ఆ రాత్రి
ఇప్పటికీ గడువలేదంటే
నువ్వు నమ్ముతావా
ఎప్పుడైతే
నన్ను చీల్చుకుంటూ
నువ్వు వెళ్లిపోయావో అప్పుడు
‘ ఆ ఒక్క క్షణం ‘ లోపట
నన్ను కుక్కి కుక్కి నొక్కిపెట్టావ్
***
విస్తారమైన మన మాటల్లో
మనమెపుడూ లేము
రంగులు పూసిన అద్దాలు
చప్పటి ముద్దులు
రబ్బరు దేహాల కౌగిలింతలు
సెల్ఫీల నవ్వులు
ఇరువురి నడుమ పల్చటి తెర
***
తను నాలా ఎడతెరిపి లేకుండా కురువలేదని
ఏడ్చే ఆకాశాన్ని చూసి జాలేస్తుంది
ఆకాశం, నేను
మబ్బులు కోసం, వెన్నెల కోసం
కాస్త సర్దుకుంటాం కానీ అవే్మీ మేము కాదు
***
మనుషులంతా
తక్కెడ పట్టుకొని ప్రేమిస్తారు
మనసు బరువును శేషించే తోటివారిని లెక్కిస్తారు
ఈ లోకపు ప్రేమలన్నీ సోమరిపోతులు
ప్రతీ రాత్రి నిద్రపోతాయి
దేహాలే మేల్కొంటాయ్
***
నేను, నువ్వు, ప్రేమ
ఏకాంతంగానే అందంగా ఉంటాం
నేనున్నపుడు నీవు లేవు
నీవున్నపుడు నేను లేను
ప్రేమ ఉన్నపుడు ఏ మనిషీ లేడు
***
వేదనే
జీవాధారమైనదిపుడు
*
చిత్రం: సృజన్ రాజ్
Add comment