అణచివేత కింద అణచివేత

క బలవంతుడి చేత అణచివేయబడి, అణచివేత అలమటతో విలవిలలాడిన వాడు, తనకంటే బలంతక్కువ వాడిని రాచిరంపాన పెడుతుంటే దానినేమనాలి?

నేను నాజీలూ యూదులూ పాలస్తీనుల గురించి మాట్లాడడం లేదు. నాకంత ఎరుక లేదు కూడా. నేను మాట్లాడుతున్నది నా గురించే, నేను వెళ్లబోసుకొంటున్నది నా గోడునే.

గోడో పీడో, కలతో కల్లేడుపో, ఏమన్నా అనుకోండి, తల లోమూలన దాగిన తలపిది. చాలేండ్ల కిందట నడిచిన నడితిది.

ఇరవైయేండ్లు దాటిపోయుండచ్చు. ఉక్కపోతతో ఉడికిపోతున్న వేసంగిరేయది. చెన్నపట్నంలో పేరేగి(బస్సు) నెక్కినాను. అది కదిలినాక కాసంత ఉసురాడినట్లు అయింది. పున్నమకు మున్నుటి వెన్నెలరేయి. నిన్నమొన్నటి వరకూ తేటనీటినీ తేనెతెలుగునీ ఒడినగట్టుకొని వడివడిగ పారిన కావేటిగట్టుకు నా పయనం.

ఒకప్పుడు ఎట్లుండేది చోళనాట తెలుగు! గొంతు గొంతునా పద్దెం, గోక గోకనా గద్దెం, కేళికలు, తెరువాటలు, యక్షగానాలు, పల్లెపాటలు, పదకవితలు, సదురాటలు, దాసియాటలు, రాయసేవలు, బారకోలలు, బూమెద్దులు, సంకీర్తనలు, రాసలీలలు, రావణహస్తాలు, ముకవేణులు… ఊరంతా తెలుగు, వాడంతా తెలుగు, నాడంతా తెలుగు… ఎప్పుడో ఎన్నడో వేలయేండ్ల కిందట నడిచినది కాదిది, 1850ల వరకూ త్యాగరాజులవారు బతికున్నంత వరకూ ఉండినదే.

ఇప్పుడా కావేటిలో తేటనీరూ లేవు, ఆ ఏటిగట్టున మేటితెలుగూ లేదు. త్యాగరాజులవారి మునిమనుమరాలే తెలుగును మరచిపోయిన చోటు ఆ చోళమండలం.

ఇప్పుడక్కడ తేటనీరు అడుగంటి పొయినాయి, ఈడుగాలులు(రుతుపవనాలు) తోడుకొచ్చే మోడమేదో ఏడ్చిపోతే ఏటికొక్కటే అడుసు ఊటక్కడ.

ఇప్పుడక్కడ మేటితెలుగు మాట పడిపోయింది, నిండుపున్నమి పండువెన్నెల గుండెలవిసేలా గోడాడితే ఏడాదికొక్కటే తెలుగు పాటక్కడ.

మే నెలలో వచ్చే పున్నమినాడు ఇప్పటికీ ఇంకా మూడువూర్లలో తెలుగు మిగిలి ఉంది చోళనాట. మెలట్టూరు, శాలియమంగళం, తేపెరుమ నల్లూరు అనేవి ఆవూర్లు. ఆ మూడూర్ల కళాకారులు తెలుగు భాగవతాలను కనుబరుస్తూ(ప్రదర్శిస్తూ) ఉన్నారింకా. ఆ శాలియమంగళపు బాగవతాన్ని చూడడం కోసమే అప్పటి నా పేరేగి ఉరుకులాట.

‘కోటదాటి పేటదాటి కోరింద వనముదాటి…’ అని బొమ్మలాటల్లో ఒక పాట ఉంటుంది కదా, అట్ల నేనెక్కిన పేరేగి కోటను పేటను దాటి పరుగు పెడుతూ ఉంది. రేయి పదిగంటల పొద్దును దాటేసింది.

పట్నపు పొలిమేరలోని తాంబరాన్ని దాటుతూ ఉన్నాం. ఉన్నట్టుండి పెద్ద చప్పుడు, పెను చావుకేక. పేరేగి ఒక్క కుదుపుతో ఆగింది. అందరం తుళ్లిపడినాం. పేరేగికి వెలుపట, ‘అయ్యయ్యో నా మొగుడో… ఇంక నేనెట్ట బతికేదిరా దేవుడో…’ అంటూ గుండెలు బాదుకొంటూ తెలుగులో అరుస్తూ ఉంది ఒక ఆమె.

అడావుడిగా అందరమూ కిందికి దిగినాం. పేరేగి ముందు గానుల(చక్రాల) నడుమ ఒక ముగ్గాను(రిక్షా) నలిగి పడుంది. ఒకామె ఆ గానుల నడుమకు వంగి చూస్తూ అరుస్తూ ఉంది. కాసేపటికి ఒక బక్కపలచటి ఆయన, పేరేగి కింది నుండి పాక్కొంటూ బయటకు వచ్చినాడు. ఆయనకు పెద్దదెబ్బలు తగిలినట్లు కనిపించలేదు కానీ ముగ్గాను మటుకు నుగ్గునుగ్గయి పోయుంది.

ఆయన బయటకు వచ్చిన వెంటనే లేచి నిలబడి, ఆమె వైపుకు విసవిసా నడిచి పోయి, ‘ముయ్, ముయ్ లంజా నోరు’ అంటూ చెంప మీద లాగి కొట్టినాడు.

ఈలోపల పేరేగి నడుపరి(కండక్టర్) ఆయన దగ్గరకు పోయి, ఏబై రూపాయలు… వట్టి ఏబై రూపాయలు ఆయన చేతిలో పెట్టి, ‘పోలాం పో రైట్’ అనేసినాడు.

ఆ ఏబై రూకలకు ఆయనకేం వస్తాది? ఇది అన్యాయం అని అడిగినవాడు లేడక్కడ, నాతో కలుపుకొనే ఈమాట. గబుక్కున ఒక వందను తీసి ఆయన్న చేత పెట్టి, ‘ఆయమ్మను దేనికి కొడితివన్నా’ అని అడిగినాను.

‘ఈ లంజ తెలుగులో అరస్తా ఉండాది సామే, తెలుగోళ్లమని కదా ఆ నా కొడుకు ఏబై ఇచ్చి పోతుండేది’ అన్నాడు.

నాకు నాజీలూ యూదులూ పాలస్తీనుల గురించి తెలియదు.

నాకు సింహళులూ తమిళులూ తెలుగువాళ్ల గురించి బాగా తెలుసు.

*

స వెం రమేశ్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సదివి కడుపు రగిలిపోతుండాది. ఏమి గతి పట్టింది తెలుగుకి !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు