నాయినమ్మతో  సినిమా

ఎండాకాలం సెలవులకు పిల్లలు ఇంటికి వచ్చారు . అయితే టీవీలో పోగో, బాలభారత్, పిల్లల కార్టూన్లూ   లేకుంటే  సెల్లులో  ముచ్చట్లు పొద్దు పొద్దు అంతా చూస్తున్నారు.  నాకు ముగ్గురు మనవరాళ్ళు ఒక మనుమడు.  ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రైవేట్ కాలేజీలో ఉన్నాడు. ఇక మిగిలిన ముగ్గురు రోజూ ఇలాగే కాలాన్ని గడుపుతున్నారు. చదరంగం ఆడుదాం అంటే మా  పెద్ద మనుమరాలు సహచరి ఆడదాం అంటుంది. నడిపి ఆమె  నేను ఆడ అంటుంది. మా చిన్న మనవరాలు వినమ్ర బక్క పల్చగా ఉంటుంది కానీ బాగా చురుకైనది.క్యారం బోర్డు ఆటైనా ఏ ఆటైనా సై అంటుంది. తాతా! “నువ్వు కవిత్వం, కథలు రాస్తావు కదా? ప్రశ్నించింది. “అవును” అన్నాను.” మరి ఒక కథ చెప్పరాదే” అడిగింది. “సరే అన్నాను” ముగ్గురూ మూతులు చాపి నా చుట్టూ ఇక చెప్పమన్నట్టు  కూర్చున్నారు.

అప్పుడు నేను ఆరేడేళ్ల పిల్లగాన్ని కావచ్చు. సిరిసిల్ల రాజరాజేశ్వర టాకీస్ లో శ్రీకృష్ణ రాయబారం సినిమా నడుస్తుంది .ఆరోజుల్లో పేరు మోసిన తారాగణం ఉందని మా ఊరి దొరవారి దొడ్డి గోడకు అంటించిన  పోస్టర్ ను చదివి వచ్చిన వారి ద్వారా  ఆ నోట ఈ నోట ఊరు అంతటా కొత్త సినిమా వార్త ఉచితంగా ప్రచారం అయింది.

సినిమా ముచ్చట్లను నడిపి చిన్నబాపు  వైన వైనాలుగా చెప్పి, ముగ్గురు కోడండ్లను తీసుకొని పోయి  సినిమా చూసి రమ్మని సినిమా పట్ల ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని మా నాయనమ్మకు  అందించాడు .

ఇక్కడ మా నాయనమ్మ ఒక విధంగా ఆజాను బాహువు బలంగా ఉండేది.

ముగ్గురు కొడుకుల్ని కూడా కోడళ్లను ఒక్క చేతితో,నోటి గాంభీర్యంతో ఆట ఆడించేది. ఎంత అంటే ఒక్క మాట చెప్తే చాలు కూసోమంటే కూర్చోవాలి లేమ్మంటే లేచి నిలబడాలి. దగ్గర దగ్గర 12 మంది పిల్లలు పుట్టారట చనిపోగా చనిపోగా నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు చివరకు మిగిలారు. పుట్టిన వాళ్లు పుట్టినట్టే చనిపోతుంటే దుర్గమ్మ దగ్గర వేసి మా బాపు పేరు దుర్గయ్య అని పేరు పెట్టారట. గట్లనే పెద్ద చిన్న బాబు కు శంకరయ్య అని ,నడిపి చిన్న బాపుకు శ్రీశైలం అని, చిన్న చిన్న బాపుకు పెంటయ్యా అని పేర్లు పెట్టారు. నా  ఎరుకలోని మా పెద్ద చిన్న బాపు శంకరయ్య చనిపోయాడు. గట్లనే మా పెద్ద మేనత్త లచ్చవ్వ కాలం చేసింది. ఇక మిగిలింది ముగ్గురు కొడుకులు కోడళ్ళు  మనమలు, మనుమరాల్లు మాత్రమే. మా మా బాపు ఐదో తరగతి చదువుతున్నప్పుడే మా తాత రాజీరు చచ్చిపోయిండట. ఇక మొత్తం సంసారం బరువు బాధ్యతలు అన్నీ చిన్నతనంలోనే మా బాపు  చదువు బంద్ చేసి మోసిండట.

ఆయినప్పటికీ  నడిపి చిన్నబాబు శ్రీశైలం అంటే మా నాయనమ్మకు ఇష్టం. ఆయన దగ్గర కూర్చొని కథ మల్లోసారి కథ చెప్పేసరికి, కాదనలేక అయిష్టంగానే చివరికి రేపు సాయంత్రం సిరిసిల్ల సినిమాకు కోడండ్లతో సహా పోవడానికి ఒప్పుకుంది .

తెల్లారి లేచి సాయంత్రం పోయే సినిమాకు కోడండ్లను ఎగిర్త పెట్టింది . ఇక మా నాయనమ్మ పొద్దున లేసి వరిపిండి, నువ్వులు మెత్తగా వేడి నీళ్లలో కలిపి పెద్ద పావుతో మంచి నూనె పోసి , నాలుగు పెద్ద మూకుడుల సర్వపిండిని దించింది. ఇంట్లో ఉన్న మిగతా వారికి తినడానికి మరో మూడు గిన్నెలు పసర్వపిండి చేసి ఉంచింది.

సాయంత్రం అయింది. మా నాయనమ్మ  నాలుగు  సర్వ పిండిలను ఒక బట్టలో ముల్లెలా కట్టింది. కోడండ్లని ఒక్కొక్కరిని పిలుచుకుంటూ పొద్దు పోతుంది.తొందరగా తయారవ్వమని గట్టిగా ఉత్తర్వులు జారీ చేస్తుంది. మా అన్నకు  చీకటి అంటే కొంచెం భయం అందుకే సినిమాకు రాను అన్నాడు. మా పెద్ద చెల్లె  సరోజన పాలు మరువని పిల్ల .ఎలాగూ మా అమ్మ చంకలోనే ఉంటది. ఇక మిగిలింది నేను  మా నాయనమ్మ “సినిమాకి సిరిసిల్ల వస్తవారా” అడిగింది. నడుము మీది మంచి జారుతున్న నెక్కర్ను పైకి జరుపుకుంటూ “వస్తా” అన్నాను.

మానేరుకు ఇవతలి ఒడ్డుకు మా ఊరు తంగళ్ళపల్లి ఉంటే, ఇవతలి ఒడ్డుకు సిరిసిల్ల ఉంటుంది. మధ్యన మానేరు వాగు అడ్డం. మా ఇంటి నుంచి సిరిసిల్లకు నడమ దూరం  దగ్గర దగ్గర  కిలోమీటర్ వరకు ఉంటుంది.

నాయనమ్మ ఒక చేతితో నన్నూ,  మరో చేతిలో ముల్లెను పట్టుకుంది.

అత్తకు భయ పడుతూ  రాముని వెంట సీత, లక్ష్మణులు నడిచినట్టు ముగ్గురు కోడండ్లు అనుసరించారు.

అటు చలికాలం కాదు. ఇటు ఎండాకాలం కాదు.  కొంచెం చలిగా కాసింత ఎండగా వాతావరణం పొడి తడిగా ఉంది. మా ఊరి పొలాలను,కమ్మరోల్ల ఒర్రెను దాటి  వాగులో నిలువెత్తు నిలుచున్న తాడిచెట్టు దగ్గర నుండి పిల్ల బాటలో సిరిసిల్లకు నడుస్తున్నాం .

పొలాలు వరి కోతకు రావడం వల్ల పెద్ద పాయ నిండా వాగు మోకాలు వంటి కన్నా ఎక్కువగానే  పారుతున్నది. నడిపి చిన్నమ్మ  అమాయకురాలు” లచ్చవ్వా”   పదిలంగా నడువు అని చెప్పింది. సినిమా టాకీస్ మైక్ లోంచి రాజరాజేశ్వరి సుప్రభాతం వినిపిస్తుంది. “సినిమాకు  ఆలస్యమైతది ఇంకా టికెట్లు తీసుకోవాలె. తొందరగా నడువుండ్రీ” నా చెయ్యి గట్టిగా పట్టుకొని బర్ర బర్ర ఈడ్చుక పోతూ మా నాయనమ్మ మా అమ్మా వాళ్ళని గదమాయించింది.

ముగ్గురు మనవరాళ్లు తదేకంగా వింటున్నారు. వినూత్న “తాతా! అప్పుడు మరి బ్రిడ్జి లేదా అడిగింది.  అప్పుడు లేకుండేది్ ఓ చాలా ఏండ్ల తర్వాత  కట్టారు నేను చెప్పాను. ఇంకా చెప్పు అన్నట్టు మిగతా ఇద్దరు  ఉత్చుకతతో “ఇంకా ఏమైందో ” చెప్పమంటూ నా వైపే  చూస్తున్నారు.

వాగు దాటి సిరిసిల్ల ఒడ్డు ఎక్కాము . సిరిసిల్ల లో కరెంటు  లైట్లు వెలుగులు పంచుతున్నాయి  . మా నాయనమ్మ  పెద్ద పెద్ద అడుగులు వేస్తూ సినిమా మొదలు అవుతుందని నడుస్తుంది. మా అమ్మ చిన్నమ్మలు నేను వెంట ఉరుకుతున్నాము.

రాజేశ్వరి సినిమా టాకీస్ పెద్ద గేటు తీశారు . మంది ఒకరి మీద ఒకరు పోటీపడి టికెట్లు ఇచ్చే కిటికీ దగ్గరకి పోతున్నారు . మా నాయనమ్మ వెనుకకు తిరిగి  చూసి ఆగింది. అందరూ లోపలి గేట్లోకి చేరాము. నాయనమ్మ నన్ను  పిలిచి ఇది పట్టుకోరా అంటూ ముల్లె ఇచ్చింది .

చెక్కుడు సంచి  లోనుంచి  పైసలు తీసి టికెట్లు తీసుకోను ఆడోళ్ళ లైన్లో నిలబడ్డది. అమ్మ సంకలో నిద్రపోతున్న మా చెల్లె చప్పుడుకు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి దద్దరిల్లి ఏడుపు అందుకుంది. అమ్మ చొచ్చో… చొచ్చో్…. అంటూ చిన్నగా వీపు తడుతూ నోటికి స్తన్యాన్ని  అందించింది . పాలు తాగుతూ ఏడుపు బంద్ చేసింది. ఇంతలో నాలుగు టికెట్లు రెండు రూపాల నోట్లు విడివిడిగా ఇచ్చి తీసుకొచ్చింది. మిగిలిన చిల్లర పైసలు సంచిలో వేసుకొని ఎప్పటి లెక్క బొడ్లె చెక్కుకొంది.

సినిమా టాకీస్ లోపల చుట్టుపక్కల పడి ఉన్న ఫిలిం ముక్కలని సిగరెట్ బుర్రలను ఏరుకుంటూ  ఒకకన్నును మూసి  మరొక కన్ను తెరిచి ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ జేబులో సంబురంగా వేసుకుంటున్నాను. ఇంతలో నాయనమ్మ నా దగ్గర ఉన్న ముల్లెను తీసుకుంది.” ఓరి పోడా” అని పిలిచి సంకలోఎత్తుకుంది.

మగవాళ్లు టాకీస్ కు కుడి దిక్కు ఉన్న రెండు చిన్న గేట్ల దగ్గర ఉన్న వారికి టికెట్లు చూపించి లోపలికి పోతున్నారు

మొదటి తరగతి బెంచి మీద ప్రేక్షకులు  కూర్చుంటారు  టికెట్ ధర కొంచెం ఎక్కువ. రెండో తరగతి నేల అంటే కింద కూర్చోవడం అన్నమాట. అప్పుడు టాకీస్ ఇప్పటి లెక్క చుట్టూ గోడలు నిర్మించి లోపల కుర్చీలు, ఏసీలు ఉండేది కాదు. పైన రేకులు అక్కడక్కడ ఫ్యాన్లు, చుట్టూ తడకలతో ఉండేది. ఎక్కడివాళ్లు అక్కడికి పోగానే టికెట్ తీసుకుని ఒక అతను తొందర తొందరగా సగం  చింపి వాళ్ల చేతుల్లో పెడుతున్నారు. మిగతా  సగం తన పైజామా సైడ్ జేబులో
వేసుకుంటున్నారు.

ఇక మేము టాకీస్ ఎడమవైపు ఉన్న ఆడోళ్ళ గేటు వైపు పోయినం. గేటు దగ్గర ఒకామె తెల్లటి చీరా జాకెట్టు కట్టుకొని  , స్టూలు పక్కన లంక రాజ్యంలోకి ఎవరిని రానీయకుండా వున్ప లంకినిలా అట్టకు అట్ట, జబర్ గా   నిలబడి ఉంది. మా ముందు కొంతమంది టిక్కెట్లు  ఆమెకు ఇస్తే సగం చింపి లోపలికి లెక్క ప్రకారం ఒక్కొక్కరిని తోలుతుంది. మా నాయనమ్మ కోడండ్లను పేరుపేరునా పిలిచి గేటు దగ్గర  ఉన్న ఆమెకు మూడు టిక్కెట్లు ఇచ్చింది. మా అమ్మ చిన్నమ్మలు ముల్లె పట్టుకొని లోపలికి నడిచారు. దాదాపు మంది అయిపోయారు.

ఇక మా వంతు వచ్చింది. మా నాయనమ్మ ఎప్పటి లెక్కనే నన్ను ఎత్తుకొని  రైక లోంచి  తీసి పాలు  తాగురా అని నా నోటికి అందించింది. పాలు ఎలాగూ రాక పోగా  నా నోరంఆ ఉప్పు ఉప్పు అయింది . బల్మీటికి నోట్లో అమ్మను కుక్కుతుంది.

సినిమా టాకీస్ మైక్ లో వచ్చే పాటలు ఆగి పోయినయ్. గప్పుడు మా నాయనమ్మ గేటు దగ్గర ఉన్న ఆమె చేతిలో టికెట్ పెట్టి, లోపలికి పోబోయింది. గంతే ఒక్కసారి గయ్యిన లేచి మా నాయనమ్మ చెయ్యి  గుంజి “గీ పిల్లగాని టికెట్ ఎవలు తీసుకుంటరని ” గట్టిగా అడిగి మమ్ముల్ని ఇవతలనే  ఆపింది. నాయనమ్మే హడల్ అంటే అంతకు మించి తాతనే ఆమె ఉన్నట్టు ఉంది.

“ఏయ్ మమ్మల్ని లోపలికి పోనీయవా” నాయనమ్మ కోపంతో నిలదీసింది.

” ఏం మాట్లాడుతున్నావ్ ఈ పిల్లగాడు మాలేసుక ఏడు ఎనిమిది ఏండ్లు ఉంటడు.  సగం టికెట్ కొనుక్కొని వస్తేనే లోపలికి తోలుతా” లంకిని అంతే గట్టిగా చెప్పింది.

లాంగ్ బెల్లు మోగింది. లోపల లైట్లు బంద్ అయినయ్. సినిమా  మొదలవుతున్నట్టు పక్కకెళ్ళి చూస్తే ఫోకస్ లైట్ పడుతుంది.

తడకలకు చేసిన చిన్న చిన్న సందుల నుంచి  పిల్లగాళ్ళు అటు ఇటూ ఎవరన్నా వస్తున్నారో లేరో చూసుకుంటూ భయం భయంగా తొంగి చూస్తున్నారు. వచ్చే మంది తక్కువ అయిపోయిండ్రు. వీళ్లను చూసి గేట్ వద్ల నిలబడ్డ ఆమె పక్కనున్న పెద్ద ఎల్తె కట్టెను పట్టుకొని “అరేయ్ “అంటూ వాళ్ల మీదికి ఉరికింది. పిల్లలు సత్తిమి బతికితిమి అని దొరుక్కుంటా ఒకటే ఉరుక బుచ్చుకున్నారు. తరిమికొట్టొచ్చి మల్లా గేటు దగ్గరికి వచ్చి ఎవరైనా వస్తారేమో అని చూస్తూ  నిలబడ్డది.

“సినిమా మొదలైతందని” మా నాయనమ్మతో  గోసగా ముఖం పెట్టి బతిలాడుతున్నట్టు చూశాను. నాయనమ్మ ఏమన్నా అంటే నాకు ఏడుపు వచ్చేటట్టు ఉంది.

బాధను చూసో నా పోరు పడలేకనో  గని  ఏమని అనిపించిందో “అవునవ్వా మమ్ములను లోపలికి తోలవా ఏందీ” కొంచెం కటువుగా అడిగింది.

ఆమె “ఏయ్ మల్ల మల్ల ఎన్ని సార్లు చెప్పాలె టికెట్ తెచ్చుకో పో” అంతే లాసిగా చెప్పింది.

మా నాయనమ్మ” గీ పాలు మరువని పిల్లగానికి కూడా టికెట్ తీసుకుంటావా “నీకు తంతు లేదు తరువాయి లేదు మునాసమ్ లేదు” అంటూ మళ్ళీ రైకలో నుంచి తీసి  అమ్మను సంకలో ఉన్న నా నోట్లో కుక్కింది. నాకేమో అంత ఉప్పు ,చెమట వాసన వస్తుంది. అట్లా నోటితో చను ముక్కును ఉల్లు ఉల్లుగా పట్టుకొన్నాను.

“ఓ మల్లవ్వా” మేనీంజర్ పిలుస్తుండు” అని నడి వయస్సు పిల్లగాడు వచ్చి చెప్పి పోయిండు.

మల్లవ్వ లోపలికి పోయి మందిని లెక్క పెట్టుకొని టికెట్ల లెక్క చూస్తుంది. మేము గట్లనే బయట నిలబడి ఎదురు చూస్తున్నాం .

మల్లవ్వ లెక్క సరిపోయిందో లేదో సరి చూనుకొని మా నాయనమ్మతో “గీ పిల్లగాడు నీకేం అయితడు” అడిగింది.
మా నాయనమ్మ “నా కొడుకు చిన్న కొడుకు “అని చెప్పింది.

మల్ల ఏమనుకుందో ఏమో గాని” గీ ఉమర్ ల పిల్లలను అంటున్నావే “గదిరించింది.

మా నాయనమ్మ ఏమన్నా తక్కువ తిన్నదా “నీకేందే కంట ఇంకా పదిమందిని కంట నీకేమన్నా  తక్లీబ్ గా వుందా నేనే కంటి నీకెమన్నా నొప్పులు అత్తయా” అంది.

లోపల ఏమో సర్కార్ రీల్ పడ్డది. మాటలు విన వస్తున్నాయి. నాకేమో నెత్తిమీద చల్లని నీళ్ల కుండ ఎత్తుకున్న  ఏడేడు సముద్రాల దుఃఖం లోపలి నుంచి ఎత్తేసుక వస్తుంది. మల్లవ్వ లేచి టికెట్ల లెక్క అప్పచెప్పడానికి మేనేజర్  అర్ర వైపు నడిచింది .

మల్లవ్వ ఇట్లా పోగానే,  అట్లా లోపలికి పోతామా సినిమా చూస్తామా లేదా ఒకటే ఏతం పోసినట్టు నా మనసు గుంజుతుంది  .

మల్లవ్వ మల్ల వచ్చి స్టూల్ మీద కూర్చుంది. మా నాయనమ్మ మనసులో ఏముంది గుణాయించుకుందో ఏమనుకుందో ఏమో కానీ లొల్లి పెట్టుకుంటే కలవదని తాత్పరానికి వచ్చి “అవ్వా మల్లవ్వా నా బిడ్డ అసుంటి  దానివి .ఇప్పటికైనా లోపటికి పోనీయ్ రాదూ? మల్ల సినిమాకు వచ్చినప్పుడు సీసల మంచి నూనె తీసుకొచ్చి ఇస్తా” బుదరకిచ్చి కొంచెం బతిలాడుతున్నట్టు అడిగింది.

మల్లవ్వ కూడా జెర కరిగినట్టు  అనిపించింది. “అవ్  అమ్మా మీది ఏ ఊరు? ఇంతకు ఎవలు మీరు? “అని అంది. ఇదే మోక అనుకొని మా నాయనమ్మ ” మాది తంగళ్ళపల్లి. మేము గాండ్లోల్లం ” నునుగారంగా చెప్పింది.

“తోల్తా గని అమ్మా ! ఎవరన్నా చెకిన్ కు వస్తే ఈ పిల్లగాడికి నాలుగేళ్లు ఉంటాయని చెప్పు మరి” అని మల్లవ్వ సలహా ఇచ్చింది.

నాయనమ్మ చిన్నదా ఇదే సమయం అనుకొని మల్లవ్వ చేతికి టికెట్ ఇచ్చింది .

లోపటికి పోయే వరకు కొంచెం కొంచెం వెలుగు చీకటి కలెగల్సి మనుషులు కనబడీ కనబడుతున్నారు. నన్ను ఎత్తుకొని కొంచెం సేపు ఆగింది. మా అమ్మా చిన్నమ్మలు సినిమా చూస్తూ కనబడ్డారు.

మా నాయనమ్మ  కూసున్న మందిల నుంచి పైలంగా  అడుగులు వేసుకుంటా మా వోల్ల దగ్గర అటు కొంచెం ఇటు కొంచెం జరుగుమని కూసుంది. నా సంబరానికి వశం అయితలేదు .

సర్వపిండి ముల్లె మా నాయనమ్మ విప్పి, కోడండ్లకు మనిషికి సగం ఇచ్చింది. మిగిలిన ఒకటిన్నర దగ్గరనే పెట్టుకుంది. నా చేతికింత ముక్క ఇచ్చి  “తిన్రా” చెప్పి గడ్కీ గడికి ఏదో ఇంత సుంచి నోట్లో వేసుకుని మా నాయనమ్మ తినడు  మొదలుపెట్టింది.

కొంచెం దూరం ఎదురుగా  ఎత్తుకెత్తు ఉన్న ఆమె తలకాయ సినిమా చూద్దామంటే మాకు అడ్డం వస్తుంది.” ఓ అవ్వ జెర తలకాయ కిందికి పెట్టు కనబడుతలేదు సినిమా” కొంచెం గట్టిగానే చెప్పింది.

అమె తలకాయను వంచినట్టే మంచి మల్ల ఎప్పటి లెక్క కూసుంది. నేను “నీ యవ్వ సినిమా కనపడతలేదే అన్న”
మా నాయనమ్మ శంకిని చూసి చూసి “ఓ ఏడు పొడుగుల దానా పెరిగినావు తాటిచెట్టు లెక్క ఇన వస్తలేదా మేము చెప్తుంటే”  గంతే ఇద్దరు ముగ్గురు వెనక్కి తిరిగి మా నాయనమ్మను “ఏందే ముసలిదానం లావ్ లావు మాట్లాడుతున్నావ్” అన్నారు. కొట్లాట అంటే కాలు దువ్వుతది . సినిమేమో కానీ నడుమ పెద్ద  రామ రావణ యుద్ధం  ముదిరింది .

గీ లొల్లి  విని వచ్చి మల్లవ్వ మనిషికో మాట నచ్చ  చెప్పి నువ్వు ముసలమ్మ  దా అని మొగోల్ల ఆడోళ్ళ నడుమ ఉన్న చిన్న గోడ దగ్గర మమ్మల్ని కూసోబెట్టింది. సినిమా చూసుకుంటూ నాయనమ్మ ఇగ నోటికి పని చెప్పింది.

ద్రౌపతి వస్త్రాపహరణం  జరుగుతుంది  అన్నిటినీ అందర్నీ కుదువ బెట్టి ఆటాడి ఓడిపోయిన ధర్మరాజుతో సహా ఐదుగురు పాండవులు తలకాయలు కిందికేసుకున్నారు. చెమటలు కారంగా ఒగరు కొడుతూ దుశ్శాసనుడు ఒక్కొక్క చీరను ఇగ్గేస్తుంటే, ఆడోళ్ళు కోపంగా మీ చేతులకు  జెట్టలు బుట్ట మీ పాడు గాను మిమ్మల్ని పానంతో బొంద పెట్టా  ఎవ్వలకు తోసినట్టు వాళ్ళు తీరొక్క తరీఖ తిడుతుండ్రు. ద్రౌపతి అన్నా అని రెండు చేతులు దండం పెట్టి వేడుకోంగనే  దయతలిచి పైనుంచి కృష్ణ పరమాత్మ ఒక్కొక్క చీరను పంపుతుండు .  చీరలు ఎంతకూ వొడుస్త లేవు. ద్రౌపతి రెండు కండ్లు మూసుకొని కృష్ణునికి మొక్కుతుంది.

విశ్రాంతి పడ్డది. సినిమా ఆమె జెప్పన లేసి వచ్చి  మొగోళ్లకు ఆడోళ్లకు మధ్యనున్న  నల్లని పర్దాను సర్రున గుంజింది.లైట్లు వెలిగాయి. మా నాయనమ్మ లేచి నన్ను పట్టుకొని , గేటు పాసు తీసుకొని, బయటకు పోయి కొంచెం దూరంలో ఉన్న నల్లా తిప్పి మంచినీళ్లు నాకూ కొంచెం  తాగిచ్చి, ధూప తీర తాను తాగింది.

మా చిన్న మనవరాలు చెప్తున్న కథకు అడ్డం  వస్తూ “నీళ్ల బాటిల్ కొనుక్కో వచ్చు కదా ” అడిగింది. అప్పుడు సిరిసిల్ల లో ఎక్కడ పడితే అక్కడ పట్టేన్ని మంచినీళ్లు నల్లాల్ల వచ్చేటివి. అందుకే నీళ్లు ఇప్పటి లెక్క అమ్మేటోల్లు కాదు. అగర్సే ఎవరైనా తాగే నీళ్లు అమ్మితే మహా పాతకం  అనేవాళ్ళు.

మల్ల గంట మోగింది   కైతకాల శ్రీకృష్ణుడు పడుకొని వగల నిద్ర లేచి గొంతు ఎత్తుకొని పద్యంతో అర్జునుడిని అన్ని వివరాలు అడిగాడు. అర్జునుడు” బావా నీ సహాయం కావాలెనని “అడిగిండు. తర్వాత దుర్యోధనుడుని చూసి బావా మీరు ఎటు వచ్చితిరి అని ఇంకో పద్యం ఎత్తుకున్నాడు కృష్ణుడు. ఆయన అట్లనే సహాయం కోరిండు.

కృష్ణుడు మల్ల పద్యం అందుకొని ముందు అర్జునున్ని చూసిన అటుపిమ్మట నిన్ను చూశాను. అందుకని అర్జునుడిని ముందుగా ఏం సహాయం కావాలనో కోరుకో అన్నాడు. నువ్వు మా వైపు ఉంటే చాలు సవ్యసాచి జవాబు ఇచ్చిండు .  ఈ  స్త్రీ లోలుని  ఒక్కనితో  ఏమైతదని
సరే మిగతా సైన్యం బలగాలు అన్నీ ఇవ్వమని దుర్యోధనుడు అర్థించాడు. కృష్ణుడు జాతకాలు చూసి చెప్పుట్ల మషూర్ కదా సరే అలాగే కానివ్వండి అని ముసి ముసి గా నవ్వుకున్నాడు.

మూడో రీలు అయిపోయింది నాలుగో రీలు వేయడానికి కొంచెం ఆలస్యమైంది. గంతే  “ఓరి వారీ అరేయ్ కట్ చేసేవురో “అంటూ పెడబొబ్బలు పెట్టారు.

ధర్మరాజు తరపున మధ్యవర్తిగా పొమ్మని రాజ్యంలో సగభాగం ఇవ్వమని లేకుంటే మా పిన తండ్రి దృతరాష్ట్రున్ని కమస్కం మా ఐదుగురికి  ఐదు ఊర్లైనా ఇమ్మని కృష్ణుడికి చెప్పి రాయబారానికి పంపుతడు.

మాయలోడు కృష్ణుడు మస్తు ఇకమతులు ఉన్నోడు నవ్వుకుంటా పోయిండు.  కౌరవ సభలో వచ్చిన పని పద్యాలలో వివరించిండు. వాళ్లు వింటారా ముందే జిద్దుగాడు దుర్యోధన యువరాజు అసలే ఒక్క ఊరు ఇచ్చేది లేదని కరాకండిగా చెప్పిండు.. కృష్ణుడు  ముందు జరగబోయే యుద్ధంలో ఏమేమి జరుగుతుందో అంజనం చూసి లైవ్ గా చెప్పినట్టు చెప్తూ విశ్వరూపం చూపించాడు.. సభలోని అందరూ లేచి నమస్కారం  చేసిండ్రు. ప్రేక్షకులు కూడా కృష్ణ పరమాత్మకు కూర్చున్న వద్ద నుంచే  రెండు చేతులా  జోడించి మొక్కిండ్రు.ఇంతటితో  సినిమా శుభం సమాప్తం అని పడ్డది.

మా నాయనమ్మ తినుడు మొత్తం అయిపోయింది. కట్టుకొచ్చిన పాత బట్టను అక్కడనే పారేసింది. మా అమ్మ చిన్నమ్మలు అందరం బయటకు వచ్చినంక,  నాయనమ్మ అందరూ వచ్చినరో లేదో చూసుకొంది. వాగు దిక్కు నడిచాము.

కరెంటు ఎలుగులకు వాగుల పారుతున్న నీళ్లు అద్దం లెక్క మెరుస్తున్నాయి. అనుమానం వచ్చి పెద్ద కోడలుతో  “అవ్ సుశీలా వాగు ఎక్కువైనట్టు ఉంది కదానే” అడిగింది. మా అమ్మ “చూస్తే గట్లనే కనపడుతుంది అత్తా” అంది. మా నాయనమ్మ “అందరు గోసులు పెట్టుకోండ్రే” అన్నది. నాయనమ్మ నన్ను ఎత్తుకొని గట్టిగా పట్టుకోమని,నలుగురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని జట్టుగా వాగులకు దిగిండ్రు. వాగు మెల్లమెల్లగా మోకాలు దాటి , నడిమిట్లకి పోయేసరికి తొడలదాకా వచ్చింది. మా నాయనమ్మ మెడను గట్టిగా పట్టుకున్నా మా అమ్మ నిద్ర పోతున్న చెల్లెను ఒల్లె చేసి బిగిచ్చి కట్టుకుంది.  నాయనమ్మ ఇక నీళ్ల దార ఎట్లెట్లా పెరుగుతుంటే అట్లట్ల చీరను  పైకి జరుపుకుంటా ఎలా తగ్గుతుంపటే అలా కిందికి జారవిడిచింది .ఎట్లయితేంది తొడల వంటి వాగు దాటినాము.. ఎత్తుగడ్డ ఎక్కిన తర్వాత “అరేయ్ పోడా నిద్రపోతున్నావురా బరువైతున్నవ్”  అని దించి నడిపించింది.

మా పెద్ద మనవరాలు హనీ షేమ్ షేమ్ అంది. ముగ్గురు మరువరాళ్లు చేతితో నోరు మూసుకున్నారు. “మీ నాయనమ్మ వాళ్లూ చెడ్డీలు వేసుకోలేదా ” నడిపి మనవరాలు  వినూత్న ప్రశ్నించింది. చిన్న మనవరాలు వినమ్ర నోరు అట్లే మూసి పెద్దగా గలగల నవ్వుతుంది.

సగం పొడిచిన చంద్రుని ఎన్నీల కు మా ఊరు దూరంగా కనబడీ కనబడుతుంది. ఇంటికి చేరాలని జెప్పజెప్ప పెద్ద పెద్ద అడుగులతో నడుస్తున్నాము.

*

జూకంటి జగన్నాథం

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఒక వయసు మళ్ళిన స్త్రీ, నాయనమ్మ ను కథానాయిక ను చేసి కథంతా ఆమె భుజస్కంధాలపై నడిపారు రచయిత. ఆరోజుల్లో సినిమా చూడడానికి తతంగం, హాల్లో సంరంభం ఇప్పటి తరానికి ఆశ్చర్యం గా ఉండవచ్చు. కానీ నాయనమ్మ ధైర్యం, సమయస్పూర్తి, ముఖ్యంగా లీడర్ షిప్ క్వాలిటీ లను ఆమూలాగ్రం వివరించారు.
    మాండలికంలో చెప్పిన భారతకథలో జీవం తొణికిసలాడింది. కొన్ని పదాలు తెలీకపోయినా సందర్భం బట్టి అర్ధం చేసుకోవచ్చు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు