ఇంతకీ “అతడి బాధ” ఏమిటి?

ఉద్యమకారుల పట్ల, ఉద్యమాల పట్ల ఎంతో సానుభూతి కలిగి వున్న పరిస్తితులు దానికి విరుద్ధంగా ఎందుకు మారాయి?

28 ఏళ్ల ప్రయాణం తక్కువేం కాదు, ఎంచుకున్న రంగాన్ని బట్టి ఎన్నో ఆటుపోట్లు, శ్రమ, సంతోషాలు కలగలిసి వుంటాయి. ఈ ప్రయాణం  యుక్త వయసులో మొదలై పూర్ణ అనుభవం స్థాయికి చేరుకొనే వుంటుంది,సందేహం లేదు. ఇంతటి అనుభవం చెప్పిన దేన్నైనా ఒక మైలురాయిగా ప్రతిష్టించుకొనవచ్చు. ఆ దశకు చేరుకున్న అనుభవాల మీద, అట్టి ప్రయాణం మీద సమీక్ష ఈ నాల్గక్షరాలు.

కథల ప్రయాణం ప్రజలతోటే మొదలై ప్రజల చెంతనే ముగుస్తుంది. ఇందులో ప్రజల పక్షం తప్ప మరో పక్షం వహించడం వుండదు[ఆధునిక కథా సాహిత్యంలో ]. ప్రజల్లోని ప్రేమా ,పగా ,కష్టాలు ,దుఃఖాలు,సంతోషాలు, ప్రతీకారాలు, గెలుపోటములు ,చరిత్ర ,ప్రయాణాలు ఇత్యాది అన్ని పార్శ్వాలే  నేటి కథ. ఇట్లా ఆధునిక కథకు ప్రజలే ఆభరణాలు .

అన్న వాహిక నుండి ప్రయాణి౦చిన పదార్దం జీర్ణశాయానికి చేరిన తరువాత పరిణామం చెంది శరీరంలోని అన్నిభాగాలకు చేరడమే దానిలక్ష్యం సుఖాంతమే.అట్లా చేరిన ఆహారం జీర్ణక్రియను తప్పుకొని మళ్ళీ అన్న వాహికకు చేరటం అంటే రోగలక్షణమే అంటుంది వైద్య పరిభాష .

అవును, నేను 28వ కథా సంపుటి “కథ -2017 “గురించే మాట్లాడుతున్నాను .నాసిరకమైన కథలు వస్తాయి,వస్తూవుంటాయి. అది అసలు చర్చ కాదు. ఎంతైనా మనుషులం గదా, బాంధవ్యాలు వుంటాయి, ఆశ్రితపక్ష పాతాలు సహజం. అవి లెక్కించాల్సిన పనిలేదు. మొత్తం ప్రయాణానికి అది కొలమానం కాదు, అప్రస్తుతం.

ఈ సంకలనం రూపుదిద్దుకొవడానికి సంపాదక బాధ్యతలు చేపట్టిన వారిలో  ఏ ఒక్కరికి “కథా సాహిత్యం లో 4౦ ఏళ్ళకు తగ్గని సీనియార్టి కలిగి వున్నారు. సంపాదకులు చెప్పినట్టుగా ’2017లో వివిధ పత్రికల్లో వచ్చిన మొత్తం కథల్లో ఎన్నిక చేసిన దాదాపు 70 కథల్ని జాగ్రత్తగా చదివినప్పుడు …’ దొరికినవి 15 కథలు .

ఇట్లా దొరికిన ఈ  15 ఉత్తమ కథల్లోంచి ఒక్క కథ గురించి నా ప్రస్తావన .

*

   ఒక ఊర్లో ఊరకుక్కల బెడద ఎక్కువగా వుంటుంది.ఈ కుక్కలతో గృహిణులు చాలా ఇబ్బ౦దులు పడుతుంటారు.ఇంటి చాకిరికి తోడు కుక్కలతో ప్రతిదాన్ని కాపాడుకోలేక తెగ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు ఊరి జనం. వారానికి ఒక రోజు సెలవు దొరికిన మగ మహారాజులు ఇంటి పనిలో ఆడవాళ్ళకు సహాయ పడకుండ ఏదో ఒక చెట్టుకింద చేరి’పులిజూద౦’[ పులిమేక], పఛ్చీసాటో’’  పందాలు పెట్టుకొని ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఆట కొనసాగుతుంటుంది, ఇంతలో ఏ ఇంటి చెట్టు కిందైతే ఆడుకుంటున్నారో ఆ ఇంటి వాళ్ళ కాంపౌండులో వున్న కోడి పిల్లల్లోని ఒక పిల్లని ఆ ఊరి విలన్ కుక్క పట్టుకోపోయే ప్రయత్నం చేస్తుంది. పిల్లల కోడి వెంట పడి తరిమినా,చెట్టు కింద తీరిక దొరికి ఆడుకుంటున్న మగవాళ్ళు అందరూ అడ్డుపడ్డా కుక్క కోడి పిల్ల ఒకదాన్ని నోట కర్చుకొని గోడ దూకి పారి పోతుంది.కోడి పొదిగిన ప్రతిసారి ఐదారు కోడి పిల్లలను కుక్కల పాలవడం జరుగుతుంది. దీన్ని అరికట్టే వాళ్లేవరూ లేరా అని ఇల్లాళ్ళు బాధ పడుతుంటారు. ఆ ఇంటామె అరుపులు, బాధని చూడలేక కోడి పిల్లను ఎత్తుకొపోయిన కుక్కని  చంపాలని మగాళ్ళు తీర్మానం చేస్తారు. ”తిరుక్కోండ్రా –దీన్నియ్యాలనేల బడగొట్టాల…”రెడ్డిగారు అంటాడు. ఆ ఆజ్ఞ అందుకున్నఈ కథ లోని హీరో సెవ్వన్న రోజు గడవక ముందే కోడి పిల్లను తన్నుకోపోయిన కుక్కను చాక చక్యంగా కోడిపోట్ట , పేగులు కటిక దుకాణం నుంచి తెచ్చి దాన్లో  గుళికల మందు కలిపి పెట్టి చంపేస్తాడు. పీడ విరగడై౦దని అందరూ సెవ్వన్నను మెచ్చుకుంటారు. చనిపోయిన కుక్క నాలుగు పిల్లల తల్లి అని తెలిసి కథ లోని హీరో సెవ్వన్న తెగ బాధ పడి పాప భీతితో కుక్క పిల్లల్ని తెచ్చుకొని పాలు పోసి పెంచుకుంటాడు. కుక్కను చంపటం న్యాయమే, పాపం దానికి పిల్లలున్నాయే అని తెగ బాధ పడుతుంటాడు అది అసలు కథ . ఆ కథ శీర్షిక “అతడిబాధ”.

ఇంతటి తో కథ ఐపోలేదు. ఈ కథలోని అసలు మానవీయ కోణ౦ మిగిలే వుంది.

ఈ కథ లోనే ఎన్ కౌంటర్లో చనిపోయిన నక్సల్స్ ప్రస్తావన పలుమార్లు తేవడం, అందోళకారులు [తల్లిదండ్రులు,పెళ్ళం,పిల్లలు]ఎన్ కౌంటర్ లో చనిపోయిన నక్సల్ కుటుంబాల్ని ,ఆదుకోవాలి ,వారి కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలని కోరిన, డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాల వారిపై లాఠీ చార్జింగ్ చెస్తూ అందోళ చేస్తున్న వారిని  అణిచివేస్తున్న ప్రభుత్వం కన్నా’ఈ విషయంలో  ప్రభుత్వం కన్నా  మా సెవ్వన్న మేలేమో ‘అన్న కథ . అంటే ఊల్లోవాళ్ళ ఆస్తుల్ని నష్టపర్చే కుక్కల్ని, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించే ఉద్యమకారుల్ని చంపుతే చంపారు కాని ‘మా సెవ్వన్న లాగ వాళ్ళ పిల్లల్ని, కుటుంబాలను ఆదుకో౦డని చెప్పిన కథ .

1 .   ఉద్యమకారులు,కుక్కలు ప్రగతి నిరోధకులు అని పోల్చిన కథ .

2.ఇప్పటి వరకు ఏ ఎన్ కౌంటర్ బాధితుడు ప్రభుత్వాలకు పునరావాసమో, నష్టపరిహారం ఇవ్వమని అడిగాడు ?

  1. వీటి మీద నష్టపరిహారం ఇవ్వమని దర్నాలు ,సమ్మెలు ప్రపంచ దేశాల్లో ఎక్కడన్నా జరిగుంటాయా ?

4 .ఉద్యమకారుల సంతానాన్ని ,కుటుంబాల్ని కుక్కల పరివారంతో[కథలోని హీరో వ్యక్తి పాప భీతితో చేసిన పరిహారం]  సమాన హక్కుల్ని తూచిన కథ.

ఉద్యమకారుల పట్ల, ఉద్యమాల పట్ల ఎంతో సానుభూతి కలిగి వున్న పరిస్తితులు దానికి విరుద్ధంగా ఎందుకు మారాయి? ఉద్యమాల అవసరం లేకుండా ‘సబ్ ఠీక్ హై’అని ప్రజలు, ప్రభుత్వాలు అందించే చేయూతని గుండెల మీద కప్పుకొని నిదురించే పరిస్తితి కల్పించ బడిందనుకోవాలా ? అడవుల్లో పీడిత తాడిత గిరిజనం, గోండుల పరిస్తితి వేరు గా వుందే, బడా కార్పోరేట్ సంవస్థలు ,పెద్ద ,పెద్ద కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వాల నీడ ను౦డి రాయితీలు తింటూ గిరిజనాన్ని ఉద్ధరించడానికి బారులు తీరుతున్నారని అర్ధమా  ? వాళ్ళని, వాళ్ళ నేల, నీడ నుంచి దూరం చేయడానికి కాదా ? కొత్త,కొత్త ప్రాజెక్టల పేర ముంచడం, పరిశ్రామిక కారిడార్ల పేర గెంటివేయడం ఎవరికోసం?ఆ పాటి ఉద్యమాలు ఉండబట్టే అక్కడి అమాయక జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు అనే వాస్తవాన్ని కాదనగలమా ? సుఖపడండి సుఖాలు అనుభవించండి ,వాటా అడిగే చైతన్యం ప్రజల్లో ఇంకారాలేదు.బయలు ప్రాంతం మేధావులు వారి త్యాగాలను హేళన చేయడం ఎందుకు.? ఓ ప్రయత్నం వృధా కావచ్చు,ఓటమి ఇంత వెనక్కు నెట్టేస్తుందనుకోవాలా ?

సాహిత్యంలో ఏ ప్రక్రియ ఐనా కల్పనపై నిర్మించ బడేదే కాని మరీ ఇంత అమానవీయ అ’భూత’కల్పనా?         రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాహిత్యకారుల్లో ‘పాలక పక్షం ‘వహించడం ఒక ఫ్యాషనుగా, లేక వ్యామోహం కనపరుస్తున్నట్టు కనిపిస్తుంది . స్వ, స్వామిభక్తికి గేట్లు తెరిచినట్లుగా వుందని పిస్తుంది

ఈ కథ , ఆ ’సంఘటనలు‘చేస్తున్న ప్రభుత్వాల పట్ల సానుకూలత గా ఏ రచయిత(త్రి )ఐనా వ్యక్తిగత౦గా రాస్తే రాసుకోవచ్చు ఎవరికీ అభ్యంతరం వుండదు. అది “ఉత్తమ”కథ, అనటమే కదా మన ప్రయాణం దిశ తేల్చేది .

నిజంగానే రాక్షసి బ్యూటీ పార్లర్ కు పోయి అందంగా అలంకరించుకొని వైయ్యారాలు వలికించినంత మాత్రాన  అందగత్తే అని ఆస్వాదిస్తామా? ముఖంలో బైటికి తన్నుకొచ్చే క్రూర౦గా భయపెడుతున్న కోరల సంగతి ఎక్కడ దాద్దాం .

*

 

 

హనీఫ్

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బహుశా ఇది కూడా ప్రభుత్వ అనుకూల వార్తాకథనం అని ముద్రవేయరని ఆశిస్తూ…..మరీ ఒకవైపే కాకుండా రెండోవైపు కూడా చూసే ప్రయత్నం అని భావిస్తూ…

    ‘‘దంతెవాడలో ప్రజాకీయం’’

    http://rasthamag.com/2018/12/01/3947/

    (ది వైర్ పత్రిక (08, నవంబర్, 2018) నుంచి అనువాదం.In Dantewada’s Naxal Area, ‘Political Participation’ Looks Completely Different)

    ఆ పత్రికలోనే మరోవ్యాసం… Crushed Between Naxals and Police, Chhattisgarh’s Abujmarh Region Is Seeking Refuge

  • హనీప్ బై అద్బుతమైన సమీక్ష చేశారు. ఇప్పుడు రచయితలు చాలా మంది పాలక వర్గాల బూట్లునాకే వారిగా తయ్యారు.ఇట్లాంటి రచనల్న చరిత్ర క్షమించదు.కదలపై మంచిసమీక్ష చేయగలవు.మరిన్నిసమీక్షలు నీ కలంనుండి జాలువారాలి….తిర్మల్

  • హనీఫ్ గారు మీ “సమీక్ష” చదువుతుంటే పిడికిళ్ళలో రక్తం మరుగుతుంది. కొద్దీ మంది రచయితలు కరుడు కట్టిన పోలీస్ పాత్రలను పోషించడానికి సిద్ధమౌతున్నారు. ఆ కథను “ఉత్తమ”కథ,గా ఎన్నుకొన్నవారు బహుశా గ్రేహాండ్ పోలీస్ అధికారులు కావచ్చు.

  • ఆ కథ హనీఫ్ గారికి అలా అర్ధం అయ్యింది. నాకు ప్రజా తిరుగుబాట్లకి కారణాలు విశ్లేషిస్తూ కొంత సానుభూతి చూపినట్లు అర్ధం అయ్యింది. నేనూ సీనియర్ పాఠకుడినే. కథ ఏక పక్షంగా కాక బాలన్స్ గా నడిచింది.

    • అవునండీ . నేనూ కథ చదివాను. నాకు హనీఫ్ గారి కోణం కనిపించలేదు. పైగా నేనూ కమ్యూనిస్టు అభిమానినే.

  • ‘అతడి బాధ’ అర్థమైంది. ఇతడి బాధే….?

    కథ చదివేటప్పుడు స్థలకాలాదుల స్పృహతో చదవాలి. సామాజిక స్పృహతో చదవాలి. విమర్శించేటప్పుడు కేవలం తన దృష్టి కోణం నుంచే కాకుండా రచయిత దృష్టి కోణం నుంచి కూడా కథను చూడగలగాలి. సంయమనం పాటించాలి. తనను పదిమంది మేధావిగా గుర్తించేందుకు అడ్డదారులు చూసుకోవడం కన్నా సరైన దృక్పథంతో విమర్శ చేయగలగాలి. అలాంటి విమర్శ సామాన్యుని మెదళ్ళను సైతం కదిలిస్తుంది.
    ‘కథ-2017’ సంకలనం లో వచ్చిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి కథ ‘అతడి బాధ’ చదివినప్పుడు అది ఒక మంచి కథ గానే నాకనిపించింది.తను చేసిన ఒక పని వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దుకొనే ఒక మానవీయ కోణం ‘అతడి’ లో కనిపించింది. సారంగ వెబ్ మ్యాగజైన్ లో ఆ కథ గురించిన విమర్శ వచ్చిందని తెలిసి వెదకి చదివాను. కథను గురించిన నా అభిప్రాయం పట్ల నేను పొరబడ్డానేమోనని కథను మళ్ళీ చదివాను. కథ, విమర్శ పక్క పక్కనే పెట్టుకుని చూశాను. ‘అతడి బాధ’ అర్థమైంది కానీ విమర్శ రాసిన ‘ఇతడి బాధే’ నాకు అర్థం కాలేదు. రచయిత దృష్టి కోణం నుంచి చూసినప్పుడు నక్సలైట్ల పట్ల సానుభూతి కనిపించింది. ప్రభుత్వ దమనకాండ పట్ల నిరసన కనిపించింది. కథలో ప్రధానమైంది మనిషిలోని మానవీయకోణం. కథా వస్తువే అది.ఒక అపరాధ భావన వల్ల దానిని సరిదిద్దుకునేందుకు మనిషిలో పుట్టుకొచ్చే మానవత్వాన్ని వ్యక్తీకరించిన కథ అది. “ప్రభుత్వం కన్నా మా సెవ్వన్న మేలేమో” అని కథ చివర్లోచేసిన ఒక వ్యాఖ్య కూడా ప్రభుత్వ చర్యల పట్ల రచయిత వెలిబుచ్చిన నిరసన మాత్రమే అవుతుంది తప్ప విమర్శకుడు చూసిన ‘ఈగవాలుడు’ దృక్పథం కాదు. ‘ఆ రచయిత ప్రజల పక్షం కాదనటం,సమాజానికి యీకథ రోగలక్షణంగా ఉందనటం, సంపాదకుల ఆశ్రిత పక్షపాతం వల్ల ఈ కథను సంకలనంలోకి తీసుకున్నారనటం, అమానవీయ అభూత కల్పన అనటం, రచయిత పాలక పక్షం వహించే ఫ్యాషన్ కలవాడనటం, స్వామి భక్తికి గేట్లు తెరిచాడనటం… నాకైతే ఇది సాహిత్య విమర్శగా కనిపించలేదు. విమర్శ కూడా
    ఇంత దుర్మార్గంగా ఉంటుందని ఊహించలేదు.
    సంపాదకుల సాహిత్య జీవితాన్ని వయసుతో కొలిచి తద్వారా వాళ్ల జ్ఞానాన్ని అంచనా వేసిన విమర్శకున్ని చూడటం ఇదే ప్రథమం.
    నాకెందుకో…. ఈ విమర్శకుడికి కథ చదవడం రాదేమో అనిపించింది.

    • రమణారెడ్డి గారు,
      మీ వాదనలో ఆవేశం ,ఎదురు దాడి విపరీతంగా కన్పిస్తుంది.
      .
      హనీఫ్ ప్రస్తావించిన అన్నింటితో నేను ఏకీభవించనప్పటికీ కథలో ”
      .
      ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పడమంటే
      ప్రభుత్వం ఉద్యమకారుల్ని చంపడం పట్ల సన్నపురెడ్డిగారి దృక్పథం రాజ్యహింసకు అనుకూలవాదన తప్ప శ్రామిక వర్గ దృక్పథం కాదు.
      .
      ఇక్కడ సన్నపురెడ్డి కథాపటిమకు సంబంధించిన ప్రశ్నేమీ లేదు. అంతర్లీనంగా ఆయన రాజ్యహింసను సమర్ధించడం పైనే.

    • మీ ‘బాధ’అర్దమైంది. ‘కథ ‘ గురించి రాస్తూ ఇతర విషయాలు రాశారేంటనే కదా ? వారు కథను మాత్రమే ఎన్నుకోలేదు,దానితో చాలా విశయాలు ముడిపడి వున్నాయి అనేది వాస్తవం . కథలు సమస్యల పైనే రాస్తారు,పిట్టల్లా ఎగరడం గురించో,చాపల్లా నీళ్ళలో ఈదడం గురుంచో రాస్తే ఎవరూ పట్టించుకోరు.రాసే పద్దతి నచ్చితే దానిలోని నైపుణ్యాన్ని గురించి అప్పుడు చూస్తారు. నేను కథను గురించి రాస్తూ కథకు సంబంచిన అనేక ప్రశ్ననలు వేశాను,ఒక్కదానికి కూడా ప్రస్థవించకుండా ఇతర విషయాల మీదనే సస్పందించారు.మీ ఆవేశాన్ని ,ధూషణను ప్రకటించారు. నేను విమర్శణ్ణి కానని,పాఠకుణ్ణి కాదేమోనని అనుమానం వ్యక్తపరిచారు. వాటికి సంబందిచిన ట్రైనింగ్ సెంటర్లుంటే సమాచారం ఇవ్వండి వాటికి అర్జీ పెట్టుకుంటాను. నేను రాసిన విషయాలు ఇంకాస్త వివరాల్లోకి పోయి రాసుంటే బాగుండేదనిపిస్తుంది. నాకు ఎవరి పట్లా రాగధ్వేషాలు లేవు. ప్రజల వాలంటీర్ని మాత్రమే.

      • నెమలిదిన్నె రమణరెడ్డి గారు. పైన వున్న Reply చూడండి.

  • అయ్యో! నేనా కథ చదవకుండానే ఈ విమర్ష చదివానే.. ఇప్పుడు ఆ కథ చదివితే అది నాకెట్లా అర్థమవుతుందో ఏమో!
    హనీఫ్ విమర్ష సహేతుకంగానే వుందనిపిస్తున్నది. కథ చదవాలిక తప్పదు.

    • ప్రసాద్ గారు.

      ఐనా కథ చదివి స్పందించండి.

      కృతజ్ఞతలు.

  • ఈ విమర్ష చదివాక, కథను చదివాను. కథను చదివాక మళ్ళీ ఈ విమర్షను చదివాను.

    “మంచి మంచి ఎత్తులతో మేకల్ని చాకచక్యంగా నడిపించి, పులుల్ని కట్టేయడంలో నేర్పరిని కాబట్టి..” అంటూ రచయిత కథకుడు ఏ పక్షమో తెలియజేస్తున్నాడు.
    ఆ వెంటనే ఈ మాత్రం పోవిడీ చాలదన్నట్టు బాహాటంగానే…
    “అతనెప్పుడూ (సెవ్వన్న) మేకల వైపే. పులుల్ని కట్టేశామంటే చాలు – ఓ పొడిదగ్గు దగ్గి, ఔడుగరచి, మీసం వద్ద చెయ్యేసి, ‘చూడు మాదెబ్బా అన్నట్లుగా కళ్ళెగరేస్తాడు.” అంటాడు.

    ఇక ఈ విమర్షలో హనీఫ్ గారు, “పిల్లల కోడి వెంట పడి తరిమినా,చెట్టు కింద తీరిక దొరికి ఆడుకుంటున్న మగవాళ్ళు అందరూ అడ్డుపడ్డా కుక్క కోడి పిల్ల ఒకదాన్ని నోట కర్చుకొని గోడ దూకి పారి పోతుంది.” అన్నారు గానీ, కథలో కుక్క ఆ సందర్భంలో కోడిపిల్లను ఎత్తుకొని పోయిందన్న ఋజువు లేదు.

    ఈ కథలో బాధితుల పక్షమే వహించేవాడిలా సెవ్వన్నను చూపించాక అతన్ని కుక్కను చంపేవాడిగా చూపించాలంటే దానికి కావలిసిన నేపథ్యాన్ని బలంగా చిత్రించాడు రచయిత. చదివే పాఠకుడికి కుక్కను చంపడం న్యాయమేననిపిస్తుంది. సెవ్వన్నకూ న్యాయమేననిపించింది. కానీ కథలో ఎక్కడా నక్సలైటును చంపడమూ, కుక్కను చంపడమూ ఒకటేననే ధోరణి స్పురించదు. కథకుడికీ ఆ అలోచన తాలూకూ వాసన వున్నట్లు కూడా అనిపించదు. పోలికల్లా అలాంటి (చంపదగిన) కుక్కను చంపితేనే దాని బిడ్డల పట్ల సెవ్వన్నకు జాలి కలిగిందే… మరి నక్సలైట్లను చంపినపుడు వారి బిడ్డల బాగోగులు ప్రభుత్వం చూడక్కర లేదా అని మాత్రమే.

    అయితే కథ ఈ పోలికతోనే ఆగదు. కథకుడు “అర్థం కానిదల్లా – వూరకుక్కల్లో యీ హింసాప్రవృత్తి, వేట మనస్తత్వం ఎట్లా ప్రవేశించిందా అని” ఆశ్చర్యపోయి సెవ్వన్నను ఆమాటే అడుగుతాడు. అప్పుడు సెవ్వన్న “తిండి దొరక్కనే..” అని బదులిస్తాడు.

    ఇది చదివాక తను చేస్తున్న పోలిక సెవ్వన్న కుక్కపిల్లలను కాపాడటముతోనే కాదు, కుక్కతో కూడానని రచయితకు తెలుసు అనిపించింది. ఇదే నిజమయితే హనీఫ్ గారి కోపానికి అర్థం వుంది. అయితే ఈ విమర్షను చదవకపోయి వుంటే నాకు ఆ జ్ఞానం కలిగేదా! ఏమొ!!

    అయితే ఇలాంటి కథను ఎందుకు ఎన్నుకున్నారో సంపాదకులు ఏమైనా చెప్పారా అని సంపాదకుల ముందుమాట చూశా. అందులో “కాపాడే జంతువుల్నే వేటాడే వాళ్ళూ” అనే మాటలతో ఈ కథను సూచించారు. అంటే వాళ్ళు ఈ కథను ఎన్నుకున్న కారణం మనం పెంచుకునే కుక్కనే చంపుకునే అనివార్యతలోకి ఎలా నెట్టబడ్డాము అన్న కోణమా??

  • హనీఫ్ సమీక్షలో సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే రకరకాల కామెంట్స్ చేశారు. కొంతమంది కమ్యూనిస్టు అభిమానులకు కూడా కథలో ఏ తప్పూ కనిపించలేదు. పోరాడితే పోయేదేముందిరా బానిస సంకెళ్ళు తప్ప. అన్న రోజుల్లో నుండి పోరాడితే పిల్లల కార్పోరేటు చదువులు పోతాయి. ఇంట్లో కలర్ టీవీలు పోతాయి.. ఇంకా భిక్షగా వస్తున్న ఆసారాలు , రాయితీలు పోతాయి. అందుకే మధ్యతరగతి వర్గం ఉద్యమాల పట్ల ఉద్యమకారుల పట్ల సానుభూతి తగ్గిపోవటంతో పాటు పాలకుల పట్ల అభిమానాలు పెరిగాయి.

    ఇక ఏది మంచి కథ? వామ్మో ! ఇది పెద్ద గందరగోళమైన ప్రశ్న. పాత నిర్వచనాలు , లక్ష్యాలు ఇప్పుడు పనికిరావు. ఎవరి వర్గం వారిది. ఎవరి సూత్రాలు వారివి. వారికి మంచి అనిపించిన కథలు వారు ఎన్నిక చేసుకుంటారు. ఆ మంచి కథలు హనీఫ్ కో నాకో నచ్చకపోతే వారికి వచ్చిన నష్టమూ లేదు. ఇంకా ప్రగతిశీలమైనవీ , అభ్యుదయమైనవీ రావాలని‌ కవులు కళాకారులు పీడిత తాడిత పక్షంగా ఉండాలనీ అనుకోవడం వలన మనకు ఒకలా కనిపించిన కథ వారికి మరోలా కనిపించి ఉండవచ్చు. “వర్గాలు” మరిచి పోకూడదు. ” మేము అభ్యుదవాదులము, ప్రగతిశీల వాదులము , మా రచనలు ప్రజాపక్షము ” అనుకనే వారెవరూ ప్రజా పోరాటాలు చేస్తున్న ఉద్యమకారుల్ని కుక్కలతో నక్కలతో పోల్చరు. ఇక ఊరకే వారి మానాన వారు ఏదో కథలు రాసుకుంటుంటే వారిని ప్రశ్నించటం ఏమిటి మిత్రమా! ?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు