అగ్నివేశ్ పై దాడి దేనికి సూచిక?

భారత సమాజంలోని విభిన్న వర్గాల, ప్రజా సమూహాల జీవన్మరణ ఉద్యమాలకు ఇంతగా స్నేహహస్తం చాచిన, ఇంతగా మమేకమైన, భారత ప్రజా ఉద్యమాల దృఢమైన మిత్రుడైన, స్థూలంగా చెప్పాలంటే హిందూ మతానికే చెందిన, ఒక ఆర్యసమాజికుడి మీద హిందుత్వ వాదులకు ఎందుకింత కసి?

ర్య సమాజ్ నాయకుడు, వెట్టి కార్మికుల విముక్తి సంఘం బంధువా ముక్తి మోర్చా నాయకుడు, మానవహక్కుల కార్యకర్త, ఆరు దశాబ్దాలకు పైగా ప్రజాజీవనంలో ఉన్న సామాజిక కార్యకర్త, చూస్తేనే గౌరవం కలిగే ఎనబై సంవత్సరాల వృద్ధుడు స్వామి అగ్నివేశ్ మీద సంఘ్ పరివార్ గూండాలు జరిపిన దాడి వర్తమానంలో భయానకమైనది మాత్రమే కాదు, భవిష్యత్తుకు సంబంధించి ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. మొదట ఆయన మాట్లాడుతున్న హోటల్ ముందు నిలబడి ‘అగ్నివేశ్ వాపస్ జావో’ అని నినాదాలు ఇచ్చిన సంఘ్ పరివార్ మూక గుంపుగా ఆయన మీద పడి, మనిషిని కిందికి తోసేసి, పగిడీ ఊడదీసి, పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో తన్ని, ఒంటి మీద కాషాయ వస్త్రాలను చింపివేసిన దృశ్యాలు దేశంలో ఆలోచించగలవాళ్లందరినీ దిగ్భ్రాంతి పరిచాయి. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని అంటూనే దాన్ని సమర్థించడానికి ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ మంత్రుల, శాసనసభ్యుల ప్రకటనలు భిన్నాభిప్రాయాల పట్ల సంఘ్ పరివార్ అసహనానికి అద్దం పడుతున్నాయి.

ఈ ఘటన దేశంలో కొంతకాలంగా జరుగుతున్న దుష్పరిణామాలకు, భవిష్యత్తులో మరింత పెట్రేగిపోనున్న మూక దాడుల విపరిణామాలకు ఒక సూచన. ఒక హెచ్చరిక. ఈ పరిణామాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే, ఇదేదో యాదృచ్ఛికమైన ఘటనగానో, అగ్నివేశ్ అన్న ఏదో మాటకో చేసిన ఏదో పనికో ప్రతిస్పందనగానో భావించి సులభంగా కొట్టివేస్తే భవిష్యత్ దుష్పరిణామాలు నిజాలు కావడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఫాసిస్టుల, నాజీల నాయకత్వంలో ఇటువంటి మూక దాడులే 1930ల జర్మనీలో, ఇటలీలో జరిగి ప్రపంచ చరిత్ర మీద విషాద బీభత్స చిహ్నాల్ని వదిలిపోయాయి. అటువంటి బీభత్సమే మన కళ్లముందు మరొకసారి కోరలు విప్పుకుంటున్నది. దాన్ని సరిగా అర్థం చేసుకోవడం, చుట్టూ ఉన్నవారికి అర్థం చేయించడం, ప్రతిఘటించడం ప్రతి బుద్ధిజీవికీ, ప్రతి మనిషికీ బాధ్యత.

శ్రీకాకుళం జిల్లాలో 1939లో ఒక సాంప్రదాయక హిందూ కుటుంబంలో పుట్టిన వేపా శ్యాంరావు సుదీర్ఘ జీవిత క్రమంలో వేద ప్రమాణాన్ని మాత్రమే అంగీకరించే ఆర్యసమాజికుడిగా, స్వామి అగ్నివేశ్ గా మారి, హిందూ స్వాముల ఆహార్యాన్నే ధరించి కూడ ఇవాళ హిందూత్వ గూండాల చేతిల్లో ఇలా అవమానాల పాలు కావడం వెనుక ఆలోచించవలసిన, అర్థం చేసుకోవలసిన చరిత్ర ఎంతో ఉంది. నిజంగా మత విశ్వాసాలు ఉంచుకుంటూనే కూడ సమాజం కోసం పని చేస్తే, రాజ్యాన్ని, అధికారాన్ని, వ్యవస్థీకృత, రాజకీయాన్విత మతాధిపత్యాన్ని వ్యతిరేకిస్తే ఏమి ఎదుర్కోవలసి ఉంటుందో ఆయన జీవిత కథ తెలియజెపుతుంది. నాలుగో ఏటనే తండ్రి మరణించడంతో, ఒక సంస్థానాధీశుడి దగ్గర దివాన్ గా పనిచేస్తున్న తాత దగ్గర ఆయన పెరిగాడు. న్యాయశాస్త్రమూ, వాణిజ్యశాస్త్రమూ చదువుకున్నాడు. వ్యాపారనిర్వహణ శాస్త్రపు అధ్యాపకుడిగానూ, న్యాయవాదిగానూ పనిచేశాడు. ఆర్యసమాజ భావాల ప్రేరణతో 1970లలో ఆర్యసభ స్థాపించి, వైదిక సామ్యవాదం అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రకటించాడు. ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువలో హర్యాణాలో శాసనసభ్యుడిగా, విద్యామంత్రిగా కూడ పనిచేశాడు. మరొకవైపు బంధువా ముక్తి మోర్చా (వెట్టి కార్మికుల విమోచన సంస్థ) స్థాపించాడు. వెట్టి కార్మికుల విముక్తి కోసం దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగాడు. ఆ సమస్యను పరిష్కరించడంలో దేశవ్యాప్తంగా ఉన్న ఇటుకబట్టీల దగ్గరికి వెళ్లి కార్మికులను విడుదల చేయించడం దగ్గరి నుంచి ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్లేదాకా గత మూడు దశాబ్దాలుగా ఆ సమస్య మీద వ్యగ్రతతో పని చేస్తున్నాడు. ఆ క్రమంలో మహిళా సమస్యలు, బాలకార్మికుల సమస్యలు, పౌరహక్కులు, విప్లవోద్యమంతో చర్చలు, ముస్లింల మీద అమలవుతున్న విద్వేషాన్ని తగ్గించడం, మత సామరస్యం వంటి ఎన్నో విస్తృత సమస్యలు చేపట్టాడు. అమర్ నాథ్ లో శివలింగం కేవలం గడ్డకట్టిన మంచు మాత్రమేనని, అక్కడికి యాత్ర నిష్ప్రయోజకమూ రాజకీయ స్వార్థపూరితమూ అని సంచలనాత్మక ప్రకటన చేసి హత్య బెదిరింపులకు, హత్యా ప్రయత్నాలకు గురయ్యాడు. ఆయనను చంపినవారికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తామని భారతీయ హిందూ మహాసభ ప్రకటించి ఉంది. పూరీ జగన్నాథ ఆలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశం అనే నిబంధనను ఖండించి హిందూ వ్యతిరేకిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చత్తీస్ గడ్ లో బూటకపు ఎన్ కౌంటర్ల మీద నిజ నిర్ధారణ జరపడానికి వెళ్లి సల్వాజుడుం దాడికి గురయ్యాడు. తాజాగా ఆదివాసుల సమస్యల పరిష్కారాన్ని కోరినందుకు, ఆదివాసుల క్రైస్తవ మతాంతరీకరణను సమర్థిస్తున్నాడనే ఆరోపణకు గురయ్యాడు.

నేనాయనను మొదటిసారి 1983లో కరీంనగర్ లో ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం మహాసభల్లో బహిరంగ సభలో చూశాను. అప్పటికి బంధువా ముక్తి మోర్చా స్థాపించి రెండు సంవత్సరాలయింది. పౌర, ప్రజాస్వామిక హక్కుల గురించి అప్పుడప్పుడే మాట్లాడుతున్నాడు. ఆ బహిరంగ సభలో ఆయన “ఈ కరీంనగర్, తెలంగాణ నేల నాకు అత్యంత ప్రియమైనది. ఈ నేల ప్రజల అధికారం కోసం పోరాడిన అమరవీరుల రక్తంతో తడిసింది. ఆ పవిత్రమైన నేలను నా నుదిటికి అద్దుకుని మీ ముందు మాట్లాడుతున్నాను’ అని ఉపన్యాసం ప్రారంభించాడు. తర్వాత ఎన్నో సభల్లో కలిశాం గాని, ఇటీవలి అనుభవాలు చెప్పాలంటే, తెలంగాణ జర్నలిస్టు ఫోరం తరఫున తెలంగాణ సమస్యను వినిపించడానికి వందలాది మంది జర్నలిస్టులం ఢిల్లీ వెళ్ళి కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో సభ నిర్వహించినప్పుడు ఆయన వచ్చి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు జర్నలిస్టు మిత్రుడు ఎం ఎం రహమాన్ రాసిన చలో చత్తీస్ గడ్ పుస్తకం ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఆ సభకు నేనే అధ్యక్షత వహించాను.

వెట్టి చాకిరీ చేస్తున్న కార్మికులు అనుభవిస్తున్న దుర్భర జీవితాన్ని, ఈ దేశంలో సంపన్నులు అనుభవిస్తున్న విలాసాలతో పోల్చి చూపడానికి ఆయన పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఒక వినూతమైన నిరసన రూపాన్ని ఎంచుకున్నాడు. వందలాది మంది చెప్పులు లేని, బురదకాళ్ల, గోచిపాతల వెట్టి కార్మికులను ఢిల్లీలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్ లోకి తీసుకువెళ్లి ఆ లాబీల్లో, కారిడార్లలో, గదుల్లో వాళ్లను నింపి నిరసన తెలియజేశాడు. ఆ అద్భుత నిరసన సందర్భాన్ని నేను కొన్ని డజన్ల సభల్లో నా ఉపన్యాసాల్లో ఉటంకించాను.

భారత సమాజంలోని విభిన్న వర్గాల, ప్రజా సమూహాల జీవన్మరణ ఉద్యమాలకు ఇంతగా స్నేహహస్తం చాచిన, ఇంతగా మమేకమైన, భారత ప్రజా ఉద్యమాల దృఢమైన మిత్రుడైన, స్థూలంగా చెప్పాలంటే హిందూ మతానికే చెందిన, ఒక ఆర్యసమాజికుడి మీద హిందుత్వ వాదులకు ఎందుకింత కసి? ఇవాళ నాగపూర్ – మోడీ – అమిత్ షా నడుపుతున్న హిందుత్వ మామూలు హిందూ మత విశ్వాసం కాదు. లోకాతీత శక్తి మీద అమాయక విశ్వాసం కాదు. ఇది రాజ్యంతో, అధికారంతో, కార్పొరేట్ శక్తులతో, సామ్రాజ్యవాదంతో అంటకాగుతున్న, మిలాఖత్తయిన మతవర్గతత్వం. పాలకవర్గ మతోన్మాదం. స్వామి అగ్నివేశ్ ఎన్నో సందర్భాల్లో హిందూత్వతో, రాజ్యంతో, అధికారంతో, కార్పొరేట్ శక్తులతో ఘర్షణకు దిగాడు. హిందుత్వకు అందువల్లనే ఆయన మీద కసి.

ఈ పాలకవర్గ మతోన్మాద కసి ఇవాళ స్వామి అగ్నివేశ్ దగ్గరికి వచ్చింది గాని తొంబై సంవత్సరాలుగా అది ఈ సమాజంలో విష విద్వేష రాజకీయాల విత్తనాలు నాటుతూనే ఉన్నది. మతఘర్షణల నెత్తురుటేర్లు పారించి ఆ విత్తనాలు పుష్పించేలా చేస్తూనే ఉన్నది. ఆ విద్వేషాలు చివరికి తమ సామాజిక రాజకీయార్థిక అధికారంగా, ఏకచ్ఛత్రాధిపత్యంగా పుష్పించాలని కోరుకుంటున్నది. దాని రక్తదాహం తీరడానికి, బారా ఖూన్ మాఫ్ స్థితికి  అవకాశమిచ్చినది 2014 ఎన్నికల విజయం.

ఈ నాలుగు సంవత్సరాలలో ఈ నాలుగు పడగల హైందవ నాగరాజు ఎన్నెన్ని దురంతాలు సాగించిందో లెక్కవేస్తే హిట్లర్ ముస్సోలినీలు కూడ సిగ్గు పడతారు. ఘర్ వాపసీ, ముజఫర్ నగర్, అఖ్లాక్, జునేద్, నజీబ్, కశ్మీర్, ట్రిపుల్ తలాక్ వంటి అనేక సందర్భాలతో ముస్లింల మీద దాడి, రోహిత్ వేముల, ఊనా, చంద్రశేఖర్ రావణ్, జిగ్నేష్ మేవానీ, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని పలుచన చేయడం వంటి అనేక ఘటనలతో దళితుల మీద దాడి, ఎం ఎం కల్బుర్గి, గోవింద్ పన్సారే, గౌరి లంకేష్ ల హత్యలు, రొమిలా థాపర్, కన్హయ్య కుమార్, ఉమర్ ఖాలిద్, సెహ్లా రషీద్ ల మీద దాడులు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రిసర్చ్, జె ఎన్ యు, చెన్నై ఐఐటి, పుణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్, జాదవ్ పూర్ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ప్లానింగ్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి సంస్థల మీద, స్వేచ్ఛా పరిశోధన మీద, భిన్నాభిప్రాయం మీద దాడి, జి ఎన్ సాయిబాబా, ప్రశాంత్ రాహీ, హేమ్ మిశ్రా, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, షోమా సేన్, మహేశ్ రౌత్, సుధీర్ ధావ్లె వంటి విప్లవోద్యమ సానుభూతి పరుల మీద దాడి, అసిఫా, ఉన్నావ్ వంటి ఎన్నో ఘటనలలో మహిళల మీద దాడులు, పెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి, బ్యాంకుల దివాళా వంటి ఆర్థిక రంగ చర్యలతో సమాజం మొత్తం మీద దాడి – ఒక్క మాటలో చెప్పాలంటే 2014-2018 భారతసమాజం 1933-1945 జర్మనీని పునర్జీవిస్తున్నది. అందులో ఒకానొక చిన్న భాగమే స్వామి అగ్నివేశ్ మీద జరిగిన ఈ దుర్మార్గమైన దాడి.

స్వామి అగ్నివేశ్ మీద దాడి సందర్భంగా పూర్తిగా భిన్నమైన దేశాల నుంచీ, కాలాల నుంచీ, మతాల నుంచీ ఇద్దరు మతాచార్యులు గుర్తుకొస్తున్నారు. వారిలో ఒకరు ఇరవయో శతాబ్ది తొలిదశకానికీ, మరొకరు ఆ శతాబ్ది మధ్య భాగానికీ చెందినవాళ్లు. ఒకరు రాచరికంలో, మరొకరు ప్రజాస్వామ్యం పేరు మీది నియంతృత్వంలో పనిచేసినవారు.

ఒకరు ఫాదర్ జార్జీ గాపన్, రష్యాలో సాంప్రదాయిక సేంట్ పీటర్స్ బర్గ్ థియొలాజికల్ అకాడమీలో చదువుకుని, సేంట్ ఓల్గా అనాథ బాలల శరణాలయంలో ఉపాధ్యాయుడుగా చేరి, కార్ఖానా కార్మికులతో, నిరుద్యోగులతో కలిసి పనిచేసినవాడు. అసెంబ్లీ ఆఫ్ రష్యన్ ఫాక్టరీ అండ్ మిల్ వర్కర్స్ ఆఫ్ సేంట్ పీటర్స్ బర్గ్ అనే ప్రగతిశీల సంస్థను నిర్మించి కార్మికుల హక్కుల కోసం పనిచేసినవాడు. అంతకు ముందురోజే ప్రారంభమైన కార్మికుల సమ్మెలో భాగంగా 1905 జనవరి 9 ఆదివారం నాడు స్వయంగా జార్ చక్రవర్తికే కార్మికుల సమస్యలు నివేదిస్తే పరిష్కారం సాధ్యమవుతుందనే అత్యాశతో రాజప్రాసాదానికి కార్మికులను నడిపించినవాడు. ఊరేగింపు మీద కాల్పులు జరిపిన జార్ సైన్యం దాదాపు మూడు వందల మంది కార్మికులను పొట్టన పెట్టుకుని రక్తసిక్త ఆదివారం అనే విషాద జ్ఞాపకాన్ని చరిత్రకు మిగిల్చింది.

మరొక మతాచార్యుడు మార్టిన్ నీమొల్లర్. జర్మన్ ఇవాంజెలికల్ చర్చ్ మత బోధకుడిగా ఉంటూనే జర్మన్ సమాజాన్ని నాజీ సమాజంగా మారుస్తున్న హిట్లర్ విధానాలను విమర్శించినవాడు. తన విమర్శలకు ప్రతిఫలంగా దాదాపు ఏడు సంవత్సరాలు నాజీ నిర్బంధ శిబిరాల్లో ఖైదీగా చిత్రహింసలు అనుభవించినవాడు. నాజీల చేతుల్లో హత్యను తృటిలో తప్పించుకున్నవాడు. ఆ మార్టిన్ నీమొల్లర్ రాసిన అజరామర వాక్యాలు ఏడు దశాబ్దాల తర్వాత భారత సమాజంలో మరొకసారి చదువుకోవలసిన అత్యవసర ప్రమాదం ముంచుకొస్తున్నది:

మొదట వాళ్లు కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాను గనుక మాట్లాడలేదు

తర్వాత వాళ్లు కార్మిక నాయకుల కోసం వచ్చారు

నేను కార్మిక నాయకుడ్ని కాను గనుక మాట్లాడలేదు

తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాను గనుక మాట్లాడలేదు

ఇవాళ వాళ్లు నాకోసమే వచ్చారు

ఇక నాకోసం మాట్లాడడానికెవరూ మిగిలిలేరు

మన మహత్తర మాతృభూమి జారిస్టు రష్యాతో, నాజీ జర్మనీతో పోటీపడుతున్నదని పొంగిపోదామా? జార్ నూ హిట్లర్ నూ కూలదోసిన ఇరవయో శతాబ్ది కన్న ఎక్కువ చైతన్యం సంతరించుకున్న ఇరవై ఒకటో శతాబ్ది పౌరులమవుదామా?

*

ఎన్. వేణుగోపాల్

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • వేణుగోపాల్ గారూ, స్వామి అగ్నివేష్ పైనే కాదు, ఏ వ్యక్తిపైన భౌతిక దాడి ఎవరు చేసినా, అది రాజ్యం చేసినా, లేక మావోలు చేసినా, లేక మూడు మతాల మతోన్మాదులు చేసినా ఖండించాలి. అయితే, ఈ విషయాన్ని చెప్పే విధానంలో మీరు స్వామి అగ్నివేష్ గురించిన మరో కోణం చూపించలేదు. అయితే, అది మీకు తెలియకపోయివుండవచ్చు. ఎలాగైతే మీరు చెప్పిన చెప్పిన సత్య కోణాలను కుడి భావజాల పక్షాలు చదవవో అలాగే వాళ్లు చెప్పే సత్య సమాచార కోణాలను మీరు కూడా చదవలేదని నా పరిశీలన. ఉదాహరణకు స్వామి అగ్నివేష్ ను ఆర్య సమాజ్ నుండి బహిష్కరించారు. దేశంలో వున్న 19 ఆర్య సమాజ ప్రతినిధి సభలలో 17 అతడి బహిష్కరణను కోరాయి. 2008 లో ఆర్యసామాజికులు అతడి ద్వంద్వం ప్రమాణాలను, భావోద్వేగ ప్రేరిత ద్వేష ధోరణులను ప్రశ్నిస్తూ ఒక బహిరంగ లేఖ వ్రాసారు. దాని లంకె చివరలో యిచ్చాను.ఇలా ఈ వ్యాసంలో వున్న అనేకానేక సమాచారాలు, అభిప్రాయాలకు ఇంకో సత్యం పార్శ్యం కూడా తెలుసుకోవాలని ఆసక్తి వుంటే సంభాషించడానికి నేను సిద్ధంగా వున్నాను. మీరు విమర్శిస్తున్నవారితోగాని, మీ భావజాల వ్యతిరేకులతోగాని కూర్చని సంభాషించడం సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుందని మీరు భావిస్తారని ఆశిస్తున్నాను.
  Open Letter to Agnivesh – Clarifications seeked on behalf of Arya Samajees across the globe
  http://www.aryasamaj.org/newsite/node/372

 • ” … అగ్నివేశ్ అన్న ఏదో మాటకో చేసిన ఏదో పనికో ప్రతిస్పందనగానో భావించి సులభంగా కొట్టివేస్తే …” అని మీరు హెచ్చరించింది అక్షరసత్యం వేణుగారూ.
  సరిగ్గా అదే జరిగి, ప్రజల స్పందన పలచబడాలన్నదే – ఈలింకుల లక్ష్యం. ఈ శ్రీనివాసుడు గారు … అతులితదీక్షతో ఆపనే చేస్తున్నారు.
  ‘అగ్నివేష్ అంత ఉత్తముడేం కాదట’ అనే గాలి కబురు తేలుతూ ఉండడమే … వారికి కావలసింది.

  • నా స్పందన పూర్తిగా చదవలేదు మీరు కళ్యాణి తల్లూరి గారూ, నేను వారి వ్యాసంలోని అసమగ్ర సమాచారం గురించి ఒక్క ఉదాహరణగా మాత్రమే దానిని యిచ్చాను. వ్యాసంలో ఇంకా అనేక అంశాలు అసమగ్రంగా వున్నాయి. వాటి గురించి సంభాషించే ఆసక్తి వుంటేనే యిస్తానన్నను. ప్రచారం అనేది ఏకపక్షంగా ఎంపిక చేసుకున్న అంశాల గురించి, తమకున్న భావజాల మొగ్గుపై మాత్రమే నడుస్తూ, భావోద్వేగ స్పందనలను రెచ్చగొడుతూ ఏ స్థాయిలో తెలుగు దినపత్రికలలో నడిచిందో తెలుసుకోవాలనుకుంటే గత 40 ఏళ్లల్లో మీ యిష్టం వచ్చిన తేదీ ఎంచుకుని తెలుగులో వున్న 10 ప్రధాన దినపత్రికలలోని (ఆంధ్రభూమి మినహా) సంపాదకీయ పుటను చూస్తే దానిలో అత్యధిక భాగం ఎడమ, ఎడమాతి ఎడమ భావజాల అనుకూలు, కుడి వ్యతిరేక ద్వేష భావజాలమే తమకు కనిపిస్తుంది. అలాగే, తెలుగులో పత్రికలలో వచ్చిన సమస్త కవితలను, వ్యాసాలను, వ్యంగరూపకాలను, కథలను గమనిస్తే సింహభాగం కుడి వ్యతిరేక, ఎడమ అనుకూల భావజాలమే కనిపిస్తుంది. కాబట్టి, మీరు కేవలం నా వ్యాఖ్యతోనే ఆ మహా ఏకపక్ష అభిప్రాయ పర్వతం కూలిపోతుందన్న బెంగే అక్కరలేదు.

   ఈరోజు నేను సంభాషణకు పిలిచిన కారణాన్ని విస్మరించి వ్యక్తిగత ఆరోపణలు చేస్తే నేను అంతకంటే తీవ్రంగా వ్యక్తిగతంగా స్పందిచాల్సి వస్తుంది. సంభాషణ మినహా సత్యాన్వేషణకు మీకు ఇంకేదైనా మార్గం కోరుకుంటున్నారేమో నాకు తెలియదు. పోనీ, అదే కోరుకుంటే ఆ మార్గంలోనే పయనించండి. ఇక్కడ నాకు నీతులు చెప్పాల్సిన అవసరంలేదు. సంభాషణే ఘర్షణలు తగ్గించడానికి, నిజాన్ని తెలుసుకోడానికి ఏకైక మార్గం అనుకుంటే అది ఎలా జరగాలో మీకు ఒక మచ్చు కూడా యిస్తాను.

   పార్థా ఛటర్జీ తమకు గుర్తుంటే వుంటారు. మన ఆర్మీ ఛీఫ్ బిపిన రావత్ ని జనరల్ డయ్యర్ తో పోల్చి ఎడమ, ఎడమాతి ఎడమ భావజాల కరదీపిక ‘ది వైర్’ లో ఓ వ్యాసం వ్రాసారు. దానికి వివేక్ కట్జూ ఖండిస్తూ స్పందించారు. ఆ డైలాగ్ అంటే సంభాషణ రెండు మూడు వ్యాసాల వరకూ సాగింది. ఆ సాగిన తీరు పార్థా ఛటర్జీకి సంతృప్తి నిచ్చి, ఒకరినొకరు గౌరవించుకుంటూ జరిగిన సంభాషణ అని కితాబిచ్చారు. ఆ విధంగా సంభాషించుకుందామంటే నాకు అభ్యంతరంలేదు. ఇంకో విధానమయితే కేవలం మీ వ్యాఖ్యలే యిక్కడ మిగులుతాయి. నేనేమీ స్పందించను.

   పార్థ ఛటర్జీకి వివేక్ కట్జూ స్పందన లంకెనిస్తున్నాను. దీనిక ముందు వ్యాసం, తరువాత పార్థా ఛటర్జీ సమాధానం లంకెలు చూస్తే పూర్తి మూడు భాగాలూ చదవవచ్చు. ఈ నమూనాలో మాట్లాడుకుందామంటే నాకు అభ్యంతరంలేదు.
   https://thewire.in/government/dyer-debate-response-partha-chatterjee
   ;

   చర్చ వేరు, వాదన వేరు, సంభాషణ వేరు. నేను సంభాషించదలచుకున్నాను. అందుకే ప్రత్యేకంగా ఆ పదమే పైన నా వ్యాఖ్యలో పెట్టాను. మీకు వాదన, చర్చ, వ్యక్తిగత ఆరోపణలు ప్రక్కనబెట్టి సంభాషణ జరిపే వైఖరి, విధానం తెలిసివుంటే మొదలుపెడదాం. లేదా, వ్యక్తిగత బురదజల్లుడు కార్యక్రమం మొదలుపెడితే దానివల్ల సారంగ స్థలం, కాలం దుర్వినియోగం, వృథా అవడంవల్ల ప్రయోజనంలేదు. మీలాగా వ్యక్తిగత వ్యాఖ్యలు, ఆరోపణలు జరిగే ఫేస్ బుక్ పేజీలు, బ్లాగులు ఇరుపక్షాలు అంతర్జాలం నిండా కోకొల్లలు. అక్కడయితే మీ విధానానికి సమానమైన, సరియైన స్పందన లభించవచ్చు.

 • ఈ మతోన్మాద కాలనాగు…..తనను వ్యతిరేకించే వారినే కాదు, పాము తన పిల్లలనే కొరికిపారేసినట్టు ….. మున్ముందు తన మతస్తులనూ, చివరగా తన అనుచర గణాన్ని కూడా కాటేస్తుంది. ఎందుకంటే మతం కేవలం పై ముసుగు మాత్రమే. దాని అసలు రూపం…దోపిడీ.
  వనరుల్ని స్వాహా చేయడం.

  • ఏ మతోన్మాద కాలనాగు తులసి గారూ? హిందూమతం ఒక్కటే కాలనాగా, లేక మిగతా మతాలు కాలనాగుల కావా? అవి మనదేశంలో జోషువా ప్రాజెక్ట్, సలాఫీ ఫండ్స్ రూపంలో తమ విషాన్ని జిమ్మడంలేదంటారా? అవి, వాటిని పాటించేవారు మాత్రమే పరిశుద్ధాత్మలా? అవి ఏ దాడులూ చేయడంలేదా? అవి తమ పిల్లల్ని తామే మ్రింగబోవా? వాటి లక్ష్యం ఈ దేశ విచ్ఛిన్నత, సాంస్కృతిక ఆక్రమణ కాదా? వాటి గురించి మన తెలుగు పత్రికలలో ఏ రోజయినా ఒక్క వ్యాసమైనా వచ్చిందా? ఒక్క కవి అయినా ఒక్క పదం అయినా వ్రాసారా? తెలుగులో మాత్రమే ఈ లేమితనం ఎందుకు వుందంటారు? ఇతర రాష్ట్రాలలో, భాషలలో అయితే ఇక్కడ వ్రాసే ఇలాంటి వ్యాసాలకు సామాన్య పాఠకులు కూడా సాక్ష్యాధారలతో సహా ఖండనలు చేస్తుంటారు. తెలుగు పత్రికలలో ఆ ఇరువైపులా చూడడం అనేది ఎక్కడయినా వున్నదా? మీకో సమాచారం యిస్తున్నాను. మీకు యిష్టమయితే అది ఎక్కడయినా లభిస్తే చదువుకోవచ్చు. దానిలో చెప్పిన విషయాలను ఖండిస్తూ ఒక్కరు కూడా కోర్టులో కేసుల వేయలేదు. దాన్నిబట్టి దాని సాధికారికత మీకు అర్థం కావచ్చు.

   Ngos, Activists and Foreign Funds, Anti-nation Industry

   https://www.amazon.com/Activists-Foreign-Funds-Anti-nation-Industry/dp/B002Q427YU

 • ఇరాక్ మీద యుద్ధం చేసేటప్పుడు అమెరికా మేము అన్యాయంగా యుద్ధం చేస్తున్నాము అని చెప్పిందా? ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ తాను దాడి చేసిన వాడు చాలా మంచి వాడు, కానీ నేనే అన్యాయంగా వాడి మీద దాడి చేసినానని ఒప్పుకున్న ది లేదు. కుక్క ను చంపాలంటే దానికి పిచ్చి పట్టందని ప్రచారం చేయాలి లేక పోతే లోకం తనను పిచ్చి వాడంటుంది. ఇలా అనిపించు కోవడానికి ఎవడు ఇష్ట పడతారు.

  • తిరు పాల్, మీకు 7- 8ఏళ్ల క్రితం ఒక విషయం చెప్పాను. అది అంబేడ్కర్ కుడిభుజం, పాకిస్థాన్ ఫౌండింగ్ ఫాదర్ జోగేందర్నాథ్ మండల్ , దేశ విభజన సమయంలో హిందూ నాయకులు ఇండియాలో ఉండమని కోరితే, మేము హిందువులం కాము, మీరెలాపొతే మాకెందుకు అని పాకిస్థాన్ కు వెళ్ళి, మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యరు కదా! అక్కడ ఉండలేక మూడేళ్ళకే తట్టాబుట్టా ఎతుకొని ఇండియాకొచ్చి రాజీనామలేఖను పంపాడు.

   పాకిస్థాన్లో దళితులపై జరిగిన దాడులను, ఇదే తీవ్రతతో మీరు ఖండిస్తే చూడాలని ఉంది? దానిని ఏ అంతర్జాతీయ సంఘటనకు లింక్ పెడుతూ రాస్తారు.

 • మీరు నాజీ జర్మనీ, హిట్లర్ ల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కొందరి మనోభావాల్ని దెబ్బతీసి పిడిగుద్దులలోకి మారే ప్రమాదం ఉంది అనిపిస్తోంది.

  • మనోభావాలు దెబ్బతినడం అనేది లేనేలేని పరిశుద్ధ అగ్రహాంతరవాసులు ఏకపక్ష దృష్టి ని తగ్గించుకుంటే అద్వైత తత్త్వం బోధపడుతుంది. లేకపోతే ‘బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్’ తీసాడని వివేక్ అగ్నిహోత్రిపైన, ’లవ్ జిహాద్‘ తీసాడని సుదీప్తో సేన్ పైన దాడిచేసి, దొమ్మీచేసి, అతడి కారు తగలబెట్టింది కూడా మనోభావాలు దెబ్బతినన్న ఇన్ టాలరెన్స్ అనబడు అసహనం ప్రబలిన జె .ఎన్. యూ. ‘భారత్ కో టుకడే కరేంగో’ బ్యాచేనన్న సత్యం మరచిపోతే ఎట్లా? మనోభావాలు దెబ్బతినడం తమకు మాత్రమే సంబంధించిన ట్రేడ్ మార్కా? (మనోభావాలు దెబ్బతినడం అనేదాని గురించి తెలియాలంటే శృంగేరీ పీఠాన్ని కాదు అడగాల్సింది. మలబార్ వెళ్లి అడిగితే వాళ్లు చెబుతారు)

 • I pity on leftist think tanks, their only agenda is to blame this country, its culture and try to prove it as bad. Till last government they could do whatever damage they want. now the India is changing, Hindus are no more ready to hear the venomous preachings of leftist, Christian, Islam pro media. Leftist are deaf to listen the truth. I wish god give them real knowledge, good thinking.

  Kalidasu

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు