ఏ అన్నమయ్య కావాలి?!

కొన్ని దశాబ్దాలుగా మన తెలుగు భాష లేదా భాష ఆవిర్భావం ఎలా జరిగి ఉంటుంది అనేది నన్ను వెన్నాడుతున్న ప్రశ్న. ఈ ప్రశ్న సంగీతానికి కూడా వర్తిస్తుంది అనేది నా భావన. In my view these evolutions are hermeneutic in nature. అంటే ఒక పరస్పర ప్రతిస్పందనలతో, కలయిక విడివడులతో ఆవిష్కృతమౌతూ ఒక సర్పిల అంటే spiral గా వృద్ధి పొందుతూ వస్తుందని. ఈ ఆలోచనా పరంపరలో, 17-Feb-2019 నాడు ముఖపుస్తకంలో పంచుకున్న కొన్ని సందేహాలు:

కొందరు తప్పుగా, అన్నమయ్య పాటలలో శాస్త్రీయత లేదని అంటారు. అసలు అన్నమయ్య ఏ విధంగా తన పదాలు పాడుకొని ఉంటాడు? ఏవిధంగా పాడాలని అనుకోని ఉంటాడు? అన్నమయ్య పురందరదాసును కలిశాడని చిన్నన్న రాశాడు. అంటే అన్నమయ్యకు ఈనాడు పిలవబడే కర్ణాటక సంగీత వరవడి పూర్తిగ తెలిసి లేక తెలియక ఉండవచ్చు. లేదా

ఆయన జానపదుల సరళిని మహోన్నతం చేసి ఒక నూతన రూపు ఇచ్చి ఉండవచ్చు. ఆయన తన సాహిత్యం జన సామాన్యానికి కూడా అందాలని, పదాలను సంగీత చట్రానికి బంధించకుండా, ఆ సాహిత్యం విన్నవారిలో ఒక కదలిక కలిగించాలని భావన అయిఉంటుందని అనిపిస్తూ ఉంటుంది, అన్నింటికీ కాకపోయిన.

‘అదివో అల్లదివో’ అన్నా, ‘పిడికిట తలంబ్రాలు’ అన్నా, ‘తందనాన భళ తందనాన’ అన్నా ఒక వేగం, ఒక ఆవేశం, ఒక ఆట పట్టింపు, హాస్యం అందు ఉండాలేమో? మనమెరిగిన శాస్త్రీయ చట్రం ఆన్నమయ్య పద సొంపుని, భావనని మరుగున పడేస్తున్నదా?

ఆనాడు చాలామంది కొన్ని మంచి వివరణలు అందించారు కూడా.

ఈ చర్చ మరల నాలో మెదలవడానికి మొదటి కారణం, మొన్న మే 23, 2024 న అన్నమయ్య జయంతి సందర్భంగా, Sudhakar Modumudi గారు, అందించిన ఒక ఆలోచనాత్మక గుళిక: “అన్నమయ్య సాహిత్యమే అంత గొప్పగా ఉంటే… ఇక ఆయన సంగీతమెంత గొప్పగా ఉండి ఉంటుంది? ఆనాడు వాడుకలో ఉన్న రాగాలు పరిమిత సంఖ్యలోనే ఉండేవి కదా!.. మరి రాగిరేకుల మీద వ్రాసిన విధంగా చూస్తే, ఒకే రాగాన్ని కొన్ని వందల సంకీర్తనలకు ఆయన ఎలా స్వరపరచి పాడుకొని ఉంటారు? ఊహకు అందని విషయమది!..

అందుకే…అందరం ‘అన్నమయ్యా!నీకు వందన మన్నామయ్యా!’ అనవలసిందే!..”

దానిపై నా స్పందన క్లుప్తంగా ఇలా చెప్పాను: “Why can’t we imagine there was diversity, and Annamayya belongs to a school that is broader than the current classical music frame we are familiar with!”

రెండవది వృద్ధుల వారి ‘నందిపిల్లి – గురజాడ కన్యాశుల్కం’ పుస్తకం. ఇందు వృద్ధుల వారు వ్యావహారిక భాషోద్యమానికి గురజాడ సలిపిన అవిరళ కృషి. గురజాడకు, గిడిగు రామమూర్తి గారికి అన్నమయ్య గురించి తెలిసే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే, మనకు అన్నమయ్య గురించి తెలుస్తూ వస్తూంది 1940 దశకం తరువాత.

పద కవితా పితామహుడు, ముప్పది రెండు వేల పదాలు అవలీలగా వ్రాసి, మిన్ను నున్న వేద వాంగ్మయానికి: సంగీతం, సాహిత్యం జోడించి, అనాచారాలను సునిశితంగా విశ్లేషించి, పండిత, పామర రంజకంగా ఆ ఏడుకొండలవాడిని నిరంతరం జపిస్తూ, తపిస్తూ, తనతోపాటు, తోటి మానవాళిని భక్తి రసామృతంలో ఓలలాడించినవాడు, భాగవతోత్తముడు,  మన అన్నమయ్య.

నన్నయ్య నాడు – తెలుగు భాషకు కావ్య గౌరవంలేదు, సంస్కృతం మినా తెలుగు రచనకు విలువలేదు. భాషను సంస్కరించి, శబ్దార్ధ రత్నాకరాన్ని క్రోడీకరించి, ఆంధ్ర మహా భారత కావ్య రచనకు ఉపక్రమించిన వాడు నన్నయ్య. అందుకే ఆదికవిగా తెలుగువారి గుండెలలో నిలిచిపోయాడు.

కానీ పద్యం పండితుల వరకే పరిమితమై పోయినది. సామాన్యుని భాషకు, జన సామాన్యంలోని మధుర కవితలో వివిధ ప్రక్రియలైన పదాలు, దరువులు, ఏలలు, జోలలు, ధవళంబులు, శోభనాలు, మంగళ హారతులు, ఉయ్యాల, జక్కులరేకు, చందమామ పదాలు మొదలైన జానపద కవితారీతులకు విలువలేదు. వాటిని పరమ నీచాతి నీచంగా ఛీత్కారం చేస్తున్న రోజులవి. ఆ నేపధ్యంలో, ‘సంకీర్తన లక్షణము’ అనే లక్షణ గ్రంధాన్ని సంస్కృతంలో రచించి, జన నానుడిలోని ప్రక్రియలను స్వీకరించి, 32 రెండు వేలకు పైగా పదాలు రచించి జనావళిని ప్రభావితం చేస్తూ, తెలుగు సాహిత్యాన్ని సుసంన్నంచేసి, ‘పద కవితా పితామహుడు’గా కీర్తింప బడ్డాడు, మన అన్నమయ్య.

నా ఉద్దేశ్యంలో పద్యరూప సాహిత్యం గాని, శాస్త్రీయ సంగీతం (కర్ణాటక గాని, మరి ఏ ఇతర దేశ సంగీతాలు) కాని, ఆ కళారూపాల పరిణామంలో ఒక దశ అంటాను. ఉత్కృష్ట దశ అని కొందరి భావన. దానిని రూపొందించిన ప్రయోజనం ఏమిటి, ఎవరు చేశారు, ఏ కాలంలో ఇలా జరిగినది, ఆ తరువాత అ దశ దాటిన దశలు ఉన్నాయా, ఇవి అన్నీ జటిలమైన ప్రశ్నలు. అలాగని, ఒక్కమాటుగా ఒక కళారూపం ఆవిష్కృతం కాదు. కాలక్రమేణా కళ అనేది మారుతూ, ఒక పరిపక్వ దశకు చేరవచ్చు. అంతే కాక  అనేకానేక సమాంతర రూపాలు, సమాంతరంగా వర్ధిల్లావచ్చు!

ముఖ్యమైన విషయమేమిటంటే, స్వరాలను స్థిరపరిచి, రాగాలను క్రోడీకరించి, రాగ లక్షణాలను వర్గీకరించి, వాటిని తెలిపే ఒక లిపి అంటే, notation ఏర్పరచి, ఈ సమస్తాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో అమర్చి, దానికి పండిత ఆమోదముద్ర వచ్చే ఒక ఉద్యమం నడిపి, జనాదరణకు ముందు తరాలకు అందచేసే విద్యా ప్రణాళిక, ప్రవేశ అర్హత, ఆ అంశాలయందు పూర్ణత కలిగినట్లు ధృవీకరణ పరీక్ష లాంటివి రూపొందడం, అనేవి సామాన్యమైన విషయం కాదు. పుస్తక సాంకేతిక, రవాణా, ప్రసార మాధ్యమాలు ఎంతో అణుమాత్రమైన ఆ రోజుల్లో ఇంతటి సమిష్టి కృషి ఎలా జరిగిందనేది ఊహాకు అందని విషయం. సాహిత్యానికి వస్తే, ఒక శబ్ద కోసం, పదాల సముదాయం, వ్యాకరణం, ఛందస్సు, లిపి, లాంటి వాటి శాస్త్రీకరణ కూడా ఏమాత్రం సామాన్య విషయం కాదు అనేది నా నమ్మిక.

శాస్త్రీయ రూపాలు రావడానికి ముందు వున్న విస్తృత రూప సంపద, ఆకృతులు మనకు తెలియదు. తెలిసే అవకాశం లేదు. అలాగని, ఆ దశకు ముందు ఉన్న, సమాంతరంగా ఉన్న రూపాలను మనం తక్కువగా అంచనా వేయలేము. ఎందుకంటే క్రమబద్ధీకరణ కొన్ని ఆకృతులను పక్కకు నెట్టి ఉండవచ్చు. సాహిత్యం, సంగీతం వంటి కళల వైశాల్యం ఒక Venn Diagrams అనుకొంటే, అందు శాస్త్రీయ సంగీతం, పద్య రూపాలు, వాటిలో భాగాలే కానీ, అవే సమస్త భూమిక కాదు, అనేది మనం ఊహించవచ్చు. ఉదాహరణకు, అన్నమయ్య నాటికి ఒక విస్తృత జానపద సాహిత్యం ఉందనేది నిర్వివాదాంశం. నిజానికి, వేల సంవత్సరాలు వెనుకకు పోతే, గుణాఢ్యుని బృహత్కథ, హాలుని గాథాసప్తశతి కూడా ఒక మహత్తర జనపదంలోని అనుభవాలే.

అన్నమయ్య భక్తి పాటలతో పాటు, ఆధ్యాత్మిక, జానపద అంశాలతో పాటు, సమకాలీన సాంఘిక రాజకీయ పరిస్థితులను తన పదాలలో పలికించాడు. సంస్కృతం, శిష్ట తెలుగు భాషతో పాటు, జన సామాన్య భాషలో కూడా ఆమోఘ సాహిత్యాన్ని సృష్టించాడు. అంటే, వ్యావహారిక భాషకు 600 సంవత్సరాల క్రితమే మహత్తర ప్రయత్నం చేశాడు. అంటే, గురజాడ, గిడిగు రామమూర్తి వారల కంటే ఎంతో ముందుచూపుతో సంగీత సాహిత్యాలను సంపూర్ణం కావించాడు. అందుకనే ఆయన స్పృశించిని పరిధి బహు విశాలమైనది, అది సంగీతం కానీ సాహిత్యం కానీ! ఈ పరిణామ జనిత ప్రపంచంలో, అన్నమయ్య ఒకే ఒక శాస్త్రీయ సంగీత ప్రక్రియకు తన పదాలను కుదించాడు అనుకోవడం, ఆ శాస్త్రీయ ప్రక్రియే అన్నింటికంటే మహత్తరమని అనుకోవడం, భావ్యమా? ఒక్కసారి ఆలోచించ మనవి, అందిరికి, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.

*

సారధి మోటమఱ్ఱి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు