త్వరగా ఆఫీస్ కి వెళ్ళాలి
దారుల్లో అదే రంగు బస్సులు
పొద్దున ఏమీ తినక పోయే సరికి
ప్లేట్లోంచి జారి నేలమీద కారిపోతున్న చట్నీలా రోడ్డు
దాని మీద పారాడే ఈగల్లా, పురుగుల్లా బస్సులు, ఆటోలు, రకరకాల బండ్లు
ఎండ పెరిగినట్లు ఆకలీ పెరుగుతోంది.
అదే ఇంటి కాడున్నప్పుడు అమ్మ పోరి పోరి
‘ఇంకేవరికి బువ్వ తింటవ్?’ అనేది.
ఇక్కడ ఎవరూ ఎవర్నీ ఏమీ అడగలేని మనుషులే ఉన్నారు.
ఆకలి కొత్త కాకపోవచ్చు,
కానీ పొద్దంతా ఎండలో మాగి
వేళ దాటొచ్చి పొలం గట్టున చెట్టు కింద కూర్చొని తిన్న కొరివికారం కమ్మదనం
ఇక్కడ పెద్ద హోటల్లో తినే బిర్యానీలో లేకుండా పోయింది.
పొలానికి నాన్నతో ఎప్పుడూ బస్సులో పోలేదు కానీ
ఈ మహా నగరంలో పనికి బస్సులోనే పోయ్యేది.
ఇక్కడ బస్సులకు కొదవలేదు.
మన సమయాలను గదుల్లో బంధించే మనకే కొదవ.
జంగిడి గొడ్లు అడివికి పోతంటే
పనికి ఏలయిందని తెలిసేది
ఇక్కడ సమయాన్ని ఏ ఆనవాళ్ళతో కనిపెట్టాలి?
ఇక్కడ నేనే ఒక జంగిడి గొడ్డుని.
*
భలే పోలికలు కవితలో