ఏవో
నమ్ముకున్న నమ్మకాలు చెదిరి
లోన
మూగగా గుండె బెదిరి
ముప్పయ్యారు గుచ్చుకున్న
గాజుపెంకుల్తో
కళ్లల్లో
పరుచుకున్న
ఎడారి ఇసకబీటల్తో
తలుపు తీసినామె
ఎదురుగా
అవయవాలన్నీ
కూడదీసుకొని వుంటా గదా –
కళ్లలో ప్రేమ తళుకుతో
ఒకింత చలవ మాటలతో
ఒడి చేతుల్లో
చెంపల మీద ఇష్టపు
శిరోజాల గిలిగింతల్లో
మునిగిపోతానని
ఎంతగా ఎదురుచూస్తాను గదా-
ఒక మనిషినై మళ్లీ
ఆమె బాహువుల్లో పుడతానని
ఆశ పడతాను గదా-
ఖాళీ అయిన
గాజు చూపుల్తో..
కన్నుల్లో ఏదో
పోగొట్టుకున్న
వెతుకులాటతో
ఆమె
ఒక
తప్పనిసరి
నవ్వులా..
చిక్కువడిన
దారపు వుండ
కొసలా..
క్షణమాత్రం
శూన్యమయాను.
ఆమె కూడా
తనని తానుగా
వెలిగే క్షణం కోసం
ఎదురుచూస్తుందా..
నోరు లేని కన్నుల్తో
ఏదైనా చెప్పే అవకాశం రానిది
చెప్పాలనుకుందా..
మనిషెప్పుడూ
సేద తీర్చే చెలిమె
అనిపించాలి
లోన
మనసు లోలకాలకు..
ఇంకా
బతికున్న
మృదులాలకు..
ఆమెకు..
నాకు..
కదా అని
నేనూ
ఆమెను
కూడదీసుకున్నాను.
కాస్తంత తనని
నింపుకోవడానికి
నా నుంచి నన్ను
కాస్తంత
ఖాళీగా
ఉంచుకున్నాను.
సముద్రాన్ని
తల బాదుకునే అలల్ని
విడదీసి చూసే కనులు
ఇక లేవు
నాకు.
*
బావుంది
మంచి కవిత సార్
మంచి కవిత అన్న