ఈరోజు మధ్యాహ్నం…
నాన్నకు… నాకు మధ్య
మాటా మాటా పెరిగింది
నేను చదువుతున్న
పుస్తకాన్ని తీసి
ఆవేశంగా అవతలకి విసిరేసాడు
రెక్కలు తెగిన పక్షిలా
టపటపమంటూ
గాలికి కొట్టుకుందా పుస్తకం
నా ప్రశ్నకు సమాధానం చెప్పలేని
నాన్న అసహనం
నా చెంపపై
తన చేతి గుర్తునుంచింది
చిన్నప్పుడు… నేను ఏడిస్తే
ఎర్ర రంగు బూర కొన్న నాన్న
నేను మారాం చేస్తే
ఎర్ర పీచు మిఠాయి కొన్న నాన్న
నా వేలు తెగితే
చిందిన రక్తాన్ని చూడలేక
నోట్లో పెట్టి చప్పరించిన నాన్న
నేనడిగిన ప్రతి ప్రశ్నకు
ఓపికగా సమాధానం చెప్పిన నాన్న
ఎరుపు రంగంటే
కంగారు పడుతున్నాడు
గుబురు గడ్డపు మనిషి
ముఖచిత్రాన్ని చూసి ఊగిపోతున్నాడు
చిన్నప్పుడు చదవకపోతే
తిట్టిన నాన్న
ఇప్పుడు నేను చదువుతుంటే….
చేతికి అందిరావాల్సినదేదో
చేజారిపోతుందనే భయంతో
నాపై చేయి చేసుకున్నాడు
ఈమధ్య పదే పదే
నాన్నకు నాకు మధ్య
మాట నలిగిపోతుంది
మా అమ్మ మనసులా
* * *
పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్
Wahwa
An excellent crispy poem. Hearty congratulations…
Thank you sailaja garu
మధ్యతరగతి నాన్న అలా భయపడడం సహజమే. అనేక అసహనాల మధ్య బ్రతుకుతూ వున్న ప్రజలు ఉద్యమాలు రావాలని కోరుకుంటారు.కాకపో తే ఆ ఉద్యమాలు ఎవరో చెయ్యాలని ఆశిస్తారు.తాము తప్ప. తమ పిల్లలు మాత్రం గొప్ప ఆదాయవనరు గావాలని కోరుకుంటారు.
ప్రస్తుతం స్థితిని చూపించి న కవిత.బాగుంది
Thank you ramakrishna garu