అడవికన్నా అందమైనది అడవే! 

ప్రకృతితో ఈమెకెంత మమేకం! అడవి హక్కుల్ని గుర్తించిన రచయిత్రిని మనం మొట్టమొదటిసారి చూస్తున్నాం.

1

వాల్మీకి రామాయణంలో కైకేయి తొలికోరిక మేరకు రాముడు అరణ్యవాసం చేయనున్నాడని తెలిసిన సీత ఎంతో సంతోషించి నేనూ నీతో వస్తానంటుంది. రాముడు కౄరమృగాలతో రాక్షసులతో నిండి ఉండే  అరణ్యంలో నివాసం ఎంత క్లేశభరితమైనదో చెప్పి వారింపజూస్తే సీత అడవుల్లో కొండలూ జలపాతాలూ తామరపూలసరస్సులూ కూడా ఉంటాయనీ రాముడితో వనవాసం తనకు పుట్టింటిలో ఉన్నట్టే  అని వాదించీ గెలిచి రాముడ్ని ఛాయవలె అనుసరిస్తుంది. జయతీ లోహితాక్షన్‌గారి “అడవి నుండి అడవికి” Title చూడగానే వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టం నాకు జ్ఞప్తికొచ్చింది. స్త్రీలు సాహసులు.

జయతిగారికి అడవులతో ఈ అనుబంధం చూస్తే “ఈనాటి ఈ బంధమేనాటిదో” అనిపిస్తుంది. ఉన్న ఊరూ ఉద్యోగమూ అన్నీ వదులుకొని అడవుల్ని వెతుక్కుంటూ ప్రయాణిస్తూ తోవలో తారసపడిన శ్రమైకజీవనసౌందర్యాన్ని చవిచూస్తూ అందులో భాగమై, చెట్లతో పిట్టల్తో వాగూవంకల్తో కొండమబ్బుల్తో స్నేహం చేశారీమె.

ఈ పుస్తకం యాత్రాసాహిత్యంకాదని సమీక్షకులందరూ చెప్పినదే. యాత్రలు అవసరమైన కొత్త సాహిత్యమిది. వ్యాసవాల్మీకులవంటి ఋషులూ ద్రష్టలూ అడవుల్లో తపస్సు చేస్తూ అందులో భాగంగానే పురాణకావ్యాలు జగద్ధితానికై రచిస్తే జయతిగారు ఆత్మసాక్షాత్కారానికై అడవుల్ని వెతుక్కుంటూ వెళ్ళి ఈ కవితాత్మకమైన కమ్మని రచన మనకందించారు. ఈ పుస్తకం మనకి కేవలం ఓ ఇద్దరు సాహసికుల్నీ వాళ్ళు తిరిగిన దారుల్నీ మాత్రమే పరిచయం చెయ్యదు, ఈ హడావిడీ జీవితంలో ఈ యాంత్రిక ప్రపంచంలో మనం కోల్పోతున్న మన సహజాతగుణాన్ని మనకు మళ్ళీ వెన్నుతట్టి గుర్తుచేస్తుంది.

మహానగరాల్లో Traffic లోనే సగానికిసగం కాలం వ్యర్థమవుతున్న ఈ దశకంలో మనం వెన్నుతట్టి పిలిస్తే తప్ప వెనుదిరిగి చూడం. ఎంత వెనక్కెళ్ళి చూస్తే అంత పచ్చగా కనిపించే అడవులూ కొండలూ ఆ దాపునున్న మట్టిమనుషులూ మనకర్థంకారు. “పాటలసంసర్గసురభివనవాతాలూ ప్రచ్ఛాయసులభనిద్రలూ రమణీయమైన దివసాపరిణామాలు” మనకు అనుభూతంకావు.

2

“ఓ సాలవృక్షమా
నిన్నెక్కడో చూశాననిపిస్తుంది
“మనమెప్పుడో కలిశామనిపిస్తుంది
పాలపిట్టా
నేనెవరు?”

ఇది ఛత్తీస్‌ఘడ్ దగ్గరి అడవిని ఈమె పరామర్శించిన విధం. ఇందులో తననుతాను కనుగొన్న రహస్యమూ ఉంది.

***

“మా అదృష్టంకొద్దీ ఆ రోజు కరెంట్‌లేదు. …. చల్లటి తెల్లటి వెన్నెల అంతటా పడుతోంది.”
కరెంట్‌లేకపోతే మనకు జెనరేటర్లున్నాయి. అవీ పనిచేయకపోతే అప్పుడు మన కళ్ళు విచ్చుకుంటాయి.

“అడవి వేసుకున్న నెగడు మోదుగ” ఇది అడవిపాటకి పల్లవి. అడవిని ఆవహించమని పిలిచే అగ్నిమీళే వంటి ఆదిమమంత్రం.

“సీమచింత చెట్టు నాకు అమ్మ.” అంటారీమె సీతా చ మాతా మమ అని భక్తులనుకున్నట్టే!

దున్నేవాడిదే భూమి అనే నినాదం మనకు తెలిసిందే. అయితే ఈమె ఇంకో అడుగు ముందుకేసి అడవిని మనిషి కబ్జా చేయకూడదనీ అడవి అడవిజీవులకే చెందుతుందని ఒకచోట అంటారు.

ప్రకృతితో ఈమెకెంత మమేకం! అడవి హక్కుల్ని గుర్తించిన రచయిత్రిని మనం మొట్టమొదటిసారి చూస్తున్నాం.

ఈశాన్యం మొదలుకొని దక్షిణాది దాక ఈమె బస్సుల్లో కిటకిటలాడుతున్న రైళ్ళలో సైకిళ్ళపైనా కాలినడకనా చేసిన ప్రయాణాల్లో నదీనదాలు అడవులు కొండలు వీరిని అక్కున చేర్చుకున్నాయి, సేదదీర్చాయి. పునర్దర్శనప్రాప్తిరస్తు అని దీవించాయి. నిజానికి ఈ పుస్తకంపై ఇంకా చాలా రాయచ్చు. అదికాదు ముఖ్యం. నేర్చుకోవాలి. ప్రకృతిమాతను శరణువేడుకుని సేదదీరడం నేర్చుకోవాలి, ఆ గుణం అలవర్చుకోవాలి. అదే ముఖ్యం.

అడవి నుండి అడవికి

For copies,
Jayati Lohitakshan or
Matti Pracuranalu, Mobile : 98480 15364
All major bookshops

Avatar

వాసు

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • From the book, the following info is excerpted

   For copies
   Putta Pushtaka Shibiram
   Alagadapa, Miryalaguda
   &
   All leading book shops.

   I will request Jayati to answer your specific question. Hope this is OK with you.

   -Vasu-

  • కొల్లి సాంబశివరావు : సర్, నవోదయ లో ఉంటున్నాయి. లేదా పైన ఇవ్వబడిన మట్టి ముద్రణలు వేనేపల్లి పాండురంగారావు గారి నంబర్ (9848015364) కి మీ పోస్టల్ అడ్రస్ ఎస్సెమ్మెస్ పంపిస్తే వారు మీకు పుస్తకాన్ని పోస్టులో పంపిస్తారు.

 • నిజానికి జయతి లోహితాక్షన్లు ఇద్దరూ ఒక అపరూపమైన జంట. నాకు వారిద్దరితోనూ కలిసి తిరిగిన కొద్దిపాటి అనుభవం వుంది. వారి దృష్టి వేరు, ఆలోచనలు వేరు. మీరు చాలా బాగా రాసారు. కానీ మరి కొంత వివరంగా రాస్తే బాగుండేది. అందుకు జయతి పూర్తిగా అర్హురాలు. మీ లోతైన అవగాహన అభివ్యక్తిని దృష్టిలో పెట్టుకొని అంటున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు