అడుగడుగునా తుంగనాథుని దర్శనమే! 

యాత్రాస్మృతి -5

 ఉదయం 3 గంటలకే నిద్రలేచాం ఇద్దరం. ముందు చేసిన పని బయట వాతావరణం ఎలా ఉందో అని చూడడం. చాలా చలిగా ఉంది గాని వర్షం లేదు, ఆకాశంలో మబ్బులూ లేవు. ఆ రోజుకి పౌర్ణమి వెళ్లి ఐదు రోజులే అయింది. చంద్రుడు ఎదురుగా కనిపిస్తున్నాడు. ఎక్కడా అలికిడి లేదు. రోడ్డు మీద ఉన్న ఆ ఒకటి రెండు చిన్న ట్యూబ్ లైట్ల కాంతిలో పలుచని వెన్నెల కలిసిపోయి అంతా తెల్లగా కనిపిస్తోంది. ఇద్దరం తయారయ్యాం. టైం అప్పటికి నాలుగవుతోంది. ఈ గంటలో ఎన్నిసార్లో బయటికి వెళ్లి చూసి వస్తూనే ఉన్నాం ఎవరైనా ట్రెక్కింగ్ మొదలెట్టరా లేదా అని. కుక్కలు మాత్రం విపరీతంగా అరుస్తున్నాయి. ఎక్కడో ఏ నక్కలో, అడవి జంతువుల అలికిడికో అరుస్తున్నట్టున్నాయి. టీ కొట్టు ఏదైనా తెరిస్తే కాస్త టీ తాగి బయలుదేరదాం అనుకున్నాం కానీ చిన్న అలికిడి కూడా లేదు. ఇద్దరం బయలుదేరుదామా వద్దా అని సందేహంలో పడ్డాం. ముందు రోజు కాస్త దూరం నడిచిన దారే. ఎలాంటి లైట్లు ఉండవు దగ్గరున్న టార్చ్ లైట్ తప్ప. అంత చీకట్లో ఎవరూ లేకుండా మేము ఇద్దరమే వెళ్లడం ఎంతవరకు సరి అయినది అన్నది తెలియడం లేదు. మెట్లు దిగి కిందకి రోడ్డుమీదకి వెళ్లి చూసాం. కుక్కలు మా వెనకే తిరగడం మొదలు పెట్టాయి.

ఏం చేయాలో నిర్ణయించుకోలేక తిరిగి గదికి వస్తుంటే పక్క గది నుండి ఒక ఆమె బయటకు వచ్చారు. తన స్నేహితుడికి విపరీతమైన తలనొప్పి ఉందని, మెడిసిన్ ఏమైనా ఉందేమో అని అడిగారు. మా దగ్గర ఉన్న శారిడాన్ టాబ్లెట్ తీసి ఇచ్చాం. థాంక్స్ అని చెప్పి ఆమె తిరిగి వెళ్ళిపోయారు. అప్పటికి సమయం నాలుగున్నర. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నామని అనిపిస్తోంది కానీ ఇద్దరమే వెళ్లడానికి ధైర్యం చాలటం లేదు. మరో 10 నిమిషాలు గడిచేసరికి పక్కన ఉన్న ఆమె బ్యాక్ ప్యాక్ తగిలించుకొని బయటికి వచ్చారు. వెంటనే అడిగాం ట్రెక్కింగ్ కి వెళుతున్నారా అని. అవును మీరు వస్తారా అన్నారు. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా రూమ్ లాక్ చేసి ఆమె వెంట బయలుదేరాం. అక్క చేతిలో టార్చ్ ,నాకు హెడ్ టార్చ్ ఉన్నాయి. ఆమె దగ్గర కూడా ఒక హెడ్ టార్చ్ ఉంది. ఆమె పేరు జూలియా. పోలండ్ నుండి వచ్చారు. ప్రొఫెషనల్ ట్రెక్కర్ .ఒక్క ఐదు నిమిషాలే మాతోపాటు వచ్చేరు. తర్వాత ఆమె చాలా త్వర త్వరగా ముందుకి వెళ్ళిపోయారు. ఆమె వెనకాలే కుక్కలు కూడా.

ఇక మిగిలింది మేము ఇద్దరమే. చెప్పాలంటే ఒక వంద మీటర్లు వచ్చేరు ఆమె మాతో కలిసి. ఆ కాస్త ధైర్యం మేము ఒక్కరమే ముందు ఎందుకు చేయలేకపోయాం? ఏ భయం మమ్మల్ని వెనక్కి లాగింది? మా మీద మాకు ఆ మాత్రం ఎందుకు నమ్మకం లేకపోయింది? పోనీ ఇప్పుడైనా మా వెనక ఎవరైనా వస్తున్నారా అంటే అదీ లేదు. అర్థంలేని భయంతో వెనక తీసాం అనిపించింది. ఇద్దరికీ టార్చ్ వెలుగులో దారి స్పష్టంగా కనిపిస్తోంది.

మెల్లగా వెన్నెల కూడా తెలుస్తోంది. మా వెనుకనే ఆకాశంలో చక్కగా చంద్రుడు చెట్ల మధ్యనుండి కనిపిస్తున్నాడు. చుట్టుపక్కల పరిసరాలు మాత్రం ఎలా ఉన్నాయో తెలియడం లేదు. చిమ్మ చీకటి. చంద్రుడిని, వెన్నెలని చూస్తూ నడుస్తూనే ఉన్నాం. అంత పెద్ద పెద్ద పర్వతాల ఆనవాలు కూడా ఆ చీకట్లో తెలియడం లేదు .ఉదయం ఆరు    గంటల సమయంలో కొద్దిగా వెలుగు కనిపించింది.చుట్టూ ఉన్న ఎత్తైన చెట్ల ఆకారాలు తెలుస్తున్నాయి. ఆ పలుచటి వెలుగులో లేత నీలిరంగు ఆకాశంలో చెట్ల మధ్య నుండి దూరంగా చౌకంభ శిఖరం కనిపించింది. మరి కాస్త ముందుకు వెళితే మంచుతో కప్పి ఉన్న మిగిలిన శిఖరాలు స్పష్టంగా ఏ మేఘాలు లేకుండా కనిపించాయి. మా ఆనందానికి అంతులేదు. ఇంత బాగా కనిపిస్తాయో లేదో అని అంతవరకు అనుకున్నాం. వాటిని చూసుకుంటూ ముందుకి నడుస్తున్నాం.

సూర్యుడి తొలి కిరణాలు ఆ శిఖరాలపై పడి పచ్చగా మెరవడం మొదలెట్టాయి. నిజంగా చూడవలసిన దృశ్యం అది. పీక్ ఫైండర్ యాప్ తో ఆ శిఖరాలన్నింటికీ ఫొటోస్ తీసుకున్నాం.

మధ్య మధ్యలో ఆగుతూ, కాస్త వేడి నీళ్లు తాగుతూ, చాక్లెట్స్ తింటూ నడక సాగిస్తున్నాం. ఎక్కువసేపు ఎక్కడా కూర్చోలేదు. క్రమంగా దారికి ఇరువైపులా కొద్ది కొద్దిగా మంచు కనబడుతోంది. పర్వత వాలు ప్రాంతంలో మంచు కాస్త ఎక్కువగా ఉంది. అలా ఉదయం నాలుగు గంటల నలభై అయిదు నిమిషాలకి ట్రెక్కింగ్ మొదలుపెట్టిన మేము ఇంచుమించుగా ఏడు గంటలకు ఆలయ పరిసర ప్రాంతాలలోకి చేరుకున్నాం.

చిత్రం ఏంటంటే ఈ మూడు గంటలలో మా వెనక వస్తూ ఎవరూ కనిపించలేదు, ఒక 20 ఏళ్ల అబ్బాయి తప్ప. మమ్మల్ని పలకరించి అతడు ముందుకు వెళ్లిపోయాడు. 7:30 అవుతుండగా ఎదురుగా జూలియా వస్తూ కనిపించారు. ఆమె వెనకే కుక్కలు కూడా. దగ్గరగా వచ్చాక పలకరించుకున్నాం .ఆమె అప్పుడే చంద్రశిల కూడా చూసి వస్తున్నారు. ఆమెతో కలిసి ఫొటోస్ తీసుకున్నాం. చాక్లెట్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్తూ థాంక్స్ చెప్పాం. బహుశా ఆమె ఆ ఉదయం మాకు కనిపించకపోయి ఉంటే మేము ఇంకా ఎంత ఆలస్యం చేసి ఉండేవారమో!

ఎండ ఎక్కువ వాతావరణం లో వేడి పెరుగుతున్న కొద్దీ శిఖరాలన్నీ పొగలాటి మేఘాలతో కప్పడిపోతాయి. ఇంత కష్టపడి వచ్చి, వాటిని చూడలేకపోతే ఎలా? అందుకే అంత ఉదయాన్నే బయలుదేరింది. జూలియా మా దగ్గర సెలవు తీసుకుని కిందకి వెళ్ళిపోయారు. మేం మళ్ళీ ముందుకు నడవడం మొదలు పెట్టాం. మరో పావుగంటకి ఆలయం కనబడడం మొదలైంది.

ప్రశాంత వాతావరణంలో ఉదయాన్నే మనుషుల అలికిడి కూడా లేని ఆ సమయంలో చుట్టూ మంచుతో కప్పడిన శిఖరాలు, లోయలు, దూరంగా ఆలయం… నిజంగా అద్భుతం ఆ దృశ్యం. ఆలయానికి మరికాస్త దగ్గరగా వెళ్ళాం.

అక్కడినుండి ఒక్క రెండు మలుపులు తిరిగితే ఆలయం. అక్కడ మాత్రం దారి కొద్దిగా వాలుగా ఉంది. ఉదయం 8 అయింది. ముందు రోజు పడిన మంచు కరిగి మెల్లిగా నీరుగా మారుతోంది. మంచు గాజు పలకలా తయారయింది. ఒక చివరగా మంచులేని దారి సన్నగా ఉంది. జాగ్రత్తగా అడుగు వెనక అడుగు వేసుకు వెళ్లాలి. వెనక వస్తున్న అక్కకి “ఇక్కడ కాస్త జారుతున్నాం. జాగ్రత్తగా రా” అని చెప్పాను. చెప్తూ అడుగు పక్కనే మరో అడుగు వేసాను. సరిగ్గా మంచు మీద కాలు పడడంతో ఒక్కసారిగా జారిపడ్డాను. ఏదైనా ఆధారం పట్టుకుని లేచి నిలబడడానికి కూడా వీలు లేదు. ఎలాగో మెల్లిగా లేచేను. ఈసారి మళ్లీ చాలా ఘోరంగా బోర్లా పడిపోయాను. పెదవి మీద, నుదుటి మీద దెబ్బలు తగిలి రక్తం కారడం మొదలెట్టింది. అలాగే ఓ ఐదు నిమిషాలు ఉండి, తేరుకుని, మెల్లిగా లేచి కూర్చుని, జారుతూ కిందకి వచ్చేసాను. ఇద్దరికీ ధైర్యం చాలలేదు మళ్లీ మీదకు వెళ్లడానికి. అక్కడే ఓ గట్టుమీద కూర్చుని ఉండిపోయాం. నిజంగా అప్పటి బాధ మాటల్లో చెప్పలేను. గుడి మూసి ఉంటుందని తెలిసీ కనీసం ఆలయం వరకు వెళ్లి రావాలి అనుకొని వచ్చాం. ఇప్పుడు మరికొన్ని అడుగులు వేస్తే మేము అనుకున్న గమ్యానికి చేరుతాం. కానీ, వెళ్ళలేకపోతున్నాం. నామీద నాకే కోపం, ఒక రకమైన పంతం, బాధ… ఇలా ఏవేవో. కాస్త కిందకి దిగి దూరం నుండి కనిపిస్తున్న ఆలయాన్ని, పర్వత శిఖరాలను చూస్తూ ఓ రెండు గంటల పాటు కూర్చున్నాం.

కాసేపటికి ఉదయం మమ్మల్ని పలకరించి వెళ్లిన అబ్బాయి తిరిగి వస్తూ కనిపించాడు. ఆలయం పక్కనుండి చంద్రశిల వైపు వెళ్లడానికి ప్రయత్నించాడట. కానీ దారి బావులేదని, జారిపోతున్నామని చెప్పాడు. మాలో ఒక రకమైన నీరసం వచ్చింది. సరే కనీసం ఇంతవరకు రాగలిగాం అని సరి పెట్టుకున్నాము. ఇంతలో ఇద్దరు భార్యాభర్తలు బెంగాలీ వాళ్ళు వచ్చారు. జాగ్రత్తగా చూసుకుని ఎక్కమని, జరిగిన సంగతి చెప్పాం .వాళ్లకి ట్రెక్కింగ్ లో అనుభవం ఉన్నట్టుంది. వాళ్లు వెళుతూ మమ్మల్ని కూడా రమ్మన్నారు. అప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. ఆ రెండు గంటల కాలంలో మంచు కూడా కరిగి నీరుగా మారి, దారి కాస్త వెడల్పు అయింది. దాటడం కష్టం అయిన దగ్గర అతను చేయి అందించి మాకు సాయం చేశారు. ఎలాగో మొత్తానికి మేము అనుకున్న గమ్యాన్ని చేరుకున్నాం. తుంగనాథ్ ఆలయం ఎదురుగా కనిపించింది. భోలే బాబా కి జై అనుకున్నాం. చాలా తృప్తిగా అనిపించింది.

కొన్ని మనం ఊహించలేం. ఉదయం మేము నాలుగు గంటలకే అనుకున్నట్టుగా బయలుదేరి ఉంటే ఆలయం దగ్గరకు వచ్చేసరికి మంచు కరగకుండా గట్టిగా ఉండి దాటగలిగి ఉండేవాళ్ళమేమో! జాగ్రత్తగా చూసుకుని అడుగు వేసుంటే కూడా పడి ఉండే వాళ్ళం కాదు. లేదంటే అందరిలా బాగా ఆలస్యంగా ట్రెక్కింగ్  మొదలెట్టినా ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే తిరిగి కిందకి దిగుతున్న సమయంలో ఎవరి సహాయం లేకుండానే జాగ్రత్తగా ఆ దారి దాటుకుని వచ్చాం. ఇదేమీ కాకుండా… పడిపోగానే భయపడి ఎలాగో మరి ముందుకు వెళ్లలేం అనుకుని కిందకి దిగిపోతే మా యాత్ర అసంపూర్తిగానే మిగిలిపోయి ఉండేది.

ఏదేమైనా అనుకున్నది సాధించాం. మెల్లగా దిగడం మొదలుపెట్టాం.  మేఘాలతో మూసుకుపోయిన పర్వత శిఖరాలు కనిపించాయి. చాలామంది ఎక్కుతూ కనిపించారు. వాళ్ళందరూ మాకంటే సులువుగా ఆలయం దగ్గరికి చేరుకోగలరేమో!కానీ, ఉదయాన్నే మేము చూసిన ఆ ప్రకృతి సౌందర్యం, పొందిన అనుభవం మాత్రం వీళ్లు పొందలేరు.

కొన్ని అనుభవాలు పాఠాలు నేర్పిస్తాయి.

ప్రయాణం మొదటి కొన్ని అడుగులు, చివరి అడుగులు మేం ధైర్యంగా వేసి ఉండాల్సింది.

పడితే పడిపోయాం కానీ లేవగలిగాం.

అనుకున్న గమ్యానికి చేరుకున్నాం ఒకరి  సహాయంతోనైనా.

చూడాలనుకున్నది చూసాం తృప్తిగా.

ఉదయం మా వెన్నంటే వచ్చిన చందమామ, ఆ వెన్నెల ,మేం పాడుకున్న పాటలు, తొలివెలుగులో కనిపించిన ఆ నీలి ఆకాశం, సూర్య కిరణాలు పడి పచ్చగా మెరిసిపోయిన ఆ మంచు పర్వతాలు, చౌకంభ, కేదార్ పర్వత శిఖరాలు, హిమాలయ పర్వతాల మధ్య ఆ ప్రత్యక్ష నారాయణుడి దర్శనం…. ఇవన్నీ  తుంగనాధుడి దర్శనం కాదూ!?

*

స్వాతి పంతుల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు