Work from home – I can’t breathe!

లాక్‌డౌన్‌కు ఒక వారం రోజుల ముందు మాట…ఇంక ఆఫీసుకు రావద్దంటారేమో, ఇంట్లోంచే పని చెయ్యమంటారేమో అని కలీగ్స్ అందరం మాట్లాడుకుంటున్నాం. నాకు ఆ మాటే నీరసంగా అనిపించింది.  కాలు ఒకచోట నిలవని నాకు పిల్ల పుట్టాక మూడేళ్లు ఇంట్లో ఉండాల్సిరావడం కట్టేసినట్టయ్యింది. మళ్లీ ఉద్యోగం కోసం బయటికెళ్లినప్పుడు కొత్త గాలులు వీచినట్టనిపించింది. గట్టిగా రెండేళ్లవ్వలేదు మళ్లీ ఇంట్లో కూర్చోవాలా! ఎన్నాళ్లో ఏమిటో లెక్క తెలీదు అనుకుంటూ నీరసంగా ఆఫీసునుంచి ఇంటికి బయలుదేరుతుంటే  నా కలీగ్ ఒక తమిళమ్మాయి కూడా నాతో పాటే బయలుదేరింది.

ఎందుకో తను కూడా చాలా డల్‌గా కనిపించింది. తను నాకన్నా చిన్నది. వయసు పాతికేళ్లలోపే! ఇంకా పెళ్లవ్వలేదు. లాక్‌డౌన్ అంటున్నారంటూ నేనే మాట కదిపాను. వెంటనే తను అందుకుంది. ఇప్పుడిప్పుడే బయటికొచ్చి కాస్త గాలి పీల్చుకుంటున్నాం, అసలు ఉద్యోగం చేసేదే ఇంట్లో ఉండకుండా బయటకి రావడానికి. మళ్లీ ఇంట్లో కూర్చోవాలంటే నీరసమొస్తోంది అన్నాది. ఆశ్చర్యపోయాను! నాలాంటివాళ్లు చాలామందే ఉన్నారనిపించింది.

అప్పుడు మరో సంగతి గుర్తొచ్చింది. నా ఫ్రెండ్ ఒకమ్మాయి దుబాయ్‌లో ఉంటుంది. మంచి ఉద్యోగం చేస్తోంది. బాబు పుట్టాక ఒక ఏడాది బ్రేక్ తీసుకుందామనుకుంది. కానీ ఆరు నెలలకే ఉద్యోగానికి వెళిపోయింది. అదేమని అడిగితే నేను ఇంట్లో ఉంటే ఇల్లు, పిల్లాడు అన్నీ నా బాధ్యతే అనుకుంటున్నారు. మిగతావాళ్లకేం పట్టట్లేదు. నాకు మరో ప్రపంచం ఉండకూడదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నేను బయటికెళితే తప్ప బాధ్యతలు పంచుకోవాలన్న విషయం వీళ్లకి అర్థం కాదు. అందుకే ఉద్యోగం మొదలుపెట్టేసాను అంది. అసలు ఆఫీసుకెళితే హాయిగా ఉంటుంది నాకు, కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతాను అంది.

ఇంచుమించు ఇలాంటి మాటలే నా ఆఫీసులో మరొకమ్మాయి మరో సందర్భంలో అంది. ఆ అమ్మాయికి ఏడాదిన్నర పాప. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అప్పటివరకూ ఇంట్లో పెద్దవాళ్లు పాపను చూసుకున్నారు కానీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల పాపను చూసుకోలేని పరిస్థితి వచ్చింది. డే కేర్‌లో వేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో నీకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఉంది కదా, కొన్నాళ్లు నువ్వు ఇంట్లోంచి పని చెయ్యొచ్చు కదా అన్నాను ఆ అమ్మాయితో. దానికి ఆ అమ్మాయి సమాధానం…అలా వర్క్ ఫ్రం హోమ్ చేస్తే చాలా కొద్ది రోజుల్లోనే నేను పిచ్చెక్కిపోతాను. ఆఫీసుకు రావడం ఒక పెద్ద రిలాక్సేషన్ నాకు. ఇల్లు, సంసారం, పిల్లలు, పాట్లు అన్నీ మర్చిపోయి మరో లోకంలో, మరో మనుషులతో, నేను ఇష్టపడి ఎంచుకున్న పని చేస్తూ రిలాక్స్ అవుతాను. ఈ ఎనిమిది గంటలూ నాకు వరం. వీటిని వదులుకోలేను. అంత చంటిపిల్ల ఇంట్లో నన్ను పనిచేసుకోనిస్తుందా చెప్పు? 24 గంటలూ ఇంట్లోనే ఉంటే “ఐ కాంట్ బ్రీత్” అంది. నిజమే అనిపించింది. నేను ఇంట్లో ఉన్న మూడేళ్లల్లో రోజూ కొంతసేపైనా ఇంటికి దూరంగా గడపాలని ఎంత తపించిపోయానో గుర్తొచ్చింది.

లాక్‌డౌన్ మొదలయ్యింది. ఆఫీసులన్నీ బంద్. కొందరు ఇంట్లోంచి ఉద్యోగం చెయ్యడం మొదలెట్టారు. ఓ నెల గడిచింది. మా చిన్ననాటి స్నేహితులందరూ కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నాం. అందరూ ఇంట్లో ఉన్న నెల ఎలా గడిచిందో చెప్పుకుంటున్నాం. ఒక ఫ్రెండు అంది కదా…ఈ లాక్‌డౌన్ నా ప్రాణాలకొచ్చింది. అతను ఆఫీసుకిపోతే నాకంటూ ఓ ప్రపంచం ఉంటుంది. ఇల్లు దాటకపోయినా సరే ఆ కొద్ది సమయంలో ఇంటి పని చేసుకుంటూ నా జీవితమేదో నేను జీవిస్తాను. పాటలు వినడమో, ఏదో ఒక పత్రికో పుస్తకమో చదువుకోవడమో లేదా పడుకోవడమో ఏదో ఒకటి నాకు నచ్చిన పని కాసేపైనా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ సుఖం కూడా లేకుండా పోయింది అని ఒకటే ఏడుపు. పొద్దున్న లేచిన దగ్గరనుంచీ కాఫీలు, టిఫిన్లు, నీళ్లు అన్నీ ఆ కంప్యూటర్ దగ్గరకే. అతను దాని ముందునుంచీ కదలడు. మళ్లీ మధ్యాహ్నం టిఫిన్ అంటాడు, చిరుతిళ్లు చెయ్యమంటాడు, అది సరిగా లేదు ఇది సరిగా లేదు అని నసుగుతూనే ఉంటాడు. నాకు విరక్తి వచ్చేస్తోంది. ఆఫీసులెప్పుడు మొదలవుతాయా, ఇతనెప్పుడు బయటికి పోతాడా అని చూస్తున్నా అంటూ బాధపడింది.

ఇంకో అమ్మాయి చంటిపిల్ల తల్లి…వర్క్ ఫ్రం హోమ్ చేస్తోంది. మీటింగులన్నిటికీ చంటిపిల్లతోనే అటెండ్ అవుతోంది. అప్పుడప్పుడూ ఆ పిల్ల ఏడుపు, అరుపులు..ఈమె సారీ చెప్పడం..ఎలాగో నెట్తుకొస్తోంది. వర్క్, సంసారం రెండిటినీ వేరు చెయ్యలేనివాళ్లు మీకెందుకండీ ఉద్యోగాలు అన్నాడట ఒక కలీగ్. అంతమాటన్నాక మళ్లీ అతనితో కలిసి ఎలా పనిచెయ్యగలవు? అని అడిగాను. ఏమన్నా సరే ఈ ఉద్యోగం మానేయలేను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఉద్యోగం వెంటనే దొరకడం కష్టమే. అసలు ఉద్యోగమే మానేస్తే నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది అంది. తన భర్త కూడా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. ఇంట్లో బాధ్యతలు పంచుకుంటాడు. తను మీటింగులు అటెండ్ అవుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడూ పిల్ల అరుపులు, గోల ఉంటాయి. కానీ అతన్ని కించపరిచే మాటలేమీ అనరు. పైగా ఇంటి బాధ్యతలు పంచుకుంటున్నందుకు పొగుడుతారు. యువర్ బేబీ ఈజ్ సో క్యూట్. యూ ఆర్ ఏ గుడ్ ఫాదర్ అండ్ గుడ్ హస్బండ్ అని పొగుడుతారు. నన్ను మాత్రం ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చో అంటున్నారు. ఎంత వివక్షో చూసావా అంటూ తను చాలా మనసు కష్టపెట్టుకుంది.

మరొక తెలిసిన అమ్మాయి….మా ఊరమ్మాయి. మంచి చురుకైన పిల్ల. డిగ్రీవరకూ చదువుకుంది. ఏదైనా ఉద్యోగం చెయ్యాలని, తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని తపనపడేది. చిన్న ఊరు, అక్కడి సామాజిక వాతావరణం, తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమెకు చదువులో ముందుకు వెళ్లడానికి సహకరించలేదు. పెళ్లయ్యాక భర్తతో పాటూ హైదరాబాదు వచ్చేసింది. సంసారం, పిల్లలతో తన ఆశలన్నీ చేతి వేళ్ల సందుల్లోంచి జారిపోయాయి. ఓ రెండేళ్లక్రితం నేను కలిసినప్పుడు ఉద్యోగం చెయ్యలనుందని, ఆర్థిక స్వాతంత్ర్యం కావాలని, ఏం సాధించకుండానే జీవితం గడిచిపోతుందేమోనని భయంగా ఉందని చెప్పింది. కానీ బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితులు లేవని అంది. అయితే ఇంట్లో ఉండే సంపాదించుకునే అవకాశాలు ఈరోజుల్లో చాలా ఉన్నాయి అలాంటిదేదో ఒకటి ఆలోచించమన్నాను. సరిగ్గా ఏడాది క్రితం మళ్లీ ఫోన్ చేసింది. అక్కా….నేను ఇంట్లోనే క్యాంటీన్ పెట్టాను. మా కాలనీలో చాలామంది ఉద్యోగస్థులు ఉన్నారు. వాళ్లందరికీ భోజనం సప్ప్లై చేస్తున్నాను. 30 మంది దాకా వస్తున్నారు. పొద్దున్నే వాళ్లు ఆఫీసుకెళ్లే టైంకి బాక్స్ కట్టి ఇచ్చేస్తాను. కొంతమంది రాత్రి భోజనం కూడా ఏర్పాటు చెయ్యమని అడుగుతున్నారు. త్వరలోనే అది కూడా మొదలెడతాను అని చాలా సంతోషంగా చెప్పింది. ఆ అమ్మాయి వంట బాగా చేస్తుందన్న విషయం గుర్తొచ్చింది నాకు. ఆ పిల్ల ఎంత సంబరపడిపోయిందో! ఉద్యోగస్థురాలినయ్యాను, సంపాదిస్తున్నాను అని సరదాపడింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఉద్యోగం పోయింది. అందరూ ఇళ్లనుంచే పని చేస్తున్నారు. ఎవరూ క్యారేజి తీసుకోవట్లేదు. చాలా దిగులుపడుతోంది.

భార్యాభర్తలిద్దరూ ఇంట్లోనే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఎప్పటిలాగే ఈ పిల్ల దగ్గర క్యారేజీ తీసుకోవచ్చు కదా. ఆఫీసులో తినే బదులు ఇంట్లో తింటారు. క్యారేజీ ఎందుకు మానేయడం అని డౌటొచ్చింది నాకు. ఆ మాటే అడిగాను. భార్య ఇంట్లోనే ఉండగా బయటనుంచి వండి తెచ్చుకోవడం ఎంత నామొష్కీ! ఏ భర్తైనా ఒప్పుకుంటాడా! ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఆఫీసు పని పోనూ బోల్డు టైం మిగులుతోంది, వంట చెయ్యి అంటున్నారట అంది దిగులుగా.

ఇంకో అమ్మాయి ఇంట్లోనే ఉంటూ ఆభరణాలు, చీరల వ్యాపారం చేస్తోంది. వర్క్ ఫ్రం హొమ్ మొదలయ్యాక తన సంపాదనకు గండి పడింది అంటోంది. ఆఫీసుకెళితే ఆడవాళ్లు మ్యాచింగ్ జూవెలరీ, చీరలు అవీ ఎక్కువగా కొంటారు. ఇప్పుడు ఇంట్లోంచే పని చేస్తున్నారు కదా…ఎవరూ పెద్దగా కొనట్లేదు అంది. ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యమేసింది నాకు! వర్క్ ఫ్రం హొమ్ కొందరు ఆడవాళ్ల ఉద్యోగాలకు గండి కొడుతోందన్నమాట!

వర్క్ ఫ్రం హోమ్ అనేది ఇండియాకి కొత్త విషయమే! లాక్‌డౌన్ కారణంగా చాలామంది ఇళ్లల్లోంచి పని మొదలెట్టాక కొన్ని సానుకూల అంశాలు దృష్టి కి వస్తున్నాయి. ఆఫీసుకి వెళ్లడానికి, రావడానికి పట్టే సమయం తగ్గింది. కాలుష్యం తగ్గింది. వర్క్ ప్రెషర్, టెన్షన్లు తగ్గాయి అంటున్నారు. ఆఫీసులకోసం భవనాలు కట్టక్కర్లేదు, అద్దెకు తీసుకోనక్కర్లేదు. భౌతిక సదుపాయాలకు కావలసిన డబ్బు మిగులు. రోడ్ల మీద వాహనాల రొద తగ్గింది. మనుషులు ఎక్కువగా తిరగట్లేదు. గాలి తేటపడింది. వాతావరణం తేలికపడింది. పశుపక్షాదులకు కొంత చోటు లభిస్తోంది. ఇంక ఇదొక ట్రెండ్ కాబోతోంది. ఇకపై వర్క్ ఫ్రం హోమ్ పెరగబోతోంది అంటున్నారు.

కానీ స్త్రీకి ఎప్పుడూ రెండవ స్థానం (చాలాచోట్ల అథమ స్థానం) ఇచ్చే మనలాంటి కుటుంబాలున్న సమాజంలో వర్క్ ఫ్రం హోమ్ మహిళలకు మేలు చేస్తుందా? ఈ విషయం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? సర్వే ఏదైనా చేసారా?

భార్యాభర్తలిద్దరూ ఇంట్లోంచి పనిచేస్తున్నప్పుడు భార్యకు ఆఫీస్ పనితో పాటు ఇంటి పని పెరిగి, భర్తకు ఆఫీసు పని మీద శ్రద్ధ పెట్టే టైం పెరిగి అతను కెరీర్‌లో ముందుకు వెళుతూ, ఆమె వెనక్కి నెట్టబడే అవకాశం ఉన్నాదేమో!

మామూలుగానే మనది ఇంటా బయటా కూడా మగ ప్రపంచం. రోజూ ఆఫీస్‌కి వెళుతూ, పని శ్రద్ధగా చేస్తూ, సామార్థ్యాలను ఎప్పటికప్పుడూ నిరూపించుకుంటూ ఉన్నా సరే కెరీర్‌లో మహిళలకు ఎన్నో ఆటంకాలు. రావల్సిన ప్రమోషన్లు రావు. పెద్ద ప్రోజెక్టులు ఇవ్వరు. అవమానాలు, వివక్ష సరేసరి. ఇంక అసలు మొహమే కనిపించకుండా ఉంటూ, జూమ్ మీటింగుల్లో దూరంగా ఉండి మాట్లాడుకుంటూ ఉంటే వీరి సామర్థ్యానికి తగిన గుర్తింపు వస్తుందా? మహిళలు కెరీర్‌లో ముందుకు వెళ్లగలరా? నా ఫ్రెండ్‌కు జరిగినట్టు కుటుంబాన్ని, పనిని వేరు చెయ్యలేకపోతోంది అనే నిందలు పైగా. ఇవన్నీ స్త్రీ కెరీర్‌ను ఎటు నడిపిస్తాయి?

అమ్మాయిలు అక్షరాలా ఇంటి గడప దాటి బయటకు వెళ్లడమే సాధికారతకు సూచిక అనిపిస్తోంది.

ఉద్యోగం సరే, ఊపిరైనా ఆడాలి కదా!

*

ఆలమూరు సౌమ్య

పుట్టిన ఊరు విజయనగరం. ప్రస్తుతం దేశ రాజధానిలో మకాం. కుటుంబంలో సాహిత్యాభిరుచి ఉండడం, తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉండడం వలన చిన్నప్పటినుంచీ తెలుగు సాహిత్యం మీద మక్కువ పెరిగింది. రాయలన్న తపనతో బ్లాగు మొదలెట్టాను. NATS 2013 కోసం కొత్త కథల ఆహ్వానం చూసి మనమూ రాస్తే బావుంటుందే అనిపించి తొలి ప్రయత్నం చేసాను. "ఎన్నెన్నో వర్ణాలు" అనే కథ NATS 2013 లో ప్రచురితమయ్యింది. అదే నా మొట్టమొదటి కథ. ఆ కథను "వాకిలి" సాహిత్య పత్రికలో మలిప్రచురణ చేసారు. అప్పటినుండీ కథలు, సమీక్షలు, వ్యాసాలు, అనువాద కవితలు..అడపదడపా రాస్తూ ఉన్నాను.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చిన్న చిన్న సంఘటనలతో “ఊపిరి అడడంలేదని” ఈ కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం తో సతమతమౌతున్న మహిళా ఉద్యోగులగురించి చక్కగా రాసారు. బాగుంది. అదనంగా మహిళలలు మోస్తున్న భాద్యతలు, బరువులు బాగా వర్ణించారు. వర్క్ ఫ్రం హోం దుఖాన్ని తెచ్చింది కాని వెసులుబాటును ఇవ్వలేకపోయింది. దీనితో మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్ లో అయితే నిర్దిష్టంగాపనిచేయోచ్చు…కానీ ఇంటినుండి చేస్తే టైమేలేదు…. కనీసం 12 గంటలు పనిచేస్తున్నారు. ఈ రచన అందిన్చినందుకుసౌమ్య గారికి అభినందనలు.

  • ఉద్యోగము, సరే ఊపిరి మాత్రం, ఖచ్చితంగాఆడదు, ఒకపక్క ఇంటి పనులు ,,,బాధ్యత లు,గుర్తుకు వస్తుంటాయి.. వర్క్ ఎంతకీ తేమలదు.. ఆపని అయ్యింది అనగానే.వంటగిన్నెలు, బట్టలు ఎదురు chustu ఉంటాయి.! gotohell.!

    • నిజం! పైగా ఇంట్లోనే ఉన్నాం బోల్డంత టైముంటుంది అనుకుంటారు!

  • లాక్ డౌన్ ను women point of view చక్కగా వీక్షించినందుకు అభినందనలు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్యే ఉండదంటారు. మీరనుకున్న పరిష్కారాన్ని సూచనాప్రాయంగా తెలియపరిచింటే బాగుండేది.

    • నిజమే! మరో వ్యాసంలో ప్రయత్నిస్తాను. Thank you.

  • Work from home జమానాలో పనిచేయలేదు ,కానీ ఉద్యోగం లో ఎన్ని కష్టాలున్నా ఊపిరి పీల్చుకోగలుగుతాము .అదే ఇంట్లో ఉంటే ఎటు చూసినా
    ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది. ఇంట్లో చేసిన పనులకు రికగ్నిషన్ రాదు .బయట పనికి వస్తుంది

    • నిజం! అలాంటిది ఉద్యోగం కూడా ఇంట్లోంచే చెయ్యాలంటే ఇంక ఊపిరాడదు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు