ఆఖరి క్షణాల
ఆయువు పెంచుతూ
ఫ్రీజర్
———————-
కొండల మధ్య
మండువా ఇల్లులా
అరకులోయ
———————-
మామిడిచెట్టు
మేడెక్కింది
కొమ్మలు మెట్లుగా
———————-
ఆదివారం
స్కూలు బెంచిలా
దండెం
———————-
ఏ వరదకో
తీగెలన్నీ తెగినట్టు
జీవితం
———————-
నీడల దుప్పటంతా
చిరుగులు
చలిలో చెరువు
———————-
ఊళ్ళోంచి తప్పిపోయి
తనవాళ్ల కోసం చూస్తూ
దారి
———————-
గుండెకి గాయం
ప్రిస్క్రిప్షన్ లో
జ్ఞాపకాల జాబితా
———————-
బాల్యంలోకి
జారవిడిచింది
జారుడుబల్ల
———————-
గుండె ఏంటీ
కన్నీటి బొట్టంత
కుదించుకుపోయింది
———————-
గదులన్నీ
సెల్ఫీ తీసుకున్నాయి
ఇల్లు
———————-
ఖాళీ ప్లేట్లతో
వరసలో నిలబడింది
ఆకలి
———————-
కొమ్మల్ని వంచిన
కల్పతరువులా
బడి
———————–
చుక్కల లెక్క
రోజూ తప్పడమే
డాబా మీద నిద్ర
———————-
మాటల్ని
మౌనం దోచుకుంది
నిలువెత్తు అవ్యక్తం
———————-
జేబులో సిరా డాగు
మతిమరుపుని
గుర్తుచేస్తూ
———————-
కూలీల పాటలకి
కొత్త వంత
చేల మధ్య రైలు
———————-
లాంచీ వెళ్ళింది
గట్టంతా
కాలిగుర్తుల తొక్కిసలాట
———————-
నీడల్ని నరికేసి
తళతళా నవ్వుతోంది
గొడ్డలి
———————-
నిద్ర అలసిపోయింది
కలలతో
ఆడీ పాడీ
———————-
శిధిల హాసం
పునః ప్రవేశం
చూపుల తవ్వకాల్లో
———————-
అస్తిత్వమే
తోసుకొచ్చింది
వాన బైటే తడుస్తోంది
———————-
తెల్లారింది
గోదారి మీద
వెలుగుల కళ్ళాపి
———————-
ప్రయాణాన్ని
స్టేషన్ కి పూసగుచ్చుతూ
రైలు
———————-
గది మెలకువని
చీకటికి చెప్తోంది
కిటికీ
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Add comment