‘అట్టకత్తి’ సినిమా: ఒక కుర్రోడి కథ

భారతీయ సినిమాను కరోనా ముందు, కరోనా తర్వాత అని నిర్వచించుకోవాల్సిన సమయమిది.  ఎందుకంటే ఓ.టి.టి ప్లాట్ఫామ్లు థియేటర్స్ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి. ‘మోర్ లోకల్, మోర్ గ్లోబల్’ అనే నినాదంతో కథా వస్తువుని కూడా నిర్దేశిస్తున్నాయి. ‘మోర్ లోకల్’ నినాదం పా. రంజిత్ తన మొట్ట మొదటి సినిమా ‘అట్టకత్తి’ (2012) తోనే ప్రారంభించారా అనే అనుమానం కలగకమానదు. మన తెలుగు సినిమాలు పాతికేళ్ళ క్రితమే మోర్ లోకల్ కథలు వదిలేశాయి. కానీ తమిళ్ సినిమాలు వదల్లేదు. ఈ వరుసలో ‘అట్టకత్తి’ సినిమా ప్రత్యేకత ఏమిటంటే? ఇది మోర్ లోకల్ కాకుండా చెన్నై చుట్టుపక్కల ఊళ్ళ నుండి చెన్నైకి బస్సులో చదువుకోవడానికి వచ్చే వారిలో దినకరన్ అనే ఒక కుర్రోడి కథ. టీనేజ్ కుర్రాళ్ళ ఆలోచనలు, అమ్మాయిల పట్ట వాళ్ళ ఆకర్షణలు కళ్ళకు కట్టినట్లుగా పా. రంజిత్ ఈ సినిమాలో చూపించాడు. ఈ సినిమా రెండువేల పన్నెండులో రిలీజ్ అయినా కథ మాత్రం రెండువేల సంవత్సరంలో మొదలవుతుంది.

హీరో (దినేష్) దినకరన్ ని అతని స్నేహితులు ‘అట్టా’ అని పిలుస్తూ ఆటపట్టిస్తుంటారు. దినకరన్ ఇంటర్ ఇంగ్లీష్ పేపర్‌లో ఫెయిలై సప్లమెంటరీ పరీక్షకు చదువుతూ ఉంటాడు. స్నేహితులతో కలిసి అమ్మాయిల వెంటపడుతూ సమయాన్ని వృధా చేస్తుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందులో భాగంగా నాలుగు అమ్మాయిల వెంటపడి చివరికి ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఉపాధ్యాయుడిగా స్థిరపడతాడు. ఆ క్రమంలో అతని జీవితంలో జరిగిన అనేక మలుపుల ప్రేమకథ ఈ కట్టకత్తి సినిమా. మొదటి అమ్మాయి పూర్ణిమ (నందితశ్వేత) బస్సు ప్రయాణంలో చూసి, వెంటపడుతుంటాడు. పూర్ణిమ, దినకరన్ ని చూసి నవ్వుతుంటుంది. అతడిని ఇష్టపడినట్లు కనిపిస్తుంది. కానీ అకస్మాత్తుగా ‘అన్నయ్య’ అని పిలుస్తుంది. దినకరన్ విచారంగా ఉంటున్నట్లు నటిస్తాడు కానీ అతని వల్ల కాదు. దినకరన్ తర్వాత తన ఇంటికి వచ్చిన దూరపు బంధువు ‘అముద’ని (ఐశ్వర్యరాజేష్) ప్రేమించడం మొదలు పెడతాడు. కానీ ఆమె దినకరన్ అన్నయ్య విశ్వనాధ్ తో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత దివ్య – నదియా వెనకపడతాడు. వాళ్ళ అన్నలు, గ్రామస్థులు దినకరన్ ని వెంటపడి కొడతారు. దినకరన్ ఇలా లాభం లేదని తనను తాను రక్షించుకోవడానికి, అమ్మాయిల్ని ఆకట్టుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందాం అనుకుంటాడు. అదీ కూడా పూర్తి చెయ్యడు. దినకరన్ ప్రేమను వదిలేసి చదువు పై దృష్టి పెడతాడు. తన ఇంగ్లీష్ ఎగ్జామ్ పాసవుతాడు. కాలేజీలో చేరతాడు. ఎప్పుడూ తగాదాలతో, సమస్యలతో నలుగుతుంటాడు. దినకరన్ అంటే కాలేజీలోని విద్యార్దులందరూ గౌరవిస్తూనే భయపడతుంటారు. అలా పవర్ ఫుల్గా సాగిపోతున్న దినకరన్ జీవితంలోకి మళ్ళీ పూర్ణిమ అదే కాలేజీలో జూనియర్ గా వస్తుంది. పూర్ణిమ పలకరించినా దినకరన్ ఫోజులు కొడుతుంటాడు. రోజులు గడిచే కొద్దీ మళ్ళీ పూర్ణిమ ప్రేమలో పడతాడు. ఆమె తనను ప్రేమిస్తుందని దినకరన్ నిశ్చయించుకుంటాడు. ఆమెకు ప్రపోజ్ చేయడానికి పూర్ణిమకు నచ్చిన తన పాత హెయిర్ కట్, వేషదారణ కూడా మార్చుకుంటాడు. అది చూసి అతని కుటుంబం, స్నేహితులు ఆటపట్టిస్తారు. కానీ పూర్ణిమ మాత్రం అతని కొత్త రూపాన్ని మెచ్చుకుంటుంది. పూర్ణిమ ప్రేమ విషయం ఇంట్లో తెలిసి కాలేజీకి పంపడం మానేస్తారు. పెళ్ళి సంబంధాలు చూడ్డం మొదలుపెడతారు. ఈ విషయం తెలుసుకున్న దినకరన్ తీవ్ర భయాందోళనలకు గురై తన పాత స్నేహితుల సహాయంతో పూర్ణిమను లేపుకుపోవాలని ఫ్లాన్ వేసి రక్తంతో లెటర్ రాసి పూర్ణిమకి ఇస్తాడు. లెటర్ లో రాసినట్టుగా వాళ్ళ ఊరి గుడి దగ్గర ఎదురు చూస్తారు. కానీ పూర్ణిమ రాదు. తెల్లారిపోయే సరికి బైకుల మీద నిరాశతో వెళ్ళిపోతుంటే బస్సులో పూర్ణిమ కనిపిస్తుంది. వెంటనే ఆగమేఘాల మీద బస్సు ఎక్కుతాడు దినకరన్. పూర్ణిమకు వేరే వ్యక్తితో పెళ్ళైపోయి ఉంటుంది.! ఆమె దినకరన్‌తో అసలు ప్రేమలో పడలేదనే స్పష్టత అతనికి వస్తుంది. పూర్ణిమ పెద్దల్ని ఎదిరించి తన బాల్య ప్రేమికుడైన మరో దినకరన్ని ప్రేమ పెళ్ళి చేసుకుంటుంది. దినకరన్ కి పరిచయం చేస్తుంది. దానితో హీరోకి మబ్బులు విడిపోతాయి.! మళ్ళీ తన ప్రేమ ప్రయత్నాల్లో భాగంగా మరో అమ్మాయిని తగులుకుంటాడు. చదువు పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా స్థిరపడి చివర ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. కథ ముగుస్తుంది.

పా. రంజిత్ ‘అట్టకత్తి’ సినిమా ద్వారా కౌమార దశలో ప్రేమ కన్నా ఆకర్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టంగా చెప్పాడు. లేనిపోని హీరో లక్షణాలను దినకరన్ పాత్రకు తగిలించి ఉదాత్తమైన, గొప్పపాత్ర అని చెబుతూ క్లాసులు పీకలేదు. ఆ కౌమార దశలో ఉండే చంచలత్వాన్ని, ఆకర్షణల్ని చాలా సహజంగా చూపించాడు. ఈ సందర్భంగా మన తెలుగు ‘జోష్’ (2009) సినిమాలో హీరో ‘నాగచైతన్య’ కాలేజీ లెక్చరర్స్ ని స్టేజ్ మీద ఇలా ప్రశ్నిస్తాడు. ‘‘చిన్నపిల్లలకు పాఠాల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగించాలో చాలామంది చాలా బుక్స్ రాశారు. కానీ ఒక కాలేజ్ కుర్రోడి ఆలోచనల్ని ఎనలైజ్ చేసి ఎవరైనా ఒక్క బుక్కైనా రాశారా సార్?’’ అని అడుగుతాడు. నిజంగా అలాంటి ఒక బుక్కు ఇప్పటికీ రాసే ప్రయత్నం జరగలేదని అనుకుంటున్నాను.! ఒకవేళ అలాంటి బుక్స్ ఉంటే అవి ఎంతమంది విద్యార్దులకు అందుబాటులో ఉన్నాయనేది ప్రదాన ప్రశ్నగా మిగులుతుంది. ఆ కౌమార దశ అనేది మనిషి జీవితంలోనే చాలా జటిలమైన దశ.! తమ పిల్లలు ఆ దశని క్షేమంగా దాటాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఆ కౌమార దశ మీద ఏకంగా మొత్తం సినిమాయే తీసే ధైర్యం పా. రంజిత్ చేశాడని మాత్రం ఖచ్ఛితంగా చెప్పుకోవచ్చు. శంకర్ ‘బాయ్స్’ (2003) సినిమాలో కొంత ఈ కౌమారదశ గురించి చెప్పే ప్రయత్నం చేసినా కెరియర్ సెటిల్మెంట్ గురించి ఆ సినిమాలో ఎక్కువ ఫోకస్ చేశారు. మన తెలుగు ‘జోష్’ సినిమాలో కూడా కొంత చెప్పి కాలేజీ యువతని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారో చూపించే ప్రయత్నం ఎక్కవ చేశారు. ఇలా కొన్ని సినిమాలు అడపాదడపా వచ్చినా ఆ కౌమారదశని ‘అట్టకత్తి’లో పా. రంజిత్ చూపించినంత ప్రభావవంతంగా ఎవ్వరూ చూపించలేదు. అసలు ఈ కౌమార దశ అంటే ఏమిటి? ఈ సినిమాకు దానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? అదేమిటో కూడా చూద్దాం.!

ఈ దశను యవ్వనారంభ దశ లేదా కిశోరప్రాయదశ అని అంటారు. 13 సంవత్సరాల నుంచి 21 వరకూ ఈ దశ కొనసాగుతుంది. ఈ దశలో ‘‘ఉద్వేగాలు తీవ్రస్థాయిలో ప్రస్ఫుటమవుతాయి. క్షణానికొక విధంగా ప్రవర్తించే నైజం కనబడుతుంది. మొదట ఉత్సాహం చూపించడం, తరవాత ఉదాసీనత చూపించడం వంటి లక్షణాలను ప్రదర్శిస్తారు. వారు చేసిన పనిని విమర్శచేసినా, అపహాస్యం చేసినా తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తూ, తమకోర్కెలు నెరవేరనప్పుడు ఏర్పడే ఒడిదుడుకులకు తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం వరకు వెళ్తారు. భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి ఆతురత ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా వచ్చిన తీవ్రమైన మార్పులను స్వీకరించలేక తీవ్రమైన ఒత్తిడికి గురై ఉద్వేగ అస్థిరతకులోనవుతారు. నాయక ఆరాధన భావన (Hero worship) ఎక్కువగా ఉంటుంది. అభిమాన తారలను (Actors) క్రీడాకారులను అమితంగా ఆరాధించి వారి చిత్రపటాలను సేకరించడానికి, వారిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు. పగటి కలలు కంటూ ఊహాజగత్తులో విహరిస్తూ ఎక్కువ కాలాన్ని గడుపుతారు. లైంగిక ఆకర్షణల వల్ల వస్త్రధారణ, అలంకరణలపై ఎక్కవ శ్రద్ద చూపిస్తారు’’. (విద్యా మనో విజ్ఞాన శాస్త్రం, పుట: 59.) అని ఈ కౌమారదశ లక్షణాల గురించి బి.ఎడ్ సైకాలజీలో కొంత వివరించే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఏ విషయాన్ని లెక్కచెయ్యకపోవడం ఈ వయస్సులో బాగా కనిపిస్తుంది. చదువు మీద శ్రద్ధాసక్తులు తగ్గి, దురలవాట్లకు లోనయ్యే అవకాశం కూడా ఈ కౌమార దశలో ఎక్కవగా ఉంటుంది. ఈ విషయాల్నే దినకరన్ పాత్రలో చూడవచ్చు. పా. రంజిత్ వ్యక్తిత్వ పరంగా తన సినిమాల్లో దురలవాట్లని ఖండిస్తూ చూపిస్తాడు కనుక ఈ సినిమాలో హీరోకు ప్రకృతి రిత్యా వచ్చే ఆకర్షణలు తప్పా చెడు అలవాట్లకు గురైనట్లు చూపించలేదు. మన తెలుగు ‘అర్జున్ రెడ్డి’ సినిమాలాగ.

దినకరన్ ‘ప్రేమ, ప్రేమ’ అని పూర్ణిమ వెంటపడుతుంటే పూర్ణిమ మాత్రం ‘అన్నయ్య’ అంటుంది. ఆ షాక్ లో కూల్ డ్రింక్ తాగి పక్కన ఉన్న బస్ స్టాప్ లో మరో అమ్మాయికి లైన్ వేస్తాడు. ఇప్పుడు నేను బాధపడాలి కదా! అని ప్రయత్నించి చివరికి విషాద ప్రేమకథ సినిమా చూసి బాధపడుతున్నట్టు పూర్ణిమ, అతని ఫ్రెండ్స్ ముందు నటిస్తాడు తప్పా ఎక్కడ నిజమైన బాధ కనిపించదు. వేంటనే తన ప్రేమ సక్సస్ అవ్వకపోయే సరికి ఫ్రెండ్స్ అందర్ని ప్రేమించవద్దని వాగ్ధానం చెయ్యమంటాడు. హీరో వ్యక్తిత్వానికి ఆపోజిట్ గా పూర్ణిమ వ్యక్తిత్వం కనిపిస్తుంది. కౌమార దశలో ఎంత బలంగా నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడానికి మనకు పూర్ణిమ బాల్య ప్రేమకథ మంచి ఉదాహరణ. తల్లిదండ్రుల్ని ఎదురించి బాల్య స్నేహితుడు దినకరన్ని పెళ్ళి చేసుకుంటుంది. ఆ వయస్సుల్లో అమ్మాయిలు నవ్వినా, వారి వైపు చూసినా ప్రేమే అనుకుంటారు అబ్బాయిలు. అలా దినకరన్ దివ్య – నదియా, ఆముద వెంటపడి చివరికి పూర్ణిమని ప్రేమిస్తాడు. తన కోసం హెయిర్ స్టైల్, వేషధారణ మారుస్తాడు. పెన్సిల్ చెక్కుతుంటే వేలు కట్టై రక్తం కారుతుంటే ఆ రక్తంతో లెటర్ రాస్తాడు తప్పా తన కోసం చేతిని కోసుకోడు. అసలు ఆ కౌమార దశలో వాళ్ళ జీవితంలో ఏం జరిగినా ప్రపంచమంతా ఆగిపోయి వాళ్ళనే చూస్తున్న ఫీలింగ్ ప్రతీ చిన్న విషయానికి కలుగుతుంది. అందుకనే వాళ్ళ భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. వాళ్ళ ఊహలకు రియాలిటీకి సంబంధం అస్సలు ఉండదు. కౌమార దశ గురించి సైకాలజీలో ఏదైతే చెప్పారో అదే దినకరన్ పాత్రలో కనిపిస్తుంది.

‘‘The mind is like a monkey swinging from branch to branch through a forest’’ The sutra. మనిషి మనస్సు ఒక కోతి లాంటిది, ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు అడవి అంతా తిరుగుతుంది. ఈ సూత్రం మనిషికి వర్తించడానికి కౌమారదశతో పనిలేదు. ఆ దశ నుండి మనిషిపోయే దశ వరకూ వర్తిస్తుంది. ఇది కూడా ‘అట్టకత్తి’లో మనం చూడవచ్చు. దినకరన్ అన్నయ్య విశ్వనాధ్, అముద చెల్లెలు వాళ్ళ ఇంటికి వస్తే తనకు లైన్ వేస్తుంటాడు. బస్సుల్లో పెళ్ళైన ఆంటీతో దినకరన్ టెంటేషన్స్ కూడా మనసు కోతే అనడానికి మంచి ఉదాహరణలు. దానితో పాటు దినకరన్ క్యారెక్టర్ సర్టిఫై చేస్తూనే ఆ వయసు ఇష్టాల్లో ఆకర్షణ తప్పా ప్రేమ ఉండదనడానికి కూడా మంచి ఉదాహరణగా నిలుస్తుంది.

ఇక దినకరన్ విషయంలో ‘దివ్య – నదియా’ అనే ఇద్దరమ్మాయిలు చూస్తుంటే ఎవర్ని సెలెక్ట్ చేసుకోవాలో తెలియని సందిగ్థం అతని కోతి మనసుకు మరో ఉదాహరణ. ఇక తండ్రి పాత్ర పా. రంజిత్ ఎక్కడో రియల్గా చూడకపోతే కానీ క్రియేట్ చెయ్యలేని విధంగా ఆ పాత్ర ఉంటుంది. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే తెగ నవ్వుకుంటాం.! రియల్ గా జరుగుతున్న కథను కెమెరా పెట్టి షూట్ చేసినట్లు ఉంటుంది తప్పితే, షూటింగ్ కోసం క్రియేట్ చేసిన వాతావరణంలా ఎక్కడ కనిపించకుండా తియ్యడం పా. రంజిత్ ప్రతిభకు నిదర్శనం. మొదటి సినిమాలోనే అంతమంది ఆర్టిస్టుల్ని పెట్టి ఒక సీనియర్ ఫిల్మ్ మేకర్లా ‘అట్టకత్తి’ తియ్యడం సాహసమని చెప్పాలి. హీరో దినేష్ నటన చాలా సహజంగా ఉంటుంది. ఆ వయసు కుర్రోన్ని తన నటనలో అచ్చు గుద్దినట్టు దింపేశాడు. దినకరన్ అంటే సూర్యుడు. పూర్ణిమ అంటే నిండు చందమామ ఈ పేర్లు గమనిస్తేనే పా.రంజిత్ ఈస్తటిక్ సెన్స్ అర్థమౌతుంది.

దళిత బహుజన దృక్పథం:

ఈ రోజు దళిత బహుజన తాత్విక దృక్పథ మహావృక్షంగా కనిపించే పా. రంజిత్ వృక్షవేర్లు ‘అట్టకత్తి’లోనే మొదలైయ్యాయి. అముద, దినకరన్ అన్నయ్యకు బీఫ్ కర్రీ తీసుకొచ్చి ఇస్తుంది. పూర్ణిమ బస్సులో ఎం.జి.ఆర్ నగర్ టికెట్ కోసం దినకరన్ కు డబ్బులు ఇచ్చేటప్పుడు చేతికి తగలకుండా ఇస్తుంది. అది గమనిస్తే తన మనుసులో కుల భావన ఉందేమో అనే అనుమానం కలగకమానదు. కరుణానిథి, ఎంజీఆర్ ఫోటోల్ని చూపించడం. హీరో ఓపినింగ్ సీన్ లోనే ‘బ్లూ’ కలర్ షర్ట్ వేసుకుని కాలేజీకి వెళ్తాడు. కాలేజీలో విద్యార్ధి నాయకుడిగా తమ హక్కుల కోసం పోరాటం చెయ్యడం. అముదని ఆకర్షించడానికి దినకరన్ పులిడాన్స్ వేసే పాటలో ‘ఒప్పారి’ (శవం దగ్గర పాడే పాటలు) ‘పరాయి’ (డప్పు పాటలు) ‘గాన’ (తమిళ్ ఫోక్ సాంగ్స్) ఇలాంటి తమిళనాడు దళిత్ బహుజన కల్చర్ని ‘అట్టకత్తి’ సినిమాలో పరిచయం చేశాడు.

పూర్ణిమ పెళ్ళి షాక్ లో దినకరన్ చివరిలో పరిగెడుతుంటే స్కూల్ గోడ మీద అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది. దినకరన్ తండ్రి తాగేసి మాట్లాడుతున్న మాటల్లో తరతరాలుగా ఆ జాతుల అణచివేత, ఆవేదన ఎక్కువగా కనిపిస్తుంది. పా. రంజిత్ తన తర్వాత సినిమాల్లో కూడా దాన్ని మరింత బలంగా కొనసాగిస్తున్నాడు. తన సినిమాల ద్వారా యువత మద్యపానానికి దూరంగా ఉంటూ వ్యాయమం చేస్తూ బాగా చదువుకోమంటాడు. ఇది కేవలం అతను నమ్మిన ఐడియాలజీ వల్లే అతని ప్రతీ సినిమాలో మళ్ళీ, మళ్ళీ బలంగా చెప్తున్నాడు. సాహిత్యంలో ఇలాంటి బలమైన ఐడియాలజీలు ఉంటాయి కానీ వ్యాపార దృక్పథం కలిగిన సినిమాల్లో చాలా అరుదు. దాన్ని పా.రంజిత్ తన సినిమాతో సుసాధ్యం చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలాంటి ఐడియాలజీ ఉన్న దళిత బహుజన కళాకారులకు ‘నీలం కల్చరల్ సెంటర్, కాస్ట్ లెస్ కలెక్టివ్’ అనే ప్లాట్ ఫామ్స్ క్రియేట్ చేసి వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు. నీలం ప్రొడక్షన్స్ స్థాపించి ఆలోచింపజేసే చిత్రాలను నిర్మిస్తున్నాడు. అలా వచ్చినవే ‘పరియేరుం పెరుమాళ్’ గుండు, కుతురైవాల, సెత్తుమాన్, రైటర్ ఇలా పా. రంజిత్ ఒక దళిత బహుజన సాంస్కృతిక విప్లవానికి పునాదులు గట్టిగా వేస్తున్నట్లు అనిపిస్తుంది. పా. రంజిత్ అంటే కుల రాజకీయ సినిమాలు తీస్తాడని ముద్రవేస్తున్నా తను ఎక్కడా అదరక, బెదరక తను అనుకుంటున్న ఐడియాలజీకి సినిమా అనే ఆర్టుని కలిపి జనంలోకి బలంగా తీసుకెళ్తున్నాడు. ఎవరికైనా ఒక సినిమాకో, రెండు సినిమాలకో పరిమితం అవుతారు కానీ పా. రంజిత్ తన ప్రతీ సినిమాలో తన ఐడియాలజీని చాలా సమర్థవంతంగా చెప్పడం ఆశ్చర్యం. ఇక ఈ సినిమాకి సాంకేతిక నిపుణుల పనితనాన్ని పా. రంజిత్ మొదటి సినిమా అయినా చాలా బాగా రాబట్టారనడంలో సందేహం లేదు. పి.కె వర్మ కెమెరా, లైటింగ్ చాలా అందంగా ఆకర్షనీయంగా ఉంటాయి. అలాగే సంగీతం, సాహిత్యం కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా సంతోష్ నారాయణ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా వినిపించింది. అలాగే ఎడిటింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది.

పా. రంజిత్ తను వచ్చిన బ్యాక్ గ్రౌండ్, దళితకల్చర్, అగ్రకుల ఆధిపత్యం, అంటరానితనం, అణచివేతలు ఇలా తనదైన శైలిలో చైతన్యవంతంగా చూపిస్తున్నాడు. భారతీయ సినిమాలపై తనదైన బలమైన ముద్రవేసిన దర్శకుల జాజితాలో పా. రంజిత్ నిలిచిపోతాడు. బహుజన దళత రాజకీయ స్పృహని జనరంజకంగా మార్చి, సినిమాలు తీయ్యడంలో మాస్టర్ క్లాస్ ఫిల్మ్ మేకర్ గా మారాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా మరింత మంది ‘మోర్ లోకల్’ దర్శకులు వచ్చి వారి, వారి కల్చర్ని ‘మోర్ గ్లోబల్’ చెయ్యాల్సిన అవసరం సినిమాకి, సొసైటీకి చాలా ఉంది. దాని వల్ల సినిమాకు మరింత ఆయువు, ఆదరణ పెరుగుతుందని మనం ముఖ్యంగా గమనించాలి.

*

 

ప్రవీణ్ యజ్జల

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు