గొప్ప కథేం కాదు!

ఈ వారం కథ-1

కథలు ఎక్కడో కాదు మనం  రోజూ చూసే మనుషుల నుండో లేక ఎదురయ్యే పరిస్థితుల నుండో పుట్టుకొచ్చేవే, అలా వచ్చిందే ఈ కథ కూడా. ఇదేం కొత్త కథ కాదు, మన దైనందిన జీవితంలో తారసపడే వ్యక్తుల నుండి పుట్టిందే. ఆడపిల్ల ఇలా కూర్చోకూడదని అమ్మ చెప్పినపుడు ఎందుకో  తెలియని అమాయకత్వం నుండో, ఆడపిల్లకి అన్నీ తెలిసుండాలని చెప్పిన బామ్మ మాటల్లో అన్నీఅంటే ఇంటిపని, వంటపని తప్ప ఇంకేం లేవని తెలియని పిచ్చితనం నుండో, రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అని చేయని తప్పుని ఆపాదించే సమాజం నుండో, అతనంటే మగాడు ఏం చేసినా చెల్లుతుందనే వ్యవస్థ నుండో పుట్టింది ఈ కథ. నేను  చూసిన, విన్నఎందరివో  జీవితాలను జోడించి రాసిందే ఈ “గొప్పకథేంకాదు”

-లక్ష్మీ ప్రియాంక

 

పద్మావతికి చాలా రోజుల తర్వాత  నడవాలనిపించింది.

నడవడమంటే మామూలుగా నడవడం కాదు. మనది కానిదేదో వదిలేసి, దూరంగా వెళ్లిపోవాలనుకునే ఆవేశంలో పరుగులాంటి నడక నడుస్తామే –  అలా నడవాలనిపించింది.

ఆలోచన రాగానే ఇంట్లోనుంచి బయటకు నడిచింది.

ఇంటికి తాళం వేశానా? గ్యాస్ ఆఫ్ చేశానా? పాలప్యాకెట్ వెయ్యడానికి గేట్ కి ప్లాస్టిక్ కవర్ తగిలించానా? తోడుపెట్టిన పాల గిన్నెకి మూతపెట్టానా? వాషింగ్ మెషీన్లో బట్టలు తీగెల మీద ఆరేశానా? చెట్లకు నీళ్లు పోసానా? లాంటి ఎన్నో ప్రశ్నలు ఆమెకు ఆ రోజు ఎదురవ్వలేదు.

మనసులో ఒకే ఆలోచన.

నడవాలి.

ఆమె నడుస్తూనే ఉంది. కార్లు, బస్సులు, వీధి కుక్కలు, పోకిరి వెధవలు – అందరినీ, అన్నింటినీ దాటేస్తూ ఆమె నడుస్తూనే ఉంది.

గమ్యం లేకుండా అలా  నడవడం ఆమె ఎప్పుడో  అలవాటు చేసుకుంది.

ఆమె నడుస్తూంటే ప్రపంచం ముందుకు సాగుతున్నట్టే ఉంది. కానీ కాలం మాత్రం వెనక్కి తిరుగుతున్నట్టు అనిపించింది.

***

పద్మావతి పుట్టినప్పుడు ఇంట్లో సంతోషపడిన వాళ్ళు తక్కువే. మొదటి కాన్పు. మగపిల్లాడే పుడతాడని పూజారి మరీ గట్టిగా చెప్పడంతో అందరూ పుట్టబోయేది మగపిల్లాడే అని దాదాపుగా ఫిక్స్ అయిపోయారు. కానీ పుట్టింది ఆడపిల్లని తెలుసుకుని, తేరుకునేసరికి అందరిమొహాల్లో నవ్వు, మనసుల్లో ఆనందం మాయమయ్యాయి.

పద్మావతి వయసు పెరుగుతున్నకొద్దీ ఈ కథ వాళ్ళ అమ్మ చెప్పి చెప్పీ ఉండడంతో ఒక రోజు అడిగేసింది పద్మావతి – అందరి సంగతి సరే కానీ అమ్మా, నేను పుట్టినప్పుడు నువ్వైనా కనీసం సంతోషంగా ఉన్నావా?

కొన్ని విషయాల్లో ఆడవాళ్లకి సంతోషపడడం, దిగులుపడడం లాంటి హక్కులేం ఉండవని తల్లి చెప్పినప్పుడు పద్మావతికి అర్థం కాలేదు.

వాడు అలా ఏడిపిస్తే నాలుగు పీక్కుండా ఏడుస్తూ వచ్చావేరా అని తమ్ముడిని ఓదార్చిన నానమ్మే, స్కూల్లో తన  జడ పట్టుకుని లాగినందుకు క్లాస్ మేట్ సుబ్బుగాడిని చితగ్గొట్టి ఇంటికొస్తే – ఇదేం మాయరోగమే నీకు?  రాను రానూ మగరాయిడిలా తయారవుతున్నావు అన్నప్పుడు వాడికి నాకు ఉన్న తేడా ఏంటో ? అనుకుంది పద్మావతి

పద్మావతికి పన్నెండేళ్ళప్పుడు  ఒక సాయంత్రం పూట పండక్కి ఇంటికొచ్చిన మామయ్య సినిమాకని తీసుకెళ్లి ఒళ్లో కూర్చోపెట్టుకుని, ఒళ్లంతా తాకుతుంటే – పన్నెండేళ్ల పద్మావతికి అది ఇబ్బందని తెలిసినా, ఆ ఇబ్బందేంటో మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఎప్పుడూ తనకిష్టమైనా క్యాడ్బరీ చాక్లెట్లు తీసుకొచ్చి సంతోషపెట్టే మామయ్య, ఆ రోజు సినిమా హాల్లో తననలా హింసపెట్టి ఏం సంతోషం పొందాడో అర్థం కాలేదు.

సినిమా అయ్యాక స్కూటర్ మీద మామయ్యతో తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించలేదు.

మామయ్య పార్కింగ్ నుంచి స్కూటర్ తీసుకొచ్చే లోపలే ఆమె నడవడం మొదలుపెట్టింది. అలా నడుస్తూనే ఉండిపోయింది.

పద్మావతి సినిమా థియేటర్లో తప్పిపోయిందని తెలిసి ఊర్లోని బంధువులు, స్నేహితులు వెంటరాగా ఊరు నాలుగు మూలల్లో  పద్మావతి తల్లిదండ్రులు వెతికిన కారణంగా, ఊరి బయట ఉన్న చెక్ పోస్ట్ దాటుకుని వెళ్లిపోతున్న  పద్మావతిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి నాలుగు రోజుల పాటు గదిలో బంధించిన విషయం ఆమెకు  గుర్తొచ్చింది.

అసలు తనకు ఆ శిక్ష విధించాడనికి తను చేసిన తప్పేంటో ఇప్పటికీ పద్మావతికి అర్థం కాలేదు.

అసలు పద్మావతికి సినిమాలంటేనే ఇష్టముండేది కాదు. తనిష్టంతో ఆ సినిమాకి వెళ్లలేదు. వెళ్లవే మామయ్య రమ్మంటున్నాడుగా అని దగ్గరుండి ఇంట్లో వాళ్లే అతని స్కూటర్ ఎక్కించి పంపించారు. సినిమాకి రెండు టికెట్లు తీసుకున్నా, ముందు సీట్లో వాళ్ల తలలు అడ్డొస్తున్నాయని, తన వళ్లో కూర్చుని సినిమా చూడమనీ బలవంతం చేసింది మామయ్య. ఏదైనా శిక్షిస్తే మామయ్యని శిక్షించాలి కానీ, నన్నెందుకు శిక్షిస్తున్నారని ఎవరినీ అడగలేకపోయింది ఆమె. కనీసం ఏం జరిగిందని కూడా అడగలేదని బాధపడింది కూడా.

***

ఈ రోజు కూడా ఆమెకి నడవడం తనకు తాను వేసుకున్న శిక్షలానే అనిపించింది.

ఎప్పుడూ ఇంతే! నేరమొకరిది శిక్ష మరొకరికి.

ఎందుకిలా? అని తనని తానే ప్రశ్నించుకుంటూ ముందుకు నడుస్తూనే ఉంది.

ఆమె ఎంత వేగంగా నడుస్తున్నా గతకాలపు జ్ఞాపకాలు ఆమెకంటే వేగంగా ఆమె ముందు పరిగెడ్తున్నాయి. కళ్లముందు ఆడుతున్న కన్నీటి తెరలు దాటుకొచ్చి దృశ్యాల్లా కదులుతున్నాయి,

***

నువ్వు చాలా బావుంటావు పద్మావతి అని తొమ్మిదో తరగతిలో తన వెంటపడ్డాడు కిశోర్. తను సైకిలేసుకుని స్కూల్ కి వెళ్తుంటే నడుచుకుంటూ ఎదురొచ్చేవాడు. తిరిగి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తిరిగొస్తున్నప్పుడూ ఎదురొచ్చేవాడు. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగొస్తుంటే కూడా మళ్ళీ కనిపించేవాడు. అలా ప్రతి రోజూ ఎదురొస్తుంటే కొన్నాళ్లకి అతన్ని గమనించింది. నవ్వితే తిరిగి నవ్వింది. న్యూ ఇయర్ కి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి, ఐ లవ్యూ అంటే సంతోషపడింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా కిశోర్ రాసిన  ప్రేమ లేఖలు అందుకుంది. ఒక సాయంత్రం గుడి దగ్గరకు రమ్మంటే భయం భయంగానే వెళ్లింది. మసక చీకట్లో లోపలకి చేతులుపెట్టి తనెప్పుడూ తాకని ప్రదేశాలను తాకాలని కిశోర్ ప్రయత్నిస్తుంటే పక్కకు తోసేసి కోపంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఎప్పుడో అర్థరాత్రి ఇంటికి తిరిగొచ్చిన పద్మావతిని కొట్టినంత పనిచేశాడు తండ్రి.

ఆ తర్వాత నుంచి వీధిలో నడుస్తుంటే కిశోర్ తన ఫ్రెండ్స్ తో రోడ్డు మీద నిల్చుని కామెంట్స్ చేస్తుంటే ఇంకెప్పుడూ స్కూలుకెళ్లనంది. నువ్విప్పుడు చదివి పెద్ద సాధించేదేం లేదన్నారు ఇంట్లోవాళ్లు. అందుకే చెప్తున్నా, దీనికి పెళ్లి చేయండి అని నాయనమ్మ సలహా.

అప్పుడే పెళ్లి చేసుకునేంత పెద్ద తప్పు నేనేం చేశాననిపించింది పద్మావతికి.

తప్పు నీదే!

ప్రతి సారీ ఇదే మాట.

ఇంట్లో.

వీధిలో.

స్కూల్లో.

కాలేజ్ లో.

పక్కింటి వాళ్ల గాసిప్స్ లో.

తన తప్పేంటో అర్థం కాలేదు పద్మావతికి.

***

పద్మావతీ, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావ్. నిన్ను రోజూ చూసుకోడానికి నేనుండను. నువ్వు ఇలా అందరి మీదా కోపంగా ఉంటే కుదరదు. ఇప్పుడు నువ్వు పెద్దదానివవుతున్నావు. నీకూ ఒక ఇల్లుంటుంది. నీకూ ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో కొత్తవాళ్లుంటారు. కొత్త వాళ్లొస్తారు. వాళ్లందరితో కలిసిపోవాలి. అయినా ఎందుకే నీకంత కోపం. నాన్న చూడు ఎలా ఏడుస్తున్నాడో! నువ్వు కోపం తగ్గించుకుని అందరితో బావుండు. అప్పుడే మేము కూడా సంతోషంగా ఉంటాం.

పెళ్లయిన తర్వాత అత్తగారింటికి వెళ్లేముందు పద్మావతికి తల్లి చెప్పిన మాటలు.

పెళ్లి కానంతవరకూ గాల్లో పక్షిలా ఎగరాలి అని ప్రయత్నించే పద్మావతికి, ఒక్కసారిగా రెక్కలు తెగిపోయాయి. ఇక ప్రయత్నం కూడా వృధా అనుకుంది పద్మావతి.

ఉదయం లేచిన దగ్గర్నుంచీ పని.

పెళ్లయిన సంవత్సారనికే ఒక పిల్లాడు.

మరో రెండేళ్లకి మరొక పిల్లాడు.

వాళ్లిద్దర్నీ పెంచడం, పోషించడం, అత్తగారి ఆరోగ్యం, మంచాన పడ్డ మామగారు, ఎప్పుడో కానీ మాట్లాడని భర్త – ఇంకా ఎన్నో బరువులు బాధ్యతలు.

కాలం గడిచిపోతూనే ఉంది. ఎప్పుడైనా తీరిక దొరికితే చదువుకునే పుస్తకాలొక్కటే ఆమెకు ఆటవిడుపు.

రొటీన్.

జీవితం.

రొటీనే జీవితం.

నిజానికి పద్మావతికి రొటీన్ జీవితం మీద కోపం రావాలి. కానీ ఆ రొటీనే అలవాటయిపోయింది.

ఈ అలవాటవడం మొదట్లో కోపంగా ఉండేది. కోపమూ అలవాటయిపోయింది.

కోపంతో ఇళ్లంతా తిరిగేసి, సర్దిందే సర్దేసి, ఊడ్చేసి,అన్నింటినీ కడిగేసి, అలా ఇళ్లంతా నడిచెయ్యడం మరొక అలవాటయిపోయింది.

హై స్కూల్లో చేరిన పెద్ద కొడుక్కి పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాకపోతే బాధ్యత తల్లిదండ్రులదిద్దరిదీ అని లోకం చెప్పినా, ఆ బరువంతా వచ్చి ఆమె మీద పడడం పద్మావతికి గుర్తొచ్చింది.

అమ్మా, నీకు ఇవన్నీ అర్థం కావు. నీకు ఇంగ్లీష్ రాదు అని కొడుకన్న మాటతో ఆమె వెంటనే వెళ్లి ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ లో జాయినయ్యింది. ముప్ఫై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? లాంటి పుస్తకాల మీద ఆమెకు నమ్మకం లేదు. ఇప్పటికీ తెలుగులో నెంబర్ వన్ బెస్ట్ సెల్లర్ గా ఉన్న రెపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ పుస్తకం మీదా ఆమెకు నమ్మకం లేదు, కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ లో జాయినయ్యిన మొదటిరోజే, వెల్కం మిస్ పద్మ అని నవ్వుతూ క్లాసులోకి అహ్వానం పలికిన టీచర్ మీద ఆమెకు అపారమైన నమ్మకం కలిగింది.

ఆ నమ్మకాన్ని ఇంగ్లీష్ టీచర్ అవకాశమనుకున్నాడు.

ఆమెకు కొత్త పుస్తకాలిచ్చాడు. కొత్త ప్రపంచాన్ని చూపించాడు. ఒకరోజు హైదరాబాద్ మొత్తం చుట్టి చూపించాడు. తనకంటే చిన్నవాడే అయినా, తనకంటే ఎక్కువ తెలిసిన వాడని గౌరవంగా చూసేది. ఆ గౌరవాన్ని ప్రేమనుకున్నాడు.

ఐ లైక్ యూ అని ఆ ఇంగ్లీష్ టీచర్ వెంటపడినప్పుడు చాలా రోజుల తర్వాత నడుచుకుంటూ ఇంట్లోంచి వెళ్ళిపోయింది పద్మావతి.

బ్యాంక్ లో క్లర్క్ గానే పుట్టి, క్లర్క్ గానే చనిపోతాడేమో  అనిపించేలా బద్ధకాన్ని ఇంటిపేరు చేసుకున్న ఆమె భర్త సైతం ఆ రోజు ఆమె కోసం ఊరంతా తిరిగాడంటే ఆమె నమ్మలేకపోయింది.

చివరికి, బేగంపేట ఐర్ పోర్ట్లో ల్యాండవుతున్న విమానాల్ని చూస్తున్న పద్మావతిని  వెతికి పట్టుకుని ఇంటికి చేర్చిన ఇంగ్లీష్ టీచర్ కి చెప్పిన కృతజ్ఞతల్లో ఒకటో వంతైనా తనకి చెప్పని భర్త మీద కోపం రాలేదు కదా, జాలేసింది పద్మావతికి.

అసలు పద్మావతి ఇంట్లోనుంచి ఎందుకెళ్లిపోయిందో, మళ్లీ ఎందుకు తిరిగొచ్చిందో కూడా అడగలేదు ఆమె భర్త. ఎప్పటిలానే మౌనంగానే ఉండిపోయాడు. ఒక్క ప్రశ్న కూడా వెయ్యని అతనిది మంచితనం అనాలో, ఆయన గురించి తెలిసి కూడా ఆశ పడిన తనది వెర్రితనం అనుకోవాలో పద్మావతికి అర్థం కాలేదు.

పద్మావతి ఆ తర్వాత కూడా ఇంగ్లీష్ క్లాసులకెళ్లింది. ఇంగ్లీష్ టీచర్ బుద్ధిగా పాఠాలు మాత్రమే చెప్పాడు. మళ్లీ ఎప్పుడూ ఆమెతో మాట్లాడలేదు. కానీ కోర్స్ మొత్తం అయిపోయాక చివరిరోజు వెళ్తుంటే పద్మావతీ అని పిలిచాడు. అప్పటికే క్లాసులోనుంచి అందరూ వెళ్లిపోయారు. క్లాస్ రూంలో వాళ్లిద్దరు మాత్రమే ఉన్నారు. ఆమె అంతవరకూ అక్కడే ఉండడాన్ని ఆమె తనకిస్తున్న మరొక అవకాశంగా అనుకున్నాడు ఇంగ్లీష్ టీచర్.

నిజానికి ఆమె అతన్ని ఏదో అడగాలని అనుకుంది. అదీ కూడా ఇంగ్లీష్ లోనే అడగాలని అనుకుంది. కానీ మాటలు కూడటం లేదు. అందుకే ఇబ్బందిగా నిలబడింది. ఆ మాటలేవో మనసులోనుంచి బయటకు రాక అక్కడ్నుంచి కదలబోయింది.

ఆ ఇబ్బందిని ఇంకొక విధంగా అర్థం చేసుకున్నాడు ఇంగ్లీష్ టీచర్.

ఆమె చెయ్యి పట్టుకున్నాడు.

కోపమొచ్చింది పద్మావతికి.

గట్టిగా అరిచి అక్కడ్నుంచి పరిగెట్టుకుని వెళ్లిపోయింది.

ఇంగ్లీష్ బాగా రావాలంటే ఇంగ్లీష్ సినిమాలు చూడాలమ్మా అని పెద్ద కొడుకు చెప్పిన ఉపాయం పాటించాలనే చూసింది. మొదట్లో ఏమీ అర్థమయ్యేది కాదు. చూస్తూ చూస్తూ ఉండగా ఒక ఐదారేళ్లకి ఆమెకు కొంచెం కొంచెం ఇంగ్లీష్ అర్థం కాసాగింది.

ఒక రోజు HBO లో ఇంగ్లీష్ సినిమా చూస్తుంటే ఆమెకు గుర్తొచ్చింది, ఆ రోజు ఇంగ్లీష్ టీచర్ ని ఇంగ్లీష్ లో అడగాలనుకున్న మాట – వాట్ ది ఫక్ డు యూ వాంట్?

అదే! ఆ మాటే ఆమె ఆ రోజు తను అడగాలనుకుంది.

ఇంగ్లీష్ టీచర్నొక్కడినే కాదు.

ఉదయాన్నే పాలు పోసే వాడొస్తాడు. నైటీలోకి గుర్రుగా చూస్తాడు.

పిల్లల్ని ట్యూషన్ నుంచి స్కూటీ మీద ఇంటికి తీసుకొస్తుంటే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు పక్కనే ఆగిన బైక్ మీద కూర్చున్న బట్టతలవాడు గాలికి ఎగిరిన చీరచెంగు చాటున దాగిన నడుముని చూస్తాడు.

గుడిలో రష్ ఎక్కువగా ఉందని గమనించి రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతుంటాడు మరొకడు.

తనతో ఒక అవకాశం పొందాలనుకున్న ప్రతి ఒక్కడినీ నిలదీసి, వాట్ – ది – ఫక్ – డు –  యూ –  వాంట్ –  ఫ్రం –  మీ అని అడగాలనుకుంది.

ఛీ ఈ మగాళ్లంతా ఇంతేనా?

కాదు. మగాళ్లు మూడు రకాలు.

స్త్రీ కనిపిస్తే అవకాశం కోసం ఎదురుచూసే వాళ్లు మొదటి రకం. అలా ఎదురుచూడని వాళ్లు, ఆడవాళ్లని గౌరవించేవాళ్లు రెండో రకం. ఇక మూడో రకం: నా భర్త. ఇలా అనుకుని పద్మావతి చాలా సార్లు నవ్వుకునేది.

ఈ మూడు రకాల మగవాళ్లు కాకుండా నాలుగో రకం మగవాళ్లూ ఉంటారని పద్మావతికి తెలియడానికి చాలా రోజులు పట్టింది.

ఒక మధ్యాహ్నం పూట.ఇంట్లోవాళ్ళు ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయాక, వాషింగ్ మెషీన్ లో బట్టలు  ఆరెయ్యడానికి టెర్రస్ మీదకి వెళ్లింది పద్మావతి. ఇంకా సూర్యుడి ప్రతాపం మొదలవ్వలేదు. టెర్రస్ పైన్నుంచి చూస్తే ప్రపంచమంతా మాయమై, విశాలమైన ఆకాశం, దానికింద ఒంటరిగా ఆమె. ఎందుకో ఆ రోజు కొత్తగా అనిపించింది. ప్రపంచంలో తనొక్కటే ఉన్నట్టనిపించింది. ఈ ప్రపంచమంతా తనదే అనిపించింది. టెర్రెస్సంతా నడుస్తూ గోడ చివరికొచ్చి చూసింది.

ఎప్పటిలాగే జనాలు, అదే ట్రాఫిక్ గోల. మనుషులు. మగాళ్లు.

కొన్ని క్షణాల పాటు ఆమె పొందిన అనుభవం తుర్రుమని జారిపోయింది.

మనసులోనే నవ్వుకుని బకెట్ లోనుంచి బట్టలు తీసి ఆరేస్తూ, వ్వాట్ ది ఫక్ డు యూ వాంట్ ఫ్రం మీ? అని అరుస్తూ, మధ్య మధ్యలో నవ్వుకుంటూ ఎప్పటిలాగే పని చేసుకుంటోంది.

“ఎక్స్ క్యూజ్ మీ”

కంగారు పడుతూ అటూ ఇటూ చూసింది పద్మావతి.

ఎవరో పాతికేళ్ల కుర్రాడు. లిఫ్ట్ రూం దగ్గర నిలబడి ఆమెనే చూస్తున్నాడు.

పద్మావతికి కోపమొచ్చిందో, భయమేసిందో, కంగారుపడిందో తెలియదు. అదేదో కొత్త ఫీలింగ్. అప్పటికప్పుడు అక్కడ్నుంచి పారిపోవాలన్న ఫీలింగ్.

అతనలాగే చూస్తూ ఉంటే, వాట్ ది ఫక్ డు యూ వాంట్ ఫ్రం మీ అని అడగాలనిపించింది. కానీ నోట్లోనుంచి మాటలు రావడం లేదు. హడావుడిగా బట్టలు ఒక గుట్టగా ప్లాస్టిక్ వైర్ మీద పడేసి అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

ఎవరతను?

అర్థం కాలేదు పద్మావతికి. ఆ రోజునుంచి ఎందుకో తెలియదు కానీ చాలా రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలన్నా భయమేసేది పద్మావతికి. ఎప్పుడైనా తలుపు దగ్గరికి వచ్చినా భయంగా బయటికి తొంగిచూసేదంతే!

ఒక రోజు ఇంట్లో అందరూ వెళ్లిపోయాక ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. కాలింగ్ బెల్ మోగింది. భయంగానే వెళ్లి తలుపు తీసింది.

అతనే!

ఏం కావాలని అడిగింది, భయంగానే!

ఇంట్లో టీ పొడి అయిపోయింది. కొంచెం ఇస్తారా? అని అడిగాడతను.

ఏం మాట్లాడకుండా ఒక చిన్న కప్పులో కొంచెం టీ పొడి తెచ్చి ఇచ్చింది. అతను అది తీసుకున్నాడు. కానీ అక్కడ్నుంచి కదల్లేదు. ఆమెకి కూడా అక్కడ్నుంచి వెళ్లాలనిపించలేదు. ఇద్దరూ కాసేపు అలానే నిల్చున్నారు. చాలా సేపటికి ఆమె తలెత్తి అతని కళ్లల్లోకి చూసింది.

ఆ రోజు మీరు టెర్రస్ మీద అన్న మాటలు నేను విన్నాను

అన్నాడతను.

వెంటనే తలదించుకుంది ఆమె.

ఆ రోజునుంచీ అతను ఆమెను ఏదో ఒక సాకుతో కలవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

పద్మావతి అతనితో కొన్ని సార్లు మాట్లాడింది కూడా. కానీ అతనితో ఉన్న ఆ కొంతసేపూ ఆమెకు ఏదో తెలియని ఇబ్బంది. అతనంటే ఏదో తెలియని ఆకర్షణ వల్ల అతనంటే ఇష్టమూ, కానీ పెళ్లై ఇద్దరు పిల్లలున్న ఇల్లాలుని. ఇలా వేరొక మగవాణ్ని చూసి ఇష్టపడకూడదేమో అని మనసు మాటిమాటికీ పంపిస్తున్న సంకేతాలు – వీటి మధ్య సతమతమవుతూ ఉండేది ఆమె.

చిన్నప్పట్నుంచీ తప్పులన్నీ తనే చేసానని ఎప్పుడో తనలో తానే ఒప్పేసుకున్న పద్మావతికి ఇప్పుడు కూడా ఆ అబ్బాయితో మాట్లాడడం తన తప్పేనేమో అని ఎప్పటికప్పుడు ఆమెను బాధపెడ్తూనే ఉండేది.

మీరు ఎందుకు ఎప్పుడూ ఎవరితో మాట్లాడరు? ఒక సాయంత్రం టెర్రెస్ మీద అతని ప్రశ్న.

ఎందుకో అలా అలవాటైపోయింది.

నేను రాసే కథలో మిమ్మల్ని ఒక క్యారెక్టర్ గా పెట్టాలనుకుంటున్నాను.

నా గురించి మీకేం తెలుసని?

నాకు చాలానే తెలుసు.

ఏం రాస్తారు? నాదేమంత గొప్ప కథ కాదు రాయడానికి!

నవ్వాడు. నవ్వితే చాలా బావుంటాడు అతను. చూస్తూ ఉండాలనిపిస్తుంది.

ఆ రాత్రి చాలా సేపు ఆమెకు నిద్రపట్టలేదు.  భర్త వైపే చూస్తూ కూర్చుంది. ఇదంతా ఏం తెలియని అతను గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. ఆ రోజు నుంచీ ఆమె బట్టలు ఆరెయ్యడానికి టెర్రస్ పైకి వెళ్లడం కూడా మానేసింది.

కొన్నాళ్లకు అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడని తెలిసింది. అప్పుడు కూడా ఆమెలో ఏదో తెలియని ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్కి అప్పటికప్పుడు ఒక పేరు పెట్టాలనే ప్రయత్నం మాని,

లక్ష్మీ ప్రియాంక

ఏం ఆశిస్తున్నారో అర్ధమయ్యేలోపే మాయమయ్యేవాళ్ళు నాలుగోరకం అన్న నిర్ధారణకి వచ్చింది  పద్మావతి.

పద్మావతి ఇంకా నడుస్తూనే ఉంది.

మనసులో అలజడి తీరడానికి ఆమెకున్న ఒకే ఒక మార్గం నడవడమే. నడుస్తుంటే ఆమెకు ఏవేవో గుర్తుకొస్తున్నాయి. ఎన్నెన్నో ప్రశ్నలు ఆమెకు ఎదురవుతున్నాయి.

ఎందుకు పుట్టామో ఎందుకు పోతామో అర్థం కాని ఈ జీవితం నుంచి పద్మావతి ఏమీ  కోరుకోలేదు.

కేవలం ఆమె సంతోషం తప్ప.

ఏ సంబంధం లేకుండా దొరికిన ఈ జీవితాన్ని ఆ మాత్రం అడగడం తప్పా?

ఏం అడిగింది ఆమె?

తన మొహం మీద చెరిగిపోని నవ్వు.

తను  కోరుకున్న చిన్ని చిన్ని ఆనందాలు.

ఈ మాత్రానికేనా ప్రపంచం ఆమెను ఆనందానికి  దూరం చేసింది.

ఏముంటాయి ఆమె  కోరుకునే ఆనందాలు?

ఒక విషాద సాయంత్రపు వేళ

ఆమె తలవాల్చుకోడానికి ఒక  నమ్మకమైన వ్యక్తి సాన్నిహిత్యం.

చెప్పమని అడగకుండానే చెప్పే ఒక ప్రేమ కవిత.

ఎదురుచూస్తుందో లేదో తెలియకుండానే చెప్పాపెట్టకుండా ఇంటికొచ్చి ఇచ్చే ఒక తీపి కానుక.

కారుతున్న కన్నీళ్లన్నీ విషాదంతోనే కాదని అర్థం చేసుకునే మనసు.

నవ్వు మొహంలోనూ విషాదాన్ని అర్థం చేసుకునే తెలివి.

ఇవన్నీ లేని మనుషులు తిరుగుతున్న లోకంలో ఇన్నాళ్లూ బతకగలగడమే ఒక మిరకిల్ అనుకుంటూ నడుస్తోంది పద్మావతి.

ఉదయమే విజయవాడ నుంచి తిరిగొచ్చింది పద్మావతి.

హాస్టల్లో చదువుతున్న కొడుక్కి వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పడంతో నాలుగు రోజుల క్రితం విజయవాడ బయల్దేరింది పద్మావతి.

కొడుకుని ఇంటికి తీసుకొద్దామంటే రానని మొండికేశాడు. ఇంకో నెలలో పరీక్షలు. ఆరోగ్యంకంటే ఎక్కువా అని అడిగే ధైర్యం చెయ్యలేకపోయింది. రెండు రోజులు హాస్పిటల్లో ఉండి, కొంచెం జ్వరం తగ్గగానే కొడుకుని  హాస్పిటల్ నుంచి హాస్టల్లో చేర్పించి మళ్లీ వెనక్కి బయల్దేరింది ఆమె.

విజయవాడలో ఉన్నన్ని రోజులూ రోజుకు రెండు మూడు సార్లైనా భర్తకి ఫోన్ చేసి తిన్నారా లేదా అని అడుగుతూనే ఉంది. ఎప్పటిలాగే పొడిపొడి మాటలే  అతని సమాధానం.

అన్ని సార్లు ఫోన్ కాల్స్ లో ఒక్కసారైనా ఎలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? తిన్నావా లేదా అని ఒక్క మాట అడగలేదు భర్త. కొడుక్కు ఎలా ఉందో మాత్రం అడిగి తెలుసుకునేవాడు.

చాలా కోపమొచ్చింది పద్మావతికి. ఇంట్లో ఉన్నప్పుడంటే సరే! అడిగినా అడగకపోయినా పట్టించుకోనవసరం లేదు. కానీ ఇలాంటి పరిస్థుతుల్లో కూడానా?

కోపమొచ్చింది. ఒక రోజంతా ఫోనే చెయ్యలేదు. కొడుకికి హాస్టల్లో చేర్పించి ఉదయాన్నే  బస్సెక్కి బయల్దేరింది. ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నమైంది.

నాలుగు రోజులు ఇంట్లో లేకపోయేసరికి పని మనిషి కూడా రావడం మానేసిందేమో, ఇల్లంతా దుమ్ము. వాష్ బేసిన లో అంట్లు ఎక్కడివక్కడే ఉన్నాయి.

కోపమొచ్చి పనిమనిషికి ఫోన్ చేసింది.

సార్ రేపట్నుంచి రమ్మన్నారమ్మా అని చెప్పింది పనిమనిషి.

ఇల్లంతా ఒక్కొక్క రూమూ సర్దుతూ బెడ్ రూంలోకి వచ్చింది పద్మావతి.

పరుపంతా చిందరవందరగా ఉంది. దుప్పటి తీసి దులిపి మడత పెడ్తుండగా బెడ్ మీదనుంచి వాడిపోయిన మల్లెపూలు కిందపడ్డాయి.

చాలా సేపు వాటినే చూస్తూ కూర్చుంది పద్మావతి.

సాయంత్రం భర్త ఇంటికొచ్చే సమయానికి ఇల్లంతా శుభ్రం చేసి, హాల్లో డైనింగ్ టేబుల్ మీద ఆ వాడిపోయిన మల్లెపూలను పెట్టి వాటివైపే చూస్తూ కూర్చుంది. భర్త ఇంటికి రాగానే, నువ్వెప్పుడొచ్చావ్? అన్నట్టు చూశాడు. కొడుక్కి ఎలా ఉందో అడిగాడు. అన్నం తినేసి పడుకున్నాడు. అతను భోజనం చేస్తున్నంత సేపూ వాడిన మల్లెపూలు టేబుల్ మీదే ఉన్నాయి. కానీ అతను వాటి వైపు చూడనైనా చూడలేదు.

ఉదయాన్నే చూస్తే టేబుల్ మీద మల్లెపూలు కనిపించలేదు పద్మావతికి. టిఫిన్ చేసి మౌనంగా ఆఫీస్ కి వెళ్లిపోయాడు భర్త.

ఏదో ఒకటి మాట్లాడుతాడేమో, ఏమైనా చెప్తాడేమో అని ఎదురుచూసింది. అతను వెళ్లిపోయాక చాలాసేపు మౌనంగా కూర్చుని బయటకు నడిచింది.

ఎంత సేపు నడిచిందో తెలియదు. కాళ్లు ఇంక నడవలేనని మొండికేశాయి. రోడ్డు పక్కనున్న చెట్టుకింద కాసేపు కూర్చుంది.

అప్పుడే సాయంత్రం అవుతోంది.

ఎదురుగా ఉన్న బస్ స్టాప్ లో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బస్సులొచ్చి ఆగాయి. చాలా మంది దిగారు. వాళ్లలో చాలా మంది ఆడవాళ్లు కూడా ఉన్నారు. బస్ దిగి ఒక్కొక్కరూ హడావుడిగా నడుచుకుంటూ వెళ్తున్నారు.

కాలేజ్ నుంచి ఇంటికెళ్తున్న టీనేజ్ అమ్మాయిలు.

ఆఫీస్ లో ఉద్యోగం చేసి అలసిపోయిన మధ్య వయస్కులు.

పిల్లని స్కూల్ నుంచి తీసుకొస్తున్న వయసులో ఆడవాళ్లు.

వాళ్లందరూ అలా నడుచుకుని వెళ్లడం చూస్తుంటే పద్మావతికి మనసులో ఏదో భారం తగ్గినట్టయింది.

రోజంతా ఇంట్లోనే ఉండే నాకే ఇన్ని వ్యధలయితే ఇక వీళ్లందరివీ ఎన్ని కథలో అనుకుంది.

వీళ్ళందరితో పోలిస్తే తనది గొప్ప కథేం కాదని మనసులో అనుకుంటూ నెమ్మదిగా లేచి తిరిగి ఇంటి వైపు నడిచింది.

చిత్రం: రాజశేఖర్ చంద్రం

*

పెనుగులాటే ఆమె “నడక”!

-వొమ్మి రమేష్ బాబు

 

ఇది మామూలు కథ కాదు– అగ్నిధార. ఎప్పుడో మొదలై నేటికీ కొనసాగుతున్న యాతనల వెల్లువ.  యుగాలుగా స్త్రీల గుండె మూలల్లో దాగిన మూగబాధల పాటల పల్లవి. రెప్పల కింద చిప్పిల్లి.. బయటికి ఉబికి రావడానికి కూడా ధైర్యంలేక తడారిపోయే కన్నీటి చెలమ. ఈ కథలో పద్మావతి.. మన చుట్టూ ఉన్న ఎందరో మహిళల నిజజీవిత వ్యథలకు ప్రతిరూపం. బాలికగా, యువతిగా, భార్యగా, తల్లిగా తనకి ఎదురైన అనుభవాలు ఆమెలోని ఆశలను, ఆనందపు ఊసులను సజీవసమాధి చేసిన తీరు చూస్తే మగప్రపంచంపై తీవ్రమైన యేవగింపు కలగకపోదు. ఊహ తెలిసినప్పటి నుంచి తన చుట్టూ కట్టిన కనిపించని గోడలను, ఆంక్షల సంకెళ్లను, చేయని తప్పుకి వేసిన శిక్షల భారాన్నీ త్యజించుకోవడానికి చేసే పెనుగులాటే ఆమె “నడక”! ఆ నడకకి తగినట్టే ఉంది కథనం కూడా!

*

లక్ష్మీ ప్రియాంక

మాది సత్తుపల్లి . ఎం.టెక్ చేసి TCS లో కొంతకాలం పనిచేసి రిజైన్ చేశాను. చిన్నతనం నుండి తెలుగు భాష మీద ఉన్న ఇష్టం కొద్దీ చదవటం మొదలుపెట్టిన నేను ప్రస్తుతం సినిమాలకు పాటలు రాస్తున్నాను. ఏ భావాన్నైనా కళల రూపంలో నలుగురికి అర్ధమయ్యేలా చెప్పటం సులువని నమ్ముతూ నా ఆలోచనలను అటు కధల రూపంలో, ఇటు బొమ్మల రూపంలో (డూడుల్స్) మలిచే ప్రయత్నం చేస్తున్నాను.
నన్ను , నా ఇష్టాలను గౌరవించే తల్లిదండ్రులు , ఎల్లప్పుడూ ప్రోత్సహించే స్నేహితులు దొరకటం నా అదృష్టం.

27 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “గొప్ప కథేం కాదు” కథ అక్షరాలా గొప్ప కథే!!
    కథా,కథనమూ,శైలీ, టైటిలూ చివరికి ముగింపూ అన్నీ గొప్పగా ఉన్నాయి. ఎంతో,ఎంతో మథనపడితేనే గాని ఇలాంటి కథలు ఇంత బలంగా, సూటిగా, గొప్పగా బయటకు రావు. రచయిత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు.

  • ఆమె నడవవావకున్న ప్రతిసారీ ఏదో ఒక సంకెలతో బంధింపబడే సగటు మహిళ కథ..బాగుంది. ప్రణాళికా బధ్ధంగా రాయబడిన కథ.

  • “గొప్ప కథేం కాదు!” నిజంగా ఒక కొత్త శైలి లో ఈనాటి (ఎప్పుడూ ఉన్న స్త్రీ పరిస్తితి ) స్త్రీ గురించి రాశారు . నడుస్తూనే ఈ వ్యవస్త లో స్త్రీ బాధలు కష్టాలు అన్నీ రాశారు. కధ లా కాకుండా ఒక monologue లా చాలా సరిగ్గా ఇవ్వల్టీ స్త్రీ పరిస్తితి బాగా రాశారు లక్ష్మి ప్రియాంక గారు

  • బావుంది… కొత్త వస్తువు కాకపోయినా కొత్త కోణం లోనుంచి, కొత్త తరం చూస్తున్న చూపు లోనుంచి రాయబడ్డ ఈ కథ ఆకర్షించింది. నడకలో కొంచం అక్కడక్కడా తడబడినా మళ్ళీ నిలదొక్కుకుని సాఫీగా నడిచారు. ప్రియాంక గారు లిరిక్ రైటర్ గా సినిమాల్లో రాణిస్తున్నారు, కథల్లో కూడా కొత్త కొత్త సబ్జెక్టు లతో రాయాలని కోరుకుంటున్నా.

  • రోటీన్ జీవితాన్ని కధ గామలచి రాసిన యువ రచయిత్రి కి అభినందనలు!💐.,కధ మాములుగా, మాలాంటి వారి జీవితాల్లో,.. జీవితంలో అనుభవస్తున్నదే కాబట్టి, కొత్త గాలేక పోయినా.. ఆ,అనుభవాలు, అనుభూతులు, కళ్ల ముందు కదిలాయి,ఒక్కసారిగా.. అంతే.!ఈ, కొత్త ప్రయోగం విజయవంతం కావాలని, .సారంగ మరింత, వన్నె తెచ్చు కోవాలని. కోరుకుంటున్నా!💐💐👌.

  • నడక బాగుంది.
    మీ నుండి మరెన్నో కథలు ఆశించవచ్చు.
    మీకు హృదయ పూర్వక అభినందనలు

  • మైళ్ళకు మైళ్ళు వంటింట్లో నుండి హాల్లోకి, హాల్లోనుండి బెడ్ రూమ్ లోకి, బెడ్ రూమ్ నుండి వంటింట్లోకి జీవితాంతం నడిచే స్త్రీ లకి ప్రతిరూపం పద్మావతి. అడుగడుగున వివక్షత, లైంగిక వేధింపులు, అత్యాచారాలకు లోనవుతూ, ప్రతి సందర్బంలో తననే దోషిని చేసే ఈ సమాజం నలుపు మొకపు అనుభవాల గాథలు ఇంకా ఎన్ని తరాలు రాసుకోవలసిన దుస్థితి వుందో!
    లక్ష్మి ప్రియాంక గారు చేయి తిరిగిన రచయిత్రుల స్థాయిలో రాసారు. ఖచ్చితంగా గెప్ప కథనే! మంచి భవిష్యత్ ఉంది. Thank you Saranga magazine

    • రొటీన్.
      జీవితం.
      రోటీనే జీవితం ..స్త్రీల మనోగతాన్ని కొత్త శైలిలో వ్యక్తకీరించిన కథ .. బావుంది

  • స్వచ్ఛమైన ప్రేమ….అమాయకత్వం…..అసహనం…కోపం…నిర్లిప్తత…వదల్లేని భవబంధం…
    తిరిగి మళ్లీ మొదలూ… తుదీ.
    ఇంతే జీవితచక్రం.
    ఆగకుండా చదివించింది. Well narrated.

  • Chala chala bavundhi mi ‘Nadaka’!! Ilanti kathalu marenno rasi mammalni alaristarani korukuntunnam!! All the best 👍

  • కథ, కథనం రెండూ బాగున్నాయి. లక్ష్మీ ప్రియాంక గారికి అభనందనలు.ఇక సారంగి సరంగే..

  • లక్ష్మీ ప్రియాంక గారి గొప్ప కథేం కాదు.. వొమ్మి రమేష్ అన్నట్టు మాములు కథ కాదు. కథనం పరిగెత్తించింది ఒక పాటలా..

  • ఎప్పటిలాగే జనాలు, అదే ట్రాఫిక్ గోల. మనుషులు. మగాళ్లు…. ఎందుకో ఒక్కసారి అదోలా అనిపించింది. స్త్రీలనీ అనగదొక్కుతూ ఇన్నితరాల తర్వాత ఇలా మగాళ్లు మనుషులనుంచి వేరు చేయబడ్డారు అనే విషయం ఇప్పటికైనా ఓపెన్ అయ్యింది… గుడ్ నరేషన్ మంచి కథ… చాలా నచ్చింది.

  • గొప్ప కథేమి కాదు అన్నారు …నిజంగా చాలా గొప్ప కథ ఇది
    ఎందరో స్త్రీల మనోభావాలకు అక్షర రూపం ఇది…
    చాలా బాగుందండి…

  • చెప్పిన కథ ఒకటైతే, చెప్పని కథలు (అన్‌టోల్డ్ స్టోరీస్), అవతలి వైపు కథలు (సెకండ్ స్టోరీస్) కూడా ఉంటాయి. ఏ పద్మావతి జీవితం మీదనయినా ఇన్ని కళ్లు గుచ్చుకోవటానికి, ఇన్ని మలుపులు తిప్పటానికీ అనేక అంశాలు తోడ్పడతాయి. స్త్రీలని కేవలం కోరిక తీర్చుకునే సాధనాలుగా చూపే సినిమాలు, పేపర్లలో, టీవీల్లో ప్రకటనలు, అపరిమితంగా వచ్చి అరచేతుల్లో ఇమిడిపోయే మొబైల్లో పోర్న్, ఇవన్నీ శక్తిమేరకు తోడ్పడుతూనే ఉంటాయి ఆబ్జెక్టిఫికేషన్‌కి. వాటికి తోడు, కథలో చెప్పిన విధంగా, ఇళ్లలో నిరాటంకంగా కొనసాగుతున్న పురుషాధిక్యపు ‘సత్ ప్రవర్తనా బోధలు సరేసరి. గొప్ప కథ అవునా కాదా అన్న విషయాన్ని పక్కనబెడితే, అసలింకా ఎన్నాళ్లిలా పద్మావతులు నడక సాగించాల్సి ఉంటుందోనన్న భయం వణికిస్తూనే ఉంటుంది. చక్కటి కథని అందించినందుకు అభినందనలు, ధన్యవాదాలు!

  • ఈ కథని చదివి అభిప్రాయాలు వ్యక్తపరిచిన, అభినందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు. ఇది సారంగలో నా మొదటి కథ. మరి కొన్ని కథలతో మీకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాను .
    Thank you so much .

  • నడక లోనుంచి ఎన్నో జీవిత అనుభవాలను నెమరు వేసుకున్న
    తీరు కథా రూపంలో గొప్పగా చెప్పారు కవయిత్రి. ఇది గొప్ప కదేం కాదు…అని టైటిల్ పెట్టారు రచయిత్రి,కానీ కొన్ని గొప్పకథల సమాహారం ఈ కథ..పసిపిల్ల,బాలికగా,యువతి గా,తరుణిగా,ఇలా ప్రతి స్థాయిలోనూ,మగవాడి రక రకాల హింసలకు,బలై,తెలియని మానసిక రుగ్మతలకు బలి అయిపోతూన్న స్త్రీ గాధలు మనం ఎన్నో చూస్తూ వున్నాం.
    అయితే కాస్తా అటు ఇటుగా పద్మావతి పాత్రలో ఒక మగపా త్ర
    ను నేను చూసాను ఈ మధ్య..
    రోజులు మారాయి.పాత్రలు కూడా,అటువి ఇటు,ఇటువి అటు మారు తున్నాయి.ఈ మార్పులు సహజామేమో!!

  • – నేరమొకరిది, శిక్ష మరొకరికా?
    – పెళ్ళి చేసేంత పెద్ద.తప్పు ఏంచేసింది తను?

    అలజడి కలిగించే ప్రశ్నలు. ముఫ్ఫై యేళ్ళుగా అస్తిత్వ సాహిత్యం చదువుతున్నా, అంతే కొత్తగా అంతే పాత ప్రశ్నలు. మనుషుల్లో సెన్సెస్ అండ్ సెన్సిబిలిటీస్ ఏమాత్రమూ పెరగలేదని లక్ష్మీ ప్రియాంక మరోసారి ఫెడేల్మని చెప్పినట్టు అనిపిస్తున్నది. పురుషులు నడుస్తూ, ఆలోచిస్తూ, మనుషుల్లా అయేంతవరకూ ఈ సాహితీయానం అవసరమైనది.

  • పద్మావతి చివరికలా రాజీ పడటమే బాగోలేదమ్మా .. !

  • చాలా మంచో కథ ప్రియాంక. గొప్పకథ కాదు గొప్పగా చదివించుకుపోయింది. ఎప్శటికి వీటన్నిటినుంచి విముక్తి !!ఒక వైపు బాధకూడా కలిగింది. ఎందుకీ జీవితం అనికూడా అనిపించింది!! అభినందనలు!!

  • ‘గొప్ప కథేం కాదు’… కానీ ఆలోచింపచేసే కథ👏🏼
    ఆసాంతం చదివించింది. డానీ చెప్పినట్లు అక్కడక్కడా కొంచెం తొట్రుపడినా, కథనం సాఫీగా సాగింది. అభినందనలు.

  • ఇక్కడ పద్మావతులు కానివారెవ్వరు? అందరము పద్మావతులమే కొందరు నడుస్తున్న- ఏడుస్తున్న- బస్టాండులో చెమటలు కార్చుకుంటూ నిలబడి పిల్లకోసమో జీవనము కోసమో(జీతము కోసమో) వెళ్ళాల్సిన అవసరము కోసము నిలబడి వెకిలి హాస్యాన్ని వంకర నవ్వులను చూస్తూ కూడ తలవంచుకునే పద్మావతులే కదా-అందరు

    • చాలా బాగుంది కథ చాలా బాగుంది శైలి శిల్పం చాలా చక్కగా సాగింది ఈ తరాన్ని ఈ కథలో చూస్తున్నాం నీ ప్రయత్నం చాలా హర్షించదగినది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు