ఔటర్ రింగ్ రోడ్

రేయ్, మీకో మాట, మెడికోనే చేసుకోండి, మన పిచ్చి మనకే అర్ధమౌతుంది,  మీరు చేసుకోబోయే అమ్మాయికి ముందే మీ గురించంతా చెప్పేయండి, మీ కోపాలు బాధలూ కోరికలూ అసూయలూ అలవాట్లు ఇష్టాలూ అన్నీ , అట్లీస్ట్  తెలిసేలా చేయండి,  లేకపోతే నాలాగే తనకి నచ్చినట్టు ఉండాలని మారుతూ మారుతూ చివరికిలా ..

కొత్త తరం కథకుల్లో రాసిన నాలుగైదు కథలతోనే తన ముద్రను వేసుకున్న కథకుడు వంశీధర్ రెడ్డి. వంశీ రాసిన మొదటి కథ జిందగీ. తెలంగాణలోని సిద్ధిపేట పరిసర ప్రాంత జీవితాలను అద్భుతంగా చిత్రిస్తూ రాసిన ఈ కథ అతనికి అభిమానులతో పాటూ విమర్శకుల ప్రశంసలనూ అందించింది. పెళ్లి, కొత్త దంపతుల అనుబంధం, అపనమ్మకాలను చర్చిస్తూ రాసిన కథ ఐస్ క్యూబ్… పలు సంకలనాలకు ఎంపికయ్యింది. వంశీ కథల్లో ప్రధానంగా ఆకట్టుకునేది తనదైన భాష, భావ వ్యక్తీకరణ. ఎటువంటి భేషజాలు, మొహమాటం లేకుండా తాను చెప్పాలనుకున్నది చెపుతాడు. మూడు పదుల వయసులోనే జీవితాన్ని, మనుషులను వ్యాఖ్యానించే తీరు అబ్బుర పరుస్తుంది. తెలుగు కథకూ, ముఖ్యంగా తెలంగాణ కథ భవిష్యత్ పట్ల  ఒక ఆశను కలిగిస్తున్న కథకుడు వంశీధర్ రెడ్డి.  వృత్తి రీత్యా వైద్యుడైన వంశీధర్ రెడ్డి కొత్తగా ఆ వృత్తిలోకి వచ్చిన వారికి ఎదురయ్యే అనుభవాలు, రకరకాల ఒత్తిళ్లను, సంఘర్షణలను చూపిస్తూ రాసిన కథ ఈ ఓ.ఆర్.ఆర్…. సారంగ పాఠకుల కోసం.

*

 — ఔటర్ రింగ్ రోడ్  —

 

“మరికాసేపట్లో హైద్రాబాద్ చేరతామని, దయచేసి సీట్ బెల్ట్ పెట్టుకుని వెనక్కి లాగిన సీట్ ని సరిచేసుకుని కూర్చోగలరని” ఇండిగో ఫ్లైట్ లో గగనసఖి లేపి చెప్పేటప్పటిగ్గానీ , ఎక్కడో అంతరిక్షపు కలల్లోఉన్న నేను కాస్త కిందికి దిగలేదు. ఫ్లైట్ ల్యాండింగ్ నాకెప్పుడూ భయమే , పైకెళ్ళడం బానే ఉంటుంది, కిందికి దిగడమే ఇంకా అలవాటవలేదు , చాలా విషయాల్లో..

ఫోన్ ఆన్ చేసుకునేసరికి వెల్లువలా మెసేజ్లూ, 4 మిస్డ్ కాల్స్. రెండు శ్యాం గాడివి, ఒకటి అమ్మది, ఒకటి ఎయిర్టెల్ గాడిది. ఫ్లైట్ రన్వే మీద ఆగకముందే జనాలందరూ లేచి ముందుకో వెనక్కో తెలీని ఎక్సిట్ డోర్ల వైపు పరిగెడ్తున్న గందరగోళపు సంగీతంలోంచి నెమ్మదిగా దిగి, శ్యాం గాడికి కాల్చేసి పదినిమిషాల్లో అరైవల్స్ కి రమ్మని చెప్పి, లగేజ్ తీసుకుని వాష్ రూంకెళ్ళొచ్చేసరికి, అరైవల్స్ లో శ్యాం, టీ షర్ట్ షార్ట్స్ తో..

” ఏంట్రా ఇది, నైట్ తాగిందింకా దిగలేదా, ఏంటీ అవతారం”

” ఇవాళ వరుణ్గాడి బాచిలర్స్ కదరా, మర్చిపోయావా, కొంపల్లి లక్ష్మి విల్లాలో ..”

” హా.. హా.. గుర్తొచ్చింద్రోయ్ దానికి ఇప్పటినుండే నెట్ ప్రాక్టిసా, , సర్లే, శాంతిగాడేడీ?”

” పటాన్ చెరువ్ దగ్గరున్నాట్ట, అక్కడ పిక్ చేసుకుందాం వాడ్ని, నువ్ ముందు కారెక్కు త్వరగా , లేటైతే ఫైనేస్తాడు ఏర్పోర్ట్ వాడు”

” ఒక బలిసినోడు అనాల్సిన మాటలేనా ఇవి, ఏం చేసుకుంటావ్రా ఆ కోట్లన్నీ”

” ఫైన్ మాత్రం కట్టన్రోయ్, హహ. పద ”

” సిగరెటుందా..”  నాలిక పీకేస్తుంది

” బెస్ట్ పల్మనాలజిస్ట్ అవార్డ్ తీసుకుని వొస్తున్నావ్, నీకెందుకురా సిగరెట్, రేయ్, డోర్ మెల్లిగా వెయ్, అంబాసిడర్ కాదిది”

” సొల్లాపి సిగరెటివ్వరా..”

” డాష్ బోర్డ్ లో ఉంటది చూడు, ఎలా ఉంద్రా బాంబే”

“నాలుగురోజులు నిద్రపోకపోతే మనకెలా ఉంటుందో అలా ఉంది, వెరీ ఇరిటబుల్, రేయ్ తెల్సా, పల్మనాలజీ ఆథర్ “ఫిష్ మాన్” గాడంటాడు,  100 కన్నా ఎక్కువ సిగరెట్స్ కాలిస్తే వాడు స్మోకరట, ఆ లెక్కన మనల్నేమనాలి”

” నువ్వే చెప్పు, ఏదోటి అనుకునే ఉంటావుగా”

” కెన్ కాల్  గిగాస్మోకర్, ఆర్ టెరా స్మోకర్, టీ తాగాలనిపిస్తుంద్రా, ఆపు షంషాబాద్ లో, కారింత నీట్ గా ఉంచుతున్నావ్, ఎప్పట్నించి ”

” పటాన్ చెరువ్ లో ఎలాగూ రింగ్ రోడ్ దిగుతాం, అక్కడ తాగుదాంలే ”

”  కార్లో నీళ్ళున్నాయా, నీడ్ టు డ్రింక్ సం వాటర్, ప్రిఫరబ్లీ కోల్డ్ ”

” చంపుతావ్ కదా, సరే టీ తాగుదాం, ఆపి చస్తాలే,షంషాబాద్లో ”

” హహ,  నీ ఎక్స్ గాళ్ ఫ్రెండ్ కన్నా డేంజర్రోయ్ నేను, అలాగే స్మోక్స్ తీసుకోవాలి గుర్తుచేయ్, నీ లైట్స్ నేను తాగను”

” ఆ కింగ్స్ తాగీ తాగీ నీకు లంగ్ కేన్సర్ వొస్తేకానీ ఆపేట్టు లేవుగా, అవున్రా స్మోకింగ్ కిల్స్ అని తెలిసి కూడా మనమెందుకు తాగుతున్నామింకా డాక్టర్లమై”

” ఏదో రోజు అందరం పోతాంగానీ, నాలెడ్జ్ ఈజ్ ఎ బర్డెన్, అఙ్నానం గొప్ప వరం”

“ఆపునీ ముసలాడి మాటలు”

” నువ్వింకా పైలా పచ్చీస్ అనుకుంటున్నావా, ఒకటి తక్కువ ముప్పై, పెళ్ళైతే ఒకర్ని కిందికి దించేవాడివి ఈ పాటికి ”

“నీ పెళ్ళెప్పుడ్రా”

“చేసుకోన్రా, శాంతిగాడ్ని చూసాకా అదే మంచిదనిపిస్తుంది”

“వాడి మారీడ్ లైఫ్ బాలేదనా, ఐనా ఎంతమంది పెళ్ళి చేసుకుని హాప్పీగా లేరు”

” ఎక్జాక్ట్లీ , ఎంతమంది స్మోకింగ్ తో ఛస్తున్నారు, అందరికీ కేన్సర్లొస్తున్నాయా ”

“నీకో దండంరా, దిగు టీ స్టాలొచ్చింది’

” అటుకాదు ఇటు, విల్ గెట్ స్మోక్స్, నువ్వెళ్ళి ఆ వైన్స్ లో నాలుగు KF లైట్స్ పట్రా, టోల్డ్ యూ, నీడ్ టు డ్రింక్ సం కూల్ వాటర్, విత్ సం ఆల్కహాల్, హహ,”

“ఇప్పుడు లైన్లోకొచ్చావ్ , లెట్స్ పార్టీ డూడ్ ”

 

***

( ధీర సమీరే …యమునా తీరే …వసతి వనే వనమాలి,

గ్రామ సమీపే ప్రేమ కలాపే.. )

బాలు గొంతులో మంద్రంగా చిత్రంగా, రింగ్ రోడ్ మీద,

” ఏ సినిమా ఇది.. గణేషా ”

” ధర్మచక్రమ్ రా, మన వెంకి బాబు, రమ్య కృష్న, మధ్యలో ప్రేమ ‘

” శాంతిగాడు వెంకీ ఫ్యాన్ కదా ‘

” హా,  వాసు వాయిస్  ఆఫ్ ద యూత్, మొదట్రోజు బాల్కనీ ఫుల్ ఐతే, 1.50 బెంచీమీద చూపించాడుకదరా, ఎలా మర్చిపోతాం ‘

(కన్నుల్లో నీ రూపమే,

గుండెల్లో నీ ధ్యానమే.. )

” ఏం ఛానల్రా ఇది, మద్యానం పూట మెలొడీస్ వేస్తున్నారు ”

” 104 అని, కొత్తది, మిర్చీ లవ్, ఆడ్స్ కుడా చాలా తక్కువొస్తాయ్,  నాకు కార్లో టైం పాసిదే ‘

” మరీ ఇంత మెతగ్గా ఉంటే ఎక్కువ రోజులు ఉండదు రా ఈ ఛానల్ ”

” ఇంకా, ఏంట్రా సంగతులు, కాంటినెంటల్లోనేనా, పే బాగుందా.. ”

” జీతం తక్కువేరా, మల్టి స్పెషాలిటీ కదా,  మెంటల్ టెన్షన్స్ ఉండవ్, రోజూ అప్ అండ్ డౌన్, నా సగం జీవితం రింగ్ రోడ్మీదే, నీ సంగతేంట్రా ‘

” మొన్నే మరో హాస్పిటల్ టేకోవర్ చేసా, నాదంతా మేనేజ్మెంట్ సైడ్ రా, ఆరెంపీలని దువ్వడమ్, మన హాస్పిటల్ కి కేసులు పంపేలా చేయడం, ఏదైనా సీరియస్ ఐతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రిఫర్ చేసుకోడం , కమీషన్ తీసుకుని..  లాస్ట్ వీక్ శాంతిగాడొచ్చాడు నా హాస్పిటల్కి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ గా, అక్కడ పధ్దతులు నచ్చక మానేసాడు వారమయ్యాక”

” హహ.. నీ బలుపుకి వాడే కరక్ట్ రా ”  బీర్ చేదెక్కుతుంది త్వరగా తాగేయాలి,

” రేయ్ నా బలుపే నిన్నిప్పుడు బీర్ తాగిస్తూ , 15 లక్షల కార్లో తిప్పుతుందని మర్చిపోకు, నీకూ నాలా బతకాలని ఆశ, కానీ భయం, నీ భయాన్నీ చేతకాన్తనాన్నీ ఎథిక్స్ ముసుగులో దాచి నా మీద పడి ఏడుస్తుంటావ్, కాదా ”

” నీకు ఎథిక్స్ లేవని ఒప్పుకున్నావుగా, బీర్ తాగు, చేదెక్కుతుంది ”

” ఎథిక్స్ హహ, నీలా ఏ కష్టాలూ లేక చదివి మాస్టర్స్ చేసినవాళ్ళకిరా ఎథిక్స్, అయాం జస్ట్ ఎ యంబీబీయస్ పాస్డ్ ఔట్, ఐనా సంపాదించడానికి పెద్ద పెద్ద డిగ్రీల అవసరం లేదు.

అలాగే నీతీ న్యాయం కూడా..”

” అవొచ్చు,  కానీ ప్రశాంతంగా నిద్రపోడానికి కాస్త నీతీగా న్యాయంగా బతకాలి ”

” రాహుల్, సడెన్గా నీకు ప్రాణం మీదికొచ్చి 10లక్షలు కావాలనుకో. ఏం చేస్తావురా .”

” అంత అవసరమ్ నాకెప్పుడూ రాదు, వొస్తే అమ్మడానికి పొలముంది ”  నిజంగా నేనేం చేస్తానపుడు

” తర్వాత..”

” ఊర్లో ఇల్లుంది ”

నాకు సంపాదించడానికి భయమా అన్యాయంగా బతకడానికి భయమా, నిజమేనేమో, లేపోతే ఇంకా ఈ హైద్రాబాద్లో  కిరాయింట్లో, పాత మారుతి 800 లో తిరుగుతానా

” తర్వాత ”

”  ఉమ్ ..  ”

ఇంకా ఏముంది నాదగ్గర , నా డిగ్రీ ఏనా ?

” అదేదో ముందే నిన్ను నువ్ అమ్ముకుంటే ఐపోద్దిగా, నే చేసేదదే,”

” కారాపరా, బీర్ బాగా చేదెక్కింది, పారేద్దాం, ఎంత దూరం ఇంకా ”   అసహాయతా ఉక్రోశం కలిసి అవమానమై మిగిలి

” నెక్స్ట్ కొల్లూరు, దాటితే పటాన్ చెరువే, శాంతిగాడికి ఫోన్చేసి స్వీట్ హార్ట్ దగ్గర ఉండమను, అలాగే ఓ సిగరెటివ్వరా అంటించి, ఇక్కడాగుదాం కాసేపు లొకేషన్ బాగుంది,

వొస్తే పొసుకునిరా బాటిల్ పారేసేయ్ ”

” రింగ్ రోడ్ మీద ఆపినా ఫైనేస్తున్నారట రా, జాగర్త, ”

” రాహుల్, నీడ్ టు టెల్ యూ ఎ థింగ్, ఐదేళ్ళ కింద మీరందరూ మాస్టర్స్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడు, నేను కూడా ఏదో ఒక ఫెలో షిప్ చేద్దాం అనుకున్నా, నీ సజెషన్ కోసం చాలాసార్లు ఫోన్ కూడా చేసా గుర్తుందా, అప్పుడు నా దగ్గర అమ్మడానికి ఏం లేవురా, అప్పటి నాకు అంత విలువ కూడా లేదు, ఇప్పుడు విలువ పెరిగినా టైం లేదు, ఐ మిస్డ్ యూ గయ్స్, ఇవాళ కూడా కేవలం నిన్నూ వాడ్నీ కలవొచ్చనే దురదతోనే నిన్ను పిక్ చేసుకోవడానికొచ్చా, ”

ఒక మనిషి పూర్తిగా మనకి ఎప్పటికైనా తెలుస్తాడా, అసలు మనిషి లోపలి తత్వానికీ మనకి అర్ధమయ్యే స్థితికి మధ్య ఎన్ని అడ్డు గోడలుంటాయో,

ఒకవేళ అలా లేకపోతే అది అత్యంత పవిత్ర స్నేహమో, అతి కాముకత నిండిన ప్రేమో ఐ ఉండాలేమో..

” శ్యాం,  ఎప్పుడైనా వేడి బీర్ తాగావా, ట్రై చేద్దామా ఓ సారి ” నా కళ్ళు మెరుస్తూ వాడ్ని చూస్తూ..

” హహ నువ్వు మారవురా హహ”

 

***

రింగ్ రోడ్ దిగి శాంతి గాడు అనబడే శాంతి స్వరూప్ గాడ్ని పిక్  చేసుకుని

మళ్ళీ రింగ్ ఎక్కేసరికి సూర్యుడు నడి నెత్తిని దాటి,

” శాంతిగా, ఏం చేస్తున్నావ్ రా అక్కడ, నీ స్వీట్ హార్ట్ లేకుండా”  శ్యాంగాడు

సగం శాడిజం నిండిన కళ్ళతో స్పీడోమీటర్ చూస్తూ స్టీరింగ్ మీద వేళ్ళతో తడుతూ

” ఇక్కడ బిర్యానీ బాగుంటదంటే తిండానికొచ్చా రా,  ఐనా ఈ స్వీట్ హార్ట్ అందరిదీ కదా.. హహ”

వాతావరణం ఇంకా వేడిగా మారకముందే చల్లబరచాలి

” రేం శ్యాం,  నువ్ రోడ్ చూస్తూ నడుపు, పక్కకి కాదు, శాంతి, నీడ్ ఎ సిగరెట్? ”

” లేదురా మానేసాను, అమ్ము కోసం చాలా మారాను, కానీ ఇలా తనే మారిపోతుంది అనుకోలేదు”  బాగ్ లోంచి గ్రీన్ టీ బాటిల్ తీసి సిప్ చేస్తూ, తుఫాన్ ముందరి నిశ్శబ్దమై,

” రేయ్ పెళ్ళి చేసుకోడం వరకే మన జీవితాలు మన చేతుల్లో, తర్వాత మనం బొమ్మలం ”

” ఏం జరిగిందసలు”  నేనేనా గొణిగింది, ఏదో తెలుసుకోవాలన్న కోరిక కంటే వాడికిలా కాకూడదనే బాధే ఎక్కువై…

” అమూల్యకి వాళ్ళమ్మ ఎంత చెప్తే అంత, చివరికి నేను క్లినిక్కి వేసుకెళ్ళే షర్ట్ కలర్ కూడా వాళ్ళమ్మకి ఫోన్చేసి అడగాల్సిందే,   ఇదంతా నా మీద పిచ్చి ప్రేమో అనుమానమో తెలీకముందే  ఓరోజు వాళ్ళ పేరెంట్సొచ్చి అమ్ముని తీస్కెళ్ళారు, ఎందుకని అడిగితే ఏదో కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటుందని, తను కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి కదా అని ఏదో చెప్పారు, సర్లే ఇదంతా అమ్ము చదువుకొసమే కదాని నేనే అప్పుడప్పుడూ వాళ్ళింటికెళ్ళి వచ్చేవాడ్ని, ఆర్నెల్లు గడిచాకా సడెన్గా ఒకరోజు లాయర్ నోటీస్ పంపారు, మ్యూచువల్ డైవర్స్ కోసం”

” ఏం మాట్లాడ్తున్నావ్ రా , డైవర్స్ ఏంటి”  శ్యాం గాడు, 120 స్పీడ్ లో ఉన్న కార్ ని సడెన్గా 80 ల్లోకితెచ్చి

” నేను అమ్ముని సరిగ్గా చూసుకోవట్లేదట, క్లినిక్కి వెళ్ళేది వేరేవాళ్ళ కోసమట, కార్లో తిరగడం దుబారా ఖర్చట, ఐరన్ బట్టలు వేసుకున్నా కూడా అనుమానమే, నేను నా సాలరీ కొంచం ఇంటికి పంపడం కూడా తప్పట, చెల్లి పెళ్ళి అనుకున్న తర్వాత ఖర్చులకి పంపిన డబ్బులవి, ఉన్న సంపాదనంతా దానం చేసి తననెలా పోషిస్తానని డౌటట ”

” ఇవన్నీ అమూల్య నీతో చెప్పిందా, పోనీ ఓసారి తనతో మాట్లాడితే ఐపోద్దిగా, ఏదో చిన్న చిన్న గొడవలేమో అనుకున్నా నేను”  శ్యాం గాడు, కారింకా 80 ల్లోనే,

” మాట్లాడితే స్పీకర్ ఆన్ చేసి వాళ్ళమ్మకే వినిపిస్తుంది, అసలు నేను అమ్ము ని చేసుకున్నానో, వాళ్ళమ్మని చేసుకున్నానో తెలియట్లే, ఈవెన్ మేం ఎప్పుడు పిల్లల్ని కనాలో కూడా వాళ్ళమ్మే చెప్తుంది,  సిల్లీ రీజన్స్ సిల్లీ ఆన్సర్స్ సిల్లీ క్వైరీస్ సిల్లీ డౌట్స్, ఆ గొడవల్లో నిన్నెలా ఫేస్ చేయాలో తెలీక నీ హాస్పిటల్లో జాబ్ కూడా మానేసా ,  సారీ రా శ్యాం, ఇవాళ మార్ణింగ్ ఇక్కడ నా సీనియర్ ఒకరు తన హాస్పిటల్ లో న్యూరాలజిస్ట్ కావాలంటే వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చి , మీకోసం స్వీట్ హార్ట్ దగ్గర ఆగా, మిస్డ్ యూ గయ్స్ ఎలాట్ ”

” ఏం చేద్దాం అనుకుంటున్నావ్ రా మరి, డైవర్సేనా”  నా గొంతు వణకడం నాకు స్పష్టమై

” ఇష్టం లేపోతే  ఎప్పటికైనా ఇష్టం పుట్టించొచ్చు, కానీ అసలు నాతో ఉండడమే కష్టమని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఎవరైనా ఏం చేయగలరు, నిద్రలేక మూడ్రోజులైంది,

ఇవన్నీ ఎప్పటికప్పుడు మీతో చెప్పలనుకున్నారా, కానీ  తను మళ్ళీ వస్తుందన్న ఆశ నన్నాపింది, ఒకప్పుడు డైవర్స్ తీసుకునే వాళ్ళని చూస్తే ఏంటీ మనుషులు , ఇంత మంచి లైఫ్ పాడు చేసుకుంటున్నారు అన్పించేది, మనదాకా వొస్తే గానీ నొప్పి తెలీదు ..ఇప్పుడింకే ఆశలూ లేవు ”

 

FM- 104 లో పాట,

( సుక్కల్లే తోచావే, ఎన్నెల్లే కాచావే, ఏడ బోయావే)

అంత ఏ.సీ లో కూడా కారుతున్న చెమటని మోచేతి కింది షర్ట్ మడతల్తో తుడుచుకుని , మేడ్చల్ దగ్గర రింగ్ రోడ్ దిగేవరకూ మా దగ్గర మాటల్లేక మేము సిగరెట్లలోకి కాలిపోయి ఆలోచనలన్నీ రేడియో పాటల్లోకి జారిపోయి,

రోజూ ఎంతమందిని తనమీదుగా నడిపిస్తుందో ఈ రోడ్, ఎన్ని వెహికిల్స్, ఎన్ని ఆక్సిడెంట్స్,  ఎందరు మనుషులు, ఎన్ని శవాలు, ఎక్కడికెళ్తారో వీళ్ళంతా రాత్రైతే, వీళ్ళందరికీ ఫ్యామిలీలుంటాయా, ఎంత మంది తల్లుల తండ్రుల భార్యల బిడ్డల భర్తల ఆశల్ని మోస్తూ తిరుగుతాయో ఈ వాహనాలన్నీ, ఎక్కడో చెట్లపొదల చాటున స్పీడ్ గన్ తో పోలీస్ కానిస్టేబుల్ , తప్పుకి గోడకుర్చీ వేయిస్తూ, ఇక్కడ్నించి చూస్తే ఈ మహా నగరం ఎంత… అంతేగా, కాస్త దూరానికి వెళ్తే మనిషికి మనిషెంత?

 

***

” రేయ్ వరుణ్ గాడి కాల్ రా”

శాంతిస్వరూప్ గాడు  అరవగానే నా మసకనిద్ర ఎగిరిపోయి సడెన్గా వొచ్చిన తుమ్ముతో దగ్గీ దగ్గీ నోట్లోకి చేరిన తెమడని ఉమ్మలేక మింగేసి తీరిగ్గా వెనకజేబునుండి కర్చీఫ్  తీసి చేతిలో పెట్టుకుని, ఫోన్ చూసేసరికి అమ్మ మిస్డ్ కాల్, నిద్రలో చూసుండను, మెసేజ్ కుడా, వాట్స్ ఆప్ కి ఫోటో పంపానని, చూసి చెప్పమని..ఏమై ఉంటుంది, అమ్మాయ్ ఫోటోనే , ఇప్పుడు పెళ్ళొద్దంటే వినదు కదా, అమ్మకి చెప్పాలి ఇంటికెళ్ళాక, ఇప్పుడే పెళ్ళొద్దనా, అసలు పెళ్ళే వొద్దనా !

” రేయ్ మిమ్మల్నే,  వరుణ్ గాడు మళ్ళీ కాల్ చేస్తున్నాడు, ఆన్సర్ చేయనా”

ఇప్పుడే ఎందుకు చేసాడని విసుగ్గా చుస్తున్నాడా, ఇప్పుడెందుకు చేసాడని చిరాగ్గానా..

” వరుణ్ హాయ్ రా, మేం బయల్దేరాం, ఇప్పుడే శంషాబాద్ నుండి, హా, రింగ్ రోడ్ ఎక్కేసాం, నేను, శ్యాం రాహుల్గాడు, మాకు ఇంకో గంట పట్టొచ్చు, హా, డైరెక్ట్ గా లక్ష్మి విల్లాకే వొచ్చేస్తాం, ష్యూర్ రా, బై”

ఫోన్ కట్ చేసి శాంతి గాడు నవ్వుతూ శాంతిగా,

” మేడ్చల్ ధాబాలో కూర్చుందాం, ఐ వాంట్టూ స్పెండ్ సం క్వాలిటీ టైం విత్ యూ బోత్, అందుకే వరుణ్గాడికలా.. హ హ ”

శాంతిగాడు అపాలజిగ్గా భారంగా మా ఇద్దరి నవ్వులూ చూసి వాడూ నవ్వి,

” రేయ్, మీకో మాట, మెడికోనే చేసుకోండి, మన పిచ్చి మనకే అర్ధమౌతుంది,  మీరు చేసుకోబోయే అమ్మాయికి ముందే మీ గురించంతా చెప్పేయండి, మీ కోపాలు బాధలూ కోరికలూ అసూయలూ అలవాట్లు ఇష్టాలూ అన్నీ , అట్లీస్ట్  తెలిసేలా చేయండి,  లేకపోతే నాలాగే తనకి నచ్చినట్టు ఉండాలని మారుతూ మారుతూ చివరికిలా ..ఇవాళ వరుణ్గాడి బ్యాచిలర్స్ అనగానే నాకు నవ్వొచ్చింది, నాది కూడా కదా అని, కాకపోతే వాడు లోపలికెళ్తే నేను బైటికొస్తున్నా, రేయ్ చిన్నప్పట్నించీ మనం స్కూల్మేట్స్, కాలేజ్మేట్స్, మెడికల్ కాలేజ్మేట్స్, తర్వాత ఒక్కొక్కరం ఒక్కోవైపు ఎగిరిపోయాం, అప్పుడప్పుడూ ఒక్కదగ్గర కలుద్దాం రా, టు బ్రీత్ సం ఎయిర్, రేయ్ శ్యాం నేను నీ హాస్పిటల్లో జాయినౌతా, కానీ ఓ కండీషన్, రాహుల్గాడు కూడా వీక్లీ వన్ డే కన్సల్టెంట్ గా వస్తేనే, మన పద్దతులు వేరు కావొచ్చు కానీ రోగానికి మందు ఎక్కడైనా ఒక్కటే, అందరికీ ముప్పై వొస్తున్నాయ్ , ఇంకో ముప్పై మహా ఐతే, మనకీ ఇగోలు సెల్ఫ్ పిటీలు అవసరమా, ఏమంటారు, చదివీ చదివీ పరిగెత్తీ పడిలేచి అలిసిపోయాన్రా..”

” ఇంతపెద్ద స్పీచ్ విన్నాకా మందు తాగకపోతే మనిషి చచ్చిపోతాడ్రా  ”  శ్యాం గాడు , దాబా వైపు కార్ పరిగెత్తిస్తూ

” నాకు మాత్రం కూల్ వాటర్ విత్ సం ఆల్కహాల్, హహ”  గొంతులో ఏదో గరగర, మళ్ళీ దగ్గొచ్చేట్టు గా

” ఐతే ఇవాళ బీర్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అన్నమాట, రేయ్ బ్యాచిలర్స్ కెళ్ళాలి దాబాలోనే తాగి పడిపోతే దరిద్రంగా ఉంటది”

” ఓసారి ఆ దరిద్రాన్ని కూడా చూద్దాంలే రా”

వొచ్చిన దగ్గుని ఆపడానికి అడ్డం పెట్టిన కర్చీఫ్ కి అంటిన రక్తపు చారికలు ఎర్రగా మెరుస్తూ, బ్లడ్ ఇన్ స్పుటం.. నీడ్ టు గెట్ ఇన్వెస్టిగేటెడ్ సూన్.. ఇంకా లేట్ చేయొద్దు, బ్లడీ సిగరెట్స్..

” రేయ్ రాహుల్,  నువ్ స్మోక్ చేయక చాలాసేపు ఐంద్రా , నాలిక పీకట్లేదా, హా”  శ్యాంగాడు ,

తెలిసి అన్నాడా తెలీక అన్నాడా, ఎనీవేస్,

జీవితమూ ఔటర్ రింగ్ రోడ్ లాంటిదే కదా,  స్పీడుగా వెళ్ళొచ్చని భ్రమపడేలోపు 100 దాటితే కట్టాల్సిన పెనాల్టీ గుర్తొచ్చి ఆక్సిలరేటర్ మీది కాళ్ళు వణుకుతాయ్,

లాంగ్ లివ్ ORR..

 

 

 

*

 

       “రాత” నాకు ఎప్పుడూ సెకండరీయే!   

           

హలో వంశీ భయ్యా. మొదటి కథ ఏది? అసలు రాయాలని ఎప్పుడనిపించింది.?

హాయ్ భయ్యా, మొదటి కథ రాసింది 2011లో, మలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో, బాల్య మిత్రుడు ఒకరు, ఉద్యమం లో యాక్టివ్ గా ఉన్నందుకు,  పోలీస్  స్టేషన్ లో వేయబడి ఎలాగోలా మెల్లగా రిలీజై, పోలీస్ కేసుందని  బైట ఎక్కడా ఉద్యొగం దొరక్క బతుకు దెరువుకు IPL బెట్టింగులు చేయాల్సిన సిచువేషన్ చాలా దగ్గరగా చూసాను, ఆ కథే “చౌరస్తా”.

 అసలు మీ దృష్టి లో కథంటే ఏంటి..? దాని వల్ల ఏదన్నా ప్రయోజనం ఉందనుకుంటున్నారా..?

ఏ సాహిత్యానికైనా ప్రైమరీ ఇన్స్టింక్ట్ మన అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలనే కోరికే .  సాహిత్యపు ప్రయోజనం ఒక్కటే, ఆ కాలపు చరిత్రని, నాగరికతని పదిలపర్చడం, సారస్వతపు ముఖ్య ఉద్డేశ్యం ఇదే అయిఉంటుందేమో.

యూత్ కి మీ కథలు బాగా కనెక్ట్ అవుతాయి. ఐతే మీ కథల్లో కొన్ని పదాలు చాలా సింపుల్ గా వాడేస్తారు. కొంతమంది ఇబ్బంది పడ్డామని అంటుంటారు..?

మనం కొన్ని పదాల్ని చాలా సింపుల్గా వాడేస్తాం రోజువారీ బతుకులో , అలా నేను మాట్లాడే పదాలే రాస్తాను దాదాపు, కొన్నిసార్లు కథగా మలచబడుతున్న అనుభవ తీవ్రతనిబట్టి రీడర్ కి ఆ ఇబ్బంది కలుగుతుంది.

 కవిత్వం కూడా రాస్తారు కదా. పోయేట్రీలో నీ శైలికి  చాలా మంది అభిమానులున్నారు.

కవిత్వమ్ రాసేవాడ్ని ఒకప్పుడు, ఒక వయసు దాటాక కవిత్వం రాయలేమని తెలిసొచ్చాకా, ఇప్పుడు కేవలం చదూకుంటున్నా అప్పుడప్పుడు

 కథ, కవిత్వం లో దేన్ని ఎక్కువగా ఇష్టపడుతారు..?

నాకు నవలలంటే చాలా ఇష్టం, కానీ అది రాసేంత శక్తి , ఆలోచనా స్తోమతా లేక కథలు  చెప్తున్నా.

కథల్లో ఫిలాసఫీ, జీవితం పట్ల వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా ఉంటాయి. మూడు పదులకే అంత అనుభవం ఎలా వచ్చింది..

అనుభవానికీ వయసుకీ లంకేమీ ఉండదేమో, మనం పుట్టి పెరిగిన పరిసరాలూ దాటి వొచ్చిన పరిస్థితులు, తిన్న దెబ్బలు నేర్పిన జాగ్రత్త , తిరిగి కొట్టాలని బతికే బతుకు, మనకన్నీ నేర్పుతాయ్ చొక్కా పట్టుకుని మరీ

అర్జున్ రెడ్డి సినిమా కు కీమో కథ కూడా చాలా దగ్గర పోలికలు ఉన్నాయి కదా..?

బహుశా రెంటికీ ఉన్న మెడికల్ కాలేజీ నేపథ్యం అండ్ హీరో ఎక్సెంట్రిక్ బిహేవియర్ వల్ల అలా అనిపించి ఉంటదేమో, కానీ ఆర్జున్ రెడ్డి కన్నా కీమో మానసిక పరిణితి, ఆలోచనా పరిధి ఎక్కువ.

మీలాంటి మంచి రచయిత చాలా తక్కువ రాయడం అన్యాయం. వంశీ కథ రాశాడంటే వెతికి చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు..?

నా కథల్లో మంచి ఎక్కువ ఉండదు అంటారు మిత్రులు, ఆ లెక్కన నేను మంచి రచయితను ఎప్పటికీ కాను, 🙂 అండ్ , చాలామంది కథకుల్లా కాకుండా నాకున్న చాలా  వ్యాపకాల్లో “కథ” కూడా ఒకటవడం వల్ల నేను ఎక్కువ రాయలేను, “రాత” నాకు ఎప్పుడూ సెకండరీయే.

 సాహితీ సమావేశాల్లో కనపడరు.  కావాలనేనా.? ఎందుకలా దూరంగా ఉంటారు..?

ఎప్పటికప్పుడు పెరిగే అదనపు బాధ్యతలవల్ల, ఆధునికత పెంచిన అవసరాలు తీర్చుకునే పోరాటంలోపడి, కొంత కావాలనీ , ఇంకొంత కాదనుకునీ  , ఎక్కువగా కనపడ్డం సాధ్యపడకపోవొచ్చు, కానీ నాకున్న కొద్దిపాటి సాహితీ మిత్రుల్ని రెగ్యులర్గా కలుస్తుంటా,

కథలు చదువుతారా..? మీకు నచ్చిన కథలు, కథకులు….అలాగే కవిత్వంలో నచ్చిన కవి..?

మెహెర్ , పూడూరి రాజిరెడ్డి ఏం రాసినా ఇష్టంగా చదూకుంటా..  కొన్ని త్రిపుర కథలు, కొన్ని రమణజీవి కథలు, కొన్ని కాశీభట్ల కథలూ ఇష్టం, కవిత్వంలో శ్రీకాంత్.కే  “యితర”, ఎమ్మెస్నాయుడు “ఒక వెళ్ళిపోతాను” సిధ్దార్ధ “దీపశిల” , పసుపులేటి “లెట్ మి కన్ఫెస్”, మో “చితి చింత” నచ్చుతాయి , ఎక్కువసార్లు చదివిన రచనలు, హెర్మన్ హెస్సె  “సిధ్దార్ధ”, గురజాడ వారి “కన్యాశుల్కం” .

 *

వంశీధర్ రెడ్డి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “వొస్తే పొసుకునిరా … ”
    అలవోకగా ఇలాంటి వాక్యాలు రాయాలంటే “అందులో” దమ్ముండాలి. మానసిక వ్యభిచారమంత అనైతికత మరొకటి లేదు. అందుకే వంశీధర్ రెడ్డి అక్షరాలు పాఠకుల్ని ఊపిరాడనీయవు. తీగలై చుట్టుకుంటాయి. 50 ఏళ్ళ క్రితమే స్మైల్ గారు భారతి లాంటి పత్రికలో “వల” అనే కథ రాసి సంప్రదాయ గోడలు బద్దలు కొట్టారు. మళ్ళీ ఇంతకాలానికి వంశీధర్ రెడ్డి కనిపించాడు. పైగా తేనెలూరే మాండలీకం ఆయన రక్తంలోనే ఉంది. రాయండి వంశీ .. రాస్తూనే ఉండండి .. రాసి రాసి మమ్మల్ని లాహిరిలో ముంచేయండి. స్వేచ్ఛగా, మైకంలో బతకడం ఎంత అద్భుతం కదా.
    ………………………………..
    “ఒక మనిషి పూర్తిగా మనకి ఎప్పటికైనా తెలుస్తాడా, అసలు మనిషి లోపలి తత్వానికీ మనకి అర్ధమయ్యే స్థితికి మధ్య ఎన్ని అడ్డు గోడలుంటాయో, ఒకవేళ అలా లేకపోతే అది అత్యంత పవిత్ర స్నేహమో, అతి కాముకత నిండిన ప్రేమో ఐ ఉండాలేమో..”
    “ఔటర్ రింగ్ రోడ్” లో నాకు బాగా నచ్చిన వాక్యమిది.

    • వంశీ దమ్మున్న కథకుడే కాదు….మనసున్న కథకుడు. మీ స్పందన కు ధన్యవాదాలు

  • ఔటర్ అంటూనే …లోపలికి… లోతుల్లోకి చొచ్చుకు పోయి చిచ్చు పెట్టే వాక్యాలు….బాగుంది.

    • థాంక్యూ రామకృష్ణారెడ్డి సాబ్.

  • ఇదివరకు చదివిన కథే. మళ్ళీ చదివా. మళ్ళీ నచ్చింది.

    • మీ స్పందనకు ధన్యవాదాలు సార్

  • ఏందిరా నాయినా..! ఇప్పటికే ఒక్కొక్క రోజూ లెక్కబెట్టుకుంటూ, ఒక్క సిగరెట్ వెలిగించినప్పుడన్నా బతికే ఉన్నామన్న స్పృహతో బతుకుతున్నాం.
    అవునూ… ఇంతకీ.. కాస్త దూరానికి వెళ్తే మనిషికి మనిషెంత? ఇప్పటికీ అర్థం కాని, అర్థం ఉందో లేదో తెలియని ప్రశ్న ప్చ్….! వంశీ…! ఎట్లా భరించేదీ భయాన్ని, భాధనీ??? ఇంకా అర్థంకావటం లేదు మీ డాక్టర్లు రచయితలు కాకుండా మీ పని మీరు చేసుకు చావండి.. లవ్యూ మై డాక్టర్ సాబ్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు