక్కి హైద్రాబాదు వచ్చేసరికి మూఁడౌతోంది . దగ్గర్లో హోటల్కెళ్లి  ,దోశ తిని, కాఫీ తాగి రిలాక్స్ అయ్యాను . ఐదు అవుతుండగా లిబర్టీ దగ్గర బస్ దిగి నడుచుకుంటూ వెళ్ళాను .అంబెడ్కర్ విగ్రహం,ట్రాఫిక్ తప్పించుకుంటూ ట్యాంకుబండ్ చేరాను .

.. ఏమాత్రం ఛాయ తగ్గని రూపం. చిరునవ్వు నిండిన కళ్ళు ఫ్యాషనబుల్ కళ్ళజోడులోంచి మిలమిల మెరుస్తున్నాయి.

జానకి ఎదురైతే, ఒక్కసారిగ నాకేంచేయాలో  తెలియలేదు.

కాస్త ఒళ్లు చేసింది. ఆరోగ్యంగా ఉంది. సెకండ్ చిన్ తయారయింది. నీలం రంగు పట్టు చీర మీద లేతపసుపు పచ్చని బ్లౌజు. ఏదో పెద్ద జువెలరీ షాప్ తాలూకు డిజైనర్ హారం. గూచి బ్యాగు. సుతారమైన పర్ఫ్యూమ్ వాసన.చెవులకు మెరిసే లోలకులు,…. కడిగిన ముత్యంలా ఉంది జానకి.

చూపులు కలిసిన వెంటనే ముందుకొచ్చి, నా చెయ్యి లాగి,షేక్హ్యాండ్ ఇచ్చి , గట్టిగా ఊపి, వదలకుండా నన్ను లాక్కెళ్లి,”రా మహీ!” అంటూ ట్యాంకుబండ్ బెంచి మీద కూర్చోబెట్టింది. బాగా పెరిగిన ట్రాఫిక్. అస్తమిస్తున్న సూర్యుడు. “ఫస్ట్….” అన్నాం  ఇద్దరం ఒకేసారి. బాగా నవ్వుకున్నాం.నా గుండె తేలిక పడింది. ఆప్యాయంగా నా చెయ్యి ని వెనక్కి తిప్పి చూసింది.నా ముంజేతి మీద పచ్చబొట్టు- విల్లు! తడిమి, నవ్వి,”సరే ,నేనే చెప్తాను.” అంది. నేను మొహమాటంగా చెయ్యివెనక్కి లాక్కుని,”చెప్పు వింటాను”,అన్నాను. “మహీ!” నా గొంతులో ఉసిరికాయ ప్రమాణంలో బరువు పైకి ఎగసి,కిందకు జారింది.

“నాన్న నాకు పెళ్లి చేసి అమెరికా పంపించారు. నేను ఏడాది తిరిగేసరికి  తల్లిని అయ్యాను. ఆ కాన్పు తర్వాత ‘బాలింత మాంద్యం- postpartum psychosis’  అంటారు, అది వచ్చింది.ఒక ఆరు నెలల పాటు నా భర్త,మా కజిన్- వాళ్ళక్కడే ఉంటారులే – కౌన్సిలర్ అమాండా. వీరందరి కృషితో,ప్రేమతో- నేను మళ్ళీ మనిషినయ్యాను.

ప్రతిరోజూ పురోగమన దృష్టితో ఆలోచించే నా మెదడే, ఆ ఆరు నెలల్లో చింపిన కాగితంలా అయిపోయింది. ఎంతో దృఢంగా ఉండే నన్ను , ఎన్నో భయాలు,అనుమానాలు ఆవరించాయి.

బేలనైపోయాను. పుట్టిన బిడ్డను కూడా, ఏదో దెయ్యంలా చూసేదాన్ని. తన పుట్టుకతో నా జీవితం పరాధీనం అయిపోయిందన్న తెలియని కోపం. నా భర్త పై అసహనం. చనిపోయిన వాళ్ళెవరో రోజూ కనిపించి, నన్ను కూడా రమ్మన్నట్టుగా  అనిపించేది.”, జానకి గొంతు జీరవోయింది.
“కానీ,  అమాండా  పర్యవేక్షణలో,మా అన్నయ్య -వదిన, మా శ్రీవారు-రమణ- నన్నెంతో బాగా చూసుకున్నారు.ఆ పాటికి ఈ దేశంలో  ఉన్న మూఢనమ్మకాలకైతే ,తప్పకుండా నన్ను  పిచ్చాస్పత్రిలో పడేసేవారు. పుట్టింటికి పంపడం, ‘మీ ఇంట్లోనే పిచ్చి ఉందా?’ అనే లాంటి ప్రశ్నలు, ఒంటరితనం, చుట్టూ అమ్మలక్కలు, కేజీల కొలది మాత్రలు,రకరకాల శాంతులు,….ఊపిరాడకుండా చేసి ఉండేవారు. అక్కడి వైద్యం,మానసిక శాస్త్ర నిపుణులు, హెల్ప్ గ్రూప్స్ ఇవన్నీ నన్ను అక్కున చేర్చుకుని నిదానంగా, సహనంగా-  అటు మందులతో , ఇటు ఓర్పుతో- నా వీక్ పాయింట్ నుంచి, ఒక చిన్న పిల్లలా ఆదరించి, without rush…..  ఆరోగ్యం వైపు అడుగులు వేయించారు. సరిగ్గా ఎనిమిది నెలలకు నా మరో నేను జన్మించింది.”
నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి జేబు లోంచి రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాను ఎన్ని జరిగాయి?! గుండెలో ఏదో అపరాధ భావం తాడులా బిగబట్టింది.
జానకి నిట్టూర్చింది.“మహీ! నీకు తెలుసా?నిర్ణయాలు తీసుకోలేకపోవడం, భయపడడం, బెరుకు తో మాట్లాడలేకపోవడం, పదుగురితో కలవలేకపోవడం – ఇవన్నీ-  చేత కాక పోవడం కాదు!నిన్ను అప్పట్లో నేను అలా అనే  అనుకున్నాను.వంశపారంపర్యమూ కాదు.

ఒక్కో వ్యక్తికి ఒక్కో మానసికమైన Snag -లోపం ఉంటుంది.అది ఉందన్న విషయం వాళ్లకే తెలీదు. కాస్త శాస్త్రీయంగా చూడాలి. తమ చుట్టూ జరిగే విషయాల వల్ల, సంఘటనల వల్ల- వాళ్ళ మనసు లోపలి  పొరల్లో మార్పులు. ఇవి ఒక వ్యక్తి బిహేవియర్ కి కారణం. దాన్ని ఈసడింపుతో చూసి, ఒక పేరు పెట్టి విమర్శించడం, ‘ఇక నువ్ పనికిరావు’ అని  పక్కన పెట్టడం సరికాదు. వాటి కారణాలు  వెతకాలి.  వాళ్ల సుతి మెత్తని మనసును మరింత గాయపరచే హక్కు ఎవరికీ  లేదు. ఏ మనసుకైనా కాస్త తోడ్పాటు,ప్రోత్సాహం ఇవ్వాలి. అసలైన ప్రేమ ఇదే.”

నేను కళ్ళార్పకుండా వింటున్నాను.”ఏ మేరే హమ్ సఫర్ —— ఏక్ జరా ఇంతెజా…ర్” సూపర్ హిట్ హిందీ పాట వినబడసాగింది,పక్కన పార్క్ చేసిన ఒక కారులోంచి. కుర్రాళ్ళు దిగి కబుర్లాడుకుంటున్నారు. మేం ఆ పాట ని విన్నాం. ఇద్దరి ముఖాలపైనా చల్లని చిరునవ్వు.”మజ్రూ సుల్తాన్ పురి”నెమ్మదిగా అన్నాను.

“ఫరవాలేదే!” నవ్వింది నిండుగా జానకి.

నేనూ నవ్వాను హాయిగా.పాట అయాక మొదలుపెట్టింది. “నేను అదే చదువుకున్నాను.సైకోలజీ. కౌన్సిలింగ్ లోకి అడుగుపెట్టాను.,”ఊ!!!” క్షణం ఆగింది. మళ్ళీ కొనసాగించించింది.”నీ పిరికితనం, నా అసంతృప్తి, మా కుటుంబ కట్టుబాట్ల లోని అవివేకం ఇవన్నీ వేసిన బలమైన ముద్రలను  దాటి వెళ్లాను.నా అనారోగ్యం నా బలహీనతలను బయటపెట్టింది.

నిజజీవితంలో, అరేబియన్ ,అట్లాంటిక్ అనే సముద్రాలను దాటితే, జీవితంలో శాస్త్రీయత,సహనం అనే కొత్త జలపాతాలను చూసాను. “అండర్ పెర్ ఫార్మర్స్  కౌన్సిలింగ్” అనే  కోర్సుని తయారు చేశాను.”

ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. ఎక్కడో విన్న పేరులా ఉంది,అనుకున్నాను.నేను కంపెనీ ద్వారా చేసిన కోర్సు!

మీద పడుతున్న ముంగురులని సరి చేసుకుంటున్న  జానకి లో కొత్తగా ఒక వెలుగు చూసాను.

“ఇవాళ ,ప్రపంచంలో పదిమందిలో ఆరుగురు ముందుకు దూసుకు పోవచ్చు. కానీ ఆ వెనకబడిన నలుగురిలో ఇద్దరు ఆత్మహత్యకో,  పర్వర్షన్ కో మారిపోతే?! అందుకే కౌన్సిలింగ్ అవసరం. అలా మీ ఎం.డి శ్రీకాంత్ పరిచయమయ్యారు!”

ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ నా ప్రయాణం లో ఓ కొత్త మలుపు.అప్పుడప్పుడు వర్క్ షాప్స్ కి వెళ్తూ,వస్తూ ఉంటాను.నిన్ను ట్రేస్ చేసాక నిన్నే ట్రైన్ చేయాలని పట్టుబట్టాను. ఆయన ఓకే అన్నారు.అదిలా మనం మళ్ళీ కలుసుకున్న కధ.”

జానకి, నా జాను….  నా జీవితాన్ని ఎలా మార్చిందో !

జానకి నా కేసి చూసింది, రెండు భుజాలు కొంచెం ఎగరేసి,”నో రిగ్రెట్స్.హౌ ఎబౌట్ యూ?” అమెరికన్ ఏక్సెంట్ ధ్వనిస్తోంది. తల ఊపాను.

ఒకపక్క ఆలోచిస్తూనే   ….. “ పిల్లలూ !” ,అన్నాన్నేను

“ఇద్దరు. అనంత్,వాడికి వయోలిన్ ఇష్టం అమ్మాయి-మహతి-తనకు ట్రెక్కింగ్ ఇష్టం.”
మెరిసే కళ్ళతో చెప్పింది.

మౌనంగా కూర్చున్నాం . సూర్య కిరణాలు హుస్సేన్సాగర్ అలలపై తెరలుగా విస్తరిస్తున్నాయి. ఎవరో మురళి ఊదుతూ,  వెదురు వేణువులను  బుట్టలో పెట్టుకుని, అమ్ముకుంటూ వెళుతున్నారు. వేయించిన వేరుశనగల వాసన  తాకుతోంది. దూరంగా బిర్లా మందిర్ గోపురం మీద లైట్.

“ఇంకా???” అన్నది తాను .

నిజమే నేను చెప్పాల్సినది మిగిలే ఉంది

“ సరే , ఓ! ఇదంతా నీ మహిమా?” నవ్వుతూ అన్నాను. “ఏడాది క్రితం మా బాస్ నన్ను వర్క్ షాప్ కోసం బెంగళూరు పంపితే ఇదేంటబ్బా కొత్తగా? అనుకున్నాను. నాలో లోపాలను ఎత్తి చూపిస్తున్నారేమో అని కూడా అనిపించింది.”

“కానీ ఎందుకో ఆ వర్క్ షాప్ తరువాత నాకు నేను పునఃపరిచయం అయ్యాను.నిజం! జానకీ, నా లోపలి చిక్కుముడులను విప్పుకో గలిగాను.రైట్ నౌ మా ఆఫీసులో బిహేవియరల్  సమస్యలను గురించి సలహా ఇవ్వగలుగుతున్నాను. కస్టమర్ సాటిస్ఫేక్షన్  కూడ పెరిగింది”.

” పర్సనల్ ఫ్రంట్ –నా భార్య సరోజ. ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తోంది .పాప-రాగ మాలిక . ఆరవ తరగతి . కర్నాటిక్ వోకల్ నేర్చుకుంటోంది .నేను ఇలా “…

“ య్యా!” తమాషాగ ఒత్తి పలికింది  జానకి, నా కళ్ళలోకి తిన్నగా చూస్తూ

“ విన్నాను మహీ! కుమార్ మా బావగారి అబ్బాయి.నీ గురించి చెప్పాడు. దట్స్ గూ…. డ్. ఇన్ ఫాక్ట్ వెరీ గుడ్..నాకు నువ్ తెలుసని అతనికి తెలీదు. ఉత్సాహంగా మాట్లాడాడు..” అంది.

నేను ఆశ్చర్యపోయాను.

తృప్తిగా నేను,సంతోషంగా తాను వీడ్కోలు చెప్పుకున్నాం..

*********.

 

జానకి ఇన్నాళ్ళూ       ఒక జ్ఞాపకం. ఇప్పుడొక సాకార స్వప్నం.  తనను నేను కోల్పోయాను అనే మాట, ఫిర్యాదుగా నాలో పెరిగి పెరిగి పర్వతం అయ్యి, అది నా జీవితం పై నాకున్న అసంతృప్తి గా మారినపుడు నేను వెళ్ళిన కౌన్సిలింగ్ నన్నెంత  హుందాగా మార్చిందో!

అవును నా జానకి నాలో,నాతో ఉంది . నేను వేసే ప్రతి అడుగు లోను,తానుంది, ప్రేమగా.

శైలజ కాళ్ళకూరి

శైలజ కాళ్ళకూరి

22 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • No person too small, no effort negligible. Ideal for the tumultuous world of today, one should be open to unlearn and relearn. Beautiful characters… Worth the drops of tears… Justified emotions

  • Environmental factors, circumstamces are do play a major role in shaping our personality … ..If lucky enough to fall in a truthful and honest friend group , for sure, may rise from the adversities and develop moral support and positive attitude …Just as seen with Janaki in your story ……Lot of Mahi s around us who need Janaki s …..

  • చాలా బాగుంది మేడం. చాన్నాళ్ల తరువాత ఒక లోతైన, బరువైన, ఆర్ద్రత ఉన్న కథ చదివాను. ఇలాంటి ఆణిముత్యాలు మీ కలం నుండి మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    – సూర్య ప్రసాద్, పడాల చారిటబుల్ ట్రస్ట్.

    • కథ కూర్పు చాలా బావుంది. కానీ ఇప్పటి ఫాస్ట్ ఫుడ్ జనాల కధ కాదు. పాత కధ. మహీ అంత responsible persons ఈరోజుల్లో కనపడటం కష్టం. ఇంక జానకి ok. ఇప్పటి జానకి కాదు. అంత మారిపోయిన ప్రపంచం. ఒక ఓల్డ్ సినిమా చూసినట్టు ఉంది. దేవదాస్.కానీ మెసేజ్ good. 100% positive attitude. Excellent. No ఆత్మహత్య ప్రయత్నాలు, blackmailing etc. స్వచ్చమైన ప్రేమ. జీవన దృక్పథం. ఓ మంచి కాఫీ తాగినట్లు ఉంది. Very good.

  • చాలా మంచి కథ. ఆలోచింపజేసే కథ. నీతిని బోధించె కథ, జీవితాన్ని నిలిపే కథ. చాలా బాగుంది శైలజగారు! అభినందనలు!

  • Nice story👌. If he had married the same person he loved ( in this case janaki ), he might have had a happily married life with her. Because they couldn’t, neither of them were honest to their spouses. They had married life. I would say being a married woman, she moved on and lived happily in her life. But until he met janaki, he was stuck. Telling others to move on and becoming a counsellor is not the point, could he move on….What if janaki won’t come and meet him? 🤔

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు