ఈ శీర్షికలో గత సంచికలో ఉపోద్ఘాతంగా నేను రాసిన పరిచయ వ్యాసానికి నేను ఊహించినదానికన్న భిన్నమైన స్పందనలు వచ్చినట్టున్నాయి. ఇలా ఒక కొత్త కాలమ్ రాయబోతున్నానని మరొక వేదిక మీద చెప్పినప్పుడు చాల మంది స్వాగతం చెప్పారు గాని అలా స్వాగతం చెప్పినవారిలో ఎక్కువ మంది నా ఈ ఉపోద్ఘాత వ్యాసం చదివినట్టు లేరు. కనీసం చదివామనే జాడలు వదలలేదు. ముందే చెప్పినట్టు నేను అసాహిత్య విమర్శకుడిని గనుక నాకు తెలిసిన సాహిత్య విమర్శక మిత్రులలో కూడ ఎక్కువమంది ఇది చదవాలనుకున్నట్టు లేరు, చదివినట్టు లేరు. కనీసం రాతలోనో మాటలోనో విమర్శ వ్యక్తం చేయలేదు. ఊహించని పాఠకులు కొందరు మాత్రం ప్రశంసనీయమైన విమర్శనాత్మకతను ప్రదర్శించారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ఉపోద్ఘాతంలో వివరించడానికి కొంత ప్రయత్నించినప్పటికీ నేను ఈ శీర్షికలో రాయదలచుకున్నదేమిటో స్పష్టంగా వ్యక్తీకరణ పొందినట్టు లేదు. రాసినవాళ్లు ఉద్దేశించే అర్థాలకూ చదివేవాళ్లు గ్రహించే అర్థాలకూ సామ్యాల కన్న భేదాలే ఎక్కువ ఉంటాయని, అందువల్లనే సాహిత్య విమర్శ, లేదా అసాహిత్య విమర్శ అవసరమవుతుందనే నా అవగాహన మరొకసారి పరోక్షంగా రుజువైనట్టుంది. రామాయణంలో పిడకలవేట లాగ ఇక్కడొక పిట్టకథ చెప్పాలి. ఇప్పటివరకూ నా వాక్యాలలో ఎక్కువ భాగం ‘అయింది’ వంటి నిర్ధారణ క్రియలు కాక ’అయినట్టుంది’ వంటి అనుమాన క్రియలు వచ్చాయి. ఇవి మళ్లీ చదువుకుంటుంటే, మార్క్స్ కాపిటల్ చదవడానికి అద్భుతమైన కంపానియన్ సంపుటాలు రాసిన డేవిడ్ హార్వే, మొదటి సంపుటం ప్రారంభంలోనే ‘ఈజ్’ అనే నిర్ద్వంద్వమైన క్రియా పదం కన్న ‘అప్పియర్స్’ అనే అనుమాన క్రియను మార్క్స్ ఎక్కువగా వాడడం గురించి వ్యాఖ్యానించాడు. ‘పైకి కనబడుతున్నదాని గురించి మాట్లాడుతున్నాం గనుక, అది కనిపించేది మాత్రమే గనుక, నిజంగా జరుగుతున్నది అది అవునో కాదో అన్వేషించవలసే ఉంది గనుక మార్క్స్ అటువంటి మాట వాడి ఉంటాడు’ అని విశ్లేషించాడు. ఇక్కడ కూడ బహుశా ‘అయింది’ అనే నిర్ధారణ కన్న ‘అయినట్టు నాకనిపిస్తున్నది’, ‘అయినట్టున్నది’ వంటి మరొక కోణానికి, మరొక పఠనానికి అవకాశం ఇచ్చే క్రియలే మేలేమోనని నాకనిపిస్తున్నది.
సాహిత్య విమర్శ అంటే ఏమిటని నేననుకుంటున్నాను, అసాహిత్య విమర్శ అనే రెచ్చగొట్టే శీర్షిక ఎందుకు పెట్టాను వంటి ప్రశ్నలను వివరించడం ద్వారా నా ఉపోద్ఘాతాన్ని మరి కాస్త వివరంగా చెప్పాలనీ, ముఖ్యంగా ఈ శీర్షిక పరిధినీ, పరిమితులనూ చెప్పాలనీ, ఇంతకూ ఈ శీర్షికలో నేను చేయదలచిన ప్రయత్నమేమిటో చెప్పాలనీ ఈ సంచికలో ప్రయత్నిస్తున్నాను.
సాహిత్య విమర్శ అంటే కేవలం సాహిత్య సిద్ధాంతమనో, లక్షణ శాస్త్రమనో, అలంకార శాస్త్రమనో నేను అనుకోవడం లేదు. సాహిత్య విమర్శ అనే మాటకు నేను చాల విశాలమైన అర్థం ఇచ్చుకుంటున్నాను. రచన చదవగానే బాగుంది, బాగులేదు అని పాఠకులు ప్రకటించే ప్రాథమిక అభిప్రాయం దగ్గరి నుంచి ఆ రచన వస్తుశిల్పాల గుణదోష నిర్ధారణ చేసి, ఆ రచనను ఆ సాహిత్య సంప్రదాయంలో, ఆ సమాజ ప్రతిఫలనాలలో భాగంగా చూసి, సాధారణీకరించే విశ్లేషణ దాకా, సాహిత్య సిద్ధాంతం దాకా, భావి రచనల, రచయితల దృక్పథ చట్రాన్ని నిర్దేశించే సూత్రాల దాకా సువిశాలమైన పరిధి సాహిత్య విమర్శకు ఇవ్వవచ్చునని నేననుకుంటున్నాను. కనుక ఒక పుస్తకం మీద చేసే విమర్శ, ఒక రచనలోని సాంకేతికాంశాల మీద చేసే విమర్శ సాహిత్య విమర్శ పరిధిలోకి రావని నేననుకోవడం లేదు.
సాహిత్య విమర్శ అనే సువిశాలమైన సాహిత్య విశ్లేషణా ప్రక్రియలో ఆయా సాహిత్య విమర్శకుల, ఆ విమర్శకు పాత్రమవుతున్న రచనల స్థాయిని, ప్రమాణాలను బట్టి వేరువేరు స్థాయిల సాహిత్య విమర్శ ఉండవచ్చు. ఇప్పుడు చాల మందికి తెలిసిన గ్రేడెడ్ స్కేల్ లో పదికి పది సాధించినది మాత్రమే సాహిత్య విమర్శ, పదికి రెండో మూడో సాధించినది సాహిత్య విమర్శ కాదు అని నేననుకోవడం లేదు. వేరువేరు స్థాయిల సాహిత్య విమర్శలు ఉంటాయి, ఉండాలి. సాహిత్యంలో ఎంత వైవిధ్యం ఉంటుందో సాహిత్య విమర్శలో కూడ అంతే వైవిధ్యం, బహుశా అంతకన్న ఎక్కువ వైవిధ్యం ఉండడం అవసరమేమో, బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒక రచనను భిన్నమైన సాహిత్య విమర్శకులు ఒకే లాగ పరిగణించారంటే ఆ రచనలోనో, ఆ సాహిత్య విమర్శకుల అవగాహనల లోనో ఏదో లోపం ఉన్నదని నాకు అనుమానం వేస్తుంది.
అయితే బాగుంది, బాగులేదు అని చెప్పడం కూడ సాహిత్య విమర్శేనంటే విజ్ఞులు ఒప్పుకోరు, నాకు తెలుసు. అది కేవలం అభిప్రాయ ప్రకటన అని, అభిప్రాయ ప్రకటన సాహిత్య విమర్శ కాదని, అంతకు మించినదేదో ఉండాలని ఒక సాధారణ అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని వివరంగా, సోపపత్తికంగా, సూత్రబద్ధంగా, ఒక పకడ్బందీ చట్రం (అంటే ఫ్రేమ్ వర్క్, కాని తెలుగులో దురదృష్టవశాత్తూ చట్రం అనే మాటకు తప్పుడు అర్థం రూఢి అయిపోయింది!) లో చెప్పమని అడగడం వేరు. అభిప్రాయ ప్రకటన సాహిత్య విమర్శ కాదనో, సాహిత్య విమర్శలో భాగం కాదనో అనడం వేరు. నిజానికి సాహిత్య విమర్శలోనైనా, ఆ మాటకొస్తే సాహిత్యంలోనైనా, అసలు ఎటువంటి ఆలోచనా వ్యక్తీకరణలోనైనా ఉండేది అభిప్రాయ ప్రకటనే. ఆ అభిప్రాయాలు ఎంతగా మూల రచన మీద అభిప్రాయాలుగా ఉన్నాయి, అవి ఎంత విశ్లేషణాత్మకంగా ఉన్నాయి, ఎంతగా ఆధారాలను చూపుతున్నాయి, ఎంతగా దృక్పథ స్పష్టతతో, సూత్రబద్ధంగా ఉన్నాయి వంటి ప్రశ్నలకు జవాబులను బట్టి ఆ సాహిత్య విమర్శ మెరుగైనది గానో, అంత మెరుగైనది కానిది గానో, చౌకబారుది గానో అంచనా కట్టవచ్చు. కాని అది సాహిత్యవిమర్శే కాదనడం నాకు అంగీకారం కాదు. అలా చేయడం ముందస్తుగా సాహిత్య విమర్శ ఇలా ఉంటుంది, ఉండాలి అని ఒక నియతివాద ప్రతిమ తయారు చేసుకుని ఆ ప్రతిమకు మిల్లీమీటరు పక్కకు జరిగినా పక్కకు పడేయడం లాంటిదే. నావరకు నాకు అటువంటి ముందస్తు ప్రతిమ ఏదీ లేదు. ఏ రూపంలోని నియతివాదం తోనైనా నాకు అంగీకారమూ లేదు. నా ముందుకు వచ్చిన ప్రతి రచననూ దానికదిగానే పరిశీలిస్తాను. ఆ రచయితకూ ఆ రచనకూ ఉన్న సంబంధపు నేపథ్యంలో చూస్తాను. దాన్ని ఒక సాహిత్య సంప్రదాయంలో భాగంగా చూస్తాను. దాన్ని ఒక సమాజ ప్రతిఫలనంగా చూస్తాను. దాన్ని ఆ సమాజపు ప్రయోజనాలను ఏ స్థాయిలో ఏ మేరకు నెరవేరుస్తున్నదనే గీటురాయి మీద చూస్తాను.
అందువల్ల అచ్చుతప్పులు, విరామచిహ్నాలు, అసమగ్ర, అసమర్థ వ్యక్తీకరణలు, తప్పుడు అన్వయాలు వంటి పాఠకులకు కూడ తెలిసిన, పాఠకులు అధిగమించగల అవరోధాలు చెప్పడం కూడ సాహిత్య విమర్శలో భాగమేనని నేననుకుంటాను. అవి చెప్పడం కూడ ఆ రచయితకూ, ఆ కాలపు సాహిత్య వాతావరణానికీ, సామాజిక పరిణామానికీ అవసరమేనని, అందువల్ల సాహిత్య విమర్శలో భాగమేనని నేననుకుంటాను. అలాగే చాలమంది సాహిత్య విమర్శగా గుర్తించని, బహుశా చిన్నచూపు చూసే పుస్తక సమీక్ష, పుస్తకవిమర్శ, ముందుమాట వంటి ప్రక్రియలు కూడ సాహిత్య విమర్శలో భాగమేననుకుంటాను. నిజానికి తెలుగు సాహిత్యవిమర్శా చరిత్రలో పుస్తక సమీక్ష, పుస్తక విమర్శ, పుస్తక పరిష్కర్తల పీఠికలు, ముందుమాటలు ఎంత కీలక పాత్ర వహించాయో ఒక బృహత్తర పరిశోధన చేయవలసే ఉంది.
అయితే నా పేచీ సాహిత్య విమర్శ ఏమిటనేదానికన్న ఎక్కువగా, ఏ రూపంలో ఉన్నా సరే, అది కేవలం సాహిత్యం మీద విమర్శగా మాత్రమే మిగిలిపోతున్నదని. సాహిత్యానికి మరేదానితోనూ సంబంధం లేదని, సాహిత్య విషయాలు సాహిత్య ఆవరణలో మాత్రమే చర్చించాలని, సాహిత్యంలో సామాజిక, తాత్విక, రాజకీయార్థిక అంశాల చర్చ రాగూడదని ఒకప్పుడు ఉండిన అభిప్రాయాల పునరుద్ధరణ ఇటీవల పెద్ద ఎత్తున జరుగుతున్నది. అసలు భాష, సాహిత్యం సామాజిక ఉత్పత్తులైనప్పుడు, వాటిని ఉపయోగించే మనుషులు సామాజిక శకలాలైనప్పుడు సమాజంతో సంపర్కం లేని సాహిత్యం ఎలా ఉంటుందో, ఆ శుద్ధసాహిత్య వాదనలు చేస్తున్నవారు ఏ శూన్యలోకాల నుంచి వాదిస్తున్నారో నాకు తెలియదు. సమాజం అంటని, సమస్యలు అంటని, ముఖ్యంగా రాజకీయాలు అంటని శుద్ధసాహిత్యం కావాలని కోరుతున్నవారిలాగే శుద్ధ సాహిత్య విమర్శ కోరుతున్నవాళ్లు కూడ పెరుగుతున్నారు. ఒక సాహిత్య రచన మీద విమర్శలో ఆ సాహిత్యానికి మూలకారణమైన రాజకీయ పరిస్థితినో, రాజకీయావగాహననో, సమకాలీన పరిణామాలనో చర్చించగూడదనే అభిప్రాయం బలపడుతున్నది. ఈ అభిప్రాయాన్ని ఉద్దేశపూర్వకంగా, సైద్ధాంతిక స్థాయిలో ప్రకటిస్తున్నవాళ్లూ ఉన్నారు. అమాయకంగా, తెలియక ప్రకటిస్తున్నవాళ్లూ, ఆచరిస్తున్నవాళ్లూ ఉన్నారు.
ఒక తాజా ఉదాహరణ చెప్పాలంటే, అఫ్సర్ కథాసంకలనం ‘సాహిల్ వస్తాడు’ వెలువడుతున్నప్పుడు, అది ఒక కాల్పనిక రచన అని నాకు అనిపించలేదు. సాహిల్ అనే పేరు దగ్గర నేను ఎన్నెన్నో పేర్లు గుర్తు చేసుకున్నాను. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ఎం ఎస్ సి బయోటెక్నాలజీ విద్యార్థి నజీబ్ ను తలచుకున్నాను. జె ఎన్ యు క్యాంపస్ నుంచి 2016 అక్టోబర్ 15న నజీబ్ మాయమైపోయాడు. అలా మాయం కావడానికి ముందు ఆయన మీద ఎబివిపి విద్యార్థుల దాడి జరిగింది. ఆ తర్వాత కనబడకుండా పోయిన నజీబ్ చనిపోయాడా, చంపేశారా, ప్రాచుర్యంలో ఉన్న ‘అనుమానం తయారీ’ లో మనం కూడ భాగమై ఆయన ఇస్లామిక్ తీవ్రవాదుల్లో కలిసి పోయాడనుకుందామా – ఏమనుకున్నా నజీబ్ తిరిగిరాలేదు. నజీబ్ వస్తాడు అని చెప్పుకోగల స్థితీ లేదు. యూనివర్సిటీ అధికారుల నుంచి, కోర్టుల నుంచి, ప్రభుత్వాధికారుల నుంచి ఏ ఒక్కరినీ తల్లి ఫాతిమా నజీబ్ వస్తాడా అని ప్రశ్నించకుండా వదలలేదు. నజీబ్ వస్తాడని నమ్మకంగా చెప్పిన మనిషి ఒక్కరు లేరు. రెండు సంవత్సరాలుగా ఆ తల్లి దుఃఖం లక్షలాది మంది కంటి చిత్తడిగా మారుతూనే ఉన్నది. అంటే సాహిల్ సాహిల్ మాత్రమే కాదు, సాహిల్ నజీబ్ కూడ. కాని ‘సాహిల్ వస్తాడు’ మీద స్పందించినవారు నజీబ్ గురించి ఇంత హృదయవిదారకమైన, కళ్లముందర కనిపిస్తున్న సామాజిక వాస్తవికతను ప్రస్తావించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది, కలిగిస్తున్నది. సాహిత్యాన్ని సాహిత్యంగా మాత్రమే చూడదలచుకున్నామనీ, సాహిత్యంలో వ్యక్తమైన సామాజిక వాస్తవికతకు, సమాజంలో నిజమవుతున్న సాహిత్యకల్పనకు సంబంధాన్ని చూడడానికి నిరాకరిస్తున్నామనీ, ప్రయత్నించడం లేదనీ అనుకుందామా అని నాలో ప్రశ్నలు చెలరేగుతున్నాయి.
ఇలా సాహిత్యంలో మాత్రమే, సాహిత్యంతో మాత్రమే ఆగిపోయే సాహిత్య విమర్శ ఒక కొసన ఉంటే, మరొక కొసన ఒక రచన మీద సామాజిక విమర్శ మాత్రమే, రాజకీయ విమర్శ మాత్రమే సాహిత్య విమర్శ అనుకునే అభిప్రాయం కూడ మనకు ఎక్కువగానే అలవడిందని నాకు తెలుసు. అది సాహిత్యపు ప్రత్యేకతను, కళగా వ్యక్తం కావడంలో సామాజిక వాస్తవికత పొందే పరావర్తనాన్ని, ప్రతిఫలనాన్ని, ఒక సమాజంలో, భాషలో సాహిత్య సంప్రదాయం రూపొందిన, అభివృద్ధి చెందిన చరిత్రను గుర్తించకపోవడం తప్ప మరేమీ కాదు. ఆమేరకు అది కూడ ఉపయోగకరమైన సాహిత్య విమర్శ కాదు, కాజాలదు. అలా అటు శుద్ధ సాహిత్య విమర్శ అయినా, ఇటు శుద్ధ సామాజిక విమర్శ అయినా అవి రెండూ వాటివాటి స్థాయిల్లో పఠితలకు, పఠన సంస్కృతికి చేయగల దోహదం పట్ల నాకు గౌరవమే కాని అవి పాఠకుల అవగాహనలనైనా, రచయితల అవగాహనలనైనా, మొత్తం మీద సాహిత్య సంప్రదాయాన్నైనా ఉన్నతీకరించడానికి సరిపోవని, అసమగ్రతలో మిగులుస్తాయని నా అభిప్రాయం.
కనుక నేను అసాహిత్య విమర్శ అన్నప్పుడు అది ఇప్పటివరకూ బలంగా ఉన్న శుద్ధ సాహిత్య విమర్శ ధోరణి మీద, శుద్ధ సామాజిక విమర్శ ధోరణి మీద నా భిన్నాభిప్రాయ ప్రకటన. నేను కావాలనుకునేది, ఈ శీర్షికలో ప్రయత్నించాలనుకునేది సమాజ-సాహిత్య సంబంధాల విమర్శ. సాహిత్యానికి మూలమూ సాధనమూ గమ్యమూ సమాజమే అనే సూత్రం నా పరిశీలనకు ప్రాతిపదిక. ఈ సూత్రబద్ధ వైఖరి మీద ఆధారపడిన చట్రాన్నే, దృక్పథాన్నే నా ఈ అసాహిత్య విమర్శ శీర్షికలో ఉపయోగించదలచాను. ఇందులో సాహిత్య భూమిక మీద నిలబడి సాహిత్య, సమాజ ఆకాశాలలోకి ఆలోచనల పతంగులు ఎగరేయాలని నా కోరిక. ఆ పతంగికి ఎక్కడికంటే అక్కడికి వెళ్లగల స్వేచ్చావకాశం ఉండాలని, కాని పతంగి నుంచి ఎన్నెన్నో ఫర్లాంగుల ఇవతల నిలబడిన నాదాకా సాగిన దారానికి నా చేతిలోని దృక్పథపు చరఖా, నేను, నా కాళ్లకింది నేల స్థిర ఆధారాలుగా ఉంటాయనీ, ఉండాలనీ నా కోరిక.
అయితే ఒక రచయిత, తన దృక్పథాన్ని వాచ్యంగా ప్రకటించాలని, అది ముందే పాఠకులకు చెప్పాలని, పాఠకుల అంగీకారాన్ని పొంది మాత్రమే ఆ విమర్శ సాగించాలని నేను అనుకోవడం లేదు. నేను పాటించే చట్రం, దృక్పథం నా రచనలో, విమర్శలో ఆకులందున అణగిమణగి తన పలుకులో వినిపించే కోయిలలా ఉండవలసిందే తప్ప అది బహిరంగంగా ఉండాలని నేననుకోవడం లేదు. ఒక పోలిక చెప్పాలంటే ఒక భవన నిర్మాణంలో ఇనుప ఊచలు, దూలాలు, స్తంభాలు, పరజాలు ఏ పాత్రను పోషిస్తాయో, ఆ పాత్రనే ఒక రచనలో దృక్పథమూ, చట్రమూ పోషించాలని నేననుకుంటాను. అవన్నీ బైటికి కనబడేట్టు కట్టడం అంటే భవనపు ఆకారానికీ, సౌందర్యానికీ, దృశ్యనీయతకూ భంగం కలిగించడమేనని, ఏ భవన నిర్మాణ కూలీ కూడ ఆ పని చేయరని నేననుకుంటాను. ఈ పోలిక సృజనాత్మక ప్రక్రియలకు ఎంతగా వర్తిస్తుందో, సృజనాత్మక రచనల విశ్లేషణగా సాగే సాహిత్య విమర్శకూ అంతగా వర్తిస్తుందని నేననుకుంటాను.
*
Very hard hitting..Provoking…
సాహిత్యం లోని వాస్తవాలను చూడ నిరాకరించే బుద్ధిజీవులం…
మీరు ఇలా దుమ్ముదులపాల్సిందే..
Thankyou sir…
True
I read your first article and did comment there. People like me who are only readers and appreciate good People oriented literature, the critical review made after reading book was appreciated as well as strongly critisiged as well. Wkat are the dimensions (kolabaddalu). Is a review limited to only the literary People?.
స్పష్టంగా, సరళంగా రాస్తున్నారు, చాలా బాగుంది.
‘సాహిత్యానికి మూలమూ సాధనమూ గమ్యమూ సమాజమే అనే సూత్రం’ – తోనే మౌలికంగా విభేదించేవారున్నా రు మరి. వారితో కూడా సాహిత్య చర్చ సాగించేందుకు ఏదన్నా కామన్ గ్రౌండ్ పట్టుకోగలమేమో – మీ వ్యాసాల ద్వారా – అన్న ఆలోచన కలుగుతోంది.
నేనైతే ఈ రెండవ భాగం కోసం ఎదురు చూసాను. ఇది చదివాక నా అవగాహన పై నాకు కొంత నమ్మకం కలిగింది
మీ రన్నట్టు పూర్తిగా సాహిత్యపరికరాలతోనో, సామాజికశాస్త్ర పరిధిలోనో కాకుండా రెంటిమధ్య సంబంధాన్ని విమర్శ పట్టించుకోవాల్సి ఉంది.
థాంక్యూ సార్.
సర్…ఈ వ్యాసం బాగుంది, చదువుతుంటే…టి.ఎం.ఎస్.ఆర్ గుర్తుకు
వచ్చారు. నిర్మోహమాటమైన విమర్శా శైలీ మీ ప్రత్యేకతగా మరోసారి
అవగాహన చేసుకుంటాం. ఇప్పటి సందర్భానికి అవసరమేనని నా భావన.
కోడం కుమారస్వామి.