1
హోరుగాలికి రాలిపోతాయేమోనని
పువ్వుల్ని కోసి సజ్జలో వేసాను
తలుపులు వేసే ఉన్నాయి
పూరెక్కలు వడలి నేలరాలిపోయాయి
ఏమీ పట్టని చెట్టు
గాలికి ఊగుతూనే ఉంది
***
హృదయం విరిగి ముక్కలయ్యిందా?
అంతకంటే సంపూర్ణమయింది ఏమున్నట్లు!
***
ఒంటరిగా వచ్చిన బాటసారి
కాలిని మృదువుగా తాకాయి అలలు
కాసేపు నిలిచి తిరిగిచూడకుండా
వెళ్ళిపోయాడు అతడు
ఏ సంజాయిషీ కోరని
నది నెమ్మదిగా ప్రవహిస్తూనే ఉంది
***
ఈ జీవితం ఒక్క వందేళ్ళదా?
ఎన్నిసార్లలా హృదయాన్ని తెరిచినట్లు!
***
పట్టు తెరచాపలెత్తిన పడవలో
పట్టపగలే వెన్నెల కురిసే తీరానికి
ప్రయాణించావు సరే
తనను తానే రాసుకున్న పద్యం
నీకెదురుపడిందా?
కథకీ కంచికీ మధ్య దూరమెంతో
ఇప్పటికైనా తెలిసిందా?
తనను తాను రాసుకున్న పద్యం వినబడిందా?.
ఏ సంజాయిషీ కోరని నది నెమ్మదిగా ప్రవహిస్తూనే ఉంది!
Baavunnaayi padaalu padyalu