A Tale of Elephants

దేవుడ్ని మోసే ఏనుగులుంటాయ్
దేవుడిగా మారిన ఏనుగులుంటాయ్
అలాంటి కథల్లో మనిషి పాత్రలుంటాయి
ఆ పాత్రల్లో మనిషెప్పుడు దేవుడిగా ఎదగలేదు!
దేవుడు మట్టిబొమ్మకు రాత్రిని రాసి
అడవిని తమ ఘీంకారాలతో నిద్రలేపడానికి
తొండాన్నీ సాగదీసి పిడుగు శబ్దాన్ని పోసాడు.
చుక్కల్ని కొమ్ములకు పూసి ఏనుగుకు ప్రాణం ఉదాడు.
ఏనుగుపై ఊరేగాలనే కోరిక పుట్టి దిగనని మారాం చేస్తూ
చివరికతడు ఊరేగుతూనే ఉత్సవ విగ్రహంగా ఆగిపోయాడు.
భారతీయుల్లో స్వాతంత్రోద్యమ కాంక్షను నింపాలనుకున్నప్పుడు అవి నిమజ్జన మట్టి విగ్రహాలు
దేవుడితో పాటే అవి భూమినీ,మనుషుల్నీ కాపాడుతూ మోయాలనుకున్నప్పుడు అష్టదిగ్గజాలు
మనిషికి దేవుడి స్ధానమిచ్చిన ఏనుగులు మనుషుల్లో రాక్షసుల్ని నిద్రలేపాయి
 దేవతలకు ఐరావతంలానే పిల్లలకు జంగిల్ బుక్ లో  ‘హతీ’
గజరాజులే అడవిని సృష్టించాయి
తమ దంతాలతో నేలను తవ్వి నీటిని పారించాయి
నోటితో గాలి ఊది ఆకుల్ని రాలేలా చేసాయి
పర్వతాలు,చెట్లపై పక్షులతో అడవంతటనీ తయారు చేసాయి.
ఇది అడవికి తెలిసిన నియమం… అడవిప్పుడు  మనుషులది
మనిషి అడవిని లాక్కున్నప్పుడు ఏమీ మాట్టాడనట్టే,
తమ దంతాలూడగొట్టినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నట్టే,
తోళ్ళను ఒలచినప్పుడు మౌనంగా ఉన్నట్టే,
కడుపులో బిడ్డల్ని చంపుతున్నప్పుడు ఏమీ మాట్లాడలేదు.
మనుషుల్నీ తమ బిడ్డలే అనుకుని మన్నించాయి
ఏనుగు ఏనుగు నల్లన! ఏనుగు మనసు తెల్లన
మనిషి మనిషి తెల్లన!మనిషి మనసు నల్లన
చంద్రుడు మబ్బుల్లో దాక్కొన్నప్పుడు
నేను అన్నం తిననంటే
ఏనుగప్పుడు నాన్నగా మారి నన్ను వీపుపై మోస్తుంది
పెద్దయ్యాక నా చేతిలోనే మరణిస్తానని తెలిసినా
అది అలాగే నన్ను మోస్తుంది.
*

జుజ్జూరి వేణుగోపాల్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనుషులకీ, జంతువులకీ మధ్య విరిపోటుని చెప్తూ అవెందుకు బెటరొ కవితాత్మకంగా చెప్పుకొచ్చారు. మంచి కవిత్ వేణూ మీ “బహుశా” సంపుటినుంచి.

  • నీ కవిత్వంలో మెదడు కదులుతుంది …. అప్పుడు హృదయం ఏం చేస్తుండి ఉండి ఉంటుంది ? వేణు బాగుంది. చదివించింది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు