అకస్మాత్తుగా ఏదేదో అలికిడి

మూలం: త్సు యెఁ  చీనా కవయిత్రి ( 4 వ శతాబ్దం )

చీనా కవయిత్రులలో పేరొందిన కవయిత్రి త్సు యెఁ. ఈమె క్రీ.శ.3-4 శతాబ్దాలకు చెందినదిగా భావిస్తున్నారు.ఈమె ఒక పానశాలలో మద్యం విక్రయించే వృత్తిలో పని చేసింది.ఆ రోజుల్లో చైనాలో మద్య విక్రయశాలల్లో పని చేసే యువతులు సహజంగా వేశ్యలుగా వుంటారు.కళలలో నిపుణులుగా వుంటారు.త్సు యెఁ తన వృత్తిలో భాగంగా కళాత్మక సొగగసైన చేతిరాత ( కాలిగ్రఫి) లో శిక్షణ పొందింది. అంతేగాక నాట్యం,చరిత్ర, సంగీతం,మర్యాద,కథలు చెప్పడం మొదలయిన వాటిలో కూడా కఠిన శిక్షణ పొందింది.వృత్తిలో భాగంగా ఆమె చలాకీగా,తెలివిగా,ఎవరినైనా రంజింపచేసే విధంగా వుండేది.దేనినైనా కవితగా మలచగలగేది.

త్సు యెఁ కవిత్వాన్ని బట్టి చూస్తే ఆమె వివిధ సమయాలలో వివిధ పురుషుల ప్రేమలో పడుండాలి లేదా వారందరినీ ఒకే ఒక ఊహాత్మక రూపంగా ‘ అతడు ‘ లేదా ‘ నువ్వు’ అని ఆమె సంభోదిస్తూ  కవిత్వం రాసి వుండాలి.ఆమె కవిత్వంలో ఉత్సాహం, విరహం, ఎడబాటు, ఆశనిపాతం, నిరాశ, శృంగారం కనిపిస్తూ వుంటాయి.బహుశా ఆమె తన ఊహాత్మక ప్రియుని పొందలేకపోయిన ప్రతిఫలనం ఆమె కవిత్వంలో కానవస్తుంది కావచ్చు.ఆమె రాసిన కవితలు / గీతాలు 115 వరకు లభ్యమవుతున్నాయి.

Kenneth Rexroth సంకలనం చేసిన Women Poets of China లోనూ, Sam Hamill సంకలనం చేసిన Crossing the Yellow River, The Lotus Lover లోనూ త్సు యెఁ కవితలు చోటు చేసుకున్నాయి.

చీనా కవిత్వంలో మరో సుప్రసిద్ధ కవయిత్రి లి చింగ్ చావోతో సరిసమానంగా త్సు యెఁ ను పరిశోధకులు భావిస్తున్నారు.

1972 లో Lenore Mayhew & William McNaughton లు చీనా లోంచి ఇంగ్లిషు లోకి అనువదించిన The Love Poems of Tzu Yeh – ‘ The Gold Orchid ‘ పుస్తకంలో త్సు యెఁ కవిత్వం లభ్యమవుతున్నది.

1.పంకజ ప్రియుడు

స్వచ్ఛ నీలికెటాల మీద పచ్చని పంకజ పుష్పం :

పూలు తాజాగా, ఎర్రగా ఎదుగుతాయి.

 

ఈ అందమైన పూలని నీకు ఏరుకోవాలని వుందా ?

అయితే, నా పంకజ పూమొగ్గని నీకిస్తాను.

2.రాత్రంతా

చంద్రుని తెల్లని వెన్నెలలో

రాత్రంతా నిదురలేదు.

 

ఒంటరిగా ఆమె.

ఏదో అలికిడి వినొస్తోంది.

అతడు గాని పిలుస్తున్నాడా..?

 

ఆమె శూన్యంలో

బదులిచ్చింది.

3.వసంతానికి ముగింపు

 

నీ నిష్క్రమణ

వసంతాన్ని ముగింపుకు తెచ్చింది.

 

ఎదురుచూపు

ఎండాకాలపు వడగాలులలో కాలిపోతుంది.

 

నీకోసం ఇంకెప్పుడైనా నా దుస్తులు జారవిడుస్తానా?

ఇంక నా తలగడ నీ సుందర వదనాన్ని మోపగలదా?

4.నవ్వు

 

కొండ మీద

గోడలు లేని ఈ ఇంటిలో

గాలి నలువైపుల నుండి తాకుతుంది.

 

అవి నీ అంగీ ఊడేలా ఎగరగొడితే

నేను నవ్వును బిగబట్టుకుంటాను.

5.భ్రమలు

ఉజ్వల వెన్నెల కాంతిలో

అంతులేని రాత్రి.

 

ఎదురుచూసే నిదుర

ఎంతకీ రాదు.

 

అకస్మాత్తుగా అలికిడి.

నీ స్వరమేమోనని అనుకొని

నిను పిలుస్తాను.

 

నా గుండె

గొంతుకలోకి వస్తుంది.

 

నా ప్రతిధ్వని మాత్రమే

బదులిస్తుంది.

 

నా ప్రతిధ్వనే రాత్రి అంతటా వినపడతా

నన్ను ఎగతాళి పట్టిస్తుంది.

*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బావున్నాయి కవితలన్నీ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు