1948 పోలీసు చర్యని ఎలా అర్థం చేసుకోవాలి?!

ఈ నెల 26 న హైదరబాద్ లామకాన్ లో అఫ్సర్ పుస్తకం “రేమేకింగ్ హిస్టరీ” పై జరుగుతున్న చర్చ సందర్భంగా-

అనువాదం – హిమబిందు చింతకుంట

ఈ వ్యాసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ఇటీవలే ప్రచురించిన డాక్టర్ అఫ్సర్ పుస్తకం “రీమేకింగ్ హిస్టరీ: 1948 పోలీస్ యాక్షన్ అండ్ ది ముస్లిమ్స్ ఆఫ్ హైదరాబాద్”, నుంచి! ఈ పుస్తకంలో 1948 హింసకు సంబంధించిన దాదాపు వంద మంది సాక్షుల కథనాలను నమోదు చేశారు. వీరిలో చాలా మంది ఇప్పటికే మరణించటంతో ఈ పుస్తకం వారి జీవితాలను, అనుభవాలను  తెలిపే చివరి గుర్తు. 1948 పోలీస్ చర్య చాలా అరుదుగా చర్చలోకి వచ్చింది. అందువల్ల ఈ రచనలోని సాక్షుల కథనాలు, అప్పటి హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలలోని దైనందిన జీవితాలను సేకరించడానికి, అర్థం చేసుకోవడానికి కొత్త కోణాలను అందిస్తాయి.

ఖిడ్కీ గమనిక: మౌఖిక కథనాలు గతానికి సంబంధించిన వివిధ దృక్కోణాలను అందించడమే కాకుండా, ముఖ్యమైన చారిత్రాత్మక సంఘటనల్ని కళ్ళారా చూసిన వాళ్ళు, వర్తమాన సవాళ్ళను ఎలా విశ్లేషిస్తారు అన్న అవగాహన కూడా  కలిగిస్తాయి. పోలీస్ చర్య హైదరాబాద్ లోని ముస్లింల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో ఈ వ్యాసంలో ప్రస్తావించిన ఖుద్దూస్ సాహెబ్ కథనం వివరిస్తుంది. ఖుద్దూస్ సాహబ్ పీర్ల పండగ కథనాల గాయకుడు. అటు తెలుగు- ఇటు ఉర్దూ కథనాలు కూడా సమానంగా పాడగలిగిన ప్రముఖ గాయకుడు.  పోలీస్ చర్య తరవాత, ఎందరో ముస్లింలు రజాకార్లుగా ముద్రింపబడి వారి రోజువారీ జీవితాన్ని కోల్పోయారు. ఖుద్దూస్ సాహెబ్ కు, సమకాలీన భారతదేశంలోని ముస్లింల స్థానం- పతనమైన వారి రాజకీయ నాయకత్వం- పోలీస్ చర్య తరవాతి  పరిణామాలు ఇప్పటికీ వారి జీవితాల్లో ప్రతిధ్వనిస్తున్నాయని తెలిపే పదునైన జ్ఞాపకం. అఫ్సర్ పుస్తకంలోంచి తీసుకున్న ఈ భాగాల అనువాదం  మీ కోసం.

 

పోలీసు చర్య తాలూకు ఐదు రోజుల సుదీర్ఘ “యుద్ధం” వారి జ్ఞాపకాలలో ఇప్పటికీ తాజాగా ఉంది. కానీ ఈ ప్రాంతం “ప్రధాన చరిత్ర” లేదా “అధికారిక చరిత్ర”, తెలుగు భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ, ఇంకా వామపక్ష-కేంద్రీత  తెలంగాణ సాయుధ పోరాటాలనే గుర్తిస్తుందని నొక్కి చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ కొత్త  రాష్ట్ర ఏర్పాటు వేడుకలు జాతీయవాదాన్ని ప్రతిబింబిస్తే, తెలంగాణ సాయుధ పోరాటం 1952 సాధారణ ఎన్నికల సమయంలో వామపక్ష పార్టీల ప్రచార సాధనంగా మారింది.

దక్కనీ ఉర్దూ సాహిత్య చరిత్రకారుడు సామల సదాశివ ప్రకారం:

‘ఆంధ్ర’ అన్న పదమే  హైదరాబాద్, తెలంగాణా ప్రాంతాల సమకాలీన చరిత్రలను చెరిపేసి,  ఈ ప్రాంతాల చరిత్రను ఒక ప్రాచీన చట్రానికి పరిమితం చెయ్యడానికి చేసిన యత్నం. ఐతే 1930 లేదా 1940 దశకాలలో పెరిగిన మాకు, తెలుగు ఇంకా ఉర్దూల మిశ్రమ చరిత్రను సూచించే ‘తెలంగాణా’ అనే పదమే మా అస్తిత్వానికి గుర్తు. ‘ఆంధ్ర’ అనే కొత్త వాడుకతో పాటు, రాష్ట్ర ప్రాయోజిత చరిత్రలు  హైదరాబాద్ ఇంకా హైదరాబాద్ ప్రాంత ముస్లింల ప్రాముఖ్యతను క్రమంగా చెరిపేశాయి. ఇలా పోలీస్ చర్య “ఖూన్రేజి” (ఊచకోత) చరిత్రాధ్యాయాల నుండి పూర్తిగా తుడిచేయబడింది.”

సదాశివ చేసిన ఈ వ్యాఖ్యలు, నా పుస్తక పరిచయంలో జానపద గాయకుడు అబ్దుల్ ఖుద్దూస్ సాహెబ్ చెప్పిన విషయాలను గుర్తు చేశాయి. 2006లో, నేను మా సంభాషణను ముగించబోతున్నప్పుడు, ఆయన1998లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) చేసిన ప్రకటనను ప్రస్తావించారు. ఖుద్దూస్ సాహెబ్ ఉద్దేశించింది హైదరాబాద్‌లో పెద్దఎత్తున జరిగిన బహిరంగ సభలో అప్పటి హోం మంత్రి ఎల్.కె. అద్వానీ చేసిన ప్రసంగం. ఆ సభకు నేను కూడా హాజరయ్యాను. పోలీసు చర్యను ప్రస్తావిస్తూ, సెప్టెంబర్ 17ని “లిబరేషన్ డే” గా, ఒక ఉత్సవంలా జరుపుకోవాలని అద్వానీ పిలుపునిచ్చాడు. అదే తెలుగు ప్రజాక్షేత్రంలో “విమోచన దినంగా” అనువదించబడింది. అద్వానీ “విమోచన” అనే పదాన్ని ఉపయోగించడం స్థానిక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో, అలాగే 1998 తర్వాత వివిధ రాజకీయ రచనలలో పోలీసు చర్య గురించి కొత్త చర్చలకు దారి తీసింది. అద్వానీ ప్రకటనకు స్పందిస్తూ, పలువురు చరిత్రకారులు, సామాజిక కార్యకర్తలు చరిత్రను పునఃపరిశీలించడం ప్రారంభించారు. దీనితో పోలీసు చర్యకు దారితీసిన సంఘటనలతో పాటు, హైదరాబాద్ ముస్లింల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న మరొక్కసారి చర్చకు వచ్చింది. ముస్లింలు కూడా తమ భవిష్యత్తు ఏమిటన్న సందిగ్ధంలో పడ్డారు. వివిధ సామాజిక పోరాటాలకు, రాజకీయ సమూహాలకు చెందిన ప్రముఖులు చర్చను కొనసాగించడంతో, ఈ చరిత్ర కాలక్రమం ప్రజారంగంలో మళ్ళీ మళ్ళీ వాదనలకు దారితీస్తూనే ఉంది.

ఖుద్దూస్ సాహెబ్ అంటారు:

“అద్వానీ, బీజేపీ పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక చారిత్రిక గాయాన్ని తిరిగి రేపే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పటంలో ప్రజలు ఆ గాయాన్ని మర్చిపోయారు అన్నది నా ఉద్దేశం కాదు! కానీ అద్వానీ ఆ గాయాన్ని ప్రేరేపించిన తీరు కలవరపెట్టింది! మనమంతా పోలీస్ చర్య గురించి తప్పకుండా చర్చించాలి. కానీ అద్వానీ, అతని అనుచరులు చేసిన వ్యాఖ్యలు హిందూ-ముస్లింల మధ్య కొత్త విబేధాలు కలిగించే విషపూరితమైన ప్రసంగాలు. అతను, తన పార్టీ అనుచరులు, ఈ చరిత్ర మొత్తాన్ని- తారీఖు- పోలీస్ చర్యను- హిందూ ఓట్ల కోసం  వాడుకున్నారు.”

ఇస్లాం, హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన విషయాలంటే ఖుద్దూస్ సాహెబ్ కు ఎంతో మక్కువ. క్లిష్టమైన 1930-1940 దశకాలను ప్రత్యక్షంగా చూడడం  వల్ల ఉర్దూ , తెలుగు, రెండు భాషల్లో చారిత్రక విషయాలను చదివే ఆసక్తిని పెంచుకున్నారు. 1940ల చివర్లో ఒక జానపద కళాకారుడిగా, ఒక ప్రజా గాయకునిగా ఖుద్దూస్ సాహెబ్ తన జీవితకాలంలో ఎన్నో చారిత్రిక సంఘటనలను కళ్ళారా  చూశారు. నవాబ్ బహదూర్ యార్ జంగ్ (1905-1944) శక్తివంతమైన బహిరంగ ప్రసంగాల నుండి 2004లో మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రారంభం వంటి ఘటనలకు ఆయన ప్రత్యక్ష సాక్షి.

“బహదూర్ యార్ జంగ్ పార్టీ ఇత్తెహాద్, తర్వాత మజ్లిస్-ఎ-ఇత్తెహాద్’ఉల్ ముస్లిమిన్ (MIM) ఎన్నో రాజకీయ, సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన శక్తివంతమైన పార్టీ. ఆయన (బహదూర్ యార్ జంగ్) ఒక ప్రేరణ ! జోష్ ! ఎంతంటే, అప్పట్లో ఎంతో మంది ముస్లిం యువకులకు అతని మాటలు కంఠస్థం. మా భావోద్వేగాలకు, ఆలోచనలకు, ఒక భాషను అందించాడు. అన్నిటికంటే ముఖ్యంగా సమకాలీన రాజకీయాల గురించి ముస్లిం యువత మాట్లాడేలా, వాటిని మెరుగుపరచడానికి ఇస్లాం ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించేలా చేశాడు.”

మా సంభాషణల్లో చాలా సార్లు ఖుద్దూస్ సాహెబ్ 1990ల చివరి దశను, 1940ల చివరి సంవత్సరాలతో పోల్చారు. ముస్లిం సమాజానికి “సమర్థవంతమైన” నాయకత్వం లేదన్న భావన ఆయన్ని ఇబ్బంది పెట్టింది. బహదూర్ యార్ జంగ్ విజయాల గురించి మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళల్లో మెరుపు నాకు ఇప్పటికీ గుర్తు.  బహదూర్ యార్ జంగ్ ఉపన్యాసాలను ఉత్సాహంగా వివరిస్తూ చివరగా “ఈరోజు మనకి తన మాటలతో, చేతలతో ప్రజలను చైతన్యపరిచే ఒక వక్త, ఒక నాయకుడు కావాలి. అంతకన్నా ముఖ్యంగా నగరం నడిబొడ్డు నుండి తెలంగాణా లోని మారుమూల గ్రామాల్లో ఉన్న ముస్లింలందరినీ ఏకం చేసే ఒక శక్తి కావాలి.” ఇవి ఖుద్దూస్ సాహెబ్ గతంలో చిక్కుకుపోయి అన్న మాటలు కావు, ప్రస్తుత వాస్తవాలను అంచనా వేస్తూ చెప్పినవి. ఖుద్దూస్ సాహెబ్ ప్రకారం బహదూర్ యార్ జంగ్- నాయకత్వ లక్షణాలు, వక్తృత్వం, రాజకీయ అవగాహన వంటి ఎన్నో లక్షణాల మేలు కలయిక. ఇక్కడ చెప్పిన లక్షణాలన్నీ కాలాతీతం. ఇప్పటి కాలంలో ప్రత్యేకంగా “హిందుత్వపు కాషాయ జెండాలు కమ్ముకుంటున్న ఈ తరుణంలో” ముస్లిం సమాజం వీటి ప్రాముఖ్యతను గుర్తించి ముందుకు సాగాలని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.

పోలీస్ చర్య గురించి వివరించేటప్పుడు ఖుద్దూస్ సాహెబ్ ఎన్నో సార్లు చారిత్రాత్మకమైన కర్బలా యుద్ధాన్ని (680 CE) ప్రస్తావించారు. “కర్బలా యుద్ధం ముస్లిం సమాజం నుంచి ఎన్నో బలిదానాలను కోరింది”. ఇలా గుర్తు చేసుకోవడంలో ఆయన బహదూర్ యార్ జంగ్ జీవితచరిత్రకు , కర్బలాలో ఇమాం హుస్సేన్ వీరమరణానికి  సమాంతరాలున్నాయని  ఉద్దేశిస్తున్నారని అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. “ఇమాం హుస్సేన్ లాగానే, బహదూర్ సాహెబ్ కూడా యుద్ధభూమిలో అమరుడయ్యాడు.” ఖుద్దూస్ సాహెబ్ తన వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితులు 1948 ఊచకోతలో ప్రాణాలను కోల్పవడం, ఇంకెందరో అజ్ఞాతంలోకి వెళ్ళడం, నిరాశ్రయులవ్వ డం వంటి విషాదాలను ప్రత్యక్షంగా అనుభవించారు. అలాగే నేటి  తరం వారు తమ “ముస్లిం అస్తిత్వం” వల్ల వివక్షకు గురౌతున్న దుస్థితికి కూడా ఆయన ప్రత్యక్ష సాక్షి.

ఈ వివక్ష గురించి మాట్లాడుతూ-

“రజాకార్లమని నిందిస్తూ, నేరస్థులుగా, సంఘ విద్రోహులుగా  ముద్రించడం  ఎంత అన్యాయమో మీకు తెలుసు. ముస్లింలందరినీ, ప్రత్యేకించి 18 నుంచి 30 యేండ్ల వయసు వాళ్ళందరినీ రాజకార్లుగా ముద్రవేసి వేటాడారు. వాళ్లకి వాళ్ళ సొంత ఊర్లలోనే తిండి, వసతి, ఉద్యోగాలు దొరకడం  అసాధ్యమైంది.” అని ఆయన అన్నారు.

ఇటువంటి ఎన్నో కథనాలను ఈ పుస్తకంలో చదవవచ్చు. అందులోని కొన్ని భాగాలు, “ముస్లింలంతా రజాకార్లు, అతివాదులు కాదన్న వాస్తవాన్ని నొక్కి చెబుతాయి”. సామాన్య ముస్లింల అస్తిత్వాన్ని చెరిపేసి, అందరిని రజాకార్లుగా  జమకట్టడం జాతీయవాదుల రచనల్లో ఒక వ్యూహం. ఖుద్దూస్ సాహెబ్ ప్రకారం ఇటువంటి రాక్షసీకరణ కొనసాగడానికి, ముస్లిం సమాజానికి  “సరైన” నాయకత్వం లేకపోవడం కూడా ఒక కారణం.

దీని గురించి మాట్లాడుతూ-

“కాలం గడుస్తున్న కొద్దీ ముస్లింలు సమాజం నుంచి మద్దతును, సానుభూతిని కోల్పోయారు. ఇప్పుడు ‘ముస్లిమ్’ అన్న మాటే కొందరిలో భయాందోళనలు  కలిగిస్తుంది. ఈ తరం ముస్లింల పరిస్థితి ఇంకా దిగజారుతూనే ఉండడం నన్ను కలచివేస్తుంది. ఒక సమాజంగా మనం ఏ దశకు చేరుకున్నాం?!”

ఉర్దూ పదమైన “హందర్దీ” (సానుభూతి) ని గుర్తుచేస్తూ, మన సమాజంలో ముస్లింలు, ముస్లిం సమస్యల పట్ల సానుభూతి లేదన్న వాస్తవాన్ని వెల్లడించారు. తన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను , విషాదాలను చవి చూసినా కూడా, ఖుద్దూస్ సాహెబ్ నేటి తరపు ముస్లిం యువత యొక్క అస్తిత్వాన్ని నిర్మించే కృషిని కొనసాగిస్తున్నారు. మొహర్రం (పీర్ల పండుగ) కర్బలా యుద్హంలో అమరులైన ఇమాం హుస్సేన్ ను, ముస్లిం ప్రవక్త కుటుంబాన్ని, స్మరించుకునే పండగ. ఇందులో భాగంగా జరిగే జానపద కళాప్రదర్శనలో పాల్గొనేందుకు హిందూ-ముస్లిం యువతను ప్రోత్సహించి, శిక్షణ ఇస్తున్నారు. మొహర్రం పాటల జానపద గాయకునిగా ఖుద్దూస్ సాహెబ్ అప్పటి హైదరాబాద్ రాష్ట్రం-ఇప్పటి తెలంగాణా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ కళ అంతరించిపోకూడదని, కనీసం 10-20 మంది యువకులకైనా శిక్షణ ఇచ్చి ముందు తరాలకు ఈ కళను అందివ్వాలని పూనుకున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే , ఎక్కడికి వెళ్ళినా , ఎటు ప్రయాణించినా, హిందూ-ముస్లిం యువతతో సంభాషిస్తూ, వారితో సంబంధాలను కొనసాగిస్తున్నారు.

“ఇరవై మందికి పైగా యువకులకు శిక్షణ ఇవ్వడంలో నేను సఫలమయ్యాను. కానీ ఆ సమయంలోనే భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాల ఉధృతి పెరిగింది. ముస్లిం యువత ముస్లింలకు సంబంధించిన సామూహిక ఉత్సవాలలో పాల్గొనే పరిస్థితి లేదు. మరొక్కసారి విద్వేషపూరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. భారత దేశంలోని ముస్లిం యువతకు ఇప్పుడు ప్రతీ రోజూ కర్బలా యుద్ధమే! అకారణంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ముస్లింల ఊచకోత ఒక పరంపరగా మారింది.”

హిందుత్వ శక్తులు చెలరేగుతున్న కాలంలో, ముస్లింల పరిస్థితులను కర్బలా తో పోలుస్తున్నది ఒక్క ఖుద్దూస్ సాహెబ్ మాత్రమే కాదు. రాజకీయ  విశ్లేషకులు, సామాజిక పోరాటాల కార్యకర్తలు ఈ అరాచాకాలను వేర్వేరు చారిత్రక ఘట్టాలతో, ఉపమానాలతో, వివరిస్తున్నారు. రాజకీయవేత్త అంగనా ఛటర్జీ ప్రస్తుత స్థితిని ‘ఆమోదించబడ్డ ఆధిపత్యం – ముస్లింల పట్ల ప్రతికూలత’ అని నిర్వచించారు. మా మాటల మధ్యలో ఖుద్దూస్ సాహెబ్ డిసెంబర్ 6 1992 లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతను కూడా గుర్తు చేశారు.

“అది కూడా ఒక పోలీస్ చర్య వంటిదే. ప్రభుత్వం, మతవిధ్వంస శక్తులు చేతులు కలిపి, భారతదేశంలోని ముస్లిం సమాజాన్ని మొత్తంగా నాశనం చేయాలనుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ విధ్వంసం ఒక్క మసీదుపై జరిగిన దాడి మాత్రమే కాదు, ముస్లింల మీద నేరుగా జరిగిన దాడి. పోలీస్ చర్యను నేరుగా చూసినవాడిగా, ఈ హింస ముస్లింలకు మాత్రమే క్లిష్టమైన పరీక్ష కాదు, హిందువులకు కూడా పరీక్షే అని నేను నమ్ముతున్నాను. మనమిప్పుడు 20వ శతాబ్దపు తుదిలో ఉన్నాం, నేనిప్పుడు గుజరాత్ లోని పరిస్థితుల గురించి కూడా వింటున్నాను – అక్కడి ముస్లింల పై మారణకాండ!”

అద్వానీ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, పోలీస్ చర్య సమయంలో ముస్లింల పరిస్థితులను ఎంతో మంది ముస్లిం క్రియాశీలవేత్తలు చర్చించారు. “మిలిటరీ ఆక్రమణ” అనే కేంద్ర ప్రభుత్వపు “తొందరపాటు” నిర్ణయాన్ని , దాని వల్ల జరిగిన దుష్పరిణామాలను ప్రశ్నించారు. సెప్టెంబర్ 13 నుండీ 17 వరకు జరిగిన పోలీస్ చర్యను ఇప్పుడు కొందరు ఒక “యుద్ధం”గా, హిందుత్వ రాజకీయాల తొలి దశగా గుర్తిస్తున్నారు.

(డేంజర్స్ ఆఫ్  సింగిల్ స్టోరీ‘ సిరీస్ 1948 నాటి పోలీస్ యాక్షన్‌పై ప్రత్యామ్నాయ దృక్కోణాలను అందిస్తుంది హైదరాబాద్‌ విలీనాన్ని  హైదరాబాద్   ‘విముక్తిగా ప్రచారం చేస్తున్న ప్రధాన స్రవంతి కథనాలు ప్రస్తుతం నడుస్తున్న విభజన రాజకీయాలను మరింతగా పెంచడానికి ఉపయోగించబడుతున్నాయి అన్న స్పృహ తోదానికి విరుగుడు గా ప్రత్యామ్నాయ కథనాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం ఇది 

చరిత్రరాజకీయాలుసంస్కృతిపై బహిరంగ  చర్చ ను బలపరిచే ఉద్దేశంతో ఏర్పడి వాటిని రూపొందించడానికి కట్టుబడి ఉన్న మేధావుల నెట్‌వర్క్ ఖిడ్కీ కలెక్టివ్‌కు చెందిన బాధ్యులు స్వాతి శివానంద్యామిని కృష్ణప్రమోద్ మందాడే  కథనాలకు సంపాదకత్వం వహించారు.)

*

అఫ్సర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అఫ్సర్ సాబ్, మీరు రాసిన ఈ పరిచయ వాక్యాలు “Remaking Of History” ను బాగా పరిచయం చేశాయి. నేను ఇప్పటి దాకా ఉపోద్ఘాతం వరకు చదివాను.

    చాలా బాగా రాశారని ఇప్పటి దాకా చదివిన ఉపోద్ఘాతం చదివి నేను గ్రహించాను. మీరు పైన్ రాసిన పరిచర్య అంశాలన్నీ చదివాను.

    మా నాటకాల్లో లాగా మీరెన్నుకున్న పద్ధతి చాలా బావుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు