ఏం జరగనుందో ఊహించాలని కూడా కాదు
కేవలం మాటలతో కన్నా
చెప్పాలనే ఒత్తిడిలో కుదించుకపోయి
ఇంకా అనేక అర్థచాయల బంధనాలలో రెక్కలు కత్తిరించబడి మనుషులు
నిస్సహాయతలోనికి ముడుచుకొని పోవడమే
ఊపిరి సలపనీయదు
ఒక చోటును పాదుకొలిపేందుకు
కనీసం ముని వేళ్ళని మోపే వీలు కోసమైనా
తలవంచి ప్రార్థన చేస్తావేమో కానీ
అనేకానేకాలుగా రానున్న రోజులను తలపోతలుగా ఊపిరి పోస్తావేమో కానీ
నీ చుట్టూ ఉన్నవారే జీవికను కలిపి పంచుకున్నవారే
నీ కుదుళ్ళ చుట్టూ ఆవరణమై ఉన్న మట్టిని వదులు చేసే కుట్ర కావడం
ఎంతకూ నిలువనీయదు
నొప్పిని గురించి మాటాడాలని నాలాగే నీకూ ఊంటుందేమోగానీ
గడ్డ కట్టుక పోయే రక్తచలన స్పర్శలో ప్రాణం రెపరెపలాడే దీపమై కొట్టుకలాడడం
ఆ క్షణం దేహమే స్వాంతనకు అడ్డంకిగా మారి నిప్పుల స్థాణువవడమూ
మనిద్దరికే తెలుసు
రోజులు బంధనయుతమయినా
ఒక పసిరికను రేఖామాత్రంగా గీయగలగడం ఆశావహమే కావొచ్చునేమో కానీ
ఇప్పటి వరకూ వేలెత్తి చూపేందుకయినా
ఒక వీధిగానో ఒకవిగ్రహంగానో
ఉత్సవంగానో ఉనికిగానో ఉన్న నీ పేరును కొట్టేసేటంతగా
ఆటని చివరాఖరుకు లాక్కుపోగలగడమేమిటో
లోలోపలికి ఇంకుతున్నప్పుడు నమ్మకపు పొరలు బదాబదలై
పెనుఉప్పెన మన ఇద్దరినీ చుట్టు ముడుతుంది
బయటికి అంతా కనిపించేలా ఉన్న దాన్ని
ఇక గుప్పిట పట్టిన రహస్యమని అనలేము
ముందే నిర్ణయమైపోయిన రాతలో ఏమున్నా
అది విరిగిన నమ్మకానికి ఒక్క చిన్న అతుకయినా అవుతుందని స్వప్నించలేము
*








బావుంది