అంకాలమ్మ తిర్నాల

మామూలుగా అయితే స‌ప్ప‌గా ఉంటాయి. ఎవుర‌న్నా టెంకాలు కొట్టి పోతాంటారు, అయితే తిర్నాల‌ప్పుడు ఆ ఊరు క‌తే వేరు.

మా ఊరు హిమ‌కుంట్ల‌. పులింద‌ల తాలుకా, సింహాద్రిపురం మండ‌లం.  మాకు కాల‌వ‌దావ‌న తూరుపు ప‌క్క‌కు పోతే అంకాళ‌మ్మ గూడురు అనే ఊరు వ‌చ్చాది. అంకాళ‌మ్మ దేవ‌త గుడి ఆ ఊర్లో ఉంది. అందికే అంకాళ‌మ్మ గూడ‌ర‌యినాది. ఉగాది పండ‌గ పోయిన ప‌దార్రోజుల‌కు కంక‌ణం క‌డ‌తారు. అది కూడా పున్నానికి. పున్నం రోజున అమ్మ‌వారికి చీర‌క‌ట్టి, సొత్తులేసి, ముక్కుపుడ‌క‌బెట్టి అలంక‌రిచ్చారు, దాలంలో ఉండే శిల‌బండిని బ‌య‌టికి తీచ్చారు. పున్నం త‌ర్వాత  బేచ్చారం(గురు) వ‌చ్చే బేచ్చారం.. ల్యాకుంటే ఆదివారం వ‌చ్చే ఆదివారం మొద‌టి వార‌మ‌యితాది.  నాలుగువారాలు (కేవ‌లం ఆది,బేస్త‌,ఆది, బేస్త‌) గూడూరు అంకాల‌మ్మ తిర్నాల జ‌రుగుతాది. అబ్బ‌బ్బ ఏముంటాదిలే.. అనంత‌పురం బార్డ‌రులో ఉండే ఈ తిరునాల తాడిపిత్రి, వేంప‌ల్లె, జ‌మ్మ‌ల‌మ‌డుగు, పార్న‌ప‌ల్లి.. ఇట్లా చానా ఊర్ల తిక్కు బాగా తెల్చు.
అంకాళ‌మ్మ గూడురు మామూలుగా అయితే స‌ప్ప‌గా ఉంటాయి. ఎవుర‌న్నా టెంకాలు కొట్టి పోతాంటారు, అయితే తిర్నాల‌ప్పుడు ఆ ఊరు క‌తే వేరు. అంకాళ‌మ్మ దేలం ఎదురుంగ ఉండే ఖాళీస్థలంలో మొల్చిన సీగిసెట్ల‌ను నెల‌ముందే కొట్టేచ్చారు, బాగా చ‌దును సేచ్చారు. తిర్నాళ మొద‌లైతానే.. ఆ ఊరంతా సంద‌డే సంద‌డి. ప‌క్కూర్లు అంతే. ఎవురు చూసినా మా ఊర్ల దిక్కు ‘తిర్నాల కంక‌ణం క‌ట్నారు మొద‌టి వారం అయిపోయినాది’ అంటాంటే.. మా పిల్ల‌గాళ్ల గుండె క‌లుక్కుమంటాండ‌. ఆ టైములోనే ప‌రీచ్చ‌లు కాల‌బ‌డ‌తాండ.  బేచ్చారం రెండోవారం అయితానే పోవాల‌నుకుంటాంటి ముందే. ‘మూడోవారం ఆదివారం ప‌డ‌తాదిలే. పదాంలేప్పా.. రెండోవారం ఏంటికిలే, ఏంటీ దొర‌క‌వు వ‌చ్చువులు’ అంటాండ
మా నాయిన‌.

మా నాయ‌న తెల్లార్జామునే టాక్టరు ప‌నికి పోయింటాడు, మాయ‌మ్మ ప‌ద్ద‌న్నే ప‌నికి పోతా పోతా… “ఎనుములు జాగ్ర‌త్త‌, పాప జాగ్ర‌త్త” అనుకుంటా కొడ‌వ‌లిక్కి, ట‌వాల‌, బువ్వ‌టిప‌ను ప‌ట్టుకోని కూలి ప‌నికి ఎల్ల‌బార‌తాండ‌. నా క‌డుపు క‌లుక్కుమంటాండ‌. ‘ఒమా.. ఈ పొద్దు రెండోవారం తిన్నాల‌. ప‌దాంమా’ అంటాంటి. ‘పైటుముంటి ప‌దాం. బెరీన వ‌చ్చా. మీనాయిన‌తో పోదువులే టాక్ట‌రు పోతాదిలా’ అనుకుంటా బెరీన మాయ‌మ్మ చేనుదిక్కు పోతాండ‌.  ‘వొమా.. ఎవురియ‌న్న ఎద్ద‌ల‌బండ్లు పోతే పోతా’ అంటాంటి. “అట్ల పోవాకు. పిల్లోళ్లు త‌ప్పోతారు. నా ద‌గ్గ‌ర లెక్కుండాది. నీకు జీపు కావాల‌న్యా.. ఇంగా ఏంది కావాల‌న్యా తీపిచ్చా. పోవాకు బంగారు చెప్ప‌కుండా” అని మాయమ్మ గ‌డ్డం ప‌ట్టుకోని బ‌తిమలాడేది. ‘పోనులేమా’ అంటాంటి. అయినా  మాయ‌మ్మ‌,నాయిన మీద అలివిగాని కోప‌మొచ్చేది.  ఏం చేయాల‌నో అర్థంగాక వ‌సార్లోని గ‌డ్డిలో ప‌డో, నుల‌క‌ల‌మంచం మీద ప‌డి దొళ్లేవాణ్ణి. ఏడిచేవాణ్ణి. ప‌ద్ద‌న్నే తిన్నాల‌కు పోతే.. తిన్నాలంతా చూడ‌చ్చు. ఏంటియోక‌టి కొనుక్కోవ‌చ్చ‌నే ఆశ‌. ఏడిచినాక‌..  జోబీలో దొంగ‌గా తిన్నాల కోసం ఎత్తిపెట్టుకున్య లెక్క చూసి ధైర్నంగా కండ్లు తుడ్సుకుంటాంటి. పైటాల‌కు బువ్వ‌తింటాంటిమి మా చెల్లెలు, ప్ర‌తి అర‌గంటా.. నాకు క‌డుపులో బాధ‌గా ఉండేది. పైటాల ఎప్పుడ‌యితాదో.. మాయమ్మ‌వాళ్లు ఎప్పుడొచ్చారో అని ఎదురుసూచ్చాంటి. మాయ‌మ్మ వాళ్లు వ‌చ్చినాంక తిన్నాళ‌కు పోదామ‌నుకుంటాంటి. మ‌య‌మ్మ లేటుగా వ‌చ్చాండ ఇంటికి. ‘కూలిప‌నికి పోతే ఇంతే.. లేట‌యినాది. ఏంటికిలే మీనాయ‌న రాల‌.. మూడోవారం ఉండ్లా పోదాం ఖ‌చ్చితంగా’ అంటాండె మాయ‌మ్మ‌. నేను చానా ఆశ‌గా మూడో వారానికి చూపెట్టుకుంటాంటి. శుక్ల‌, శ‌నివారం ఎట్ల గ‌డుచ్చాదో అనుకుంటాంటి. గంట‌లు రోజుల మాద్ద‌రి క‌న‌ప‌డ‌తాండ‌. ఆపొద్దు ప‌ద్ద‌న‌ తిరనాల‌కు సావుకార్ల పిల్లోళ్లు మోట‌రు సైక‌ల్లో వాళ్ల నాయ‌న‌గారితో పోతాండిరి. అక్క‌డ‌ శ‌వారు బండి, టాక్ట‌రు, బైకు, జీపు, టుపాకులు తెచ్చుకోని ఎచ్చ‌లుగా మాకు సూపిచ్చి, తిర్నాల గురించి మాకు చెప్తాండిరి. అయ్యి చూసినాక ఇంటికి పోయి మాయ‌మ్మ‌, నాయిన‌ను పీక్క‌తింటాంటి. ‘మూడోవారం ప‌దాంమా.. నాకు జీపు కొనిపియ్యాల‌, టుపాకి కావ‌ల’ అంటాంటి. స‌రేలే అంటాండ మాయ‌మ్మ‌.

శ‌నారం ప‌ద్ద‌న్నే మాయ‌మ్మ గాటిపూట పేడ తీసిపెడ్తాండ‌. మా బ‌జారోళ్లు గంప‌లోది వాళ్ల చాట‌ల్లో ఏ ఇచ్చుకోని పోతాండిరి. మాయ‌మ్మ ఆ పొద్దు ఇండ్లంతా న‌డుములెత్తు సున్నంగొట్టి, ఎర్ర‌మ‌న్ను తీసి ఇండ్లంతా క‌డిగేది. ఇండ్లు ప‌ద‌కొండు క‌ల్ల అలుకుతాండ‌. మా ఊర్లో అంకాళ‌మ్మ తిన్నాల టైములో పేడ అలుకుతాండారు అంటే రేప్ప‌ద్ద‌నే తిర‌ణాల‌కు పోతాండార‌ని అర్థం. దావుంటి పొయ్యేవాళ్లు ‘ఏమి ఇమాంబీ.. మూడోవారం రేపు పోతానార తిన్నాల‌కు’ అని అడుగుతాండ్రి. ‘పిల్లోల‌కోస‌రం పోవాల‌. అంకాళ‌మ్మ త‌ల్లికి టెంకాయి కొట్టి వ‌చ్చాముక్కా’ అంటా మాయ‌మ్మ గ‌ర్వంగా చెప్పేది. నా ఆనందం అల‌వికాకుండా ఉండేది. ఉరికిత్త బ‌డితిక్కు పోయి పిల్ల‌గాళ్ల‌కు చెప్తాంటి.. ‘రేపు తిన్నాల‌కు పోతాన’ అని. మంచులో ఇనాక్క తిన్నాళ్లలో అన్నీ కొని పార్దెంగాల  అనుకుంటాంటి.

ఆదివారం ప‌ద్ద‌న..

మా ఊరికి ప‌డ‌మ‌ర‌తిక్కుండే బిదినంచెర్ల‌, గుర‌జాల తిక్కునుంచి ఎద్ద‌ల బండ్లు ప‌ద్ద‌న్నే వ‌చ్చేయి. ఎద్ద‌ల‌బండ్లు జొల్ల‌లు, గాండ్లు బాగా ఎర్ర‌మట్టితో అలుకుతాండ్రి. కొత్త జొల్ల‌లు ఉంటాండె బండికి, ఇంక ఎద్ద‌ల‌కైతే మాంచి సిక్కాలు, చెండుకి టోపీలు, కాళ్ల‌కు గ‌జ్జెలు క‌డ‌తాండ్రి. మా బ‌జారోళ్ల పిల్లోల్లం అంతా ప‌ద్ద‌నే చెంబుప‌ట్టుకోని బ‌డిదిక్కు దొడ్డికి పోతాంటిమి. ఇంటికొచ్చి అర‌గ‌ల‌మింద కుచ్చుంటామో లేదో  ఎద్ద‌ల‌బండ్ల గ‌జ్జ‌ల శ‌బ్ధం గ‌ల్లుగ‌ల్లుమ‌ని వ‌చ్చాండ‌. మ‌ట్టిదావ‌లో దుమ్ము ఎగుర్తాంటే.. మేం అర‌గ‌ల మింద కూచ్చోని నోరు ఎగ‌బ‌ట్టుకోని బండ్ల తిక్కు సూచ్చాంటిమి. ఆ బండ్ల‌ల్లో పిల్లోల్ల మాదిరి అర్సుకుంటా పోవాల‌ని ఆశ‌ప‌డ్తాంటి. మా ఊర్లో బూపొద్దుకే  కొంద‌రు బండ్లు క‌ట్టి తిర్నాల‌కు ఎల్లవార‌తాండ్రి. బంధువులో, ఒకే బ‌జారోళ్లో మాట్లాడుకోని బండ్ల‌ల్లో పోతాండ్రి. అట్ల మా బ‌జారోళ్ల‌ము బండ్లోనో, టాక్ట‌రులోనో అడుక్కోని తిర‌నాల‌కు పోతాంటిమి. బండ్లో పోతాంటే ఉడాలున ఎద్దులు ప‌రిగిత్తాంటే మా ఆనందం అలివిగాకుండా ఉంటాండ‌. బండిపోతాంటే ‘పిల్లోల్లు కుచ్చోల్లి కింద‌ప‌డ‌తారు’ అని పెద్దోళ్లు అరుచ్చాండిరి. ఎద్ద‌ల బండి ఇమానం మాదిరి పోవాల అనుకుంటాంటి. అది స‌న్న‌గానే పోయేది. మా ఊరికి,గూడూరికి మ‌ధ్య‌లో బండ్లు ఆపుతాండ్రి. అక్క‌డ శివుడ‌న్న పాన‌కం పోచ్చాండ‌. ఎవుర‌న్న ముక్కున్నోళ్లు బెళ్లం మూట‌లు ఇచ్చాండ్రి. చ‌ల్ల‌కాగుల్లో పాన‌కం గ్లాసులో లొట‌లొటా అందురు తాగుతాండ్రి. మాయ‌మ్మ నాకిచ్చేది పానకం. నాకు న‌చ్చ‌దు. వ‌ద్ద‌నేవాణ్ణి. మాయ‌మ్మ‌, మా పాప తాగేవాళ్లు. ‘అందురూ ఎక్కినారా?’ అని న‌గ‌ల్లో ఉండే బండితోలేఆయ‌ప్ప అరిసేవాడు. ‘ఎక్కినాం న్నా’ అంటానే రంగుల చాల‌కాలు ఇదిలిచ్చేవాడు ఆయ‌ప్ప‌. బండిగాన్లు క‌దిలేయి.

అంకాళ‌మ్మ గూడూరికి పోతాంటే దావ‌లో న‌ర్సుకుంటా పోయేవాళ్లు ఉంటాండిరి. ‘బండిలో త‌లం ఉందా?’ అని అడుగుతాండ్రి. అన్ని బండ్లు ఫుల్లుగా ఉంటాండె. కొంద‌రు ప‌దికే పోయి వ‌చ్చేవాళ్లు సైక‌ల్లో,టీవీఎస్ లో ఎదుర‌యితాన్యారు. గూడూరు ద‌గ్గ‌ర‌కు పోయినాక కొంద‌రు న‌డూర్లో దూరి వ‌య‌సోళ్లు ప‌రిగిత్తాండ్రి తిన్నాళ‌కు. నేను పోతానేమోన‌ని మాయ‌మ్మ గ‌ట్టిగా చేయి ప‌ట్టుకుంటాండ‌. గూడూరుకు పోయినాక బండిని ఊరిబ‌య‌ట ఇరిసేవాళ్లు. ‘మేం మైటాల వ‌ర‌కూ ఉంటాం. వ‌చ్చేవాళ్లు ఈ బండ్లోనే రావ‌చ్చు’ అంటాండిరి బండోళ్లు. గ‌బ‌గ‌బా రెండువంద‌ల మీట‌ర్ల‌లో ఉండే అంకాళ‌మ్మ గుడికాడికి పోతాంటిమి. బ‌య‌టుండే బోరింగు కాడ కాళ్లు చేతులు క‌డుక్కోన్యాక టెంకాయ‌,పూలు కొనుక్కుండేది మాయ‌మ్మ అక్క‌డ షాప‌ల్లో. లోప‌లికి మా బ‌జారోళ్ల‌మంతా ఒక‌టేపారి పోతాంటే.. దేలం కాడ బ‌య‌టే పొట్టేళ్లు, మేక‌లు న‌రుకుతాంటారు. దేలం బ‌య‌ట అంతా నెత్తుటి వాస‌నే. నేను సీలు తిన‌ను, నాకు మూగిజీవాల‌ను సంప‌టం కోపం.మాయ‌మ్మ చీరచాటున న‌రికేప‌క్క‌కు చూడ‌కుండా, ట‌ప్ప‌ట్ల శ‌బ్దానికి బ‌య‌ప‌డ‌తా లోప‌లికి పోతాంటి. లోప‌ల అడుక్కుండేవాళ్లు వాకిలి కాడ ఉంటాండిరి. అంకాళ‌మ్మ దేలం క‌డిపమాను తొక్క‌కుండా లోప‌లికి పోతానే.. దేలంలో నెత్తురు వాస‌న గ‌ప్పుమ‌నేది, నాకు వాంతికి వ‌చ్చిన‌ట్ల‌నిపించేది. ‘వొమా నేను బ‌య‌టికి పోతా’ అంటాంటి. ‘అమ్మ‌వారు.. చూడాల‌,కండ్లు పోతాయి అట్ల బ‌య‌టికిపోతే’ అనుకుంటా మంచ‌ల్లో ఇగ్గుగోని మా ఇద్ద‌రినీ తీస‌క‌పొయ్యేది. టెంకాయ కొట్నాక అట్ల ముక్కోని.. ‘అంకాళమ్మ‌త‌ల్లీ ఏంటికి ఇట్ల నెత్త‌ర’ అంటాంటి మంచులో . టెంకాయ కొట్నాక నిమ్మపండు, కుంక‌మ ఇచ్చేవాళ్లు పూజార్లు. ప‌దిరూపాయ‌ల ద‌చ్చినం మాయ‌మ్మ ఏచ్చాండ‌. గ‌బ‌గ‌బా బ‌య‌టికి మాయ‌మ్మ లాక్క‌చ్చేది.

బ‌య‌టికి వ‌చ్చానే మాదిగోల్లు వాంచే ట‌ప్పెట్ల శ‌బ్దం ఇన‌ప‌డేవి. అమ్మ‌వారి గుడికాడ పూన‌కం వ‌చ్చిన‌ట్లు ట‌ప్పెట్ల‌కాడ ఎగిరేవాళ్లు.. అలివిగాని జ‌నాలు, మేక‌పోత‌ల‌కు, పొట్టేళ్ల‌కు ఆకుల‌తో దండ‌, పూల‌దండో క‌డ్తాండ్రి. యాట‌లు పెట్టేవాళ్లు అమ్మ‌వారి గుడికాడ బాగ చ‌ప్పిడి చేచ్చాండ్రి. ఊర్ల‌లోని సాక‌లోళ్లో, త‌లారోళ్లో యాటకొడ‌వ‌లితో జివాన్ని నరుకుతారు. బ‌య‌టికొచ్చానే ఒకాయ‌ప్ప పొట్టేలును న‌రికితే మెడ‌కాయ ఎగిరి ప‌డినాది. నాకు బ‌యం దొందుకుంది. మంచంతా జ‌ర‌మొచ్చిన‌ట్లు అనిపించినాది. నెత్త‌ర కాళ్ల‌ను బోరింగుకాడ క‌డుక్కోని ప‌క్క‌కు సూచ్చానే ఒక పుంజుకోడి రెక్క‌లు కొట్టుకుంటా నాకాడ ప‌డినాది. గొంతు కోసి ఇంచినారు. భ‌య‌ప‌డినా. ఎదురుగా ఉండే తిన్నాళ‌లోప‌ల‌కి పోదామ‌నుకుంటాంటే.. ‘మాయ‌మ్మ రోంచేపు ఉండు’ అంటాండె.  ‘రామా.. సూచ్చా’ అని మాయ‌మ్మ‌ను పిల్చ‌క‌పోతాంటి. అన్నీరేట్లు అడుగుతాంటి. కొనుక్కునేవాళ్లం కాదు. ఇంటికిపొయ్యేట‌ప్పుడు బొమ్మ‌ల‌రేట్లు త‌గ్గిచ్చార‌ని. తిణ్ణాల‌లో ఎవురెవ‌రో క‌ల్చేవాళ్లు. పాతోళ్లు, బంధువులు,ఫ్రెండ్సు.. బాగుండారా? అని ప‌ల‌క‌రిచ్చుకుంటాండిరి. కొంద‌రు వ‌య‌సోళ్లు చెట్టుకింద కూచ్చోని మాట్టాడ‌తాండిరి. తిన్నాల‌లో పుల్లఐసుక్రీములు, గీతాఐసులు బాగా అమ్ముడ‌య్యేయి. పుల్ల ఐసు అద్దురుపాయి, గీత ఐసు రూపాయి ఉంటాండ‌. సోడాలు, స‌ర్వ‌త్తులు తాగుతాండ్రి బాగా పులింద‌ల రోడ్డుకుండే షాప‌ల్లో. అంకాళ‌మ్మ సోమికి యాట‌లు పెట్టినేవాళ్లు బండ్ల‌కాడ వండుకోని తినేవాళ్లు.  తెల్చినోళ్ల‌ను పిల్చుకునేవాళ్లు. కొంద‌రు ముక్కాలుబాగం వండి.. పావుబాగం సీలు ఎండేసుకోవ‌డానికి దాపెట్టుకుండేవాళ్లు. మా సింహాద్రిపురం దావ‌కు.. ఊరిచుట్టూ సీల‌వాస‌న‌, తిరువాత‌బువ్వ గ‌మాలిచ్చాంటాది. సీలెంక‌ల కోస‌రం వ‌చ్చిన కుక్క‌లు మొరుగుతా కొట్లాడేవి.

తిర్నాల‌లో మా మేన‌త్త‌నో, మామ‌నో క‌న‌ప‌చ్చేవారు.  వాళ్ల‌ది గూడూరే. ఇంటికి పిల్చ‌క‌పోయేవాళ్లు. ఇంటికి పోతానే కాళ్లు క‌డుక్కున్యాక క‌జ్జికాయ‌లు, అప్ప‌లు, కారాలు, ల‌డ్లు పెట్టేవారు. ఆ ఊర్లో వాళ్లంతా తిన్నాల‌కు ఈ తిండి చేసుకోవ‌టం అక్క‌డ సంప్ర‌దాయం. పైటాల బువ్వ తిన్యాక మూడున్న‌ర‌పుడు తిన్నాళ‌లోకి వ‌చ్చి జోబీలోని లెక్క తీసి.. కీ ఇచ్చే జీపు,కారో.. ఏదోక‌టి ప‌దైదు రూపాయ‌ల‌కు లోప‌లే బేరం ఆడి తీసుకుంటాంటి. ప్ర‌తి సంవ‌త్స‌రం కొత్త బొమ్మ కొనుక్కుంటాంటి. కిర్ కిర్ మ‌నే బాణం తుపాకి కొంటాంటి. బొమ్మ‌లు కొన్యాక పిల్లోళ్ల ఆనందం చెప్ప‌డానికి అలివికాదు. మాయ‌మ్మ‌,మా పాప రోలుగోల్డు గొల్చులు, ఉంగ‌రాలు చూసేవారు. మాయ‌మ్మ‌కు ఉంగ‌రాలంటే ఇష్టం. ప‌దో,ఇర‌వ‌య్యో ఇచ్చి గ‌బామ‌ని కొంటాండ‌. మా పాప‌కు రిబ్బ‌న్లు, నెయిలు పాలీసు, కాటిక డ‌బ్బీలు కొంటాండ‌. మాపాపకు చిలకబొమ్మ,ప్లాస్టీకుబొమ్మలు, చిన్నబిందెబొమ్మలు కొనిచ్చాండ.  తిన్నాలలో మేం బొమ్మలు కొనుక్కో‌డం అయిపోయినాక బొరుగులుండే సాట‌కు పోతాంటిమి ఇంగ‌. అక్క‌డికి పోతే ఇంగ ఇంటికి ఎల్ల‌బారిన‌ట్లు. ముప్ఫ‌యి రూపాయ‌లు ఇచ్చే రెండు త‌వ్వ‌ల బొరుగులు, కాలుకేజీ బెండ్లు, కాలుకేజీ చ‌క్కెర కారాయ‌లు, అర్ధ‌కేజీ కారాయ‌లు వ‌చ్చాండ‌. అయ్యి  క‌ట్టెల సంచిలో ఏసుకోని మాయ‌మ్మ తీస‌క‌చ్చాంటే మేం ముందు ప‌రిగిత్తాంటిమి. మైటాల పూట గూడూరులో బ‌స్స‌ల్లో దిగేవాళ్లు, ఊర్లో జ‌నాలు, ఊరిబ‌య‌ట బండ్లకాడ జ‌నాలు బ‌య‌టికొచ్చేవాళ్లు..అబ్బ‌బ్బ తిన్నాల సెప్ప‌లేను. చూడాల్ల.. అనుభవించాల ఆ కిక్కు.

మైటాల నాలుగున్న‌ర దాటినాక శిల‌బండి తిప్పుతారు. చూసి పోదామ‌ని ఎదురు చూసేవాళ్లం. అంద‌రూ టెంచ‌నుగా సూచ్చాంటే శిల‌బండికి ఎద్దులు క‌ట్టేవాళ్లు. ఆ ఎద్దులు బ‌లంగా ఉండేవి. బండిని ఎద్దులు ఇగ్గుతాంటే బండి ఎన‌కాల, ముందు అరుచ్చా ప‌రిగెత్తేవాళ్లు. ‘బండికింద స‌చ్చారురా ప‌డి..’ అని పెద్దోళ్లు తిడ‌తాండిరి. ఎవురూ ప‌ట్టిచ్చుకునేవాళ్లు కాదు. అంకాళ‌మ్మ గుడిచుట్టూ మూడుమాట్లు తిరిగేది శిల‌బండి. శిల‌బండిపైన పైన పోలుమాదిరి గుండ్ర‌ని క‌ట్టెమొద్దు ఉండేది. ఆకాశానికి త‌గులుతాదా అనిపించేది. ఆ క‌ట్టె చివ‌ర్లో ఐదుకేజీలుండే మేక‌పోతును యాల‌డ‌తీసేవారు. ఆ మేక‌పోతును బ‌ల్లిపిల్ల‌ అనేవాళ్లు. అంకాళ‌మ్మ గూడూరులోని గొల్లోల్లు ముక్కుబ‌డి ఉంటే ముజావ‌ర్లు ప‌లానోళ్ల బ‌ల్లిపిల్ల క‌ట్ట‌మంటే దాన్నే క‌ట్టేవాళ్లు ప‌నివాళ్లు ఆ సంవ‌చ్చ‌రానికి. ఆ బ‌ల్లిపిల్ల‌ను మేపి మీద‌టికి(వ‌చ్చే సంవ‌చ్చ‌రం) అంకాళ‌మ్మ‌కు బ‌లి ఇచ్చేవాళ్లు. ఇంగ శిల‌బండిని ఈర్చ‌ల్యాక‌.. ఎద్దులు బుస్స‌గొడ‌తాంటే.. ఎద్దులాయ‌ప్ప చాల‌కాల‌తో కొట్టేవాడు. ట‌ప్పెట్ల శ‌బ్దం, డ్యాన్సులు, జ‌నాల అరుపులు, ఈల‌లు వేచ్చా ఎగురుతాండ్రి. పాపం పైన మేక‌పోతు అరుచ్చాండేది. పెంటిక‌లు, ఉచ్చ‌లు పోచ్చా బ‌య‌ప‌డేది. అదంతా సూచ్చాంటే.. ఆ దుమ్ములో ప‌రిగిత్తే జ‌నాలు అరుపులు ఇంటాంటే భ‌య‌మ‌య్యేది. ఒళ్లంతా పుల‌క‌రిచ్చి.. ఏళ్లు, కాళ్లు మీద ఎంటిక‌లు నిల‌బ‌డ‌తాండ. ఒళ్లంతా ఒక‌టేమైనా స‌ర్తుపోసేది. ఏదో చెప్ప‌లేని గుబులు, భ‌య్యం. గుండెలోప‌లెక్క‌డో అంద‌రితోపాటు తెలీని ఆనందం ఉండేది. అది ఇట్లా అని చెప్ప‌లేను. మేక‌పోతును పైన యాల‌గ‌ట్టి ఇట్ల అంకాళ‌మ్మ‌కు ఎందుకు న‌రుకుతారో.. ఆ త‌ల్లికి ఎందుకు సీలంటే పాణ‌మో అనుకుంటాంటి. మూడుచుట్లు దేవ‌లం చుట్టు తిరిగినాక సూచ్చే కొంద‌రికి దెబ్బ‌లు త‌గిలి ర‌క్తాలు కారేవి, కాళ్లు-చేతులు ఇంచుకుంటాండిరి. ఎద్దులు శిల‌బండిని ఈడిచినాయ‌ని.. ఎద్దుగ‌ల్ల ఆయ‌ప్ప మీసాలు దూగుతాండ‌. అబ్బ‌బ్బ‌.. ఏం కోడిగిత్త‌లురా.. ఈర్చిదెంగె బండిని అంటా ప‌క్క‌జ‌నాళ్లు పొగుడుతాండిరి. దేలం ముందు ఆ బండికి ఉండే పెద్ద క‌ట్టెను దించి మేక‌పోతును కిందికి దించేవారు.దానికి అరిసి అరిసి గొంతు పోయేది. అంత‌లోకే ప‌దాంపాండంటా అందురూ ఇంటికి బండ్ల‌ల్లో ఎక్కేవాళ్లు. మ‌బ్బు అయితాద‌ని. ఎవ‌రు ఎవ‌రి బండిని ఎక్కేవాళ్లో అర్థ‌మ‌య్యేదికాదు. ‘పొయ్యొచ్చాం అంకాళ‌మ్మ‌త‌ల్లి.. రేపు సంవ‌చ్చ‌రం వ‌చ్చాము త‌ల్లీ’ అని  దేల‌ము తిక్కు ఆ దేవ‌త‌కు దండంపెట్టుకోని.. ఎనిక్కి తిర‌క్కుండా ఇంటికి పొయ్యేవాళ్లం.  పీక‌లు ఊంచుతాంటే పిల్లోళ్లు న‌గ‌ల‌బండ్లు, టైరు బండ్లు ఇండ్ల‌కు ప‌రిగిత్తాండ‌. ఇంటికి పోయినాక జీపులు కీ ఇచ్చి ఆడుకుంటాంటిమి. బువ్వ తిన‌క‌పోయేవాళ్లం. కీ ఇచ్చి బొమ్మ‌ల‌తో ఆటాడుకునేవాళ్లం మా బ‌జార్లో పిల్ల‌గాళ్ల‌మంద‌రం. కార్ల‌కు పైన లైటుండేది. ఆకురాయికి ఎలిగేది. ఏదో సాధించిన‌ట్లు ఆనందప‌డ్తాంటిమి. దినం మ‌ధ్యానానికి.. కీ ఇచ్చే బొమ్మ‌ల‌కు కీ సొట్ట‌పోయేది. కొన్ని ప‌నిచేయ‌క‌పోతాండ‌. బాధ‌ప‌డ్తాంటిమి.

మ‌ర్చిపోతిని నాలుగోవారం జ‌నాలు పోయేవాళ్లు తిన్నాళ్ల‌కు. బొమ్మ‌ల‌కు అగ్గ‌వ‌కు వ‌చ్చాయి. అనుకునేవాళ్లు క‌డారం(చివ‌రివారం) పోతాండిరి. ఆ పొద్దు మాదిగోళ్లు ఎక్క‌వ వ‌చ్చేవాళ్లు. మొక్కుబ‌డికి మేపిన దున్న‌పోతుల‌ను బ‌లిచ్చేవాళ్లు. ఆ దున్న‌పోతుల మెడ‌లు ఈత‌పులుల‌కు తెగేవి కావ‌ని మా ఫ్రెండు ఓబులేసు చెప్తాండ‌. ఆ క‌డారం త‌ప్పోయినోళ్లే కోళ్లు, మేక‌పోతులు, పొట్టేళ్లు పెట్టుకుండేవాళ్లు. యాడ‌చూసినా దున్న‌పోతు ఎనుములే ఉండేవి. మాదిగోళ్లు అక్క‌డ తిన‌టం, ఊరికి తెచ్చుకోని ఎండేసుకోవ‌ట‌మో సేసేవాళ్లు. ఆ క‌డారం మైటాల క‌ల్లా అన్నీ ఎత్తిపెట్టేవాళ్లు. కంక‌ణం ఇప్పేవాళ్లు. శిల‌బండి గాన్లు, బండి తీసి దేలంలో పెట్టేవాళ్లు. అంకాళ‌మ్మ దేలాన్ని క‌డిగేవాళ్లు. నెత్త‌ర వాస‌న పోయి మామూలుగా గుడి ఉండాద‌ని ఆ ఊరికి పొయినోళ్లు చెప్తాండ్రి.

ఇట్ల ప్ర‌తి సంవ‌చ్చ‌రం మేం అంకాళ‌మ్మ తిర్నాల‌కు పొయ్యేవాళ్లం.  తొమ్మిదో త‌ర‌గ‌తిలో ఉండంగా అంకాళ‌మ్మ త‌ల్లి మా ఊరు హిమ‌కుంట్ల‌లో ముగ్గురును బ‌లితీసుకుంటాద‌ని మా బ‌జార్లో ఒకాయ‌మ అన్యాది. నాకు తెల్దే అన్యా. ప్ర‌తి సంవ‌త్స‌రం ఇట్ల‌నే అయితాది. నీకు తెల్దా అని ఆయ‌మ అన్యాది. ఆ సంవ‌చ్చ‌రం ప‌ద్ద‌న మూడోవారం తిర్నాల అనుకుంటాండంగానే మా ఊరిలోని ఒక త‌లారోళ్లాయిప్ప ఎల్ట్రీన్ మందు(చీనీ చెట్ల‌కు కొట్టేమందు) తాగి స‌చ్చిపోయినాడు, రాత్రి ఏడ‌ప్పుడు ఓ జీపు మా ఇంటి దావుంటి పోతాంటే.. నేను పెంచుకున్న ఎర్ర‌కుక్క‌పిల్ల జీపుకింద ప‌డి నెత్త‌ర కక్కుకోని స‌చ్చిపోయినాది. అది చూసి నేను బెత్తురుకున్యా. నేను స‌చ్చిపోతానేమో.., అంకాళ‌మ్మ త‌ల్లి న‌న్ను సంపుతాదేమోన‌ని నేను భ‌య‌ప‌డినా. అట్ల ప్రతి సంవ‌త్సరం నాకు భ‌య‌మ‌య్యేది. మా ఊర్లోవాళ్లంతా స‌చ్చిపోయిన‌ట్లు భ‌య‌ప‌డేవాణ్ని. అట్ల‌నే క‌ల‌లొచ్చేవి. క‌ల‌లో అంకాళ‌మ్మ క‌న‌ప‌డేది. కొందురేమో.. ‘అంకాళ‌మ్మ త‌ల్లిది మనూరు, ఓ పారి వాన‌కాలంలో అత్త‌గారి ఊరు గూడూరుకు పోతాంటే బండి ఇర‌క్క‌పోయినాదంట‌. అప్పుడు మ‌నోళ్లు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదంట‌, అప్ప‌టినుంచి అత్త‌గారి ఊరిలో ఉండాది. మ‌న ఊరి మ‌గం చూడ‌ల‌. కోపం. మ‌న‌ ఊరోళ్ల‌ను బ‌లితీసుకుంటాది ఆయ‌మ‌’ అని చెబుతాంటే పైన‌పాణాలు పైన పొయ్యేవి నాకు.

రెండువేల సంవ‌త్స‌రం దాటినాక మా ఊరిమింద వ‌చ్చే ఎద్ద‌ల‌బండ్లు త‌గ్గినాయి. జ‌నాలు నాగ‌రికం తిరిగి బ‌స్స‌ల్లో,బైకుల్లో, టాక్ట‌ర్లు, ఆటోలు, జీప‌ల్లో పోతాన్యారు. మెల్ల‌మెల్ల‌గా అయ్యిపోయినాయి. ఎవ‌రి బైకుల్లో వాళ్లు పోతానారు. బీదోళ్లే బ‌స్స‌ల్లో పోతానారు. తిర‌నాల‌లో బొమ్మ‌లు పెట్టే పెద్దోళ్లు రాడంలేదు. వాళ్ల పిల్లోల్లు ఈ యాపారం చేయ‌లేదేమో. అమ్మేవాళ్లు త‌గ్గినారు, కొనేవాళ్లు త‌గ్గినారు. తిర్నాల ఊర‌క జ‌రిగిందంటే జ‌రిగింద‌ని పోరుజాల‌కు జ‌రుగుతాంది. గూడురు తిర‌నాల‌కు మేము ఓసారి యాటలు పెట్నాం.. నేను ఇంట‌రులో. అది మ‌ర్చిపోలేను. నేను పెంచుకున్య పొట్టేలును మా నాయిన హ‌లాలు సేచ్చాంటే.. నేను ఎంత బాధ‌ప‌డినానో. బువ్వ‌గూడా తిన‌కుండా నాలుగునాళ్లు బాధ‌ప‌డినా.

ఇప్పుడు ప‌ల్లెల‌నుంచి వ‌చ్చి ఏ టైములో అయినా అమ్మ‌వారికి టెంకాయ‌లు కొట్టిపోతానారు. యాట‌లు కూడా త‌గ్గినాయి. యాటలు కొట్టినా ఇంటికి కార్లో తెచ్చుకోని ఇంట్లో కోసుకోని డిన్న‌రుపెడ‌తానారు(డిన్న‌రు అంటే మాసైడు సీల‌బువ్వ‌). చైనాబొమ్మ‌లు చిన్న‌ప‌ట్ట‌ణాల్లో దొరుకుతానాయి. బొమ్మ‌ల ఇల‌వ పిల్ల‌ల‌కు త‌గ్గినాది. అక్క‌డ ఐసుక్రీములులు, సోడాలు, న‌న్నారు స‌ర్వ‌త్తులు వేసేవాళ్లు లేరు, కూలుడ్రింక్సు తాగుతానారు,, అంకాళ‌మ్మ గుడికాడ ఉండే షాపుల్లో. అక్క‌డ బోరింగులేదు. కాళ్లు క‌డుక్కోని లోప‌లికి పొయ్యే భ‌క్తులు లేరు.

అంకాళ‌మ్మ గుడిని రీమోడ‌లు చేసినారు స్ట‌యిలుగా. ముజావ‌ర్లు పాతోళ్లు లేరు, ఒక‌ప్పుడు తేలుకుడితే, జెర్రికుడితే అంకాల‌మ్మ‌సోమి నిమ్మ‌కాయ పిండేవాళ్లు. ఆ గుడోళ్లు మందు ఇచ్చే పురుగుబుట్ట‌ల నొప్పి పొయ్యేది. ఇపుడు అంకాళ‌మ్మ గుడికి బీదోళ్లే కాదు షావుకార్లు వ‌చ్చాండారు, షావుకార్లు కారు వేసుకోని సూసి అమ్మ‌వారికి చీర‌క‌ట్టిచ్చి వేల డ‌బ్బులు రూపాయ‌లు హుండీలో వేసి వ‌చ్చానారు. అమ్మ‌వారి గుడే మారింది. ప‌దేండ్ల‌నుంచి శిల‌బండి క‌ట్టే మొగోళ్లు లేరు. అంద‌రూ చ‌దువుకున్యారు. పాత‌సంప్రదాయాలు మ‌ర్సినారు. అప్ప‌టి పెద్దోళ్లు ముసిలోళ్ల‌యినారు, వాళ్ల పిల్లోలు ఈ ముసిలోళ్ల‌ను ప‌ట్టిచ్చుకోలేదు. అందుకే శిల‌బండి క‌తే లేదిప్పుడే. మంచ‌ల‌మాదిరే అంకాళ‌మ్మ‌వారు కూడా నైసుకి తిరిగినారు. ఇపుడు అంకాళ‌మ్మ గూడూరు తిర్నాల అంటే ఒక‌ప్ప‌టి జ్క్షాప‌కంగా మిగిలింది. ఇప్పుడు తిర్నాల కొంచెమే ఉండాది. అప్పుటి రోజుల్లా తిర్నాల ఫీలింగులేదు. ఆ ఎమోష‌ను లేదు. ఆ సంద‌డీలేదు.

—ప్ర‌స్తుతం అంకాళ‌మ్మ‌గూడురు తిర్నాల టైము- ఇది గుర్తొచ్చి—

( అంకాళమ్మ గూడూరులో ప్ర‌ముఖ ర‌చ‌యిత, ప‌త్రికా ఎడిట‌రు దివంగ‌త గ‌జ్జ‌ల‌మ‌ల్లారెడ్డి పుట్టినాడు, అంకాళ‌మ్మ గూడురులో మాంచి లెఫ్టిస్టులు ఉండారు. వాళ్ల గురించి నాకు పెద్ద‌గా తెల్దు, ఈ ఊరి ప‌క్క‌నే దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి ప‌ల్లె ఉంది, ఆ ప‌ల్లెపేరు బ‌ల‌ప‌నూరు. అంకాళ‌మ్మ గూడూరు అనంత‌పురం చివ‌ర ఉండే సింహాద్రిపురం మండ‌లంకింద‌కి వ‌స్తుంది, మా ఊరు అంతే. మేం అనంత‌పురం,క‌డ‌ప మిక్సు యాస మాట్లాడ‌తాం)

*
రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అభినందనలు సర్ రాళ్లపల్లి గారూ

 • నీ పాసుగుల్లా మా ఊర్నిగుర్తుతెచ్చినావుపో. మాది జమ్మలమడుగు దగ్గకంలో యాపరాల.. మీకు అంకాలమ్మ తాన్నాల ఉన్నట్టే మాకు కూడా జమ్మడక్కు తిర్నాల జ్ఞప్తికి వచ్చింది. జమ్మడక్కు ఎంటకాలంలో వస్తాది. మేము ఎన్ని రకాలుగా అన్కోనే వాళ్లం… ఎద్దలబండి, సిమ్నా బండి, కళ్లద్దాలు, వాచ్చి ఇట్టా ఎన్నోన్నో బొమ్మలు కొనుక్కోవాలని అనుకొంటాంమి. మాయమ్మను ముందు నుంచి లెక్కకావాలని న్యాను, మావాడు అడుగుతుంటాంమి. బొమ్మల ఏది కొనియ్యపోయినా బాధపడ్తామి. మా ఇంటికాడ సిద్దారెడ్డి వాళ్ల చేన్లో డిసంబర్ చెక్కాయ చేసేవాళ్లు.. చెన్నక్కాయలు కోయనీకి పోయి ల్యాక్క ఎడబెడ్తాంటిమి. జేవులో ల్యాక్క ఉంటే ఆ సంబరమే వేరే మార్దిరి ఉండేదిలే..

  ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. మా ఊరికి పోయినప్పుడు నా కొడుకును, మానాయన ‘పాపోడు నీళ్లుదెంకరాపోరా’ అని అంటాడు. నీళ్లు తెచ్చిన నా కొడుకు నాతో మాట్లాడుతూ నాయనా అబ్బ దెంక్కరాపో అంటుంన్నాడే.. అబ్బ బూతులు మాట్లాడున్నాడు అని నాకు ఫిర్యాదు చేస్తుంటాడు. ఎందుకంటే వాడిది తెలంగాణ భాష కాబట్టి..

  ఈ కథలో కొన్ని చోట్లు మీరు కొని పదాలు వాడేటప్పుడు కడప జిల్లాలో మాట్లాడే బాషలో మాట్లాడిన్నట్లు నాకు అనిపించలేదు. (దేలం బ‌య‌ట అంతా నెత్తుటి వాస‌నే) నెత్తుర వాస‌నే అని వాడరు. నెత్తురును (నెత్తర) అంటారు. (ఆ ఊర్లో వాళ్లంతా తిన్నాల‌కు ఈ తిండి చేసుకోవ‌టం అక్క‌డ సంప్ర‌దాయం) సంప్రదాయం అనే పదం వాడురు. అలవాటు అని అంటారు. (నెయిలు పాలీసు) ఇప్పటికి కూడా ఈ పదం వాడేవాళ్లు లేరు. గోళ్ల రంగు అంటారు. బొమ్మలు కొంటే ‘ఆ కిక్కే వేరు’ అని అన్నారు. కిక్కు అనే పదం మీరు చెబుతున్న కాలమాన పరిస్థితిల్లో ఆ పదం వాడుకలో లేదు. ఈ కథను బట్టి చూస్తే 30 ఏళ్ల కిందకి చరిత్ర, అప్పటి పరిస్థితులను మీరు చెప్పినట్లు అర్థం అవుతోంది. అయితే కథలో కొన్ని సందర్భాల్లో ఇప్పటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది నా అభిప్రాయం మాత్రమే పులివెందుల, సింహాద్రిపురంలో యాసలో రాశారు. చాలా సంతోషం. నేను పైన రాసిన రెండు లైన్లకే కొంత కష్టపడ్డాను. ఎందుకుంటే మనం మాట్లాడే శైలి మనది కాదు కాబట్టి. (అసలు నేను ఇంతకు నీకు ఎవరో చెప్పలేదు కాదా నా పేరు భాస్కర్ మాది జమ్మలమడుగు పక్కన వేపరాల, మైలవరం మండలం)

  • చాలా సంతోషం. ధన్యవాదాలు కథలో కొన్ని పదాలు పోయాయి. Time leka tension lo rasinavi. Malli reading, editing cheyaledu. ముమ్మాటికీ నా తప్పే. అన్నీ సవరించుకుంటాను. మీ ఊరి గురించి రాసినారు. చానా ఆనందంగ ఉండాది. మీ ఫోన్ నంబరు ఇయ్యండి
   నా ఫోన్ :7989746115

 • అంకాలమ్మ తిర్నాల అంటూ శివాలెత్తించినావులే రాజావలి.

  ”తెలుగు నాట భక్తి రసం – తెప్పలుగా పారుతోంది… డ్రైయినేజీ స్కీము లేక – డేంజర్‌గా మారుతోంది…” అని నాలుగు దశాబ్దాల క్రితం అన్న ప్రముఖ కవి గజ్జెల మల్లారెడ్డి అంకాళమ్మ గూడూరులో పుట్టినాడని చెప్పిన రాజావలికి…

  పెంచుకున్య పొట్టేలును హ‌లాలు సేచ్చాంటే.. బువ్వ‌గూడా తిన‌కుండా నాలుగునాళ్లు బాధ‌ప‌డిన రాజావలికి అంకాళమ్మ‌త‌ల్లీ… భూమ్యాకాశాలనున్న తల్లులందరి దీవెనలు.

  • మీ మనపూర్వక అభినందనలకు , స్పందనకు ధన్యవాదాలు సర్ !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు