​మూడు పుస్తకాల ముచ్చట

మన అనుభవ ప్రపంచం మరొకరి అనుభవ ప్రపంచంతో సాంతం అనుకంపించే సందర్భాలు మాజికల్!

డైరీస్ ఆఫ్ ఫ్రాంజ్ కాఫ్కా (The Diaries of Franz Kafka):

హైదరాబాదు వచ్చిన కొత్తలో ఆదివారాలు చిక్కడపల్లి లైబ్రరీకో, ఆఫ్జల్ ఘంజ్ లైబ్రరీకో వెళ్ళేవాడిని. వాటి గదుల్లోను, వరండాల్లోను పోటీ పరీక్షలకి చదువుకునేవాళ్ళు ఎక్కువ కనిపించేవారు. రద్దీలేని సాహిత్య విభాగానికి పోయి లైబ్రరీ మూసేదాకా చదువుకునేవాడ్ని. ఆకలేస్తే బైటికెళ్ళి సమోసాలో, బగారా అన్నమో. అలా ఒక రోజు చిక్కడపల్లి లైబ్రరీలో కాఫ్కా డైరీల పుస్తకం దొరికింది. అప్పటికే నా దగ్గరున్న కాఫ్కా మూడు నవలల సంపుటిలో ‘ట్రయల్’, ‘కాసల్’ రెండూ చదివేసి కాఫ్కా జ్వరంతో ఉన్నాను. అప్పటికింకా ఈ ఫ్లిప్‌కార్టులూ, అమెజాన్‌లూ, లిబ్‌‍జెన్‍లూ లేవు. కొన్ని పుస్తకాలు దొరకటం కష్టంగా ఉండేది. అలాంటప్పుడు కనపడింది ఈ పుస్తకం. దాన్ని ఇంటికి అద్దెకు తెచ్చుకోవాలంటే లైబ్రరీ సభ్యత్వం కోసం కావాల్సిన అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫుల్లాంటివేవీ నా దగ్గర లేవు. అవి సంపాయిద్దామని కూచుంటే ఈలోగా ఈ పుస్తకం తప్పిపోతే ఎలాగ. అందుకే- ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోగానే అర్థమైపోయింది- మళ్ళీ తీసినచోట పెట్టనని. అటూయిటూ చూసి, చొక్కా వెనకాల పొట్ట దగ్గర ఇరికించుకుని, బైటికి వచ్చేశాను. “ఏయ్ ఆగు!” అని వెనక నుంచి ఎవరైనా పిలుస్తారేమోనన్న భయం వల్ల అసహజమైనంత నెమ్మదిగా నడుస్తూ, గేటు దాటాను, ఆ లోతైన బరువుతోటి.

ఆఫీసుకెళ్ళి రావటం, మెస్సులో తినేయటం, రేకు షెడ్డు గదిలో అర్ధరాత్రిదాకా యీ పుస్తకం చదువుకోవటం.. ఇదే జీవితంగా కొన్ని రోజులు సాగింది. కాఫ్కా తన కథల్లో బొద్దింక, ఎలక, కుక్క, బొరియలు తవ్వే పురుగు.. ఇలాంటి మనిషికాని జీవులెన్నింటి గొంతులతోనో మాట్లాడాడు. ఆయన డైరీల్లో కూడా మనిషికాని జీవేదో మనిషి కన్ను తగిలించుకుని మానవ ప్రపంచాన్ని పరికిస్తున్నట్టు ఉంటుంది. అలవాటు సోకని కంటికి సహజంగానే నైశిత్యం ఎక్కువ. మనసుపైన పసి ఈకంతటి బరువుతో పడే అనుభవ ముద్రల్నీ, చెరువుమీద దాటిపోయే పిట్టనీడలాంటి భావ చలనాల్నీ కూడా కాఫ్కా పెన్ను పట్టించుకుంటుంది. ఈ పుస్తకం చదువుతున్న ఉత్సాహంతో- నేనూ జీవితాన్ని అంతే దగ్గరగా పరికిద్దామనీ, అంతే తీక్షణంగా లోపలికి తీసుకుందామనీ డైరీ రాయటం మొదలుపెట్టాను. కాఫ్కా డైరీల్లో ఆయన చూపు గనక మనల్ని పూనితే ప్రపంచం ఒక్కసారి పాజ్ బటన్ నొక్కినట్టు ఆగిపోతుంది, తర్వాత అత్యంత స్లో మోషన్‌లో కదలటం మొదలుపెడుతుంది, ఆ తర్వాత తారసిల్లిన ప్రతీదాన్నీ మన చూపు మైక్రోస్కోపిక్ దగ్గరితనంతో లోపలికి తీసుకుంటుంది. ఇంత గాఢమైన ఏకాగ్రతని అంతశ్చక్షువు ఎక్కువకాలం భరించలేదు. అదంత మంచిదేం కాదు. అయితే అదొక్కటే కాదు, కాఫ్కా తన రచనతో అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి డైరీని ఒక సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి అది చదువుతుంటే అంతే సన్నిహిత సంబంధం మనకీ మన రచనా వ్యాసంగంతోటి ఏర్పడిపోతుంది.

డైరీ ఎంట్రీలు కాబట్టి మొదట్నుంచి చివరిదాకా చదువుకుంటూపోలేం. ఎంట్రీలన్నీ ఆయన దినచర్య గురించి రాసుకున్నవి కాదు. చాలావరకు రైటింగ్ స్కెచ్‌లు- కొన్ని పూర్తయినవీ, కొన్ని విఫలయత్నాలూ ఉంటాయి. ఇంకొన్ని ఎంట్రీల్లో కలల్ని గుర్తు తెచ్చుకొని రాసుకుంటాడు. కాఫ్కా ఫిక్షన్‌ మొత్తాన్నీ కలల్లో ఉండేలాంటి తర్కమొకటి అంటిపెట్టుకుని వుంటుంది. బహుశా ఇలా కలల్ని డైరీలో రాసుకునే అలవాటు వల్ల వాటిలోని తర్కమేదో ఆయనలో ఇంకి ఉంటుంది. ఈ పుస్తకం ప్రభావంతో కొన్నాళ్లు నేనూ పొద్దుటే లేచి నా కలల్ని డైరీలో రాసుకున్నాను. కలల స్వభావం ఎలా వుంటుందంటే- మనం ఒక కలని రాసే ప్రయత్నం చేసిన మరుక్షణం అక్కడ అక్షరాల్లో వచ్చి పడేదానికి ఆ కలతో సంబంధం తెగిపోతుంది. కాయితం మీదకు వచ్చినదాంట్లో కట్టె కొట్టె తెచ్చెలన్నీ ఉంటాయి, కానీ కల కలిగించిన భావం మాత్రం ఉండదు. పైగా అంతవరకూ కనీసం స్ఫురణతో దోబూచులాడిన అసలు కల- ఈ రాసే ప్రయత్నం వల్ల కలిచేసినట్టయిపోయి మరుపులోకి తప్పిపోతుంది. కానీ కాఫ్కా మాత్రం ఇలా డైరీలో కలల్ని రాసుకునీ రాసుకునీ బహుశా వాటి కీలకాన్ని (tropes) బాగా పట్టుకున్నాడు. అందుకే తన రచనల్లో అంత మంచి కలల్నీ పీడకలల్నీ సృష్టించగలిగాడు.

త్రిపుర కథలు:

పన్నెండేళ్ళ క్రితం నా బ్లాగులో రాసిన ఒక కథ కింద కామెంట్లలో త్రిపుర పేరు మొదటిసారి చూసాను. ఎవరో చదవమని సజెస్ట్ చేశారు. త్రిపుర కూడా కాఫ్కా పిచ్చోడని తెలిసి చదవాలనిపించింది. కానీ అప్పట్లో పుస్తకం దొరక లేదు. ఏదో సంకలనంలో ‘వలస పక్షుల గానం’ చదివాను కానీ ఆ కథ నాకేం పెద్ద ఎక్కలేదు (ఆ కథ సగం కాఫ్కా అనువాదమని తర్వాత తెలిసింది). ఓ ఐదేళ్ళ తర్వాత పుస్తకం దొరికింది. అప్పుడు కూడా తిన్నగా సంపాయించిందేం కాదు. కాశీభట్ల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఆ పుస్తకం కాపీ చూసాను. ఆయన ఫుల్లు ఆన్‌లో ఉండగా ఆయన చేత బలవంతంగా ఆ పుస్తకం నాకిప్పించుకున్నాను. తెచ్చుకున్నానే కానీ పూర్తిగా చదవలేదు. మొదటి కథ ‘పాము’, బాగా ఫేమస్ కథైన ‘భగవంతం కోసం’ చదివి పక్కనపెట్టేసినట్టున్నాను. ‘భగవంతం కోసం’ ఆయన ఎసెన్షియల్ కథ అని అనిపించదు.

ఈలోగా మళ్ళీ ఆ పుస్తకం పబ్లిష్ అయింది. 2013లో కొత్తగూడెంలో ఊరి చివార్న పొలాల్నానుకుని ఉండే ఇంట్లో కొవ్వొత్తి దీపం కింద ‘చీకటి గదులు’ చదివాను (ఎందుకో ఏ పుస్తకమన్నా బాగా నచ్చితే అది చదివిన ప్రదేశం, వాతావరణం కూడా గుర్తుండిపోతాయి). వెన్వెంటనే ‘జర్కన్’, ‘ప్రయాణీకులు’, ‘వంతెనలు’, ‘గొలుసు చాపం విడుదల భావం’ చదివేశాను. ముఖ్యంగా ‘చీకటి గదులు’ చదవటం ఒక అపూర్వానుభవం నాకు. ఒక రీడర్ లైఫ్‌లో అలాంటి పఠనాలు ఎప్పుడోకాని తగలవు. నబొకొవ్‌ని చదవటం గురించి ఆయన బయొగ్రఫర్ బ్రైన్ బోయ్డ్ ఒక ఉదాహరణ చెప్తాడు. టెన్నిస్ ఆటలో అవతలి ఆటగాడు మన బాట్‍కి సులువుగా అందేలాగా బంతి కొడుతున్నప్పుడు ఆట మీద ఆసక్తి ఉండదు. అలాగే బొత్తిగా మనకి అందనంత దూరం కొడుతున్నా ఎక్కువసేపు ఆడబుద్ధి కాదు. కానీ మన వొళ్ళు ఇంకాస్త సాగితేనో, వొంగితేనో అందే తావులకి అవతలి ఆటగాడు బంతి పంపగలిగితే- అప్పుడు అలాంటి ఆట ఎక్కువసేపు ఆడబుద్ధవుతుంది. నబొకొవ్ కూడా అలాగే పాఠకుడికి అందీ అందకుండా, కానీ ప్రయత్నం చేస్తే తప్పక అందుతుందనిపించే స్థాయిలో తన నెరేషన్ నడుపుతాడంటాడు బోయ్డ్. అయితే నబొకొవ్ నేరేషన్ అంతా ఒకరకంగా ఆట లాంటిదే! పాఠకుడితో నెరేటివ్ గేమ్స్ ఆడటం ఆయనకిష్టం. కానీ మరోరకం రచయితలుంటారు–తమ అంతరంగపు లోతుల్లోకి ఏ ఆసరాలేకపోయినా, కింద ఏ వలా లేకపోయినా సర్కస్‌లో trapeze artists లాగా సాహసంతో నమ్మకంతో దూకుతారు, మనల్నీ దూకమంటారు. Leap of faith… వాళ్ళ వైపు నుంచీ, మన వైపు నుంచీ కూడా. అర్థరాహిత్యంలోకి పడిపోతున్నామేమో అనిపించే ఆఖరి క్షణంలో మన చేతులు అందుకుంటారు, ప్రతి సారీ, ప్రతి వాక్యంలోనూ! వాళ్ళని అణువణువునా అందుకుంటున్నామన్న ఎరుకతో చదవటం వొళ్ళు కంపించే అనుభవం. రాస్తూ రాస్తూ వాళ్ళు తమ అంతరంగంలోని ఎంతెంత లోతుల్లోకి దూకుతారంటే, చివరికి మన అంతరంగంలోంచి పైకి తేలతారు. మన అనుభవ ప్రపంచం మరొకరి అనుభవ ప్రపంచంతో సాంతం అనుకంపించే అలాంటి సందర్భాలు మాజికల్! త్రిపుర కథల్లోని ప్రపంచంతో అటువంటి అనుకంపనే కలిగింది నాకు. వెంట వస్తున్నానో లేదో అన్న లెక్క లేకుండా ఆయన ఎంతెంత ఇంటిమేట్ దూరాల్లోకి పోయినా నేను వెంటపోగలిగాను. జీవితమొక జ్ఞాపకం కాబట్టి– ఆయన చూపించినవన్నీ, అక్కడ కనిపించినవన్నీ చాలా ముఖ్యమనిపించాయి.

డార్క్ నైట్’స్ పాసింగ్ (A Dark Night’s Passing):

జపనీస్ రచయిత నవొయ షిగా రాసిన నవల ఇది. ఈ ఏడాది మొదట్లో చదివాను. నేనిక ఏ పుస్తకాన్నీ దాని లోతుల్లోకి దిగిపోయి, ఆ పేజీల అంచులే నా ప్రపంచం అంచులేమో అనిపించేంత గాఢంగా చదవలేనేమో అనిపించినప్పుడు- చాలా యేళ్ళ తర్వాత (బహుశా త్రిపుర కథల తర్వాత) మళ్ళా అలాంటి ఒక పఠనానుభవాన్ని కలిగించిన నవల. అలాగని పకడ్బందీగా అల్లిన ప్లాటుతోనో, ఏ దాస్తోయెవ్‌స్కీ క్రైమ్ అండ్ పనిష్మెంట్ లాగో ఒకే ఉన్మాదమైన ఊపులోనో చదివించేసే నవలేం కాదు. ఇంకే నవల్లోనైనా అయితే కొట్టొచ్చినట్టు కనపడే సంఘటనలు కూడా ఈ నవలలో సాఫుగా సర్దేసినట్టుండే నేరేషన్లో ఇమిడిపోతాయి. వాటిని కథనం కోసం, ఒక ఎఫెక్టు కోసం వాడుకోడు షిగా. దర్శకుడు యసుజిరో ఓజు (Ozu) సినిమాల్లో కనిపించే ఈస్థటిక్ ఇందులో ఉంటుంది. నిజానికి అంతకన్నా సున్నితంగా ఉంటుంది. ఓజు బాగా అభిమానించిన రచయిత షిగా. ఓజు సినిమాల్లోని నెమ్మదీ, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌ లక్ష్యంగా సినిమాని నడిపించాలనుకోకపోవటమూ, ప్రపంచపు నశ్వరతలోని విషాద సౌందర్యాన్ని (“Mono no aware”) చూపించే ప్రయత్నమూ… వీటన్నిటి వెనుకా షిగా ప్రభావం ఉందంటారు. ఇద్దరికీ స్నేహం కూడా ఉంది.

ఈ నవల తోకితొ కెన్సాకూ జీవితాన్ని చూపిస్తూ సాగుతుంది. అతనికి తగిలే ఎదురుదెబ్బల్ని, ఆ ఎదురుదెబ్బల్లోంచి అతను నెగ్గుకు రావటాన్నీ చూపిస్తుంది. కెన్సాకూ బాగా కలిగిన కుటుంబంలో, బతకటానికి ఏ పనీ చేయనక్కర్లేని ఆర్థిక సదుపాయం మధ్యన పుట్టినవాడు. కాబట్టి అతని ఎదురయ్యే సంఘర్షణలేవీ అతన్ని రోజువారీ జీవితపు నడకని అడ్డగించేవి కావు. కానీ మానసిక పునాదుల్ని కూలదోసేవి. తన జన్మరహస్యం- తాను తల్లికీ తాతయ్యకీ (తండ్రికి తండ్రి) పుట్టినవాడినని- తెలియటం, తాను ఇంట్లో లేనప్పుడు భార్య స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైందని తెలియటం, నెలల బిడ్డ జబ్బు చేసి చనిపోవటం… ఇలాంటివి ఆ ఎదురుదెబ్బలు. ఇవి అతను జీవితంలో ఎంతగానో కోరుకునే నిలకడ నుంచి అతన్ని అశాంతిలోకి విసిరేస్తాయి. బతకటానికి ఒకేవొక్క సవ్యమైన దారేదీ, సంశయాల మధ్య దేన్ని పట్టుకొని నిలదొక్కుకోవాలీ అన్న ప్రశ్న అతన్ని అంతిమంగా ఎక్కడికి పర్యవసించేలా చేసిందనేది కథ.

నవల థర్డ్ పెర్సన్‌లోనే సాగినా, జపాన్ లో చాన్నాళ్ళు అధికారం చెలాయించిన ‘I novel’ అనే (అంటే “నేను” అని కథ చెప్పుకునే) రచనా సంప్రదాయంలో ఈ నవలను ముఖ్యమైనదిగా చెపుతారు. ఎందుకంటే చదువుతున్నప్పుడు ఇది రచయిత జీవితానికి చాలా దగ్గరగా సాగినట్టుగా తోస్తుంది. షిగా కూడా “కెన్సాకు దాదాపుగా నేనే. అతని చర్యలు అవే పరిస్థితుల్లో నేనూ చేసేవో, చేయాలనుకునేవో, నిజంగా చేసినవో,” అని చెప్పుకున్నాడు.

*

మెహెర్

తెలుగులో కొత్త వచనానికి వర్ణమాల తిరగరాస్తున్న రచయితల్లో మెహెర్ మొదటి కోవ. మెహెర్ కథ రాసినా, వ్యాసం రాసినా ఆ వాక్యంలో తనదైన తేటదనం! ఉత్తమ చదువరీ, బుద్ధిజీవీ, నిర్మొహమాటి అయిన సున్నిత మనస్కుడూ ఆ వాక్యాల్లో స్ఫుటంగా కనిపిస్తాడు. మెహెర్ కథల పుస్తకం కోసం ఇప్పుడు ఎదురుతెన్నులు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆ పుస్తకాల్లో ఏముందో ఎవరికీ తెలియకుండా (తనతో సహా) ఎంతో జాగ్రత్తగా రాసినందుకు రచయితకు అభినందనలు.

  • చక్కటి శాస్త్రీయ మైన విశ్లేషణలు.ఓ పీరియడ్ లో జ్యోతిలో రాసేవారు ఈ మద్య రాయడం లేనట్టుంది.పుస్తకం వేయండి. మెహర్ గారూ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు