అడిగినట్లు చెప్పు….

నిన్ను చూస్తే ఊరంతా

సినిమా రీలు తీరు

కండ్ల ముందు తిరుగు తున్నది

నువ్వు మాట్లాడుతుంటే

వాడకట్టు ముచ్చట్ల వాసన

పెయ్యంతా పాకినట్లున్నది

 

నువ్వు ఏదో చెప్తావని

తడిసిపోయిన యాది

లోలోన కదలాడుతున్నది.

 

కూన పెంకల మన బడి బాగుందా

పైనుంచికారే సూర్య కిరణాలు,

వాన ధారలు బాగున్నాయా

దొడ్డికాడి ఎంకమ్మ,  రేణిపండ్ల  రంగవ్వ

అట్లనే  వున్నారా   వంగిపోయారా

బతుకు బరువుల్ని మోసిమోసి

కుషిలవడ్డరా…

 

అంగి కింద పిప్పరమెంటు పెట్టి  కొరికి

పానపానంగా ఇచ్చిన  బక్కమల్లేశును

ఎండాకాలం తన కడుపుపై ఎగిరినా

తల్లిలా ఓర్సుకొని చల్లదనమిచ్చిన

మోటబావిని అడిగినట్ట్లు చెప్పు

 

లెక్కల కాపీ ఇచ్చిందానికి

కుడుకా బెల్లం పోట్లెం

సాటుకు చేతుల వెట్టిన

దుకాణం పార్వతిని అడిగినట్లు చెప్పు

 

పదిహేనేళ్ళకే పూర్ణమ్మయి

ఇరవై య్యేళ్ళకే పూలులేని చెట్టయిన

కల్పనను అడిగినట్లు చెప్పు.

 

మనసు వాకిట్లో

రంగురంగుల పూలు పేర్చినట్లు

బొడ్డెమ్మ పాటలు పాడే

దూదేకుల బిస్మిల్ల అక్కను

అడిగినట్లు చెప్పు

నిల్చున్న జాగల్నే సవార్ల తీరు ఎగిరేట్టు

డప్పు కొట్టే మాదిగ ఈరన్న తాతను

అడిగినట్లు చెప్పు

భుజం భుజం కలిపి నాతో *గుండమాడిన

గాండ్ల భూమన్నన్ని అడిగినట్లు చెప్పు

 

నాతో పాటు మొలిచి ఎదిగిన

పూల గౌనుల మామామిడి చెల్లెండ్లను

చూడ వస్తానని చెప్పు

 

అమ్మ తిట్టినపుడు అలిగిన మొఖాన్ని

ఒడిలో దాచుకున్న హనుమాండ్ల గుడిని

నాన్న కొట్టినపుడు దెబ్బల్ని ఓదార్చిన

పొచ్చమ్మ  యాపచెట్టును

అడిగి నట్లు చెప్పు

 

బడికెళ్ళినపుడు కాలిపోతున్న పాదాలకు

రక్షణ పత్రాలైన మోతుకాకుల్ని

రెండు వందల బాకికే

అమ్మ చెవి పోగుల్ని

గుంజుకున్న  అప్పులోన్ని

అడిగినట్లు చెప్పు

 

ఆకలియినపుడు కడుపుకు ఆసరయిన

సీమచింతను, చెలిమె ఊటను

అడిగినట్లుచెప్పు

 

నన్ను ఇంత వాణ్ణి చేసిన

మనిషిగా మలిచిన

నను గెలిపించిన

మన ఊరు మట్టిని

పీల్చిన గాలిని

మరీ మరీ అడిగినట్లు చెప్పు

***

*గుండం =పీరీల పండగ నాడు

దూల ఆడడం

 

ఉదారి నారాయణ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు