‘మనకెందుకు లే…’- రెండు కవితలు, రెండు సందర్భాలు

మంచివాళ్ళ మౌనం వలన, అణచివేతలు, అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మధ్యేమార్గం అవలంబించటం వలనా జరిగే అనార్థాల గురించి ఎన్నిసార్లు, ఎన్నిచోట్ల చదివినా, ‘ఆ, మనకెందుకులే..’ అని వెళ్లిపోయేవాళ్లే ఎక్కువ. ‘మనదాకా వస్తే కానీ తెలియదు’ అంటారుగానీ అక్కడిదాకా వచ్చేసరికి పరిస్థితి చేయి దాటిపోయి ఉంటుంది. అయినా మనకు రాజకీయాలు గిట్టవు. ఉద్యమాలు మనవి కావు. మనలో ఎక్కువ మంది పరిస్థితి ఇదే. ఈ పరిస్థితి గురించి రెండు విభిన్న సందర్భాలలో ఇద్దరు కవులు రాసిన రెండు కవితల్ని చూద్దాం.

మొదటి కవిత ‘first they came for the communists…’ చాలా ప్రసిద్ధమైనది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత Martin Niemöller రాసినది.

మొదట వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను కమ్యూనిస్టుని కాదు కదా,
నేనేమీ మాట్లాడలేదు

తర్వాత వాళ్లు సోషలిస్టుల కోసం వచ్చారు
నేను సోషలిస్టును కాదు కదా,
నేనేమీ మాట్లాడలేదు

ఈసారి వాళ్లు కార్మిక సంఘ సభ్యుల కోసం వచ్చారు
నేను కార్మిక సంఘ సభ్యుణ్ణి కాదు కదా,
నేనేమీ మాట్లాడలేదు

అప్పుడు వాళ్ళు యూదుల కోసం వచ్చారు
నేను యూదును కాదు కదా
నేనేమీ మాట్లాడలేదు

చివరికి వాళ్ళు నాకోసం వచ్చేసరికి
నా తరపున మాట్లాడడానికి
ఎవరూ మిగిలి లేరు

First they came for the Communists
And I did not speak out
Because I was not a Communist

Then they came for the Socialists
And I did not speak out
Because I was not a Socialist

Then they came for the trade unionists
And I did not speak out
Because I was not a trade unionist

Then they came for the Jews
And I did not speak out
Because I was not a Jew

Then they came for me
And there was no one left
To speak out for me

Martin Niemöller (1892 – 1984), జర్మనీలో లూథరన్ చర్చ్ పాస్టరుగా, ప్రొటెస్టెంట్ మత నాయకుడిగా ఉండేవాడు. అతను మొదట్లో అప్పటి జర్మన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాడు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిలో కమ్యూనిస్టులు, సోషలిస్టుల నాస్తికత్వం అతనికి, తోటి మతాధికారులకు నచ్చలేదు. దానితో హిట్లర్ ను సమర్థించాడు. పైగా, క్రైస్తవ మతంలో సాంప్రదాయికంగా ఉన్న యూదువ్యతిరేకత నాజీలలో ఉండటం అతనికి తప్పుగా అనిపించలేదు.

అయితే నాజీల యూదువ్యతిరేకత, యూదులను అధికారానికి దూరంగా, రెండవ తరగతి పౌరులుగా ఉంచటం వరకే పరిమితమవుతుందని, అలాగే వారి జాతీయవాదం చర్చ్ వ్యవహారాలలో తలదూర్చదనీ అతను, తోటి మతాధికారులు నమ్మారు. ఆ మేరకు హిట్లర్ వాళ్ళకి హామీలు ఇచ్చినట్లు రుజువులు ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిట్లర్ చర్చి ఆధిపత్యాన్ని తగ్గించి, మతాన్ని రాజ్య యంత్రాంగ పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. యూదుల అణిచివేత కూడా క్రమక్రమంగా పెరిగి చివరికి కాన్సంట్రేషన్ క్యాంపులు, మూకుమ్మడి హత్యల వరకూ చేరింది.

దీనితో Niemöller, ఇంకొందరు మత పెద్దలు నాజీలను వ్యతిరేకించటం మొదలు పెట్టారు. చర్చి వ్యవహారాల్లో నాజీ ప్రభుత్వం తలదూర్చటానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం మెల్లగా నాజీల రాజకీయ, నైతిక విలువలకు వ్యతిరేకంగా మారింది. దీనిని సహించలేని హిట్లర్ ప్రభుత్వం 1937లో Niemöller తోపాటు, ఎనిమిది వందల మందిని అరెస్టు చేసి జైళ్లకు, తర్వాత కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించింది. వీళ్లలో ఎందరో చంపబడ్డారు. చివరికి 1945లో అమెరికన్ సైన్యాలు వీళ్ళని విడిపించాయి.

ఎనిమిదేళ్ళ జైలు జీవితం, రాజ్య హింస, తనను ఎంతో మార్చివేశాయని Niemöller చెప్పుకున్నాడు. హిట్లరును, నాజీ పార్టీని మొదట్లో సమర్థించినందుకు ఎంతో పశ్చాత్తాప పడ్డాడు. యుద్ధానంతరం, చర్చి యంత్రాంగం నాజీల దుర్మార్గాలను ఆపటానికి చేయగలిగినంత చేయలేదని ఒప్పుకుంటూ రాసిన Stuttgart Declaration of Guilt రచయితల్లో అతను ముఖ్యుడు. తన మిగిలిన జీవితం అంతా యుద్ధ వ్యతిరేకిగా ఉద్యమిస్తూ గడిపాడు.

అలా, తన రాజకీయ, నైతిక, మత విశ్వాసాలకు అనుగుణంగా మొదట ప్రవర్తించి, ఆ విశ్వాసాలు సృష్టించిన పరిస్థితులను చూసి, అర్థం చేసుకుని, మానసిక పరివర్తన చెంది, ఆ పరివర్తనను ఉద్యమంగా మార్చుకుని, అందువల్ల అష్టకష్టాలు పడిన వ్యక్తి తన తప్పులు తలుచుకుని రాసుకున్న ఒప్పుకోలు ఇది.

మరి ఎక్కువ మంది ఇలా ఉంటారా? ఉండరు. మన రాజకీయ, నైతిక విలువల ప్రభావం ఎంత వినాశకారిగా మారినా, గుర్తించి, ఒప్పుకునే విశాల స్వభావం మనకు ఉండదు. ఎంత నైతికంగా పతనమైనా, మానసికంగా ఎంత కష్ట పడ్డా, భౌతిక భద్రత చూసుకునే భద్ర జీవులమే మనం. మనకి పరివర్తనకు, ఒప్పుకోలుకు అవకాశం లేదు. మన వంటి వాళ్ళ కోసం, మన నిష్క్రియాపరత్వాన్ని, దాని వల్ల మనకు కలిగే నిష్కృతి లేని అనంత క్లేశాన్ని ఎత్తి చూపేదే ‘రాజకీయాలు పట్టని బుద్ధిజీవులు’ (apolitical intellectuals) అనే ఈ కవిత.

ఒకరోజు, ఏదో ఒక రోజు
రాజకీయాలతో మనకెందుకు
అనుకునే నా దేశపు బుద్ధిజీవులని
సామాన్య ప్రజలు
నిశితంగా ప్రశ్నిస్తారు

తమ దేశం
చిన్న దీపంలా
ఒంటరిగా, కొడిగడుతూ
కొద్ది కొద్దిగా చనిపోతున్నప్పుడు
వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో
అడుగుతారు

వాళ్ల దుస్తుల గురించి,
భోజనానంతరం వాళ్ళ కునుకుల గురించీ
ఎవరూ అడగరు,

“సర్వం మిథ్య” వంటి ఆలోచనలతో
వాళ్ళు చేసిన పనికిమాలిన పోరాటాల చరిత్ర
గురించి ఎవరూ తెలుసుకోవాలనుకోరు
డబ్బు సంపాదించటంలో
వాళ్ల ప్రావీణ్యాన్ని ఎవరూ లెక్కచేయరు.

గ్రీకు పురాణాల గురించి
వాళ్ళని ఎవరూ ప్రశ్నించరు
వాళ్ల అంతరాత్మ ఎప్పుడు ఎలా
పిరికి చావు చచ్చిందో ఎవరూ ఆరా తీయరు.

శుద్ధ అబద్ధపు నీడలో
వాళ్ళు పుట్టించుకున్న
అర్థం పర్థం లేని సమర్థనల గురించి
కూడా వాళ్ళని ఎవరూ అడగరు.

ఆ రోజు
సామాన్య ప్రజలు వస్తారు

రాజకీయాలు మనకెందుకు
అనుకున్న బుద్ధి జీవుల
పుస్తకాల్లో, కవిత్వాల్లో
కనపడని సామాన్య ప్రజలు
రోజూ వాళ్ళ ఇళ్ళకి కూరగాయలు, పాలు
కిరాణా సరుకులు, వార్తా పత్రికలు
తెచ్చి ఇచ్చిన ప్రజలు
వాళ్ల కార్లు తోలిన ప్రజలు
వాళ్ల కుక్కలనీ, తోటలనీ చూసుకున్న ప్రజలు

ఆ సామాన్య ప్రజలు వచ్చి,
“పేదవాళ్ళు నానా కష్టాలు పడుతున్నప్పుడు,
వాళ్లలోని సున్నితత్వము, జీవమూ
మాడి మసి చేయబడుతున్నప్పుడూ,
మీరు ఏం చేశారు?”
అని నిలదీస్తారు.

రాజకీయాలు మనకెందుకు
అనుకునే నా ప్రియదేశపు
బుద్ధి జీవులారా,
మీ దగ్గర సమాధానం ఉండదు.

మీ నిశ్శబ్దం రాబందులా
మిమ్మల్ని లోపల నుంచీ కొరుక్కుతింటుంది.

మీ దౌర్భాగ్యం
మీ ఆత్మని పొడిచి పొడిచి సతాయిస్తుంది.

సిగ్గుతో మీ గొంతుకలు మూగబోతాయి.

Apolitical Intellectuals

One day
the apolitical
intellectuals
of my country
will be interrogated
by the simplest
of our people.

They will be asked
what they did
when their nation died out
slowly,
like a sweet fire
small and alone.

No one will ask them
about their dress,
their long siestas
after lunch,
no one will want to know
about their sterile combats
with “the idea
of the nothing”
no one will care about
their higher financial learning.

They won’t be questioned
on Greek mythology,
or regarding their self-disgust
when someone within them
begins to die
the coward’s death

They’ll be asked nothing
about their absurd
justifications,
born in the shadow
of the total lie.

On that day
the simple men will come.

Those who had no place
in the books and poems
of the apolitical intellectuals,
but daily delivered
their bread and milk,
their tortillas and eggs,
those who drove their cars,
who cared for their dogs and gardens
and worked for them,
and they’ll ask:

“What did you do when the poor
suffered, when tenderness
and life
burned out of them?”

Apolitical intellectuals
of my sweet country,
you will not be able to answer.

A vulture of silence
will eat your gut.

Your own misery
will pick at your soul.

And you will be mute in your shame.

ఈ కవిత రాసిన Otto Rene Castillo గ్వాటెమాలా దేశానికి చెందిన కవి. గ్వాటెమాలాలో విదేశీ ఆధిపత్యానికి, అమెరికన్ కుట్రలకు వ్యతిరేకంగా పోరాడటానికి 1960లో ఏర్పడిన Fuerzas Armadas RebeldesFAR అనే గెరిల్లా పోరాట సంస్థలో Castillo సభ్యుడు. రహస్య విప్లవదళాలలో పనిచేసిన కారణంగా అతని జీవితం గురించి కచ్చితంగా తెలిసింది తక్కువే. 1934లో జన్మించిన Castillo అనేక పోరాటాలు, విదేశీ వాసాల తర్వాత 1967 లో ప్రభుత్వ దళాలకు దొరికారు. నాలుగు రోజుల విచారణ, హింసల తర్వాత అతన్ని సజీవ దహనం చేశారని తెలుస్తుంది. గ్వాటెమాలా దేశంలో తరతరాలుగా నడుస్తున్న అంతర్యుద్ధాలు, విదేశీ శక్తులకు అమ్ముడుపోయి దేశాన్ని దోచుకున్న నాయకులు, వారికి సహకరించిన రాజకీయ, సాంస్కృతిక, సామాజిక పరిస్థితులు, ఈ కవిత రాయటానికి అతన్ని ప్రేరేపించాయని చెప్పవచ్చు. గ్వాటెమాలా చరిత్ర క్లుప్తంగా చూస్తే మనకి ఈ విషయం అర్థం అవుతుంది.

మధ్య అమెరికాలో మెక్సికో, ఎల్ సాల్వడార్, హోండూరస్ దేశాల మధ్య గ్వాటెమాలా ఉంది. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నుండీ క్రీస్తు శకం 1500 సంవత్సరం వరకూ మాయా నాగరికత అవిచ్ఛిన్నంగా విలసిల్లిన ప్రాంతం ఇది. క్రీస్తు శకం 1500 సంవత్సరంలో ప్రారంభించి స్పెయిన్ దేశం ఈ ప్రాంతాలని ఆక్రమించింది. 1821వ సంవత్సరంలో స్వతంత్రం వచ్చినప్పటికీ, ఇరవయ్యో శతాబ్దం వరకూ అంతర్యుద్ధాలతో గడిచి పోయింది.

1901 లో అమెరికాకు చెందిన యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ, అరటి సాగు కోసం గ్వాటెమాలాలో ప్రవేశించి, అక్కడి రాజకీయ నాయకుల, దేశాధినేతల సహకారంతో వేల ఎకరాల భూమిని సొంతం చేసుకుని, త్వరలోనే దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది. ఈ విధంగా విదేశీ శక్తులు ఒక దేశంలో ప్రవేశించి, అక్కడి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నాయకులను లోబరుచుకుని, మొత్తం దేశాన్నీ సొంత ఆస్తిగా మార్చుకుని, ఆ దేశాన్ని దోచుకునే సందర్భంలో, అటువంటి దేశానికి “బనానా రిపబ్లిక్” అని పేరు రావటం ఇక్కడే మొదలైంది.

చివరికి, 1944లో అప్పటి దేశాధినేత, నియంత Jorge Ubicoకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమ ఫలితంగా Juan José Arévalo, Jacobo Árbenz లు 1944 నుండీ 1954 వరకూ ప్రభుత్వాలను నడిపారు. ఈ సమయంలో కొత్త కార్మిక, వ్యవసాయ చట్టాలను చేశారు. విదేశీ కంపెనీలకు, దేశీ నాయకులకు  కాకుండా దేశ ప్రజలకు అనుకూలంగా ప్రవర్తించారు.

ఇది నచ్చని యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ అమెరికా ప్రభుత్వాన్ని సహాయం కోరింది. అమరికా వరల్డ్ బ్యాంక్ నుండీ గ్వాటెమాలాకు నిధులు అందకుండా చేసింది. 1954లో అమెరికా దేశాధినేత Eisenhower మద్దత్తుతో అమెరికా గూఢచారి సంస్థ సెంట్రల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని కూలదోసింది. అప్పుడు మొదలైన అంతర్యుద్ధం 1996 వరకూ కొనసాగింది. ఆ తర్వాత కూడా, ఇప్పటి వరకూ గ్వాటెమాలాలో మానవ హక్కుల ఉల్లంఘన, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనని ప్రభుత్వం లేదు.

ఇప్పుడు, జనవరి 2024లో, గ్వాటెమాలా విప్లవానికి సారథులలో ఒకరైన Juan José Arévalo కొడుకు Bernardo Arévalo దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దౌత్య వేత్త, సామాజిక శాస్త్ర నిపుణుడు, రచయిత అయిన ఆయన నేతృత్వంలో గ్వాటెమాలా పూర్తి ప్రజాస్వామ్యంగా కొనసాగుతుందని ఆశిద్దాం.

అయితే ప్రపంచ వ్యాప్తంగానూ, భారత దేశంలోనూ, విచ్ఛిన్నకర రాజకీయ, సామాజిక శక్తులు నానాటికీ బలపడుతున్న నేపథ్యంలో ఈ రెండు కవితల ప్రాసంగికత ఏ మాత్రం తగ్గలేదని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఏ దేశమైనా గ్వాటెమాలా అవటానికి ఎక్కువ సమయం పట్టదనీ, మనం గమనించాలి.

*

వేణుగోపాల కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు