హిప్పీల నుండి బ్యాక్‌ప్యాకర్ ల వరకూ..

1

ఏమైనప్పటికీ నన్ను నేను పూర్తి స్థాయి బ్యాక్‌ప్యాకర్ గా భావించుకోను. మధ్యస్థ బ్యాక్ పేకర్ గా అనుకోవచ్చు. ఎందుకంటే పర్యావరణహితం కోసం ఎక్కువ public transport ను ఉపయోగిస్తాను. సాధారణంగా vegan ఆహారం మాత్రమే తీసుకుంటాను. అప్పుడప్పుడూ తప్పకపోతే వెజిటేరియన్ ఆహారం. మాంసాహారం నా ఆరవ ఏటనే స్వచ్ఛందంగా మానేసాను.

బ్యాక్‌ప్యాకర్లు అందరూ vegans లేదా వెజిటేరియన్స్ కాదు. అయితే చాలా ఎక్కువమంది vegans బ్యాక్‌ప్యాకర్స్ లో నాకు తారసపడ్డారు. బ్యాక్‌ప్యాకర్ నిబంధనల్లో vegan ఆహారం అనేది లేదు. అయితే చవకైన ఆహారం తప్పని సరి. Public transport తప్పని సరి. Hostels లో, చవకైన హోటల్స్ లో నివసించడం తప్పనిసరి. నేను ఈ బ్యాక్‌ప్యాకర్ నిబంధనలను అన్నింటినీ సంపూర్ణంగా పాటించలేను. ఎందుకంటే హాస్టల్స్ ఉండలేను. నేను బసచేసే హోటల్  ambience, quality, look విషయంలో రాజీ పడను. అక్కడ నా ఖర్చు పెరుగుతుంది.

ఇక ఆహారం విషయానికొస్తే vegan గా నేను అంత ఖరీదైన ఆహారం తీసుకొనే అవకాశం లేదు. చాలా పరిమితమైన vegan వంటకాలు లభ్యమవుతాయి కాబట్టి. ఇక నడవడం ఇష్టం. రోజుకి 20 కి. మీ నడుస్తాను, యాత్రలో. అప్పుడే హృదయం, ఆత్మ తేలికగా ఉంటాయి. ఈ బ్యాక్‌ప్యాకర్ లక్షణం నాలో సహజంగా ఎప్పటి నుండో ఉంది. ఈ అలవాటు వల్ల కూడా కొంత ఖర్చు తగ్గుతుంది.

ఇంతకీ ఈ బ్యాక్‌ప్యాకర్స్ ఎవరు అని urban dictionary ని తెరచి వెతకకండి. వివరంగా చెబుతాను. వారిలో హిప్పీల, nomads ఛాయలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బ్యాక్‌ప్యాకర్స్ లో digital nomads కూడా ఉన్నారు. అనేక దేశాలు తిరుగుతూ freelance work/work from home చేసుకుంటూ ఉంటారు. మరి కొందరు 6 నెలలు ఉద్యోగం చేసి, ఆ డబ్బుని పొదుపుగా ఖర్చు చేస్తూ మరొక 6 నెలలు బ్యాక్‌ప్యాకర్స్ అవతారంలో దేశాలు తిరుగుతూ ఉంటారు. కొందరు work break లో, కొందరు రిటైర్  అయ్యాకా, ఇలా ఎన్నో రకాలు.

బ్యాక్‌ప్యాకర్స్ సాధారణంగా 18-30 ఏళ్ళ మధ్యలో ఉంటారు. అలా అని అది తప్పనిసరి నిబంధన కాదు. వీపున కొంత బరువు మోయగలిగి, బాగా నడవ గలిగిన దేహ దారుఢ్యం ఉంటే చాలు, ఎవరైనా బ్యాక్‌ప్యాకర్ గా మారవచ్చు. నేను 80 ఏళ్ళ బ్యాక్‌ప్యాకర్స్ ని కూడా చూశాను. వయసు అనేది మానసికమైనదే కదా! కాస్త శ్రమిస్తే ఏ వయసులోనైనా దేహాన్ని చురుకైన, బలమైన  స్థితిలోకి మలచుకోవచ్చు. బ్యాక్‌ప్యాకర్స్ జీవితంలో శ్రమ తప్పని సరి. ఆ శ్రమయే యాత్రలో మనల్ని స్పందనాశీలురి గా మారుస్తుంది.

“2 పౌన్ల మాంసం తినే కూలీ ఉదయం నుండీ రాత్రి వరకూ రాళ్ళు కొడతాడు. 6 పౌన్ల మాంసం తినే మనం ఎంత కష్టపడాలి? కానీ మనం రోజంతా సోఫా మీదనే దొర్లుతాము. మరి మన కవాటం మూసుకుపోకుండా ఎలా ఉంటుంది?” అంటాడు టాల్ స్టాయ్. ఇక్కడ కవాటం అంటే జ్ఞానానికి సంబంధించినది; వివేకం, జీవితానికి స్పందించగలిగే సున్నితత్వం.

2

బ్యాక్‌ప్యాకర్స్ టన్నుల కొద్దీ బట్టలు, వస్తువులు check-in baggage లో సర్దుకోరు. వీపుకి తగిలించుకొన్న బ్యాక్‌ప్యాక్ లోనే తేలికైన వస్త్రాలు, ప్రాధమిక అవసరాలకు సరిపోయే వస్తువులు నింపుకుని తీసుకెళతారు. Luxury వస్తువులు నిషిద్దం. అంత చోటు బ్యాక్‌ప్యాక్ లో ఉండదు కూడా. తక్కువ బరువు కావడం వల్ల ఒక చోటు నుండి ఇంకొక చోటుకి, తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో వెళ్ళడం సాధ్య పడుతుంది. టూరిస్టుల స్థాయిలో ఖర్చులు పెడితే నెలలకు నెలలు ప్రయాణించడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదు.

బ్యాక్‌ప్యాకర్స్  ప్రాథమిక లక్షణం సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం. కొత్త అనుభవాలను  సకారత్మకమైనా, నకారాత్మకమైనా స్వీకరించగలగడం. అనుభవాలు ఏవైనప్పటికీ వాటిని intense experiences గా ఉండేలా జీవించగలగడం .

సాధారణంగా బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్స్ లో నివసిస్తారు. అక్కడే వారు ఇతర బ్యాక్‌ప్యాకర్స్ తో కలవడం, అనుభవాలు పంచుకోవడం, స్నేహితులుగా మారడం జరుగుతుంది. వారితో కలిసి కొత్త ప్రదేశాలు చూడడానికి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నేను యాత్రల్లో చాలా మంది సీరియస్ బ్యాక్‌ప్యాకర్స్ ని కలిసాను. ఎందుచేతనో వారు తరచుగా నన్ను పలకరించి స్నేహితులుగా మారుతూ ఉండడం జరుగుతోంది. అది నాలో వారి జీవన శైలి పట్ల కుతూహలాన్ని పెంచింది.

అందుచేతనే బ్యాంకాక్ కౌసన్ రోడ్డులోని mad monkey hostel లో ఒక రోజు గడపాలని నిర్ణయించుకున్నాను. Banff, Queenstown, Berlin, Cusco నగరాలు బ్యాక్‌ప్యాకర్ ల పుణ్యక్షేత్రాలు. కానీ మక్కా మాత్రం బ్యాంకాక్ లోని కౌసన్ రోడ్. అది బ్యాక్‌ప్యాకర్ ల స్వర్గం, రాజధాని. దేశదేశాల బ్యాక్‌ప్యాకర్స్ అక్కడికి చేరుతారు. అసలు కోలాహలమంతా రాత్రి మొదలవుతుంది. హాస్టల్ లాంజ్ లో బ్యాక్‌ప్యాకర్స్ కలుస్తారు. పరిచయాలు చేసుకుంటారు. అనుభవాలు పంచుకుంటారు. కొంత డబ్బు చెల్లించిన వారికి ఒక token, టీషర్ట్ ఇస్తారు. ఆ టోకెన్ తో ఆ రాత్రి ఎంతైనా మద్యం తాగవచ్చు. ఆ కౌసన్ రోడ్డులోని ఏ బారు, పబ్ లో అయినా తాగవచ్చు.

ముందు అర్థరాత్రి అయ్యే వరకూ హాస్టల్ లోని బార్ లో మద్యం తాగుతారు. అక్కడ మద్యం తాగే విధానంలో ఎన్నో ఆటలు ఉంటాయి. ఆ తరువాత అంతా కలిసి నృత్యం చేస్తారు. అర్ధరాత్రి దాటాక ప్రత్యేక టీ షర్ట్ ధరించి అందరూ కలిసి కౌసన్ రోడ్డులో ఒక్కొక్క బారులోకి వెళ్ళి మద్యం తాగుతూనే ఉంటాయి. బార్లు లో rock, jazz , techno లాంటి ఉర్రూతలూపే సంగీత ప్రదర్శనలను బ్యాండ్స్ ఇస్తుంటాయి. అలాగే సున్నితమైన, మృదువైన మెలోడీలు పాడే బ్యాండ్స్ కూడా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అలా బార్లన్నీ తిరిగి తిరిగి, ప్రతి బారులోనూ తాగి నృత్యం చేసుకుంటూ చివరికి హాస్టల్ కి చేరుకుంటారు. అదంతా ఒక మహోత్సవంలా ఉంటుంది.

నేను మద్యం తాగకపోవడం వల్ల ఈ సంతోషాన్ని కోల్పోయాను అని మీరు అనుకోవచ్చు. వారందరి ఉత్సాహానికి నాకూ మత్తు వచ్చింది. ప్లాసెబో ఎఫెక్ట్.

బ్యాక్‌ప్యాకర్స్ అంటే ఎప్పుడూ ఇలా మద్యం మత్తులో ఉంటారనుకోకండి. ఇలా బ్యాక్‌ప్యాకర్స్ అంతా నగరాల్లో కలిసినప్పుడు మాత్రమే ఇలా ఉత్సాహంగా మద్యం సేవిస్తూ ఒకరి యాత్రనుభవాలు మరొకరు పంచుకుంటూ ఉంటారు.

కొత్త సంస్కృతుల్ని, కొత్త ప్రదేశాలని చూడడం, ఆయా దేశాల ప్రజలతో మమేకం కావడం, కొత్త దారుల్లో పయనించడం, టూరిస్ట్ లు ఎక్కువగా వెళ్ళని ప్రదేశాలను వెతుక్కుంటూ ప్రయాణించడం వారి ముఖ్య ఉద్దేశ్యం.

బ్యాక్‌ప్యాకర్స్ గురించి మరింత వివరంగా చెబుతాను.

3

ఈ భూగ్రహం అంతటా ఒక ప్రత్యేకమైన తెగ సంచారం చేస్తోంది. వారు తమ జీవితాలను వీపుపై మోసుకుంటూ గైడ్‌బుక్‌లు, యాప్‌లతో సాయంతో ప్రయాణాలు చేస్తారు. మనసు నిండా సాహసం, ఉద్వేగం; తెలియనిదానిలోకి దూకే తెగింపు వారి సొంతం. బడ్జెట్ పరిమితులు, భాగస్వామ్య ఉమ్మడి అనుభవాల సార్వత్రిక భాష వారిది. వారే బ్యాక్‌ప్యాకర్లు. నవకాలపు యాత్రికులు. వారి యాత్ర ఖండాలను దాటుకుని విస్తరించి ఉంటుంది.

ఈ కాలంలో బ్యాక్‌ప్యాకర్ సంస్కృతి సర్వవ్యాప్తంగా కనిపిస్తోంది: యువహృదయంతో, సాహసోపేతమైన ఉద్వేగంతో, బాగా నలిగి వెలిసిపోయిన బ్యాక్‌ప్యాక్ తో, తక్కువ బడ్జెట్‌లో ప్రపంచంలోని సుదూర ప్రాంతాలను అన్వేషిస్తారు వారు. ఈ ఆధునిక సంస్కృతికి మూలాలు ఆశ్చర్యకరంగానూ, వైవిధ్యభరితంగానూ ఉంటాయి. ఆధునిక బ్యాక్‌ప్యాకింగ్ సంస్కృతికి వివిధ సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పులు మార్గం సుగమం చేశాయి.

“బ్యాక్‌ప్యాకర్” అనే పదం 20వ శతాబ్దం చివరి భాగంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ, స్వతంత్ర, బడ్జెట్-స్పృహతో కూడిన ప్రయాణం అనే భావన మన పూర్వీకులకు బాగా పరిచయం ఉన్న విషయమే. కాశీ యాత్రికులు, కష్టతరమైన ప్రయాణాలను చేసిన మధ్యయుగాల యాత్రికులు, పాతకాలపు అన్వేషకులు, వ్యాపారులు, ఆధ్యాత్మిక వెతుకులాటతో వెళ్లిన వారు, ఆర్థిక అవకాశాల కోసం ప్రయాణాలు చేసినవారు – వీరందరినీ  ప్రోటో-బ్యాక్‌ప్యాకర్లు అనొచ్చు.

17 సుదీర్ఘ సంవత్సరాలు భారతదేశ యాత్ర చేసిన బౌద్ధ సన్యాసి హుయాన్ త్సాంగ్ మొదటి బ్యాక్‌ప్యాకర్ కావొచ్చు. కనీసం నేను అలా అనుకోవడానికి ఇష్టపడుతున్నాను.

నేను అనేక దేశాల్లో చాలామంది అంకితభావం కల నిజమైన బ్యాక్‌ప్యాకర్లతో కలిసి ప్రయాణించాకా, వారితో అనేక చర్చల అనంతరం నేనూ కొంతమేరకు బ్యాక్‌ప్యాకర్ నేనని అనిపించింది. అయితే పూర్తిస్థాయి బ్యాక్‌ప్యాకర్ గా మారడానికి కొంత సమయం పట్టింది.

మొదట్లో నేనూ 2 భారీ సూట్ కేసులతో విదేశీ ప్రయాణాలు చేసేవాడిని. ఇంటిలో ఉన్నట్టే అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉండాలని కోరుకునే వాడిని. రాను రాను ఎంత ఎక్కువ బరువును మనం తీసుకెళ్తే అంత స్వేచ్ఛను కోల్పోతాము అని అర్థమైంది. బ్యాక్‌ప్యాకర్ గా మారడానికి మొదట్లో చాలా కష్టపడ్డాను. అంతరిక్షానికి వెళ్లేటప్పుడు వ్యోమగాములు సరంజామాను ఎలా కుదిస్తారో నేను అలాగే నా సామాన్ల బరువును తగ్గించుకుంటూ వచ్చాను. అది అంత సులభంగా సాధ్యం కాలేదు. మొదట జీన్ ప్యాంట్లు తీసేసాను. తర్వాత కోటులు, బరువైన షర్టులు తీసేసాను. Essential oils, sanitary items, electronics తగ్గించాను. అద్భుతం! ఇప్పుడు 10 కేజీలకు నా బ్యాగ్ ని కుదించాను. తేలికైన షార్ట్స్, ట్రాక్స్, టీ షర్ట్స్ తో బ్యాక్ ప్యాక్ ని నింపాను. 10 కేజీలతో కొన్నాళ్లు ప్రయాణం చేశాను. రాను రాను బరువు 7 కేజీలకు తగ్గించగలిగాను. 10 లీటర్ల decathlon బ్యాక్‌ప్యాక్ లో 7 కేజీల వస్త్రాలతో ప్రయాణం ఎంతో తేలికగా, హాయిగా ఉంటుంది. అలా వెళుతుంటే స్వేచ్ఛ అంటే ఏమిటో అనుభూతం అవుతుంది. అవసరమైతే బట్టలు లాండ్రీకి ఇచ్చుకోవచ్చు. లేదా కొత్త బట్టలు కొనుక్కొని మాసిన బట్టలు పారేయవచ్చు.

ఇదంతా చేస్తున్నప్పుడు స్నేహితురాలు జయతి లోహితాక్షన్ మాటలు గుర్తొచ్చేవి. “ఒక బ్యాక్‌ప్యాక్ కి మించిన సామాన్లు మనిషి బ్రతకడానికి అవసరం లేదు. ఒకవేళ ఉంటే ఆ బరువు మన స్వేచ్ఛను హరిస్తుంది.” అనేవారు ఆమె. ఆ విషయంలో ఎప్పుడూ ఆమెకు నాకు వాదన జరిగేది. జయతి, లోహి మా ఇంటిలో ఉన్న 2 ఏళ్ళూ కాస్త సౌకర్యంగా జీవిస్తే తప్పులేదనే వాదనతో వారిని ఒప్పించి వారి కోసం టీవీ, హోం థియేటర్, ఫ్రిజ్ లాంటివి కొనిపించాను. కాని వారు ఒకరోజు వాటిని olx లో 2,3 వేలకి అమ్మేసి, వీపుకి రెండు బ్యాక్‌ప్యాక్ లను తగిలించుకుని, రెండు సైకిళ్ళ మీద గమ్యం తెలియకుండా ఎటో వెళ్ళిపోయారు. ఇప్పటికీ వారు అలా ఒకచోట నిలకడ లేకుండా తిరుగుతూనే ఉన్నారు. జయతి, లోహిలు  మొదటి తెలుగు బ్యాక్‌ప్యాకర్లుగా చెప్పొచ్చు. హిప్పీ సంస్కృతి, nomadic ఛాయలు కూడా వారిలో నాకు కనిపిస్తాయి. వారి పై అనవసరమయిన బరువులను బలవంతంగా పెట్టి నేనే వారిని బంధించానని అర్థమైంది. స్వేచ్ఛగా, తేలికగా ఉండడంలోనే వారు సంతోషంగా ఉండగలరని అర్థమైంది.

క్రమంగా నేను తేలికగా, స్వేచ్ఛగా ప్రయాణాలు చేసే విధానాన్ని రూపొందించుకున్నాను. అది ఎలాగో ముందు ముందు వివరిస్తాను. నేను ఆధ్యాత్మిక అన్వేషకుడిని లేదా యాత్రికుడిని అయినప్పటికీ అత్యాధునిక సాంకేతికత, జీవనశైలి, ultra sophistication ని అమితంగా ఇష్టపడతాను. కానీ వాటికి బందీని కాను. మెక్సికోలో నివసించే జర్మన్ పరుసవేది, మూలికామార్గంలో ఆధ్యాత్మిక అన్వేషణ చేస్తున్నాను అని చెప్పుకునే స్నేహితుడు జాన్ మౌంటెన్ నా గురించి చెబుతూ, నాదొక అత్యాధునిక ప్రాచీన ఆత్మ అంటూ ఉంటారు. ఏది ఏమైనా ఆధునిక బ్యాక్‌ప్యాకర్ సంస్కృతిలో చక్కగా ఇమిడి పోవడానికి నా అభిరుచులు సరిగ్గా సరిపోయాయి. అయినప్పటికీ 4 శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకూ అనేక spritual masters చే లిఖించబడిన ఆధ్యాత్మిక ఉద్గ్రంథం Philokalia లోని ప్రాచీన ఆధ్యాత్మిక యాత్రికునిగా నన్ను నేను భావించుకుంటాను.

4

1960-1970లలో జ్ఞానోదయం కోసం అన్వేషణ చేసిన హిప్పీలు ఆధునిక బ్యాక్‌ప్యాకర్ ఉద్యమానికి ఆద్యులు అని భావిస్తాను. ప్రారంభ అంతర్జాతీయ బ్యాక్‌ప్యాకింగ్‌కు బహుశా అత్యంత ముఖ్యమైన ఉత్ప్రేరకం “హిప్పీ ట్రైల్”.  యూరప్ నుండి టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, నేపాల్ మీదుగా విస్తరించి ఉన్న ఈ భూమార్గం, ఆధ్యాత్మిక జ్ఞానం, అన్యదేశ సంస్కృతుల పట్ల అభినివేశం, చౌకైన జీవనం కోరుకునే పాశ్చాత్య యువతకు ఒక ఆకర్షణగా మారింది. శాంతి, ప్రేమ, అవగాహన అనే తత్వాలతో జీవించే ఈ ప్రయాణికులు దీర్ఘకాలిక, తక్కువ-ధర అంతర్జాతీయ ప్రయాణాలను ప్రారంభించిన మొదటి వారిగా చెప్పొచ్చు. వారు గెస్ట్‌హౌస్‌లలో బస చేయడం, వనరులను పంచుకోవడం, స్థానిక సమాజాలతో కనెక్ట్ అవ్వడం అనే ఆలోచనను బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు – ఇవన్నీ ఆధునిక బ్యాక్‌ప్యాకింగ్ సరళి ముఖ్య లక్షణాలు. చౌక విమానాల (ఇప్పుడంటే విమాన చార్జీలు బాగా పెరిగిపోయాయి) లభ్యత ఈ ప్రయాణాలను మరింత సులభతరం చేసింది.

21వ శతాబ్దంలో బ్యాక్‌ప్యాకింగ్ అనే అద్భుతమైన దృగ్విషయం పూర్తిగా వికసించింది.

ఇంటర్నెట్ మరియు స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విస్తృతం కావడం వలన ప్రయాణ ప్రణాళికలో మార్పులు వచ్చాయి. వసతి, రవాణా, ఇతర ప్రయాణికులతో కనెక్ట్ అవ్వడం చాలా సులభం అయ్యాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అనుభవాలను పంచుకోవడానికి, కొత్త తరాలను వారి స్వంత సాహసాలను ప్రారంభించడానికి ప్రేరేపిస్తున్నాయి. టీనేజ్ అమ్మాయిలు, యువతులు కూడా ధైర్యంగా బ్యాక్‌ప్యాకింగ్ మొదలుపెట్టారు. కాలం ఎంతగానో మారిపోయింది. ఆధునికతను సంతరించుకుంది.

హాస్టళ్లు, బడ్జెట్ వసతి నెట్‌వర్క్‌ల పెరుగుదల, అనుభవపూర్వక, వ్యక్తిగత ప్రయాణాల పట్ల పెరుగుతున్న ప్రాధాన్యత వల్ల బ్యాక్‌ప్యాకింగ్‌ అత్యంత డిమాండ్ ఉన్న పర్యాటక రూపంగా బలపడింది.

సాంప్రదాయ వ్యతిరేక ఉద్యమంగా, స్వేచ్ఛ కోసమైన కోరికగా ప్రారంభమైన బ్యాక్‌ప్యాకింగ్ ప్రపంచ పరిశ్రమగా పరిణామం చెందింది, అయినప్పటికీ ఇది స్వతంత్ర అన్వేషణ, సాంస్కృతిక సమ్మేళనాభిలాష, బడ్జెట్-స్పృహ కలిగిన సాహసిక స్ఫూర్తిని ప్రధానంగా నిలుపుకుని ఉంది. ఆధునిక బ్యాక్‌ప్యాకర్ లు, బహుశా వారి పూర్వీకుల కంటే ఎక్కువగా సాంకేతికంగా అనుసంధానించబడి ఉన్నప్పటికీ, ఆ ఉత్సుకత – ప్రపంచాన్ని వారి స్వంత నిబంధనల ప్రకారం అనుభవించాలనే కోరిక పూర్వీకులైన అన్వేషకుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం వల్ల వచ్చిందని చెప్పవచ్చుననుకుంటాను.

*

శ్రీరామ్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు