Let’s Recaste the Caste!

మధ్యప్రదేశ్ ఘటన దేశాన్నంతా కుదిపేసింది. తెలుగు కవులంతా ఆ విషాదానికి చలించి స్పందించారు. ఆ స్పందనలను ఒక్కచోట చేర్చి తన సంపాదకత్వంలో ఒక సంకలనంగా తేవడం ద్వారా తన ఆగ్రహాన్ని ప్రకటించాలనుకున్నారు కవయిత్రి మెర్సీ మార్గరెట్. ‘ ఉచ్చల జలధి తరంగా ‘ పేరుతో త్వరలో రాబోతున్న ఆ కవితా సంకలనానికి కవి, విమర్శకుడు ప్రసేన్ ముందుమాట రాసారు. మతమార్పిడికి చట్టబద్ధంగా అవకాశం ఉన్నట్టే కులమార్పిడికి ఎందుకు అవకాశం ఉండకూడదు? అనే ఒక కొత్త ప్రతిపాదన చేస్తున్న ఆ ముందుమాట ఇక్కడ ఇస్తున్నాం.

*

త మార్పిడికి చట్టబద్దత ఉన్నట్టు కుల మార్పిడికి ఎందుకు లేదు?!

మతం మారినట్టు ఎవరైనా కులం ఎందుకు మారకూడదు?!

వితిన్ ది కాస్ట్ వివాహాలను చట్టం రద్దు చేయొచ్చు కదా.

ఏ కులం వాళ్లు అదే కులంతో వివాహ సంబంధాలు కుదుర్చుకోవడం నేరం అని ఒక బిల్ పాస్ చేయొచ్చు కదా.
కుల నిర్మూలన గురించి ఆలోచించే క్రమంలో బహుశా ఎవరికైనా లోలోపల ఇలాంటి ఘర్షణే నలుగుతుందేమో. ఇవి కొంచె అవుటాఫ్ ది బాక్స్ గా ఉన్నాయా. వీటి సాధ్యాసాధ్యాల లోతూ వైశాల్యమూ ఎంతో మరి. అసలు కుల నిర్మూలన గురించి పరిష్కారాలు వెతికే విధానం ఇది కాకపోవచ్చేమో కూడా. అయినా మధ్యప్రదేశ్ మూత్ర దాష్టీకానికీ మణిపూర్ నగ్న దౌర్జన్యానికీ వెరశి యుగ యుగాలుగా జరుగుతున్న అమానుషాలకు ఏదో ఒక విరుగుడు జరగాలి కదా.

కులాంతర వివాహాల వల్ల మరో వర్గం ఏర్పడుతుంది, అది కొత్త సమస్యలను సృష్టిస్తుంది అనే వాదన కూడా నిజం కావచ్చు. కుల మార్పిడిని చట్టబద్దం చేసినా సమాజం దాన్ని ఆమోదించదు, వరకట్న నిర్మూలన చట్టం బాలకార్మిక నిర్మూలన చట్టంలాగా అది కూడా అపహాస్యం అవుతుంది అనే వాదన కూడా నిజమే కావచ్చు. అయినా సరే కులమార్పిడి వల్ల ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. వితిన్ ది కాస్ట్ వివాహాలను రద్దు చేస్తే కూడా కొంత ఫలితం ఉండవచ్చు. అంబేద్కర్ కూడా కులాంతర వివాహాలను కులానిర్మూలనకు ఒక పరిష్కారంగా నే భావించాడు కదా…సరే ఏది ఎలా ఉన్నా కుల నిర్మూలన వైపు ఒక ప్రయాణమైతే మొదటి అడుగుగా మొదలవుతుంది కదా అని, ఆ తరవాత ఆ దారిని మరమ్మత్తు చేసుకోవచ్చు, లేదూ నడకంటూ మొదలైంది కనుక దారి మార్చుకోవచ్చు లేదా కొత్త దారి నిర్మించుకోవచ్చు కదా అని కూడా ఉటోపియన్ గా ఆశ పడడమే ఇప్పుడు ఎవరమైనా చేయగలిగింది.

‘కులమతాల గీతల జొచ్చి పంజరాన గట్టువడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన, నాకు తిరుగులేదు విశ్వనరుడ నేను ’ అని అనుకోవడం కేవలం నినాద సౌందర్యమే కాదా. అది అనుభవంలో కూడా కల మాత్రమే కాదా. ఈ ఆలోచనలకూ ఈ నమ్మకాలకూ బలమిచ్చే సంఘటనలు భారతదేశంలో క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో పెద్ద దూరం కానీ వ్యవధి కానీ అంతరం కానీ ఎప్పుడూ లేకపోవడం బహుశా ఇటువంటి ఆలోచనల వెనుక ఉన్న అసలైన విషాదం కావచ్చు.

ఇదిగో ఇప్పుడు కూడా అదే. ఆ వరుసలోనే మధ్యప్రదేశ్ లో ఒక అభిజాత్యుడు ఒకానొక ఆదివాసీ పై మూత్రం పోసాడన్న సంఘటన. అదే అదే పదే పదే.

ఇప్పుడిక్కడ మధ్య ప్రదేశ్ మూత్ర విసర్జన గురించి మాట్లాడడమంటే కేవలం ఆ సంఘటన గురించి మాత్రమే మాట్లాడడం కాదు. ఒక అవ్యవస్ధ గురించి మాట్లాడడం. కులం గురించీ, దాని వైపరీత్యంతో పాటు మతం గురించీ వాటికి వత్తాసు పలికే వర్గం గురించీ మొత్తంగా అవమానవీయ హింస గురించీ సిగ్గువిడిచిన దౌర్జన్యం గురించీ మాట్లాడడం.

ఇది కొత్తేమీ కాదు. దూరం పెడతారు. దేవుడినీ దూరం చేస్తారు. చెప్పులు చేతబట్టి నడిపిస్తారు. ఉమ్మిని మెడముంతలోనే దాచుకొమ్మంటారు. నడుముకు తాటాకులు కడతారు. నగ్నం చేస్తారు. చెప్పులు నాకిస్తారు. ఉచ్చలు తాగిస్తారు. మలం తినిపిస్తారు. నీటి బావులను పరాయిగా మారుస్తారు. అత్యాచారాలు చేస్తారు. చెరువులనుంచి వెలి వేస్తారు. స్మశానాలలో కూడా గీతలు గీస్తారు. శవాన్ని కూడ అవమానిస్తారు. ఇంకా చాలా చాలా చేస్తారు. ఇదేదో ఇప్పుడే మొదటి సారి జరిగిందీ కాదు. తొట్ట తొలిసారి అనుభవానికి వచ్చిన విచిత్రమూ కాదు. దాని రూపం వేరుగా ఉండొచ్చు. దాని నిర్మాణం మరో రకంగా ఉండొచ్చు. కానీ అన్నింటి వెనుకా ఉన్నది ఒకటే.

అహంకారం. అభిజాత్యం. నువు నాకంటే చాలా ఎక్కువ తక్కువ, నేను నీకంటే చాలా ఎక్కువ ఎక్కువ అనే భావజాలం. వెరశి అవమానం. ‘చరిత్ర కోరలు నా రక్తంతో ఎరుపెక్కాయి నా కాలు సోకని గర్భగుళ్లు గొడ్రాళ్లయాయి’ అన్న ధిక్కార కవితాత్మ కూడా ఈ హింసావరణంలో నినాద సౌందర్యమే.

అవమానం నాలుగక్షరాల మాట. అదొక చాతుర్వర్ణమాల. అవమానం సమాజ వ్యక్తిత్వ సూచన. ఆ సూచన కులంలోంచి వచ్చింది కాదు అది మతం నుంచి పుట్టింది, అది ఆచారంవల్ల పెరిగింది కాదు వర్గం వల్ల బలపడింది అని
ఎవరైనా అనొచ్చు. అసలు కుల వ్యవస్థకు మతం కాదు, ముఖ్యంగా హిందూ మతం కారణం కానే కాదు దాని వెనుక
భూస్వామ్య పెత్తందారీ అగ్రవర్ణ వ్యవస్థలున్నాయి అని కూడా ఎవరైనా అనొచ్చు. ఒక విషపూరిత చాతుర్వర్ణ వ్యవస్థను భుజాన వేసుకుని తిరిగే ఉన్మాదులెవరు. అగ్రవర్ణులే కదా. ఈ కుల వ్యవస్ధా చట్రం నుంచి పీడితులు విముక్తి పొందిన నాడు ఈ అగ్రవర్ణం వర్గంగా తన అధికారానికి అభిజాత్యానికి గౌరవానికి ప్రమాదం ముంచుకొచ్చినట్టు భావిస్తుంది. అందుకే అది కుల వ్యవస్థను కాపాడుకోవాలని బలంగా ప్రయత్నిస్తుంది. అందుకు ఎంతకైనా దిగజారుతుంది. ఆ పరిణామమే అవమానాల వరస.

ఒక సమాజంలో ఒక భావజాలం ప్రభలంగా ఉందీ అంటే అందుకు కారణాలు కూడా ఆ సమాజంలోనే ఉన్నాయని అర్దం. ఈ అవమానాలకు మూలాలు కచ్చితంగా మనలోనే ఉన్నాయన మాట. వాటిని తెలుసుకోవడం వెతుక్కోవడం అర్దం చేసుకోవడం పరిష్కరించుకోవడం మనం చేయాల్సిన పని.

‘There is strong intersection of economic, political and ideological components of the caste system in Indias historical perspective. It shows that the caste system is actually grounded in a hierarchy of land rights and political power supported by religious and secular ideology. While the mainstream sociologists focus on ritual homogeneity and draw attention away from intra-caste inequality, thus portraying castes as internally undifferentiated, we should focus on intra-caste differentiation by locating the roots of caste in economic and political hierarchy. Based on historical–ethnographic evidence, its clear that the caste is not a creation of Hinduism and that Hinduism without caste is not utopia.’

అవునా…నిజమా?!

కులం లేని హిందూ మతం సాధ్యమేనా, అదేమీ ఊహాత్మకం కాదా. సరే కానిద్దాం. అలాగే అనుకుందాం. మతం అంతరించడం సాధ్యం కాదనుకుందాం. మతమంటే జీవన విధానం అనుకుంటున్నాం కనుక కులం అంతమై మతం ఉండిపోయినా సరే మంచిదే అనుకుందాం. ఆ తరవాతే మతాన్ని ఏం చేద్దాం అనే విషయాన్ని ప్లాన్ బి లో ఆలోచిద్దాం.

మధ్య ప్రదేశ్ దుర్మార్గాన్ని అనేక మంది కవులు రచయితలు నిరసించారు. అభ్యంతర పడ్డారు. సంఘటనకు స్పందిస్తూ అనేక మంది దేశ వ్యాప్తంగా కవిత్వం రాసారు. తెలుగులోనూ అటువంటి తక్షణ కవిత్వం వచ్చింది. దాన్ని మెర్సీ మార్గరెట్ ఒక పుస్తకంగా తీసుకొస్తూ దానికి నన్నొక ముందుమాట రాయమన్నారు.

చాలా మంది ప్రముఖ కవులే స్పందించారు. ఈ కవితల్లో బోలెడు దుఖ్కం వినపడింది. చెప్పలేనంత విషాదం కనపడింది. ఉండాల్సినంత ధిక్కారమూ ఉంది. గుండెడు కోపం ఉంది. పిడికెడు తపనా ఉంది. అందరూ ఒక మార్పును కోరుకుంటున్న దృశ్యం తనను తాను స్పష్టంగా కవితల్లో ఆవిష్కరించుకుంది. నిస్సందేహంగా ఇది ఒక మంచి కవితా సంకలనం.

అయితే కవిత్వంలో తక్షణ స్పందనలను రెండు కోణాలలో చూడాలి. ఒకటి స్పందనావసరం. రెండు స్పందన లోపలి కవిత్వం. నిజానికి తక్షణ స్పందనా కవిత్వంలో కవిత్వాన్ని ఆశించడం దురాశే. తక్షణ స్పందన ఒక ఆవేశ ప్రకటన. ఒక సామూహిక ఉద్వేగ సంతకం. ఒక భావజాల జిగ్ జాగ్ ఊరేగింపు. ఒక గద్గద నిరసన నినాదం . చాలా సందర్బాలలో తక్షణ స్పందనలలో జీవం ఉండదు నిజమే . మొక్కుబడికి రాసినట్టుంటాయి నిజమే. వచనం కంటే తేలిక స్ధాయి కవిత్వం ఉంటుంది నిజమే . అందుకు కారణాలు ఏవైనా కావచ్చు. ఆ తక్షణ స్పందనల ప్రభావం కచ్చితంగా బలమైనదే. వాటి వల్ల సమాజానికి ప్రయోజనమే. అవి మార్గదర్శకాలు కూడా.  దారి చెపుతాయి. గమ్యం చూపుతాయి. కార్యాచరణకు మానిఫెస్టోనిస్తాయి.

ఇప్పుడూ అదే జరిగింది. మధ్య ప్రదేశ్ ఘటనను కేంద్రంగా తీసుకుని కవులు తక్షణ స్పందనే అయినా మంచి కవిత్వం రాసారు. ఆశ్చర్యంగా చాలా మంది కవుల ఆలోచనలు ఒక్కలాగానే ఉన్నాయి. అనేక మంది కవుల నిరసనలో, ఆగ్రహంలో ఒక సారూప్యత కనపడింది. చాలా మంది జాతీయ గీతంలోని ప్రతీకను, పదబందాన్ని అన్వయించి బుసలు కొట్టారు. కవితలకు ఇచ్చిన శీర్షికలలో కూడా ఆ సారూప్యత కనపడింది. ఉచ్చ నీచం, ఉచ్చల జలధి తరంగా, ఇచ్చట మూత్రము పోయరాదువంటి ప్రతీకలనో పదజాలాన్నో కవులంతా ఒకరికి తెలియకుండా ఒకరు ప్రకటించారు. జరిగే
అన్యాయాల పట్ల అవమానుషాల పట్ల కవులలో సంఘీభావం ఉందన్న విషయం ఈ సంకలనం రుజువు చేస్తుంది.

ఇదే సందర్బంలో మరో విషయం కూడా మాట్లాడుకోవాలి. మధ్య ప్రదేశ్ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మణిపూర్ లో
ఇద్దరు మహిళలను అగ్ర తెగలు నగ్నంగా ఊరేగించిన ఘటన కూడా జరిగింది. ఈ సంఘటన పట్ల కూడా దేశ
వ్యాప్తంగానూ తెలుగులోనూ కవులు ధర్మాగ్రహం ప్రకటించారు. . చాలా కోప కవిత్వం వచ్చింది. మణిపూర్ ఘటన
నేపథ్యంలో మధ్య ప్రదేశ్ విషాదం వెనుకబడిపోయినట్టు అనిపించింది. కానీ అది వాస్తవం కాదు. ఘటన మధ్య ప్రదేశ్ దైనా
మణిపూర్ దైనా మూత్ర విసర్జన అయినా నగ్న ఊరేగింపయినా అదే అవమానం. అదే అభిజాత్యం. అదే అహంకారం.
అదే పెత్తందారీ భూస్వామ్య బలుపు. కవులు మధ్య ప్రదేశ్ ను మరిచి పోయారనీ మణిపూర్ లో తాజా మకాం పెట్టారనీ
అనుకోవడానికి వీలు లేదు. మధ్య ప్రదేశ్ కవితకు మణిపూర్ కవిత పొడిగింపు మాత్రమే. రెండింటి సారం ఒక్కటే. మధ్య ప్రదేశ్ ఘటన తరవాత మణిపూర్ సంఘటన జరిగినప్పటికీ యూరినేషన్ పై నిరసనతో రాసిన కవిత్వం కూడా మణిపూర్ ఘటనకూ వర్తిస్తుందన్నది నిజం. అంతే కాదు నిజం చెప్పాలంటే అప్పుడెప్పుడో జాషువా నుంచి ఇప్పుడు మెర్సీ దాకా ఈ కవులందరూ రాస్తున్నది ఒకే ఒక దీర్ఘ కవిత. అందరూ రాస్తున్నది ఒకే సారాన్ని నింపుకున్న గొలుసు కవిత. జాషువా నుంచి ఇవాల్టి దాకా అందరు కవులూ ఆశిస్తున్న లక్ష్యం ఒకటే. కంటున్న కల ఒకటే. అది నెరవేర్చుకునే కార్యాచరణే ఇటువంటి సంకలనాలు. ఈ సంకలనంలో అగ్రవర్ణ కవులు రాసిన కవిత్వమూ వుంది. లక్షణంగా చూస్తే అది కూడా బహుజన కవిత్వమే.

కుల మార్పిడి చట్టం వచ్చినా రాకున్నా, వితిన్ ది కాస్ట్ వివాహాలు చట్టబద్దంగా రద్దయినా కాకున్నాఏదో ఒకటి జరగాలి. ఒక అడుగైతే పడాల్సిన సమయం ఇది. కొన్ని అడుగులు ఇప్పటికే పడ్డాయని ఎవరైనా అంటే అది పూర్తిగా అబద్దం. ఒక విస్ఫోటనం సంభవించాలి. ఒక అతి పెద్ద మార్పు జరగాలి. కొన్ని సమస్యలుండొచ్చు. కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. కుల నిర్మూలన పూర్తిగా జరగకపోవచ్చు. అందులోంచే ఏదో ఒక పరిష్కారం పుట్టకపోదు.

భారతీయ సమాజంలో కులం ఒక రియాలిటీ, దాన్ని నిర్మూలించడం సాధ్యం కాని పని అంటారా…సరే!
రండి ఈ కవులతో కలిసి కనీసం Let’s Recaste the caste’

*

ప్రసేన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు