కళ చాలా దయ లేనిది. అది ఆవహించిన వాళ్ళ పట్ల, కళలను పిచ్చిగా ప్రేమించేవాళ్లు మిణుగురుల్లా ఆకర్షించబడి మాడి మశైపోతారు. ‘ఎందుకిలా’ అన్న దానికి సమాధానం ఉండదు. మొన్న 64వ యేట కల్పనా లజ్మి పోయినప్పుడు పై మాటలే పదే పదే గుర్తొచ్చాయి. 80 ల చివర్లో సమాంతర సినిమాలు చూసి కాలరెగరేసే తరాలకి, పురుషాధిఖ్య ప్రపంచాన్ని ఓ రౌడీలా తల పైకెత్తి ప్రశ్నించిన కల్పనా లజ్మి అంటే ఓ ఆరాధనా పూర్వక గౌరవం, తెగింపు, తెగువా ఉన్న సినిమా పెద్ద మమనిషిగా ప్రేమ. ‘మరీ బోల్డండీ’ అంటూ ముక్కుకున్న వాళ్ళూ లేక పోలేదు. మొన్న తను పోయిందన్న వార్తతో నిద్రపోతున్న పాత జ్ఞాపకాలు టపటపా కొట్టుకున్నాయి. తననెలా గుర్తుపెట్టు కోవాలీ? తన వ్యక్తిత్వాన్ని అద్దంపట్టే కొన్ని సినిమాలను బలమైన మైలురాళ్లుగా పరిశ్రమలో వదిలిపెట్టిన ఓ కళాకారిణిగానా, అసలు ప్రేమించడం అంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా తనని తాను అర్పించుకొనే ఓ ప్రేమ మూర్తిగానా. ఈ విషయంలో ఎవరూ పెద్దగా గుర్తించని రెండో భాగమే గొప్పదనుకుంటాను.
1954లో పుట్టిన కల్పన తల్లి లలితా లజ్మి, తండ్రి కెప్టెన్ గోపీ లజ్మి. లలిత పేరుపొందిన పెయింటర్, గురుదత్ చెల్లెలు. శ్యాంబెనగల్ కి పెద్దమ్మ వరుస. కల్పన కి మరీ చిన్నతనం అవడంవల్ల గురుదత్ జ్ఞాపకాలేవీ పెద్దగా లేవు. సైకాలజీలో గ్రాడ్యుయేట్ అయిన కల్పన పదేళ్ళ పాటు కజిన్ శ్యాంబెనగల్ దగ్గర శుశ్రూష చేసినా పెద్దగా ప్రయోజనం లేక పోయింది. పూర్తిగా సినిమాలలోకి రాక ముందు D.G.Movie Pioneer, A work study in tea plucking, Along the Brahmaputra అన్న డాక్యుమెంటరీలు తీసి దర్శకురాలిగా తొలి అడుగులేసింది. ‘ఏక్ పల్’ 1986లో తన మొదటి సినిమా. ‘రామ్ తేరీ గంగా మైలీ’ అంటూ మడి బట్టలతో తడి సినిమాలు రాజ్యమేలుతున్న రోజుల్లో, స్త్రీల మనోభావాలని, వివాహేతర స్త్రీ, పురుష సంబంధాలని ఓ సానుభూతి కోణంలో స్త్రీల వైపు నుంచి తీసిన సినిమా ’ఏక్ పల్’.
గుల్జార్ తో పాటు స్క్రిప్ట్ చేసిన ఈ సినిమా ఆ రోజుల్లోనే సెక్షన్ 497 ఉనికిని ప్రశ్నించింది. ‘ఆనే వాలీ హై బహార్, కోమల్ తన్మే’ అంటూ ఆశా చేసిన అభ్యర్ధన యిప్పటికీ చెవుల్లో హోరుమంటూనే ఉంటుంది. ఆ తర్వాత 1993లో వచ్చిన ‘రుడాలి’ ఒక్కసారి అందరూ ఉలిక్కిపడేలా చేసింది. మహశ్వేతా దేవి రాసిన బెంగాల్ లోని ఒక గిరిజన తెగకి సంబంధించిన కథని, రాజస్థాన్ ఎడారులలోకి లాక్కొచ్చి ఓ దళిత దీన గాధగా మలచింది. దానికి సినిమాకు కావలసిన మెరుగులద్ది, ఎవ్వరూ ఊహించని డింపుల్ కపాడియాని ఉత్తమ నటిగా తీర్చి నిలబెట్టింది. అంతక ముందు కొన్ని హిందీ సినిమాలు చేసినా, అస్సామీ,బెంగాలీ ప్రాంతాలలో మాత్రమే సుపరిచితమైన భూపేన్ హజారికాని తన సినిమాల ద్వారా జాతి మొత్తానికి పరిచయం చేసింది. భూపేన్ అస్సామీ, బెంగాలీ జానపదాలనే తెచ్చాడో, పహాడీ, భూపాలీ లాంటి సొగసులనే అద్దాడో, లోతైన, గంభీరమైన గొంతుతో వెన్నల వలలనే విసిరాడో కాని, ‘దిల్ హూం హూం కరే’ లాంటి పాటలు జాతీయ గీతాలై కూర్చున్నాయి. భూపేన్ ని తను ఎందుకంత ప్రేమించినదో మనకి చెప్పడం కోసం సినిమా తీసినట్టయ్యింది. భూపేన్ కూడా తనకి కల్పన మీద ప్రేమని, తన సినిమాలలో సంగీతమై, వరదై ముంచెత్తి చూపించాడు. ముఖ్యంగా ‘రుడాలి’ లో డింపుల్, రాఖీల నటన ఓ గొప్ప విషాద సంగీతమైతే, భూపేన్ సంగీతం ఓ మహోన్నత విషాద పాత్రగా మారింది. తన మూడో సినిమా ‘దర్మియా’ ని ట్రాన్స్ జెండర్స్ మీద మొట్ట మొదటిగా తీసిన సాధికార సినిమాగా చెప్పుకోవాలి.
ఆ తర్వాత ‘దమన్’, ‘ఖ్యోమ్’, ‘చింగారి’ సినిమాలు తీసినా, అవి పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. అయితే మధ్యలో ‘లోహిత్ కినారే’ అనే టెలివిజన్ సీరియల్ తన్వీ అజ్మి తో తీసింది. 20 యేళ్లలో 6 సినిమాలే తీసినా, చివరి సినిమా తప్పించి, మిగిలిన అన్ని సినిమాలూ ఓ వర్గం విమర్శకుల ప్రశంసలు పుష్కలంగా అందుకున్నాయి. డింపుల్ కానీ, రవీనా కానీ, సుష్మిత కానీ, కిరణ్ ఖేర్ కానీ, ఎవరైనా కానీ అందాల భరిణలనుంచి ‘అహో’ అనబడే నటనను రాబట్టింది. ఓ మహిళ దర్శకత్వంలో ఇద్దరు మహిళా నటీమణులకి వేర్వేరు సినిమాలలో ఉత్తమ నటీమణులుగా జాతీయ అవార్డులు రావడం భారత చలన చిత్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. స్త్రీవాద కథ లంటే, కల్పన కళ్ళురుమి తనవి మానవతా వాద కథ లనేది. అవును. ఏ వాదానికైనా మానవత్వమే ప్రాతిపదిక కదా!
1971 ప్రాంతాలలో 17 యేళ్ళ కల్పన కాలేజీ విద్యార్థినిగా వున్నప్పుడు , మేనమామ ఆత్మారామ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆరోప్’ సినిమా సెట్లో కంపోసర్ గా 45 యేళ్ళ భూపేన్ హజారికాని చూసింది. ‘ హే డోలా’ అనే బోయీలు పల్లకీ మోసే పాట కంపోస్ అవుతోంది. భూపేన్ క్రియేటివ్ జీనియస్ కి artist bent of mind ఉన్న కల్పన తీవ్రమైన ఆకర్షణలో పడింది. 28 యేళ్ళ వయసు తేడా అడ్డం రాలేదు. ఆ తర్వాత 5 యేళ్ళకి అది నిఖార్సైన ప్రేమగా ఘనీభవించి, భూపేన్ తో కల్సి సహ జీవనం చేయడానికి పురి కొల్పింది. నిజానికి అప్పటి సమాజంలో సహ జీవనం అనేది ఊహకి కూడా అందని విషయం. అప్పటికే భూపేన్ ని భార్య వదిలేసింది. కల్పన తండ్రి యిదేదో తాత్కాలికమైన మోహం అనుకున్నాడు. తల్లైయితే ఆ రిలేషన్షిప్ ని గుర్తించడానికే నిరాకరించింది.
భూపేన్ ప్రతిభ అతని పదో యేట నుంచే ఈశాన్య రాష్ట్రాలలో ప్రతీవారికీ తెల్సు. పాల్ రాబ్సన్ లాంటి వారితో భుజాలు రాసుకు తిరిగి, ఆ అనుభవాలతో అతను సృష్టించిన అజరామరమైన కల్పనలు అందరికీ తెల్సు. వామ పక్ష కళావేదిక IPTAలో సభ్యుడిగా ప్రజా సంగీతం లో అతని ముద్ర కూడా అందరికీ తెల్సు. అయితే కళాకారుడిగా అతడెంతో ఉన్నతుడైనా, వ్యక్తిగత విలువలు, ఆలోచనా ధోరణిలో చాలా చిన్నవాడు. తనతో సహ జీవనం చేస్తున్న కల్పనని భూపేన్ తన మేనేజర్ గా పరిచయం చేయడానికే యిష్టపడ్డాడు. ప్రపంచానికి తన సహచరి గా చెప్పడానికి చాలా కాలమే పట్టింది. కల్పనని పెళ్లి చేసుకుంటే సమాజం యేమనుకుంటుందోనని భయపడ్డాడు. వీటికి తోడు అతని ఆర్ధిక అరాచకత్వం, విపరీతమైన తాగుడు, ఆడవాళ్ళ పట్ల ఆకర్షణ కూడా కల్పనకు మొదట్లో చికాకు తెప్పించినా, అతని కళ పట్ల తన కున్న అపారమైన ప్రేమ ముందు , అవన్నీ చిన్నచిన్న సమస్యలుగానే కనబడ్డాయి. ఇతర ఆడవాళ్ళ పట్ల అతనికుండే వ్యామోహాన్ని సెలెబ్రిటీల పట్ల సామాన్యులకుండే ఒక వింత ఆకర్షణగానే చూసింది. అయితే భర్తగా భూపేన్ యిమడలేడన్న విషయాన్ని గ్రహించి, పెళ్లి అనే ఆలోచనని శాశ్వతంగా పక్కన పెట్టేసింది. తనకి పిల్లలంటే ఎంతో యిష్టమున్నా, వివాహేతర సంబంధం ద్వారా కలిగే పిల్లల్ని భారతీయ సమాజంలో పెంచడం కష్టమనీ, ఆ కోరికనీ వదిలేసుకుంది.
తన ఆలోచనా విధానాలు ఏంటో తెలియ చెప్పడంతో పాటు, తను ప్రేమించిన భూపేన్ కళ ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియపర్చడానికే తను సినిమాలు తీసినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో తను నూటికి నూరు శాతం సక్సస్ అయినట్లే. అయితే 20 యేళ్లలో తను తీయగలిగినది 6 సినిమాలే. ఆ తర్వాత భూపేన్ ఆరోగ్యం బాగా దెబ్బ తినడంతో ఓ నర్స్ లా, అటెండర్ లా తన మొత్తం సమయాన్ని అతని కోసమే ధార బోసింది. సినిమాల వైపు, యితర పనుల వైపు చూడ్డం పూర్తిగా మానేసింది. చిత్రంగా చావుకు దగ్గరవుతున్న భూపేన్ కి, సామాజిక బంధం లేని కల్పన తనని వదిలేస్తుందేమోనని భయమేసింది. పెళ్లి చేసుకుందాం అని ప్రతిపాదించాడు. కల్పన ఓ వెర్రి నవ్వు నవ్వింది. చివరి క్షణం వరకూ అతనితోనే ఉండి, తమ బంధం యే సామాజిక బంధం కన్నా బలమైందని నిరూపించింది.
తన ప్రతీ చర్యకీ వెన్నుదన్నుగా నిలబడ్డ తండ్రి మరణం, ఆ తర్వాత భూపేన్ మరణం కల్పనని బాగా క్రుంగదీశాయి. భూపేన్ దుబారా వల్ల పెద్దగా కూడబెట్టిన ఆస్తులు లేవు. అతని విల్లు ద్వారా వచ్చిన అరకొర ఆస్తికీ కల్పన హక్కుదారైనా, యెప్పుడూ మొహం కూడా చూడని భూపేన్ కొడుకు కయ్యానికి దిగాడు. అప్పడికే మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఉన్న కల్పన, తన మనిషే లేనప్పుడు, యివన్నీ ఎందుకని నిశ్శబ్దంగా నిష్క్రమించింది. అయితే చాలా కాలం పరిశ్రమకి దూరంగా ఉండడంతో ఆదాయ వనరులు లేకుండా పోయాయి. బతిమాలుకున్నా పని యిచ్చేవాళ్లు కనబడలేదు. మరో పక్క భూపేన్ జ్ఞాపకాలన్నీ పుస్తక రూపం లో తేవాలని తాపత్రయం. అన్నీ కలిపి క్రమంగా కల్పన ఆరోగ్యాన్ని తినేశాయి. కిడ్నీ సమస్య వల్ల డయాలసిస్, ఖరీదైన మందులు తలకు మించిన భారమయ్యాయి. సోనీ రజ్దాన్, ఆలియా భట్ మాటలతో, చేతలతో తోడుగా నిలిస్తే, అమీర్, సల్మాన్ లాంటి వాళ్ళు కొంత ఆదుకున్నారు. జావేద్ అక్తర్, షబనా, నీనా గుప్తా, అమిత్ ఖన్నా లాంటి వాళ్ళు తలో చేయ వేశారు. త్వర త్వరగా కోలుకొని, కాస్తంత పని చేసి, వీళ్ళ ఋణాలు తీర్చాలని తపన పడింది. అయితే కిడ్నీ కేన్సర్ తనను నిలబడ కుండా చేసి, ఈ లోకాన్నుంచే తీసుకు పోయింది. అంత బాధలో కూడా తను రాద్దామనుకున్న భూపేన్ జ్ఞాపకాలు “Bhupen Hajarika as I knew him” పూర్తి చేసి, తన ప్రేమని పరిపూర్ణం చేసుకొని మరీ వెళ్ళి పోయింది.
కల్పన లా ప్రేమ సముద్రంలో ఈది ఈది, అందులోనే మునిగి ముగిసి పోయేవాళ్లు కొద్ది మందే ఉంటారు. తన వ్యక్తిత్వాన్ని ఏ మాత్రం వదులుకోకుండా, ఎవరేమనుకున్నా తన జీవితాన్ని ప్రేమమయం చేసుకుని, అందులోనే చివరి ఊపిరి తీసుకుని, కట్టుబాట్లు నీతి నియమాలంటూ పోసుకోలు కబుర్లు చెప్పే హిపోక్రసీ బతుకుల మీద ఓ నిర్లక్ష్యపు నవ్వు విసిరి వెళ్లిపోయింది కల్పనా లజ్మి.
*
మోహన్ బాబు గారూ అద్భుతమైన పరిచయం .చాలాబాగుంది. ఈ మద్యనే మీరు కల్పనా సినిమా. గురించి ప్రస్తావించడం గుర్తుంది.రుడాలీ తప్ప ఏమీ చూడలేదు. వెంటనే చూస్తాను.
Chaala chaala dhanyavaadaalu gangadhar gaaru
‘సమయ్ తూ – ధీరే చలో…’ అనే వ్యధాభరిత వేడుకోలును మృత్యువు వినిపించుకోలేదు.
అయినా జీవితాన్ని, మనుషుల్ని ప్రేమించే
జనులంతా ఆమె అందించిన కళా ప్రపంచంలో
నడుస్తూనే ఉంటారు; ఇంకా ముందుకు పోతామంటారు.
హృదయపు లోతుల నుండి వెలువడిన సమగ్రమైన వ్యాసం. మిత్రుడు కృష్ణ మోహన్ కి ఒక తరం తరఫున ధన్యవాదాలు.
Thank you very much Sudhakar gaaru
కల్పనపై ప్రేమ ను మరింత పెంచారు.మీ ఆర్ద్ర మైన నివాళి తో
చాలా ఉపయోగకరమైన వ్యాసం. ఇలాగైనా పదిమంది యువత ఆ సినిమా లు చూస్తారు. మనకున్న మంచి నటులలో ఆరిఫ్ జకారియా ఒకడు
గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి. ఎన్నో తెలియని విషయాలు తెలిశాయి.
చిన్నప్పుడు ‘రుడాలి’ గురించి పేపర్లో చదివిన జ్ఞాపకం.
Wellwriteup..mohanji..many thanks..Teleyani..vishayaluAnnochadhivanu..!
Very insightful. Focussed on lesser known corners of Kalpana Lazmi’s private life and creative work. Thank you Mohan gaaruu..!
Thank you very much Sir
Mohanji.nomorewords..Rudalichausta..!Twaralo..