లాస్య ఆటో ఎక్కింది. ఆటో కొంచెం ముందుకి కదలగానే జ్యోతి నుండి కాల్. “త్వరగా రా లాస్యా! సినిమాకి లేటవుతోంది” అంది.
“హా..ఇప్పుడే బయలుదేరాను. రీచ్ కాగానే కాల్ చేస్తాను” అని ఫోన్ పెట్టేసింది.
“అన్నా! కొంచెం త్వరగా పోనివ్వరా” అని ఆటో డ్రైవర్‌కి చెప్పి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ, బయటి సూర్యకాంతిని, నడుస్తున్న మనుషులను చూస్తూ ఉండిపోయింది. హైదరాబాద్ నగరంలో ఉదయం పూట అంతగా జనసంచారం, వాహనాల చప్పుళ్లు లేకపోవడం చాలా ప్రశాంతంగా అనిపించింది తనకి. చల్లని గాలి ఒంటిని కొత్తగా తెలియని కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ వీకెండ్ హాయిగా ఉంది.
ఆటో థియేటర్ ముందు ఆగింది. “హే! రారా..త్వరగా రా! ఇప్పటికే లేటయ్యింది” అని జ్యోతి హడావిడి చేసింది. చుట్టూ గుంపులు గుంపులుగా జనం. ఆరోజు ‘అతడు’ సినిమా రీరిలీజ్.
ఇద్దరు హాల్లోకి వెళ్లారు. సినిమా టైటిల్ పడింది. మహేష్‌బాబు అభిమానులు కేకలు పెడుతున్నారు. లాస్య, జ్యోతి కూడా కేరింతలు కొడుతూ అరిచారు. రీరిలీజ్‌కి వెళ్ళినప్పుడు సీట్లు వెతుక్కోవడం కంటే నిల్చొని అరవడం ఒక సరదా. ఇద్దరూ సినిమా చూస్తూ, మధ్యమధ్య ఆనందంతో అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
సినిమా మధ్యలో లాస్య ఫోన్ మోగింది. జ్యోతి తన ఉత్సాహంలో తనుంది. లాస్య వైపు చూసి “ఫోన్ పక్కన పెట్టు. ఇంటర్వెల్లో మాట్లాడొచ్చులే” అంది. లాస్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్లీ రింగ్ అయ్యింది. ఫోన్ స్క్రీన్ మీద ‘రిషబ్..మేనేజర్’ అని కనిపిచింది. తప్పదన్నట్లు లాస్య చిరాగ్గా హాల్లో నుంచి బయటికి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసింది.
“హే లాస్యా! రేపటి క్లైంట్ రివ్యూ మీటింగ్ కోసం ఈరోజు పెండింగ్ వర్క్ అంతా చెయ్యడానికి మీటింగ్ షెడ్యూల్ చేశాను. జాయిన్ అయ్యాక అన్ని విషయాలను డిస్కస్ చేద్దాం. టీంలో అందరికీ కాల్ చేసి చెప్పు. నేను కూడా చెప్తాను” అని ఫోన్ పెట్టేశాడు లాస్య చెప్పేది వినకుండా.
లాస్యకి సినిమాకి వచ్చిన మూడ్ అంతా పోయింది. ఆ ఫోన్ కాల్ తన ఆలోచనలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఉద్యోగంలో చేరి కొత్తలో మినహా ప్రతి వీకెండ్ వర్క్ చేస్తూనే ఉంది. అంత చేసినా జీతం పెంచడం లేదు. చిల్లర మొహాన కొట్టినట్లు ఇస్తున్నారు. నిరుత్సాహంగా హాల్లోకి వచ్చింది. సీట్లో కూర్చున్నా సినిమాను ఎంజాయ్ చేయలేకపోయింది.
సినిమా అయిపోయాక జ్యోతి, లాస్య బయటకు వచ్చారు. “ఎవరు కాల్ చేశారు? అలా టెన్షన్ పడుతున్నావ్?” అని నడుస్తూ అడిగింది జ్యోతి.
“నా మేనేజర్ రిషబ్. నైట్ 2 గంటల దాకా కూర్చుని వర్క్ మొత్తం పూర్తి చేశాను. ఈరోజు ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనుకున్నాను. కానీ..”
“మళ్లీ ఎందుకు కాల్ చేశాడు?”
“ఏదో మీటింగ్ ఉంది, కాల్ కనెక్ట్ అవ్వమంటున్నాడు. ఇలాగే ఓ టైం అంటూ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ అంటాడు, మీటింగ్ అంటాడు. కనీసం ముందుగా కూడా చెప్పడు. ఇలా వీకెండ్‌లో కాల్స్ కొత్త కాదు కానీ, కనీసం నా మీద కొంచెం కన్సర్న్ కూడా లేదు. ప్రతి వీకెండ్ చేస్తూనే ఉన్నాను” అంది లాస్య.
“ఈరోజు బయటకి వెళ్తున్నాను, కుదరదని చెప్పొచ్చు కదా నువ్వు?” అంది జ్యోతి.
“మొదట్లో చెప్పాను. ఒక వీకెండ్ మా మామవాళ్ళ గృహప్రవేశం ఉందని వారం ముందే చెప్పాను. చెప్పాక కూడా తింటున్నపుడు కాల్ చేసి కనెక్ట్ అవ్వాలన్నాడు. కుదరదని చెప్పినా కూడా ప్రయారిటీ బేసిస్ అని చాలా ఫోర్స్ చేశాడు. మళ్లీ మధ్యరాత్రి ఇంటికి వెళ్ళాక పని పూర్తి చేసి పంపిస్తే, ‘రేపు ఆఫీస్‌లో మాట్లాడదాం’ అని ఫోన్ పెట్టేశాడు. కనీసం రివ్యూ కూడా చెయ్యలేదు. ఇంక నాకూ అలవాటైపోయింది”.
“చాలా దారుణం కదా..!”
“హా..చాలా టాక్సిక్ మేనేజర్. నస మనిషి. పని పని అని టార్చర్ చేస్తుంటాడు. ఫ్రీ టైం అంటూ ఉండనివ్వడు. ఎప్పుడు పడితే అప్పడు కాల్ చేసి పని చెయ్యమంటాడు. అన్నీ టైంకి అయిపోవాలంటాడు. పని చేస్తూ ఉంటే ఇంకా పని చెప్తాడు. చెయ్యకపోతే రివెంజ్ కోసం ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఏదో రకంగా ఇబ్బంది పెడుతాడు. అతని ఇగో హర్ట్ అయితే నా వర్క్ రివ్యూ చెయ్యడు. పెండింగ్‌లో పెడతాడు. తర్వాత నాదే తప్పని, ఆలస్యంగా చేశావని నా మీదకి తోసేస్తాడు”.
నడుచుకుంటూ మాట్లాడుతున్నారు ఇద్దరూ. లాస్య చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తోంది జ్యోతి. “మీ మేనేజరెవడో శాడిస్ట్‌లా ఉన్నాడు. అతనితో చాలా టార్చర్ కదా లాస్యా!” అంది జాలిగా.
“ఏం చేస్తాం చెప్పు? మార్కెట్‌లో ఇప్పుడున్న కండీషన్ నీకు తెలుసు కదా! జాబ్ రావడం అంత ఈజీ కాదు. అందుకే భరించక తప్పట్లేదు. నేననే కాదు, చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. కానీ మన ఫ్రెండ్స్ చేస్తున్న కంపెనీలో ఇంత దారుణంగా మాత్రం ఉండదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెమైనా ఉండాలి. కానీ ఈ కంపెనీలో చేరినప్పటి నుంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మరిచిపోయాను. ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక కూడా మళ్లీ లాగిన్ అవ్వాలి, కనెక్ట్ కావాలి అంటాడు. నైట్ ఎంత లేట్ అయినా పని అయిపోదు. అది అతనికి కూడా తెలుసు. కొంచెం అలిసిపోయినట్లు కనిపిస్తే ‘మేము మీ వయసులో ఉన్నప్పుడు ఎంత పని చేశామో తెలుసా’ అని లాజిక్ లేకుండా చాదస్తంగా మాట్లాడతాడు. కాలాన్ని బట్టి కష్టాలుంటాయని అతనికెలా చెప్పి అర్థం చేయించాలో! సరే పద, లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం” అని ఉప్పల్‌లో ఉన్న పిస్తాహౌస్‌కి వెళ్లారు. దూరంగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని వెయిటర్‌కి ఆర్డర్ చెప్పారు.
“మీ మేనేజర్ గురించి వింటుంటేనే కోపం వస్తోంది. మరి టీంలో అందరూ ఎలా భరిస్తున్నారసలు?” అంది జ్యోతి.
“మా టీంలో చాలామంది పెద్దవాళ్ళున్నారు. ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఎలా పని చెయ్యగలుగుతున్నారనేది నాకు పెద్ద వండర్. చనువుగా ఉండే ఓ అన్నని అడిగానొకసారి. వాళ్ళకు కూడా ఇలానే వర్క్ ఇస్తూ, వాళ్ల పర్సనల్ విషయాల గురించి ఆఫీస్‌లో అందరి ముందు అన్‌ప్రొఫెషనల్‌గా మాట్లాడతాడంట. వాళ్ళకీ ఇవేవీ నచ్చడం లేదు. వర్క్ కల్చర్ సరిగా లేని కంపెనీలో పని చేయడం వాళ్లకీ ఇష్టం లేదు. కానీ వాళ్లకి పెళ్లయ్యి, పిల్లలు ఉన్నారు. ఈ డొమైన్‌లో బయట జాబ్ దొరకడం కష్టం. ఒకవేళ వచ్చినా ఇక్కడిచ్చేంత ప్యాకేజీ రాదు. మళ్లీ కొత్తగా ఇంకేదో నేర్చుకొని ప్రిపేర్ అవ్వలేరు. ఖర్చుల, లోన్స్, ఈఎంఐలతోనే సరిపోతుంది వాళ్లకి”.
“అవున్లే! వాళ్ళయినా ఏం చేస్తారు? బయట జాబ్ మార్కెట్ కూడా సరిగా లేదు. పనికి తగిన జీతం ఉండదు. గొడ్డు చాకిరీ చేయించుకుంటారు. కొన్ని కంపెనీలు బానే ఉన్నాయి లాస్యా! మన ఫ్రెండ్స్‌కి ఇంత చెత్త వర్క్ కల్చర్ లేదు. మా దాంట్లో కూడా లేదు”.
“మీరు చాలా లక్కీ! మా చేత ఇంత పని చేయించుకున్నాక ఏమన్నా గుర్తింపు ఉంటుందా అంటే అది కూడా ఉండదు. మొన్న మా టీం అందరం కలిసి పని చేస్తే క్రెడిట్ ఆయన కొట్టేశాడు. ఆయనకి ప్రమోషన్ వచ్చింది. నేను చేసిన వర్క్‌ని బట్టి చూస్తే ఈపాటికే ప్రమోషన్ రావాలి. అడిగితే ఏవేవో కారణాల చెప్తాడు. నాకు ప్రమోషన్ ఇస్తే ఎక్కడ కంపెనీ మారతానో అని అతని భయం. హైక్ పెంచుతా అంటాడు కానీ పెంచడు. టీమ్ ఔటింగ్ అని పెడతాడు. అక్కడ కూడా పని గురించి, లేదంటే పర్సనల్ లైఫ్ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. అలసటగా ఉంటే, నిద్ర సరిగా లేకపోతే, పీరియడ్స్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ అడిగితే విసుక్కుంటాడు. చాలా అవసరం అయితే తప్ప అడగొద్దంటాడు” బాధగా అంది లాస్య.
వాళ్లు ఆర్డర్ చేసిన ఐటమ్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టి సర్వ్ చేశాడు వెయిటర్. ఇద్దరూ తినడం మొదలుపెట్టారు.
“లాస్యా! నేనొకటి చెప్పనా! నువ్వు పడుతున్న కష్టానికి ప్రతిఫలం దొరకనప్పుడు బలవంతంగా అక్కడుండటం ఎందుకు? వీకెండ్ వర్క్ చెయ్యడం, గుర్తింపు లేకపోవడం, టెన్షన్..ఇదంతా అవసరమా? రోజూ ఉప్పల్ నుండి హైటెక్ సిటీ రావడం, పోవడం ఎందుకు చెప్పు? నా మాట విని నువ్వు వేరే కంపెనీలోకి మారిపో! నీది, నాది ఒకటే డిపార్ట్‌మెంట్ అయ్యుంటే మా కంపెనీలో నేనే రెఫర్ చేసేదాన్ని” అంది జ్యోతి.
జ్యోతి మాటలు విని లాస్య ఆలోచనలో పడింది. కంపెనీ మారడం అంత సులభం కాదు. అందుకు తగ్గ ప్రిపరేషన్ కావాలి. కానీ టైం సరిపోవట్లేదు. దానికితోడు ధైర్యం చాలట్లేదు. రోజులో ఎనిమిది గంటలు ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోతే గొప్ప అన్నట్లు ఉంది తన పరిస్థితి. నిద్ర, సుఖం, ఆరోగ్యం లేని ఈ పని ఎందుకు అనిపిస్తోంది. కానీ బయట తన రోల్‌కి సంబంధించిన జాబ్ దొరకడం కష్టం.
ఆలోచనల్లో మునిగిపోయిన లాస్యని చూసి “ఏంటి? ఏం ఆలోచిస్తున్నావ్?” అంది జ్యోతి.
“ఏమో జ్యోతీ! నా లైఫంతా ఏదో పెద్ద గ్లాస్ బిల్డింగ్‌లో చిక్కుకుపోయినట్లు అనిపిస్తోంది. పేరుకే పెద్ద కంపెనీ. జలగలాగా రక్తం పిల్చేస్తున్నారు. ‘నువ్వు కాకపోతే మాకు చాలామంది వస్తారు. మాది పెద్ద కంపెనీ’ అనే యాటిట్యూడ్ వాళ్లది. వదిలేయ్. ప్రశాంతంగా బయటకొచ్చి, ఇవన్నీ చెప్పి నిన్ను బాధపెట్టాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజంతా సరిపోదు” అంది లాస్య.
“హేయ్! డోన్ట్ బీ ఫార్మల్. నువ్వు కలిసేదే ఎప్పుడో ఏడాదికోసారి. ఇప్పుడు కూడా నీ మనసులో ఉన్నది చెప్పకపోతే ఎలా? అలా ఏం అనుకోకు. ఎప్పుడైనా వర్క్ వల్ల ఒత్తిడిగా అనిపిస్తే నాకు కాల్ చెయ్. ఎక్కువగా ఆలోచించకు. కంపెనీ మారడానికి ప్రయత్నించు. నాకు తెలిసిన వాళ్ళని అడుగుతాను. ఇందులోనే ఎక్కువగా ఉంటే పీసీవోడీ లాంటి లేనిపోని రోగాలొచ్చే అవకాశం ఉంది. ఇలాగే వదిలేస్తే రేపు చాలా సమస్యలొస్తాయి”.
“అవును. అదే అనిపిస్తోంది జ్యోతీ!”
“మీలాంటి పెద్ద కంపెనీలోనే ఓ అమ్మాయి నీలా విపరీతమైన వర్క్ చేస్తూ, ఎక్కువ ఒత్తిడికి గురయ్యింది. గంటలపాటు వర్క్ చేస్తూ అలాగే పడుకునేది. చివరికి అదే అలవాటుగా మారింది. ఓ రోజు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది. ఆఫీసు నుంచి కనీసం ఒక్కరు కూడా వెళ్ళలేదు చూడటానికి. ‘ఎవ్వరూ ఏమీ స్టేటస్ పెట్టొద్దు. ఎక్కడా ఆమె గురించి మాట్లాడొద్దు’ అని వాళ్ల కంపెనీ ప్రెసిడెంట్ వాళ్ల ఎంప్లాయిస్‌కి చెప్పాడంట. ఆ తర్వాత ఏదో ప్రకటన ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. తమ జాబ్‌కి రిస్క్ అనుకొని ఆమె కొలీగ్స్ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. మానవత్వం అక్కడే ఆమెతోపాటే మరణించింది” అంది జ్యోతి.
మరోసారి లాస్య మనసులో ఆలోచనలు రేగాయి. జ్యోతితో ఇవన్నీ మాట్లాడటం మంచిదే అయ్యిందనిపించింది. కొంచెం ధైర్యంగా అనిపిస్తోంది. ‘జ్యోతి చెప్పింది నిజమే! గుర్తింపు, గౌరవం లేని చోట ఎంతకాలం పనిచేసినా లాభం లేదు. నెలల తరబడి తను కోల్పోయిన వీకెండ్లు, ప్రశాంతమైన నిద్ర తనకి ఇప్పుడెంతో ముఖ్యం’ అనుకుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తున్నారు.
ఇంతలో లాస్య ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి “హలో రిషబ్! నాకు ఈరోజు కొంచెం లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. నా ఫ్రెండ్‌తో బయటకి వచ్చాను” అని టకటకా చెప్పేసింది.
“ఓకే! ఇంటికి వెళ్ళాక నాకు పింగ్ చేయ్. విల్ కనెక్ట్” అని ఫోన్ పెట్టేశాడు.
‘లేట్ అవుతుంది అంటే కూడా పింగ్ చెయ్యమంటాడేంటి’ అనుకుంది. తను చేసిన పని ఎలాగూ విలువివ్వడు. తన టైంకి కూడా విలువ ఇవ్వకుండా, తనకి చెప్పకుండానే మీటింగ్స్ పెట్టడం ఏంటి అనుకుంది. ఆరోజు మొత్తం జ్యోతితో గడిపి ఆలస్యంగా ఇంటికి వెళ్లింది. ‘వర్క్ రేపు చేస్తా. అర్జెంట్ అయితే టీంలో ఎవరికైనా చెప్పమని’ మేనేజర్‌కి మెసేజ్ చేసి, తినేసి పడుకుంది. రోజంతా తిరిగి అలిసిపోవడం వల్ల కళ్లు మూసుకోగానే నిద్రపట్టింది.
ఆదివారం దాటి సోమవారం వచ్చేసింది. ఉదయం లేవగానే అలసటగా, ఇబ్బందిగా అనిపించింది. ఈరోజు పీరియడ్స్ అని గుర్తొచ్చింది. ‘వర్క్ ఫ్రం హోమ్ కావాలి’ అని మేనేజర్‌కి ఒక మెసేజ్ పెట్టింది. అవతలి నుంచి రిప్లై లేదు. కాల్ చేసింది. లిఫ్ట్ చేయలేదు.
గంటసేపు వెయిట్ చేసినా సమాధానం రాలేదు. కాల్స్ చేసినా నో రెస్పాన్స్. ‘ఇంక తప్పదు. మళ్లీ అందరిముందు ఇన్సల్ట్ చేస్తూ, టౌంట్ చేస్తాడు. వెళ్లడమే బెటర్’ అని త్వరగా తయారై ఆఫీస్‌కి బయలుదేరింది.
నిన్నటి పెండింగ్ వర్క్ గురించి రిషబ్ లాస్యతో మీటింగ్ షెడ్యూల్ చేశాడు. నెగటివ్ పాయింట్స్ గురించి వివరిస్తూ ‘వర్క్ టైంకి చెయ్యాలి. ఈ మధ్యలో నీ ప్రొడక్టివిటీ తగ్గిపోయింది, అందుబాటులో ఉండట్లేదు’ అన్నాడు.
లాస్యకి సమాధానం ఇవ్వాలనిపించలేదు. ఏమైనా చెప్తే, సీనియర్ మేనేజర్‌కు తన గురించి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చి తనకు రాబోయే బోనస్ తగ్గిస్తాడు. ఈ భయమే రిషబ్‌కి ఎదురు మాట్లాడనీయకుండా చేస్తోంది. మీటింగ్ చివర్లో రిషబ్ ‘ఈరోజు రియా లీవ్‌లో ఉంది. తన వర్క్ కూడా కంప్లీట్ చేసెయ్’ అన్నాడు.
“ఈరోజు చాలా పనులున్నాయి. నిన్నటి వర్క్ కూడా ఉంది. ఒక కోర్స్ కూడా చెయ్యాలి. అది ఈ రోజుకే షెడ్యూలై ఉంది” అంది రిషబ్‌తో.
“ఇంటికి వెళ్ళాక పూర్తి చేయ్” అని వెళ్ళిపోబోతూ, “రేపు లీవ్స్ కానీ, వర్క్ ఫ్రం హోమ్ కానీ అడగొద్దు. ఈ వారం మొత్తం రియా లీవ్‌లో ఉంది. తన హెల్త్ బాలేదంట. తన వర్క్ నీకు అసైన్ చేస్తున్నా. కుదిర్తే ఈరోజు రాత్రే వర్క్ మొదలుపెట్టు” అని చెప్పి మీటింగ్ రూమ్ నుండి వెళ్ళిపోయాడు.
అంతా విని అలాగే కుర్చీలో కూర్చుండిపోయింది లాస్య. కడుపునొప్పి మొదలయ్యింది. ‘ఈ వర్క్ నాకే ఇవ్వాలా? వేరే ఎవరికైనా ఇవ్వొచ్చుగా! నేనే ఖాళీగా ఉన్నానా? తనకి నచ్చినవాళ్ళకి ఏ పనీ చెప్పడు. నాపైన ఎందుకో ఇంత కక్ష?’ అనుకుంది. అలా ఆలోచిస్తుండగా గతంలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది.
ఆఫీసుకి దగ్గర్లోనే తన ఫ్రెండ్ ఒకతను వర్క్ చేస్తున్నాడు. చాలా ఒత్తిడికి గురైనప్పుడు బ్రేక్ టైంలోనో, ఆఫీస్ అయిపోయాకో అప్పుడప్పుడూ అతణ్ని కలవడానికి వెళ్తూ ఉంటుంది. ఒకసారి అలా వెళ్లినప్పుడు అతను, అతని ఫ్రెండ్స్ స్మోక్ చేస్తున్నారు. తను వాళ్ల పక్కన నిల్చుని చాయ్ తాగుతోంది. అదే టైంలో క్యాబ్‌లో రిషబ్ వెళ్తూ తనని చూసి, స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు ఆఫీస్‌లో మాట్లాడుతూ ‘కంపెనీ వాళ్ళు స్మోకింగ్ పైన లెక్చర్స్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్‌లో మన టీం పార్టిసిపేట్ చేయాలి. నువ్వే లీడ్ తీసుకొని, అందరితో కోఆర్డినేట్ చేసి టీం ఎంగేజ్ అయ్యేలా చూడు’ అన్నాడు. ఆ తర్వాత ‘ఈసారి స్మోక్‌కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్లు’ అని వెటకరంగా నవ్వి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం అతనేమన్నాడో అర్థం కాలేదు తనకి. అర్థమయ్యాక కోపం వచ్చింది. వెళ్లి రిషబ్‌ని నిలదీయాలని అనిపించింది. కానీ ఆగిపోయింది.
మళ్లీ మరుసటి రోజు రిషబ్ వస్తూవస్తూనే ‘ఏంటి నిన్న అక్కడ కనిపించలేదు?’ అన్నాడు. ‘ఎక్కడ?’ అని అడిగింది. ‘అదే స్మోక్ చేస్తావ్ కదా ఆ బిల్డింగ్ దగ్గర బాయ్స్‌తో’ అన్నాడు. ‘రిషబ్! నేను స్మోక్ చెయ్యను. ఆ టైంలో చాయ్ తాగుతూ వాళ్లకి కంపెనీ ఇచ్చానంతే! ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు?’ అని గొంతు పెంచి గట్టిగానే అడిగింది.
‘అయ్యో! అదేం లేదు లాస్యా! కామ్ డౌన్! నేనేదో క్యాజువల్‌గా అన్నాను. నువ్వు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నావ్. ఎక్కువ ఆలోచించకు. వెళ్లి వర్క్ చేసుకో! గుడ్ డే’ అని సర్దిచెప్పి వెళ్లిపోయాడు. తను స్మోక్ చెయ్యనని అతనితో ఎందుకు చెప్పింది? తన వ్యక్తిగత విషయాలపై తనెందుకు అతనికి సంజాయిషీ ఇచ్చిందని ఆలోచించింది లాస్య. ఏదో తప్పు చేసినట్లు గిల్టీ ఫీలింగ్ కలిగింది తనకు.
***
రోజులు గడుస్తున్నకొద్దీ లాస్యకు జాబ్ అంటేనే విర్తకిగా మారిపోయింది. రిషబ్ ఇంకా దారుణంగా మారాడు. అతని ప్రవర్తన తట్టుకోలేక కొంతమంది ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు. తను మాత్రం ఎందుకింకా ఇక్కడుండటం అనిపించింది.
ఇన్నాళ్లూ తను సరిగ్గా పనిచేసింది. ఏ రోజూ పని తప్పించుకోలేదు. తనకు పని చెయ్యడం, పనిచేస్తూ కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. కానీ ఇక్కడలా జరగడం లేదు. గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు. దానికి తగ్గ గుర్తింపు, గౌరవం లేదు. ఇలాంటప్పుడు ఇంకా ఇక్కడ ఉండటం అవసరమా అని తనని తాను ప్రశ్నించుకుంది. పరిస్థితి ఇంకా దారుణంగా మారకముందే ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకుంది. కొత్త అవకాశాల కోసం, కొత్త జీవితం కోసం కంపెనీ మారాలి. అదంత సులభం కాదని తెలుసు. కానీ ఇక్కడే ఉంది పడే ఇబ్బంది కంటే అదేమంత కష్టం కాదని అనిపించింది. వెంటనే రిజైన్ లెటర్ రాసి మెయిల్ చేసింది.
లాస్య రిజైన్ చెయ్యడం రిషబ్ సహించలేకపోయాడు. టీం అందరిలో లాస్య పనిమంతురాలు. ఎంత పనైనా చెయ్యగలదు. అది రిషబ్ ఒప్పుకోలేని నిజం. ఎలాగైనా తనని బయటకు వెళ్ళకుండా ఆపాలని అతని ఆలోచన. లాస్యతో మాట్లాడి చూశాడు. ఒప్పుకోలేదు. ఎక్స్‌ట్రా హైక్, బోనస్, ప్రమోషన్ ఇస్తానని నమ్మించడానికి చూశాడు. కంపెనీ ద్వారా కోర్స్ స్పాన్సర్ చేయిస్తానని కూడా అన్నాడు. లాస్య మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. ‘ఏదైనా కానివ్వు, ఇక్కడ మాత్రం ఉండను’ అని గట్టిగా నిర్ణయించుకుంది. రిషబ్ అహం దెబ్బతింది. చేసేదేం లేక తన ప్రయత్నాలు మానుకున్నాడు.
లాస్య బయట జాబ్ ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. ఇంటర్వ్యూలు ఇచ్చింది. కొన్ని కంపెనీలు రిజెక్ట్ చేశాయి. కొన్ని తన 90 రోజుల నోటీస్ పీరియడ్ చూసి కుదరదని చెప్పేశాయి. చివరకు ఒక కంపెనీ 90 రోజుల నోటీస్ పీరియడ్ ఒప్పుకొని ఆఫర్ లెటర్ ఇచ్చింది. కంపెనీ గురించి కనుక్కుంటే, మంచి కంపెనీ అని, ఎంప్లాయిస్‌ని బాగా చూసుకుంటారని తెలిసింది. మంచి ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. లాస్యకి ఆనందంగా అనిపించింది. తప్పకుండా అందులోనే జాయిన్ అవుదామని నిర్ణయించుకుంది.
లాస్య వెళ్లిపోవడం నచ్చక తనకు చాలా పనులు ఇస్తున్నాడు రిషబ్. లాస్య అవేమీ పట్టించుకోవడం లేదు. ఇన్ని రోజులు ఇంత కష్టపడి పని చేసినా ఫలితం లేదు, ఇప్పుడేం ఉంటుంది అనుకుంది. 90 రోజులు గడిస్తే తన దారి తాను చూసుకోవచ్చని ఎప్పట్లాగే రిషబ్ చెప్పిన పనులు చేస్తోంది.
లాస్యకు కొత్తగా జాబ్ ఆఫర్ చేసిన కంపెనీ వాళ్ళు నెల రోజుల తర్వాత తనకు కాల్ చేశారు. ‘మాకు అర్జెంట్ రిక్వైర్‌మెంట్ ఉంది. మీ కంపెనీ వాళ్ళకి ఒక నెల జీతం ఇచ్చి ఇంకో 30 రోజుల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. లేదంటే వేరే వాళ్ళని తీసుకుంటాం’ అని చెప్పారు. లాస్యకి ఏం మాట్లాడాలో అర్థంకాక ‘ఓకే! ట్రై చేస్తాను’ అంది నిరాశగా.
లోపల భయం మొదలైంది. ‘నువ్వు ఆఫర్ లెటర్‌లో సంతకం పెడితే తప్ప, కచ్చితంగా 90 రోజులు సర్వ్ చెయ్యాలన్న రూల్ ఏమీ లేదు. నువ్వు నీ జీతం ఇస్తా అంటే కంపెనీ వాళ్లు ఒప్పుకోవాలి. కంపెనీకి ఏదైనా అత్యవసరమైన పని, అవసరం ఉంటే తప్ప నిన్ను ఆపడం కుదరదు’ అని తెలిసినవాళ్లు చెప్పారు. రిషబ్‌తో ఈ విషయం మాట్లాడదామని చూసింది. అతను తనను చూసినా చూడనట్లు ఉంటున్నాడు. అందరితో మాట్లాడుతూ, తన ముందు మాత్రం బిజీగా ఉన్నట్లు నటిస్తున్నాడు. మాట్లాడటానికి టైం ఇవ్వడం లేదు. ఏం చేయాలో లాస్యకి అర్థం కావడం లేదు. మరోవైపు తొందరగా ఏదో ఒకటి చెప్పమని ఆ కంపెనీ నుండి కాల్స్.
ఇలా కాదని మరుసటి రోజు ఆఫీసుకి రాగానే రిషబ్ డెస్క్ దగ్గరకి వెళ్ళింది. తను ఎందుకు వచ్చిందో కనుక్కోకుండా “నాకు చాలా వర్క్ ఉంది. నేను నీ ప్లేస్‌లో వేరేవాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ తీసుకోవాలి” అన్నాడు.
“మొన్ననే ఎవరో దొరికారని చెప్పారు కదా?” ఆశ్చర్యంగా అడిగింది లాస్య.
“అన్ని రౌండ్స్ బానే పర్ఫార్మ్ చేశాడు కానీ కెరీర్ గ్యాప్ ఉందని రిజెక్ట్ చేశాను” అన్నాడు. ‘ఇదేంటి? వింతగా?’ అనుకుంది.
“ఒక్క ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి” అని అడిగింది. తనకు చాలా పనుందని, ఇప్పుడు కుదరదని రకరకాల సాకులు చెప్పి తన చేత బతిమాలించుకున్నాడు. చివరకు టైం ఇవ్వడంతో విషయం చెప్పింది.
“అలా ఎలా కుదుర్తుంది? ఇక్కడ చాలా పన్లున్నాయి నువ్వు చెయ్యాల్సినవి. కొత్తవాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. కంపెనీ పాలసీ ప్రకారం కచ్చితంగా 90 రోజులు నోటీస్ సర్వ్ చెయ్యాల్సిందే” అన్నాడు. రిషబ్ మాటలకు లాస్యకు చాలా కోపం వచ్చింది. తన మీద కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నాడని అనిపించింది.
కష్టానికి ఫలితం ఇవ్వకపోవడం, చేయాల్సిన సమయానికి మించి పని చేయించుకోవడం, వీకెండ్‌లో పని చేయించడం, ఇతరుల పని అన్యాయంగా తనపై మోపడం, లీవ్స్ ఇవ్వకపోవడం..రిషబ్ చేస్తున్న ఈ పనులన్నీ కంపెనీ పాలసీలకు విరుద్ధమే! ఇవన్నీ రిషబ్‌తో వాదించలేదు. ఇప్పుడు వాదిస్తే రిలీవింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది పెడతాడని భయం.
ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో పడింది లాస్య. కొత్త కంపెనీ నుండి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. కుదరదని చెప్పడంతో వాళ్ళు ఆఫర్ లెటర్‌ని రివోక్ చేశారు. రాక రాక జాబ్ వచ్చి ఇలా జరగడంతో లాస్య కుంగిపోయింది. వేరే ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నా 90 రోజుల పాలసీ కారణంగా రిజెక్ట్ చేస్తున్నారు.
90 రోజులు పూర్తయ్యాయి. జాబ్ దొరకటం లేదన్న బాధకన్నా ఇలాంటి మేనేజర్ నుండి విడుదల దొరికిందన్న సంతోషం ఎక్కువగా ఉంది లాస్యకి. తొందర్లోనే మరో జాబ్ దొరుకుతుందని తనకి తాను ధైర్య చెప్పుకుంది.
***
నెలలు గడుస్తున్నా లాస్యకి జాబ్ దొరకటం లేదు. ఇంటర్వ్యూ ఆఫర్లు కూడా తగ్గాయి. ఇంతకుముందు 90 రోజుల నోటీస్ పీరియడ్ చూసి వద్దన్నారు. ఇప్పుడేమో కెరీర్ గ్యాప్ ఉందని అంటున్నారు. ఉన్న ఉద్యోగాన్ని వదిలి తప్పు చేశానా అని తనని తాను ప్రశ్నించుకుంది. దాచుకున్న డబ్బులు అయిపోతున్నాయి. పని లేకపోవడంతో రేపు ఎలా గడుస్తుందన్న భయం. ప్రశాంతత కరువైంది. నిద్రలేని రాత్రులు, డిప్రెషన్, మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. చాలా కృశించిపోయింది. మధ్య మధ్య జ్యోతి తనను కలిసి ధైర్యం చెప్తోంది.
ఈ పరిస్థితుల్లో ఫ్రెండ్ బలవంతం మీద హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కి వెళ్ళింది. అక్కడ తన స్కూల్ సీనియర్ కనిపించాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఏడాది నుంచి తనకు జాబ్ లేని విషయం అతనితో చెప్పింది. పాత కంపెనీలో లాస్య చేసిన రోల్ గురించి అడిగాడతను. ‘మా ఆఫీసులో ఆ రోల్ ఖాళీగా ఉంది. నీ ప్రొఫైల్ పంపిస్తే రెఫర్ చేస్తానని’ చెప్పాడు. తన ప్రొఫైల్ అతని మెయిల్ చేసింది. పంపింది కానీ, ఆ ఉద్యోగం వస్తుందన్న ఆశ లేదు. ఇప్పటికే ఎన్నో కంపెనీలు వెతికి వెతికి అలిసిపోయింది.
వారం తర్వాత లాస్యకి ఆ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఇంటర్వ్యూ బాగా జరిగింది. ఏడాది గ్యాప్ ఎందుకు వచ్చిందని వాళ్లు అడిగారు. ఆ ప్రశ్నతో నెర్వస్‌గా ఫీలయ్యింది. జాబ్ లేకవపోవడం వల్ల తను తెచ్చుకున్న అనారోగ్య సమస్యలే కారణమని చెప్పింది. ఆ స్థితిలోనుంచి తను బయటపడ్డానని, ఇప్పుడు తాను జాబ్‌కి సిద్ధంగా ఉన్నానని ధైర్యంగా సమాధానం ఇచ్చింది. ఆ మాట వాళ్ళకి సంతృప్తిగా అనిపించింది. హెచ్ఆర్ టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుందని చెప్పి పంపించారు.
అంతా బాగానే జరిగింది కానీ, లాస్య మనుసులో ఎక్కడో చిన్న భయం, నిరాశ.
మరుసటి రోజే కాల్ వచ్చింది సెలెక్టెడ్ అని. లాస్య సంతోషానికి అవధులు లేవు. పాత కంపెనీ నింపిన భయాలతో కొత్త కంపెనీలో చేరిపోయింది. మూడు నెలలు ఇట్టే గడిచిపోయాయి. అక్కడంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వీకెండ్ వస్తే ఎంత బాగా గడుపుదామా అని ప్లాన్ చేసే టీమ్ మెంబర్స్. ‘ఎక్కువ వర్క్ ఉంటే త్వరగా పూర్తి చేసుకోండి. ట్రాఫిక్ చాలా పెరిగిపోతుంది, త్వరగా ఇంటికి వెళ్లండి. ఫ్యామిలీతో గడపండి’ అని సున్నితంగా హెచ్చరించే కొత్త బాస్. ఆఫీసుకు రాలేని పరిస్థితిలో ఉంటే వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే కంపెనీ మేనేజ్‌మెంట్. ఎవరిలోనూ ఇగో లేదు. ‘అయామ్ ఎట్ రైట్ ప్లేస్’ అని ప్రతి రోజూ అనుకుంటూ, మనసులో సంతోషాన్ని నింపుకుంటోంది లాస్య. కొత్త కలలతో, సరికొత్త ఆశలతో కెరీర్‌లో దూసుకుపోతోంది.
***
రెండు జీవితాల కథ
* హాయ్ తేజా! మీ గురించి చెప్పండి.
హాయ్! మాది జనగాం. నేను పుట్టి పెరిగింది అక్కడే. ఇంటర్‌కి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే బీకాం పూర్తి చేశాను. ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో ఏఎంఎల్ స్పెషలిస్ట్‌గా చేస్తున్నాను.
* కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
మా తాత జి.వై.గిరి ప్రఖ్యాత రచయిత, ఉద్యమకారుడు. ఆయనది జనగాం దగ్గర్లో ఉన్న వడ్లకొండ. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ఆయనది కీలకమైన పాత్ర. ఆయన ఎస్‌సిడిఎస్ఎస్(సోషల్ అండ్ కల్చరల్ డెవలప్‌మెంట్ సర్వీస్ సొసైటీ) అనే సంస్థ స్థాపించి, కళల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అనేక పాటలు రాశారు. నాకు మూడేళ్ల వయసున్నప్పుడు ఆయన మరణించారు. ఆ తర్వాత 2014 దాకా నాన్న జి.కృష్ణ ఆ సంస్థను నడిపారు. అందులో 300 మంది వరకూ పనిచేసేవారు. నా చిన్నప్పుడు నాన్నతో కలిసి ఆ కార్యక్రమాలకు వెళ్లేవాణ్ని. అలా ఆ సంగీతం, సాహిత్యం నాలో ఊరిపోయాయి.
కథలకన్నా ముందు వ్యాసాలు రాశాను. డిగ్రీలో ఉన్నప్పుడు వ్యాసరచన పోటీల్లో పాల్గొని రెండుసార్లు గవర్నర్ నుంచి అవార్డులు అందుకున్నాను. పత్రికల్లో కూడా వ్యాసాలు రాశాను. 2021 నుంచి తెలుగు పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో కథలు రాయాలన్న ఆసక్తి కలిగింది. ఇది నా మొదటి కథ.
* ‘90 రోజులు’ కథ రాయడం వెనుక నేపథ్యం ఏమిటి?
నేను చూసిన రెండు జీవితాలను కలిపి ఈ కథ రాశాను. ఇందులో 90 రోజుల నోటీస్ పీరియడ్ అంశం నా స్వానుభవం. నా ఫ్రెండ్ ఒకరు వాళ్ల కంపెనీలో మేనేజర్ ఇబ్బందులు రోజూ నాతో చెప్పుకునేది. ఆ విషయాలు నన్ను చాలా కుంగదీశాయి. అలాంటి ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఈ అంశాలను కలిపి కథగా రాస్తే బాగుంటుందని అనిపించింది. అలా ఈ కథ పుట్టింది.
* మీకు నచ్చిన రచయితలు ఎవరు?
చిన్నప్పుడు ఎక్కువగా న్యూస్‌పేపర్లు చదివేవాణ్ని. 2021 నుంచే తెలుగు సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. నేను చదివిన మొదటి పుస్తకం ‘అసమర్థుని జీవయాత్ర’. ఆ తర్వాత ‘తిలక్ కథలు’ చదివాను. చలం, తిలక్ నా అభిమాన రచయితలు. విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే తత్వం, అంశాన్ని సరళంగా చెప్పడం వారి రచనల్లో నాకు నచ్చాయి. స్వాతంత్ర్య పూర్వం దేశంలో ఇలాంటి పరిస్థితులున్నాయా అనిపించేలా వారి రచనలు నన్ను కదిలించాయి.
* ఇంకా ఏమేం రాయాలని ఉంది?
ప్రస్తుతం మా తాత రచనల్ని సంకలనంగా తీసుకొచ్చే పనిలో ఉన్నాను. దీంతోపాటు రచయితగా మరిన్ని కథలు రాయాలని ఉంది. కొన్ని కథాంశాలున్నాయి. వాటిని కథలుగా తీర్చిదిద్దాలి.








Add comment