తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరానికి చెందిన నాగేంద్ర కాశీ ఇప్పటి వరకూ రాసింది పదిలోపు కథలే. ఐనా ప్రతీ కథలోనూ అటు వస్తువు పరంగా, ఇటు నిర్మాణం పరంగా వైవిధ్యం చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. “కోయెటా అబ్బులు”… కథలో పేదరికం, అప్పుల బాధ తట్టుకోలేక …అరబ్బు దేశాలకు వలసపోతున్న కుటుంబాల దీనస్థితిని చూపిస్తూనే ఊహకు అందని ముగింపుతో పాఠకులను ఆకట్టుకున్నారు. గోదావరి జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలైనా… ఆ అభివృద్ధి అన్ని వర్గాలకు అందని తీరునూ, పేదరికం సృష్టించే బతుకు చిత్రాలని తన కథలుగా చెపుతున్నారు. అదే సమయంలో మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్ ఫోన్లు, యువతరం జీవితాల్లో సృష్టిస్తున్న సంక్షోభాన్ని, విలువల పతనాన్ని చూపించే ట్రెండింగ్ … కథనూ రాశారు (కొత్త కథ 2018 సంకలనంలో వచ్చింది.) మొత్తంగా నేటి యువతరం ఆశల్ని, ఆకాంక్షల్ని తన కథల్లో విభిన్నమైన శైలిలో చూపడానికి ఆసక్తి చూపిస్తున్న నాగేంద్ర కాశీ కథ “ఎక్స్” ఈ పక్షం సారంగ “రేపటి కథ.”
పాముల్లా మెత్తగా జారుతూ కను రెప్పల్ని కాటేసి రెండు కన్నీటి బొట్లు కింద పడి మాయమై పోయాయ్. అతని చూపు నేల నెరలు తీసినట్టు చిట్లి పోయి నల్లని అగాధం లోకి పడిపోయింది. గోడ మీద చచ్చిపోయిన భార్య నవ్వుతున్న ఫోటో. బతికున్నప్పుడు అలా నవ్విన సందర్భాలు తక్కువే. చనిపోయి సంవత్సరం అయింది. జ్ఞాపకాలు కొక్కె ల్లా నడ్డి మీద చర్మాన్ని గుచ్చి గుచ్చి లాగుతున్నాయి. చాల రోజుల తర్వాత ఏడుపొచ్చింది అతనికి. చిన్న ఏడుపు. ఏంటో అన్నీ చిన్నవైపోయాయి. అన్ని స్పందనలూ అల్పాయుష్షు తోనే చచ్చి పోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆగకుండా నవ్విన ఒక్క నవ్వు గుర్తు లేదు. కనీసం రోజంతా బాధలో కాలిపోయిన సందర్భమూ లేదు.
మంచం పక్కకి చూసాడు. బాటిల్ లో వేసిన పిల్స్ పీకేసిన కళ్ళ లాగ వికారం గా కనబడుతున్నాయ్. పైకి లేవడానికి ప్రయత్నించాడు. చేయి కదల్లేదు. మణి కట్టు మీద ప్లాస్టర్. చూడగానే నొప్పి తెలిసింది. రాత్రి ఏం జరిగిందో గుర్తొచ్చింది.
ఎప్పటిలాగే రాత్రి ఏం చేయాలో తెలియకపోతే, ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుని ఒక పబ్ కెళ్ళాడు, కొత్తగా ఉంటుందని. ఎప్పుడూ తాగే బ్రాందీ ఎందుకని షాట్స్ ట్రై చేసాడు. మానేసిన సిగరెట్ వెలిగించాడు. అంతా బాగానే జరిగింది కానీ, ఫ్లాట్ దగ్గర మెట్లు ఎక్కుతున్నప్పుడు తూలి పడ్డాడు. కొంచెం సేపటివరకూ ఎవరూ రాలేదు. వాచ్ మెన్ చూడలేదు. ఓ అరగంట తర్వాత ఎవరో పై ఫ్లాట్ లో ఉండే అబ్బాయి చూసి తీసుకొచ్చాడు.
గుర్తొచ్చిన తర్వాత మనసు కొంచెం కుదుటపడింది. అంతలో టక్ మని తలుపు తోసుకొని లోపలికొచ్చింది పని మనిషి. మంచం మీద పడుకున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ, “ఏంటి సారూ, చిన్న పోరగాళ్లా మీరు? రాత్రి యాడికెళ్లారు? అమెరికా నుంచి ఫోన్ వొస్తది… ఏం చెప్పమంటరు” అంటూ తడిగుడ్డ పెడుతూ మాట్లాడుతోంది.
ఏం మాట్లాడలేదు.
పని మనిషి కిచెన్ లోకి వెళ్లి “ఏం వండమంటారు?” అని అడుగుతున్నట్టు వినిపించింది. పట్టించుకోనట్టు బాత్ రూమ్ కి వెళ్ళాడు.
గోర చిక్కుడు కాయలు బాగు చేసి, వేన్నీళ్ళలో గ్రీన్ టీ బాగ్ ఒకటి పడేసి, బెడ్ షీట్ లు మడత పెట్టడానికి లోపలికొచ్చింది. బెడ్ షీట్ తీస్తుంటే, అతని స్మార్ట్ ఫోన్ కనిపించింది. తీసి అటూ ఇటూ చూస్తూ అప్రయత్నం గానే స్విచ్ ఆన్ చేసింది.
మధ్యలో పాజ్ చేసిన పోర్న్ ఫిలిం స్క్రీన్ మొత్తం. ప్లే బటన్ నొక్కి ఒక నిమిషం తర్వాత ఆఫ్ చేసింది. వొళ్ళంతా చెమటలు పట్టాయ్. “ఏంటి ఈ వయసులో ఈ పైత్యం? నన్ను కూడా రోజూ ఇలాగే చూస్తున్నాడా? మొన్న వాళ్ళావిడ చీర ఇచ్చి కట్టుకుని ఒకసారి కనిపించు అన్నాడు, ఎందుకు?” రకరకాల ప్రశ్నలతో పనులు గబా గబా చేసుకొని, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది.
బాత్రూంలోనుంచి వచ్చి లుంగీ కట్టుకొని టీ పాయ్ మీదున్న గ్రీన్ టీ, మందులూ చూసాడు.
టాబ్లెట్ తీసి గ్రీన్ టీ లో వేసాడు పడేయలేక, అలాగే వేసుకోలేకా. పేపర్ తీసి మెయిన్ హెడ్డింగ్ చదివి పక్కన పడేసాడు. గ్రీన్ టీ సగం తాగి రెండు బ్రెడ్ ముక్కలు తిని, ఫోన్ పట్టుకొని మంచం మీద పడుకున్నాడు. పాజ్ లో పెట్టిన పోర్న్ ఫిలిం ప్లే చేసాడు.
ఈ మధ్యన బాగా అలవాటైంది అతనికి. తెలియని మనుషులతో ఈ వర్చ్యువల్ ఇంటరాక్షన్ ఎందుకో నచ్చుతోంది. తనలో అణగారిపోయిన, తొక్కి పెట్టిన పర్వర్షన్స్ పురుడు పోసుకున్నాయని ఒప్పుకోలేక పోతున్నాడు. వరుసగా గంటా రెండు గంటల పాటూ చూస్తాడు. లోకాంటో లాంటి సైట్ లో కి వెళ్లి చాట్ చేస్తాడు. కూతురు వయస్సు వాళ్ళు కనబడతారు. చాట్ చేస్తాడు. మనవరాలి వయస్సు వాళ్ళు కనబడతారు. చాట్ చేస్తాడు. ఏదో ఒక పాయింట్ లో బ్రేక్ అవుతాడు. కాన్షస్నెస్ కరెంట్ షాక్ లా తగులుతుంది. టప్ మని మొబైల్ పక్కన పడేసి బాల్కనీ లోకి వచ్చి కూర్చుంటాడు. చాట్ చేసిన మాటలు గుర్తొస్తాయి. ఎంత అనాగరికమైన మాటలు. కానీ ఏదో ఆనందం. డ్రగ్ లాగ. నేను అసెక్సుల్ కాదు అని అవతలి వాళ్ళు గుర్తు చేస్తుంటే ఏదో ఆనందం. రక రకాల ఫోటోలతో క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్స్ వాడతాడు. అమ్మాయిల ఫోటో లు. మంచి షేప్ తో ఉన్న అబ్బాయిల ఫోటోలు. వాటిని చూస్తూంటే insane అనిపిస్తుంది కొద్ది సేపు. చీకట్లో తన మీద తాను అసహ్య పడతాడు. జాలి పడతాడు.
ఫోన్ పక్క న పడేసాడు. ఫ్లాట్ లో జనాలు గుర్తొచ్చారు. వాళ్లే సగం ఉత్సాహాన్ని, ఆశని చంపేశారు… ఏదో గుళ్లకు, గోపురాలకు తిరిగే బ్యాచ్ లా ట్రీట్ చేస్తారు. మాట్లాడడానికి ఎవరూ ఉండరు. మాట్లాడినా మోరల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఆ వయసు అర్హత అన్నట్టు. అక్కడ చిన్న పిల్లలు కూడా అలాగే తయారయ్యారు, వాళ్లలో అమాయకత్వం, నవ్వు పోయింది. అందుకే ఆ ఫ్లాట్ లో ఎవ్వరితోనూ మాట్లాడడు. సబ్మిస్సివ్ మెంటాల్టీ లు అని వాళ్ళ మీద జాలి పడతాడు.
మూడేళ్ళ క్రితం వరకూ ఉద్యోగం ఉండేది. సెల్ఫిష్ అయినా గాని కొంత మంది ఫ్రెండ్స్ ఉండేవారు. భార్య బతికున్నప్పుడు తన వాళ్ళని పెద్ద గా చూసేది కాదు, అందువల్ల ఇప్పుడు తన ఇంటికి రారు. ఆవిడే లేనప్పుడు ఆ యింటికెందుకు అని భార్య తరుపున తిన్నవాళ్ళు రారు. కొడుకు అమెరికా లో సెటిల్ అయిపోయాడు. హైదరాబాద్ లో ఒక ఫ్లాట్, నెలకి డబ్బు, వండి పెట్టడానికి ఒక పనిమనిషి, మిగతా పనులు చేయడానికి ఒక కుర్రాడు అన్ని కొడుకే అక్కడి నుంచి చూసుకుంటాడు. ఏ లోటూ లేదు. మనుషులూ, ఒంటరి తనం తప్ప.
కాండీ క్రష్ లాంటి గేమ్స్ ఆడాడు. మధ్యాహ్నం అయింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి, ఏం కూరో చూద్దామని మీద బౌల్ మీద మూత తీసాడు. పాలిపోయిన గోకరకాయ. విసిరి కొట్టాలనిపించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. వచ్చి సోఫా లో కూర్చుని, స్విగ్గి లో బిర్యానీ ఆర్డర్ చేసాడు. దాని వల్ల సాయింత్రం ఏం జరుగుతుందో తెలిసినా గాని ఆగలేదు. అరగంటలో బిర్యానీ వచ్చింది. సగం తిని సగం అలాగే డైనింగ్ టేబుల్ మీద వదిలేసాడు. బెడ్ రూమ్ లోకి వెళ్లి, మొబైల్ తీసుకొని ఎక్స్ అని గూగుల్ లో టైప్ చేసాడు, ఓ వంద లింక్ లు వచ్చాయ్.
“ఏంటి పని మనిషి మళ్ళీ మానేసిందట! ఏంటి నాన్న? ఏం చేస్తున్నావ్? ఇలా అయితే నువ్వే పెట్టుకో, నా వల్ల కాదు” అన్నాడు సందీప్ ఫోన్ చేసి.
ఎందుకు పని మనిషి మానేసింది? అప్పుడే వీడికేలా తెలిసింది. ఏ ప్రశ్నలకూ జవాబుకు వెతికే పని పెట్టుకోలేదు. ఆలోచించే ఆసక్తి కూడా లేదు. ఆలా విటున్నాడు.
ఆన్సర్ చేయలేదు.
“నాన్నా ! ఉన్నావా లైన్ లో” అన్నాడు.
“ఊఁ” అన్నాడు.
యేవో మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసాడు కొడుకు.
సందీప్ చాలా కేరింగ్. రోజూ ఫోన్ చేస్తాడు. పక్క ఫ్లాట్ లో వాళ్ళ తో మాట్లాడుతాడు. అమెరికా వెళ్ళిపోతున్నప్పుడు “వచ్ఛేస్తారా?” అని అడిగాడు. అప్పుడు వాళ్ళమ్మ ఉంది. ఇద్దరూ రానన్నారు. తల్లి చనిపోయినప్పుడు అతనే ఇండియా కి వచ్చాడు. “వచ్ఛేస్తావా?” అని మళ్లీ అడిగాడు. ఏమీ సమాధానం చెప్పలేదు. మళ్లీ ఇండియా కి వస్తే తాను పోవాలి. కొడుకు కెరీర్ ని తప్పు బట్ట లేదు. కొడుకంటే మహా ప్రేమ. కానీ చూపించే సందర్భాలు తక్కువ సార్లు మాత్రమే దొరికాయ్ అతనికి. ఇప్పుడు వదిలి ఉంటేనే ప్రేమ ని, అదో ఎక్స్ప్రెషన్ అఫ్ లవ్ అనుకుంటున్నాడు. కొడుకు మీద కంప్లైంట్స్ లేవు.
ఏడవుతోంది. ‘రోజు’… తన లాగ ముసలిదైపోయి కాంతి విహీనం గా ముడతలు ముడతలు పడి పోతూ నల్ల గా మారిపోతూ ఉంది. రాత్రి పూట గాలి ఎందుకో భయపెడుతోంది ఈ మధ్య జడలు విప్పుకున్న దెయ్యం లా కిటికిలోంచి తొంగి చూస్తోంది. గుండె వేగం గా కొట్టుకుంటోంది. ఈ మధ్య సన్నని సెగ లాంటి నొప్పి నరాల్లో పురుడు పోసుకుంది. అది రక్తం తాగుతూ పెరిగి పెద్దదవు తుందేమోనని అనుమానం గా ఉంది. ఏదో చుట్టం లా అప్పుడప్పుడూ వస్తోంది.
తొమ్మిదైంది. రెండు గంటల్ని రాయి మీద పెట్టి నూరినట్టు అనిపించింది. పక్క ఫ్లాట్ లోని టీవీలో జబర్డస్త్ ప్రోగ్రాం నడుస్తోంది.
సోఫా లో కూర్చుని టీవీ ఆన్ చేసాడు. ఆడ వేషం వేసుకున్న ఒక అబ్బాయి కామెడి. అమ్మాయి జెనైటల్స్ కూడా ఇతను ఫీల్ అవుతాడా అనే ఒక ప్రశ్న వచ్చి నవ్వు రాకపోగా చిరాకు వచ్చింది .
ఇంతలో మధ్యాహ్నం తిన్న బిర్యానీ తాలూకు ఆఫ్టర్ ఎఫెక్ట్ మొదలైంది. గబా గబా బాత్రూమ్ కి వెళ్ళాడు. రెండు విరోచనాలు. కమోడ్ మీద నుంచి లేస్తుంటే మోకాళ్ళ ని మేకుల మీద ఆనించి లేపుతున్నట్టు ఒకటే బాధ. నీరసం వచ్చింది. వెంటనే చిరాకొచ్చి చేతి మీద ప్లాస్టర్ తీసి పడేసి, ఠప్పున లేచి బయటికి వచ్చాడు.
పనిమనిషి కి ఫోన్ చేసాడు. ఎందుకు మానేసిందో కనుక్కుందామని. కానీ ఎంత చేసినా తీయడం లేదు. కిచెన్ లోకి వెళ్లి మజ్జిగ కలుపుకొని తాగి ట్రాంక్విలైజర్ వేసుకొని, వైరాగ్యానికి గూగుల్ లో అర్ధం వెతుకుతూ పడుకున్నాడు .
సందీప్ ముభావంగా కూర్చున్నాడు బ్యాక్ యార్డ్ లో. కొడుకూ, కూతురూ కుక్క పిల్ల తో ఆడుతున్నారు. రమ్య బార్బెక్యూ గ్రిల్ క్లీన్ చేస్తూ సందీప్ నే చూస్తోంది. రెండు రోజుల నుంచి అలాగే వున్నాడు. రమ్య లోపలి కెళ్ళి ప్లేట్ లో నాచోస్, సాస్ పట్టుకుని వచ్చి పక్కన కూర్చుంది.
“ఏమైంది” అని అడిగింది.
“నథింగ్” అన్నాడు, నాచోస్ తింటూ.
“మీ డాడీ కి ఏమన్నా అయిందా.”
“నో. బాగానే ఉన్నారు.”
“మరి.”
“పని మనుషులు మానేస్తున్నారని ఎంక్వయిరీ చేస్తే ఒక విషయం తెలిసింది. డాడీ పోర్న్ చూస్తూన్నారంట. అదీ పనిమనుషుల ముందు. వాళ్ళకి కనిపించేలా. మానేసిన ముగ్గురూ అదే చెప్పారు. ఒకావిడ అయితే బాత్ రూమ్ డోర్ పెట్టు కోకుండా స్నానం చేస్తారు అని చెప్పింది.”
“అదేంటి ..!?” జనరల్ గా ఇలాంటి విషయాల పట్ల ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది ఈ వయసులో.
“ఈ రోజు పేపర్ చూసావా” అని తన మొబైల్ లో ఈ పేపర్ ఓపెన్ చేసి చూపించాడు.
“వృద్ధుడి కామానికి బలైన చిన్నారి” అనే హెడ్ లైన్ కనబడింది. బాక్స్ ఐటెం లో రాసారు.
“పక్క ఫ్లాట్స్ లో ఆడ పిల్లలున్నారు. టీనేజర్స్. ఇంట్లోనే ఉండే ఆంటీ లున్నారు. ఏదైనా మిస్ బిహేవియర్ నోటీసు చేస్తే?” అని చేయి నుదుటి మీద పెట్టుకున్నాడు.
“నువ్వు మరీ ఓవర్ గా ఆలోచిస్తున్నావ్. బాగా చదువుకున్నాయన. టూ మచ్ నువ్వు. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే బోలెడంత కంటెంట్ ఉంటుంది. నీ వాట్సాప్ గ్రూప్ లో ఉండట్లేదా వీడియో లు. షేర్ చేయడం లేదా మన ఫ్రెండ్స్ . లైట్ తీసుకో. గెట్ అప్. కాస్ట్కో కి వెళ్ళాలి,” అంది విషయాన్ని డైల్యూట్ చేస్తూ.
అప్పటికప్పుడు మనసు తేలిక పడింది.
పైకి లేస్తూ “పోనీ ఆయన్నే అడిగితే?”
“యేమని అడుగుతావ్? డాడీ పోర్న్ చూస్తున్నారా, ఎక్స్ వీడియోస్ చూస్తున్నారా… రెడ్ ట్యూబా?” అంటూ నవ్వింది.
చిన్నగా తల మీద కొట్టి “నీకు కామెడీ అయిపొయింది” అన్నాడు.
“సందీప్, వుయ్ కాంట్ కంట్రోల్ ఇట్. ఇమ్మెర్స్ అయిపోయున్నాం మనం అందరం. రేపు నీ కొడుకు చూస్తే నువ్వు కంట్రోల్ చేయగలవా? కెన్ యు? ఆయనకి ఆ థిన్ లైన్ తెలుసని అనుకుంటున్న” అంది డ్రెస్ చేసుకుంటూ.
సందీప్ అప్పటికి రిలాక్స్ అయినట్టు కనిపించాడు.
తర్వాత రెండు రోజులు, అతనికి కలల్లో తండ్రిని చెట్టుకు కట్టి కొడుతున్నట్టు, ఫ్లాట్ లో వాళ్ళు అందరూ చెప్పులతో కొడుతున్నట్టు, న్యూస్ చానెల్స్ వాళ్ళు పదే పదే తన తండ్రి ఫోటో వేస్తున్నట్టు ఒకటే కలలు. ఆ దెబ్బకి వారం రోజులు పేపర్లు, తెలుగు న్యూస్ చానెల్స్ చూడడం మానేసాడు.
చీకటి గాలి మొదలయ్యింది. కిటికీలు మూసేసాడు. ఇంకా చిన్న చిన్న కన్నాల్లోనుంచి నిన్ను వదలను అన్నట్టు మొహానికి తగులుతోంది. గుండె కి అతి దగ్గరగా సన్నని సెగ లాంటి నొప్పి గూడ్స్ బండి లా వస్తోంది. చిన్న ఎలక్ట్రిక్ షాక్ లాంటిది మెదడుకు తగులుతోంది. పక్కనే ఉన్న మంచి నీళ్ల బాటిల్ తీసి రెండు గుటకలు వేసాడు. నొప్పి తగ్గింది. వెల్లకిలా పడుకొని ఫ్యాన్ వైపు చూస్తుంటే అది గతం లోకి లాక్కెళుతున్నట్టు తిరుగుతోంది. బాల్యాన్ని, యవ్వనాన్ని దేన్నీ గుర్తుకు తెచ్చుకొని, దాని గురించి ఆలోచించటం ఇష్టం లేదతనికి. కనీసం అమ్మ నాన్న ని గురించి కూడా, ఎట్ లీస్ట్ భార్యని కూడా.
ఆబ్జెక్టివ్ రియలిజం గుర్తొచ్చింది.
స్వార్థం తన్నుకొచ్చింది. తన కోసం తాను నిజంగా బతికిన క్షణాలు గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.
మళ్లీ సన్నని సెగ. చిన్ననాటి స్నేహితుడిలా బ్రాందీ గుర్తొచ్చింది. వెంటనే ఉత్సాహం వచ్చింది. చురుగ్గా పైకి లేచాడు. షెల్ఫ్ లో ఉన్న బాటిల్ తీసి, గ్లాస్ తెచ్చుకొనే ఓపిక లేక మంచి నీళ్ల బాటిల్ లోనే సగం పోసేసాడు. రెండు గుటకలు మింగాడు. మనసు తేలిక అయ్యింది.
భార్య వుంటే ఆ బాటిల్ స్థానం వేరే చోట ఉండేది. భార్య ఉన్నప్పుడు ఆమెతో గొడవ పడుతూనో, ఏడిపిస్తూనో కాలం గడచి పోయేది. దాని అవసరం పెద్దగా రాలేదు. ఇప్పుడు అగాధం.
వాట్సాప్ లో “నాన్నఎలా ఉన్నారు” అని మెసేజ్. రిప్లై ఇవ్వలేదు.
వీడియో చాట్ విత్ strangers అని కొట్టాడు, కొన్ని లింక్స్ వచ్చాయి. ఒక దాంట్లో వెళ్లి ఒక అబ్బాయితో మాట్లాడడం మొదలు పెట్టాడు. కొన్ని మాటలు ఐన తర్వాత అతను గే అని తెలిసింది.
చాన్నాళ్లకి నవ్వుకున్నాడు. ఆ నవ్వుకి గుమ్మం ముందుకి వచ్చి నిలబడినట్టు తాగిన బ్రాందీ నోట్లో కి వచ్చింది.
ఎందుకో పొద్దున్నే ఉత్సాహం గానే లేచాడు. పనిమనిషి రాలేదు. కిందకి వెళ్లి వాచ్ మెన్ ని అడిగాడు. “మీ దగ్గర ఎవరూ చేయమంటున్నారండి. కానీ సెట్ చేస్తాను. మొన్న మీ అబ్బాయి కూడా ఫోన్ చేసాడు సార్” అన్నాడు ఇస్త్రీ చేసుకుంటూ.
వీధి చివరకు వెళ్లి ఒక అల్లం టీ తాగి వచ్చాడు. ఎవరో కొత్త మనిషి నుంచుంది ఫ్లాట్ కి ఎదురుగా.
“పని మనిషి కావాలని అడిగారంట” అంది. ముప్పై ఐదు, నలభై మధ్య ఉంటాయి. ఛామన చాయ. చురుగ్గా ఉంది.
“రోజూ వస్తావా మరి” అనడిగాడు.
తలూపింది.
లోపలి తీసుకెళ్లి చేయాల్సిన పనులు చెప్పి ఇల్లు చూపించాడు.
ఆ రోజు పనులు చేసి, నెలకి సరిపడా డబ్బులు ముందే తీసుకొని వెళ్ళిపోయింది.
కొత్త పనిమనిషి రోజూ టైం కి వస్తోంది. వచ్చీ రాగానే మంచి కాఫీ పెట్టి ఇస్తుంది. అతనితోనే కింద కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెబుతుంది. చదువుకుంటున్న కొడుకు గురించి, హాస్టల్ లో ఉన్న కూతురు గురించి చెప్తుంది. రాత్రి ఎన్ని కొత్త ఆటలు ఆడారు ఫోన్ లో అని అడుగుతుంది. అడిగిన వెంటనే కొన్ని గేమ్స్ చూపిస్తాడు. దగ్గరగా వచ్చి పక్కన నుంచుని చూస్తుంది. నవ్వుతుంది.
ఆమె వచ్చినప్పటి నుంచి గ్రీన్ టీ మానేసాడు. పొద్దున్నే హుషారుగా లేస్తున్నాడు. ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమె చెప్పే మాటలు వినడానికి, అతను దాచి పెట్టుకున్న గొలుసు కట్టు మాటలు చెప్పడానికి ఎదురు చూస్తూ ఉంటాడు.
సందీప్ ఫోన్ చేసాడు ఆ రోజు రాత్రి.
“వంట ఎలా చేస్తోంది? ఆమె ఫోన్ నెంబర్ నాకు పంపించు” అన్నాడు.
“ఎందుకు? గ్రీన్ టీ ఇవ్వు, ఆయిల్ తక్కువ వెయ్. ఉప్పు తగ్గించు అని చెప్పడానికా? అవసరం లేదు. ఆ అమ్మాయి ఎలా చేస్తే అలాగే చేయనివ్వు. మంచి పనిమంతురాలు.”
“సరేలే! నీ ఇష్టం.”
“ఉంటా” అయితే అన్నాడు.
“నాన్నా! అది ఆ వీడియోలు గట్రా వాళ్ళముందు చూడకు” అన్నాడు సందీప్.
“ఏ వీడియో లు?”
“అదే …ముందు మానేసిన వాళ్ళు అదే చెప్పారు. బాత్రూం డోర్ వేసుకో స్నానం చేసేటప్పుడు. ఈ అమ్మాయి బాగా చేస్తుంది అంటున్నవ్” అన్నాడు.
“అదేం లేదే! లెఫ్ట్ సైడ్ లో అప్పుడప్పుడూ కొంచెం పెయిన్ వస్తోంది రా. చాలా చిన్నగా, సెగ లాగ. రెండు నిమిషాల తర్వాత పోతోంది అనుకో. ఒక్కసారి మీ ఫ్రెండ్ ఉన్నాడుగా అతనికి చెప్పు.”
“మరి ఇప్పటి వరకూ ఏం చేసావ్” అని కంగారు పడి, “నేను మళ్ళీ చేస్తా ఆగు, వాడి అప్పాయింట్మెంట్ తీసుకోమని చెప్తా మా ఫ్రెండ్ కి. ఏంటి నాన్నా నువ్వు ఇలాంటి విషయాలు నెగ్లెక్ట్ చేయకూడదు” అని ఫోన్ టక్ మని పెట్టేసాడు సందీప్.
గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.
బాత్రూం కి వెళ్ళాడు. సింక్ దగ్గర మొహం కడుక్కుని అద్దం లో చూస్తే పాములా కనిపించింది ప్రతిబింబం.
ఆ రోజు కావాలని ఫోన్ లో పని అమ్మాయి చూసేలా పోర్న్ ఫిలిం పెట్టడం, బెడ్ రూమ్ తుడుస్తుంటే బాత్ రూమ్ కి డోర్ లాక్ చేయకపోవడం గుర్తొచ్చాయి.
అద్దం లో పతనమై పోతున్న మనిషి, విధ్వంసయిపోతున్న మనిషి, రంగులు మార్చే మనిషి కనిపిస్తున్నాడు.
అతనే తవ్వుకున్న ఒంటరితనపు చీకటి గుయ్యారం లోకి వెళ్లిపోతూ, ఆ పెచ్చూ లూడిన గోడల మీద తన నీతిని, విలువలని పబ్లిక్ టాయిలెట్ లో అసహ్యమైన రాతలు గా మార్చి పడేయడం కనిపించింది అద్దం లో.
బయటకు వచ్చాడు. పని అమ్మాయి వచ్చింది.
ఏం గమనించిందో ఏంటో అతన్నే చూస్తూ “ఈ నాలుగు గోడలు వదిలి కొన్నాళ్ళు బయటికి వెళ్ళొచ్చుగా సార్” అంటూ లోపలి వెళ్లి పోయింది.
అతనికి జవాబు దొరికింది. వెతుకుతున్న జవాబు. కావాల్సిన జవాబు.
మర్నాడు సూట్ కేస్ లో బట్టలు సర్దుకొని కిందకి వచ్చాడు. ఉబెర్ వచ్చింది .
“ఏంటి సార్, ఎప్పుడూ ఎక్కడికి కదలరు, ఎక్కడికి బయలుదేరారు?” అన్నాడు వాచ్ మెన్. “అడవుల్లోకి” అన్నాడు నవ్వుతూ.
వాచ్ మెన్ సూట్ కేసు కార్లో పెట్టాడు.
కారు రింగ్ రోడ్డు మీద వెళ్తోంది. దూరంగా పచ్చగా కనబడుతోంది. కళ్ళు ఆ పచ్చదనం లో కూరుకు పోయాయ్. అతన్ని అతను వెతుక్కోడానికి ప్రకృతి లోకి పోతున్నాడు.
కాంటెంపరరీ స్టఫ్ రాయలేక పోతున్నాం: కాశీ
–హాయ్ కాశీ…ఈ మధ్య “కొత్త కథ”లో వచ్చిన మీ కథ ‘ట్రేండింగ్’ చదివాను. ఒక సున్నితమైన, ఆధునిక ఇతివృత్తాన్ని ఆసక్తికరమైన కథగా మలిచారు. అభినందనలు.
థాంక్స్ చందూ.
ఇప్పుడు మన ప్రతి అలవాటూ, ఎమోషన్ మార్కెట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మార్కెట్ డిఫైన్ చేసిందే అందం. మార్కెట్ చెప్పిందే మోరల్. ‘కన్స్యూమర్ వరల్డ్ ‘ కోరిక ని జాగ్రత్తగా బుర్రలోకి ఇంజెక్ట్ చేస్తుంది. దాని వాళ్ళ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా మార్కెట్ చేసుకొంటుంది. అలా రాసిందే ఈ కథ.
–మొదటి కథ ఎప్పుడు రాశారు. దాని నేపథ్యం ఏమిటీ?
మొదటి కథ ‘అంతర్వాహిని ‘ అని కౌముది లో అచ్చయింది. కౌముది కిరణ్ ప్రభ గారు చాలా సలహాలు ఇచ్చారు . ఏదో రాయగలను అని నమ్మక మిచ్చింది ఆయనే .పసలపూడి వంశీ గారి ప్రభావం గట్టిగా ఉంటుంది ఆ కథ మీద . ప్రభావం కూడా కాదు ,అది పూర్తి ఇమిటేషన్ . తర్వాత disownచేసుకున్న.మాట్లాడేంత మంచి కథ ఏం కాదు . చిన్న అనుభవం . అలా నేను రాసిన మూడు నాలుగు కథలు ఉన్నాయ్ . రచయిత ఒక సంఘ సంస్కర్త లా మారిపోయి preach చేసి, గందరగోళమైన నీతులు , సూక్తులు చెప్పే కథలు అవి. .Immature రైటింగ్ అది . ఎన్ని పుస్తకాలు చదివినా రాయడం వచ్చేసరికి మనమే బయట పడతాం . మన నీతే బయట పడుతుంది . మన psyche రిఫ్లెక్ట్ అవుతుంది .ఈ అనుకరణలు నిలబడవు. కాకపోతే పుస్తకాలు “థాట్ ఫిల్టర్లు ‘ గా పనికొస్తాయి . ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొనే అవకాశం వస్తుంది . రాసే ముందు బాగా చదవాలి. మన రాసే అక్షరం ఎంత ఫిల్టర్ అయి , రిఫైన్ అయ్యి వస్తే కొంచెం కాలం బతక గలుగుతుంది .
–ఇప్పటి వరకూ ఎన్ని కథలు రాశారు. వాటిల్లో మీకు బాగా నచ్చిన కథ.?
8 కథల వరకూ రాసాను. ఇంక ఏది పెద్ద స్ట్రైకింగ్ గా అనిపించలేదు . కొంతలో కొంత ‘సీత కనిపించింది ‘ నచ్చుతుంది. కథ గా కంటే కూడా దాన్ని ఆలోచించినప్పుడు నేను పొందిన ఆనందం ,బాధ నచ్చాయి .
–కోయెట్ అబ్బులు కథ మీకు బాగా గుర్తింపు నిచ్చిన కథ కదా. అది నిజంగా జరిగిన సంఘటనేమో అనిపిస్తుంది. దాని నేపథ్యం ఏమిటీ..?
కొయిటా అబ్బులు కథ కూడా రచయితలు కొంచెం notice చేసిందే కానీ , పాఠకులకు పెద్దగా చేరలేదు. వెబ్ లోనూ , ‘మా కథలు‘ సంకలనం లో నూ వచ్చింది. ఈ రెండు మాధ్యమాలదీ లిమిటెడ్ రీచ్.
మా ప్రాంతం లో దిగువ మధ్య తరగతి లో ఎక్కువ మంది కువైట్ , మస్కట్ , దుబాయ్ లలో పని చేయడానికి వెళ్తూ ఉంటారు . ఎక్కువగా ఆడవాళ్లు వెళ్తుంటారు. కనీసం పదో తరగతి కూడా చదవని వాళ్ళు . పిల్లల్ని బాగా చదివించు కోవాలని , ఇల్లు కట్టు కోవాలని , ఒక అరెకరం పొలం కొనుక్కోవాలని వెళ్తుంటారు . కొంతమంది డబ్బులు పట్టుకొని వస్తే, కొంతమంది జబ్బులతో, కొంతమంది పిల్లల మీద బెంగ తో వచ్చ్చేస్తుంటారు. ఇక్కడ వయసులో ఉన్న మగాళ్లు వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. ఇలాంటివే రక రకాల కథలు .నేను రాసిన దాంట్లో కొన్ని ఫిక్షనల్ ఎలెమెంట్స్ వున్నాయ్ కానీ దాదాపు అది జరిగిన కథే . ఇది రాసిన తర్వాతే చక్ర వేణు రాసిన ‘కువైట్ సావిత్రమ్మ ‘ చదివాను . అద్భుతమైన కథ. ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ లో రాయాల్సిన కథలు చాలా వున్నాయ్. రికార్డు చేయాల్సిన అవసరం చాలా ఉంది.
– కథ రాసేముందు ఎలాంటి హోం వర్క్ చేస్తారు….?
ఏం రాయాలో నిర్ణయించుకున్నాక ఆ పాత్ర స్వభావాన్ని లోతుగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తాను . ఎలా ఉంటాడు , ఏం తింటాడు , ఎలా రియాక్ట్ అవుతాడు ఇలాంటివి . తర్వాత కాంటెక్స్ట్ లోకి వెళతాను . ఊరు అయితే ఊరు , ఒక హాస్టల్ అయితే హాస్టల్ . అన్నీ నోట్స్ లాగ రాసుకున్నాక ,కొన్నాళ్ళు మెదడు లో నలిగాక ఇంకా రాసేయొచ్చు అనుకునే మూమెంట్ వస్తుంది . అప్పుడు రాసేస్తా . కొన్ని సార్లు పాత్ర ఎదిగి పోతూ ఉంటుంది , మన మాట వినదు. ఏదైనా కథ రాయడం ఒక magicalప్రాసెస్. మన intellect logic అడుగుతుంది , మన innocence ignore చేస్తూ ఉంటుంది. అది కథ రాసే వాళ్ళకే తెలుస్తుంది. కథ ఆర్ట్ ఫార్మ్స్ లో ఒక బలమైన ఎక్స్ప్రెషన్.
ఇలాంటి విషయాల లో కథ కి సంబంధించి మనకి వర్క్ షాప్స్ తక్కువే . ఇప్పుడు ఆ కొరత తీస్తున్నది , కొంచెం కొత్త తరహా లో సీనియర్ రచయితలతో ఖదీర్ బాబు , సురేష్ నిర్వహిస్తున్న ‘ రైటర్స్ మీట్‘ చాలా ఉపయోగ పడుతోంది.
కొత్తగా రాస్తున్న వాళ్ళకి ఇలాంటి వేదికలు కావాలి.
– మీ గోదావరి జిల్లాలనుంచి పాఠకులు ఎక్కువమంది ఉంటారు. కానీ కొత్త తరం కథకులు ఎక్కువ వచ్చినట్టు కనపడదు. ఎందుకని…?
పానుగంటి ,శ్రీపాద నుంచి వంశీ వరకూ గోదావరి జిల్లాల నుంచి గొప్ప రచయితలు వచ్చారు.
సీరియస్ సాహిత్యం వైపు వచ్చే వాళ్ళు తక్కువే . రాసే వాళ్ళు సినిమా ల వైపు , వెబ్ సిరీస్ ల వైపు , వేర్వేరు ప్లాట్ఫామ్స్ వైపు వెళ్లిపోతున్నారు .ఎందుకంటే సాహిత్యం లాభసాటి కాదు అని . కష్టపడి కథ రాస్తే ఈనాడు 500 రూపాయిలు ఇస్తుంది . సాక్షి 500 ఇస్తుంది . జ్యోతి తెలియదు . స్వాతి కి రాయాలంటే దానికి వేరే ప్రాధామ్యాలు ఉన్నాయ్. పోనీ బుక్ రాసి పబ్లిష్ చేసి చేతన్ భగత్ లా ఆర్ధికంగా కొంచెం సర్దుబాటు చేసుకుందాం అంటే ఇక్కడ మార్కెట్ గురించి మనకందరికీ తెలుసు . మనం కూడా మార్కెటింగ్ లో అగ్గ్రెస్సివె కాదు . కాంటెంపరరీ స్టఫ్ రాయలేక పోతున్నాం.
‘నీ యయ్య‘ అని కుర్రాళ్ళు అందరూ మాట్లాడుకుంటారు సరదాగా . అదే కథ లో రాస్తే , ఏ పత్రిక వేసుకోదు . వెబ్ కి రీచ్ లేదు . కెరీర్ ఓరియెంటెడ్ సొసైటీ లో కొత్త రచయితలు ఎలా వస్తారు మరి ? ఎదో ఖాళీ ఉన్నప్పుడు అక్షరం మీద ప్రేమతో రాయాలి తప్పించి కొత్త రచయితలు అదీ సీరియస్ సాహిత్యలో కి ఇప్పట్లో రారు , నాకు తెలిసి .
– అలాగే కొత్త తరం జీవితాలు, ఇతివృత్తాలు కథల్లో ప్రతిఫలించకపోవడం వల్లే కొత్త తరం పాఠకులు కథలు చదవడంలేదనే విమర్శ వినిపిస్తోంది. మీకేమనిపిస్తోంది.?
ఖఛ్చితం గా చందూ ! పాఠకులు ఇప్పుడూ ఉన్నారు . కానీ కథలు ఇతివృత్తాలతోనూ , పరిస్థితులతోనూrelateకావడం లేదు . కథల్లో ముఖ్యం గా కొత్త తరం వాడే భాష ఉండాలి . వాళ్ళ వస్తువులు ఉండాలి . వాళ్ళ చేసే పనులు ఉండాలి . అప్పుడు చదువుతారు. ఉబెర్ , స్విగ్య్ లాంటివి మన జీవితాల్లోకి వచ్చేశాయ్ .విపరీతమైన అడల్ట్ కంటెంట్ దొరుకుతుంది . దాన్ని ఆపు చేయడం ఎవరి వాళ్ళ కాదు . అవి కథల్లోకి రావాలి . కొత్త కథ 2017 ఆవిష్కరణ సభలో ఎవరో ‘అన్ని కథల్ల్లోనూ మందు సీన్లు ఉన్నాయ్ ‘అన్నారు . నిజమే మరి . ఉంటాయి . మన డైలీ లైఫ్ మారి పోయింది గా . దీంట్లోనే ‘మోరల్ ప్లేన్‘ కొంచెం పైన సెట్ చేసుకుని రాయాలి .రాస్తే కచ్చితం గా చదువుతారు .
–మీకు నచ్చిన కథలు, కథకులు..?
అల్లం శేషగిరి రావు గారు రాసిన ‘చీకటి‘ , తిలక్ గారి “నల్ల జర్ల రోడ్డు , త్రిపుర గారి ‘పాము‘,గొల్లపూడి మారుతీ రావు ‘జుజుమోర ‘, వంశీ ‘పసలపూడి కథలు ‘ ,రమణ ‘ఆకలీ-ఆనంద రావు‘ ఇలా చాలా ఉన్నాయ్ . రచయితల్లో త్రిపుర , కొకు నచ్చుతారు.
– మీ నేపథ్యం ఏమిటీ..?
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం స్వస్థలం. వ్యవసాయ కుటుంబం .బీ టెక్ చదివాను. ఇప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీ లో సీనియర్ డిజైన్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను.
*
Chala bavundi
రేపటి కథకులను ప్రోత్సహిస్తున్న మీకు కృతజ్ఞతలు సర్
ఫేస్ బుక్ లో చందు పోస్టు చూసి వెంటనే కథలోకి వెళ్లాను. కథకు ఎంచుకున్న ఇతి వృత్తం, శైలి నచ్చాయి. మరింత మెరుగు అవసరమేమో. ఆ మధ్య మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు స్థలం, కుల మతాలకు అతీతంగా అంశాల ప్రాతిపదికగా కథలు వస్తే మరింత విశాలంగా ఉంటాయేమో అన్నాడు. ఈ కథ చదివేటప్పుడు ఆ మాట గుర్తుకు రావటం యాధృచ్ఛికమేమీ కాదేమో.
మీ సూచనలకు, స్పందనకూ ధన్యవాదాలు సతీష్ గారూ.
Thank you sir.
నాగేంద్ర కాశి గారూ, మీ కథ X బాగుంది. సమకాలీన సమస్యను బాగా డీల్ చేశారు. కథలోనూ, పరిచయంలో చెప్పిన మీ మనసులోని మాటల్లోనూ భేషజం లేని నిజాయితీ కనిపించింది.అభినందనలు.
Thank you sir .
గొరుసన్న అభినందనలు అందుకున్న నాగేంద్ర కాశీ… అదృష్టవంతుడు.
చాలా ఆశ్చర్యం వేసింది ఈ సబ్జెక్టును ఎన్నుకుని రాసినందుకు.చదువుతూంటే కొంచెం భయమూ వేసింది….వయసు మనిషిని ఇలా కూడా మారుస్తుందా అని. మనిషిలో దాగుండే మరో మనిషికీ మనసుకూ మధ్యన ఏర్పరుచుకున్న సన్నని గీత వలన ఏర్పడిన సంఘర్షణను చూపే మంచి ప్రయత్నమే చేసారు.
Thank you Nitya గారు.
బాగుంది. ఎదో కొంచం తగ్గినట్టు అనిపించింది. కథ నలగాల్సిన అవసరం కనిపించింది. మీ నుంచి ఇంకా మంచికథలు వస్తాయి.
ఇంటర్వ్యూ చాలాబాగుంది.
కొట్టం రామకృష్ణ రెడ్డి సార్….
మీ సూచనలకు, స్పందనకు ధన్యవాదాలు
కాంటెంపరరీ సాంఘిక రుగ్మతల నుంచి వానప్రస్థాశ్రమాల కల్చర్ వరకూ ఆలోచనలు సాగాయి ఈ కధ చదువుతుంటే. అర్ధవంతమైన, అవసరమైన కాంటెంపరరీ స్టఫ్.
నాగేంద్ర ,కధ ని బాగా నేరేట్ చేసావు. చెప్పిన పాయింట్ కూడా చాల striking గా ఉంది. ఆల్ ది బెస్ట్
బాగుంది సర్
పఠనీయత పుష్కలంగా ఉంది
చైతన్య స్రవంతి కథలా అనిపించింది
లాజిక్ అడ్డుకుంటుంది అన్నారు కదా ఇంటర్వ్యూలో
నిజమే…..నాలుగు గోడల నుండి నలుగురు వ్యక్తుల మధ్యకు వెళ్లాలన్న చిన్న స్పృహ లేదా అంతకు ముందు…(చివరి పనిపిల్ల చెప్పకముందు…) అంటే అది లాజిక్.. కానీ ఆ లాజిక్ కి అతీతంగా కనెక్ట్ అవటమే మేజిక్..tq సర్….Very well written and trend setting one