మంచి కలగంటాన్నేను. ఆ కలను నీకెలాగైనా అలాగే చెప్పాలనుకునే మంచి కల. నువ్వు, నేను ఇద్దరమే ఉంటాం ఆ కలలో. కల కంటున్నప్పుడే దాన్ని నీకెలా చెప్పాలా అని వాక్యాలు నిర్మించుకుంటూ ఉంటా.
ఒక పిల్లి ఆడుతూ ఆడుతూ ఇల్లంతా తిరిగి, కాళ్ల సందుల్లోంచి ఎటో పోతుంది. ఒక్కసారే రెండు కాళ్లు ఒక దిక్కు తిప్పుకొని దాన్నుంచి బయటపడ్డాననుకుంటా. అదప్పటికే దాని దారి అది చూసుకొని వెళ్లిపోయి ఉంటుంది కూడా. ఇదే ఏ కలలోనో ఇష్టంగా నిన్ను చూసుకుంటున్నప్పుడో జరిగి ఉంటుంది. ఇప్పుడు పడుకున్న నా కాళ్ల సందుల్లోంచి అది పోయినట్టు నిద్రలోనే కాళ్లను జరిపేసుకుంటూ ఉంటా. విచిత్రంగా అనిపిస్తుంది ఇది కల అని తెలుసుకోవడం.
‘‘నిన్న రాత్రి కలలో ఏం జరిగిందో తెలుసా?’’ అని పొద్దున్నే చెప్పడానికి ఇప్పుడిలా లేచి కూర్చోవడం బాగుందనుకుంటా. మళ్లీ పడుకుంటా. ఇంకేదో కలొస్తుంది. తెల్లారిపోతుంది.
నిన్నేదో కలొచ్చిందే! ఛ.. ఇలా ఎలా మర్చిపోయాను! గుర్తుండి ఉంటే బాగుండును అని లేచినప్పట్నుంచీ ఆలోచిస్తా. నువ్వొస్తావు. కలిసి కబుర్లు చెప్పుకుంటాం. చాయ్ తాగుతాం. తిరిగి వెళ్లిపోతావు.
కనీసం ఇలా ఒక కల కన్నాను, నువ్వు, నేను ఉన్న కల అని చెప్పడానికి కూడా నాకిది ఎందుకు గుర్తురాదని బాధేస్తుంది. ఇంత మంచి కలని నీకెందుకు చెప్పలేకపోతున్నానా అన్నది రోజంతా వెంటాడుతూనే ఉంటుంది.
ఏ పని చేస్తూ కూర్చున్నా, నీకు ఆ కలని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తా. సాయంత్రమవుతుంది. ఒక్కసారే ఎవరో పిలిచినట్టు సూర్యుడు వెళ్లిపోతాడు. ఆకాశమంతా మబ్బులు పరుచుకుంటాయి. ఫ్లోరంతా ఒక్కసారిగా చీకట్లోకి వెళ్లిపోతుంది. అప్పుడు ఏడో అంతస్తులోంచి, అద్దాల గోడను ఆనుకొని కిందకు చూస్తా. ఐదవుతుంది. అప్పటికే వాహనాలన్నీ వరుసగా ఆగిపోయి ఉంటాయి ఆ సిగ్నల్ ముందు. అన్నీ లైట్లు వేసేసుకుంటాయి. చాలాసేపు అది చూస్తూ నిలబడతా.
వర్షం కురుస్తూ ఉంటుంది. వర్షం కురవడానికి ముందు ఆకాశంలో ఒక రంగు కనిపిస్తుంది. ఒక పెద్ద కొండ వెనక ఆ రంగును చూడాలి నువ్వు. పెద్దమ్మ వాళ్ల ఊరికి వెళ్తుంటే ఇంకో ఐదు కిలోమీటర్లలో ఊరన్నప్పటికి ఒక మట్టి రోడ్డు కనిపిస్తుంది. వర్షం పడటానికి ముందు, ఆ మట్టంతా నీ ముద్దుకో, కౌగిలింతకో రెడీ అయిన వాడు నాలాగా ఉంటుంది. ఒక దగ్గర నిలబడ్డట్టు ఉండదు. ఊరికి పోకుండా రెండు కిలోమీటర్లు నడిచెళ్లి ఆ పెద్ద గుట్ట ఎక్కితే గనక చుట్టుపక్కల ఊర్లన్నీ కనిపిస్తాయి. ఈ నడిచొచ్చే దారి కూడా కనిపిస్తుంది. బ్యూటీ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకు అటువైపు వెళ్లిపోయి, అక్కడే ఉండిపోవాలని కూడా అనిపిస్తుంది. ఇంకింకోసారి అసలెప్పుడైనా అటు పోతానా అనిపిస్తుంది.
ఒకసారి ఆ గుట్టెక్కి సాయంత్రానికి ఇంటికి చేరాం. ఊరికి వెళ్లిపోతానని తెగ గొడవ చేశా నేను. మంజు, నేను, అన్నయ్య.. ముగ్గురమే ఉన్నాం.
“ఇయ్యాల ఒక్కరోజుండు. రేప్పొద్దుగాల ఫస్ట్ బస్సుకే పంపిస్త.” అంది పెద్దమ్మ. నాటుకోడి కూర వండి పెట్టింది. ఆరోజు తిన్నంత అద్భుతమైన కోడి కూర మళ్లీ తినలేదు నేను. ఆరోజు తెగ వర్షం పడుతోంది. పెద్దమ్మ వాళ్ల ఇంటినుంచి చూస్తే ఎదురుగా ఒక ప్రైమరీ స్కూల్లో ఉన్న చెట్టు ఊగి ఊగి ఇష్టంగా రమ్మని పిలుస్తున్నట్టు ఉంటుంది. బయటికి వచ్చేసరికి అది కూలిపోతుంది. వర్షం మెల్లిగా తగ్గుతుంది. కొన్ని గంటల పాటు అంతా నిశ్శబ్దంగా ఉంటుంది చుట్టుపక్కలంతా. ఇప్పుడు ఆ నిశ్శబ్దం నుంచి బయటికి వచ్చాక అదే మట్టి రోడ్డులో ఇట్నుంచైతే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్ట ఎక్కాలనిపిస్తుంది. ఈ నిశ్శబ్దం తగ్గేవరకూ ఎదురుచూడాలి.
సిగ్నల్ ముందు ఆగిన ఈ బండ్లన్నీ ఎక్కడో ఒక దగ్గరికి వెళ్లి ఆగాలి. నేను నీ దగ్గరికొచ్చి ఆగాలి. నీ దగ్గరికి రావడానికి ముందు ఈ దారంతా నడవాలి. నడుస్తూ నడుస్తూ.. నాకొక కలొచ్చింది కదా, అది ఏమై ఉంటుందో గుర్తు తెచ్చుకోవాలి. గుర్తుకురాదు కదా, పైన ఎక్కడైనా చందమామ ఉందేమో చూసుకొని వెళ్లి పడుకోవాలి.
ఎప్పుడైనా.. ఏదో ఒక రోజు.. ఆ కల గుర్తొచ్చి నేను నీ దాకా వచ్చి చెప్తే.. అదొక వేళ చాలా చిన్న విశయమైతే.. అయినా కూడా.. “దీనికా!” అనకుండా వింటావు కదూ!
*
Add comment