ఇదే ఏడు ‘కలవరాలు – కలరవాలు’ అని నాగలక్ష్మిగారొక కవితా సంపుటి ప్రచురించారు. ఆ పుస్తకం మొదట చదివాన్నేను. ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ ‘శిశిర సుమాలు’ కథల సంపుటి చేతికందింది. రెండు మూడు ప్రక్రియల్లో నిష్ణాతులైన సృజనకారుల్ని చూస్తే మాటల్లో చెప్పలేని ఆశ్చర్యం కలుగుతుంది. వీళ్ళెంత ప్రతిభావంతులో కదా అని అనుకోకుండా ఉండలేము.
నాగలక్ష్మి గారి కథలు, కవితలు ఆమె బహుముఖ ప్రతిభకు అద్దం పడతాయి. అందులోనూ కథల పాత్రలన్నీ ఆమె సునిశిత పరిశీలనకు తార్కాణంలా ఉంటాయి. అబ్బూరి ఛాయాదేవి గారు సంకలన బాధ్యత వహించిన ‘20 వ శతాబ్దంలో తెలుగు రచయిత్రుల రచనలు’ పుస్తకంలో – స్త్రీల రచనల్లో అభివ్యక్తమయ్యే ప్రత్యేక దృష్టి కోణాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశ్యంతో ఈ సంకలనం రూపొందించాము. స్త్రీలు స్వయంగా రాసిన వాటిల్లో అనుభూతి సాంద్రత, నిజాయితీ ఇటువంటి సంకలనాల నుంచి తెలుసుకోవడానికి వీలవుతుంది. అని అంటారు.
ఒక్కసారిగా ఇప్పుడు రాస్తున్న కథా రచయిత్రులందరూ కళ్ళ ముందు మెదిలారు. ఎండపల్లి భారతి, మానస ఎండ్లూరి, స్వాతి, అపర్ణ తోట, కల్పనా రెంటాల, నూతక్కి, విజయా బండారు ఇంకా చాలా మంది గుర్తుకొచ్చారు. అచ్చమాంబ, ఇల్లిందల సరస్వతి, సత్యవతీ మొదలు నేటి వరకూ కథా రచయుత్రులు ఎప్పుడూ తమదైన చూపుతో కథలు రాస్తూనే ఉన్నారు. వాటిల్లో స్వయంసిద్ద, వియ్యుక్క వంటి విభిన్నమైన కథా సంకలనాలూ ఉన్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కొక దృక్కోణము. ఒక్కో శైలి. ఒక్కో జీవన దృశ్యావిష్కరణ. స్త్రీవాద చైతన్యంతో పితృస్వామ్య మూలాలను ప్రశ్నించేవారు, విప్లవ శిబిరాల్లో స్త్రీల పోరాటాల గురించి; లేదా ఫక్తు (ఉన్నతశ్రేణి) మధ్యతరగతి ఎత్తు పల్లాలను, వాటిలోని సుఖ దు:ఖాలను, సంతోష వైరాగ్యాలను చిత్రించేవి కొన్ని. వారణాసి నాగలక్ష్మి గారి కథలన్నీ ఆ చివరి కోవ లోనివి. అమ్మా-నాన్న; అత్తా కోడలు; తాతా-మనవడు; ఒక పనమ్మాయి, లేదా బ్యూటీషియన్– ఇలా ఒక స్త్రీ తన రోజువారీ కుటుంబ వాతావరణంలోంచి విభిన్నమైన కథల్ని అల్లుకున్న వ్యవహారం మనకి ఎక్కువగా ఈ కథల్లో కనిపిస్తుంది.
మొత్తం 14 కథలు. శిశిరంలో విరిసిన కుసుమం – భర్త రంగారావు పోయాక ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోయిన కుసుమ భావోద్వేగాల కథ. కొడుకు కోడలు నిర్లక్ష్యం చేత కూతురు రమ దగ్గరే ఉండాల్సిరావడం ఆమెకి నచ్చదు. లోకం ఏమనుకుంటుదో అని బెంగటిల్లుతుంది. అయితే తన మనుమడు (కూతురు కొడుకు) ఆనంద్ కీ తనకీ మధ్య జరిగే సంభాషణలు ఆసక్తిగా ఉంటాయి. అతని ప్రేమ, శిశిరతో పెళ్ళి విషయాల్లో కుసుమ కలగజేసుకోవడం, ఆనక ఆ మనుమరాలితో తన వొంటరితనాన్ని మర్చిపోవడం కథా గమనం. కొడుకుల దగ్గరే తల్లిదండ్రులు ఉండాల్సిన అవసరం లేదు, కూతుళ్ళదగ్గరా ఉండవచ్చు అని చెబుతుందీ కథ.
‘కలువ కొలనులో వెన్నెల’ కథ కూడా ఒక తాతామనవడి చుట్టూ తిరుగుతుంది. తీరిక లేని నగరపు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో కొట్టుమిట్టాడే యువ జంట (ప్రకాశ్ – కుసుమ) పల్లెటూళ్ళో తాతయ్యకి పది రోజులు తోడుంటారు. అక్కడి వాతావరణం, మనుషులూ వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని బలిష్టం చేస్తాయి. ప్రకాశ్ ప్రేమ కొద్దీ లక్ష రూపాయల్లో ఏదన్నా కొనుక్కోమని తాతకి చెబుతాడు. ఆ సొమ్ముని ఫిక్సెడ్ వేసి నెల నెలా తన దగ్గర పని చేసే ముసలయ్యకి ఆర్థిక సాయం చేద్దామంటాడు తాతగారు. తొలుత కేవలం ఒక స్వరూపం గా కనిపించే భర్త ప్రకాశ్ పుట్టిన ఊరు, పిదప తన భార్యకీ అనుబంధంగా అల్లుకోవడం అసలు కథ. ఇది కూడా ఇంట్లో పెద్దవాళ్ళ పట్ల పిల్లలు చూపాల్సిన ప్రేమా గౌరవాల్ని తెలియజేస్తుంది. ‘పూలపల్లి విత్తనాలు’ కథ ఒక అన్నా-చెల్లెలు మధ్య తన తండ్రి మరణానంతరం దక్కే ఆస్థి గురించిన ఆలోచనలతో సాగే కథ. నాకు వద్దు బాబాయ్ కిచ్చేద్దాం అంటాడు అన్న కిషోర్. నా భర్త వ్యాపారం ఇబ్బందుల్లో పడింది, నాకు ఆ ఆస్థిలో వాటా ఉపయోగిస్తుందంటుంది చెల్లెలు సుజాత. బాబాయ్ సంవత్సరీకాలకు సొంత ఊరు వెళ్ళి అక్కడ బాబాయ్ ఇద్దరాడపిల్లల పెళ్ళి విషయాల దాకా నడిచే కథ. కుటుంబాల్లో ఉండాల్సిన ప్రేమాభిమానాలు, వాత్సల్యాల ప్రస్తావన వానలా ముద్ద ముద్ద చేసి తడుపుతుంది. స్వార్థం, స్వలాభాలు దాటి అయినవాళ్ళని గుండెలకి హత్తుకోవడంలో ఉన్న తాదాత్మ్యత తెలిసివచ్చే కథ. ముందు తరాల ఔదార్యాన్ని, సంస్కారం, ప్రేమల్ని, అపేక్షల్ని విత్తనాల్లా గుండెల్లో నాటుకోవాలని చాటుదుందీ కథ. ఇళ్ళూ పొలాలూ మాత్రమే ఆస్తులు కావు తల్లీ, నైతికతా, తనకున్నది నలుగురితో పంచుకుతినే అలవాటూ మనం పిల్లలకిచ్చే ఆస్తులు’ అంటుందొక పాత్ర. గ్రామీణ కుటుంబ వాతావరణం, సేంద్రీయ పంటల విలువ, నవతరంలో వ్యవసాయం పట్ల ఆసక్తి ఈ కథలో కనిపిస్తాయి. అత్తగారి పట్ల కోడలి ప్రేమ తెలిపే కథ ఓ మూగ మనసా కథ. కథల్లో కొంత సందేశ లక్షణం ఉంది.
నాగలక్ష్మి గారిలో మనుషుల మధ్య కావల్సిన దగ్గరితనం పట్ల విపరీతమైన ఆదరువు ఉంది. అది తన ఇంటికి పెడీక్యూర్ చేయడానికి వచ్చిన ‘సుమాళి’ దగ్గర నుంచి ‘నామోషీ’ కథలో పని మనిషి ముత్యాలు వరకూ చూపెట్టకుండా ఉండలేనితనం తెలుస్తుంది మనకి. సుమాళి కథలో బ్యూటీషియన్ కూతురు, కథ చెబుతున్న సంధ్య సుద్దులు విని జీవితాన్ని బాగు చేసుకుంటుంది. ఇంకో కథలో ముత్యాలు మాత్రం తన పిల్ల ఇస్కూల్లో ‘ఇండ్లల్లో పని మనిషంటే దోస్తులు ఏడిపిస్తరంట’ నేను మీ ఇంట్లో పనికి ఇంక రాను అని చెప్పడంతో ముగుస్తుంది. రోజువారీ జీవితాల్లో ఎవర్ని ఎవరం ఎలా ప్రభావితం చేయగలుగుతాం, చేయలేకపోతాం అని మనకు మనమే ఆలోచనలో పడే కథలు. ఇంతకీ ఆ ప్రభావాల విలువ ఎంత ?
ఈ పుస్తకంలో భూపాలం, ఇరుగూ పొరుగూ, చుట్టుకునే బంధాలు, వృద్ధ పురుష:, కథలు అత్యంత మేలిమి కథలు. రేపటి వెలుగు స్త్రీ సమస్యల్ని వైవిధ్యంగా చూపిన కథ. ఇందులో కథనం కాస్త నెమ్మది. మన బ్రతుకు మనమే కాదు ‘ఇరుగూ పొరుగూ’ కూడా ముఖ్యం అని చెప్పిన కథలో ఒక జంట గోవా బీచ్ లో గడిపిన కాలాన్ని అద్భుతంగా వర్ణిస్తుంది రచయిత్రి. వొళ్ళు పులకింపజేసిన శైలి ఉందీ కథలో. అంతే గంభీరంగా కథ చివర్న పొరిగింటి వారి మంచితనానికి సిగ్గుపడిపోయే క్షణాల్ని కూడా చక్కగా రాస్తారు నాగలక్ష్మి. కదిలిపోతాం. మనల్ని మనం తడుముకుంటాం.
భూపాలం కథలో కూడా స్త్రీకి కావల్సిన మనో ధైర్యం ఉంటుంది. శారీక దురాక్రమణకీ మానసిక హింసకీ స్త్రీలు ఎలా తట్టుకుని నిలబడాలో చెప్పే కథ.
వృద్దనారీ పతివ్రత: వంటి వాటిని నాగలక్ష్మి వ్యతిరేకిస్తుంది. వృద్ధ పురుషా భార్యానుకూల: అనమంటుంది. స్త్రీలను కించపరిచే సామెతల్ని వాడుకలోంచి తోసేయ్యాలంటుంది. ఈ కథలో నాగలక్ష్మి కొంటెదనం శిఖరాయమానం. ఎంత వ్యంగ్యమో ? చెప్పనలవి కాదు. మృణాళిని గారు అన్నట్టు ఇలాంటివి సూదంటురాళ్ళవంటి కథలు ఆమె మరిన్ని వ్రాయాలి. చుట్టుకునే బంధాలు కథలో పిల్లల ఆజ్ఞల్ని ధిక్కరించే ఒక అమ్మ గడుసుదనం అబ్బురపరుస్తుంది. పొరుగింటి మీనాక్షమ్మని కథలో ఉడుకుమోతు లావు పాత్ర గురించి చెప్పడం కాదు చదివి తీరాల్సిందే.
మొత్తానికీ కథలన్నీ మన కథలు. మన చుట్టూ ఉండే మనుషుల రోజువారీ ప్రయాణాలు. వీటినింత గొప్పగా చిత్రించేంత కథాంశాలా ఇవి ? అనిపిస్తుంది. కానీ అసలు కథాంశం ఎలా రూపుదిద్దుకుంటుంది ? జీవిత పరిశీలనలోంచి. ఏపుగా పెరుగుతున్న పూల తీగెను తగినంత కత్తిరించడం (Pruning) లోంచి. భయం వల్లో జాగ్రత్త వల్లో మూసుక్కూర్చున్న తలుపుల వెనుక నుంచి. పువ్వుల్లా విచ్చుకుని, అంతలోనే ముడుచుకుపోయే మానవసంబంధాల్లోంచి. విశాల హృదయంలోంచి. ఉన్నతమైన ఆదర్శం లోంచి. నాగలక్ష్మి గారు ఆధునిక సామాన్య జీవితం ఎన్ని ఒడిదుడుకులకి గురవుతున్నదో, అందులో స్త్రీ ఎంత నలిగిపోతున్నదో, ఎటువంటి ఒత్తిడులను భరిస్తున్నదో కథలుగా మలిచారు. వీటిల్లో కాన్వాసు పెద్ద పెద్ద సామాజిక సమస్యలను నిర్వహించడకన్నా సూక్ష్మ స్థాయిలో మనిషి భావోద్వేగాల ప్రవర్తన, స్వభావ నియంత్రణ, కుటుంబ జీవన విధ్వంసం, తదనంతర ప్రభావం– అన్నింటినీ రచయిత్రి సున్నితంగా నిర్వహించారు. ఆమె కథాలోకం పెద్దది కాదు, అనిపిస్తుంది గానీ ప్రతి చిన్నవిషయం పట్లా ఆమె పట్టింపు పెద్దది. ఎక్కువగా సాధారణ మనస్తత్వ చిత్రణకి పరిమితం కావడం కనిపిస్తుంది, మరింత సమస్యల మూలాల్లోకి వెళితే బాగుండేది. చాలావరకూ పాత్రల మధ్య ఘర్షణ తక్కువ. ఒక సాఫీదనం చూస్తాము. శైలి వివరణాత్మకంగా ఉంటుంది. పాత్రల పేర్లు ఉన్నట్టుండి ఠక్కున ప్రవేశిస్తాయి. పాఠకుడు జాగ్రత్త పడవలసిన స్థితి ఉంది. చదివించే శైలే ఈ పుస్తకానికి ముఖ్యమైన ఆకర్షణ.
గతంలో మూడు కథా సంపుటాలు ప్రచురించిన నాగలక్ష్మిగారికి కథ ఎలా రాయాలో ఎవరూ చెప్పనక్కర్లేదు. అయితే తన కథ ఏ పాఠకులకు పరిమితమైపోతున్నదో, వస్తుపరంగా తానెంత పరివ్యాప్తం చెందవలసి ఉందో కొంత గ్రహింపు తప్పనిసరి. ఆమె అందమైన బొమ్మలు కూడా వేస్తారు. వర్ణ సమ్మేళం బాగా తెలుసు. ఆమె ఒక్కో కథా ఒక్కో పొందికైన బొమ్మ కూడా.
శిశిర సుమాలు (కథలు) : వారణాసి నాగలక్ష్మి, పేజీలు: 162, ప్రతులకు: అన్వీక్షికి ప్రచురణలు 9705972222, 9849888773
శ్రీరామ్! థాంక్యూ, శిశిర సుమాలు కథాసంపుటి చదివి ఇంత చక్కని విశ్లేషణ, విమర్శ అందించినందుకు! మీ సూచనలు కూడా చాలా apt గా ఉన్నాయి. అనేక ధన్యవాదాలు! Pleasantly surprised to find this write up 😍